Monday, December 9, 2019

నన్నెచోడుని క్రౌంచపదము


నన్నెచోడుని క్రౌంచపదము

సాహితీమిత్రులారా!

పరిచయము
తెలుగు కవులు ఎంత గొప్పవారైనా వారి జీవిత విశేషాలని దురదృష్టవశాత్తు వారు ఎక్కడా వ్రాయలేదు, వారి కావ్యాల్లో మనకు ఎక్కువ ఆధారాలను వదలలేదు. ఉన్న ఆధారాలతో వారి కాలాన్ని నిర్ణయించడం కష్టతరమైన కార్యం, కానీ కొన్ని పద్ధతులతో చేయడానికి వీలవుతుంది. అందులో కొన్ని: 1. సామాన్యంగా రాజులు కవులను పోషించేవారు, ఆ రాజులకు కవులు తమ కావ్యాలను అంకితం చేసేవారు. ఆ ప్రభువుల రాజ్యపాలనా కాలము కవుల కాలాన్ని కూడా తెలుపుతుంది. 2. కవులు తమకు ముందున్న కవులను, తమ సమకాలీన కవులను పొగడి పద్యాలను రాసేవారు. కవుల కాలం అట్లు పొగడబడిన కవులకు పిదప కాలం అని మనం అనుకోవచ్చు. 3. కవుల పేరులు, వారి కుటుంబపు వారి పేరులు లేక వారిని పోషించిన రాజుల పేరులు ఉండే కొన్ని శిలాశాసనాలతో కొందరు కవుల కాలాన్ని నిర్ణయించవచ్చు. 4. కవుల గ్రంథాల శైలి, వారి వ్యాకరణము, ఛందస్సు, వారు ఉపయోగించిన పలుకుబడులు ఇత్యాదులు.

నన్నెచోడుడు తన గురించి చెప్పుకొన్నదల్లా తన తండ్రి చోడబల్లి అని, తల్లి శ్రీదేవి అని, గురువు మల్లికార్జునుడని. తానేమో టెంకణాదిత్యుడన్నాడు. టెంకణము అంటే దక్షిణదేశం. పూర్వకవి స్తుతిలో వాల్మీకిని, వ్యాసుని, కాళిదాసును, భారవిని, ఉద్భటుని, బాణుని పేర్కొన్నాడు. తెలుగు కవులను మరెవ్వరిని పేర్కొనలేదు, నన్నెచోడుని కూడ మరెవ్వరు పేర్కొన్నట్లు ఆధారాలు లేవు. ఇక మనకు మిగిలిందల్లా శిలాశాసనాలు, కుమారసంభవ కావ్యం మాత్రమే. కేవలం వీటి ఆధారంగా నన్నెచోడుని కాలనిర్ణయం ఎలా చేయగలమో వివరించడమే ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం. నన్నెచోడుడు ఉపయోగించిన విశేష వృత్త ఛందస్సులనూ, ముఖ్యంగా క్రౌంచపదమనే వృత్తాన్ని గురించి వివరించి, ఈ వృత్త లక్షణాల ఆధారంగా ఇతడు తెలుగులో మొదటి ఛందోగ్రంథాన్ని రాసిన కవిజనాశ్రయకర్తకన్నా పూర్వుడనే నా అభిప్రాయాన్ని విశదీకరిస్తాను.

శాసనప్రమాణాలు
మానవల్లి రామకృష్ణకవి ఈ కవి నన్నయకంటె పూర్వీకుడని నిర్ణయించిన దానికి ఆధారాలు[1]: కుడుంబలూరు శాసనం (క్రీ.శ. 900-950) ప్రకారం విక్రమకేసరి అనే ఒక రాజు మల్లికార్జునుడనే ఒక మతాచార్యునికి ఒక మఠాన్ని దానం చేశాడు. బీచుపల్లి అనే మరో శాసనంలో (క్రీ.శ. 902) చోడబల్లి అనే రాజు కృష్ణానది ఒడ్డులో ఉండే ఒక గుడికి భూదానం చేశాడు. ఇక మూడో శాసనంలో నన్నెచోడుడనే రాజు పశ్చిమ చాళుక్యులతో చేసిన యుద్ధంలో క్రీ.శ. 940లో చనిపోయాడు. తండ్రి పేరు, గురువు పేరు, నన్నెచోడుని పేరు ఈ మూడూ మూడు శాసనాలలో ఉన్నాయి, కాబట్టి ఇతడు నన్నయకు ముందటి వాడని కవి తీర్మానం.

ఇంతవరకు, నన్నెచోడుడు ఎప్పటివాడో అన్నది కేవలం శిలాశాసనాలపై ఆధారపడిందే. చోడుడు నన్నయ తిక్కనలకు మధ్య కాలం వాడన్న దానికి ఆధారాలు[1]: పెదచెరకూరు శాసనం అని ఒకటి ఉంది. ఇది కాకతీయ రాజు గణపతిదేవునికోసం మల్లిదేవుడనే చోళరాజు చేసిన దానాన్ని గురించినది. దీని కాలం క్రీ.శ. 1250 సంవత్సరం. ఇందులో ఏ సందేహమూ లేదు. మల్లిదేవుని వంశంలోని పూర్వుల జాబితా ఇలాగుండి ఉంటుందని ఊహ: మల్లిదేవుడు (1250) – నన్నెచోడుడు – మల్లిదేవుడు – ఘటంకారుడు – సురభూపతి, రాజరాజ మహీపతి – నన్నెచోడుడు – చోడబల్లి – కరికాలచోడుడు . ఇక పోతే ఒక తరానికి మరో తరానికి మధ్య ఎన్నేళ్లు తీసికోవాలో అనే దానిపై అంగీకృతమైన విషయం 25 నుండి 30 ఏళ్లని. దీని ప్రకారం ఇందులోని నన్నెచోడుని కాలం బహుశా క్రీ.శ. 1125 ప్రాంతం. అదీ కాకుండా కొప్పరపు శాసనం ప్రకారం క్రీ.శ. 1125 ప్రాంతంలో చోడబల్లి అనే రాజు ఒక మల్లికార్జునయోగిని సత్కరించాడట. ఈ వాదం ప్రకారం నన్నెచోడుడు నన్నయ తిక్కనల నడిమి కాలం వాడు. ఈ వాదాన్నే అనేకులు బలపరిచారు.

నన్నెచోడుని కవితలో తిక్కన, నాచన సోమనల ఛాయలు ఉన్నాయని, కావున ఇతడు తిక్కనకు తరువాతి వాడని మరి కొందరి వాదం[1]. ఇక పోతే ఇతని కవితలోని గూఢాంశాలను నిశితంగా పరిశీలించి ఇతడు నన్నయకు సమకాలీనుడని దేవరపల్లి కృష్ణారెడ్డి తీర్మానించారు[2]. చివరగా కొర్లపాటి శ్రీరామమూర్తి మానవల్లి రామకృష్ణకవే కుమారసంభవ కావ్యాన్ని రాసి నన్నెచోడునికి ఆపాదించారని ఒక పెద్ద పుస్తకం రాశారు[3].

మంగళాచరణ పద్యాలు
నన్నయ తిక్కనలు తమ కావ్యాలను సంస్కృత పద్యాలతో ఆరంభించారు. కాని నన్నెచోడుడు తెలుగులో రాసి మార్గదర్శి అయ్యాడు. మనకు దొరికిన తెలుగు ఛందోగ్రంథాలలో అతి పురాతనమైనది రేచన వ్రాసిన కవిజనాశ్రయము. ఇందులో కూడా మంగళాచరణమైన కింది మొదటి పద్యం (సంజ్ఙాధికారము నుండి) తెలుగులోనే ఉంది [4],[5].

కం. శ్రీకాంతాతిప్రియ వా
        క్ఛ్రీ కాంత జగత్రయైక సేవిత నుత వి
        ద్యాకాంత దివ్య కావ్య స
        దేకాంత నితాంత కాంతి నీవుత మాకున్

శ్రీకాంతునికి అతి ప్రియమైన దానా, పలుకుల సిరిరాణీ, ముల్లోకములయందు పూజింపబడుదానా, విద్యల తల్లీ, మంచి కావ్యములయందు ప్రీతి చూపుదానా, ఎల్లప్పుడు మాకు నీ కాంతుల నొసగుమని దీనికి అర్థము.

ఇది ఎందుకు ముఖ్యమంటే నన్నయ తిక్కనలవలె కాక ఈ ఇద్దరు కవులు తెలుగు పద్యంతో కావ్యారంభం చేశారు. ఇందులో ఎవరు ఎవరిని అనుసరించారన్నది ఎవరు ముందో ఎవరు వెనుకో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అంతే కాక రేచన తేటగీతి లక్షణాలను తెలిపేటప్పుడు “వస్తుకవి జనాశ్రయా” అంటూ వస్తుకవిత అనే పదాన్ని కూడా వాడాడు[4],[5]. ఈ రెండు పద్యాలు జయంతి రామయ్యపంతులుగారి ప్రతిలో[6]లేదు.

గోవిందకవి చోడుని అనుసరించాడా?
కుమారసంభవ కావ్యపు ముద్రణ లన్నింటికీ తంజావూరు సరస్వతీమహలు ప్రతియే మూలాధారం. మరొక ప్రతి ఉందని కవిగారు చెప్పినా దానిని మరెవ్వరు చూచింది లేదు. ఆ తంజావూరు ప్రతి నిజమయిందేనా అనే సంశయాన్ని కొందరు వెలిబుచ్చారు. ఈ మధ్య నేను తాళదశప్రాణప్రదీపిక[7] అనే గ్రంథం చూశాను. ఇది సంగీతంలోని తాళాలపైన ఒక గొప్ప పుస్తకం. దీనిని పోలూరి గోవిందకవి రాశాడు. ఈ కవి కాలం బహుశా నన్నయ నన్నెచోడుల పిదప. ఇతడు మంగళాచరణ పద్యాన్ని తెలుగులో ప్రారంభించాడు. నన్నెచోడునివలె షష్ఠ్యంతాలను కూడా రాశాడు. ఈ కవి నన్నయను, గణిత శాస్త్రములో ప్రావీణ్యము గడించిన పావులూరి మల్లనను మాత్రమే పేరు పెట్టి ప్రశంసించాడు. బ్రాహ్మణేతర కవులను ఆ కాలములో స్తుతించరో ఏమో? కాని “నన్నయ ప్రముఖాంధ్ర సన్నుత ప్రాక్తన కవిరాజరాజుల కవనతు లిడి” అన్నప్పుడు వ్యంగ్యంగా నన్నెచోడుని కూడా పేర్కొన్నాడని నా ఊహ. ఇదే నిజమయితే కవిరాజశిఖామణిని ప్రస్తుతించిన ఒకే కవి ఇతడు కాబోలు! ఈ గ్రంథపు ప్రతి కూడా తంజావూరు సరస్వతి మహలు నుండే, అక్కడ తప్ప వేరెక్కడా లేదు. మరి ఒకే ప్రతి ఉన్న ఈ పుస్తకాన్ని కవిపండితులు అంగీకరించి, కుమారసంభవాన్ని ఎందుకు కూట సృష్టి అంటారో అర్ధం కాదు.

రేచన నన్నెచోడులు
కవిజనాశ్రయము తెలుగులో మనకు దొరికిన మొదటి ఛందోగ్రంథము. దీని రచయిత రేచనయా లేక వేములవాడ భీమకవియా అన్న విషయం కూడా ఇంకా సరిగా తీర్మానించబడలేదు. జయంతిరామయ్యచే పరిష్కృతమైన ప్రతిలో[6] ఈ పుస్తకాన్ని భీమకవి రాశాడన్నాడు. దీనిని భీమనఛందం అనడం వాడుక. వావిళ్ల ప్రతిలో[5] నిడదవోలు వేంకటరావు భీమకవి రేచనలు వేరువేరు వారనియూ, రేచనయే కవిజనాశ్రయపు కర్త అని తీర్మానించారు. అంతేకాక కుమారసంభవం, కవిజనాశ్రయములోని కొన్ని పద్యాలకు సామ్యాన్ని కూడా వీరు ఎత్తి చూపారు. మచ్చుకు కింది రెండు పద్యాలు ఒకదాని కొకటి అనుసరణ అనుటలో సందేహం లేదు. నన్నెచోడుని కుమారసంభవము (7.1) నుండి –

కం. శ్రీ శ్రితవక్షుఁడు ముక్తి
        శ్రీ శ్రిత సహజావదాతచిత్తుఁడు వాణీ
        శ్రీశ్రితసుముఖుఁడు కీర్తి
        శ్రీశ్రితదిఙ్ముఖుఁడు శేముషీనిధిపేర్మిన్

లక్ష్మీదేవికి ఆశ్రయమైన వక్షఃస్థలము గలవాడు, మోక్షలక్ష్మికి ఆశ్రయమైన నిర్మలచిత్తుడు, విద్యాలక్ష్మికి ఆశ్రయమైన ముఖము గలవాడు, కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన దిఙ్ముఖుడు, బుద్ధివంతుడు అయిన జంగమ మల్లికార్జునుని ఉద్దేశించి, రేచన (కవిజనాశ్రయము, దోషాధికార ప్రకరణము) రాసినది ఈ పద్యము.

కం. శ్రీ శ్రితవక్షుఁడు విద్యా
        శ్రీశ్రితముఖుఁడఖిలజనవిశేషితకీర్తి
        శ్రీశ్రితభువనుఁడు సుకవిజ
        నాశ్రయుఁడెఱిగించు కృతులనగు దోషంబుల్

లక్ష్మీదేవికి ఆశ్రయమైన వక్షఃస్థలము గలవాడు, విద్యాలక్ష్మికి ఆశ్రయమైన ముఖము గలవాడు, లోకములో జనులెల్లరిచే పొగడబడుచు కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన వాడు, మంచి కవులకు ఆశ్రయమిచ్చువాడు గ్రంథములలోని దోషములను తెలియజేయును.

శార్దూలవిక్రీడిత లక్షణాలను చెప్పేటప్పుడు రేచన రాసిన పద్యానికి, నన్నెచోడుని దారిద్ర్యవిద్రావణ దశకములోని ఒక పద్యానికి ఆరంభంలో ఉన్న పోలికను కూడా నేను గమనించాను. రేచన, కవిజనాశ్రయము, యతిచ్ఛందోధికార ప్రకరణము నుండి ఈ పద్యం:

శా. సారాచారవిశారదా, యినయతిన్ శార్దూలవిక్రీడితా
        కారంబై మసజమ్ములిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్

శ్రేష్ఠములైన ఆచారములను తెలిసికొన్న వారిలో గొప్పవాడా, పన్నెండుకు విరిగే శార్దూలవిక్రీడితము మ-స-జ-స-త-త-గలతో ఒప్పారును అని దీనర్ధం. నన్నెచోడుని దారిద్ర్యవిద్రావణదశకములో ఒక పద్యం (10.98) కూడా ఇలాగే ఆరంభమవుతుంది.

శా. సారాచారవిచారదక్షు లమలజ్ఞానక్షణోద్వీక్షణా
        ప్రారంభాత్మకు లాత్మ నిన్ను నెనయన్ భావించి దుర్వార సం
        సారాంభోనిధి పారమెయ్ది సుమహత్సౌఖ్యాత్ములై మర్త్యు లా
        ధారాధేయ విముక్తియుక్తు లగుదుర్ దారిద్ర్యవిద్రావణా

అర్ధం:ఓ దారిద్ర్యవిద్రావణా, విమలవంతములైన ఆచారముల నెరిగినవారు, ఒక త్రుటిలో నిర్మల జ్ఞానాన్ని తెలిసికొనే శక్తిగలవారు నిన్ను మనసులో సంస్మరించి ఈ గొప్ప సంసారసాగరానికి ఆవలి ఒడ్డు చేరి పారమార్థిక సౌఖ్యాలను అనుభవించిన మానవులు ఈ జన్మనుండి విముక్తి పొందుతారు గదా!

నన్నెచోడుడు ఒక లాక్షణికుడా?
కుమారసంభవములోని పద్యాల సంఖ్యను ఈ పట్టికలో చూడగలరు. ఇందులో సామాన్యముగా తెలుగులో రాసే కందము, సీసము, ఆటవెలది, తేటగీతి, శార్దూలమత్తేభ విక్రీడితాలు, చంపకోత్పలమాలలు ఎక్కువ. సీసపద్యానికి చివర ఆటవెలదినో లేక తేటగీతినో వ్రాయాలి. దీనిని ఎత్తుగీతి అంటారు. నన్నయభట్టు భారతంలో సీసపు ఎత్తుగీతిగా ఆటవెలదులే ఎక్కువ. నన్నెచోడుడు పై పట్టిక ప్రకారం రెంటిని సరి సమానముగా వాడాడు. ఆ ఒక కారణం వల్ల నన్నెచోడుడు నన్నయకు పిదప వాడని నిర్ధారించలేము. ప్రాచీన శాసనాలలో సీసపద్యానికి ఎత్తుగీతిగా తేటగీతులు కూడా ఉన్నాయి. ఆటవెలదిగీతికన్న తేటగీతులు మూడింతలకన్న ఎక్కువగా ఉన్నాయి కుమారసంభవములో. ఇది నన్నెచోడునికి తేటగీతిపైన ఉండే సుముఖతను, సౌలభ్యాన్ని సూచిస్తుంది. ఈ సుముఖతయే సీసపు ఎత్తుగీతిలో కూడా ప్రసరించి ఉండవచ్చు కదా!

ఖ్యాత వృత్తాలు, జాత్యుపజాతుల తరువాత మిగిలిన వాటిలో మహాస్రగ్ధర, లయగ్రాహి, ఉత్సాహ కన్నడమునుండి గ్రహించబడినవి. తరువోజ తెలుగు శాసనాలలో కనిపిస్తుంది. స్రగ్ధర, వనమయూరము, లలితగతి, వసంతతిలకము, భుజంగప్రయాతము, మందాక్రాంత, స్వాగతము, మాలిని, తోటకము సంస్కృత ఛందస్సులో ఉన్నాయి. మిగిలినవి క్రౌంచపదము, మత్తకోకిల, మానిని, లయహారిణి, కవిరాజవిరాజితము, మంగళమహాశ్రీ, మణిగణనికరము. వీటిలో క్రౌంచపదము, మణిగణనికరము, మంగళమహాశ్రీలను గురించి తరువాత చర్చిస్తాను. ఇవి పోగా ఉండేవి మత్తకోకిల, మానిని, కవిరాజవిరాజితము, లయహారిణి. సామాన్యముగా లాక్షణికులు లక్షణాలకు లక్ష్యాలను ఇచ్చేటప్పుడు ముద్రాలంకారాన్ని వాడుతారు అనే విషయాన్ని మనము జ్ఞాపకములో పెట్టుకోవాలి.

ఇందులో మత్తకోకిల(4.108), మానినీ వృత్తాలను(7.9) ముద్రాలంకారంతో వాడాడు చోడుడు. ఆ పద్యాలు-

మత్త. మెత్త మెత్తన క్రాలు దీవు సమీరణుండ, మనోభవుం
        డెత్తకుండఁగ వేగకూడఁగ నెత్తు, మెత్తక తక్కినన్
        జత్తు సుమ్ము వసంతుచే నని చాటునట్లు చెలంగె నా
        మత్తకోకిల లారమిం గడు మాసరంబగు నామనిన్

అందమైన ఆమనివేళలో ఆ తోటలోని మత్తకోకిలలు “ఓ పవనమా, నీవేమో మెల్లమెల్లగా వీస్తున్నావు. మన్మథుడు నీపై దండయాత్ర చేయకముందు నీవే త్వరగా వానిపై దండెత్తు, అలా చేయకపోతే వసంతుడు నిన్ను చంపుతాడు, జాగ్రత్త సుమా” అని హెచ్చరించేటట్లు ధ్వనులు చేశాయట.

కన్నడములో మత్తకోకిలకు పేరు మల్లికామాలె. కన్నడములోని ఉత్పలమాలె, చంపకమాలె తెలుగులో ఉత్పలమాల, చంపకమాలలయ్యాయి. మరి మల్లికామాలె మల్లికామాల ఎందుకు కాలేదు? దీనికి మత్తకోకిల అని ఎవరు పేరు పెట్టారు? మల్లికామాల అని పద్యంలో రాయాలంటే ఆ పదాన్ని ఒక పాదం చివరనుండి మరొక పాదం మొదట పెట్టితేనే సాధ్యమవుతుంది. కాని మత్తకోకిల పదాన్ని పాదంలో ఎక్కడైనా వాడవచ్చును. నన్నెచోడుడు ముద్రాలంకారాన్ని ఉపయోగించాడు ఒక మత్తకోకిలలో, కాబట్టి అతడే దీనికి మత్తకోకిల అని పేరు పెట్టి ఉండవచ్చు గదా?

మా. ఆననలీల సుధాకరబింబ నవాంబురుహంబుల చెల్వగుటన్
        వేనలి కృష్ణభుజంగకలాపి సవిస్తరభాసురమై చనుటం
        దా నతి బాలకి యయ్యుఁ దపం బుచితస్థితిఁ జేయుచునుండుట నీ
        మానిని రూపచరిత్ర లుదారసమం బగుచున్నవి చిత్రగతిన్

ముఖమో చంద్రబింబము లేక అప్పుడే విరిసిన పద్మాలు. జడ నల్లటి త్రాచు పామువలె లేక నెమలిలా ప్రకాశిస్తూ ఉంది. తనేమో చిన్న పిల్ల అయినా దీక్షతో తపస్సు చేస్తూ ఉంది. ఈ మానిని రూపము, గుణము అతి విచిత్రముగా ఉన్నదని దీని భావము.

నన్నయ (ఏచి తనర్చి తలిర్చిన ప్రోవుల నింపగు తావుల…), నన్నెచోడుడులు ఇద్దరూ మానినీ వృత్తానికి ఒక్క యతినే పాటించారన్న విషయం గమనార్హము. కాని రేచన మానినీవృత్తాన్ని యతిచ్ఛందోధికార ప్రకరణములో విశదీకరించేటప్పుడు ఒక్క యతినే చెప్పినా, ఆ పద్యంలో మూడు యతులు వాడాడు. ఆ పద్యం-

మా. కారకముల్ క్రియఁ గన్గొన నేడు భకారము లొక్క గకారముతో
        గారవమై చనఁగా యతి పండ్రెటఁ గల్గిన మానిని కామనిభా

ఓ మన్మథాకారుడా, ఏడు భ-గణములతో, ఒక గురువుతో పన్నెండు అక్షరాలకు విరిగే వృత్తాన్ని మానిని అంటారు.

మానినిని సంస్కృతములో మదిరా అంటారు. మదిర అనే పేరు నచ్చక దీనికి మానిని అని నన్నెచోడుడు పేరు పెట్టి ఉండవచ్చుగదా? ఈ కోవకు చెందినదే కవిరాజవిరాజిత వృత్తం కూడా. నన్నయ(చనిచని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమ లతాతతులన్ …), నన్నెచోడుడు(11.214, కింది పద్యం) ఒక్క యతినే వాడారు.

కవి. మనునిభ చారుచరిరుఁ బవిత్రు నమానుష పౌరుషవర్తి జగ
        జ్జననుత నిర్మలకీర్తి రమావిభు శాశ్వత యోగ పదస్థిరు, స
        న్మునిజన ముఖ్యు శివాగమవేది నమోఘవచోనిధి ధీనిధిఁ బా
        వనతరమూర్తి సమస్త జగద్గురు వంద్యు ననింద్యు, సదాత్మవిదున్

మనువువలె అత్త్యుత్తమ చరిత్ర గలవానిని, పవిత్రుని, మానవాతీతమైన పురుషరూపుని, లోకమునందలి ప్రజలచే కొనియాడబడి విష్ణుమూర్తివలె కీర్తివంతుని, అచంచల యోగమూర్తిని, మునీశ్వరులలో ముఖ్యుడైనవానిని, ఈశ్వరవేదజ్ఞానిని, అనర్గళమైన వాక్కుల సిరిగలవానిని, ధీమంతుని, పరమ పావనుని, గురువులకే గురువైన వానిని, అనింద్యుని, బ్రహ్మజ్ఞానియైన జంగమ మల్లికార్జునుని గురించి రాసినదని ఈ పద్యార్ధము. రేచన ఈ పద్యానికి యతిచ్ఛందోధికార ప్రకరణములో లక్షణాలు చెప్పేటప్పుడు యతి మాటే ఎత్తలేదు, కాని లక్షణపద్యంలో మూడు యతులను వాడాడు.

కవి. క్రమమున నొక్క నకారము నాఱు జకారములుం బరగంగ వకా
        రమును నొడంబడి రాఁ గవిరాజవిరాజిత మన్నది రామనిభా

అర్థం: ఓ రామరూపా, వరుసగా న-గణము, ఆరు జ-గణాలు, పిదప వ-గణము కవిరాజవిరాజిత వృత్తానికి ఉంటుంది. ఈ కవిరాజవిరాజితాన్ని సంస్కృతములో, కన్నడములో హంసగతి వృత్తము అంటారు. కవిరాజవిరాజిత వృత్తాన్ని ఆదిశంకరులు కూడా వాడారని “శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము” అన్న వ్యాసంలో తెలియజేసాను . తెలుగులో ఎప్పుడు ఎవరు కవిరాజవిరాజితమన్న పేరును పెట్టారో తెలియదు. బహుశా ఒక వేళ కవిరాజశిఖామణియైన నన్నెచోడుడు మొట్టమొదట దీనిని వాడినప్పుడు కవిరాజవిరాజితమన్నాడా?

అలాగే, లయహారిణికి కూడా ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు. నన్నెచోడుడు ఈ వృత్తంలో రాసిన రెండు పద్యాలలో ఒక దానిలో లలితగతి అనే పదం ఉంది. ఇతడు దీనికి లలితగతి అని పేరుంచాడేమో? ఈ నా ఊహకు కారణం, లయహారిణిలో చివరి రెండు గురువులకు బదులుగా ఒక స-గణమును ఉంచితే ఆ వృత్తాన్ని లలితలతా అంటారు. భారతములో ఈ ఉద్ధురమాలా వృత్తము కనబడదు. పైన చెప్పిన కారణాలవల్ల నన్నెచోడుడు పాత వృత్తాలకు కొత్త పేరులను కల్పించియుండవచ్చును. ఇదే నిజమయితే, కవిజనాశ్రయకారుడు కవిరాజశిఖామణి పిదప జీవించి ఉండాలి.
క్రౌంచపదము
క్రౌంచపదము అనేది ఒక వృత్తఛందస్సు. (క్రౌంచము అనే పేరుతో ఒక పక్షి (Heron), ఒక కొండ కూడా ఉన్నాయి.) తెలుగు ఛందస్సులో క్రౌంచపదంలో ప్రతి పాదానికి 24 అక్షరాలు ఉంటాయి. ఇది సంకృతి ఛందములో పుట్టిన 4193479వ వృత్తము. దీని గణములు- భ-మ-స-భ-న-న-న-య. ఇది ఒక చతుర్మాత్రల తాళవృత్తము. మాత్రాగణములుగా దీనిని ఇలా వ్రాయవచ్చు- UII UU UII UU IIII IIII IIII UU, అనగా ప్రతి పాదములో ఎనిమిది చతుర్మాత్రలు. సంస్కృతములో[8] , కన్నడములో[9] ఈ పేరుతో, ఇదే లయతో ఒక వృత్తము ఉన్నది. కాని అది పాదానికి 25 అక్షరాలు గల అభికృతి ఛందస్సులోని 16776391వ వృత్తము. తెలుగులో చివరి మాత్రాగణము గ-గము. సంస్కృతము, కన్నడములలో అది స-గణము. క్రౌంచపదముతో ఛందఃపరముగా ఎన్నో ఆటలను ఆడుకోవచ్చు[10]. సంస్కృతములో పింగళ ఛందస్సులో దీనికి “యా కపిలాక్షీ పింగళకేశీ …” అనే ఉదాహరణ ఉంది. ఇది ఒక కురూపియైన స్త్రీ వర్ణన. దీనికంటే ఒక అందమైన ఈ క్రింది పద్యాన్ని మధ్వాచార్యులు సంస్కృతంలో రాశారు.[11]:

సం.క్రౌ. అంబరగంగా చుంబితపాదః పదతలవిదలిత గురుతరశకటః
        కాలియనాగశ్వేలనిహంతా సరసిజనవదలవికసితనయనః
        కాలఘనాలీ కర్బురకాయః శరశతశకలితరిపుశతనివహః
        సంతతమస్మాన్ పాతు మురారిః సతతగసమజవఖగపతినిరతః

ఆకాశగంగను ముద్దాడిన పాదాలు గలవాడా, పెద్ద బండినే విరగగొట్టిన అడుగులవాడా, కాళియుని ఉనికిని నాశనము చేసినవాడా, కొత్త తామరపూల రేకులవంటి కన్నులు గలవాడా, కారు మేఘములవంటి దేహము గలవాడా, శత్రువులను బాణములతో జయించినవాడా, ఎల్లప్పుడు గరుడదేవునిపై వెళ్ళెడివాడా, ఓ మురారీ, నన్నెల్లపుడు కాపాడవయ్యా అని దీనికి అర్థం. పై పద్యంలో మొదటి రెండు పాదాలలో యాదృచ్ఛికముగా పూర్వార్ధములో ప్రాసయతి కుదిరింది. కన్నడములో కూడా మొదటి సగ పాదంలో ప్రాసయతి ఉన్నది. ఆ కన్నడ క్రౌంచపద పద్యము [9]–

క. క్రౌ. శీతకరోర్వీ-వాత-శశాంకర్ యుగ-మిత-సురపుర-నివహద కడెయొళ్
        భూతగణేశం, భూత-శరాశా గజదొళె యతిగళు మెసెదరె పెసరిం
        నీతియుతే, కేళ్ నీ సాతిశయోక్తి-క్రమదొళె నెగళ్దుది దతిశయ రచనో
        పేతమశేషోర్వీతలకం క్రౌంచపదమిదతిశయపదరచనెగళిం

చంద్రుడు(భ-గణము), భూమి(మ-గణము), వాయువు(స-గణము), చంద్రుడు(భ-గణము), నాలుగు దేవలోకాలు(న-గణాలు), చివర ఒక శుక్రాచార్యుడు(గురువు), భూతాలు(ఐదు), బాణాలు(ఐదు), దిగ్గజాలు(ఎనిమిది), ఋషులు(ఏడు) యతులుగా ఉండినచో, ఓ మానవతీ, విను, ఆ అతిశయ రచనను క్రౌంచపదము అంటారు అని నాగవర్మ తన భార్యను ఉద్దేశించి ఈ పద్యాన్ని వ్రాసినాడు.

ఇందులో కూడా ప్రథమార్ధములో ప్రాసయతి ఉంది. కన్నడములో యతికి అక్షరమైత్రి లేదు, పాదవిచ్ఛేదన మాత్రమే. కావున ప్రతి పాదం ఐదు, ఐదు, ఎనిమిది, ఏడు అక్షరాలుగా విరుగుతుంది. కాని తెలుగులో మాత్రం పాదానికి 24 అక్షరాలు. దానిని రేచన కవిజనాశ్రయములో ఇలా వివరిస్తాడు-

క్రౌ. పంచశరాభా, సంచితపుణ్యా, భమసభననయల పరిమితమైనన్
        గ్రౌంచపదాఖ్యం బంచిత మయ్యెన్ గ్రమయతి దశవసుకలితము కాగన్

మన్మథాకారుడా, పుణ్యవంతుడా, భమసభనననయలతో కూడియున్నదై పదికి, ఎనిమిదికి తరువాత యతి ఉండినచో దానిని క్రౌంచపదమందురు. ఇందులో అక్షరయతి మాత్రమే సూచించబడినా, ఉదహరణలో ఐదక్షరాల తరువాత ప్రాసయతి కూడా ఉన్నది. అసలు సంస్కృత, తెలుగు క్రౌంచపదాలకు లయలో భేదము ఏ మాత్రము లేదు. దీనిని నిరూపిస్తూ కింద ఒక పద్యము చూడండి. ఇందులో కుండలీకరణములలో నున్న పదాలు తెలుగు క్రౌంచపదానికి, అలా లేని చివరి పదాలు సంస్కృత వృత్తానికి వర్తిస్తాయి.

క్రౌ. ఇంచు సడుల్ నే నించుక వింటిన్ హృదయము నిజముగ హృతమయె నహహా (నాహా)
        ఎంచితి నిన్ బ్రేమించితి రాత్రిన్ హిమకర కరములు హితమయ మయెగా (మయ్యెన్)
        కాంచనమాలా చంచల హేలా గగనము మురిసెను కడు ముద మొసగన్ (మీయన్)
        కాంచగ రావా క్రౌంచపదమ్మున్ గనగను వినగను కమల సునయనా (సునేత్రీ)

ఈ నేపథ్యముతో నన్నెచోడుని క్రౌంచపదాన్ని(10.30) పరిశీలిద్దాము.

క్రౌ. చంచుల నాస్వాదించుచు లేఁదూండ్లకరువు ప్రియులకు నలదుఁచు మై రో
        మాంచము లోలిం గంచుకితంబై పొడమఁగ నడరుచుఁ బులినములం గ్రీ
        డించుచు సంభాషించుచుఁ బ్రీతిం బొలుచుచుఁ జెలగుచుఁ బొలయు సముద్య
        త్క్రౌంచగతుల్ వీక్షించుచు భాస్వజ్జ్వలనుఁడు శరవణ సరసికి వచ్చెన్

ముక్కులతో లేత తూడులను తింటూ, పుప్పొడిని తమ ప్రియురాళ్లకు పూస్తూ, గగుర్పాటుతో ఒళ్లు నిండిపోయి విజృంబిస్తూ, ఆ ఇసుక తిన్నెలపై ఆడుతూ, మాట్లాడుతూ, సంతోష ధ్వనులతో మురిసిపోతూ ఉండే ఆ క్రౌంచ పక్షులను చూస్తూ మండిపోతూ ఉండే అగ్నిదేవుడు శరవణ సరసికి వచ్చాడు. శివుని రేతస్సును మోసికొని అగ్ని శరవణసరసికి వచ్చినప్పుడు క్రౌంచపక్షుల విహారాన్ని వర్ణించే పద్యము ఇది.

నన్నయ భారతములో క్రౌంచపదము లేదు. నన్నెచోడుని క్రౌంచపదమే తెలుగు సాహిత్యములో మొట్టమొదటిది. ఇందులోని విశేషాలు:

సంస్కృతమువలె, కన్నడమువలె కాక ఇందులో పాదానికి 24 అక్షరాలు ఉన్నాయి.
ఇందులో పూర్వార్ధములో ప్రాసయతి ఉన్నది.
ఉత్తరార్ధములో అక్షరయతి ఉన్నా, అది మొదటి అక్షరముతో చెల్లడం లేదు. సీస పాదమువలె మొదటి సగములో ప్రాసయతి, రెండవ సగములో సామాన్య యతి ఉన్నది.
ఈ మూడవ విశేషాన్ని గమనించిన కవి[12] సీసమునుండి క్రౌంచపదము పుట్టినది అన్నారు. కాని నాకు ఇది అంత సబబుగా తోచలేదు. ఎందుకంటే, సీసపదముగా నుండాలంటే చివరి రెండు చతుర్మాత్రలను త్రిమాత్రలు చేయాలి. నన్నెచోడునికి నాగవర్మ ఛందోంబుధి పరిచితమై ఉంటుంది. అందులోని విధముగా ప్రాసయతిని ఉంచాడు. కాని అక్షరయతి ఉంచేటప్పుడు ద్వితీయార్ధాన్ని స్వతంత్రంగా తీసికొన్నాడు. అసలు 25 అక్షరాల పాదం 24 అక్షరాలు ఏలాగయింది? రేచన కవిజనాశ్రయాన్ని చూసి వ్రాసింది కాదు. రేచన కవిజనాశ్రయము నన్నెచోడునికి ముందు వ్రాయబడి ఉంటే, లక్ష్యాలేమియు లేని రేచన సంస్కృత లక్షణాలను స్వీకరించి ఉంటాడు. నన్నయ మధ్యాక్కరకు ఐదవ గణముతో యతి నుంచాడు. నన్నెచోడుడు మధ్యాక్కరను రాయలేదు. కాని చంపకోత్పలమాలలలో మధ్యాక్కరను గర్భితము చేయడానికి ప్రయత్నించినట్లుందని “చంపకోత్పలమాలల కథ” అన్న వ్యాసంలో తెలియజేసాను. (11.131, 11.132). ఇలా చేస్తే అదనముగా యతి నుంచలేని కారణాన, మధ్యాక్కరకు నాలుగవ గణముతో యతి కుదురుతుంది. ఎఱ్ఱన మధ్యాక్కరకు నాలుగవ గణముతో యతిని ఉంచాడు. రేచన మధ్యాక్కరలోని నాలుగవ గణానికి యతిని నియమిచాడు. ఇక పోతే ఇద్దరు నన్నియలు మానినికి, కవిరాజవిరాజితమునకు ఒకే యతి నుంచారు. కాని కవిజనాశ్రయకర్త మూడు యతులను వివరించాడు. ఈ కారణాలవల్ల కవిజనాశ్రయము నన్నయ నన్నెచోడుల పిదప వ్రాయబడినది కాని ముందు కాదు. అంటే భీమనచందము అని పిలువబడే కవిజనాశ్రయాన్ని భీమన వ్రాసెనో లేక రేచన వ్రాసెనో మనకు నిక్కచ్చిగా తెలియదు. కాని ఆ రచయిత నన్నయ, నన్నెచోడుల తరువాతివాడే.

క్రౌంచపదానికి పూర్వార్ధపాదములో అందరూ ప్రాసయతిని ఉంచలేదు. తిక్కన కవిజనాశ్రయ లక్షణములను విధిగా పాటించాడు. ఎఱ్ఱన పూర్వార్ధములో అక్షరయతిని ఉంచాడు. నంది తిమ్మన, అప్పకవి పద్యాలలో ప్రాసయతి లేదు [13]. నన్నెచోడుని ద్వితీయార్ధ యతిలా కాక అక్షరయతి ఎప్పుడూ మొదటి అక్షరముతో చెల్లుతుంది మిగిలిన కవుల పద్యాలలో. సంస్కృత క్రౌంచపదము రుక్మవతీ (ప్రథమార్ధము) మణిగణనికరముల (ద్వితీయార్ధము) సంయోగము. మనకు దొరికిన నన్నెచోడుని మణిగణనికరము(8.93) లక్షణయుక్తముగా లేదు.

మణి. సరసిజహితుఁ డటు సనఁ దరతర మ
        త్యరుణరుచిని మెఱుఁ గడరుచు వడి సం
        బరమున నుడుతతి ప్రవిమల మయ్యెన్
        నిరుపమ మణిగణనికర విభాతిన్

సూర్యుడు అలా అస్తమించాడు, ఎర్రని కాంతులు మెల్లమెల్లగా ఆకాశములో వ్యాపించాయి. నక్షత్రాలు మణిగణముల రాశిలా దేదీప్యమానముగా వెలుగ నారంభించాయి. పుస్తకములో పద్యం ఇలాగే ఉంది. ఈ రీతిలో నన్నెచోడుడు వ్రాసి ఉంటే మొదటి రెండు పాదాలకు మాత్రమే మణిగణనికరపు లక్షణాలు ఉన్నాయి. మూడవ, నాలుగవ పాదాల చివర రెండు లఘువులు, ఒక గురువుకు బదులు రెండు గురువులు ఉన్నాయి. ఈ లక్షణాలతో ఉండే వృత్తమును కమలవిలసితము లేక గౌరీ అంటారు. మూడవ పాదములో అయ్యెన్ కు బదులుగా అయెగా అనియూ నాలుగవ పాదములో మణిగణనికర విభాతిన్ కు బదులుగా మణిగణనికరము విధమై అని చెబితే మణిగణనికరపు లక్షణాలు సరిపోతాయి. మొదటి రెండు పాదాలు మణిగణనికరములా ఉన్నా, చివరి రెండు పాదాలు కమలవిలసితములా ఉన్నది (ఉదా. కంకంటి పాపరాజు ఉత్తరరామాయణములోని[14] వనజనయనుఁ గరివరదునిఁ జేరన్ …). కాని ఈ కమలవిలసితవృత్తము కవిజనాశ్రయములో లేదు. దీనినే పింగళుడు[8] గౌరీ అని పిలిచాడు.

ఇంతవరకు ఈ క్రౌంచపదాన్ని గురించి వ్రాసినవారందరూ ఒక విషయం మరచినట్లుంది. తెలుగు క్రౌంచపదపు లక్షణాలు ఉన్న వృత్తము పింగళఛందస్సు, ఛందోంబుధిలో లేవు. అంతమాత్రాన దానిని ఏ లక్షణకారుడు నిర్వచించలేదు అనడం తప్పు. జనాశ్రయుని, జయదేవుని (గీతగోవిందకారుడు కాదు) పిదప జయకీర్తి అనే లక్షణకారుడు ఇప్పటి కర్ణాటకములో ఉండేవాడు. అతని లక్షణగ్రంథము ఛందోనుశాసనము (తరువాతి కాలంలో హేమచంద్రసూరి కూడా ఛందోనుశాసనమనే మరొక గ్రంథాన్ని రచించాడు). నాగవర్మ ఛందోంబుధి క్రీ. శ. 990 నాటిది. తరువాత కొన్ని సంవత్సరాల పిదప జయకీర్తి ఛందోనుశాసనమును సంస్కృతములో రాసినాడు. ఇందులో తెలుగు క్రౌంచపదపు లక్షణాలతో హంసపదము అనే ఒక వృత్తము ఉన్నది[15]. జయకీర్తి ప్రకారము దాని లక్షణాలు-

హంసపదం స్యాద్భాంచ గణాః స్యుర్వ్రతశరవసుయతి మసభననాన్యౌ

తరువాతి కాలంలో హంసపదమును కోకపదము అని కూడా పిలిచేవారు. వేరు లక్షణాలతో హంసపదమనే మరొక వృత్తము కూడా ఉన్నది[16]. జయకీర్తి హంసపదాన్ని నన్నెచోడుడు చూచి అదే క్రౌంచపదమనుకొని వ్రాసినాడేమో? సంగీతపరంగా క్రౌంచపదము చాలా ముఖ్యమైనది, అందుకే దేశికార ప్రబంధములలో పదనైవదిగా క్రౌంచపదాన్ని, పదహారవదిగా హంసపదాన్ని (క్రౌంచపదము కాని మరొక హంసపదము) మతంగముని బృహద్దేశిలో[17] పేర్కొన్నాడు. ఇలా ఈ రెండు పదవృత్తాలను గురించి తికమకలు పడడానికి అవకాశం ఉందా అనే ప్రశ్నకు నా జవాబు: మణిగణనికరములో అన్ని పాదాలు ఒకే విధముగా లేవు కదా? అందులోని మొదటి రెండు పాదాలు సంస్కృత క్రౌంచపదములోని ద్వితీయార్ధములాగా, చివరి రెండు పాదాలు తెలుగు క్రౌంచపదములోని ద్వితీయార్ధములాగా ఉన్నవి కదా?

ఈ చర్చల సారాంశము ఏమంటే – రేచన కవిజనాశ్రయములోని క్రౌంచపదపు లక్షణాలు నన్నెచోడుని పద్యాన్ని అనుసరించి వ్రాసినది. నన్నెచోడునికి సంస్కృత క్రౌంచపదము, జయకీర్తి ఉదహరించిన క్రౌంచపదము తెలిసి ఉండాలి. ఇతడు తెలుగు కన్నడ సీమల సరిహద్దులకు రాజు కదా! తాను వ్రాసినప్పుడు ఒక దాని లక్షణాలను మరొకదానికి తారుమారు చేసి ఉంటాడు, మణిగణనికరమును సంకరము చేసినట్లు. కన్నడములోలా ప్రాసయతిని ఉంచినా, అక్షరయతిని ఎందుకు మొదటి అక్షరముతో పెట్టలేదో అన్నది ఇంకా చర్చనీయమే. దానిపై నా అభిప్రాయాలు ఇవి – క్రౌంచపదమును వ్రాసేటప్పుడు నన్నెచోడుడు ఒక సందిగ్ధావస్థలో పడ్డాడు. తాను వ్రాసిన స్రగ్ధర, మహాస్రగ్ధరలకు తప్ప మిగిలిన అన్ని పద్యాలకు అక్షర సామ్య యతి ఒకటే. స్రగ్ధరలోని రెండు యతులు సంస్కృతములో శతాబ్దాలుగా నియతమై ఉన్నవి. మహాస్రగ్ధర స్రగ్ధరనుండి పుట్టిన వృత్తము, కావున అందులో కూడా యతి నియమము కష్టమైనదేమీ కాదు. క్రౌంచపదములో నన్నెచోడుడు ఒక కొత్త సమస్యను ఎదుర్కొన్నాడు. ఇందులో ప్రాసయతి, సామాన్య యతి రెంటినీ మిశ్రితము చేయాలి. కన్నడ పద్ధతి దీనికి ఏ సహాయమూ చేయదు. ఎందుకంటే కన్నడములో స్వరయతి లేదు. సీసాన్ని వ్రాసేటప్పుడు నన్నయ యతి సాంకర్యము ఎక్కువగా చేయలేదు. నన్నెచోడుడు ఒకే పాదములో రెంటినీ మిశ్రణము చేసినట్లుంది. కాని కుమారసంభవమంతా తంజావూరు ప్రతిపైన ఆధారపడినది కావున గ్రంథ స్ఖాలిత్యాలు ఇందులో ఎక్కువ.

ఈ సందిగ్ధతనుండి బయటపడడానికి రెండు మార్గాలు. ఒకటేమో, మొదటి అక్షరముతో యతి కుదర్చడము. దీనివల్ల ఇప్పటికీ ఒక నష్టమేమంటే, అక్షరసామ్యము పది అక్షరాల తరువాత వస్తుంది, కావున శ్రవణసుభగత్వము అంతగా ఉండదు ఇట్టి పద్యాలలో. రెండవ అర్ధ పాదములోని అక్షరాలకు యతిని ఉంచితే వినడానికి బాగుంటుంది. ఈ కారణాలవల్ల నన్నెచోడుడు క్రౌంచపదానికి యతి నిర్ణయం ఇలా చేసి ఉంటాడు. ఇది కేవలం ఊహాగానమైనా నాకేమో తర్కరీతిగా సబబు అనే తోస్తుంది. పై సిద్ధాంతాలు అంగీకృతమైతే, నన్నెచోడుని కాలం ఛందోనుశాసన కర్త జయకీర్తి తరువాత, రేచనకు ముందు అని చెప్పవచ్చు. అంటే ముగ్గురు నన్నియలు (నన్నియభట్టు, నన్నియ నారాయణాభట్టు, నన్నిచోడుడు) సమకాలికులని అనుకోవచ్చు. కుమారసంభవము భారతంకన్న ఒక పదేళ్ల ముందు లిఖితమయి ఉండవచ్చును. సంఖ్యాశాస్త్రాదుల నుపయోగించి కృష్ణారెడ్డి[2] నన్నెచోడుడు నన్నయభట్టు సమకాలికులనే తీర్మానించారు.

మంగళమహాశ్రీ
పంపకవి కన్నడ భారతాన్ని మంగళం అనే పదముతో అంతం చేశాడు. అందులో మత్తేభవిక్రీడితములోని చివరి పదాలు[18] ‘విభవం భద్రం శుభం మంగళం’. నన్నెచోడుని కుమారసంభవములోని చివరి పద్యములోని చివరి పదము ‘మంగళమహాశ్రీ’. ఈ పద్యం కూడా ముద్రాలంకారముతో వ్రాయబడినది. మంగళమహాశ్రీ వృత్తము ఆ కాలపు ఏ ఛందోగ్రంథములలో కూడా వివరించబడలేదు. అనగా ఇది అసలు సిసలైన ఒక కొత్త పద్యము. నాగవర్మ ఛందోంబుధిలో[9] మంగళము అనే 16అక్షరాల వృత్తము (న భ జ జ జ గ) ఉన్నది. పింగళ ఛందస్సులో[8] దీనిని పద్మ అని పిలిచారు. మంగళమహాశ్రీ కవిజనాశ్రయములో చెప్పబడినది.

ఈ వృత్తము ఎలా పుట్టింది అనే ప్రశ్న కలుగవచ్చు. ఛందోంబుధిలో లలితవృత్తము, లయగ్రాహి చెప్పబడి యున్నది. ఈ రెంటికీ గణాలు ఒక్కటే. లయగ్రాహిలో ఉన్న చివరి ప్రాసయతి లలితలో ఉండదు. అదొక్కటే ఈ రెంటికీ తేడా. నన్నయ నన్నెచోడులు లయగ్రాహిని వ్రాసియున్నారు. లయగ్రాహికి 30 అక్షరాలు. కాళిదాసో లేక నా ఉద్దేశములో శంకరాచార్యులో అశ్వధాటీవృత్తాన్ని దేవీ అశ్వధాటిలో వ్రాసియున్నారు. అశ్వధాటికి 22 అక్షరాలు. ఇందులో పాదానికి ఆరు పంచమాత్రలు (UUI, UIII), చివర ఒక గురువు. లయగ్రాహిలో ఏడు పంచమాత్రలు (UIII), రెండు గురువులు. ఇక్కడ ఒక చిక్కు, వృత్తాలలో 26 అక్షరాలకంటె ఎక్కువ ఉండరాదు. 30 అక్షరాలలో నాలిగింటిని అంటే ఒక పంచమాత్రను తీసివేస్తే మనకు 26 అక్షరాలు దొరుకుతాయి. దీనికి ఉదాహరణగా నా యీ కింది పద్యమును చదవండి. ఇందులో కుండలీకరణములతో చదివితే లయగ్రాహి, వాటిని వదలి చదివితే మంగళమహాశ్రీ మనకు దొరుకుతాయి.

(ఓ రమణి) సంతసము మీరగ వసంతముననీరముల చారు సుమ హారములు పూచెన్
(కారుకొను) వంత లిక తీరువడు, వర్ధిలును ధారుణియు, వర్షములు ధారలయి పాఱున్
(దారుణపు) చింత లిక దూరమగు శ్రీలు కడు చేరువగు, చెల్వముల తారకలు తోచున్
(స్ఫారమగు) కాంతుల నపారమగు గానసుధ లూరు, శుభకాలములు చేరు ధర శాంతిన్

బహుశా ఆ అలోచనే చోడునికి తట్టి ఉంటుంది. ఇది వృత్తము కాబట్టి లయగ్రాహిలోని ప్రాసయతికి బదులు, క్రౌంచపదములా ప్రాసయతి సాంకర్యము లేక, ఇందులో రెండు మాత్రాగణాలకు ఒక అక్షరయతి ఉంచబడినది. లయగ్రాహిలోని ఒక పంచమాత్రారాహిత్యము వలన మంగళమహాశ్రీని చోడుడు కల్పించి ఉంటాడు. అలా ఈ వృత్తము ఉత్కృతి ఛందములో 15658735వ వృత్తమైనది. నన్నెచోడుని మంగళాంత పద్యమును(12.231) కింద చదువవచ్చు. ఇందులో మొదటి పాదములో చివరి రెండు గురువులకు ముందు ఒక పంచమాత్ర లోపమై ఉన్నది.

మం. భూవినుతుఁ, డార్యజనపూజితుఁడు, సద్గుణవిభూషితుఁడు, సర్వా-
        శా వివర పూరిత విశాల శర నిర్మలయశఃప్రసరశోభితుఁడు, సద్భూ
        దేవకులశేఖరుఁడు, దేవమునిముఖ్యుఁడు, సుధీజనవరేణ్యుఁడు, ప్రియుండై
        యీ వసుధ శిష్టతతి కిష్టఫలయుక్తముగ నిచ్చు దయ మంగళమహాశ్రీ

భూమిలో పొగడబడినవాడు, పెద్దలచే పూజించబడినవాడు, మంచి గుణాలతో శోభిల్లువాడు, దిక్కుదిక్కుల వ్యాప్తమైన కీర్తిధవళిమతో అలరారువాడు, బ్రాహ్మణశ్రేష్ఠుడు, దేవతలలో మునులలో ముఖ్యుడు, పండితజనులలో ప్రథముడు – జంగమ మల్లికార్జునుడు – కోరిన కోర్కెలను మంగళమైన గొప్ప సంపదలను సజ్జనులకు ప్రసాదించును అని దీనికి అర్థము

ముగింపు
నన్నెచోడుడు ఒక చిన్న సామంత రాజు, కాని కవిరాజులకు రారాజు. పరమేశ్వరారాధకుడు మాత్రమే కాదు, ప్రబంధ పరమేశ్వరుడు కూడ. జాను తెలుగులో వస్తుకవితకు మార్గదర్శి. తెలుగు కావ్యకన్యకకు అలంకారాలను తీర్చి దిద్దిన అసమాన శేముషీ దురంధరుడు. చిత్ర కవి, లాక్షణికుడు, ఛందోవతంసుడు, నూతన పథాన్వేషణాసక్తుడు, స్వతంత్రుడు. వైష్ణవద్వేషి కాని వీరశైవుడు. స్మరుని స్మరించిన శృంగారరసోల్లాసి. స్కందుని ప్రీతికై కందానికి అందాలను దిద్దిన కల్పనా నిపుణుడు. సీసానికి మాసిపోని మూసల నేర్పరచి వాసికెక్కిన వర్ణనాత్మకుడు. నవరస పిపాసి, నటరాజోపాసి. ఆంధ్రభాషలోని ఆదికవి లేక ఆదికవులలో ఒకడు.

గ్రంథసూచి
జొన్నలగడ్డ మృత్యుంజయ రావు, నన్నెచోడకృత కుమారసంభవము, ప్రథమ భాగము, పీఠిక, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994.
దేవరపల్లి కృష్ణారెడ్డి, నన్నిచోడకవి చరిత్ర, బీ.ఎన్.కే. ప్రెస్, మదరాసు, 1951.
కొర్లపాటి శ్రీరామమూర్తి, నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1983.
అమరేశం రాజేశ్వరశర్మ, నన్నెచోడుని కవిత్వము, అజంతా ప్రింటర్స్, సికిందరాబాదు, 1958.
మల్లియ రేచన లేక వేములవాడ భీమకవి, కవిజనాశ్రయము, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1950.
మల్లియ రేచన లేక వేములవాడ భీమకవి, కవిజనాశ్రయము, ఆంధ్ర సాహిత్య పరిషత్, సుజనరంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ, 1932.
పోలూరి గోవిందకవి, తాళదశప్రాణ ప్రదీపిక, తంజావూరు సరస్వతీ మహల్ సీరీస్ – 13, గవర్నమెంట్ అఫ్ మెడ్రాస్, 1950.
పింగలాచార్య, ఛందఃశాస్త్రం, పరిమల్ పబ్లికేషన్స్, ఢిల్లీ, 1994.
నాగవర్మ, కన్నడ ఛందస్సు, సం. ఎఫ్. కిట్టెల్, బేసెల్ మిషన్ బుక్అండ్ ట్రాక్ట్ డెపాసిటరీ, మంగళూరు, 1875.
జెజ్జాల కృష్ణ మోహనరావు, ద్వికందగర్భిత క్రౌంచపదము – , క్రౌంచపదము – హరిగతిరగడ
వ్యాసనకెరె ప్రభంజనాచార్య, స్తోత్రమాలికా, శ్రీమన్మధ్వసిద్ధాంతోన్నాహినీ సభ, తిరుచానూరు, 1994.
మానవల్లి రామకృష్ణకవి, మానవల్లికవి రచనలు, సం. నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1972.
రావూరి దొరసామిశర్మ, తెలుగు భాషలో ఛందోరీతులు, వెల్డన్ ప్రెస్, మదరాసు, 1962.
కంకంటి పాపరాజు, ఉత్తరరామాయణము, 4.281, సీ. వీ. కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1957.
జయకీర్తి ఛందోనుశాసనం, జయదామన్, సం. హరి దామోదర్ వేళంకర్, హరితోషమాల, బాంబే, 1949.
జెజ్జాల కృష్ణ మోహనరావు, హంసపద
మతంగముని, బృహద్దేశి, పరిష్కర్త, ద్వారం భావనారాయణరావు, ద్వరం పబ్లికేషన్స్, విశాఖపట్టణము, 2001.
నిడుదవోలు వేంకటరావు, ఆంధ్ర కర్నాట సారస్వతములు, క్రాంతి ప్రెస్, మదరాసు, 1962.
----------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: