Wednesday, January 16, 2019

నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం!


నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం!
సాహితీమిత్రులారా!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.

ఈ వాక్యం చందమామ చదువరులకు చిరపరిచితమే. ఒక చేత్తో కత్తి పట్టుకుని, మరొక భుజం మీద శవాన్ని మోస్తూ నిలుచున్న విక్రమార్కుని చిత్రం అంతకన్నా సుపరిచితమే!

భారతీయ కథా సాహిత్యంలో కథామాలికలూ, కథలో కథ, కథలో కథగా అల్లుకుంటూ సాగిపోయే గొలుసుకట్టు కథలూ చాలా కనిపిస్తాయి. పంచతంత్రం, శుక సప్తతి, హంస వింశతి మొదలైనవి. వీటన్నిటికీ మూలాలు కథాసరిత్సాగరంలో ఉన్నాయని చెప్పవచ్చు. సంస్కృతంలో ఉన్న కథాసరిత్సాగరానికి మూలం పైశాచీ భాషలోనిదని భావించే బృహత్కథ. అది క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందిన గుణాఢ్యుడనే పండితుడు రచించాడని ప్రతీతి. అందులోనిదే మరొక ప్రసిద్ధ కథామాలిక భేతాళ పంచవింశతి.

పంచవింశతి అంటే ఇరవై అయిదు. అది ఇరవై అయిదు కథల సమాహారం. శవాన్ని ఆవేశించి ఉన్న భేతాళుడు కాలక్షేపానికి విక్రమార్కునికి ఒక కథ చెప్పడం, చివరన ఆ కథకి సంబంధించిన ఒక చిక్కుప్రశ్న వేయడం, తెలిసీ జవాబు చెప్పకపోతే నీ తల వేయివక్కలవుతుందని అనడం, విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పడం, అతనికి మౌనభంగమై ఆ శవం తిరిగి చెట్టెక్కడం–ఇదీ వరస. ఈ వరసలో భేతాళుడు చెప్పిన చివరి కథ ఏమిటో గుర్తుందా? అది ఆఖరి కథ ఎందుకయ్యిందో తెలుసా? విక్రమార్కుని సహనాన్నీ పట్టుదలనీ తెలివితేటల్నీ పరీక్షించి పరీక్షించి, అతను గొప్ప యోగ్యుడని నిశ్చయించుకుంటాడు భేతాళుడు. ఇక తాను అతనికి వశం కావాలి. తన కథల పరంపరకి ముగింపునివ్వాలి. కానీ ఎలా? దీనికొక అద్భుతమైన పరిష్కారం కనుగొంటాడు భేతాళుడు.

సమాధానం ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానం ఆలోచించి చెప్పగలగడం ఒక ఎత్తయితే, సమాధానం లేని ప్రశ్నకు సమాధానం లేదని తెలుసుకుని మౌనంగా ఉండిపోవడం ఇంకొక ఎత్తు! అలా చేయగలిగినప్పుడే అది సంపూర్ణ ప్రజ్ఞ అవుతుంది. విక్రమార్కుడు అలాంటి పూర్ణ ప్రజ్ఞావంతుడా కాదా? అది పరీక్షించేందుకు, కచ్చితమైన సమాధానం అంటూ లేని చిక్కుముడిని విక్రమార్కుని ముందుంచుతాడు భేతాళుడు. ఇది అతనికి చివరి పరీక్ష. మౌనంగా ఉండాల్సినప్పుడు ఉండగలడా లేడా? అలా ఉండిపోతే మౌనభంగం జరగదు. అప్పుడు తను విక్రమార్కునికి వశమవుతాడు. అదీ భేతాళుని యుక్తి. సమాధానం లేని ప్రశ్నకి దారి తీసిన ఆ చిక్కుముడి కథ ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చుంటుంది. తెలియని వాళ్ళకోసం స్థూలంగా ఇక్కడ…

అనగనగా తండ్రీ కొడుకులు. వాళ్లిద్దరూ ఒకసారి అడవిలో వెళుతూ రెండు జతల స్త్రీల పాదాల గుర్తుల్ని చూస్తారు. పెద్ద పాదాలున్న స్త్రీని తండ్రి, చిన్న పాదాలున్న స్త్రీని కొడుకూ పెళ్ళాడుతామని ప్రతిజ్ఞ పడతారు. ఆ గుర్తుల వెంట వెళ్లి ఆ స్త్రీలను కలుసుకుంటారు. వాళ్ళ ప్రతిజ్ఞల మేరకు పెద్ద పాదాలున్న స్త్రీని తండ్రి, చిన్న పాదాలున్న స్త్రీని కొడుకు పెళ్ళాడతారు. అయితే ఆ స్త్రీలిద్దరూ తల్లీ కూతుళ్ళు. పైగా పెద్ద పాదాలున్న స్త్రీ కూతురు, చిన్న పాదాలున్న స్త్రీ తల్లి. తదనంతరం వాళ్ళకు సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఆ పిల్లల మధ్యనున్న సంబంధం ఏమిటి అన్నది ప్రశ్న.

ఈ ప్రశ్నకి కచ్చితమైన సమాధానం లేదు. అది తెలుసుకున్న విక్రమార్కుడు మౌనంగా ఉండిపోతాడు. భేతాళుడు అతనికి వశమవుతాడు.

ఈ కథలో చిక్కుముడికి అసలు కారణం గమనించారా? ఒక తండ్రికి మరొక సంబంధం ద్వారా కొడుకే తిరిగి తండ్రి కావడం! ఒక దిశలో తిన్నగా సాగిపోయే సాధారణ బంధుత్వాల పరంపర, వేరొక బంధుత్వం ద్వారా మెలితిరిగి, తిరిగి మొదలికి వచ్చిందన్నమాట. దాని వలన సాధారణ సంబంధాలలో కనిపించని ఒకానొక వైరుధ్యం ఇక్కడ ఏర్పడింది. అదీ చిక్కుముడి, లాజికల్ ఫేలసీ (logical fallacy).

ఇది పైకి సరదా కథలా కనిపిస్తున్నా ఈ చిక్కుముడి వెనకనున్న తత్త్వం గాఢమైనది. తర్కశాస్త్రంలో (Logic) ఇది ఒక ముఖ్యమైన విషయం! పెద్ద పెద్ద గణిత శాస్త్రవేత్తలను సైతం బెంబేలెత్తించిన అంశం. కొన్ని మౌలికమైన లాజికల్ పేరడాక్సులకు ఉత్పత్తి స్థానం. దీని గురించి మరింత స్పష్టం కావాలంటే ఈ కింద రెండు వాక్యాలను చూడండి:

దీని తర్వాతున్న వాక్యం అబద్ధం. దీని ముందరున్న వాక్యం నిజం.

ఈ రెండు వాక్యాలలో ఉన్న వైరుధ్యాన్ని గమనించండి. మొదటి వాక్యం నిజమైతే, దాని ప్రకారం తర్వాతి వాక్యం అబద్ధం కావాలి. కానీ రెండో వాక్యం, మొదటి వాక్యం నిజమని చెపుతోంది. అది అబద్ధమైతే, మొదటి వాక్యం అబద్ధం కావాలి! పోనీ మొదటి వాక్యం అబద్ధం అయితే, దాని ప్రకారం రెండో వాక్యం నిజం కావాలి. అప్పుడు దాని ప్రకారం తిరిగి మొదటి వాక్యం నిజం కావాలి! ఈ వైరుధ్యానికి కారణం మొదటి వాక్యం రెండో వాక్యం గురించి చెప్పి, రెండో వాక్యం మళ్లీ మొదటి వాక్యం గురించి వ్యతిరేక దిశలో చెప్పడం. దీని వల్ల ఏర్పడిన చిక్కుముడి. పరస్పర సూచకాలైన (అంటే referential) రెండు వాక్యాల మధ్య ఏర్పడిన తికమక ఇది.

అలాగే ఒకే వాక్యం తన గురించి తానే చెప్పుకొనేటప్పుడు కూడా ఇలాంటి తిరకాసు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ కింద వాక్యం చూడండి:

ఈ వాక్యం అబద్ధం.

ఈ పైనున్న వాక్యం నిజమా అబద్ధమా? నిజం అయ్యేమాటయితే, అది చెపుతున్న ప్రకారం ఆ వాక్యం అబద్ధం కావాలి. లేదూ అబద్ధమైతే, ఆ వాక్యం అబద్ధం కాదన్న మాట, అంటే నిజం అవుతుంది! అంచేత ఆ వాక్యం నిజమా అబద్ధమా అని నిర్ణయించడం అసంభవం. దానికి కారణం అందులోని అంతర్గత వైరుధ్యం. ఏటూ తేల్చలేని ఆ సందిగ్ధానికి అసలు కారణం మళ్ళా ఒక రకమైన ముడి. తన గురించి తాను చెప్పుకొనే లక్షణం నుంచి ఏర్పడ్ద చిక్కుముడి ఇది. దీనిని ఆత్మసూచన (Self-reference) అనవచ్చు. పైన యిచ్చిన రెండు వాక్యాలు కూడా ఒకరకంగా (పరస్పరం) ఆత్మసూచకాలే.

ఈ సెల్ఫ్-రిఫరెన్స్, వివిధ రంగాలలో ఎత్తే అవతారాలు ఎన్నెన్నో! తర్కం, గణితం, కళ, సాహిత్యం, తత్త్వం–ఇలా అనేక రంగాలలో ఇది చేసే విచిత్ర విన్యాసాలు, సృష్టించే చిత్రమైన చిక్కుముడులూ ఇన్నీ అన్నీ కావు. అది సృష్టించే మాయా ప్రపంచంలోకి కొన్ని నెలల ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. ఇది నా గురించి, నాతో నేను, నాలోకి నేను చేస్తున్న ప్రయాణం. ఆసక్తిగల వాళ్లందరికీ స్వాగతం. ఇది ఒక సాహస యాత్ర. అసలు ప్రయాణం వచ్చే నెల ఆరంభం!

అందాకా ఒక భేతాళ ప్రశ్న:

ఈ, ఇది, నేను, నా–మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా, తన గురించి తాను చెప్పుకొనే ఒక తెలుగు వాక్యాన్ని తయారు చేయగలరా? ప్రయత్నించండి!
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: