Tuesday, January 15, 2019

అర్థంకాని మాటల గురించి మరికొన్ని మాటలు


అర్థంకాని మాటల గురించి మరికొన్ని మాటలు
సాహితీమిత్రులారా!

వేలూరి వారి వ్యాసం అర్థంకాని మాటలు-అర్థమవని కవితలు చదివిన మీదట, నాకు కలిగిన కొన్ని సందేహాలూ, తోచిన కొన్ని ఆలోచనలూ – వెరసి ఈ స్పందన.

వేలూరి వారు తన వ్యాసంలో ప్రథానంగా ప్రస్తావించిన విషయాలు ఇవి:

అర్థంకాని మాటలో రెండు రకాలు – సంస్కృత పదాలూ, సమాసాలు. కాలక్రమంలో అర్థాలు మారిపోయిన మాటలు. శ్రీశ్రీ “ప్రజల” కోసం కవిత్వం రాయలేదు, కవిత్వం అర్థమయ్యే వాళ్ళకోసమే రాశాడు, విశ్వనాథలాగ. దీనికి ప్రమాణం అతని కవితలలోని అర్థంకాని పదాలే. విశ్వనాథ, శ్రీశ్రీ కవితలని ప్రతిపదార్థాలతో, వ్యాఖ్యానాలతో ప్రచురించాలి.

ఈ విషయాలగూర్చి నాకు కలిగిన ముఖ్యమైన సందేహం – అర్థంకాని మాటలున్నంత మాత్రాన కవిత్వం అర్థంకాకుండా పోతుందా? ఈ విషయాన్ని వివరించే ముందు, అర్థంకాని మాటలలో నాకు తెలిసిన మరికొన్ని రకాలుగూర్చి ప్రస్తావిస్తాను.

కొన్ని పదాలకు వాడుకలో ఒక ప్రసిద్ధమైన అర్థముంటుంది. కొన్ని అప్రసిద్ధమైన ఇతర అర్థాలుకూడా ఉంటాయి. అలాటి అప్రస్సిద్ధార్థంలో ఆ పదాలను వాడితే, ఆ కవిత్వం అర్థమవక మనం కొంత తికమక పడాల్సివస్తుంది. మొన్న మొన్నటి వరకూ నాకు, “ఏ తీరుగనను దయజూచెదవో…” అన్న పాటలోని “కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా!” అన్న వాక్యం అర్థమయ్యేది కాదు. “కారుణ్యాలయ”, “భక్తవరద” అన్నవి కౌసల్యకు విశేషణాలెలా అయ్యాయా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఈ మధ్యనే తెలిసింది, “కానుపు” అంటే “చూపు” అన్న అర్థం కూడా ఉన్నదని. అప్పుడు అందులోని భావం తేటతెల్లమైంది. ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యం వంటి ప్రౌఢ కావ్యాలలో ఇటువంటి తికమకలు కొన్ని ఎక్కువగా కనిపిస్తాయి.

అర్థంకాని మాటలలో మరోరకం, మాండలికాలు. ప్రాంతీయ కవిత్వం ప్రాథాన్యం సంతరించుకున్న ఈ కాలంలో, ఒక ప్రాంతానికి చెందిన మాండలిక పదాలు మరొక ప్రాంతం వాళ్ళకి అర్థంకాని మాటలే అవుతాయి. అలాంటి పదాలతో వచ్చే ప్రాంతీయ కవిత్వం, అర్థమవని కవిత్వమే అవుతుంది. అటువంటి కవిత్వం ఇతర ప్రాంతాలవారు కూడా చదివి అర్థంచేసుకోవాలంటే, వాటికి ప్రతిపదార్థ తాత్పర్యాలు అవసరమవుతాయి. ఈ మధ్యనే ఆంధ్రజ్యోతి వివిధలో పడిన కవిత శీర్షిక “నాలిద్దాం”. అధస్సూచికలో ఇచ్చిన అర్థం చదివితే కాని ఇదేమిటో బోధపడలేదు! ఈ కాలపు కవిత్వంలో మాండలికాలు విరివిగా కనిపిస్తున్నాయనడానికి ఇదొక చిన్న ఉదాహరణ.

అర్థంకాని మాటలలో మరొక తరహాకు చెందినవి, అర్థంఅయినట్టే ఉండి, నిజానికి అర్థంకాని మాటలు. ఇలాంటి మాటలవలన, కవిత్వం పూర్తిగా అర్థమవకుండా పోదు. అయితే, ఆ మాటల అర్థాలని “లోనారసి” పరికిస్తేనే కవిత్వ మహత్వం పరిపూర్ణంగా అవగతమవుతుంది. ఉదాహరణకి, పోతనగారి “ఎవ్వనిచే జనించు జగము…” అన్న పద్యంలో “ఆత్మభవున్‌” అన్న పదం వస్తుంది. ఈ పదానికి అర్థమేమిటి? పద్యం చదువుకుంటూ పోతే, చక్కగానే అర్థమవుతుంది. కానీ “ఆత్మభవుడు” అన్న పదానికి అర్థం తెలుసుకోవాలంటే, బోలెడంత వేదాంతజ్ఞానం అవసరమవుతుంది. తిక్కన “ధర్మాద్వైత స్థితి” అన్న పదార్థం గూర్చి ఈనాటికీ చర్చించేవాళ్ళున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి పదాలు ప్రయోగించడంలోని పరమార్థం తెలీక, అవి పాదపూరణకై వాడిన పొల్లు మాటలని కొట్టిపారేసే ప్రమాదముంది, పద్య కవిత్వంలో. ఉదాహరణకి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాశ్త్రిగారు రాసిన “అంచలు” అన్న కావ్య ఖండికలోని ఈ పద్యం చూడండి:

ఎదరగిలించి పాడిన నభోదినగీతికి నొక్క యశ్రు వే
వదలరు శుష్కమానవులు వారలతో మనకేమిలెమ్ము పో
వుదము ఉమామహేశ్వర విచిత్ర పదాంకిత పుణ్యమేదినీ
పదముల రెక్క రెక్క గదియించి చరింపగ రాజహంసమా
ఇందులోని “విచిత్ర” అన్న పదం, పాదపూరణకై వాడిన కేవల వ్యర్థ పదంగానే తోస్తుంది. ఇక్కడ ముందుగా మనం గమనించాల్సినది, ఈ పద్యానికి యతి నియతి లేదన్న సంగతి. అంచేత యతి మైత్రికి ఈ పదం వాడారనుకోవడానికి లేదు. ఇక్కడ “విశిష్ట” లాంటి మరే విశేషణమైనా కూడా వెయ్యవచ్చు. మరి ఈ “విచిత్ర” పదంలోని అంతరార్థం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, అక్కడ వర్ణిస్తున్న వస్తువేమిటి అని ఆలోచించాలి. అవి “పదాంకితాలు”, అంటే “పాద ముద్రలు”. ఎవరి పాద ముద్రలు? ఉమామహేశ్వరుల పాద ముద్రలు.వాటిలోని విచిత్ర్మేమిటి? ఒక పాదానికి పారాణి పూత ఉంటుంది, మరొక పాదానికి ఉండదు. అది అందులోని విచిత్రం. ఇది అర్ధనారీశ్వర రూపం వల్ల కలిగిన వైచిత్రి. కనుక, ఆలోచిస్తే “విచిత్ర” అన్న పదం ద్వారా ఇక్కడ అర్ధనారీశ్వర రూపాన్ని కవి ధ్వనింపజేసాడు. పద్య తాత్పర్యం తెలియడానికింత రామాయణం అక్కర్లేదు. కాని అందులో దాగిన కవిత్వం సంపూర్ణంగా బహిర్గతం కావాలంటే, ఈ విషయ చర్చ అవసరం.

ఇలాంటి అంతరార్థం కలిగిన పదాలు ఎక్కువగా ప్రాచీన కవిత్వంలోనే కనిపిస్తాయి. ఇక్కడొక విషయం గమనించడం ముఖ్యం. ఇది శ్లేష కవిత్వం కాదు. ఇది వేరు. ఇది ఎంత తోడితే అంత జల ఉట్టిపడే కవిత్వపుటూట. నన్నయ్యగారన్నట్లుగా, సారమతి అయిన కవులు లోనారసి చదువుకోవలసిన కవిత్వమది. ఈ ప్రజాస్వామ్య యుగంలో ప్రజాకవిత్వానికి ఇది గుణం కాక దోషంగా పరిణమించింది. ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.

ఇప్పుడు నా మొదటి సందేహానికి వస్తాను. అర్థంకాని మాటలున్నంత మాత్రాన కవిత్వం అర్థమవకుండా పోతుందా? వేలూరి వారు ప్రస్తావించిన విశ్వనాథవారినే తీసుకుందాం. అతను ప్రజల కోసం రాసినట్టు చెప్పకపోయినా, కల్పవృక్షంలో తనది “వ్యవహార భాష” అని చెప్పుకున్నారు. ఇది పండితులైనవారు సైతం అవుననడానికి సంకోచించే విషయం. శివధనుర్భంగ ఘట్టంలో విల్లు విరిగిన శబ్దాన్ని వర్ణిస్తూ రాసిన పద్యాలు ప్రఖ్యాతమైనవే. అయినా మచ్చుకొకటి:

నిష్ఠావర్ష దుదార మేఘపటలీనిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠస్ఫూర్జధుషండమండలరవాహీనక్రియాప్రౌఢి ద్రా
ఘిష్ఠమ్మై యొక రావమంతట నెసంగెన్‌ వాకిటన్‌ ఘోరమై
ఈ పద్యానికి నాకు ప్రతిపదార్ధంకాదు కదా తాత్పర్యం కూడా తెలీదు. తెలిసినదల్లా శివ ధనుస్సు విరగంగానే ఒక పెను రావం, ఘోరంగా వినిపించిందని. ఈ పద్యం గట్టిగా, ఊపిరి బిగపట్టి చదివితే, పెట పెట మనే ఆ చప్పుడు అది ఎంత ఘోరమైందో మనసుకి స్ఫురిస్తుంది. మాటలు అర్థంకాకకపోయినా, కవిత్వం అర్థమవడమంటే ఇదే. శబ్దశక్తి ద్వారా పాఠకుని మనస్సులో భావస్ఫూర్తిని కలిగించడం ఇందులోని ప్రథానాంశం. అయితే విశ్వనాథ వారి ప్రతి అర్థంకాని పద్యం ఈ కోవకే చెందింది కాదు. చాలా పద్యాలకి ప్రతిపదార్థం తెలిస్తేనే అందులోని కవిత్వం అర్థమౌతుంది.

ఇక శ్రీశ్రీ విషయానికి వస్తే, వేలూరి వారి ఉదహరణలే తీసుకుందాం.

మహాప్రస్థానంలో “వర్షుకాభ్రముల ప్రళయఘోషలు” వినిపించే కవితాభాగం ఇది:

ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
“హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!” అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
ఈ కవిత అర్థమవడానికి “వర్షుకాభ్రములు” అన్న పదంకోసం నిఘంటువులు తిరగెయ్యనక్కరలేదు. మహా ప్రవాహంలా హోరెత్తించే ఆ కవిత్వ వేగం సామాన్య పాఠకుణ్ణి సైతం మున్ముందుకి తోసుకుపోతుంది. అటువంటివే ప్రతిజ్ఞలోని “పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ”, కవితా ఓ కవితా లోని “ఘూకం కేకా, భేకం బాకా”.

కానీ ఇక్కడొక విషయం గమనించాలి. “కవితా ఓ కవితా” శ్రీశ్రీ ప్రజలకోసం రాయలేదు. తనకోసం, తనలాంటి భావకవిత్వపు మోహంలో పడిన కవులకోసం రాసిన కవిత అది. శ్రీశ్రీని మహాకవిగా నిలబెట్టింది “కవితా ఓ కవితా” కావచ్చుకానీ, ప్రజాకవిని చేసింది మాత్రం, ఒక మహాప్రస్థానం, ఒక ప్రతిజ్ఞ, ఒక దేశచరితలు, ఒక ఖడ్గ సృష్టి. ఆ కవితలలోని పదాలు కొన్ని అర్థం కాకపోయినా, అందులోని కవిత్వం సామాన్య ప్రజల అనుభవానికి వస్తుంది. ఈ విషయంలో శ్రీ శ్రీ ప్రాచీన కవులలో పోతన లాంటి వాడు. పోతన కవిత్వంలోనూ చాలా అర్థంకాని పదాలుంటాయి. అయినా ఆ కవిత్వం ప్రజలకి దగ్గరయ్యింది. అతని కవిత్వంలో పొంగిపొర్లే భక్తి రసం ఆ పని చేయించింది. అలాగే శ్రీశ్రీ కవిత్వంలోని వేగం, విప్లవం అతణ్ణి ప్రజాకవిని చేసాయి. అంచేత శ్రీశ్రీ ప్రజాకవిగా కొనసాగడానికి అతని కవిత్వానికి ప్రతిపదార్థాలతో వ్యాఖ్యానాలు ప్రచురించాల్సిన అవసరం లేదు. శబ్దార్థాల సమైక్య శక్తి కవిత్వం అని కాళిదాసు ఎప్పుడో సుస్పష్టం చేసాడు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో శబ్దశక్తి భావస్పూర్తిని కలిగించడంలో అధికపాత్ర వహించవచ్చు. అలాంటి సందర్భాలలో, సామాన్యపాఠకుడు, అర్థం వెంటనే అవగతంకాకపోయినా, కవిత్వాన్ని అనుభవించగలడు. ఆ తరువాత దానికి అర్థసౌందర్యంకూడా తోడైతే, ఆ అనుభవం పరిపూర్ణమౌతుంది.

ఆధునిక కవిత్వంలోని “ప్రజా కవులు” అర్థంకాని మాటలు (సంస్కృత పదాలూ, సమాసాలూ) ఎంతవరకూ వాడారు, ఏ ప్రయోజనం కొరకు వాడారు అన్నది ఆసక్తికరమైన పరిశోధనాంశం.
----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: