Tuesday, December 3, 2019

థాయ్‌లాండ్ యాత్రాగాథ – 5


థాయ్‌లాండ్ యాత్రాగాథ – 5

సాహితీమిత్రులారా!

ఒక కొలను, రెండు కోవెలలు
కమలాల కొలను అనగానే బాగా తెల్లారకముందే నలుగురం రడీ అయిపోయి మా వాహనం ఎక్కాం. పైగా అంతకు ముందటి రోజు రికీ ఆ కొలను దాకా తీసుకువెళ్లి ‘ఇపుడు సాయంత్రం గాబట్టి కొలను నిండుగా లేదు. రేపు సూర్యోదయపు సమయానికల్లా రాగలిగితే నీళ్లు కనపడకుండా కమలాలే కమలాలు!’ అని ఊరించి ఉన్నాడాయే. ఊరించి ఊరుకోకుండా తనదైన బాణీలో స్మార్ట్‌ఫోన్ తెరచి కమలాలతో నిండిపోయివున్న కొలను(పాత) ఫోటోలు చూపించీ ఉన్నాడాయే…


ఎంత బుద్ధిగా అందరం రెడీ అయిపోయి వాహనం ఎక్కినా సూర్యోదయంలోగా గమ్యం చేరుకోవాలంటే సమయంతో చిరుసమరం తప్పదని తేలింది. అంచేత పిట్ట తప్ప చెట్టు కనిపించని అర్జునుడిలా సత్యజిత్ డ్రైవింగ్! ఆ ఏకాగ్రత శ్రుతి మించి ఎక్కడైనా రోడ్డు మిస్సవుతాడేమోనని మిగిలిన ముగ్గురిలో గుబులుగుబులు. పక్కన కనిపిస్తోన్న మెయిక్‌లాంగ్ నదీసరోవరాన్ని, కొండలమీద కనిపిస్తోన్న గుడులని, కొండవాలుల్లో ఉన్న అతి కళాత్మకమైన సమాధుల పరంపరనూ పట్టించుకోకుండా మేవు కూడా గమ్యం మీదే మనసు నిలిపి ముందుకు సాగిపోయాం. పెద్ద రోడ్డు మీద ఓ పది కిలోమీటర్లు, అది దాటి మరో చిన్న రోడ్డు మీద మరో నాలుగయిదు, చిట్టచివరికి అదీ వదిలిపెట్టి ఓ కిలోమీటరు దూరం అచ్చమైన పల్లెటూరిబాట. దారంతా మాతోపాటే తోడువచ్చిన పెద్ద పంటకాలవ. చక్కని ప్రయాణం. సూర్యుడికన్నా ముందుగా కొలను చేరుకోవడంలో సఫలమయ్యాం. కానీ కొలనులో నిన్నటి సాయంత్రంకన్నా ఎక్కువ పూలున్న మాట నిజమేగానీ, మేవు అనుకొన్నట్టు కిక్కిరిసిపోయి ఏంలేదు. ఆ కొరత మమ్మల్ని నిరాశపరచకుండా మాకు మేవు సర్దిచెప్పుకొన్నాం. అయినా మనసును రాగరంజితం చెయ్యడానికి అరవిరిసిన ఒక్క కమలం, ఒక్క సహ సహృదయపు సాహచర్యం చాలదూ?!


చిన్న చెరువు. అంతా కలసి రెండు కిలోమీటర్ల లోపు చుట్టుకొలత. అచ్చమైన గ్రామీణ ప్రాంతం. పార్కింగ్ దగ్గర చుట్టూ పరచుకొన్న ఓ నిడుపాటి వృక్షమూ ఒక చిన్నపాటి టీ దుకాణమూ తప్ప ఏ ఇతర అట్టహాసాలూ లేని సహజ వాతావరణం. ‘చెరువు చుట్టూ పలకల కాలిబాటలు’ బాపతు ఆధునిక టూరిజం హంగులు ఏమీ లేకుండా పలకరిస్తోన్న గడ్డీగాదం. మనసు చల్లబడింది. ఆటో ట్యూన్ మోడ్‌లోకి వెళిపోయి తెలియకుండానే శ్రుతి అయిపోయి రాగాలాపన మొదలెట్టింది!


కొలను లోపలికో విశాలమైన కాలిబాట ఉంది. దానిమీద ఓ పాతిక ముప్పై మీటర్లు నడిస్తే వృత్తాకారంలో కూడలి. దానికి ఒక అంచున ఆకట్టుకొనే బుద్ధప్రతిమలు. చుట్టూ చేతికందే దూరంలో ఎర్రతామరలు. అప్రయత్నంగా మధుర తీస్తోన్న కూనిరాగాలు. గబగబగబా అక్కడి అందాలను కెమెరాలలో బంధించే ప్రయత్నాలు… సంతోషంతో ఆ అరవిందాలకన్నా సుందరంగా విచ్చుకొన్న ముఖారవిందాలు… సమయస్పృహ లేకుండా తనివిదీరా ఆ వృత్తాకారపు కూడలిలో గడిపాక అందరం మళ్లా చెరువుగట్టుకు చేరి వాటిల్ని శోధించడం మొదలెట్టాం. సరళంగా చెప్పాలంటే అది అందమైన దృశ్యాలకోసం, అనుభవాలకోసం వేట. సన్నపాటి కాలిబాట చెరువుగట్టున కనబడితే దానివెంబడి ఓ అర కిలోమీటరు… గట్టున చెట్లూ, నీటిలోపల పచ్చటి ఆకులూ మొక్కలూ కనిపిస్తే వాటిని పలకరిస్తూ అక్కడో పావుగంట. స్థానికులు కనిపిస్తే పలకరించి కాసేపు కబుర్లు. కబుర్లాడడానికి భాషకన్నా హావభావాలు బాగా పనికొస్తాయి అన్న అవగాహన మా అందరికీ ఉంది!

పార్కింగ్ దగ్గర తేనీరూ చెరుకురసం తీసుకుని సంతృప్తభావనతో ఆ కమలాల కొలనును వదిలిపెట్టాం.


మా తదుపరి మజిలీ–బౌద్ధాలయం–వేపు కాలవగట్టున వెళుతోంటే ఆవలి గట్టున కనిపించిన దృశ్యం మమ్మల్ని నిలవరించింది. కాలువ ఒడ్డునే సుమారు ఏభై అడుగుల పొడవూ పదిహేను అడుగుల వెడల్పున ఓ సిమెంటు చేసిన ప్లాట్‌ఫామ్, దానిలో అమర్చి ఉన్న ఓ పటిష్టమైన ఇనప ఫ్రేము. ఆ ఫ్రేములో పదిపదిహేను చోట్ల పంపులు విరజిమ్ముతోన్న జలధారలు. ఆ నీళ్లలో ఆకుకూరలను కడిగి శుభ్రపరుస్తోన్న థాయ్ గ్రామీణులు! వాహనం నిలిపేసి చకచకా ఫోటోలు. అవతలి గట్టునుంచి ముందుగా అనుమానపు చూపులు… క్షణాల్లో చేతి ఊపులు… మరికాసేపట్లో ప్రోత్సాహక కేరింతలు… మా తిరుగు పలకరింపులు–ఆనందం అర్ణవమవడానికి ఇలాంటి ‘అల్ప’మైన అనుభవాలు చాలవూ?!

రిసార్టు వదిలి దాదాపు రెండుగంటలు గడచినా టైము ఇంకా ఎనిమిది దాటలేదు. ఏదో అంటారే, అభీ భీ దిన్ బాకీ హై!

మొదటి మందిరం మరో పావుగంటలో!


అప్పటికే రోడ్డు మెయిక్‌లాంగ్ నదీతీరం చేరింది. ఒడ్డుకు రెండువందల గజాల దూరాన ఓ గుట్ట. గుట్ట మీద వాట్‌థమ్‌సుయా అన్న కోవెల. పార్కింగ్ ప్రాంతమే ఎత్తుమీద ఉందనుకొంటే మళ్లా అక్కడినుంచి గుడి ప్రాంగణం చేరడానికి మరో నూట ఏభై మెట్లు. మెట్లు ఎక్కలేనివారికోసం కేబుల్ కారు. అంతా కలసి గుడిమీదకు చేరేసరికి దాదాపు రెండువందల అడుగుల ఎత్తు. గుడి, దాని సౌందర్యం, గాంభీర్యం, వైశాల్యం ఒక ఎత్తయితే ఆ గుట్టమీద నుంచి దిగువున కనపడే దృశ్యమాలిక మరో ఎత్తనిపించింది. కుడివేపున అంత వేసవిలోనూ పచ్చదనాన్ని గొప్పగా సంతరించుకొనివున్న పంటచేలు, ఎదురుగా ఎడమవేపున మెలికలు తిరుగుతూ ప్రవహిస్తోన్న విశాలమైన మెయిక్‌లాంగ్ నది. నదికీ గుట్టకీ నడుమ నిడుపాటి వృక్షాలు. వెనకవేపున ఆ ప్రాంతంలో వ్యాపించి ఉన్న దుకాణాలూ, ఇళ్ల సమూహాలూ… క్షణంసేపు ఆ ఆశించని ఊహించని అందాలకు గుండె లయతప్పింది!


చూస్తోంటే అది ఒక్క మందిరం కాదు, మూడు నాలుగు మందిరాల సమూహం అనిపించింది. మాకంటె తెల్లవారి అప్పటికే రెండుగంటలు దాటినా ఆ గుడికి మాత్రం ఇంకా తెలతెలవారుతూనే ఉంది. మెట్లన్నీ ఎక్కి పైకి వెళితే విశాలమైన ప్రాంగణం నిండా పెద్ద పెద్ద చెట్లు. అవి రాల్చిన ఆకుల్ని ఊడుస్తూ శ్రామికులు… వాళ్ల పనికి అడ్డం రాకుండా ఆ ప్రాంగణపు నలుమూలలా మా సౌందర్య శోధనలు… ఆహా ఓహో అంటూ నిట్టూర్పులు, కేరింతలు.


అక్కడి ముఖ్యమైన ఆకర్షణ బంగారపు రంగులో పద్మాసనం భంగిమలో ఉన్న ఒక బృహత్తరమైన బుద్ధ విగ్రహం. ఉదయపుటెండలో ఆ బంగారం దాదాపు మిరుమిట్లుగొలిపినా, కోరికలే సకలానర్థాలకు మూలం అంటూ సంపదను ఈసడించిన మహానుభావుడికి ఈ బంగారు విగ్రహాలు ఏమిటో అనిపించక పోలేదు. విగ్రహం పరిసరాల్లో బౌద్ధ పురాణ గాథలకు చెందిన శిల్ప సమూహాలు. అతి విలక్షణమైన శిల్పరీతిలో నిర్మించి అలంకరించిన రెండుమూడు గుమ్మటాలు. ప్రాంగణంలో ఓ వృక్షానికి వేలాడుతోన్న గంటలు. ఓ పక్కన త్రిభుజాకారపు పెద్దపాటి గవాక్షంలోంచి ప్రస్ఫుటంగా కనిపిస్తోన్న నది. ఈ మందిర సముదాయాన్ని ఏభై ఏళ్ల క్రితం కట్టారట.


అక్కడికి మరో నాలుగయిదు కిలోమీటర్ల దూరాన ఉన్న రెండో మందిరం పేరు వాట్‍బన్‍థమ్. ఇదీ కొండ మీదే ఉంది. పైకి వెళ్లాలంటే ఏకంగా ఏడొందల మెట్లు ఎక్కాలి. మిగిలిన ముగ్గురూ ‘అలసిపోయాం. మెట్లెక్కే ఓపిక లేదు, మీరు వెళ్లిరండి…’ అనేశారు. మామూలుగా అయితే నేనూ మిత్రధర్మం పాటించి ఆ గుడిని వదిలేసే వాడినేగానీ అక్కడి మెట్లు వెళ్లి వెళ్లి నిప్పులు కక్కుతోన్న బృహదాకారపు డ్రాగన్ నోటిలోకి చేరడమూ, ఆ తర్వాత ఆ మహాసర్పపు పొట్టలోంచి కొనసాగడమూ కనిపించి నాలోని బాలుడు పదపదలెమ్మన్నాడు.


అలసటనూ శ్రమనూ జయించడానికి అతి ఉత్తమ మార్గం కుతూహలం, ఉత్సాహం. అవి రెండూ పుష్కలంగా ఉండటంతో మెట్లన్నిటినీ తూనీగలాగా ఎక్కేసి మహాసర్పపు పొట్టలోకి చేరాను. ఏడెనిమిది అడుగుల వెడల్పూ, అంతే ఎత్తూ ఉన్న సౌకర్యమైన సోపానమార్గమది. రెండుపక్కలా గోడల మీద ఏవేవో చిత్రాలు ఉన్నాయి. థాయ్‌లాండ్ దేశపు ఒక సుప్రసిద్ధ నవలకు చెందిన దృశ్యాలట. సర్పం తోకలోంచి బయటపడగానే మళ్లా సువర్ణ బుద్ధ దర్శనం. మరికాస్త దూరాన ఒక బండరాయి–జానపద గీతాలు పాడే ఒకానొక మహిళను అనుమానంతో భర్త చంపేశాడని, ఆ మహిళ బండరాయి రూపంలో ఈ కొండమీద వెలసి అందరికీ శుభం చేకూరుస్తోందనీ స్థలపురాణం. ఆ మధ్య ఎప్పుడో థాయ్‌లాండ్ రాజుగారు–రామ-9–ఈ గుడికి వచ్చారట. అదో విలక్షణత.

మొత్తానికి రెండు ఆలయాలూ ఆకట్టుకొనేవే అయినా ఈమధ్యే కట్టినందువల్ల కాబోలు, మహిమలూ మహత్యాలూ అంటూ పెద్దగా ప్రచారం జరిగినట్టు లేదు. మేం వెళ్లిన సమయంలో రెండుచోట్లా ఇతర సందర్శకులు దాదాపు లేరు. ‘ఈ కాంచనబురి ప్రాంతాలకు ఇవి అపురూప దేవాలయాలే. కానీ దూరతీరాల నుంచి వచ్చేవాళ్లు చాలా అరుదు’ అన్నాడు అక్కడి స్థానికుడు.


గుడి మెట్ల పక్కనే కొండవాలులో అనేకానేక చిన్న చిన్న కట్టడాలు కనిపించాయి. బాగా ఆకర్షించాయి. ఏమిటా అని పరీక్షగా చూశాను. అవన్నీ సమాధులు! బహుశా ఉన్నత వర్గాలకూ, ఆధ్యాత్మిక ప్రముఖులకూ చెందినవి అయివుండాలి. ‘ఇందాక దారిలో కొండచరియల్లో మరో బాణీ సమాధుల్ని గమనించామే…’ అని అడిగితే ‘అవి చైనా దేశపు సంపన్నులవి. ఇవి థాయ్‌లాండ్ దేశపు స్థానిక ప్రముఖులవి.’ అన్న వివరణ.

ఈ మందిరం వదిలి రహదారి ఎక్కీ ఎక్కగానే విశాలమైన జలాశయం. మెయిక్‌లాంగ్ నదిమీద ఆ దగ్గర్లోనే కట్టిన ఆనకట్ట సృష్టించిన జలాశయమది. అలాంటి జలసంపద కనిపిస్తే ఆగని మనిషి ఉంటాడా! ఆగాం. అదో పావుగంట. అక్కడ నది ఒడ్డున మరో విలక్షణ విగ్రహం… పూజలు జరిగిన చిహ్నాలు.

ముందుగా మేవు అనుకోకపోయినా రికీ ప్రోద్బలం వల్ల చేసిన ఆ గ్రామసీమల కమలాల యాత్ర మా అందర్నీ తెలియని ఆనందంతో నింపింది. ఈ మాత్రం పద్మాలు ఉన్న కొలనులు మన దేశంలో లేవా? దానికోసం థాయ్‌లాండ్ దాకా రావాలా అంటే ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కమలాల చుట్టూ అసంకల్పితంగా పోగుపడిన అనేకానేక సున్నిత స్పందనల సమాహారం ఆ ఉదయపు సమయం. ఎన్నోరోజులపాటు మా నలుగురినీ ‘కమలాల కొలను’ అనగానే ఒక విలక్షణ స్పందనకూ, జ్ఞాపకాల్లోకి ప్రయాణానికీ కారణమవగల శక్తి ఉన్న క్షణాలవి.

తిరిగి మా ప్లకన్ రిసార్ట్ చేరేసరికి పదీపదిన్నర. గబగబా సామాన్లు సర్దుకొని అంతా లాబీలో చేరాం. సత్యజిత్ బిల్లులూ అవీ చెల్లించే పనిలో పడ్డారు.


రిసెప్షన్‌కు ఎదురుగా–ఆ హాలుకు అటు చివర ఉన్న గది నన్ను ఆకర్షించింది. వచ్చిన దగ్గర్నుంచీ దానిమీద ఒక చూపు వేస్తూనే ఉన్నాను. ఏదో రహస్య మందిరంలా అది నన్ను ఆకర్షిస్తోనే ఉంది. అటు అడుగుపడటానికి ఆ చివరి నిమిషాలే ముహూర్తమయ్యాయి.

గదిలోకి అడుగుపెట్టాను. అదో విశాలమైన హాలు! అదో పురావస్తు ప్రదర్శనశాల! గత అరవై డెబ్బై ఏళ్లలో వాడుకలో ఉండి ఇప్పుడు కనుమరుగు అయిన వస్తువులన్నీ కొలువుదీరి నన్ను పలకరించి సంభ్రమాశ్చర్యంలో ముంచేసిన సమయమది!


పాత హరికేన్ లాంతర్లు, పెట్రోమాక్స్ లైట్లు, సైకిళ్లు, స్కూటర్లు, తేలికపాటి మోటారు సైకిళ్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, బొగ్గు ఇస్త్రీ పెట్టెలు, రోటరీ టెలిఫోన్లు, టైపురైటర్లు, పాడటానికి ఒకటిరెండు నిమిషాలు తీసుకునే మూడు నాలుగు బాండ్ల రేడియో సెట్లు, గడియారాలు, కోకోకోలా వెండింగ్ మెషీన్లు, బూరగొట్టపు గ్రామొఫోను, గణగణ మోగే అలారం టైమ్‌పీసు, మగ్గులు, జగ్గులు, హాట్‌కేసులు, ఎన్నో ఎన్నెన్నో గ్రూప్ ఫోటోలు–ఒక్కసారి బాల్యం లోకి అడుగుపెట్టిన భావన!


పాత హరికేన్ లాంతరు అంటే 1958, చీరాల; నాలుగు బాండ్ల రేడియో అంటే 1959, ఏలూరు; బూరగొట్టం గ్రామొఫోను అంటే 1960, బంటుమిల్లి; రోటరీ టెలిఫోను అంటే 1963, బెజవాడ; మాన్యువల్ టైపు రైటర్ అంటే 1969, విజయవాడ… అప్పుడుగదా వాటిల్ని మొట్టమొదటిసారి చూసింది, చూసి అబ్బురపడింది, వాడి ఉపయోగించింది! మళ్లా ఆ ఏభైలు, అరవైల నాటి అనుభవాలలోకీ, జ్ఞాపకాలలోకీ నన్ను ఇపుడు తీసుకువెళుతోంది ఎవరూ?!

‘మా ఓనరుగారు. ఆయనకీ పాత వస్తువులంటే ప్రాణం!’ రిసెప్షనావిడ సమాచారం.

ఎక్కడున్నాడో ఆ మహానుభావుడు! వెళ్లి చేతులు తాకాలనిపించింది. గట్టిగా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది.

‘అమరేంద్రా! రండి, బయల్దేరదాం.’ పిలిచారు సత్యజిత్.

పదకొండింటికల్లా రిసార్టు వదిలాం. రెండూ రెండున్నర గంటల ప్రయాణం.

అనుకోకుండా సత్యజిత్‌తో కబుర్లలో పడ్డాను. “మీరు మన దేశంలో వివిధ ప్రదేశాల్లో పనిచేశారు. బాధ్యతగల ఉద్యోగాల్లో ఉంటూ సహోద్యోగులతో పనిచేయించారు. గత రెండేళ్లుగా బ్యాంకాక్‌లో కూడా మీ పెప్సీ కంపెనీలో మీకు అదే పనిగదా… మనదేశపు అనుభవానికీ, ఇక్కడి అనుభవానికీ తేడా ఉందా? ఉద్యోగుల నైపుణ్యాలలోనూ, విషయ పరిజ్ఞానంలోనూ, పనితీరులోనూ తేడా కనిపించిందా?”


కాసేపు ఆలోచించి సమాధానం చెప్పారాయన. “నైపుణ్యం, పరిజ్ఞానం అన్న విషయాలలో పెద్ద తేడా లేదు. మా కంపెనీవాళ్ల కొలబద్దలు అక్కడా ఇక్కడా ఒకటే. అంచేత మనుషుల స్థాయి అక్కడా ఇక్కడా ఒకటే. కానీ పని తీరు, వర్క్ ఎథిక్స్‌లో చాలా తేడా ఉంది. వీళ్లకు మనలాంటి శ్రుతిమించిన పోటీతత్వం లేదు. నింపాదిగా తమ పని తాము చేసుకొంటూ పోతారు. రేయింబవళ్లు పనిచేసి అందరికన్నా ముందు ఉండాలి అన్న తాపత్రయం లేదు. ఒక పట్టాన సహనం కోల్పోరు, ఆవేశపడరు. మనం కోల్పోయి ఆవేశపడినా స్పందించనే స్పందించరు. తరిమో, ఆశపెట్టో, భయపెట్టో వీళ్లతో పనిచేయించలేం. అలా అని పని నుంచి తప్పించుకొనే ప్రయత్నం చెయ్యరు. పనిమీద గౌరవం ఉంది. నిబద్ధత ఉంది…”

“ఆ మనస్తత్వం వీళ్లకు ఎలా వచ్చిందంటారూ? గత నాలుగు రోజులుగా నేనూ షాపుల్లోనూ రెస్టారెంట్లలోనూ ఇదే గమనిస్తున్నాను.”

“బహుశా అది బౌద్ధమత ప్రభావం. సరళ జీవితం, సహజ ప్రవర్తన అన్నవి వీళ్లల్లో బాగా జీర్ణించుకుపోయాయి.”

“దేశపు దక్షిణ ప్రాంతంలో ముస్లిములు ఎక్కువ అని విన్నాను. మరి మత విబేధాలు లేకుండా బతుకుతున్నారా, లేక బర్మాలో లాగా గొడవ పడుతున్నారా?”

“నిజమే! అక్కడ మలేషియా ప్రభావం ఎక్కువ. విబేధాలు పూర్తిగా లేవు అనలేం. ఎంతో కొంత టెన్షన్లు ఉన్నాయి. ఆ టెన్షన్లను పెంచి పోషించే నాయకులూ ఉన్నారు. అడపాదడపా కల్లోలాలు జరుగుతున్నాయి.”

తప్పదన్నమాట! ఎక్కడైనా ఇది తప్పదన్నమాట!


“నాదింకో ప్రశ్న… ఇక్కడివాళ్లంతా అతి చక్కని సివిక్ సెన్స్ చూపిస్తున్నారు. అటు బ్యాంకాక్‌లోనూ, ఇటు ఈ కాంచనబురి, చుట్టుపక్కల గ్రామాలలోనూ అంతా నియమాలు పాటిస్తూ, మర్యాదను దాటకుండా, క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి బ్యాంకాక్ రోడ్లమీద అంత రద్దీ ఉన్నా, ట్రాఫిక్ వత్తిడి విపరీతంగా ఉన్నా ఎవరూ రాంగ్ ఓవర్‌టేకింగ్‌లూ, ఎర్ర లైటు దాటడాలూ లేవు. వీళ్లకింత పౌరస్పృహ ఎలా వచ్చిందీ? పోనీ, యూరోపియన్ పాలనవల్లా అనేద్దామంటే అదీ లేదాయే!”

“మీరన్నది నిజం. వీళ్లు చాలా గొప్ప క్రమశిక్షణ పాటిస్తారు. ఎలా వచ్చిందీ అంటే నిజానికి నేనూ చెప్పలేను. బహుశా రెండేళ్ల క్రితం వెళ్లిపోయిన రామా-9 రాజుగారి ప్రభావం అయివుండవచ్చు. ఆయన పాశ్చాత్య దేశాల్లో పుట్టిపెరిగాడు. చదువుకున్నాడు. పందొమ్మిదేళ్ల వయసులో రాజు అయ్యాడు. దాదాపు డెబ్బై ఏళ్లు రాజుగా వ్యవహరించాడు. ముందుచూపు ఉన్న మనిషి. తన పాలన సమయంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి దేశాన్ని నడిపాడు. ప్రజలూ ఆయన్ని బాగా గౌరవించారు. బహుశా ఆయనవల్ల ఇంత క్రమశిక్షణ వచ్చివుండాలి. సరే, బౌద్ధం ప్రభావం శతాబ్దాలుగా ఉండనే ఉంది.”

“అవును, ఆయన గురించి విన్నాను. ఆయన పోయినపుడు ఇండియాలో కూడా మంచి కవరేజ్ వచ్చింది. కానీ మితవాది అని విన్నానే… సరే, మరి ఈ కొత్త రాజుగారి సంగతేమిటి? తండ్రి అంత సమర్థత ఉన్న మనిషేనా?”

“లేదనే చెప్పాలి. ఇతనికీ యూరప్‌తో అనుబంధం ఉంది. చాలాకాలం జర్మనీలో గడిపాడు. జనసామాన్యంలో తండ్రికి ఉన్నంత గౌరవం లేదు. కానీ వీళ్లు ఎవరు రాజయినా మౌలికమైన గౌరవం, భక్తి చూపిస్తారు. రాచరిక వ్యవస్థకు సమాంతరంగా సైనిక ఆధిపత్యం, మధ్యలో నియంత్రీకృత ప్రజాస్వామ్యం ఏకకాలంలో కొనసాగుతున్నా, ప్రజలకు ‘రాజు’ అన్న వ్యవస్థ మీద భక్తి ఉంది. ఆ వ్యవస్థకు అధిపతి అయిన మనిషిని గౌరవిస్తారు. ఈ రామ-10గారికి ఆ గౌరవం దక్కుతోంది. అందుకే అంత వైభవంగా ఇపుడు పట్టాభిషేకం జరుగుతోంది. అన్నట్టు తండ్రి రామ-9 చనిపోయి రెండేళ్లు దాటినా ఆయన పట్ల గౌరవం వల్ల కాబోలు ఈ రామ-10 ఇప్పటిదాకా సంప్రదాయపరమైన పట్టాభిషేకం జరిపించుకోలేదు.”

మాటల్లోనే బ్యాంకాక్ పొలిమేరలు చేరాం.

“రెండు దాటేసింది కదా ఇహ ఇంటికేం వెళతాం, ఇక్కడి ఇండియన్ రెస్టారెంట్లో భోంచేద్దాం.” ప్రతిపాదించారు సత్యజిత్.


కాస్త పైస్థాయి రెస్టారెంటది. గుజరాతీలదనుకొంటాను. ఒక్కసారిగా ఇండియా చేరుకొన్న భావన. ధారాళంగా వినిపిస్తోన్న హిందీ. అవడానికి ఉత్తర భారతదేశానికి చెందినదేగానీ అన్ని రకాల భారతీయ వంటకాలూ ఉన్నాయి. “బ్యాంకాక్‌లో మన భోజనాలు ధారాళంగా దొరుకుతాయి. మలేషియాలో ఉన్నంతగా కాకపోయినా ఇక్కడా భారతీయులు బాగానే ఉన్నారు. మన తెలుగువారి సంఘం కూడా ఉందట, నేనింతవరకూ వెళ్లలేదు.” వివరించారు కల్యాణి.

సాయంత్రమవగానే మా సుఖమ్‌విట్ మిలేనియం రెసిడెన్స్ టవర్ల చుట్టూ ఉన్న ప్రాంతంలో బాగా తిరుగాడాలని, ఆ ప్రదేశంతో పరిచయం పెంచుకోవాలనీ కోరిక కలిగింది. “నిజమే, మేవూ పెద్దగా ఈ వీధుల్లో తిరిగింది లేదు. పదండి వెళదాం,” అంటూ కల్యాణి సిద్ధమయ్యారు. ఆమెతోపాటు మధుర. “మీరు తిరగడం ముగించాక ఫోను చెయ్యండి. ఆ దగ్గర్లో ఉన్న ఫ్యామిలీ మార్ట్‌లో ఇంటిసామాన్లూ కూరగాయలూ కొనే పనుంది. నేవచ్చి అక్కడ కలుస్తాను.” అన్నారు సత్యజిత్.
ముగ్గురం బయల్దేరాం.
మామూలుగా మేవు ఇంట్లోంచి బయటపడి సిటీలోకి వెళ్లేది ఉత్తర దిక్కుగా సాగి అశోక్ మెట్రో స్టేషన్ దిశలో. అప్పటికే అందరికీ ఆ ఉత్తరాన ఉన్న వీధులూ షాపులూ బాగా పరిచయం కాబట్టి మా అన్వేషణ దక్షిణ దిశలో చేద్దామనుకొన్నాం. రెండు మూడువందల గజాలు వెళ్లగానే అప్పటిదాకా విశాలంగా పరచుకొని ఉన్న రోడ్లూ షాపులూ తగ్గిపోయి సన్నపాటి సందులూ, చిన్నపాటి దుకాణాలూ, అతి విరివిగా గృహసముదాయాలూ కనిపించాయి. ఆరా తీస్తే అది యోట్‌సోన్‌థాన్ అన్న గ్రామ ప్రాంతమని తెలిసింది. అలాంటి గ్రామాలు ఆ చుట్టుపక్కల మూడునాలుగు ఉన్నాయని తెలిసింది.


అన్ని నగరాలలో జరిగినట్టుగానే బ్యాంకాక్‌లో కూడా నగర విస్తరణ ధాటికి పరిసర గ్రామాలు తలవొగ్గి నగరంలో భాగమయిపోవడమూ, అలా భాగమయిపోయినా కూడా అవి పూర్తిగా అదృశ్యమయి పోకుండా తమ తమ ఉనికిని నిలుపుకుంటూనే మహానగరపు నీడలో సహజీవనం చెయ్యడమూ జరుగుతోంది అన్నమాట. మన హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో చింతల్ బస్తీలూ, కూకట్‌పల్లిలూ; ఢిల్లీ నగరంలో మెహ్రోలీ, నజఫ్‌గఢ్ లాంటి పెద్ద పెద్ద గ్రామాలూ విలీనమైపోయిన ప్రక్రియ బ్యాంకాక్‌కూ అపరిచితం కాదన్నమాట. కానీ ఒక ముఖ్యమైన తేడా నా స్వల్ప పరిశీలనలో కనిపించింది. రోడ్లు సన్నపాటివే అయినా ఇళ్లూ వాకిళ్లూ బీదరికం దాటుకొని, నాగరికం నేర్చుకొన్నట్టు అనిపించింది. శుభ్రత, క్రమశిక్షణ విషయంలో కిలోమీటరు ఉత్తరాన ఉన్న నవనాగరీక నగరం బాణీలోనే ఈ గ్రామాలూ ఉన్నాయి. నిజానికి ఏ మహానగరమైనా అనేక ఉపశకలాల సమారోహం; విభిన్న స్థాయిల జనావాసం అన్న విషయం మరోసారి మరోసారి కళ్లకు కనిపించింది.

“ఇక్కడ ఒక సర్దార్జీ దుకాణం ఉంది. చాలా స్నేహంగా ఉంటారా పెద్దాయన. మా చిరు కొనుగోళ్లన్నీ ఆయన షాపులోనే చేస్తాం. రండి, పరిచయం చేస్తాను…” అని దారి తీశారు కల్యాణి. తీరా వెళితే ఆయన లేరు. సర్దారిణి ఉన్నారు. చిన్న దుకాణం. జీవితంలో పెద్దగా పరుగులు తీసే పని పెట్టుకోని మనిషి నడిపితే ఓ దుకాణం ఎలా ఉంటుందో అలా ఉంది. ఆకర్షణలు, ఆడంబరాలు లేవు. కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. నాణ్యంగా కనిపించాయి.
ఫ్యామిలీ మార్ట్‌లో సత్యజిత్ వచ్చి కలిశారు.
బహు పెద్ద దుకాణమది.
పళ్లు, కూరగాయలు, బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, పప్పులూ దినుసులూ, పాలూ పెరుగూ, చిన్న చిన్న చిరుతిళ్లు–దొరకని సామగ్రి లేదక్కడ. “అన్నీ దొరికే మాట నిజమేగానీ, ఇందాక మీరు వెళ్లిన సర్దార్జీ దుకాణంలాంటి వాటితో పోలిస్తే ఇక్కడ ఖరీదులు కనీసం ఏభై శాతం ఎక్కువ. ఒక్కోసారి నూటికి నూరు శాతం.” వివరించారు సత్యజిత్. ఖరీదెక్కువయినా కొనడానికి సందేహించని వాళ్లు, ఆ మాటకొస్తే ఖరీదు ఎక్కవ కాబట్టే అక్కడికి కొనడానికి వచ్చేవాళ్లు ఉన్నంతకాలం ఈ మార్టుల వ్యాపారాలకు ఢోకా ఉండదు!
(సశేషం)
------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments: