Monday, October 2, 2017

సంజీవనీశైలి


సంజీవనీశైలి
సాహితీమిత్రులారా!

ఒక రచయిత పద్య లేదా గద్యశైలిని 
హాస్యస్ఫోరంగా అనుకరిస్తే - అది పేరడీ.

వెళుతున్న రైలు - ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో
అతడేదో ఆలోచిస్తూ ప్రయాణం చేయడం

ఈ సన్నివేశంతో రాసిన పేరడీ-

   సంజీవదేవ్ గారు గద్యరచనలో కొత్త పోకడలను ప్రవేశ పెట్టారు. తర్కమూ, గంభీరమైన సంస్కృతపదాలను సామాన్యవాక్యాల్లో పొదగడమూ వీరి ప్రత్యేకత. ఇదే సంఘటనను సంజీవ్ దేవ్ గారయితే!

   "రైలు జడమే అయినా అది కదుల్తుంది. చెట్టు చేతనమే అయినా అది కదలదు. కదలే అచేతనాలు, కదలని సచేతనాలు, కదలే సచేతనాలు: కదలని అచేతనాలు కూడా తారసపడతాయి. నిత్యజీవితంలో కదలిక సజీవమైన ప్రాణస్పందనకు గతిశీల చిహ్నం.
రైలు చేస్తున్న శబ్దం లయాత్మకంగా తట్టసాగింది ఫస్ట్ క్లాస్ లో కూర్చున్న అతనికి, కిటికీ గుండా బాహ్యజగత్తును అనుశీలన చేయసాగేడు. అభివ్యక్తపరచబడిన భావాలేవో అతని మానసాకాశంలో వుండి వున్నాయి. దూరాన ఛాయారూపంలో అస్పష్టంగా అగపడే పర్వత పంక్తులు ముక్తాకాశం క్రింద రమ్యంగా గోచరిస్తున్నవి. అతను వివాహితుడా?అవివాహితుడా? అని ఆలోచన చేయసాగేను. కొందరు వివాహితులు అవివాహితల్లాగాను కొందరు అవివాహితులు వివాహితుల్లాగాను వుంటారు. అతను వివాహితుడనే నిర్ణయానికి వచ్చాను. కాని, నా నిర్ణయం భ్రమయేమోననే సందేహం కూడా కలిగింది."

(శ్రీరమణ పేరడీలు నుండి.............)


No comments: