Friday, January 18, 2019

కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం


కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం
సాహితీమిత్రులారా!

శ్రీ శ్రీ 1930-1940 మధ్యకాలంలో వ్రాసిన ‘మహాప్రస్థానం’ లోని కవితలు ఒక బలీయమైన నిరసన లోంచి వచ్చినవి. ఈ నిరసన ఒక సాంద్రమైన డీప్లీ ఫెల్ట్ ఎమోషన్. ఒక తాత్వికచింతన ననుసరించి వచ్చిన నిరసన కాదు. అంతక్రితం వరకు వచ్చిన, వస్తున్న కవిత్వం సమాజంలో తాడితుల, పీడితుల వేదనలకు స్పందించకుండా వుండటంపై వచ్చిన నిరసన. ఇది మహాశక్తిమంతంగా వెల్లువలా, జ్వాలలా వచ్చింది. ఆయన కవిత్వంలో కూడా అంత బలీయంగానూ వెల్లువయింది. అంచేతనే చలం గారన్నట్లు ఈ సంకలనం లోని కవితలు కత్తులుగా, ఈటెలుగా, మంటలుగా, బాధలుగా తిరుగుబాట్లుగా, యుద్ధాలుగా బహిర్గతమయ్యాయి. తనకు, పాఠకునికి మధ్య అక్షరాలు అడ్డుగా నిలవకుండా ఆయన గుండెలోని ఆవేశాలు, ఆక్రందనలు, ఆకాంక్షలు పాఠకుల గుండెల్లోకి మహా వేగంగా చీల్చుకుంటూ దూసుకపోతవి. ‘మహాప్రస్థానం’ లోని అత్యధికమైన కవితలు ఈ వేగం, ఈ ఊపు కలిగి వుంటవి. వెనుకచూపు లేనే లేకుండా “పదండి ముందుకు, పదండి ముందుకు” అంటూ పిడికిలి బిగించి కదను త్రొక్కుతూ విరుచుకపడుతుంటే, అడ్డంకులన్నీ బేజారెత్తి పటాపంచలై పారిపోతవి. పాఠకులని జ్వలించే మూర్తులుగా ప్రభావితం చేస్తవి.

ఇంతటి శక్తి ఆ కవితలకుండటానికి కారణం కవి ఆవేశస్ఫూర్తి, శబ్దశక్తి, అనుభూతుల నిజతత్వ నిరూపణకు వ్యక్తీకరణ మాధ్యమాలుగా వాడిన పదచిత్రాలు. శ్రీశ్రీ తన ఆవేశావిష్కరణకు మాధ్యమాలుగా వాడే పదచిత్రాలు, పాఠకుల్ని కదిలించి ఊగించే బలం కలవి. సజెస్టివ్ పవర్ గలవి. మహాప్రస్థానం కావ్యంలో అదే పేరు గల మొదటి ఖండిక యొక్క భావవేగం, శబ్దసౌష్టవం, పదచిత్రాల నిర్మాణ ప్రౌఢిమ, అది సాధించిన మనోహరమైన లయ కావ్యానికే తలమానికంగా నిలబడుతవి. అల్లంత దూరంలో ఉన్న దోపిడీ లేని ప్రపంచం లోని ప్రేమ, స్నేహం, సమత, సౌభ్రాతృత్వ పునాదుల మీద లేచిన సమాజం చేరడానికి పిలుపు, మేల్కొలుపు ఈ మహాప్రస్థానం. ఈ ప్రస్థానం సులభం కాదు. అందుకే కృతనిశ్చయంతో సర్వత్యాగాలకు సిద్ధపడి అవసరమైతే గుండె నెత్తురుల తర్పణ చేస్తూ బాటలు, పేటలు, కోటలు, నదులు, కొండలన్నిటినీ అతిక్రమించి గమ్యం చేరటానికి గొంతెత్తి పిలిచే ‘క్లారియన్ కాల్’ ఈ గీతం. ఆశయసిద్ధి కోసం పురోగమించే పోరాటయోధుల అచంచల విశ్వాసం ‘కదం తొక్కుతూ పదం పాడుతూ’ అనడం లోనే ఆయుధాలు చేపట్టి వీరావేశంతో ముందుకు సాగే జనసందోహం దృశ్యమానమవుతుంది. మిలిటరీ బాండ్ సంగీతాన్ని స్ఫురింపజేసే లయతో చరణాలు కదం త్రొక్కుతవి.

“మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరోప్రపంచం పిలిచింది.
పదండి ముందుకు
పడండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి!
….దారి పొడవునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి.
నదీనదాలు,
అడవులు,కొండలు
ఎడారులా మనకడ్డంకి?

‘ఎడారులా మనకడ్డంకి’ అనడంతోనే అడ్డంకులేవీ లేవని నిర్లక్ష్యంగా స్ఫురింపజేయడం మంచి ధ్వనిప్రాయంగా జరుగుతుంది. ‘ప్రభంజనం వలె హోరెత్తండీ/ భావవేగమున ప్రసరించండీ’ అనే ఉద్బోధకు తగినంత వేగంతో అప్రతిహతంగా గీతం ముందుకు సాగుతుంది. ఆ ముమెంటంకు ‘త్రాచులవలెనూ రేచులవలెనూ ధనుంజయునిలా సాగండి’ లాంటి పదచిత్రాలతో ఒక అపూర్వమైన ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఈ సంకలనానికి ధ్యేయ, దిశానిర్దేశం జేస్తుంది ఈ ప్రారంభ కవిత. అలాగే ‘జయభేరి’లో చక్కని చిక్కని, ఉర్రూతలూగించే కవితా ప్రస్థానం సాగుతుంది.

నేను సైతం/ ప్రపంచాగ్నికి/ సమిధనొక్కటి/ ఆహుతిచ్చాను
నేనుసైతం/ ప్రపంచాబ్జపు/ తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం/ భువనభవనపు/ బావుటానై/ పైకిలేస్తాను

అలాగే గంటలు, అమూర్తం, భిక్షువర్షీయసి, అభ్యుదయం, మిధ్యావాది, ప్రతిజ్ఞ (ముఖ్యంగా కాల్చే ఆకలి కూల్చే వేదన/ బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ/ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని), కవితా ఓ కవితా, నవకవిత, కేక, గర్జించు రష్యా, నిజంగానే (బానిసల సంకెళ్ళు బిగిసే/ పాడు కాలం లయిస్తుందా? సామరస్యపు, సోదరత్వపు/ సాధుతత్వం జయిస్తుందా), నీడలు, జగన్నాధుని రధచక్రాల్ (ద్రోహాలని కూలగొట్టి/ దోషాలను తుడిచిపెట్టి/ స్వాతంత్ర్యం/ సమభావం/ సౌభ్రాత్రం,సౌహార్దం/ పునాదులై ఇళ్ళు లేచి/ జనావళికి శుభం పూచి); ఈ కవితలన్నీ గొప్ప కవితలు. ఉర్రూతలూగించే కవితలు. అలజడిని, ఆక్రోశాన్ని, ఆందోళననీ, కలిగించి గుండెలను మండించే కవితలు. రసానందాన్ని కలిగించే కవితలు.

మహాప్రస్థానం, లండన్ ప్రచురణకు ‘నా మాట’ శ్రీశ్రీ వ్రాస్తూ అంటారు: “ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను ‘సామాజిక వాస్తవికత’ అంటారనీ దీనికి వెనుక దన్నుగా ‘మార్క్సిజం’ అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు.”

‘నా మాట’ ముగిస్తూ శ్రీశ్రీ ఇలా అంటారు: “మహాప్రస్థానంలో అభ్యుదయకవిత్వము, విప్లవ బీజాలు ఉన్నాయి.విప్లవసాహిత్యం లేదు” అని.

విప్లవసాహిత్యం అంటే ఏంటి? సామాన్యప్రజానీకాన్ని విప్లవాచరణకుద్యుక్తులని జేసే విధంగా సాగేదే! మహాప్రస్థానం వ్రాసే రోజుల్లో సామాజిక వాస్తవికత గురించీ, మార్క్సిజం గురించీ శ్రీశ్రీకి తెలియకపోవటమే మంచిదయింది. తన చుట్టూ ఉన్న సమాజ స్థితిగతులకు చిత్తశుద్ధితో, ఆర్ద్రమైన హృదయంతో స్పందించి వ్రాయబట్టే తన భావుకతకు తోడుగా గొప్ప శబ్దశక్తి, అనుభూతి నిజతత్వ నిరూపణ, వ్యక్తీకరణ మాధ్యమాలుగా శక్తివంతమైన పదచిత్రాలను వాడబట్టే, గొప్ప లయను రచనలో సాధించబట్టే ఆయన గొప్ప కవిత్వం, ఎన్నటికీ మరువలేని కవిత్వం వ్రాయగలిగారు. మార్క్సిజానికి, విప్లవసాహిత్య అలంకారిక కట్టుబాట్లకు ఆయన లోనైన తర్వాత కవిగా ఆయన స్వతంత్రం కోల్పోయారు. సిద్ధాంత ప్రవచనం తన కర్తవ్యంగా స్వీకరించి, తన కవితా వ్యాసంగంపై మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పెత్తనం అప్పజెప్పారు. ఆయన దృక్పధంలో సాహిత్యప్రయోజనానికి, సాహిత్యమార్గానికి సంబంధించి ఈ మార్పు వచ్చిన తర్వాత కవిత్వరచనలో శిల్పం యొక్క ప్రాధాన్యతను దాదాపు త్యజించినట్లుగా భావించవచ్చు. ‘శ్రీశ్రీ సాహిత్య విమర్శ దృక్పధం’పై జూన్ 10, 2010 ప్రజాసాహితి సంచికలో కాత్యాయనీ విద్మహే అంటారు: ” ‘కాదేదీ కవితకనర్హం,అవునవును శిల్పమనర్ఘం’. సాహిత్యవస్తువు ఏదైనా కావచ్చు. సాహిత్యంగా దానిని నిర్మించే తీరుకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రారంభంలో శ్రీశ్రీ శిల్పవాది. చెప్పటంలోని చమత్కారం మీదనే దృష్టి. సంవిధానమే సమస్తమూ అనుకునే దశలో ఎలా చెబుతున్నాననే దానికి ప్రాధాన్యతనిచ్చారు. కళ కళ కోసమే అనేవారి దంతప్రాకారంలో జీవిస్తూ అందులోంచి బయటపడి ప్రజలకోసమే కళ అనే నిశ్చయానికి ప్రయత్నపూర్వకంగా వచ్చినవారు శ్రీశ్రీ.”

కళ కళ కోసమే అనే మహాసూక్తిని ఎందుకో మహా మేధావులు కూడా సరిగా అర్ధం చేసుకోలేదనిపిస్తుంది. కళ కళ కోసమే అనడం కళ ప్రజల కోసమే అనేదానికి వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కోసమే కళ. అంటే మొదట దేనినైతే మనం కళ అని పిలవదలచుకున్నామో అది కళ కావాలి కదా. కవిత్వం ద్వారా గానీ, లేదా ఇతర సాహిత్య రూపాల ద్వారా కానీ చెప్పదలచుకున్న వస్తువు లేదా విషయం కళగా మారాలి కదా! అది కళగా మారాలి అంటే అది కొన్ని నిర్దుష్టమైన విషయ నియమాలకూ, విధానాలకూ అనుగుణంగా శిల్పసౌందర్యాత్మకమైన, గుణాత్మకమైన మార్పులకు లోనై తీరాలి. లేకపోతే అది కళ కాదు. కళ కాని దానిని కళ అని పిలిచి ఇది ప్రజల కోసం అనడం అసంబద్ధమయిన విషయం. కళ కళ కోసం కానిది ప్రజల కోసం కానేరదు. కారణం కళ కళ కోసం కానప్పుడు అది కళే కాకుండా పోతుంది. ప్రజలను చైతన్యవంతులనే చేయటం ధ్యేయమైతే దానికి కవిత్వమే ఉపయోగించక్కరలేదు. వారికర్ధమయ్యే భాషలో, సరళమైన రీతిలో కరపత్రాలు రచించి, వారు నిరక్షరాస్యులైతే వారిని చిన్న చిన్న కూటములుగా చేర్చి సరళమైన భాషలో సూటిగా మాట్లాడి చైతన్యవంతులను చేయవచ్చు. చక్కగా అర్ధమయ్యే భాషలో చెప్పవచ్చు. కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలంటే వారినది ఆకట్టుకోవాలి. అంటే వినేట్లు లేదా చదివేట్లు చేయాలి. దానిలో ఒక ఆకర్షణ, అందం అంతర్లీనంగా వుండి తీరాలి. కవిత్వం కాని అక్షరాలు కవిత్వంగా నిష్ప్రయోజనం.

మాట్లాడినపుడు కూడా కళ యొక్క ప్రభావం నిబిడీకృతమై ఉంది. కళకు ప్రభావం లేకుండా చేయటం అసంభవం. ఏ రకమైన కమ్యూనికేషన్ విధానంలోనైనా రీతికి ప్రాధాన్యత ఉంటుంది. దానినెవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు. రీతిని విస్మరిస్తే నిర్జీవమైన కవిత్వం, నిర్జీవమైన ఇతర సాహితీ రూపాలు, నిర్జీవమైన ప్రసంగాలు మాత్రమే ఉంటవి. ఇళ్ళు ప్రజల కోసమే. కానీ ఇళ్ళు కట్టే రీతిలో నియమభంగం కాని రీతి ఒకటి ఉండాలి కదా! లేకపోతే అది కుప్పకూలి పోతుంది. కళ కూడా అంతే. అంచేత మానవసమాజానికి నీతి ఎంత ముఖ్యమో, రచనకు ముఖ్యంగా సృజనాత్మక రచనకు రీతి అంత ముఖ్యం.

పైనుదహరించిన వ్యాసంలోనే కాత్యాయనీ విద్మహే అంటారు: “కవిత్వం జీవితానికి వ్యాఖ్యానంగా ఉండాలని భావించే శ్రీ శ్రీ కవిత్వాన్ని సౌందర్యంతో ముడిపెట్టి చూసే దృష్టిని విమర్శకు పెట్టారు. అసౌందర్యం ఒక జీవిత వాస్తవం. అది అసలు లేదనుకోవడం భ్రమ అయినా కావాలి; ఆత్మవంచన/ పలాయనవాదం అయినా కావాలి. సౌందర్యారాధకుల అసౌందర్య వ్యతిరేకతను శ్రీశ్రీ నిరసించాడు. అసౌందర్యాన్ని సాహిత్య వస్తువుగా చేసుకుని దాని పట్ల అసహ్యం కలిగించేట్లు వ్రాస్తే – దాని నిర్మూలనకు ప్రేరణలు సమకూడి సత్యసుందరాత్మక ప్రపంచనిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది కనుక అది గొప్ప సాహిత్యం అవుతుందని…” పేర్కొన్నారు. అసౌందర్యం జీవిత వాస్తవికత అయితే అసౌందర్యవ్యతిరేకత కూడా జీవిత వాస్తవమే. శ్రీశ్రీ దృష్టిలో ధ్యేయం ‘సత్యసుందరాత్మక ప్రపంచనిర్మాణ’మని రూఢిగానే చెప్పినట్లయింది. ఈ నిర్మాణానికి మార్గంగా ‘అసౌందర్యాన్ని సాహిత్యవస్తువు’గా చేసికొనడం బాగానే ఉంది. ‘దానిపట్ల అసహ్యం కలిగించేట్లు వ్రాయాలనే సంకల్పం’ కూడా బాగానే ఉంది.కానీ, అసౌందర్యం యడల అసహ్యతను కలిగించే విధంగా వ్రాయడమంటే అసహ్యంగా వ్రాయడం కాదు. దానిలోని అసౌందర్యతను అది అసహ్యించుకోవలసినదిగా స్థిరముద్ర పాఠకుని మనసుపై వేసేటట్లు వ్రాయడం. అంటే వినసొంపుగానే రాయాలి. అపుడే అది అసహ్యతను చూపించగలుగుతుంది.

ఎవరైనా అర్ధం లేకుండా మాట్లాడారని మనం నిరూపించదలచుకుంటే మనం అర్ధం లేకుండా మాట్లాడి నిరూపించలేం. మనం నిరూపించదలచుకున్న అర్ధరాహిత్యాన్ని పదిమంది నిరసించేలా చేయాలంటే మనం చాలా అర్ధవంతంగా మాట్లాడి మాత్రమే చేయగలం. ‘సత్యసుందరాత్మక ప్రపంచనిర్మాణం’ శ్రీశ్రీ కోరుకుంటున్నారంటే ఆయన అసౌందర్య వ్యతిరేకతను నిరసించినట్లు ఎలా అవుతుంది? ఆయన భావనలో గందరగోళం ఉంది. రచనా రీతిలో వైరుధ్యాలు ఉన్నాయి.

శ్రీశ్రీ ఈ విధమైన ఈస్తటిక్ ప్రభావాలకు లోనై కవితాసౌందర్య భావనలకు, సుందరాత్మక కవిత్వావిర్భావతత్వానికి వ్యతిరేకంగా రియాక్షనరీగా తయారై తనలోని సహజమైన కవితాశక్తిని బలహీనపరచుకున్నారు. ఎక్కడో తన మనసులో ఒక చోట తనకు కవిగా ఎంతపేరు వచ్చిందో తనకు తెలుసు కాబట్టి ఇక తాను ఏమి వ్రాసినా కవిత్వంగా చెల్లుబాటవుతుందనే అపోహకు గురయ్యారు. పైపెచ్చు మార్క్సిస్ట్ భావనల అండ ఉండనే ఉంది. మార్క్సిస్ట్ భావనలు ఏ మాత్రం లేని కవితలలో కూడా ఒక నిర్లక్ష్య రచనా వైఖరి చాలాచోట్ల ‘ఖడ్గసృష్టి’లో, ‘మరోప్రస్థానం’లో కనిపిస్తవి. శ్రీ శ్రీ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా రచనా సామర్ధ్యం లేకుండా రచనా కండూతి ఉన్నవాండ్ల మీద పడి, దోపిడీనో, పెత్తందారీతనాన్నో నిరసిస్తూ, బూర్జువా లాంటి పడికట్టు పదాలను వాడుతూ, ఆకలి, అనారోగ్యం లాంటి వస్తువిశేషాల మీద ఇష్టమొచ్చినట్లు వ్రాసి కవిత్వంగా చదువరులను భ్రమింపజేయాలనే తహతహలో ఒక వ్యర్ధమైన వర్గం తయారయింది. దీనికి తోడు ఆయన పేరడీలు, ప్రాసక్రీడలు, లిమరిక్కుల జిమ్మిక్కులు తోడైనాయి. దీనినే వేటూరి, శ్రీశ్రీ మరణించినపుడు నివాళులర్పిస్తూ చేసిన రచన ‘చిరంజీవి శ్రీ శ్రీ’ (పునర్ముద్రణ ప్రజాసాహితి,జూన్ 2010) లో చూస్తాం: “అతడి పేరడీ, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, పలుకుల జిమ్మిక్కులు ఎందరినో కవులను జేసి కాగితాలను కౌలుకిచ్చాయి.” పైన పేర్కొన్నబడిన సామర్ధ్యం, నిబద్ధత లేని వర్గం మీద వేటూరి ఈసడింపు ఈ వ్యాఖ్యలో స్పష్టంగా తెలుస్తుంది.

మహాప్రస్థానంలోని కవితలతో సరితూగగలిగిన కవితలు ఆయన ఇతర సంకలనాలలో చాలా అరుదుగా కనిపిస్తవి. నీరసమయిన రచనలు, శుష్కవచనప్రాయమైన కవితలు మాత్రమే ‘ఖడ్గసృష్టి’ ‘మరోప్రస్థానం’ సంకలనాలలో అత్యధికంగా కనిపిస్తవి. స్టేట్‌మెంట్స్ స్థాయిని దాటలేకపోయిన వాటిని ఎక్కువగా చూస్తాం. ‘ఖడ్గసృష్టి’లో ఖడ్గసృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, సదసత్సంశయం, మహాసంకలనం ఈ కవితల శీర్షికలన్నీ ఎంత అందమైన సంస్కృతపదబంధాలో చూడండి. కానీ అన్నీ ప్రొజాయిక్ రచనలే.

“మానవుడే నా సంగీతం/ మానవుడే నా సందేశం” – ఇది ఒక ప్రొజాయిక్ స్టేట్మెంట్. ఒక స్లోగన్ గా బాగా పనికివస్తుంది.

‘శరశ్చంద్రిక’లో – “ఎవడో చెబితే వినేరోజులు/ ఏనాడో వెళ్ళిపోయాయి/ ఇంకా ఏదో చెప్పాలని/ఎందుకీ ఉబలాటం.” – ఇది సుభాషితంగా బావుంది. కవిత్వంగా మాత్రం కాదు.

“వెళ్ళు జాబిల్లీ వెళ్ళు/ వినిర్మలమైన వెన్నెలని కురిపిస్తూ/ మనోహరమైన సంగీతం వినిపిస్తూ ప్రయాణించు/ శశీ ప్రయాణించు.” – ఏది కవిత్వం దీనిలో?

‘విషాదాంధ్ర’లో – “కొంగల్లారా జపం చెయ్యండి /పిల్లీ పఠించు మంత్రాలు/ ఎలుకల్లారా సభ జరపండి/ఎవరు గంటకట్టాలని?” – దీని గురించి చెప్పేదేముంది!

సామాన్యుని కామన, రుబాయత్, బొమ్మలాంతరు, ఆఖరిమాట, మొదటిమాట, విదూషకుని ఆత్మహత్య -వీటిలో అభ్యుదయమేది? కొంటెకోణాలలో ఎందుకంత ఫ్లిప్పన్సీ? అలానే ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ.

‘నగరంలో వృషభం’ ఎంత ప్రొజాయిక్!

‘వెండి పండుగ’లో – “ఈ స్వాతంత్ర్యంలో/ బాగుపడిన వాళ్ళు పదిమంది/ బాధలు పడుతున్న వాళ్ళు పదివేలమంది/ ఈబాధల స్వభావాన్ని/ బహిరంగపరచటమే ఈ నాటి కవుల ఏకైక కర్తవ్యం.” – దీనిలో కర్తవ్య బోధ ఉంది. కవిత్వం లేదు. ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కవిత్వం ఎందుకు? నిబద్ధత కలిగిన కార్యకర్తలుంటే చాలు. పిశాచి, శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు, అవలీలగా’లలో అభ్యుదయం ఎక్కడుంది? విప్లవోన్ముఖులను జేసే విప్లవావేశం ఎక్కడుంది? ‘స్త్రీస్త్రీ’ లో ఎందుకంత ఫ్లిప్పన్సీ? ‘తులంవృశ్చికం’లో కేవలం తమాషా ఉంది.

కప్పవైద్యుడు, సీనూ-భానూ పిల్లల కవితలు. ఓ మహాత్మా ఓ మహర్షీ’ శరపరంపరలుగా సాగిన ప్రశ్నలు. ఆఖరున ఉన్న జవాబు కవితా మయంగా ఉంది. బావుంది.

“నిన్న స్వప్నం ,నేటి సత్యం/ నేటి ఖేదం,రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి/ ఓ మహర్షీ ,ఓ మహాత్మా”

‘అధివాస్తవికుల ప్రవేశం’ చందోపద్ధతిలో ఉంది.వదిలేసిన పద్య రచన మరలా ఎందుకు?

దాదాపు అన్ని ఖండికలూ ప్రొజాయిక్ రచనలు. ‘దీర్ఘాలు’ అడ్డదిడ్డంగా ప్రింట్ చేయటం జిమ్మిక్కుగా తోస్తుంది. ‘యువకవిత’లో వచనానికీ, కవనానికీ సరిహద్దులు చెరిగి పోయినాయంటే ఇక కవనం, వచనం అనే రెండు మాటలెందుకూ? విశ్వమానవాళి గురించే ఆలోచించే శ్రీశ్రీ ‘జగానికంతా సౌఖ్యం నిండగ’ అనే శ్రీశ్రీ ‘ఆంధ్రదేశంలో’ అంతటి ఆంధ్రాభిమానం ప్రదర్శిస్తే ఆశ్చర్యం వేస్తుంది.అది సైద్ధాంతిక వైరుధ్యం కాదు. కానీ ఆ పంక్తులు చక్కగా ఆకట్టుకుంటాయి.

“నీ దేహపు దుర్గం నేనై/ నా బాహువు ఖడ్గం నీవై
పరాంకోటి జనబాహుళ్యం/ చలాయించు రధ సౌరభ్యం
సమరంగా సముజ్వలిస్తే/ ప్రళయంగా పరిప్లవిస్తే
నిశాంధ్యముల నిర్మూలిస్తాం/ మహాంధ్రమని తీర్మానిస్తాం”

‘జన్మదినోత్సవం’లో మన పతాకంలో ‘అజ్ఞానం,అనారోగ్యం,నిరుద్యోగం కనబడతా’యన్నారు శ్రీశ్రీ . కానీ ‘సఖ్యం’లొ హిందీ, చీనీ భాయీ భాయీ అనడాన్ని మెచ్చుకుంటూ ఇరుదేశాల పతాకాల గురించి అంటారు:

“అవిచ్ఛిన్నమై అప్రతిహతమై
సాగిన చరిత్ర మనదేశాలవి.
సజీవ నాగరికతా పతాకం
ఎగరేస్తున్నవి ఈ దేశాలే”

ఎలా అర్ధం చేసుకోవాలి ఈ వైరుధ్యాలను? మహాప్రస్థానంలో అభ్యుదయకవిత్వం, విప్లవబీజాలు ఉన్నాయి. విప్లవసాహిత్యం లేదు అని ఆ తరువాత వచ్చిన ఖడ్గసృష్టి, మరోప్రస్థానం నిండా విప్లవసాహిత్యం ఉన్నట్లు మనల భ్రమింపజేస్తారు. వారి మాటల ప్రకారం చూసినా విప్లవసాహిత్యం ఎక్కడో తప్ప కానరాదు. అనువాద కవితలతో నిండిన తక్కిన గ్రంధభాగం (ఖడ్గసృష్టి) చాలా వచనంగా ఉండి రీడబిలిటీ లేకుండా ఉంటుంది. అభ్యుదయభావాలు కూడా పెద్దగా కానరావు. పుష్కిన్ కవిత ‘చలికాలపు ఉదయం’లో ఆఖరి మూడు పంక్తులు ఆకర్షణీయంగా ఉంటవి. కానీ అవి అభ్యుదయకవితా పంక్తులు కావు; అది ప్రణయ కవిత్వపు చరణం.

“ఎవరూ లేని ఎవరూ రాని పొలాలలో తిరుగుదాం
ఆకులు శూన్యమైన అరణ్యాల కరుగుదాం
నాకెంతొ సుఖమిచ్చే నది వొడ్డుకి కదులుదాం”

మయకోవ్‌స్కీ ‘గృహోన్ముఖంగా’లో అదేమి కవిత్వమో ఇలా ఉంటుంది:

“ప్రజారాజ్య మహా యంత్రంలో
ప్రత్యేకంగా నా చోట నిలబడి నేను
‘ఏమండోయ్ బాగున్నారా?’ అని నేను పలకరించను
పగలగొట్టటం నా కుశలప్రశ్న”

వాల్ట్ విట్మన్ ‘కామ్రెడ్’లో:

“అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతినీ,క్షేమాన్నీ, చట్టాలను
కట్టుదిట్టాలను వాటిని ధిక్కరించటమే నా పని
అందరూ నాకెంత దూరమైతే అంత బిర్రబిగుస్తాను
అందరూ నాతొ ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో”

వీటిని చదవటం, కవిత్వంగా భావించటం సాధ్యమా?

కవితానువాదం ఎవరో చిన్నవాళ్ళు చేయవలసిన పని. మహాప్రస్థాన కవీశ్వరులు కాదు. ‘చేపలరాత్రి పాట’ అక్షర రహితమైన ఆ సరళరేఖలు, అర్ధచంద్రాకృతులు నాకసలు బోధపడలేదు. ఏదో మిస్టీరియస్ హైరోగ్లఫిక్స్ లాగా, పెద్ద బ్రెయిన్ టీజర్ లాగా ఉంది. ఏమిటి దాని అందం, దాని సందేశం? ఎందుకంత జిమ్మిక్కుల యెడ ఫాన్సీ? అభ్యుదయ, విప్లవ సందేశాలను ఏ ఎడారులకు వదలివేసినట్లు?

చలసాని ప్రసాద్‌గారు మరోప్రస్థానానికి ముందుమాట వ్రాస్తూ ఆశ బెట్టిన “నక్సల్బరీ నిప్పురవ్వలు, శ్రీకాకుళం విప్లవాగ్నులు, పీడితజనుల పోరాటాల పాటలు, విప్లవయోధుల బలిదానాల బాటలు, వెలుతురు బావుటాలు, మంటల చేత మాట్లాడించి/ రక్తం చేత రాగాలాపన చేయించిన సందర్భాలు” ఈ గ్రంధంలో చాలా చాలా అరుదుగా కనిపిస్తవి. విప్లవసాహిత్యం లేకపోయినా శాశ్వతంగా నిలచిపోయే గ్రంధం మహాప్రస్థానం మాత్రమే.ఈ సంకలనంలో కవితాకళ పరంగానూ, విప్లవచైతన్య ప్రేరకంగానూ చాలా మంచి చరణాలు ఉన్నది మరోప్రస్థానం లోని మొదటి కవిత.

“యిప్లవం యాడుందిరా/ఆడనే నీ కూడుందిరా,నీ గూడుందిరా
…యిప్లవమ్యేమందిరా/ మనిసికొకటే సావందిరా
కట్లుతెంచుకు రమ్మందిరా/ కత్తి దూసుకలెమ్మందిరా
యిప్లవం నీ దమ్మందిరా
యెర్రెర్రని రగతాల/ యేరుల్లో ఈదరా”

కదిలించే చరణాలు, ఎప్పటికీ గుర్తుండే చరణాలు.

మహాప్రస్థాన కవితలతో పోల్చడానికి వీలు లేకపోయినా అక్కడక్కడ మంచి చరణాలు కల కవితలు – తుదిపయనం, తొలివిజయం, కదలిరండి నవభారత నారీమణులారా, భూమ్యాకాశాలు, దూది, పులి మీద పుట్ర, ఓ మహాత్మా ఓ మహర్షీ, ఉగాది గీతి, పెద్దపండుగ, ఝంఝ. చాలా కవితలు వచనప్రాయంగా ఉండి, ఏ మాత్రం గుర్తు వుండకుండా ఉంటవి. ఉదాహరణకు: రాక్షస ఉగాది, మట్టిపులి, మనీషి, అరరే దమ్మిడీ, ఇప్పుడే ఇక్కడే కలగాపులగం (దీనిలో ఆఖరి రెండు లైన్లు పైన ఉండి వాటి ముందున్న లైన్లు ఆఖరి లైన్లుగా ఉంటే బావుండేది), ఉగాది గీతం, రావోయ్ నవకవీ, స్వకీయపురాణం, బాలలవత్సరం, ఉగాది స్వాగతాలు, మనమే సైన్యంగా మారిపోదాం, మెల్లమెల్లగా – జోరుజోరుగా, దైవప్రార్ధన, పంచరత్నాలు, సాధారణ ఉగాది పచ్చడి, సుప్రభాతం, ఎవరిది అహింస.

గ్రంధంలో ద్వితీయభాగంగా ఉన్న ప్రసిద్ధుల అనువాద కవితలలో – ఎక్కడ సత్యం, ఫిడేల్ కోసం పాట, పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండటం వల్లనే గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగా ఉన్నారు, మిగిలిన వలయాలు, టర్కీ, మరేముంది మరణం తప్ప, గీతం నా మేజోళ్ళకు, పేదవాళ్ళ ఆగ్రహం, చిరుతిండి, సృజన, సమరధ్యానం, విరాజకీయ మేధావులు: వీటిలో – అతి సామాన్య అభ్యుదయ భావనలు కూడా అక్కడక్కడ ఉండీ లేనట్లుగా ఉన్నా, ఆనందింపజేసే పంక్తులు బహుశా లేనేలేవని చెప్పవచ్చు. ఉటంకించాలనే ఆర్తి కలిగించే పంక్తులు లేనే లేవు. కంఠవశం కావు. కంఠవశం చేసుకోవాలనే కోరిక కూడా కలుగదు. వీటిని కవితలనడానికి ఎంతటి వామపక్ష రససిద్ధాంత పక్షపాతమున్నవారికి కూడా ధైర్యం చాలదు. అసలు మొదట తేల్చుకోవాల్సిన విషయం: విప్లవాచరణకుద్యుక్తుల్ని చేసేది కవి రచన ద్వారానా? లేక ప్రజలలో కలిసి మెలిసి వారి కష్టసుఖాలలో పాలు పంచుకుని, వారిని ప్రసంగాల ద్వారానూ ముఖాముఖి సంభాషణల ద్వారానూ చైతన్యవంతులను చేసి వారి సమస్యలకు పరిష్కారమార్గాలుగా ఉద్యమాలు నడపటం, తిరుగుబాటు పంధాలను చూపించటం, చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో వాటిలో పాల్గొని వాటిని నిర్వహించటం ద్వారానా? కవిత్వాల వల్ల విప్లవాలు రావడం, విప్లవాలవల్ల కవిత్వాలు రావడమంత సులభం కాదు. విప్లవాలు వస్తే, అవి జయిస్తే, ఆ కీర్తి పూర్తిగా వానిలో ప్రాణాలు తెగించి పోరాడిన విప్లవవీరులకే గానీ, మీరు పోరాడండి అని ఎంత గొప్ప కవిత్వాలు వ్రాసినా ఆ కవిత్వాలు వ్రాసే సోకాల్డు విప్లవకవులకు కాదు.

మరి కవిత్వానికి ప్రయోజనం, ప్రాధాన్యతలు లేవా? ఒకమేరకు తప్పనిసరిగా ఉన్నవి. ఒక మేరకు ఉన్నవి అంటే వాటికి పరిమితులు వున్నట్లుగా చెప్పటమే. కవిత్వం అతి ప్రధానమైన కళారూపం. దాని ప్రభావం ప్రత్యక్షంగా రసానందం కలిగించటం. పరోక్షంగా అది కలిగించే కొన్ని స్థిరమైన అభిప్రాయాలు కార్యాచరణపర్యవసాయి అవుతాయన్న నమ్మకంలేదు. ఈ మాటలు అన్నిరకాల కవిత్వాలకు వర్తిస్తాయి. మనకెంతో నీతిని ప్రబోధించే కవిత్వముంది. మనం దానిని చదివి ఆనందిస్తాం. కానీ మనందరం నీతిమంతులమయ్యామా? అలాగే నైతికత జీవిత వాస్తవికత అయ్యిందా? అలానే భక్తిని ప్రచారం చేసే కవిత్వంతో నిజమయిన భక్తులమయ్యామా? నిజమైన భక్తులు, నిజమైన నీతివంతులు, నిజమైన విప్లవకారులు కవిత్వం వ్రాయడం కేవలం యాదృచ్ఛికం. వారు కవులు కాబట్టి కూడా వ్రాశారు. అలానే భక్తిని ప్రబోధిస్తూ వ్రాస్తే భక్తులు, నీతిని ప్రబోధిస్తే నీతివంతులు, విప్లవాన్ని ప్రబోధిస్తే విప్లవకారులు తప్పనిసరిగా కానవసరం లేదు.

చలసాని ప్రసాద్‌గారు మహాప్రస్థానానికి ముందు మాటలో, “ప్రజానీకాన్ని విప్లవాచరణకుద్యుక్తుల్ని చేసే విధంగా ప్రభావితులని చేయాలంటే కవితారూపాలు గుర్తుపట్టలేనంత మారిపోవాలి. నిజానికి శ్రీశ్రీలో అలా మారిపోయాయి కూడా. మహాప్రస్థానంలోని భాషాప్రవాహం, శైలీ విన్యాసం, శబ్దశక్తిని కొలబద్దలుగా తీసుకుని ఈనాటి కవిత్వాన్ని కూడా కొలవాలని చూస్తున్నారు.” అంటారు. మహాప్రస్థానంలోని అతి ముఖ్యమైన, కవిత్వానికే అతి ముఖ్యమైన, భావావేశం, అనుభూతి సాంద్రతల గురించి మాట్లాడలేదు. అసలు మహాప్రస్థానంలో విప్లవ కవిత్వపు బీజాలు మాత్రమే ఉండి విప్లవకవిత్వం లేకపోవటమేమిటి? విప్లవకవిత్వం బీజరూపంలో వున్నదంటే చాలా కళాత్మకంగానూ, గొప్ప సజెస్టివ్ పవర్‌తో విప్లవకవిత్వం ఉందన్నమాట. సామాన్య ప్రజానీకాన్ని విప్లవాచరణ కుద్యుక్తులని చేసే విధంగా ప్రభావితుల్ని చేయడానికి విప్లవావశ్యకతను ప్రబోధిస్తూ మహాప్రస్థానంలో వాడిన కవితా రీతిని కొనసాగించటం ఎలా నిరర్ధకమవుతుంది? అంటే శ్రీశ్రీ మహాప్రస్థాన రచనాకాలానికి మరోప్రస్థాన రచనాకాలానికీ మధ్య ఉన్న కొద్ది కాలంలోనే అవుట్‌డేటెడ్ అయ్యారా? పాతబడి అక్కరకు రాకుండా పొయెట్రీ మ్యూజియంకు మహాప్రస్థానం వెళ్ళిపోయిందా? కవితా రూపాలు గుర్తు పట్టలేనంత ఎందుకు మారిపోవాలి? బాహిరమైన రూపంలో నామమాత్రమైన తేడాలున్నా అది కలిగించవలసిన స్పందనలలో గుణాత్మకమైన మార్పు ఎందుకుండాలి? ఉండదు. ఉండకూడదు కూడాను. తేలిగ్గా వ్రాస్తూ, అందంగా వ్రాస్తూ ఉత్తేజం కలిగించలేరా? కమ్యూనికేషనే ప్రధానమైతే కవిత్వాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఏముంది? కవిత్వం యొక్క ప్రధాన లక్షణం రంజింప జేయటమని ఖడ్గసృష్టి లోని ‘కవితాప్రయోజనం’ ఖండికలో కేవలం శ్రీశ్రీ, ఆరుద్ర లాంటి మేధావులు, మార్క్సిస్ట్ రస సిద్ధాంతకారులే ఈ క్రింది విధంగా సంవాదరూపంలో అన్న మాటలని పోగు చేస్తున్నాను.

ఆరుద్ర: ఎవరూ చెప్పంది చెప్పటం, ఇలా చెప్పి మెప్పించడం అదేనన్నమాట కవిత్వమంటే.
శ్రీశ్రీ: రుచీ, ఔచిత్యం ఇవీ ముఖ్యం మెప్పుకి/ అందుకే అసలైన కవిత్వం ఏకకాలంలో పండితపామర జనరంజకం ఎవరో అనగా విన్నాను.
ఆరుద్ర: ఏమిటి చెప్పడం ఎలా చెప్పడం/ అనేవి రెండూ రెండు చక్రాలు. చెవికింపుగా వినసొంపుగా కవి పలకడం ఖచ్చితంగా ఖాయం.
శ్రీశ్రీ: మెదడూ, హృదయం మిళితమయే గుణం/ అదే కావ్యానికి ఏకైక లక్షణం.
ఆరుద్ర: కావాలి కవిత హృదయానికి నరిష్మెంట్/ కారాదు ఏనాడు మెదడుకి పనిష్మెంట్.
శ్రీశ్రీ: ఎక్సలెంట్ ఆరుద్రా నీ స్టేట్‌మెంట్. రంజనం కలిగిస్తాడు/ సందేశం వినిపిస్తాడు.
ఆరుద్ర: రంజింపజేస్తూ సందేశమిచ్చేదే మహాకావ్యం.
శ్రీశ్రీ: ఛందస్సుల అశ్వహృదయం తెలియనివాడు/ సవారీకి తయారు కాకూడదు.

కవితాశక్తి కలిగిన వ్యక్తి యొక్క సహజస్వభావం లోంచి వచ్చిన ఆవేశం కవితగా ఆవిర్భవించే తీరుకు, నిబద్ధత తోనో, అనిబద్ధత తోనో ఒక సిద్ధాంతాన్ని నమ్మి దానికనుగుణంగా వ్రాయాలనే సంకల్పంలో వ్రాసే కవితకూ చాలా తేడా ఉంటుంది. రెండవ రకానికి చెందినది పత్రికా ప్రకటనకు కొంచెం అటు, ఇటుగా వుండేవి. మరుసటి రోజుకు మరచిపోయేది. మొదటి రకమైనది జీవితాంతం గుర్తుంచుకోవాలనే తపన కలిగించేదీ, గుర్తుంచుకోగలిగేది.

కవితాప్రయోజనం ఖండికలో శ్రీశ్రీ, ఆరుద్ర కవిత్వాన్ని గురించి చెప్పిన అతి ముఖ్యమైన విషయం పాఠకుడిని రంజింపజేయడం, రంజింపజేస్తూ సందేశాన్నివ్వడం. ఈ సందేశం కూడా కవితాస్వాదన లోనే అంతర్లీనమై పాఠకుడి అంతరంగంలోకి ప్రవేశించడం జరిగితే అది ఎక్కువ శక్తిమంతంగా ఉంటుంది. పాఠకుడి స్వభావం లోనే గుణాత్మకమైన మార్పు తెస్తుంది. 1968లో మొదట సారిగా సాహిత్యాభిలాష ఉన్న ఒక మిత్రుడు అక్కడక్కడా చదవగా విన్నాను ఖడ్గసృష్టి లోని ‘ఏవి తల్లీ’ లోని పంక్తులు. మార్క్సిస్ట్ సిద్ధాంతాలు, అభ్యుదయ భావాలుగా భావించేవేవీ అందులో లేవు. కానీ శ్రీశ్రీ ఎంత గొప్ప కవిత వ్రాశారు? ఆద్యంతం ఆకట్టుకుని, ఆనందం కలిగిస్తూ, మన ప్రాచీన వైభవాన్ని దానికి తగిన మహోదాత్తమైన శైలిలో, రీతిలో ఎంత రమ్యంగా కొనసాగిస్తారు! జీవితాంతం మర్చిపోలేని కవిత!

చక్రవర్తి అశోకుడెక్కడ/ జగద్గురు శంకరుండెక్కడ
ఏవితల్లీ నిరుడు కురిసిన/ హిమసమూహములు
కాళిదాస మహా కవీంద్రుని/ కవన వాహినిలో కరంగిన
ఉజ్జయని నేడెక్కడమ్మా/ ఉంది చూపించు
షాజహాన్ అంతఃపురంలో/ షట్పదీశింజానమెక్కడ
ఝాన్సిలక్ష్మీ దేవి యెక్కిన/ సైంధవం నేడేది తల్లీ ?
రుద్రమాంబా భద్రకాళీ/ లోచనోజ్వలరోచులేవీ
ఖడ్గతిక్కన కదన కాహళ/ కహకహధ్వనులెక్కడమ్మా?
ఎక్కడమ్మా కృష్ణరాయని/ బాహుజాగ్రద్బాడబాగ్నులు ?
బాలచంద్రుని బ్రహ్మనాయుని/ ప్రాణవాయువులేవి తల్లీ ?
జగద్గురువులు చక్రవర్తులు/ సత్కవీశులు సైన్యనాధులు
మానవతులగు మహా రాజ్ఞులు కానరారేమీ ?
పసిడిరెక్కలు విసరి కాలం/ పారిపోయిన జాడలేవీ
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?

పైనుదహరించినది శ్రీశ్రీ గేయాల్లోకల్లా అపురూపమైన జాతి వజ్రం. దీని మహోజ్వలమైన తేజోవలయానికి కేంద్రబిందువు “పసిడిరెక్కలు విసరి కాలం పారిపోయిన జాడలేవీ” అన్న పంక్తి. ఇలాంటి పంక్తులు ఎంత గొప్ప కవులైనా చాలా అరుదుగానే వ్రాయగలుగుతారు.

శ్రీశ్రీ కవితాప్రస్థానం మహాప్రస్థానంగా జరిగింది, సాగింది మహాప్రస్థానం లోనే. డైడాక్టిసిజానికి చోటివ్వని సాంద్రమైన అనుభూతులు భూమికగా ఉన్న కవితలే మరువలేని కవితలుగా మిగిలిపోయేవి. మార్క్సిస్ట్ సిద్ధాంతం అబ్సెషన్ అయ్యాక శ్రీశ్రీ వ్రాసిన కవితలు అతి స్వల్పసంఖ్యలో ఏవో కొన్ని మినహాయించి హృదయాన్ని తాకలేనివి. దాదాపు రీడబిలిటీ కూడా లేనివి. తత్ఫలితంగా ఆయన కవితాప్రస్థానం అవరోహణక్రమంలో దిగజారింది. పరిణామం విపరిమాణం అయింది. అయినా ఆయనకొచ్చిన లోటు లేదు. చాలా గొప్ప కవిగా ఆయనకు శాశ్వత స్థానం ‘మహాప్రస్థానం’ కల్పించడం జరగనే జరిగింది.

ఇప్పుడు చెప్పబోయే సంగతి శ్రీశ్రీపై వ్రాసిన వ్యాసంలో భాగం కాదు. దానికి ఎడెండంగా ఉండటానికి తగనిది కూడా కాదు, శ్రీశ్రీ వ్యక్తిత్వం లోని ఒక పార్శ్వాన్ని కొంత ప్రతిఫలింపజేస్తుంది కనుక మాత్రమే ఇక్కడ చెప్పదలచుకున్నాను. శ్రీశ్రీ దంపతులకు ఆతిధ్యం ఇచ్చే అవకాశం మాకు కలిగింది. చాలా సంతోషం వేసింది. శ్రీశ్రీ తప్పనిసరిగా సెలబ్రిటీయే. కాలేజీ ఏ.సి. గెస్ట్‌హౌస్‌లో వారి విడిది. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భోజనానంతరం దాదాపు ఇరవైమంది లెక్చరర్లం వారిని కాలేజీలోని అశోక వృక్షాల మధ్య సోడియం లైట్ల కాంతిలో కలిశాం. ఆనాడు నాకనిపించింది ఆయన మృదుభాషి, స్మితభాషి, మితభాషి అని. మహాప్రస్థానం కవితలన్నిటిలోకి ‘నిజంగానే’ చాలా గొప్ప కవిత అని నాకనిపిస్తుందని నేనన్నాను. చిరునవ్వుతో చిన్నగా అన్నారు దానిమీద విమర్శ ఉందని. ఆ ప్రశ్నార్ధకాలు “పాడుకాలం లయిస్తుందా? మంచికాలం రహిస్తుందా? సాధుతత్వం జయిస్తుందా?” లాంటివి అవి విజయవంతంగా నిజమవడంపై తనకు అనుమానమున్నట్లు ధ్వనింపజేస్తాయని. “అదెలా అవుతుంది, ఈ స్నెయిల్ పేస్‌లో ప్రజలు ఉద్యమించటంపై మీ అసహనాన్ని ప్రకటిస్తాయి, మీరు వాటిద్వారా ఉద్యమస్ఫూర్తి, వేగిరవతావశ్యకతను కోరుతున్నారనుకోవాలి గాని,” అన్నాను. నవ్వి ఊరుకున్నారు.

తర్వాత నేనడిగాను: మీకింత పేరొచ్చింది, మీకింత ఫాలోయింగ్ ఉంది. మిమ్మలను అభిమానించే సామాన్య జనం, సాహితీ పరులు కోకొల్లలుగా దేశంలో ఉన్నారు. మిమ్మలను ఒక మహాకవిగా ఒక మహామనీషిగా చూసే వాండ్లు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. ఈలోకం, ఈ సంఘం మీ యెడల ఇంత ప్రేమ, గౌరవాలు చూపించాయి. మీ మరణసమయంలో వీరందరినీ వదలి పోతున్నందుకు మీకేమనిపిస్తుంది అని. చెరగని చిరునవ్వుతోనే అన్నారు: “ప్రత్యేకంగా అనిపించటమేముంది? అది సహజమైన టెర్మినేషన్ కదా”. నేను మరలా అన్నాను, “మీరొస్తున్నారని మేమెంతో హడావుడి చేశాం. మీ స్టే సుఖప్రదంగా ఉండేందుకు వీలున్న అన్ని ఏర్పాట్లు చేశాం. మిమ్మలను ఒక మహా వ్యక్తిగా భావించి ఇంతమందిమి వచ్చి మీరు చెప్పేది వినడం కోసం ఇంత ఉత్సాహంతో, గౌరవంతో మీతో గడిపాం. రేపు ఉదయం మీ అవసరాలన్నీ చూసి గౌరవంగా మీకు వీడ్కోలు పలుకుతాం. మమ్మలను వదలి మీరు వెళ్ళేందుకు కారు ఎక్కేప్పుడు మీకేమీ అనిపించదా?” అని.

వారే మన్నారో నాకు గుర్తులేదు, చెరగని చిరునవ్వు మాత్రం గుర్తుంది.
-----------------------------------------------------------
రచన: సి. ఎస్. రావ్, 
ఈమాట సౌజన్యంతో

No comments: