Saturday, December 14, 2019

వెడలెను కోదండపాణి


వెడలెను కోదండపాణిసాహితీమిత్రులారా!


ధగద్ధగాయమానమైన కిరీటం ధరించి మొహంలో వర్ఛస్సు తాండవమాడుతూంటే రావణుడు సభలో గర్వంగా చర్చిస్తున్నాడు తాను బ్రహ్మ ఇచ్చిన కోరికతో దాదాపు అమరుడైన సంగతి. తపస్సులో పది తలలూ అగ్నిలో ఆహుతి చేసి రావణుడు కోరుకున్న వరం – యక్ష, కిన్నర, కింపురుష, నాగ, గంధర్వ, దేవతలనుంచి మరణం ఉండకూడదు అని. సందేహంగా అడిగాడో మంత్రి రావణుణ్ణి:

“ఇంతమంది చేత మరణం లేకుండా వరం అడిగిన మహారాజు మానవుల గురించి అడగడం మర్చిపోయేరా? ఎందుకు వాళ్లని వదిలేసినట్టో?”

“మానవులు నాకు తృణప్రాయులు. అందుకే వాళ్ళని వదిలేశాను!”

“మరి ఆ మానవుల్లోంచే మనకి అపాయం వస్తే?”

“అదంత తలలు బద్దలు కొట్టుకునేంత విషయమా? ఇప్పటునుంచే మానవుడన్నవాడెవడు బాగా బలం పుంజుకోకుండా చేస్తే చాలదూ?” సమాధానం సేనాని ప్రహస్తుడు చెప్పేడు.

“మరి దానికి అనేక యుద్ధాలూ, జన నష్టాలూ…”

“జన నష్టాలు ఎలాగా జరుగుతూనే ఉంటాయి. యుద్ధం లేకపోతే వ్యాధులో, ప్రకృతి వైపరీత్యాలో వచ్చి జనం ఎప్పుడు చస్తూనే ఉంటారు కదా?”

“సరే. మనం ఇప్పుడు చేయవల్సిన కార్యం?”

“భూమండలం మీద ఉండే ఒక్కో రాజునూ ఓడించుకుంటూ పోవడమే. వేగుల్ని పంపించి ఎక్కడెక్కడ రాజులు బలం పుంజుకుంటున్నారో విచారించి ఎప్పటికప్పుడు వాళ్ళని అణిచేయడమే!”

“అలాగైతే మొదటి దండయాత్ర ఎక్కడ మొదలు పెడదాం?”

“ఇక్ష్వాకు రాజధాని అయోధ్య”

రాజ్యాలన్నీ జయించి విజయగర్వంతో తిరిగివచ్చిన రావణాసురుడు ముందున్న ప్రణాళికలు ఆలోచిస్తున్నాడు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా వినడం బట్టి బలం పుంజుకున్న ఏ రాజైనా సరే తలొంచి దేహీ అనకపోతే ప్రాణం తీయడమే. దిక్పాలకులని జయించిన తర్వాత పోనీ వరసకి అన్న అవుతాడు కదా అని కుబేరుణ్ణి చూసీ చూడకుండా వదిలేస్తే ఆయనే ఓ దూతని పంపించేడు తనకి సుభాషితాలు చెప్పించడానికి. ఎంత ధైర్యం? ఆ దూతని భక్షించి దండయాత్ర కెళ్ళేసరికి అంతటి ధనవంతుడూ తోకముడిచి పారిపోయేడు లంక లోంచి; పిరికిపంద. ఇప్పుడు సునాయాసంగా పుష్పకం, లంకానగరం చేతిలోకి వచ్చేయి. శత్రుశేషం మిగిలి ఉన్నంత వరకూ ఇలా చూస్తూ ఉండవల్సిందే. ఏ తరానికా తరాన్ని నాశనం చేయకపోతే ఏమో ఏ పుట్టలో ఏ పాము పుడుతుందో? గాలిలో, భూమ్మీద, ఇంట్లో, బయట, ప్రాణం ఉన్నదానితో గానీ లేనిదానితో గానీ చావు రాకూడదని కోరుకున్న హిరణ్యకశిపుణ్ణి ఆ పెద్దాయన ఎలా చంపేడో జగమెరిగిన సత్యం. ఎల్లకాలం అప్రపమత్తంగా ఉండవల్సిందే. అయినా ఇన్ని తరాల్లోనూ మానవమాత్రుడెవరూ తనముందు కత్తి ఎత్తలేకపోయేడు. వీళ్ళా నన్ను చంపేది? నవ్వొచ్చింది రావణుడికి. తాను కోరుకున్న కోరిక అద్భుతమైంది. బ్రహ్మ అమరత్వం ఇవ్వనంటే నేను సాధించుకోలే ననుకున్నట్టున్నాడు. అప్రయత్నంగా రావణుడి చేయి మీసం మీదకి పోయింది.

ఈ లోపుల ద్వారం దగ్గిర్నుంచి వినిపించిందో సేవకుడి కంఠం, “విభీషణులవారు మాట్లాడడానికి వచ్చారు. ఏమి శెలవు?”

“పంపించు.”

లోపలికొచ్చిన విభీషణుడు ఏమీ ఉపోద్ఘాతం లేకుండా చెప్పేడు. “అన్నా, ఇన్ని రోజులూ పుంజుకుంటున్న తర తరాల మానవులని చంపేం. మన రాజ్యం అప్రతిహతంగా సాగుతోంది. నయానో భయానో యక్ష, కిన్నర, కింపురుష, దేవతల్నీ జయించడం కూడా అయింది. ఇంక యుద్ధాలు మానడం మంచిదని నాకనిపిస్తోంది. మనకి లంకలో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి; చచ్చిన రాజుల ఉసురు ఊరికే పోదు కదా? ఇప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది…”

ఏదో చెప్పబోతున్న విభీషణుణ్ణి అడ్డుకుని అన్నాడు రావణుడు. “నేను బ్రహ్మని కోరిన అసలు వరం మృత్యువు రాకూడదనే. విరించి అలా వరం తీర్చడం కుదరదన్నప్పుడు ఈ మానవులని వదిలేసి మిగతా వాళ్ళచేతుల్లో చావకూడదని కోరుకున్నాను. ఈ గడ్డిపరకలన్నింటినీ ఎప్పటికప్పుడు ఏరి పారేస్తూంటే నాకు మృత్యువనేదే లేదు. వీళ్ళని ఏరిపారేయడం కోసం ఆ మధ్య కైలాసం పైకెత్తి శివుణ్ణి మెప్పించాను కదా? ఆయనిచ్చిన చంద్రహాసంతో…”

విభీషణుడు నమ్మలేనట్టు చూసేడు రావణుడి కేసి. నోరు పెగుల్చుకుని అన్నాడు “అన్నా, నువ్వు నిజంగానే అమరుడవని నమ్ముతున్నావా?”

“ఎందుకా సందేహం?”

“నువ్వు కైలాసం పైకెత్తినప్పుడు నందీశ్వరుడిచ్చిన శాపం మర్చిపోయాయావా?”

రాజభవనం కదిలిపోయేలాగ నవ్వేడు రావణుడు తన పేరుని సార్ధకం చేస్తూ. “యముణ్ణి జయించిన నేను – ఇంద్రుణ్ణి జయించిన మేఘనాదుడూ, కుంభకర్ణుడూ, నువ్వూ నాకు అండగా ఉండగా – కోతి మూకల మూలంగా చస్తానా? ఎవడో ఒక ఎద్దు మొహంగాడు ఏదో అంటే దాన్ని పట్టుకుని నాకు పిరికిమందు పోయకు విభీషణా!”

శివ శివా! చెవులు మూసుకున్నాడు విభీషణుడు. “నేను చెప్దామనుకున్న విషయం విను. ఎప్పుడో ఇక్ష్వాకు వంశంతో మొదలుపెట్టి ఇప్పటిదాకా ప్రతీ తరం రాజునీ అణుస్తూనే ఉన్నాం. ఇప్పుడు అక్కడే ఉన్న అయోధ్య రాజు అణరణ్యుడనేవాడు బలం పుంజుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది చెప్పడం నీ ఆంతరంగికుల్లో ఒకనిగా నా బాధ్యత. యుద్ధం వద్దు అని చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నువ్వు ఎంతమందిని ఎన్నిసార్లు అణిచినా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు కానీ ఈ పరిస్థితిలో నేను చెప్పేది నీకు నచ్చేటట్టు కనిపించదు, శెలవు.”

రావణుడి సమాధానం కోసం చూడకుండా బయటకి నడిచేడు విభీషణుడు చిన్న బోయిన మొహంతో.

పదిరోజుల్లో అయోధ్య మీద విరుచుకు పడింది రాక్షససేన. పిరికివాడిగా పారిపోకుండా ధనుస్సు చేతబట్టుకుని బాణాలు సంధించేడు అనరణ్యుడు. పదితలల రావణుడి ముందా ప్రతాపం? రావణుడు వేసిన అస్త్రాలలో తలకి ఎనిమిదివందల బాణాలు తగిలి నేలకొరిగిపోయేడు మహారాజు. కొస ప్రాణంతో ఉన్న రాజుని చూడ్డానికొచ్చేడు రావణుడు ఠీవిగా నడుచుకుంటూ. కళ్ళెత్తి రావణుడికేసి చూసేడు అనరణ్యుడు. మొదట కనబడిన దృశ్యంలో రావణుడు నవ్వే విషపు నవ్వు క్రమక్రమంగా ఏడుపులోకి మారుతోంది. ఏడుస్తూన్న రావణుడు నేలమీద పడి పొర్లుతున్నాడు. పక్కనే ఓ ఆజానుబాహువు కిందపడిన రావణుడి కేసి జాలిగా చూస్తున్నాడు. పరికించి చూస్తే మొహం బ్రహ్మ వర్ఛస్సుతో సూర్యుణ్ణి తలపిస్తున్న ఆ ఆజానుబాహువు, సూర్యవంశపు రాజే! తర్వాతి దృశ్యంలో విగతజీవుడైన రావణుడు యుద్ధభూమిలో పడిఉన్నప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారు ఆ ఆజానుబాహుడి మీద. ఏదో అర్ధమైనట్టూ, అనరణ్యుడు చెప్పేడు పైకి,

ఉత్పత్స్యతే కులే హ్యస్మిన్న్ ఇక్ష్వాకూణాం మహాత్మనాం
రాజా పరమతేజస్వీ యస్తే ప్రాణాన్ హరిష్యతి

“నీ ప్రాణాన్ని తీయడానికి త్వరలో ఓ మహాతేజస్వి నా కులంలో పుట్టబో….” ఈ మాటలు నోట్లోంచి వస్తూండగానే అనరణ్యుడి ప్రాణం అనంతవాయువుల్లో కల్సిపోయింది. ఎవరో ఛెళ్ళున చెంప మీద కొట్టినట్టూ రావణుడు కంగారు పడ్డాడు. వంధిమాగదులు చదివే స్తోత్రాలు కళ్ళు కప్పేసినా లంకకి రాగానే విభీషణుణ్ణి పిలిపించేడు మాట్లాడ్డానికి. అనరణ్యుడు ప్రాణం పోయే ముందు అన్న మాట చెప్పగానే విభీషణుడన్నాడు,

“అన్నా నందీశ్వరుడి శాపం మహత్తరమైంది. సందేహం లేదు. ఇప్పుడీ అనరణ్యుడు అన్న మాట చూస్తే ఈ మనుషులు ఎప్పటికప్పుడు బలం పుంజుకుంటున్నారనీ, మనుషుల్లోంచే నీ ప్రాణాంతకుడు పుట్టబోతున్నాడనేది తెలుస్తూనే ఉంది. ఇంతమంది ఉసురు మనకి అనవసరం. కాస్త ఆలోచించి చూడు. అనరణ్యుడు బలం పుంజుకుంటున్నాడని తెలుస్తోంది కానీ మనమీద యుద్ధానికి కాలు దువ్వలేదే?”

“విభీషణా, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఎలా?”

“దేనికీ అంత అప్రమత్తంగా ఉండడం?”

“రాబోయే చావుకి!”

“అది తప్పించగలవా?”

“మనుషులందర్నీ నా చెప్పుచేతల్లో పెట్టుకోగల్గితే, తప్పకుండా తప్పించుకోగలను.”

“ఎంతకాలం తప్పించుకోగలవు? ఎవరూ చంపలేకపోతే వ్యాధి రూపం లోనో, మరోవిధంగానో యముడు కాచుకుని కూర్చునుంటాడు కదా?”

“యముడా?” నవ్వేడు రావణుడు, “ఆయనకంత ధైర్యం ఉందా? నా చేతిలో ఓడిపోయేక నా కేసి చూడగలడా?”

“సరే, నీ ఇష్టం.” విభీషణుడికి ఒక్కసారి ఏదో స్ఫురించినట్లయింది.

“అన్నా, పుట్టిన ప్రతీ జీవి గిట్టక తప్పదనేది బ్రహ్మ వాక్కు. లేకపోతే ఆయన నువ్వడిగినప్పుడు అమరత్వం ఇచ్చి ఉండేవాడు కదా? నేను ఎంతచెప్పినా ఒకటే. నీ మీదకి దండయాత్రకి రాని మనుషుల మీద దాడి చేయడం అనవసరం. మానవమాత్రులు బలం పుంజుకుంటున్నారంటే వాళ్ళనో కంట కనిపెట్టడం మంచిదే కానీ ఇలా వార్త రాగానే ఏదో అత్యవసరం అన్నట్టు వాళ్లని చంపేసి రావడం ఎంతవరకూ సమంజసం? ఇది కూడా దాదాపు ఇష్టం లేని స్త్రీని బలాత్కరించడం వంటిదే. ఓ వేదవతి శాపం, రంభ ఇచ్చిన శాపం, కామధేనువు బిడ్డడైన నందీశ్వరుడి శాపం, ఇప్పుడు అనరణ్యుడు చెప్పిన వాక్కూ అవన్నీ ఒక్కసారిగా కలబడి మీద పడితే అప్పుడు చేసేదేమీ ఉండదు కదా? నువ్వు జగత్సంహారకుడైన శివుణ్ణి మెప్పించిన పులస్త్య బ్రహ్మ వంశ సంజాతుడివి. ఇంతటి నీచానికి దిగజారవల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలోచించి చూడు.”

“నువ్వెన్ని చెప్పు విభీషణా, నేను ఈ మనుషులని అదుపులో ఉంచవల్సిందే.”

విభీషణుడు చెప్పేది మొదట్లో కాస్త విన్నట్టు అనిపించినా చావు గుర్తొచ్చేసరికి రావణుడు లేచిపోయేడు. విభీషణుడు నిట్టూర్చేడు.

కుటీరం బయట చెట్టునీడలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు విశ్వామిత్రుడు. కొద్దిరోజుల క్రితం తాను చేయబోయిన యాగం గుర్తొచ్చింది. యాగం మొదలయేలోపుల అగ్ని ఆరిపోయేది. సమిధలు మాయమై వాటి స్థానే ఎముకలు కనిపించేవి. ఈ పనులన్నీ మారీచ సుబాహులవే. వీళ్ళకి తోడు ఆ తల్లి తాటకి ఒకత్తె. ఈ కుర్ర కుంకల్ని చంపడం పెద్ద పని కాదు కానీ ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి తన శతృవు చేత బ్రహ్మర్షి అనిపించుకున్న తనకి యాగం చేసే సమయంలో కోపం రాకూడదు. అయినా ఈ రాక్షసులకి ఇంతబలం రావడానిక్కారణం వీళ్ళ పైనున్న దశకంఠుడిది. వాడి అండ చూసుకునే కదూ పేట్రేగిపోతున్నారు. ఏదో ఒకనాడు తనకి కోపం తెప్పించి ఎలాగోలా యుద్ధానికి రప్పించడానికి పది తలలతో విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వీడి చావు ఎవరి చేతుల్లో ఉందో? ఈ యాగం ప్రస్తుతానికి ఆపి ఏదో ఒకటి ఆలోచించాలి…

బిగ్గరగా ఏడుస్తున్న ఓ స్త్రీ కంఠం వినిపించి కళ్ళు తెరిచి చూసేడు మహర్షి. నడుము వంగిపోయి చింపిరి జుట్టుతో నేలమీద పడి పొర్లుతూ ఏడుస్తోందో స్త్రీ.

“ఏమమ్మా? ఏమైంది?” అడిగేడు ఆతృతతో.

ఏడుపు ఆపి ఆవిడ చెప్పిన కధ అంతా విన్నాడు. కోపంతో మొహం జేవురించింది. జరగబోయేది చూడడానికా అన్నట్టు ఒక్క క్షణం ధ్యానంలో కళ్ళు మూసుకున్నాడు.

“విచారించకు. నువ్వు అయోధ్యకి వెళ్ళి అక్కడున్న ఇక్ష్వాకు మహారాజు దశరధుడితో నేను నిన్ను ఆశ్రయం కోసం పంపించాననీ, రాబోయే రోజుల్లో వచ్చి కలుసుకుంటాననీ చెప్పు. నీకీ గతి పట్టించినవాణ్ణి సర్వనాశనం చేయడానికీ నీచేత్తోటే బీజం వేద్దువు గాని. ఆలశ్యం చేయకుండా బయల్దేరు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఈ విశ్వామిత్రుడి మాట జరిగి తీరుతుందని గుర్తు పెట్టుకో.”

ఆవిడటు వెళ్ళగానే కళ్ళుమూసుకున్నాడు విశ్వామిత్రుడు. ఈ సారి మనసుని దొలిచే ప్రశ్న ఒకటే. ఈ రావణుడి చావు ఎవరిచేతిలో రాసిపెట్టి ఉందో? ధ్యానంలో ఖంగు ఖంగుమని మోగే ధనుష్టాంకారం వినిపిస్తోంది. పినాకపాణిదా? మరి పరమ శివుడు రావణుడికి చంద్రహాసం ఇచ్చినట్టు విన్నాడే? కొద్ది క్షణాల్లో ఆ ధ్వని ఎవరిదో తెలిసింది. సుదర్శనమూ, నందకమూ ఎప్పటికప్పుడు స్వామి అడగకుండానే సిద్ధంగా ఉంటాయి కనక శార్గ్య ధనువుకి ఇప్పటిదాకా ఏం చేయడానికీ అవకాశం రాలేదు. ఇప్పుడు ధనువుదే అవకాశం. అదన్నమాట ధ్వని. మరి ఇంతటి రాక్షస కులాన్ని నిర్మూలించడానికి, ఎక్కడో మూలనున్న రావణుణ్ణి ఆ స్వామి ఎలా చేరతాడో? శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించవద్దూ? అయినా ఇంత ఆలోచన దేనికీ? తన పని ఏమిటో తెల్సింది కదా? తను సాధించిన శస్త్రాస్త్ర సంపదంతా ఆయన ధారాదత్తం చేస్తే చాలు. సాగర లంఘనం, రావణ సంహారం అవన్నీ ఆయనే చూసుకోడూ? సాగర లంఘనం ఓ పెద్ద పనా? ఏ కోతైనా దూకగలదు కావాల్సివచ్చినప్పుడు.

కిచకిచ చప్పుళ్లకి ధ్యానభంగమై కళ్ళు తెరిచేడు. ఎప్పుడొచ్చాయో చెట్టుమీద కోతులన్నీ దిగి చుట్టూరా కూర్చొనున్నాయి. ఇదన్నమాట అసలు రహస్యం. వీటితోటే ఆయన కావాల్సిందీ, చేతనైనదీ చేస్తాడు. తనపని తాను చేయడమే. లేచి కుటీరం లోకి వెళ్ళి ఉన్న పళ్ళు అన్నీ తెచ్చి కోతుల గుంపు ముందు పెట్టేడు తినడానికి.

“మహారాజు మీ కోసం ఒక కొత్త దాసిని పంపించారు, లోపలకి పంపమన్నారా?” కైకని అడిగింది ద్వారం దగ్గిర మనిషి.

“ఇదెప్పట్నుంచి? నా దాసీలని నేను చూసుకోలేనా? సరే పంపించు.”

“ఏమిలా వచ్చావ్?” లోపలికొచ్చిన గూని మనిషిని చూసి కొంత జాలితో అడిగింది కైక.

“నా కుటుంబం అంతా సర్వ నాశనం అయింది తల్లీ. దిక్కులేక కడుపుచేత్తో పట్టుకుని విశ్వామిత్రుల వారి ఆశ్రమానికి వెళ్తే, రాజు గారి దగ్గిరకి వెళ్ళమనీ మీరు ఆశ్రయం ఇస్తారనీ చెప్తే ఇలా వచ్చాను.”

“నీ పేరు?”

“మంధర.”

“నీ కుటుంబానికి ఏమైంది?”

మంధర తన కధ చెప్పడం మొదలుపెట్టింది. “మేము రాజ కుటుంబీకులమే. ఓ రోజు చెప్పా పెట్టకుండా యుద్ధం అన్నారు. దాడి చేసేది ఎవరో, ఎందుకో అవన్నీ తెలియవు. ఇంట్లోంచి బయటకొచ్చే వీలు లేదు. మహారాజు ధనుర్బాణాలు పూని బయటకెళ్ళిన మూడు గంటల్లో పంచత్వం పొందారని వినికిడి. యుద్ధం నెగ్గిన వాడు రావణుడనే రాక్షసుడనీ ఎక్కడో దక్షిణంగా ఉన్న లంకానగరంలో ఉంటాడనీ చెప్పుకున్నారు. ఆ తర్వాత రెండురోజుల్లో మా రాజ్యంలో ఇళ్ళన్నీ వెదికి వెదికి మరీ రాజ కుటుంబీకులని చంపేశారు. ఆడా లేదు మగా లేదు కనిపించిన ప్రతీ ప్రాణాన్నీ తీయడమే. నేను పారిపోయి దాక్కున్నాను కనిపించకుండా. మొత్తం రాజ్యం అంతా నాశనం చేసి ఇళ్ళన్నీ తగలబెట్టేశారు. అవన్నీ అంటుకుపోతూంటే వాటి మధ్యలో ఈ రాక్షసులందరూ వికృతంగా పైశాచికానందంతో నాట్యం చేయడం! బయటకి వచ్చి చూస్తున్న నన్ను కూడా చంపడానికొచ్చేరు మీదకి. కాళ్ళావేళ్ళా పడి బతిమాలాను నన్ను వదిలేయమని. ఎందుకో కనికరించి వదిలేసినా చివరగా వెళ్ళిపోయేటప్పుడు నన్నో నాలుగు తన్నులు తన్ని గుర్రంతో తొక్కించి వెళ్ళేరు. ఆ గాయం మానేసరికి నేను గూనిదానిలా తయారయ్యేను. ఎక్కడికెళ్ళాలో తెలియని పరిస్థితి. అష్టకష్టాలు పడి విశ్వామిత్రులవారి ఆశ్రమానికి చేరాను. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు నా ఖర్మకి? మహారాజు దగ్గిరకి వెళ్ళమని పంపించేరు. చూశావుటమ్మా? నేను ఒక్కత్తినీ అసలు ఎందుకు బతకాలో? ఎవరి కోసం?…” దుఃఖంతో ఇంక నోట మాట రాక చెప్పడం ఆపింది మంధర.

మౌనంగా ఉన్న కైక నోరు తెరిచింది. “మంధరా, ఇప్పుడు నువ్వు వచ్చినది రఘువంశ మహారాజు దశరధుడి దగ్గిరకి. రఘువెటువంటివాడో, సూర్యవంశం ఎటువంటిదో నీకు తెలియకపోవచ్చు. నిన్ను ఇక్కడకి విశ్వామిత్రులవారు పంపించారంటే అందులో మనకి తెలియని నిగూఢ రహస్యం ఏదో ఉందన్న మాట. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ రాజభవనం నీ ఇల్లే అనుకో. నీ చేతనైన సహాయం చేస్తూండు. మా పూర్వీకులని కూడా రావణుడు చంపాడని నేను విన్నాను. ఏదో ఒకరోజు వాడికి ఆయుర్దాయం తీరిపోతుంది.”

ఏళ్ళు గడుస్తున్నాయి. మంధర కిప్పుడు కూటికీ గుడ్డకీ లోటులేదు కానీ నా అన్నవాడెవడూ లేడు. ఒంటరి బతుకెంత దుర్భరమో అనుభవించేవారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మంధర ఆలోచించేది: కారణం లేకుండా తన వంశాన్ని నిర్మూలించిన దశకంఠుడి మీద పగ చల్లారేలా లేదు. ఎక్కడి లంకా నగరం? ఎక్కడి రావణుడూ? తన పగ ఎప్పటికి చల్లారేను? కాలం గాయాల్ని మాన్పుతుందా? మరి తన పోయేలోపుల రావణుడి చావువార్త తనకి చేరేదెలా? పిల్లలు లేరని మహారాజు చేసిన పుత్రకామేష్టి తర్వాత పుట్టిన నలుగురి పిల్లలతోటీ ఈ రాణులకి సరిపోతోంది సమయం అంతా. ఎంత అణుచుకుందామన్నా తగ్గని కోపం ముందు తననే చంపేసేలా ఉంది. రావణుడికేం? ఎన్ని రాజ్యాలు తగలబెట్టినా వాడి బతుకు బ్రహ్మాండంగానే ఉంది. ఇదేనా ధర్మం? సరే రేపు ఎలాగా విశ్వామిత్రులవారు అయోధ్య వస్తున్నట్టు వార్త వచ్చింది. నన్ను ఇక్కడకి పంపించింది ఎందుకో ఆయన్నే అడుగుదాం. అంతటి మహర్షి మాట వ్యర్ధమౌతుందా?

మర్నాడు మహారాజును కల్సుకోవడానికి విశ్వామిత్రుడు బయల్దేరుతూంటే ఎదురొచ్చింది మంధర. చిరునవ్వుతో పలకరించేడు మహర్షి. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాక అంది మంధర, “ఎన్నాళ్ళిలా బతుకు ఈడవమంటారు? నా బతుక్కో గమ్యం లేనట్టుంది. నేను బతికి ఏం ప్రయోజనం? మమ్మల్ని సర్వనాశనం చేసిన వాడు బాగానే ఉన్నాడు.”

“మంధరా, నేను చెప్పినది అక్షరం కూడా పొల్లుపోదు. ఇప్పుడు నేను వచ్చింది మహారాజు కొడుకులకి అస్త్రవిద్య అంతా నేర్పడానికే. ఇవి నేర్చుకున్న వాళ్ళే రావణుణ్ణి చంపడానికి అర్హులు. ఈ అస్త్ర సంపద ఇవ్వడం వరకే నా బాధ్యత. మరి తర్వాత, ఈ రాజు కొండలూ, కోనలూ, అడవులూ, నదీ నదాలు దాటుకుంటూ ఎలా ఎక్కడికి రావణుణ్ణి వెతుక్కుంటూ వెళ్తారనే దానితోటి నాకు సంబంధం లేదు. నేను నా బాధ్యత తీర్చుకోవడానికొచ్చాను. ఇది అయ్యాక మిగిలిన విషయాల్లో ఎవరి పని వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి నేనేం చేయాలి అని నన్ను అడక్కు. నువ్వేం చేయాలో కాలమే చెప్తుంది. సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నా, అది నిన్ను కాళ్ల మీద నిలబెట్టి బలవంతగా ఆ పని చేయిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు.” మహర్షి ముందుకి సాగిపోయేడు పన్నెండేళ్ళ కుర్రాళ్ళని భవిష్యత్తులో అసమాన ధనుర్వేత్తలుగా చేయడానికీ, మొదట్లో కొంచెం బెంగపడినా ఇక్ష్వాకు రాజులు ఇచ్చినమాట ఎలా నిలబెట్టుకుంటారో ప్రపంచానికి చూపించడానికీను.

మంధరకి ఒక్కసారి చిక్కుముడి వీడిపోతున్నట్టనిపించింది. ఇదా సంగతీ? ఈ నలుగురు పిల్లల్లో ఎవరో ఒకరు రావణుణ్ణి చంపుతారన్నమాట. హమ్మయ్యా, ఇన్నేళ్లకి నా కష్టాలు పోయే రోజు దగ్గిర్లోనే ఉందా? చూద్దాం ఈ నలుగురి పిల్లల్లో ఎవరికి అర్హత ఉందో ఈ ఋషి ఇచ్చే ధనుర్విద్య నేర్చుకునే తాహతూ అదీని. ఓ సారి ధనుర్విద్య నేర్చుకునేవాడెవడో తెలిస్తే తర్వాత జరగబోయేది ఆలోచించవచ్చు.

సాయంకాలానికి వార్త తెలియనే తెల్సింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులని కూడా పంపమంటే దశరధుడు వాళ్ళు చిన్నపిల్లలనీ, వాళ్లని వదిలేయమనీ, కావలిస్తే తాను వస్తాడనీ బతిమాలినా వశిష్టులవారి ప్రోద్బలంతో ఒప్పుకున్నాడు. మంధర మొహంలో కనిపించిన చిరునవ్వు క్రమంగా పెద్దదైంది. కుర్రాళ్ళని పంపించమంటే నేను వస్తాను, వీళ్లని వదిలేయండి అన్నాట్ట. ఈ ముసలి రాజేం చేయగలడు రావణుణ్ణి? ఈయనకేమైనా చేతనైందా? పుత్రకామేష్టిలో బయటకొచ్చిన యజ్ఞ పురుషుడు పాయసం ఇచ్చింది ఇందుకేనన్న మాట. ఆ పాయసంలో ఎక్కువ భాగం కౌసల్యకి ఇచ్చ్చినప్పుడు రాజుగారికి ఆవిడంటే మహా ప్రేమ అని అందరూ అనుకోలేదూ? ఇప్పుడర్ధమౌతోంది. అధికభాగం పాయసం తీసుకున్న కౌసల్య కొడుకేనా రావణుణ్ణి చంపబోయేది? అన్నం తినకుండా చందమామ కావాలని పేచీ పెడితే అద్దం చూపించి రామచంద్రుడనీ, మంత్రి భద్రుడు ఎత్తుకున్నప్పుడు రామభద్రుడనీ పిలిపించుకున్న ఈ నీలమేఘశ్యాముడే, రావణుడంతటివాణ్ణి చంపేదీ? మనసు తేలికైంది మంధరకి. ఇంక చూద్దాం ఇప్పుడు ఈ కుర్రాళ్ళు గానీ ఏదో విధంగా, రావణుడితో యుద్ధానికెళ్ళారా? అప్పుడు విశ్వామిత్రుల వారివ్వబోయే అస్త్రాలతో వాణ్ణి చంపడం ఖాయం. అంతట్లోనే మరో సందేహం. మీసం కూడా రాని పాల బుగ్గల పన్నెండేళ్ళ కుర్రాళ్ళు రావణాసురుడంతటివాడి మాయలు ఎదుర్కోగలరా?

తర్వాత మూడు నెలల్లో జరిగిన ఎన్నో అద్భుతాలు ఒక్కొక్కటీ మంధరకి తెలిసొచ్చాయి. తాటకిని చంపి మొదట అస్త్ర విద్య నేర్చుకున్నది రాముడు. రాముడి వెంటే నీడలా ఉండే తమ్ముడికి ఆ తర్వాత. దుమ్మూ ధూళీలో రాయిలా పడి ఉన్న అహల్య రామ పాదం సోకి మామూలు మనిషైంది. మహామహులైన రాజులెవ్వరూ ఒక్క అంగుళం కూడా ఎత్తలేని శివధనుస్సుని రాముడు అవలీలగా పైకెత్తి నారి సంధించబోయేసరికి మిన్ను విరిగి మీదపడ్డట్టూ ముక్క ముక్కలైంది. ఆ తర్వాత మిథిలా నగరంలో జరిగిన కళ్యాణంలో, జానక్యాః కమలామలాంజలి పుటేః యాః పద్మరాగాయితః అనే విశేషం ప్రతీనోటా విన్నదే. అయోధ్యకు వస్తుంటే అడ్డొచ్చిన పరశురాముడంతటివాణ్ణి ఈ కుర్రాడు నిలువరించాడు. అసలు ఇంతకాలం రాముడు ఇంట్లో ఉండిపోబట్టే ఇవన్నీ జరగలేదు కాబోలు. ఈ అద్భుతాలన్నీ జరగడానికి రాముణ్ణి పంపించమంటే జరగక్కుండా ముసలి రాజుగారు అడ్డుకోబోయేడు. దీనికన్నా విచిత్రమేమిటంటే ముందు, మా పిల్లల్ని పంపలేను బాబోయ్! అని నెత్తీ నోరూ కొట్టుకున్న ఆ ముసలి రాజే మనసు కష్టపెట్టుకుంటూనో మరో విధంగానో ఋషి కూడా పంపించేడు. ఇదే కాబోలు కర్మ ఫలం అనుభవించడమంటే. మహర్షి చెప్పినట్టూ నేను ఈ పని చేయను అనేవాడే కర్మ పరిపాకం కాగానే చేయనన్న ఆ పనే చేసి తీరుతాడు కాబోలు.

వినయమునను కౌశికునివెంట జని నాంఘ్రులను జూచేదెన్నటికో, అందువెనక రాతిని నాతిజేసిన చరణములను జూచేదెన్నటికో, చనువున సీతను బొట్టుగట్టిన కరమును జూచేదెన్నటికో, మున భృగుసుతుచాపబలమందుకున్న బాహువు జూచేదెన్నటికో అనుకుంటూ ఈ రాముణ్ణి చూడకుండా ముగ్గురు రాణులూ, తానూ ఈ మూడు నెలలూ ఎలా బతికారో? ఇంతకన్నా విశేషాలేం కావాలి? రాముడే తన కక్ష తీర్చగలవాడు. ఇప్పటి నుంచి ఇంక ఆలోచించవల్సింది ఈ రాముణ్ణి ఎలా రావణుడితో యుద్ధానికి ఉసిగొలపాలనేదే. అయ్యో, ఈ యుద్ధం కాని ఏదో విధంగా వస్తే పాపం ఇప్పుడే అత్తవారింటికొచ్చిన కొత్త పెళ్ళికూతురు ఎలా ఓర్చుకుంటుందో? ఏదైనా తాను కొన్నాళ్ళు ఆగి మహర్షి చెప్పినట్టూ వేచి చూట్టం తప్ప మరేం చేయలేదు. అయినా ఏ కారణం పెట్టి రాముణ్ణి యుద్దానికి పురికొలపడం? రావణుడు ఎక్కడుంటాడో, వాణ్ణి చంపడానికెన్నాళ్లు పడుతుందో? చూస్తూ చూస్తూ తన స్వహస్తాలతో ఎత్తుకుని ఆడించిన ఈ చంటిబిడ్డని కైలాసం ఎత్తి శివుడి దగ్గిర్నుంచి మహత్తరమైన ఖడ్గం సంపాదించిన ఆ రావణుడి మీదకి పంపడానికి చేతులెలా వస్తాయి తనకి? ఒక్కసారి మనసంతా పాడైపోయింది మంధరకి.

రాత్రి నిద్రలో కల. ఒకప్పుడు తమ రాజ్యం మీదకి దండెత్తుకొచ్చినట్టే అయోధ్య మీదకి రావణుడు దండయాత్ర కొచ్చేడు. కారణం ఏమీ లేదు. ముసలి రాజు గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చుంటే రాముడు ధనుస్సు తీసి బాణం సంధించేడు. ఆ బాణం వింటిని దాటకుండానే రావణుడు విసిరిన ఖడ్గంతో రాముడి తల తెగి కిందపడింది. రక్తం ఓడుతున్న యుద్ధభూమిలో ఈ ముగ్గురు రాణులూ జుట్టు విరబోసుకు ఏడుస్తూంటే, ఇంకా యవ్వనం రాని పసిపిల్ల జానకికి ఏం చేయాలో, ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. చటుక్కున మెలుకువ వచ్చింది మంధరకి. ఛీ, ఎంత పీడ కల? రామ రామ, రామ రామ రక్తవర్ణం, రామ రామ, రామ రామ రాక్షసాంతకం. నా కక్ష తీరక రావణాసురుడు చావకపోయినా నాకొచ్చిన ఈ కల నిజం అవకుండు గాక. జీవితంలో నాకొచ్చిన కష్టాలు ఈ అయోధ్య ప్రజలకి రాకుండు గాక. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మంధరకి నిద్ర కరువైంది.

మనశ్శాంతి కోసం మరోసారి విశ్వామిత్రుణ్ణి చూడడానికి బయల్దేరింది. చుట్టూరా ఉన్న ఆయన శిష్యులతో కూర్చునుండగా నారదుడొచ్చేడు. కుశలప్రశ్నలయ్యేక అడిగేడు “మహర్షీ, మీరిచ్చిన అస్త్రాలన్నింటితో రాముడు రావణుణ్ణి చంపడానికి వెళ్తాడనుకుంటూంటే ఇక్కడ ఆ కుర్రాడు కళ్యాణం చేసుకుని సంసారం మొదలు పెట్టబోతున్నాడా? మరి ఈయన సంసారంలో పడితే ఈ దండకారణ్యంలో రాక్షసులూ ఆ మూలనున్న రావణుడూ చచ్చేదెలా? ఎంతకాలం ఈ నవగ్రహాలన్నీ వాడి మాట వింటూ ఉండాలి? పూర్ణచంద్రుడి తర్వాత అమావాస్య దాని తర్వాత మళ్ళీ చంద్రోదయం రావాలి కదా?”

“ఎందుకంత ఆదుర్దా నారదా? ఏదో విధంగా రాముడు కనక జనస్థానం దాకా వెళ్ళాడా, అక్కడున్న రాక్షసులు ఇతని మీద పడడం ఖాయం. అక్కడ్నుంచి ఒక్కొక్కటీ అవే గొలుసులా రావణుడి దగ్గిరకి దారి చేసుకుంటూ పోతాయి.”

“నారాయణ, నారాయణ. మరి సృష్టికి ప్రతిసృష్టి చేసిన మీ అంతటి మహామహులే వెళ్ళి రాముణ్ణి కూడా పంపమంటే కడుపూ కాళ్ళూ కొట్టుకున్న దశరధుడు రాముణ్ణి ప్రతీ అంగుళం కౄర రాక్షసులతో నిండి ఉన్న జనస్థానం దాకా వెళ్లనిస్తాడా? నేను కూడా వస్తా అనడూ?”

“అనొచ్చు, అనకపోవచ్చు. కూడా దశరధుడు జనస్థానం దాకా వెళ్లినా వెళ్ళకపోయినా రాముడు వెళ్ళవల్సిందే.”

“మరి రాముణ్ణి అయోధ్యలోంచి బయటకి రప్పించడం ఎలా?”

“ఎవరో ఏదో విధంగా చేయాలి తప్పదు.” విశ్వామిత్రుడీమాట అంటూ ఓరగా మంధర కేసి చూసేడు. మంధర వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. వడివడిగా లేచి ఇంటికొచ్చిందన్నమాటే గానీ చాలా రోజులదాకా మహర్షి చూసిన చూపు మంధరని రాముడు సంధించిన వెనుతిరగని బ్రహ్మాస్త్రంలా వెంటాడుతూనే ఉంది.

కాలం గడిచి రాముడిప్పుడు ఇరవై అయిదేళ్ళ వాడయ్యేడు. మంధర జోల పాట పాడుతూంటే నిద్రలోకి జారుకున్న ఒకప్పటి పాల బుగ్గల కుర్రాడిప్పుడు నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, మహాశుగంబులున్ విల్లును దాల్చు వాడు, గడు విప్పగు వక్షము వాడు, మేలు పై జల్లెడు వాడు, నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులన్ జల్లెడు వాడు. రాముడెలా ఉన్నా, మంధర బతుకు మాత్రం ఇలా కొట్టుమిట్టాడుతూండగానే ఓ రోజు పిడుగులాంటి వార్త. మహారాజు విశ్రాంతి కోరుకుంటూ రాముణ్ణి రాజుగా అభిషేకించబోతున్నాడు. ఓ విధంగా ధర్మమూర్తి అయిన రాముడు రాజైతే ప్రజలందరికీ మంచిదే. మరి ఇక్కడ రాముడికి శస్త్రవిద్యంతా పట్టుబడిందనీ, రాజౌతున్నాడనీ తెలిస్తే రావణాసురుడు యుద్ధం ప్రకటించడూ? కైకమ్మ చెప్పడం ప్రకారం అనరణ్యుడి తోటీ, మాంధాత తోటీ ఈ రావణుడు యుద్ధాలు చేయలేదా? వాళ్ళని ఓడించలేదా? తమ రాజ్యంలాగే అయోధ్య, ఇక్ష్వాకు వంశం కూడా సర్వ నాశనం అవబోతున్నాయా? మరి రాముడు ఇక్కడ రాజ్యం ఏలుతూ కూర్చుంటే రావణుణ్ణి చంపేదెప్పుడూ? పరధ్యానంగా నడుస్తూ కైక మందిరం లోకి వచ్చింది మంధర.

“మంధరా ఇది విన్నావుటే, రాముడు మహరాజు కాబోతున్నాడు!” సంతోషంగా అడుగుతోంది కైక. చూడబోతే కైక కాళ్ళు నేలమీద ఆనుతున్నట్టు లేదు. ఆవిడ సంతోషం ఆవిడది.

“విన్నానమ్మా, నాకూ సంతోషమే.”

“అలా నీరసంగా అంటావేమే?”

“నా కుటుంబం గుర్తొచ్చి అలా అనిపించింది. ఏమనుకోకమ్మా.”

“అవునా? పోనీలే, ఎందుకంతగా గుర్తు తెచ్చుకోవడం ఆ పాత విషయాలు?”

“ఓ సారి రాముడు రాజైతే మళ్ళీ అకారణంగా రావణాసురుడొచ్చి యుద్ధం ప్రకటిస్తాడేమో, ఈ అయోధ్య కూడా మా రాజ్యం లాగానే సర్వనాశనం అవుతుందేమో అనే భయం నన్ను నిద్ర పోనీయట్లేదమ్మా.”

కైక ఒక్కసారి ఆలోచనలో పడింది. మంధర చెప్పింది నిజమే. పాతికేళ్ళ రాముడు యుద్ధాల్లో చేయి తిరిగిన రావణుడి ముందు నించోగలడా? కైకకి ఒక్కసారి రాముడు విశ్వామిత్రుడి దగ్గిర శస్త్రాస్త్రాలు సంపాదించడం, శివధనుస్సు ఎక్కుపెట్టడం గుర్తొచ్చాయి.

“అవన్నీ ఆలోచించకు మంధరా, రాముడి దగ్గిర దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా?”

తనకి వచ్చే పీడకలల్లో రాముడు రావణుడిచేతిలో ఎలా ఓడిపోయాడో, రాముడు వేసే అస్త్రాలన్నీ ఎలా పనికిరాకుండా పోయాయో రాముడు పోయాక ముగ్గురు రాణూలూ ఎలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారో అన్నీ విపులంగా చెప్పి అంది మంధర,

“ఏమోనమ్మా, రావణుడు మమ్మల్ని వంశాంకురం అనేది లేకుండా నాశనం చేశాడు. ఇక్కడేం జరుగుతుందో ఏం చెప్పగలం?”

“మరి ఇప్పుడు ఏమిచేద్దాం?”

“నాదగ్గిర చిన్న ఉపాయం ఉంది మరి మీకు నచ్చుతుందో లేదో?”

“చెప్పు చూద్దాం?”

“వద్దులెండి. అది మీకూ నాకూ మంచిది కాదు.”

“అదేం?”

“మీరూ మీ ఇద్దరి సవతులూ రాముడు లేకుండా బతకలేరనే మాట అందరికీ తెల్సిందే కదా? ఇంక మహారాజు రోజూ రాముడి మొహం చూడకపోతే ప్రాణంతో ఉండలేరు. రాముని తమ్ముళ్ళ సంగతి చెప్పేదేముంది? నేను చెప్పేది ఏమో ఎటు తిరిగి ఎటు వస్తుందో? వద్దులెండి.”

“మరి ఈ గండం గడవడం ఎలా? చెప్పు చూద్దాం అసలు.”

“సరే అయితే, మరో మాట. ఇలా చెప్పినందుకు నా మీద కోపం తెచ్చుకోనని మాట ఇస్తేనే చెప్తాను.”

“సరే”

“రాముణ్ణి ఏదో విధంగా అడవుల్లోకి పంపించగల్గితే అక్కడ్నుంచి ఒక్కో రాక్షసుణ్ణీ చంపుకుంటూ చివరకి రావణుణ్ణి చంపడం కుదురుతుందని విశ్వామిత్రులవారు అనడం విన్నాను.”

“ఎన్ని రోజులు వెళ్ళాలి అడవుల్లోకి?”

“ఏమో, రెండు మూడు రోజులు సరిపోవు కదా? జనస్థానం నుంచి దండకారణ్యం దాకా నేల ఈనినట్టు కాచుకుని ఉన్నారు రావణ సేన. ఎన్ని వేలమంది ఉన్నారో ఎవరికెరుక? మరో మాట కైకమ్మా, రాముడు ఒంటరిగా వెళ్తేనే మంచిది అడవుల్లోకి. మళ్ళీ మందీ మార్బలంతో వెళ్తే, ఈ వార్త రావణుడికి చేరిందా వాడే వచ్చి యుద్ధం ఆరంభించవచ్చు. అనవసరపు జనక్షయం. మనలో రాముడు తప్ప మహారాజుతో సహా మిగతావారంతా తోక ముడిచే వీరులనే సంగతి మీకూ తెలుసు కదా?”

“ఒక్కడూనా?” కైక ఆశ్చర్యపోయింది.

“అవునమ్మా అలా వెళ్తేనే యుద్ధ ధర్మం ప్రకారం రావణుడు ఒక్కడూ వస్తాడు యుద్ధానికి. ప్రజలందర్నీ చావకుండా రక్షించవచ్చు. ఇంతకుముందు మా రాజ్యంలో జరిగిన మారణకాండ గుర్తు పెట్టుకుని చెప్తున్నాను. ఒక్కడి కోసం రాజ్యంలో ప్రజలనందర్నీ పణంగా పెట్టడం దేనికీ?”

“మరి రాముడు ఒక్కడూ రావణుణ్ణి ఎదుర్కోగలడా?”

“మీరే చెప్పారు కదా? ధనుర్విద్యలో రాముడంతటివాడు లేడనీ? ఇంకా సందేహిస్తున్నారేం? విశ్వామిత్రుడంతటి ఋషి ఇచ్చిన అస్త్రాలు అత్యంత శక్తివంతమైనవి కాదూ? రాముడు ధనుష్టాంకారం చేసి యుద్ధంలో నిలబడితే ఎవరమ్మా ఎదురు నిలవగలిగేది?”

కాసేపు మౌనం తర్వాత సాలోచనగా అంది కైక “పధ్నాలుగు రోజులు నేను రాముణ్ణి చూడకుండా ఉండగల్ను. పూర్వం విశ్వామిత్రుడికి దగ్గిరకి పంపినట్టే ఈసారి కూడా రాముణ్ణి అడవుల్లోకి పంపమని మహారాజునీ ఒప్పించగలననుకో. కౌసల్యనీ, సుమిత్రనీ కూడా ఎలాగోలా ఒప్పించగలను కూడా. అంతవరకూ అయితే సరే. ఆ పైన నగుమోము కలవాని నా మనోహరుని, జగమేలు శూరిని జానకీ వరుని, సుజ్ఞాన నిధిని సూర్యలోచనుని చూడకుండా కుదరదు మరి. ఏం చేద్దాం?”

“పధ్నాలుగురోజుల్లో ఏమౌతుందో?” తన ఆలోచన పైకే అంది మంధర.

“మంధరా, ఇంతకన్నా నేను నీకేమీ చేయలేను. కావాలిస్తే చెప్పు. పధ్నాలుగు రోజులు. అంతే.”

మంధర ఆలోచించింది ఒక్క క్షణం. విశ్వామిత్రుడు తనకేసి చూసిన చూపులూ, తన చేత రావణ సంహరానికి బీజం వేయిస్తానని చెప్పడం అన్నీ గుర్తొచ్చాయి. ఇదే తనకి ఉన్న ఒకే ఒక అవకాశం. ముందు రాముడు అడవుల్లో కి వెళ్తే అప్పుడు చూసుకుందాం. అసలు రాముడు ఎక్కడికీ వెళ్లకుండా అయోధ్యలో పిల్లా పాపల్తో సంసారం చేయడం కంటే పధ్నాలుగు రోజులు వెళ్ళడమే మంచిది. ఇక్కడ సంసారం చేస్తూ కూచుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ రావణుడొచ్చి అయోధ్యని తగలబెడతాడు. అప్పుడు మొత్తం రాజ్యం నాశనం అవడం ఖాయం, “సరే మీ ఇష్టం, కానీ అడవుల్లోకి పంపడానికి కారణం ఏం చెప్తారు?” అడిగింది కైకని.

“నువ్వే చెప్పు, ఎలా అడగాలో మహారాజుని.”

“ఆ మధ్య మీకు మహారాజు రెండు వరాలిచ్చారని అన్నారు కదా? అవి ఇప్పుడు అడగండి. మొదటిది రాముడు పధ్నాలుగు రోజులు అడవిలోకి, రెండోది ఈ పధ్నాలుగు రోజులూ భరతుడు రాజు అయ్యేటట్టూ.”

“భరతుడా? లక్ష్మణుడుండగా భరతుడేమిటే? నీకేమైనా పిచ్చెక్కలేదుకదా?”

“లేదమ్మా, భరతుడి కోసం కౄరమైన సవితి తల్లి అవతారం ఎత్తండి ఈ ఒక్కరోజుకీ. ఓహో సొంత కొడుకు కోసం ఇలా అడిగింది అనుకుంటారు ప్రజలు. అయినా ఈ రెండు కోరికలు మహారాజు తీర్చినప్పుడు కదా? రేపు పట్టాభిషేకం అనగా ఇలాంటి కోరిక కోరితే ఈయన తట్టుకోగలడా?

“ఏమౌతుందేం?”

“ఏమో మహారాజుకేమైనా అయితే మీ ముగ్గురి రాణులకీ వైధ… ఎందుకు నాచేత అనిపిస్తారు? వద్దులెండి, చూద్దాం. రాజు ఒప్పుకోడనే నా అనుమానం. ఒప్పుకున్నా పధ్నాలుగురోజుల్లో ఏదో పెద్ద అద్భుతం జరిగితే తప్ప రాముడు రావణుణ్ణి ఎదుర్కోడానికి సమయం చాలవద్దూ? రాక్షసులు చూడబోతే లక్షల్లో ఉండొచ్చు. రాముడేమో ఒక్కడు.”

“చూద్దాం. నేను అడగవల్సింది అడుగుతాను.”

“తాతగారింటికి వెళ్ళిన భరతుడిప్పుడు ఇక్కడెలాగా లేడు. మీరు ఎంతకాలమైనా భరతుణ్ణి చూడకుండా ఉండగలరు కానీ రాముణ్ణి చూడకుండా ఉండలేరు కదా? సరే మీ ఇష్టం, మీ మాటే కానివ్వండి.”

కైక భవనంలోంచి మంధర తిన్నగా ఇంటికొచ్చిందన్న మాటే గానీ రాత్రంతా ఉత్కంఠ. కైక అడుగుతుందా? రాజు ఏమంటాడో? మర్నాడు పొద్దున్నే వార్త దావానలంలా వ్యాపించింది. రామ పట్టాభిషేకం రద్దు చేశారు, కైక కోరిన వరాల వల్ల. ఆశ్చర్యం ఏమిటంటే పధ్నాలుగు రోజులు మాత్రమే రాముణ్ణి విడిచి ఉండగలను అని మంధరతో పట్టుపట్టిన కైక కోరిన మొదటి వరం రాముణ్ణి పధ్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపమని అడగడం. మంధర తాను విన్నదాన్ని నమ్మలేక దాదాపు పరుగెట్టుకుంటూ వెళ్ళి కైకని చూడబోయింది. మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయి ఉంది కైక. మహారాజు వంటిమీద తెలివి లేదు. పరిచర్యలు చేశాక కూడా ఏమీ తేరుకున్నట్టు లేదు. మంధర రావడం చూస్తూనే మిగిలిన పరిచారకులు పక్కకి తప్పుకున్నారు.

“ఏమమ్మా నేను విన్నది నిజమేనా?” మంధర అడిగింది.

నిజమే అన్నట్టూ తలూపింది కైక, “పధ్నాలుగు రోజులు అనబోయేసరికి ఏదో భూతం ఆవహించినట్టుంది నన్ను. పధ్నాలుగు సంవత్సరాలు అని అప్రయత్నంగా వచ్చేసింది నోట్లోంచి. ఎందుకిలా అయిందో? ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు.”

మంధర మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్కలేదు. ఈ పధ్నాలుగు రోజులు పధ్నాలుగు సంవత్సరాలుగా మారినందుకు ఇప్పుడేమౌతుందో? కౌసల్య తట్టుకోగలదా? కౌసల్య ఎలాగోలా తట్టుకున్నా రాముడు లేకుండా కైక బతకగలదా? మహారాజో? ఏదో కీడు జరగబోతోందనేది సుస్పష్టం. లేకపోతే కైక మాట తూలడం ఎన్నడైనా విన్నదా కన్నదా? ఒకట్రెండు సంవత్సరాలు చాలవూ రావణుణ్ణి చంపడానికీ? పధ్నాలుగు సంవత్సరాలే? రాముడు ఇన్నేళ్ళు అడవుల్లోకి వెళ్తే జానకి ఏం చేస్తుంది? అడిగేటప్పుడు కాస్త చూసుకోవద్దూ? కైకమ్మ ముందూ వెనకా చూసుకోకుండా అర్ధం పర్ధం లేని ఈ కోరిక ఎలా కోరింది? ఇప్పుడీ మతిలేకుండా పడిపోయిన రాజు కాలం చేస్తే రావణుడు ఇక్కడికి రాకుండానే ఈ రాజ్యం శ్మశానంలాగా తయారవదూ? ఎంతపని చేశావు కైకమ్మా? ఈ కోరికలన్నీ విన్నాక ఇలా అడగమని కైకని పురిగొల్పినందుకు రాముడు తనని నరికి పారేయడూ? నీకాశ్రయం ఇచ్చింది ఇందుకా అని అడిగితే ఏ మొహం పెట్టుకుని ఏం సమాధానం చెప్పాలి?” మంధర నుదిటి మీద చేత్తో కొట్టుకుంటూ అక్కడే నేలమీద కూలబడింది.

కాసేపటికి రాముడు రానే వచ్చాడు కైక దగ్గిరకి. మంధర తెర వెనుకకి తప్పుకుంది. తల్లి పాదాలకు నమస్కరించి అడిగేడు కైకని, “అమ్మా చెప్పండి ఏమిటిలా పిలిచారు?”

కైక రాముడికేసి చూసింది. అదే చిరునవ్వు. గుండె రంపంతో కోసేస్తున్న భాధ. రాముడితో ఎలా చెప్పడం? నోటమ్మట మాట రాక కూలబడిపోతూంటే రాముడే పొదివి పట్టుకున్నాడు కైకని ఆత్రంగా. దుర్విషయంబులు మనసున దూరకజేసే నినునెరనమ్మక నే మోసబోదునటరా, నటరాజవినుత – ఇటువంటి రాముణ్ణి పధ్నాలుగు ఏళ్ళు వనవాసం చేయమని ఎలా అనగలిగింది తాను? రాముడు ఈ మాట విని అడవుల్లోకి వెళ్తాడనేది సత్యం. రాముడటు వెళ్ళగానే తాను బతికి ఉండగలదా? ఇప్పటికే జీవఛ్ఛవంలా పడి ఉన్న మహారాజు బతుకుతాడా? కౌసల్యో? ఎంతటి దరిద్రానికి నోచుకుంది తన నోరు?

దగ్గిరే కూర్చున్న రాముడు కాసేపాగి అడిగేడు మళ్లీ, “చెప్పమ్మా? నేనేం చేయాలి?”

కైక నోరు విప్పింది, “ఏం అడుగుతున్నానో తెలియని ఒక క్షణంలో మహారాజునో రెండు కోరికలు కోరాను. కానీ అడిగేటప్పుడు ఏదో భూతం ఆవహించినట్టూ రోజులు అని అడగడానికి బదులు సంవత్సరాలు అని అప్రయత్నంగా నోట్లోంచి వచ్చేసింది. ఇలా ఎందుకు జరిగిందో ముందేమౌతుందో అని…”

“పూర్తిగా చెప్పమ్మా.”

“నువ్వు పధ్నాలుగు సంవత్సరాలు అడవుల్లోకి వెళ్ళాలనీ, భరతుణ్ణి నువ్వొచ్చేదాకా రాజుని చేయాలనీ అడిగేను. కానీ రామా, రోజులు అని అడగబోతూంటే సంవత్సరాలు అని నోట్లోంచి అప్రయత్నంగా వచ్చేసింది.”

చిరునవ్వు నవ్వేడు రాముడు, “అంతే కదా? దీనికే అంత వ్యధ దేనికమ్మా? నువ్వు అడిగితే నా చేత్తోనే భరతుణ్ణి మహారాజుగా అభిషేకించి ఉండేవాణ్ణి కదా? నా వనవాసం అంటావా? పధ్నాలుగేళ్ళు ఎంతసేపు? ఇలా వెళ్ళి అలా వచ్చినట్టు జరిగిపోవూ? నువ్వేమీ మనసులో శంక పెట్టుకోకు. అసలు ఇలా అడుగుదాం అనుకున్నాను, అలా మాట తూలిందేం అని సందేహించకు సుమా. అయితే వెళ్ళేటప్పుడు అమ్మ కౌసల్యని చూసి వెళ్లవచ్చా?”

కైక కడుపు తరుక్కుపోయింది. రాముడు కత్తితో తనని నిలువునా నరికేసి ఉన్నా అంత భాధ ఉండదేమో? ఇంతటి కష్టంలోనూ రాముడి మొహంలో చెదరని చిరునవ్వెలా వస్తోంది?

వెళ్ళొచ్చు అన్నట్టూ తల ఊపి మళ్ళీ నేలమీద కూలబడింది. కైకని చూసుకోమని పరిచారకులకి అప్పచెప్పి రాముడు బయల్దేరేడు. ముందు జరగబోయే చిత్రాతిచిత్రమైన విషయాలు చూడడానికి మంధర రాముడికి తెలియకుండా వెనుకనే బయల్దేరింది. తిన్నగా నడుచుకుంటూ కౌసల్యని చేరాక, జరిగింది చూచాయగా చెప్పి తాను ఆ రోజే వనవాసానికి బయల్దేరుతున్నట్టూ, జానకిని తానొచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోమనీ రాముడు చెప్పడం మంధర విన్నదే. అప్పుడే జరిగింది ఎవరూ కలలో కూడా ఊహించని విచిత్రం. రాముడు లేకుండా తాను బతకలేననీ రాముడెక్కడుంటే తానూ అక్కడేననీ సీతకూడా బయల్దేరింది. రాముడు మరో మాటనేలోపు లక్ష్మణుడు కూడా తయారైపోయేడు. అడిగినందరికీ ఒకటే సమాధానం – రాముడు లేకుండా లక్ష్మణుడు లేడు. కైకకీ మంధరకీ కూడా జరిగిన విషయాలకి తల తిరిగిపోయింది. ఇంతటి కంగారులో కైక – మంధర అడగమన్నట్టూ – ‘రాముడొక్కడే’ అడవుల్లోకి వెళ్ళాలని అడగడం ఎలా, ఎందుకు మర్చిపోయిందో అటు కైకకి గానీ ఇటు మంధరకి గానీ గుర్తు రాలేదు.

నారబట్టలు కట్టుకునేటప్పుడు కౌసల్య అడిగింది రాముణ్ణి, “ఈ కోరికలు మహారాజు నీతో చెప్పినవా లేకపోతే కైక అడిగినవా?”

“ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఎవరైనా ఒకటే కదా నాకు?”

“కాదు, కాదు. మహారాజు ఆజ్ఞ అయితే దాన్ని అతిక్రమించడానికి అధికారం సూర్యవంశ రాణులకి ఉంది. కానీ కైక కనక ఆజ్ఞాపిస్తే నువ్వు తప్పకుండా అడవులకి వెళ్లవల్సిందే?”

అర్ధం కానట్టూ కౌసల్య కేసి చూశాడు రాముడు.

“కైకే కనక నిన్ను అడవులకి వెళ్లమంది అంటే, దాని పర్యవసానాలన్నీ అలోచించే నిన్ను వెళ్లమని ఉంటుంది. కైక ఇలా అడగడంలో అంతర్యం నీ క్షేమం, లోక కళ్యాణం అయి తీరుతుంది. నేను నిన్ను స్వంత కొడుకులా ప్రేమించలేకపోయినా కైక నిన్ను భరతుడికన్నా ఎక్కువగా చూసుకుంటూంది కదా? నీ వనవాసంలో ఏదో మహత్కార్యం జరబోతూందన్న మాట. ఇంతకీ చెప్పు ఎవరు నిన్ను ఆజ్ఞాపించినది? మహారాజా? కైకా?”

“అమ్మే ఆజ్ఞాపించినది.”

కౌసల్య మొహంలో దుఃఖం స్థానే నవ్వు తొణికిసలాడింది, “నేను అనుకున్నదేనన్నమాట. ఇప్పుడు మహారాజు మనసు మార్చుకున్నాసరే నువ్వు వనవాసం చేసి తీరవల్సిందే. నాకు తెలిసినంతలో ఈ ప్రపంచంలో కైక కన్నా నీ క్షేమం ఎక్కువగా కోరేవారెవరూ లేరు. నీ చేత ఏదో బృహత్కార్యం కావాల్సి ఉంది. సందేహించకుండా బయల్దేరు.”

ఎవరికీ కనిపించకుండా ఈ విషయాలన్నీ వింటున్న మంధర స్థాణువైపోయింది. సవితి తల్లి కొడుకుని అడవుల్లోకి ఒకటి కాదు, రెండు కాదు, పధ్నాలుగేళ్ళు కారడవిలోకి వెళ్ళమంటే, స్వంత తల్లి అది జరిగి తీరాలంటోంది. ఎందుకంటే ఆ సవితి తల్లి ఈ కొడుకు క్షేమం, లోక కళ్యాణం దృష్టిలో పెట్టుకునే వెళ్ళమంటోందిట! రేప్పొద్దున్న భరతుడొచ్చి రాజ్యాధికారం చేపట్టేక మళ్ళీ రాముణ్ణి నగరం లోకి రానీయకపోతే? ఈ తల్లీ కొడుకులు ఎక్కడ, ఎలా బతుకుతారు? అధికారం వంటబట్టేక భరతుడు వీళ్ళిద్దరిచేతా అడ్డమైన చాకిరీ చేయించుకోడూ? ఈ ఆలోచనలు వస్తూంటే ఎవరో పక్కనుంచి కొరడా దెబ్బతో కొట్టినట్టూ మంధర అంతరాత్మ హెచ్చరించింది – రాముడంతటి వాడికి భరతుడు తమ్ముడైతే అతను అలా చేస్తాడా? అతనికీ ఉదాత్తమైన ఆలోచనలుండవూ? తనకి మల్లే చవకబారు ఆలోచనలు ఎలా వస్తాయి? తనలాంటి కాకులు హంస వేగం ఎలా అందుకోగలవు? సింహం కడుపున మేక పుట్టడం ఎక్కడైనా విన్నామా? ఈ కౌసల్య ఆలోచనలూ రాముడి వ్యవహారం చూస్తే వీళ్ళు మామూలు మనుషులు కాదని తెలుస్తూనే ఉంది. ఆలోచనల్లోంచి తేరుకుని చూసేసరికి రాముడు వశిష్టులవారి తోనూ మిగతా మంత్రుల తోనూ మాట్లాడుతున్నాడు. చూడబోతే విశ్వామిత్రులవారు చెప్పినది నిజం కాబోతోంది. పధ్నాలుగేళ్ళలో రాక్షస సంహారం జరిగితీరుతుంది కాబోలు. లేకపోతే రోజులనబోయి సంవత్సరాలు అని ఎలా అంది కైకమ్మ? కాళ్ళు నేలలో దిగిపోయి, మతిపోయినట్టూ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది మంధర.

తను దేని కోసమైతే పుట్టాడో అది నెరవేర్చడానికి రామభద్రుడు బయల్దేరుతున్నాడు. మంధర అందరితోబాటే నించుని చూస్తోంది జరుగుతున్న జగన్నాటకం. కాబోయే మహారాజుని నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టల్తో ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తున్న ఇంతటి ఎంతో దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా? కడుపు తరుక్కుపోతోంది కానీ తప్పదు. జగదానంద కారకా, నా ఒక్కదాని కోసం కాదు కానీ జగత్కళ్యాణం కోసం ఒక్క పధ్నాలుగు సంవత్సరాలు కొంచెం ఓర్చుకో తండ్రీ. విశ్వామిత్రులవారిచ్చిన అస్త్రసంపదకి ప్రయోజనం చేకూరే రోజు దగ్గిర్లోనే ఉంది. తోకతొక్కిన కోడెతాచులా భుజంమీద మెరుస్తున్న ధనుస్సు సర్వ శక్తులూ కూడగట్టుకుని పడగ విప్పి కాటువేయడానికి ఉద్యుక్తమౌతోంది. ఎవరయ్యా ఈ శరాగ్నుల్లో శలభంలా కాలిపోకుండా మిగిలేది? నారబట్టలు కట్టుకుని కూడా వచ్చే సీతాలక్ష్మణులతో బయల్దేరే రాముడి మొహం లోకి సూటిగా చూసింది మంధర. ఎప్పటిలాగే గంభీరంగా, ప్రశాంతంగా అదే మోము – పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల, జగదానంద కారకా. మంధర మొహం సంతోషంతో వికసించింది. తాను చేసింది తప్పు కాదు. తన వంశాన్ని సమూలంగా నాశనం చేసి, మూడు లోకాల్నీ ఏడిపించుకు తింటూన్న రావణుడూ వాడి జాతి మొత్తం అంతా నాశనం కావడానికి తాను వేసిన ఎత్తు అత్యద్భుతంగా పనిచేయబోతోంది. సందేహం లేదు. పరమ యోగులకు పరి పరి విధముల వరమొసగెడి పాదాలని అడవుల్లో పధ్నాలుగేళ్ళు కటిక నేలమీద నడిపించి కందిపోయేలా చేస్తున్న తనకి అతి హేయమైన అధోగతి పడితే పట్టొచ్చుగాక. కామిని పాపము కడిగిన పాదము సుతలంలో సర్వవేళలా బలిని రక్షించడానికి సిద్ధమవ్వగా లేనిది నాకూ ఏదో ఒక రక్ష కల్పించదా? బ్రహ్మ కడిగిన పాదము పావుకోళ్ళని మోస్తూ ముందుకి నడుస్తూంటే మంధర కంట్లోంచి ధారాపాతంగా కన్నీళ్ళు. మసక మసకగా కనిపించిన ఆఖరి దృశ్యంలో అనుజ సౌమిత్రినిగూడి, కరమున శర చాపములు ఘనముగ వెలయ, సురులెల్ల వినుతి సేయ, వసుధ భారమెల్ల తీర్ప వెడలిన కోదండపాణి.
------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments: