భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె
సాహితీమిత్రులారా!
కావ్యాలంకార సంగ్రహ కృతి భర్త అయిన
నరసభూపాలుడు రామరాజభూషణుని
ఈ విధంగా అడిగాడట. కృతిని కూర్చమని-
బాణు వేగంబును, భవభూతి సుకుమార
తయు, మాఘు శైత్యంబు, దండిసమత,
యల మయూరుసువర్ణకలన, చోరునియర్థ
సంగ్రహమ్ము, మురారిశయ్యనేర్పు,
సోముప్రసాదంబు, సోమయాజుల నియ
మంబు, భాస్కరుని సన్మార్గ ఘటన,
శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి,
యమరేశ్వరుని సహస్రముఖదృష్టి,
నీక కల దటుగాన ననేక వదన
సదన సంచార ఖేదంబు సడలుపఱిచి
భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె
మూర్తి కవిచంద్ర విఖ్యాత కీర్తిసాంద్ర
(కావ్యాలంకార సంగ్రహం - 1-15)
ఇందులోని పదాలు- అర్థాలు
బాణ - బాణకవి - బాణము
భవభూతి - ఒక కవి, ఈశ్వరైశ్వర్యము
సుకుమారత- గోము, సుకుమారస్వామి
మాఘ - మాఘకవి, మాఘమాసము
మయూర- మయూరకవి, నెమలి
వర్ణము - అక్షరము, శుక్లపీతాదులు
చోరుడు - ఒకకవి, తస్కరుడు
అర్థము- అభిధేయము, ధనము
మురారి - ఒక కవి, విష్ణువు
శయ్య - శబ్దవిన్యాస విశేషము, పఱపు
మురారి శయ్య - అదిశేషుడు
సోముడు - నాచనసోముడు, చంద్రుడు
ప్రసాదము - ఓజస్సు మొదలైన గుణములలో ఒకటి,
ప్రసన్న భావము
సోమయాజి - తిక్కనసోమయాజికవి, దీక్షితుడు
నియమము - పదనియమము, వ్రతము
భాస్కరుడు - ఒకకవి, సూర్యుడు
సన్మార్గము - సజ్జన మార్గము, ఆకాశము
శ్రీనాథుడు - ఒక కవి, విష్ణువు
పదము - శబ్దము, చరణము
ధార - కవిత్వధార, జలధార
అమరేశ్వరుడు - ఒక కవి, ఇంద్రుడు
సహస్రముఖదృష్టి - అనేకవిధ దృగ్వ్యాప్తి,
వేయి కన్నులు కలిగి ఉండటం
దండి - ఒక కవి, దండమును ధరించిన యోగి
సమత - ఒక గుణము, సర్వసామ్యము
ఇందులో కవి పరంగా అన్యవిధంగా రెండు అర్థాలుగా చెప్పవచ్చు
కావున ఇది అనేకార్థక చిత్రంలోనికి వస్తుంది.