Friday, July 21, 2017

నవరత్న కలిత సీసము


నవరత్న కలిత సీసము




సాహితీమిత్రులారా!


విష్ణుమాయా విలాసంలోని
ఈ పద్యంలో
మాయాముని తన ఆశ్రమంలోని సంపదను
బ్రహ్మకు చెబుతూ నవరత్నాల వాకిలిని
గురించి చెప్పిన సందర్భములోనిది చూడండి-

పద్మరాగచ్ఛవిపత్రంపుజొంపలు
         కేకిపంఛచ్ఛదాకీర్ణ లేఖ
అమృతాంశుశోభాదళాంచిత భిత్తులు
         గారుడమణిపత్ర తోరణములు
జాతిపచ్చలవన్నెచదురగు కప్పులు
         మేల్మి వన్నియలాకు మేలు కట్లు
వజ్రాభపత్రకవాటంపు తడికెలు
         పవనంపు వన్నె కంబములు దనర
మరియునరవిరి తెరగంటు విరుల సరుల
పాలవెల్లువ మధురసపాన మత్త
సంభ్రమభ్రమరారావసంకులంబు
గలుగు మొగసాల యల్లన గడచిచనగ
(విష్ణుమాయా విలాసము - 3- 109)

పద్మరాగమణుల కాంతిగల ఆకులగుత్తులు
నెమలిఈకల నీల వర్ణముగల చిత్తరువులు
చంద్రుని వెన్నెల శోభగల గోమేధికము(పసుపు)
వర్ణముగల గోడలు. గరుడ పచ్చని గారుడమణి
(మరకతము) గరిమగల గడప ముందు వాకిలిలో
నిడుపైన కంబములకు కట్టిన ఆకుల సరములు.
లేతపచ్చని రంగుగల మాణిక్యవర్ణముగల
(అశోక వృక్ష పత్రములు) ఇంటిలోని పైకప్పులు.
నేర్పరితనముగల వైఢూర్యవర్ణముగల (పిల్లికన్నురంగు)
కప్పుల గోడలంటునట్లు చిత్రమైన సన్నని సన్నని
వస్త్రముల సముదాయపు మేలికట్లు. తెల్లని రంగుకల
సూర్యకిరణముల వంటి వజ్రాలవర్ణముతో తలుపులుగా
నున్న ఆకుల తడికలు. గోధుమకాంతిగల పగడపు
వర్ణముగల స్థంభములు. సగము విచ్చిన దేవతా
పుష్పములు ముత్యాల(వెండివంటి) కూర్పులలో
తేనెత్రాగి మదమెక్కి, వేగిరపాటుతో తిరుగు
తుమ్మెదల ఝంకారములతో సందడిగల వాకిలిని
దాటి... - అని భావం.
ఇందులో పద్మరాగమణి, నీలమణి, గోమేధికము,
గారుడమణి, మాణిక్యము, వైఢూర్యము, వజ్రము,
పగడము, ముత్యము అనే నవరత్నముల పేర్లు
ఇందు కూర్చబడినది.

No comments: