Sunday, October 4, 2020

యరలవ శషసహ - లతో పద్యం

యరలవ శషసహ - లతో పద్యం





సాహితీమిత్రులారా!

 చిత్రమంజరి పేరుతో శ్రీబోడి వాసుదేవరావుగారు

ఒక పుస్తకాన్ని కూర్చారు. ఇందులో
బంధ - గర్భ - చిత్ర కవిత్వాలున్నాయని
చెప్పుకున్నాడు ఇందులోని చిత్రకవిత్వ విభాగంలోనిదే
ఈ అంతస్థోష్మకందపద్యం
మనకు హల్లులలో
స్పర్శముల(క నుండి మ వరకు ఉన్న హల్లులు)ని,
అంతస్థముల(య,ర,ల,వ - అనే నాలుగక్షరాలు)ని,
ఊష్మముల(శ,ష,స,హ - అనే నాలుగక్షరాలు)ని
విభాగాలున్నాయి
ఇపుడు య,ర,ల,వ అనే అంతస్థములు
       శ,ష,స,హ అనే ఊష్మములు
       (జిహ్వామూలీయము(కకార ఖకారములకు
         ముందున్న విసర్గ),
        అనుస్వారములు కూడ ఊష్మములే)
ఈ అక్షరముల అంటే యరలవ శషసహ - ల తోటే 
కందపద్యం కూర్చబడినది కావున దీనికి
అంతస్థోష్మకందమని పేరు

వరహారవార! సువిహయ!
సరసరసా! శ్రీవిహార! సాహాయ! రరా!
సురహరి! సారసశరసా!
హరశర! సారవర! సారహరి! హరిశాయీ!

వరహారవార - శ్రేష్ఠమైన హార సమూహములు  గలవాడా
సువిహయ - (సు-వి-హయ) - చక్కని పక్షివాహనము
           (గరుడవాహనము) గలవాడా
సరసరసా - (స-రస-రసా) - అనురాగముతో కూడిన
                          భూదేవి గలవాడా
శ్రీవిహార - లక్ష్మీదేవియొక్క విహారము గలవాడా
సాహాయ (సా - హా - య) కాంతికిని, ఈవికిని నిలయమైనవాడా
ర రా - (ర - ర - అ) - మనోహరుడైన మన్మథునికి హేతువైనవాడా
సురహరి - అమరులునింద్రుడు గలవాడా
సారసశరసా(సారసశర - సా) మన్మథుని వంటి దేహకాంతి కలవాడా
హరశర - హరునికి బాణమైనవాడా
సారవర - (సార-వర) న్యాైయముచేత శ్రేష్ఠమైనవాడా
సారహరి - స్థిరాంశము గలిగిన విష్ణువా
హరిశాయీ - శేషుని(సర్పము)పై శయనించువాడా

1 comment:

Anonymous said...

Great selection, Sir. I appreciate the detailed way you have given the meaning. Greatly helping us to learn new words and the various meanings that some words have.

When you find time, can you please explain the detailed meaning of a great Annamacharya Sanskrit composition - hari rasama vihaaree, satu sarasOyam mama Srama samhaaree? Some words are difficult and different people are giving different meanings. I would like to know how to interpret and understand the composition correctly.

Thank you.
Regards