నాలుగు భాషల్లో ఒకే అక్షర పద్యాలు
సాహితీమిత్రులారా!
ఇక్కడ మనం తెలుగు, సంస్కృతం, హిందీ, కన్నడ
భాషల్లోని ఒకే అక్షర(వ్యంజన) పద్యాలను గమనిద్దాం-
మొదట తెలుగు భాషలోని ఒకేఅక్షర పద్యం -
అల్లంరాజు రంగశాయి కవిగారి చంపూ భారతం
పుట. 249 మొదటి పద్యం ఏకాక్షర కందపద్యం
చూడండి ఇది మ - అనే హల్లునుపుయోగించి
కూర్చబడినది. మ - అనే హల్లుకు ఏ స్వరమైనా
కూర్చవచ్చు అలాకూర్చినదే ఇది చూడండి-
మామా మీమో మౌమా
మామా! మిమ్మొమ్ము మామ మామా మేమా
మేమొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మౌ మౌమా!
మా = చంద్రుని యొక్క, మా = శోభ,
మోము + ఔ = ముఖముగా గల,
మామా- మా = మాయొక్క, మా = మేధ,
మిమ్ము = మిమ్ములను, ఒమ్ము =-అనుకూలించును,
మామమామా = మామకు మామవైన దేవా!,
ఆము = గర్వమును, ఏమి =- ఏమియు,
ఒమ్మము = అంగీకరించము, మీమై = మీ శరీరము,
మేము ఏమే = మేము మేమే, మమ్ము,
ఓ ముము + ఓముము = కాపాడుము, కాపాడుము,
ఇమ్ము = అనుకూలము, ఔము = ఔమా + అగుము - అగుమా
రెండవది సంస్కృత భాషలోని పద్యం-
పాదుకాసహస్రంలో వేదాంతదేశికులవారు చేసిన
ఈ ఏకాక్షరశ్లోకం చూడండి.
తతాతత్తా తితత్తేతా తాత తీతేతి తాతితుత్
తత్తత్తత్తాత తితతా తతేతాతేత తాతుతా
(పాదుకాసహస్రము - 935)
పదచ్ఛేదం - 1. తతాతత్తా 2. అతి తత్తేతా, 3. తాతతి, 4. ఇతేతితాతితుత్
5. తత్తత్తత్తాతతితతా, 6. ఆతతా, 7. తాతుతా 8. తాతతి
అర్థం -
తతాతత్తా తతా - తతా = విస్తృతమైన, అతత్తా = సంచరించే ధర్మం కలిగిన,
అతితత్తేతా - అతి = అతిక్రమించిన, తత్ + తా = పరబ్రహ్మ కలిగిన భావంతో,
ఇతా = కూడినట్టి, ఇతేతి తాతితుత్ - ఇత = పొందిన,
ఈతి తా = ఈతిబాధలుకల(వారి) భావాన్ని, అతి = మిక్కలి.
తుత్ = నశింపజేయునట్టి, తత్తత్తతా తతి తతా -
తత్ + తత్ = ఆయావస్తువుల యొక్క,
తత్ + తా = ఆయాధర్మం యొక్క, తతి = సముదాయంతో,
తతా = విస్తరింపబడిన, ఆ తతా = పలుదెసల వీణాది వాద్య నాదం కలిగినట్టి,
ఇతాతేతతాతుతా - ఇ = మన్మథుని యొక్క, తాత = తండ్రియైన విష్ణువుతో,
ఇత = కూడిన, తాతుతా = పాదుక, తాతతి = తండ్రిలాగా ఆచరిస్తుంది.
కన్నడ భాషలో 12వ శతాబ్దికి చెందిన నాగవర్మ "కావ్యావలోకనం"లోని
ఏకాక్షరి ఉదాహరణ.
ಶ್ಲೋ. ನಿನ್ನಿ ನೇನಿನ್ನ ನಾನನ್ನ |
ನಿನ್ನ ನೆನ್ನ ನನೂನನಂ||
ನುನ್ನ ನೈನನ್ನ ನೈನೇನೇ|
ನೆನಿನ್ನನ್ನಂ ನಿನ್ನೆ ನಾನುನಂ||
(ಕಾವ್ವಾವಲೋಕನಂ - 8 - 584)
పై కన్నడ శ్లోకానికి తెలుగులిపి
శ్లో. నిన్న నీనిన్న నానన్న
నిన్ననెన్న ననూననం
నున్న నైనన్న నైనేనే
నెన్నిన్నం నిన్నెనానునం
హిందీలో లేఖరాజకవి రచిత "గంగాభరణ్ "లోని ఏకాక్షరి.
गंगी गोगो गो गगे, गुंगी गो गो गुंग ।
गंगा गंगे गंग गा, गंगा गंगे गंग ।।
పై దోహేకు తెలుగులిపి
గంగీ గోగో గోగ గే, గుంగీ గోగో గుంగ
గంగా గంగే గంగ గా, గంగా గంగే గంగ