Thursday, November 14, 2019

సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు


సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు




సాహితీమిత్రులారా!


సినిమా పాటల్లో తాళవాద్యాలది ప్రముఖ స్థానం. వాటిలో ప్రధానంగా తబలా ఉపయోగించినా అవసరాన్ని బట్టి తక్కినవికూడా వినిపిస్తూ ఉంటాయి. జానపదగీతాల్లో ఢోలక్‌, కర్ణాటక సంగీతపు లక్షణాలకు మృదంగం వాడతారు. ఆధునిక సంగీతంలా అనిపించడానికి రకరకాల డ్రమ్స్‌ ఉపయోగిస్తారు. “ఏరువాకా సాగారో” వంటి పాటల్లో ఔచిత్యానికి తగినట్టుగా డప్పు వాడబడింది. మన సినిమాల క్లైమాక్స్‌లో కేరళకు చెందిన “చండ” వాద్యబృందాన్ని వాడడం మామూలే. అరుదుగా కొన్ని కొత్త ప్రయోగాలూ జరుగుతూంటాయి. “లాహిరి లాహిరి” పాటలో ఘటం వినిపిస్తుంది. అంతకన్నా ప్రత్యేకం అనిపించేట్టు నౌషాద్‌ తాను స్వరపరిచిన ముకేష్‌, సుమన్‌ కల్యాణ్‌పుర్‌ యుగళగీతం “మేరా ప్యార్‌ భీ తూ హై” లో మృదంగం వాడారు. బెంగాలీ భజనల ధోరణి ఉన్న పాటల్లో ఖోల్‌ అనే మృదంగంవంటి వాయిద్యం పనికొస్తుంది. ప్యాసా సినిమాలో “ఆజ్‌సజన్‌ మొహే” ఇటువంటిదే. అదే సినిమాలోని “జానే క్యా తూనేకహీ” పాటలో టిక్‌టిక్‌మని మోగే Chinese blocks వినిపిస్తాయి. చాలా పాటల్లో హెచ్చుస్థాయిలో చిన్నచిన్న తబలాలు (డుగ్గీ) మోగు తాయి. ఆర్‌.డి.బర్మన్‌ ఎన్నెన్నో కొత్త వాద్యాలనూ, ధ్వనులనూ, నడకల్లో విరుపులనూ ప్రవేశ పెట్టాడు. పాతవాటితో మొహంమొత్తిన శ్రోతలకు అవన్నీ ఎంతో ఆనందాన్నిచ్చాయి.

పాత సినిమాల్లోని క్లబ్‌ సన్నివేశాల్లోనూ, ఈనాటికీ స్టేజి ప్రోగ్రాముల్లోనూ అట్టహసంగా కనిపించే jazz drums అందరికీ తెలిసినవే. Afro సంగీతంతో బాటు జనాదరణ పొందిన bongo, conga, thumba మొదలైన పెద్దపెద్ద డ్రమ్స్‌, రిధ్‌మ్స్‌కి ఉపయోగించే మొరాకోస్‌, కబాసా మొదలైనవి తరుచుగా సినిమా పాటలకు ఉపయోగపడ్డాయి. పెద్ద వయొలిన్‌ను పోలినదై తీగలను మీటే డబ్‌ల్‌ బేస్‌, నాలుగే మందమైన తీగలున్న బేస్‌ గిటార్‌వంటివి కూడా లయకూ, తాళవాద్యాలకూ బరువునివ్వడానికి ఉపయోగిస్తారు. అవి ఎంత మంద్రస్థాయిలో మోగుతాయంటే వాయించడం అపేసినదాకా వాటి ప్రభావం మనకు తెలియరాదు. 1980లలో జనాదరణ పొందిన “ఆప్‌ జైసా కోయీ” పాటలో అప్పట్లో కొత్త వింత అనిపించిన డిస్కో డ్రమ్స్‌ ధ్వనులు పాటకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఈరోజుల్లో రకరకాల డ్రమ్స్‌ వచ్చేశాయి. అవేవీ అక్కర్లే దనిపిస్తూ వందలరకాల ధ్వనులు పలికించగల Octapads ఉన్నాయి. అసలు వాద్యాలేమీ లేకుండా కంప్యూటర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోగల వింత ధ్వనులున్నాయి. పాటకు తగిన లయను అందించడమే ఈ ధ్వనుల పని. తక్కిన ఆర్కెస్ట్రాతో బాటు ఈ తాళవాద్యకారులు కూడా తెరవెనుకనే ఉంటారు కాని సంగీత దర్శకులు వీరిపై ఎక్కువ శ్రద్ధవహిస్తూ గమనికగా ఉంటారు. ఎందుకంటే గాత్రం తరవాత పాటకు ముఖ్యమైనవారు వీరే.

పాత పాటల్లో ఒక్కొక్కప్పుడు చరణాల మధ్య బిట్స్‌కు తాళవాద్యాలను (percussion) నిలిపేసి కేవలం పియానో, గిటార్‌ వగైరాల మీద chords మాత్రమే వినిపించేవారు. ఎస్‌.డి.బర్మన్‌ సంగీతం సమకూర్చిన “తుమ్‌ న జానే కిస్‌ జహామే ఖోగయే” వంటి పాటల్లో అసలు percussion వాడనేలేదు. అందుకనే అది వింటే మేఘాలమీద తేలిపోతున్న భావన కలుగుతుంది. “ఖుషీఖుషీగా” పాట చివరి చరణం లోనూ ఇలాగే అనిపిస్తుంది.

ఇక వాద్యాల సంగతి వదిలేసి లయలోని వైవిధ్యం చూద్దాం. తక్కిన లలిత సంగీతంలోలాగే తెలుగు సినిమాపాటల్లో ఎక్కువ శాతం నాలుగు, లేదా ఎనిమిది అక్షరాల నడక ననుసరిస్తాయి. దీన్ని రమారమిగా కర్ణాటకపద్ధతిలో ఆదితాళమనీ, హిందూస్తానీ పద్ధతిలో తీన్‌తాల్‌, లేదా కెహర్‌వా అని అనుకోవచ్చు. ఇందులో నాలుగు “సమానమైన” మాత్రలు 1, 2, 3, 4 అని పునరావృతమవుతూ ఉంటాయి. ఈ నడకలో లెక్కలేనన్ని పాటలున్నప్పటికీ దరువులోనూ “ఊపు”లోనూ తేడాలుంటాయి.

వీటన్నిటిలోనూ ముందుగా శాస్త్రీయ పద్ధతిలో సాగే పాటలను గుర్తించడం సులభం. “మది శారదాదేవి మందిరమే”, “దేవీ శ్రీదేవీ”, “పిలచిన బిగువటరా”, “రసికరాజ”, “రారానాసామి రారా”, “బాలనురా మదనా”వంటివన్నీ మృదంగం దరువుతోసహా వినబడే పక్కా ఆదితాళం పాటలు. అలాగే 16 మాత్రల తీన్‌తాల్‌లో “శివశంకరీ”, “సలలిత రాగ”,”నీ మధు మురళీ”, “పాటకు పల్లవి ప్రాణం” వగైరాలున్నాయి. వీటిలో చాలామటుకు తబలామీద “ధాధిన్‌ధిన్‌ధా” అని మొదలయే శాస్త్రీయ “ఠేకా” వినిపిస్తూ ఉంటుంది. మిగతావాటిలో జానపదశైలికి చెందిన కెహర్‌వా ఉపయోగం ఎక్కువ. ఉదాహరణకు “మౌనముగా నీ మనసు పాడిన”, “చెట్టులెక్కగలవా”, “ప్రేమయాత్రలకు”, “ఏరువాక సాగారో” వగైరాల్లో ఈ నడక వినిపిస్తుంది. మరొక ప్రత్యేకత ఏమంటే వీటిలోని ఎనిమిదక్షరాలలో జానపద సంగీతపు లక్షణం అనిపించే 3, 3, 2 విరుపు గోచరిస్తుంది. మరింత వివరంగా చెప్పాలంటే “ప్రెఎమ యఅత్ర లకు” అని ఉచ్చరిస్తే ఈ 3, 3, 2 విభజన తెలుస్తుంది. జానపదధోరణి లేకుండా మామూలుగా కెహర్‌వాలో కాస్త నింపాదిగా సాగే “సావిరహే”, “ఏమిటో ఈమాయ”, “నీ కోసమె నే జీవించునది”వగైరా పాటలు కూడా మనకు తెలిసినవే.

ఇవికాక పాశ్చాత్య సంగీతంలో అనేక నాలుగక్షరాల నడకలున్నాయి. తెలుగు పాటలు వాయిస్తు న్నప్పుడు ఎలక్ట్రానిక్‌ కీబోర్డ్‌ మీద లయ కోసమని auto-accompaniment ఉపయోగించేవారికి పనికొచ్చే దరువుల్లో ప్రధానంగా rhumba, bossa nova, beguine వగైరాలుంటాయి. “ఖుషీఖుషీగా నవ్వుతూ”, “అందెను నేడే అందని జాబిల్లి”, “రావేరావే బాలా” మొదలైన పాటల్లో ఇవి వినబడడడంలో ఆశ్చర్యం లేదు. మార్పు కోసమని అప్పుడప్పుడూ ఈ వెస్టర్న్‌ దరువులను మన దేశవాళీ నడకలతో కలిపి వాడడం కూడా చూస్తాం. ఉదాహరణకు “ఖుషీఖుషీగానవ్వుతూ” పాట మొదట్లో వెస్టర్న్‌బీట్‌తో మొదలైనప్పటికీ, సన్నివేశాన్నీ, అవసరాన్నీ దృష్టిలో ఉంచుకోవడంవల్ల “మేనాలోన ప్రియుని చేర” అనే చరణంలో మన పద్ధతిలో సాగే ఢోలక్‌ వినిపిస్తుంది. మళ్ళీ పల్లవికి యథాప్రకారం డ్రమ్‌స్‌ మోగుతాయి.

మరొక పద్ధతి పాట మధ్యలో తాళాన్ని ఒకటో “కాలం” నుంచి రెండో “కాలం”లోకి మార్చు కోవడం. అంటే తాళవాద్యాల వేగం మధ్యలో రెండింతలవుతుంది. పాతపాటల్లో “చిగురాకులలో చిలకమ్మా” విన్నప్పుడు చరణాల మధ్య సంగీతంలో ఇది స్పష్టంగా వినిపిస్తుంది. “హాయిహాయిగా ఆమని సాగే” పాటలో ఫ్లూట్‌ బిట్స్‌మీద ఇటువంటి మార్పు గమనించవచ్చు. దృశ్యపరంగానూ, పాట నడకలోనూ లయలోని ఈ మార్పు కొంత వెరైటీని ఇస్తుందనడంలో సందేహం లేదు.

ఇవన్నీకాక పాట ఎత్తుగడలో తాళాన్ని బట్టి చేసే మార్పులు పాటకు ఎంతో ప్రత్యేకత నిస్తాయి. ప్రస్తుతం వివరిస్తున్న 4, లేక 8 అక్షరాల లయను మాత్రమే పరిగణిస్తే “లాహిరి లాహిరి”వంటి కొన్ని పాటలు సరాసరి మొదటి అక్షరం (శాస్త్రీయ పరిభాషలో సమం) మీదనే మొదలవుతాయి. మరికొన్ని మొదటి అక్షరం వదిలేసి మొదలవుతాయి. ఇందుకు ఉదాహరణలుగా “చల్లని వెన్నెలలో”, చెంచులక్ష్మి సినిమాలో (మరుగున పడ్డ) మంచి యుగళగీతం “ఆనందమాయె”, రాజమకుటంలో “ఊరేది పేరేది”, వగైరాలను చెప్పుకోవచ్చు. మరికొన్ని పాటలు ఇందుకు భిన్నంగా మొదటి అక్షరానికి కాస్త ముందుగా మొదలవుతాయి. “చిగురాకుల ఊయలలో”, “వినిపించని రాగాలే” ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు (వీటిలో గుర్తుపెట్టిన అక్షరాలమీద తాళం మొదలవుతుంది). అనార్కలీలోని మంచి యుగళగీతం “కలిసె నెలరాజు” మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది తాళానికి సగం మాత్ర ముందుగా మొదలవుతుంది. చరణాలన్నీ కూడా ఇదే పద్ధతిలో సాగి, పాటకు మంచి అందాన్నిస్తాయి. “నిలువవే వాలుకనులదానా” అనే పాటలో పల్లవి తాళానికి బాగా ముందుగా మొదలవుతుంది. తరవాతి పంక్తుల్లోకూడా “ఎవరని ఎంచుకొనినావో, పరుడని భ్రాంతిపడినావో” అన్నచోట గుర్తుపెట్టిన అక్షరాలమీద తాళం దెబ్బ పడుతుంది కనక మొత్తం పాటకు కవ్వాలీ లక్షణం ఏర్పడి కొత్తరకంగా అనిపిస్తుంది. పెళ్ళినాటి ప్రమాణాలు సినిమాలోని యుగళగీతం “వెన్నెలలోనే” ఎత్తుగడ మొదట్లో “సమం” తరవాత ఉన్నా చరణాల మధ్యలో మాత్రం పల్లవి సమం మీదనే మొదలవుతుంది. చరణాలన్నీ సమం తరవాతనే మొదలవుతాయి. ఇది పాటకు అందాన్నిచ్చిందనడంలో సందేహంలేదు. వినేవారికి ఈ తాళాల సొగసులు ఇంత స్పష్టంగా అర్థంకాకపోయినా పాట ప్రజాదరణ పొందడానికి అవి చాలా తోడ్పడతాయి.

6 మాత్రల తాళంలోని పాటలకు కూడా పైన చెప్పిన లక్షణాలున్నాయి.మామూలు దాద్రా తాళంలో రెండో కాలంలో సాగే “జగమే మాయ”, “మాయాసంసారం తమ్ముడూ”, “పగలే వెన్నెలా”, “చిలకా గోరింకా”, “ఓ దేవదా” వగైరా పాటలు దరువుకు సంబంధించినంత వరకూ జానపదగీతాల్ని గుర్తు చేస్తాయి. ప్రత్యేకంగా తాళవాద్యాల ఉపయోగంతో “పడవపాట” లక్షణాలను కలిగించిన పాటలకు ఉదాహరణలుగా “కొండగాలి తిరిగింది”,”ముద్దబంతి పూలుపెట్టి” వంటివి చెప్పుకోవచ్చు.

ఆరక్షరాల తాళం సగం స్పీడ్‌తో నడిస్తే అది కాస్త వెస్టర్న్‌ధోరణితో waltz నడకలా ఉంటుంది. ఇందుకు ఉదాహరణలు “జగమేమారినది”, “మనసులోనికోరికా”,”చిన్నారిపొన్నారి పువ్వు” మొదలైనవి. బాగా పాశ్చాత్యలక్షణాలు కలిగినవై, స్వింగ్‌ నడకకు ఉదాహరణలుగా “జోరుగా హుషారుగా”, “మూగవైన నేమిలే”, “అందమైన బావా” మొదలైన పాటలున్నాయి. ఎనిమిదక్షరాల పాటలలో ఉన్నట్టే  మొదటి మాత్రను వదిలేసి మొదలయే పాటల్లో ఎస్‌. వరలక్ష్మి పాడిన “వరాల బేరమయా” ఒకటి. తాళానికి ముందు మొదలయే ఆరక్షరాల పాటకు ఉదాహరణగా “ఇలాగే ఇలాగే సరాగమాడితే” అన్న పాటను చెప్పుకోవచ్చు.

అయిదక్షరాల పాటల్లో సామాన్యంగా కొత్తపోకడ లుండవుగాని మొదటి మాత్రను వదిలేసి మొదలయే ప్రసిద్ధ గీతం మల్లీశ్వరిలో ఉంది. “ఏడతానున్నాడొ బావా” అని మొదలయే ఈ పాటలో ప్రతి పంక్తికీ ఇదే లక్షణం ఉంది. అన్నమయ్య జోల పాట “జో అచ్యుతానంద” మొదలైనవాటిని కూడా ఈ పద్ధతిలో పాడడం కద్దు. ఏడక్షరాల అప్పగింతల పాట “పోయిరా మా తల్లి” కూడా ఒక మాత్ర వదిలి పాడడం వింటాం.

మొత్తం మీద పాటకు రాగంలాగే లయ అతి ముఖ్యమైనది. ఆర్కెస్ట్రాలో వాడే వాయిద్యాలు కూడా పాటకు ప్రత్యేక రూపాన్నిస్తాయి. అంతేకాక ఎన్ని మాత్రల తాళానికైనా నడకలో కొద్ది మార్పులతోనే ఎంతో వైవిధ్యం ఏర్పడుతుందని సంగీత దర్శకులందరికీ తెలుసు. సైన్యం కవాతు చేస్తున్నట్టు నిర్దుష్టంగా సాగే దరువైనా, ముందువెనకలుగా సాగే నడకైనా సాహిత్యానికీ, సన్నివేశానికీ తగిన అందాన్ని సమకూర్చి నప్పుడే మొత్తం పాటకు సార్థకత ఏర్పడి, వినేవారు ఆనందిస్తారు. అలా విని ఆనందించడానికి ఇలాటి విశ్లేషణ అవసరం కూడా లేదు!
----------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

No comments: