Saturday, February 29, 2020

కృష్ణగాథ లేక కృష్ణప్పాట్టు


కృష్ణగాథ లేక కృష్ణప్పాట్టు




సాహితీమిత్రులారా!

మలయాళంలో 15వశతాబ్దానికి చెందిన
చెరుస్సెరి నంబూదిరి మణిప్రవాళ శైలి
ప్రచారంలో ఉన్నప్పటికి ఒక ప్రత్యేక పంథాలో
కృష్ణగాథ(కృష్ణప్పాటు) కావ్యాన్ని రచించారు.

కృష్ణగాథ భాగవతాన్నుసరించి రచించిన కావ్యం.
ఇందులో వస్తువు, భాష, శైలి విషయాలలో,
కవి నవ్యమార్గాన్ని అనుసరించారు.
కవి మణిప్రవాళ శైలిలోకాని, కథావస్తువును బట్టి
సంస్కృత బాహుళ్యం గల శైలినిగాని అనుసరించక
వాడుక భాషను ప్రయోగించి తన కావ్యం జనసామాన్యులు
అలరారే విధంగా కూర్చాడు. సంస్కృతంలో
మహాపండితుడైన చెరుస్సెరి నంబూదిరి బ్రాహ్మణుడు
కావడం చేత, ఆర్య సంస్కృతి సంప్రదాయాల మధ్య
పెరిగినప్పటికి ముందుగా తాను మలయాళీననే విషయాన్ని
తన కావ్యంలో నిరూపించాడు. ఈ కావ్యాన్ని తన ప్రభువైన
కొలాత్తునాడు పాలకుడైన ఉదయవర్మ కోరికపై వ్రాసినట్లు చెప్పికొన్నాడు.

కృష్ణగాథ కృష్ణప్పాట్టు అనే పేర ప్పాట్టు సంప్రదాయానికి
చెందినప్పటికి విస్తృతమైన పరిధిలో కావ్యం వలె సాగిన రచన.
సులభశైలి, వ్యవహారిక పదబాహుళ్యం, లయాత్మకమైన
గేయమాధుర్యం ముఖ్యంగా కావ్యవస్తువులోని భక్తిప్రాచుర్యం
కృష్ణగాథను అత్యుత్తమ జనరంజక కావ్యంగా నిలిపాయి.
కేరళ పండితకవులలో బహుళ ప్రచారం పొందిన కవిగా,
చెరుస్సెరి నంబూదిరిని పేర్కొంటారు.


ఈ కవి మరో రచన భారతగాథ ఉదయవర్మ కాలంలోనే,
ఆ ప్రభువు ఆశ్రయంలోనే వెలువడింది. అయితే
రచనావిధానం, శైలి కొంత వాసితక్కువగా ఉండటంచేత
చెరుస్సెరి కృతంగా ప్రచారం చేసి ఉండవచ్చని
కావ్య పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Thursday, February 27, 2020

అగస్త్యుడు ఎవరు?


అగస్త్యుడు ఎవరు?




సాహితీమిత్రులారా!

ప్రాచీన తమిళ సాహిత్యంలో అగస్త్యుడు అనే పేరుతో
ఒకరికంటే ఎక్కువ మంది కనిపిస్తున్నారు.
అయితే వారిలో ఇద్దరుమాత్రం ముఖ్యులు.
ఒకటి మొదటి సంగం కాలంలోని అగస్త్యుడు కాగా
రెండవవాడు మధ్యసంగం కాలంలోనివాడు.

                   తమిళ వాఙ్మయ వికాసం పాండ్యరాజుల పోషణలో మూడు సంగాల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వాటిలో ేలైస్సంగం మొదటి సంగం క్రీస్తుకు పూర్వమే మధురలో ఇది ప్రారంభమైంది. దీనిలో అగత్తియవార్ (అగస్త్యుడు) తోబాటు 549 మంది కవులున్నారని వారిలో శివుడు, మురుగన్ కూడా సభ్యులేనని చెప్పే గాథలుప్రచారంలో ఉన్నాయి.
అగస్త్యుని రచనగా ప్రసిద్ధిపొందిన లక్షణగ్రంథం, అగత్తియంలో 12 వేల సూత్రాలు ఉండేవని ప్రతీతి. కానీ ఇప్పుడు కొన్ని మాత్రమే లభ్యమౌతున్నాయి. పరమశివుడు సంస్కృత వ్యాకరణాన్ని పాణినికి, తమిళ వ్యాకరణాన్ని అగస్త్యునికి ప్రసాదించాడనే ఐతిహ్యం ఉంది.
కాబట్టి వీరిరువురు సమకాలీనులని నమ్మాల్సి వస్తోంది. ఏది ఏమైనా తమిళ భాషకు వ్యాకరణాన్ని అందించినందుకు అగస్త్యుని తమిళ పితామహునిగా తమిళులు ప్రస్తుతిస్తారు. అంతే కాకుండా తమిళాన్ని అగస్త్యం అని కూడా చెబుతారు. పాణిని అనుసరించి అగస్త్యుడు వ్యాకరణం వ్రాశాడని కొందరి అభిప్రాయం.  దానివల్లనే అతని లక్షణ గ్రంథంలో కర్మణ్యర్థం, సప్తవిభక్తులు, తద్భవరూపంలో సంస్కృత శబ్దాలు మొదలైనవి చోటుచేసుకున్నాయని పండితుల అభిప్రాయం.

         మధ్యసంగం కపాడపురంలో వెలసింది. అందులో 59 మంది కవులుండేవారని వారిలో అగస్త్యుడు, తొల్కాప్పియవార్ మొదలైనవారు ప్రసిద్ధులని తెలుస్తున్నది.అగస్త్యుని 12 మంది శిష్యులలో తొల్కాప్పియవార్ ఒకరు.సంస్కృత లాక్షిణికుడు, కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుని(1294-1325) ఆస్థానకవి అయిన విద్యానాథుని అసలుపేరు అగస్త్య పండితుడని కొందరి అభిప్రాయం. అయితే దీనికి సరైత ఆధారాలు లేవు. కాబట్టి వీరు ఇద్దరు ఒక్కరే అని భావించనవసరం లేదు.

Tuesday, February 25, 2020

తలకట్లు గల సర్వలఘు నిరోష్ఠ్య గీతము


తలకట్లు గల సర్వలఘు నిరోష్ఠ్య గీతము





సాహితీమిత్రులారా!

నంబెరుమాళ్ళ పురుషకారి కేశవయ్య గారి
నిరోష్ఠ్య ఉత్తర రామాయణము
దాశరథి చరిత్రలో నాలుగవ ఆశ్వాసంలో
ఖ, ఙ, ఞ, ట ణ అనే అక్షరాలు లేకుండా
అన్నీ తలకట్లు గల అక్షరాలతో అన్నీ లఘువులతో
సర్వలఘులు కలిగి పెదిమలతో పలుకకుండా కూర్చబడినది
ఈ గీతపద్యం  గమనించండి -

దయఁగనర ఘనదశరథతనయ! సనయ!
గగనచరరథ! దశశతకరశశధర
నయన! సతతసరస! నతనగచరచయ!
తతదరహరద! దశగళదళన సదయ!
                                                                (దాశరథి చరిత్ర - 4 - 15)

ఇందులో పై చెప్పిన ఖ, ఙ, ఞ, ట, ణ లను వాడలేదు
అన్నీ తలకట్లే ఉన్నాయి.
అన్నీ లఘువులే ఉన్నాయి.
ఇవేవీ పెదవితో పలుకబడవు గమనించండి.

Sunday, February 23, 2020

సంభాషణలో చ్యుతచిత్రం


సంభాషణలో చ్యుతచిత్రం



సాహితీమిత్రులారా!

సరసంగా మాట్లాడుకొనే స్త్రీపురుషుల సంభాషణలో
అనేక చిత్రాలుంటాయి. ఇక్కడ మనం చ్యుతచిత్రం
చూద్దాం-
ఒక దగ్గర ఒక స్త్రీ ఒక పురుషుడు
ఇలా మాట్లాడుకొంటున్నారు.

పురుషుడు-     మాయాధుర్య చతురులేదురుగదే!
            స్త్రీ -       ఔర! యా మాట మేలగునటోయి? 
పురుషుడు-     జవరాండ్రు కుటిల ప్రచారుల్ గదే !
              స్త్రీ-    ఔర నడిమిటి మాట మానవుగదోయి! 
పురుషుడు-     జవ్వనుల్ శోక భాజనులు గదే! 
            స్త్రీ -     ఔర ! కాదొలగించి పల్క మేల్గాదటోయి?
పురుషుడు-     నన్ను నీవాని పల్కుట న్యాయమటనే?
           స్త్రీ -     మేలు వాగదచేసి నన్నేలు సామి !

పురుషుడు-     మాయాధుర్య చతురులేదురుగదే!
                         స్త్రీలు మాయచేయటంలో నిపుణులు (మాయాధుర్యలు)          
           స్త్రీ        ఔర! యా మాట మేలగునటోయి? 
                       మాయాధుర్యలో 'యా' తీసివేయమని అర్థం
                       (మాధుర్య చతురులేదురుగదే!)
   
పురుషుడు-     జవరాండ్రు కుటిల ప్రచారుల్ గదే !
                          స్త్రీలు కుటిలప్రచారులు            
                స్త్రీ-    ఔర నడిమిటి మాట మానవుగదోయి! 
                  
అపుడు మాధుర్యచతురులౌతారుగదా అదీసంగతి! అతడు న్నాడు.
(మోసం చేసటం తెలిసినవారని)
ఆమె 'టి' తీసేయమన్నది.
అప్పుడు కులప్రచారులౌతారు.
అంటే వంశోధ్ధారకులను ప్రసాదించేవారౌతారన్నమాట.(వంశంనిలబెట్టేవారు)
అతడు స్త్రీలు శోకభాజనలు అన్నాడు. అంటే దుఃఖకారకులు అని.
ఆమె 'క' తీసివేయమన్నది. అప్పుడు శోభాకారకులౌతారనియర్ధం.
"గృహిణీ గృహముచ్యతే" ఆడదిలేకపోతే ఆయింటికి అందమేలేదు. శోభాజనకలని భావం. అతడునన్ను నీవాడిని, యిలా అన్నిటికి
వ్యతిరేకంగా మాటలాడుట తగునా అన్నాడు.
ఆ 'వా' తీసేయవయ్యా! అక్కడ 'దా' చేర్చమన్నది ఆమె.
అంటే నన్ను నీదానినిగా చేసి యేలుకోవయ్యా స్వామీ! అని చెపుతోంది.

(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో )

Friday, February 21, 2020

శివస్తుతి


శివస్తుతి




సాహితీమిత్రులారా!
Image result for siva images
కూచిమంచి తిమ్మకవి కృత
రసికజనమనోభిరామము
షష్ఠాశ్వాసం నందు
శివస్తుతి ని ఇక్కడ చూద్దాం-
ఇది అంత్యప్రాసతో కూర్చబడినది
గమనించండి-

రవిశశిశిఖినేత్ర భువనరక్షణమాత్ర
                     పాలితమునిపుత్త్ర ప్రథనజైత్ర
విజితశాత్రవగోత్ర కుజనద్రుకరపత్ర
                    భవలతోగ్రలవిత్ర ధవళగాత్ర
దివిజోపవనచైత్ర కవిజనస్తుతిపాత్ర
                    ఘనతరవృషపత్ర ధనదమిత్ర
నిలయితసితగోత్ర నిభృతచక్షుశ్శ్రోత్ర
                    పరిమపవిత్ర బంధురచరిత్ర
పంకరుహపత్ర లోచనకంకపత్ర
వ్యాజసంసారసాగరయానపాత్ర
వృజినసంగాతకాననవీతిహోత్ర
నిను బొగడ నేర్తుమే భవానీకళత్ర
                                 (రసికజనమనోభిరామము - 6 - 177)


Thursday, February 20, 2020

ఈ పద్యానికి 30 అర్థాలున్నాయ్


ఈ పద్యానికి 30 అర్థాలున్నాయ్ 



సాహితీమిత్రులారా!
పోకూరి కాశీపత్యవధానిగారు
ఒక ఆటవెలదిని కూర్చారు
దానికి 30 అర్థాలున్నాయి
దాన్ని త్రింశదర్థపద్యంగా పేరు పెట్టారు వారు.
ఆ పద్యం-
   భూరి జఠర గురుడు నీరజాంబిక భూతి
   మహితకరుడ హీనమణికలాపు
   డలఘు సద్గణేశు డగ్రగోపుడు మహా
   మర్త్య సింహుడేలు మనల నెపుడు

   దీనిలోని 30 అర్థాలు-
   1. గణపతి, 2. శివ, 3.బ్రహ్మ, 4. విష్ణు, 5. ఇంద్ర,
   6. అగ్ని, 7. యమ, 8. నిరృతి, 9. వరుణ, 10. వాయు
   11. కుబేర, 12. అష్టదిక్పాలక, 13. నవగ్రహ, 14. సూర్య,
   15. చంద్ర, 16. సముద్ర, 17. మేఘ, 18. హిమన్నగేశ్వర,
   19. ఆదిశేష, 20. గరుడ, 21. గజేంద్ర, 22. ఆంజనేయ,
   23. నందీశ్వర, 24. వీరభద్ర, 25. కుమారస్వామి,
   26. మన్మథ, 27. నారద, 28, దత్తాత్రేయ,
   29. విశ్వకర్మ, 30. వీరబ్రహ్మ- లను గూర్చిన వర్ణన
   ఈ పద్యంలో కూర్చారు.

Tuesday, February 18, 2020

చమత్కార పద్యం


చమత్కార పద్యం




సాహితీమిత్రులారా!

భాస్కరరామాయణాన్ని రచించిన
నలుగురు కవులలో ప్రధానమైనవాడు
హుళక్కి భాస్కరుడు. భాస్కరరామాయణాన్ని
కృతిగా అందుకున్నవాడు
సాహిణిమారు(డు)న.
ఈయనను గురించి హుళక్కి భాస్కరుడు చెప్పిన
చమత్కార పద్యం చూడండి-


అప్పులిడు నతడు ఘనుడా?
అప్పు డొసగి మరల పొందు నాతడు రాజా
చెప్పగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు, రాజు నటంచున్


అప్పు ఇచ్చేవాడు గొప్పవాడా -
అని సామాన్యంగా అర్థమౌతుంది.
అప్పులు ఇచ్చేవాడు తీర్చేవాడు కాదు ఇక్కడ.

అప్ అంటే సంస్కృతంలో నీరు -
దాన్ని తెలుగు పదంగా మార్చటం వల్ల
అప్పుగా మారింది.
ఇక్కడ అప్పులిచ్చేవాడు
ఘనుడా అంటే మేఘము

అప్పుడొసగి మరల పొందు నాతడు రాజా -
దీనిలో
రాజు అంటే భూమిని పాలించేవాడు, చంద్రుడు

ఇక భావంలోకి వస్తే

నీటిని ఇచ్చే మేఘునికంటె,
తన కళలను ఇచ్చి తిరిగి
స్వీకరించే చంద్రునికంటె
దానంలో సాహిణి మారప్పే
గొప్పవాడు - అని భావం.

Friday, February 14, 2020

అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్


అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ 

మనుమండ నయ్యెదన్



సాహితీమిత్రులారా!

"అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్"-
అనే సమస్యను అక్రమ సంబంధంకాకుండా సక్రమ సంబంధం వచ్చేవిధంగా
చెప్పమని
అవధానంలో ఒక పృచ్ఛకుడు
మిన్నెకంటి గురునాథశర్మగారిని అడిగాడట.
దానికి వారి పద్యం చూడండి.-

ఎల్ల సురల్  వినంగ హరి యిట్లనె భూ సుత సీత బొందితిన్
నీళ్ళను మున్గనట్టి ధరణీ సతిఁగౌగిట గ్రుచ్చి యెత్తితిన్
తల్లికి తల్లియౌ సతి నెదన్ ధరియించితిగాన భూమికిన్
అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్

అని పూరించాడు.

(దేవతలందరూ వినగా విష్ణువు ఇలా అన్నాడు -
భూపుత్రిక సీతను పెండ్లాడాను(రామావతారంలో)
భూమిని పెళ్ళాడాను (వరాహావతారంలో)
లక్ష్మిని పెళ్ళాడాను (సముద్ర మథనానంతరం) -
ఇక్కడ విష్ణుపాదంలో గంగ పుట్టింది.
విష్ణువు భార్య భూదేవి.కనుక గంగ భూమికి కూతురువరుస.
గంగ సముద్రుని భార్య. నదులన్నీ సముద్రుని భార్య కదా!
సముద్రంలో పుట్టింది లక్ష్మి కావున లక్ష్మి గంగ కూతురి వరుస.
భూమికి మనుమరాలి వరుస.
కూతురును తల్లీ అని పిలువడం ఉంది.
కనుక ఈ వరుసల ప్రకారం భూమికి, భూమిసుతకు, గంగాసుతలక్ష్మికి -
మూడు తరాల వారికి విష్ణవు భర్త కనుక
భూమికి అల్లుడు, మగడు, మనుమడు వరుసలు సరిపోయాయి.
ఇవన్నీ ధర్మబద్ధమైన బంధాలే.)

Wednesday, February 12, 2020

అటజని కాంచె ........... (అనుకరణ)


అటజని కాంచె ........... (అనుకరణ)





సాహితీమిత్రులారా!

అటజని కాంచె భూమిసురుడంబర------
అనే పద్యం వినగానే
మనకు అల్లసాని పెద్దన గుర్తుకురాడం సహజం
కానీ ఈ పద్యం అనుకరణా అన్నట్లు కనిపిస్తున్నదీ పద్యం
ఇది చిత్రాంగదా పరిణయము - గోపాలుని రామకవి కృతము
దీనిలో అర్జనుడు చిత్రాంగదను వివాహం చేసుకోవడం ఇతివృత్తం.
ఇది పూర్తిగా లభ్యంకాలేదని సమాచారం.

అటఁజని  కాంచె పాండుసుతుఁడభ్రతటీవరతానమాన వి
స్ఫుట కలషడ్జ గాన భవభూరి భయార్తి విలీన గూఢపా
త్పటల జుఘృక్ష కేశి కల ధర్షణ హేతు తరంగ రంగదా
ర్భటపటు నిర్ఝరీవిశద భవ్య విశాలము శీతశైలమున్
                                                                           (1918 ఆంధ్రపత్రికనుండి)
దీన్ని గమనిస్తే ఎవరు ఎవరిని అనుసరించారో వారికే తెలియాలి

Monday, February 10, 2020

చ్యుతచిత్రం - దాని రకాలు


చ్యుతచిత్రం - దాని రకాలు



సాహితీమిత్రులారా!

చ్యుతము అంటే తొలగించుట
అది అక్షరమైతే అక్షరచ్యుతకం
అది బిందువు అంటే సున్న అయితే బిందుచ్యుతకం
అది మాత్ర అయితే మాత్రాచ్యుతకం
అది స్థానం అయితే స్థానచ్యుతకం
వీటిలో రెంటిని ఇక్కడ చూద్దాం-

బిందువును చ్యుతము(తొలగించుట) చేస్తే
దాన్ని బిందు చ్యుతము అంటారు
దీని ఉదాహరణగా
విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరం
పూర్వభాగంలోని ఈ పద్యం గమనిద్దాం-

బహువిధాంధః కృతోల్లాసభరుఁడవీవు
సంగత శ్రీవి నీవు యో సరసిజాక్ష
అహితులకు సంజ్యర ప్రతియాతనుడవు
అన్నిటనుఁజేయు మరులకు సున్నచ్యుతుల

ఈ పద్యం మొత్తంలో గమనిస్తే మూడు పదాల్లోనే
సున్న(బిందువు)వుంది.
 ఆ పదాలు 1. అంధః 2. సంగత, 3. సంజ్వర
1. అంధః
అంధః - చక్కెర పొంగలు మొదలైన వంటకాలచేత
కృత - చేయబడిన, సంజ్వర - వేడిమిచే,
ప్రయాతనుడవు - సాటిగాగలవాడవు, అరులకు - పగవారికి, అన్నిటను
సున్న - లేమిని, చ్యుతులను - పడుటను సున్నచేయుము.
సున్నలు తీసువేసిన అర్థం-
పగవారికి పలురీతుల
అధఃకృత - నిరాకరింపబడిన, ఉల్లాసభరుడు.

2. సంగతలో బిందువు పోయిన
   సగత అవుతుంది.
సగత శ్రీ - పోకతో కూడిన, శ్రీ - సంపదలు గలవాడు

3. సంజ్వర లో బిందువు పోతే - సజ్వర
సజ్వర ప్రతియాతనుడు - జ్వరముతోను, సర్వవిధములైన
తీవ్రబాధతోను కూడిన వాడు.

పదాలు ఉండవలసిన స్థానాలలో ఉండక పోవడం
స్థానచ్యుతకము అనబడుతుంది. ఈ ఉదాహరణ
చూడండి-

చాటుధారా చమత్కారసారఃలోనిది ఈ శ్లోకం-

కాశీనః పాతు మాం పత్రం పర్యంక స్తత్కులా దభూత్
మాతా పుత్రీ సపత్నీ చ మేనా యస్య దివోభువః

కాశీనుడు నన్ను రక్షించుగాక
ఆ కులము నుండి పత్రము పర్యంకము పుట్టెను
ఈ విధంగా సరైనవికాని అర్థాలు వస్తున్నాయి
దీనిలో పదములు సరైన వరుసక్రమంలో లేవు
వాటిని సరైన విధంగా దండాన్యయంలో
తీసుకున్న వాటి అర్థం సరైనదిగా వస్తుంది.

1. యస్య పర్యంకః కాశీనః
(ఏ దేవుని యొక్కపడక ఆదిశేషుడో)
2. యస్య పత్రం తత్ - కులాత్
(ఏ దేవుని వాహనము గరుడ పక్షియో)
3. యస్య పత్నీ మా 
(ఏ దేవుని పత్ని లక్ష్మీదేవియో)
4. యః ఇవా పుత్రీ 
(ఏ దేవుడు మన్మథునితో సంతానవంతు డయ్యెనో)
5. యః భువః దివః మాతా ఆభూత్
(ఏ వేలుపు భూమికి, స్వర్గానికి ప్రమాణకర్తగా ఆయెనో)
6. సః మాం పాతు 
(అట్టి విష్ణుదేవుడు నన్ను రక్షించుగాక)

ఈ విధంగా పదాలు సరియైన విధంగా మార్చుకుంటే
సరైన అర్థం వస్తుంది అందుకే దీన్ని స్థాన చ్యుతకచిత్రం
అంటారు.

Saturday, February 8, 2020

పోకూరి కాశీపతి గారి శబ్దచిత్రం


పోకూరి కాశీపతి గారి శబ్దచిత్రం



సాహితీమిత్రులారా!
Image result for pokuri kasipathi photo
పోకూరి కాశీపతిగారి సారంగధరీయం అనే
త్య్రర్థి కావ్యంలోని శబ్దచిత్రం ఇందులో
పద్యం అంతా ఒకే ఒక స్వరం ఉపయోగించి
కూర్చిన పద్యం ఇది. ఇది ఏ - అనే ఒక స్వరంతో కూడిన పద్యం
కావున దీన్ని ఏత్వపద్యం అని అంటారు.
ఈ  ఏత్వకందంలో  ఎ,ఏ - స్వరములు ఉన్నాయి గమనించండి-
దీన్ని  ఏకస్వరచిత్రం అనీ అంటారు

కే లేదే తే తేవే
వే లేవే మెట్లె దేబెవే యేల్చేడె
న్నే లేనే వేరే యె
గ్గే లేనే లేదే యేడ్చెదేలే మేలే
                                        (సారంగధరీయము - 3-43)

కేలు = హస్తము, ఏదే = ఎచ్చటనే, తే తేవే = తెమ్ము తెమ్ము,
వే = శీఘ్రముగా, లేవేమెట్లె = లేవవేమి ఎట్లనే,
దేబెవే = దీనురాలవా, ఏల్చేడెన్ = రక్షించువనితను,
నేలేనే = నేనుండలేదా, వే = వేరుగా,
ఎగ్గేలేనేలేదె = కీడు లేక దోషం లేనేలేదె,
ఏడ్చెదేలే = ఏడ్చెదవెందులకు,
మేమే = శుభమా?

Thursday, February 6, 2020

అనులోమప్రతిలోమ చిత్రం


అనులోమప్రతిలోమ చిత్రం




సాహితీమిత్రులారా!


ఒకశ్లోకం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివితే ఒక అర్థం వస్తుంది.
ఆ శ్లోకాన్నే చివర నుండి మొదటికి చదివిన మరో శ్లోకం వచ్చి మరోఅర్థం వస్తుంది.
దీన్నే అనులోమ ప్రతిలోమ శ్లోకం అంటారు.  ఇది గతిచిత్రంలో ఒక భాగం.


నసమాశనవాగారం నమేమత్వామజేయతం
తరసారమ్యనవ్యాభమరామాదయమా విభో
                                          (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం - 34)

(ఆశలు కోరికలు లేని నిష్కాముల యొక్క యజ్ఞాలు
నిలయంగా కలవాడవు, జయింప వీలుకానివాడవు,
నిత్యనూతన తేజస్సుకలవాడవు, శీఘ్రంగా ఫలాలను
ఇచ్చేదయగలవాడవు. అయిన
లక్ష్మీ వల్లభా! రంగనాధా! నమస్కారం)

ఇదే శ్లోకాన్ని చివరినుండి మొదటికి రాయగా


భోవిమాయదమారామ భర్యా నమ్య రసారత
తం యజేమత్వామమేన రంగావాన శమాసన
                                   

(మాయా రహితులైన ఇంద్రియ మనోనిగ్రహాల
చేత క్రీడించు పుణ్యాత్ముల చేత నమస్కరింప
దగిన శ్రీరంగపుణ్యభూమి యందు
ఆసక్తి కలవాడా! ఆనందంగా ఉండేవాడా!
శ్రీరంగనిలయుడవాన నిన్ను
సన్నిధిలో సేవిస్తాను.)

లక్ష్మిసహస్రకావ్యంలోని ఈ
పద్యం చూడండి.
ఇది విద్యున్మాలికా వృత్తంలో
కూర్చబడింది.

అనులోమ పద్యం -
సామాధామాసారాభీమా
కామారామాకామాభూమా
రామాధామారారాభామా
భామాకామాభామాభూమా

భావం -
సామవేదానికి పూర్ణ నివాసులగు పండితులకు నివాసమైనదానా
శ్రేష్ఠురాలా భయముగొలుపనిదానా కేవలము ఇహలోకమునందలి
కోరికలుగల వారియందు అనురాగం లేనిదానా భూదేవిరూపం
నొందిన లక్ష్మీ స్త్రీల యొక్క తేజస్సునకు స్థానమైనదానా
సత్యభామ అనే పేరుగలదానా రమ్ము రమ్ము స్త్రీలయొక్క
కోర్కెలయందు ఉండుదానా కాంతి సంపదయొక్క ఆధిక్యమునకు
స్థానమైనదానా రమ్ము రమ్ము


ప్రతిలోమ పద్యం -
పై పద్యాన్ని క్రిందినుండి పైకి వ్రాసిన వచ్చు పద్యం

మాభూమాభామాకామాభా
మాభారారామాధామారా
మాభూమాకామారామాకా
మాభీరాసామాధామాసా

భావం -
భూమియొక్కయు, పార్వతిఅను స్త్రీ యొక్కయు, కోర్కెలయొక్క
విశేష ప్రకాశముగలదానా, (భూదేవి, పార్వతి లక్ష్మివలన సకల
సంపదలు పొందుతారని తెలుపుట), మాకు కష్టములైన
పనులందు ధైర్యము నిచ్చుదానా, రమ్ము మాతేజస్వరూపమైన
దానా రమ్ము, మాసంపదకు స్థానమైనదానా, మన్మథునియందు
పూరణమైన సంతోషంకలదానా విష్ణుపత్నీ, భయముగలవారికి
సుహృద్బలమైనదానా లక్ష్మీ ప్రదముకాని చోట తేజస్సు
ఉండనిదానా  రమ్ము రమ్ము

అనులోమ శ్లోకం-
రామ రామ మహాబాహో మాయా తే సుదురాసదా
వాదసాదద కబ లోకే పాదావేవ తవాసజేత్
                                                                        (యమక భారతం - 71)
భావం -
ఓ రామా! నీవు ఆజానుబాహునివి. ఈ జగత్తులో కేవలం
బ్రహ్మపాదమే సరిపోలుతుంది నీ పాదంతో. నీ మాయను
అనుసరించటం చాల కష్టం. నీవు జ్ఞానప్రదాతవు.

ప్రతిలోమ శ్లోకం -
జేత్సవాతవ వేదాపాకేలోకోదద సాదవా
దాసరాదుసుతేయామాహేబాహా మమ రామ రా(రాః)
                                                                                       (యమక భారతం - 72)

(ముందు చెప్పబడిన  అనులోమ శ్లోకాన్ని క్రిందినుండి
చదివిన ఈ ప్రతిలోమ శ్లోకం వస్తుంది గమనించండి.)

భావం -
ఓరామ! నీవు గాలితో సహా ఈ విశ్వానికి బోధకుడవు.
నీవు జ్ఞానప్రదాతవు మరియు ప్రపంచానికి క్రియవు.
నీవు నీ భక్తులలో భయాన్ని పోగొట్టి సంతోషాన్ని
చ్చేవాడివి. నీవు ఈశ్వరుని, స్కందుని, గణపతిని,
లక్ష్మిని నీ అధీనములో ఉంచుకొన్నవాడివి. నీవు
నరసింహ స్వామిగా రుద్రుని ఉవాహన చేసినవాడివి.
నీవే నా సంపద.

చూశారుకదా !
అనులోమ ప్రతిలోమ శ్లోకం
ఎంత గమ్మత్తుగా ఉందో

Tuesday, February 4, 2020

ఒకే శ్లోకంలో శివకేశవుల స్తుతి


ఒకే శ్లోకంలో శివకేశవుల స్తుతి




సాహితీమిత్రులారా!
Image result for sivakesava images
ఒకే పద్యంలో శివుని కేశవుని స్తుతించిన పద్యం
ఇందులో మొదటగా శివస్తుతి తరువాత కేశవస్తుతి
గమనించండి

గవీశపత్రో నగజార్తిహారీ
కుమారతాత: శశిఖండమౌళి:
లంకేశసంపూజితపాదపద్మ:
పాయా దపాయాత్ పరమేశ్వరో వ:

గవీశపత్ర: = నందీకేశ్వరుడు వాహనముగా గలవాడు,
నగజార్తిహారీ = పార్వతీదేవి సంతాపమును  తొలగించినవాడు,
కుమారతాత: = కుమారస్వామి తండ్రి,
శశిఖండమౌళి: = చంద్రమౌళి,
లంకేశ సంపూజిత పాదపద్మ:
= రావణాసురునిచే పూజింపబడిన
పాదపద్మలు
పరమేశ్వర: - శివుడు,
వ: - మిమ్ములను,
అపాయాత్ - ఆపత్తునుండి,
పాయాత్ - రక్షించుగాక.

ఈ శ్లోకంలోని విశేషణ విశేష్యపదాలలో మొదటి అక్షరాన్ని
చ్యుతం(తొలగిం)చేస్తే ఇందాక చూచిన శివపరమైన అర్థం తొలగి
విష్ణుపరమైన అర్థం వస్తుంది.

గవీశపత్ర: లో గ- తొలగిస్తే వీశపత్ర: =(వి - ఈశ:) గరుడవాహనుడు,
నగజార్తిహారీ లో న తొలగిస్తే గజార్తిహారీ = గజేంద్రుని బాధను తొలగించినవాడు,
కుమారతాత: లో కు తొలగించిన మారతాత: = మన్మథుని తండ్రి,
శశిఖండమౌళి: లో శ - తొలగిస్తే శిఖండమౌళి: = నెమలి పురి శిరోభూషణముగా గలవాడు, లంకేశసంపూజితపాదపద్మ: (క: - ఈశ:)=బ్రహ్మరుద్రులచే
 పూజింపబడిన చరణ సరోజములు గలవాడు,
పరమేశ: - లో ప - తొలగించిన రమేశ: = రమాపతి అయిన విష్ణువు,
 వ:  అపాయాత్ పాయాత్ = మిమ్ములను అపాయమునుండి పాలించుగాత!
 అని అర్థం వస్తుంది.

Sunday, February 2, 2020

ఆకాశమే నడుము గిరులే స్తనములు


ఆకాశమే  నడుము   గిరులే స్తనములు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
ఇందులో అన్నీ పుణ్యక్షేత్రాలున్నట్లున్నను
అందులో నాయికా వర్ణనకూడ ఉన్నది.

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం వస్త్రం విధాతు: పదం
ధమ్మిల్లస్సుమన: పదం ప్రవిలసత్కాంచీ నితమ్బ స్థలీ
వాణీ చేన్మధురా ధరో2రుణ ధర: శ్రీరంగ భూమిర్వపు
స్తస్యా: కిం కథ యామి భూరి సుకృతం మాన్యాసదా నిర్జరై:

ఈ శ్లోకం ఒక నాయికను వర్ణించే శ్లోకం.
ఇందులో శ్లేషను ఆధారంగా తీసుకొని
శరీరఅవయవాలను పుణ్యక్షేత్ర
సంబంధమైనవిగా ఒక అర్థం,
శృంగార పరంగా మరొక అర్థం కనబడుతుంది.

పుణ్యక్షేత్ర సంబంధమైన అర్థం-
మధ్యం - నడుము, మిష్ణుపది - వైకుంఠము, కుచౌ - స్తనములు,
శివపదం - కైలాసం, వక్త్రం - ముఖం, విధాతు: పదం - బ్రహ్మలోకం,
ధమ్మిల్ల: - కొప్పు, సుమన: పదం - దేవతల లోకం,
నితంబస్థలీ - మొలప్రదేశం,
ప్రవిల సత్కాంచీ - ప్రకాశించే కాంచీ పట్టణం, వాణీ - నోరు,
మధురా - మధురా పట్టణం, అధర: - క్రింది పెదవి,
అరుణధర: - అరుణాచల క్షేత్రం, వపు: - శరీరం,
శ్రీరంగభూమి: - శ్రీరంగక్షేత్రం, తస్యా: - ఆమె యొక్క,
భూరి సుకృతం - పుణ్యాన్ని, కిం కథ యామి? - ఏమి చెప్పుదును,
నిర్జరై: - దేవతల చేత, సదా - ఎల్లపుడు, మాన్యా - పూజింప తగినది.


వీటికే శృంగార సంబంధమైన అర్థం -
విష్ణు పదం - ఆకాశం(నడుము శూన్యము) , శివపదం - కైలాస పర్వతము
(స్తనాలు పర్వాలవంటివి), ముఖము బ్రహ్మ జన్మస్థానమైన పద్మమువంటిది,
సుమన: పదం - పూవులకు స్థానం (కొప్పు  పుష్పాలు ధరించినది),
నితంబస్థలీ - నడుముభాగము కాంచి(ఒడ్డాణం)తో ప్రకాశిస్తున్నది.
వాణీ మధురా - వాక్కు తీయగా ఉంటుంది,
అధర: అరుణధర: - పెదవి ఎరుపురంగు కలిగినది,
శరీరము, శ్రీరంగభూమి: - లక్ష్మీదేవికి నాట్యవేదిక,
నగలతో ఆమె శరీరం సంపదకు నెలవుగా ఉన్నది. - అని భావం.