Sunday, November 3, 2019

థాయ్‌లాండ్ యాత్రాగాథ – 4


థాయ్‌లాండ్ యాత్రాగాథ – 4




సాహితీమిత్రులారా!

కాంచనబురి
మే ఆరూ ఏడూ ఎనిమిదీ మా కాంచనబురి ప్రయాణం.

‘అదేమిటీ! ఏడో తారీఖున కొత్త రాజుగారి పట్టాభిషేకం గదా, ఆ వేడుక చూడరా?!’ అని మమ్మల్ని మేమే ప్రశ్నించుకొని, ‘లేదు! మాకు తీరిక లేదు!’ అని సరదా సమాధానాలు చెప్పుకొన్నాం.


ముందటి సాయంత్రమే దగ్గర్లో ఉన్న కార్ల రెంటల్ ఏజెన్సీకి వెళ్లి ఒక సరికొత్త అతిపెద్ద ఎస్.యు.వి. అద్దెకు తీసుకున్నాం. సత్యజిత్‌కు పెద్ద పెద్ద వాహనాలంటే ఇష్టం. అతని శరీరాకృతి కూడా పెద్ద వాహనాలకే అనుకూలం. ‘ఎప్పుడో చిన్నకార్లు నడిపానే కానీ ఇపుడా సంగతే ఊహించుకోలేను…’ అన్నారాయన. అలా అని మళ్లీ కాళ్ళు నేలకు తగలని మనిషి కాదు; ఉద్యోగమూ, వృత్తీ, జీవన సరళీ శిఖరాలలో తిరుగాడే మాట నిజమేగానీ క్షణాల్లో తన బాణీని మట్టిమీదకు దింపగల నేలవిడువని సామువీరుడాయన.

తెలతెలవారుతూ ఉండగానే నలుగురం ఇల్లు వదిలిపెట్టాం. ఈసారి ప్రయాణం అచ్చమైన పశ్చిమదిశలో–బర్మా సరిహద్దుల దిశలో–సాగింది. అంతా కలిసి నూటయాబై కిలోమీటర్లు. రెండున్నర గంటలు. చిన్న చిన్న ఊళ్లు తప్ప పెద్ద పట్నమంటూ దారిలో కనిపించిన గుర్తు లేదు. ఎనిమిదిన్నరకల్లా కాంచనబురి చేరుకొని, ఊరు దాటి వెళ్లి, ఒక నదిని దాటి ఆవలి ఒడ్డునే ఉన్న మా నివాసస్థలం చేరుకొన్నాం. సత్యజిత్ ముందే ఏర్పాటు చేసిన గైడ్, రికీ, మా కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. గలగలా కబుర్లు ఆరంభించాడు.

మా నివాస స్థలం పేరు ప్లకన్ రిసార్ట్.


ఆ ప్రదేశాన్ని చూడగానే గుండె లయ తప్పింది. అంతా కలిసి రెండెకరాలుంటుంది. ఇరవై పాతిక గదులకన్నా ఎక్కువ లేవు. చిన్నపాటి ఈత కొలను. ఆకర్షించే రూపపు డైనింగ్ హాలు భవనం. ఇవి దాటుకొని వెళ్లగానే నదీతీరం. మూడు నిడుపాటి వృక్షాలు. నదిలో లంగరు వేసి ఉన్న రెండతస్తుల పడవ. వాహ్-రె-వాహ్ అనిపించింది.

రిసెప్షన్‍లో ఇద్దరు యువతులు. ఒక సహాయకుడు. ఎవరికీ ఇంగ్లీషు అంతగా రాదు. మనం కష్టపడి చెపితే వాళ్లు ఇంకా కష్టపడి అర్థం చేసుకోగలరు. మా గైడ్‌కు ఇంగ్లీషు ధారాళంగా వచ్చు. అంచేత మా కష్టాలకూ రిసెప్షనువాళ్ల కష్టాలకూ ఈ గయుడు సరళపు కళ్లెం వేసి సంభాషణ సాఫీగా సాగేలా చేశాడు.

‘చెకిన్ లెక్క ప్రకారం పన్నెండింటికి. మీరు బాగా ముందొచ్చారు కదా, ఒక గంట ఆగినట్టయితే రూములు సిద్ధం చేసి మీకు అందిస్తాం.’ రిసెప్షన్‌వాళ్ల అభ్యర్థన.


గబగబా ఆలోచించాం. ఆ రోజు మా ప్లాను కాంచనబురికి సుమారు వంద కిలోమీటర్ల దూరాన ఉన్న ఇరావన్ నేషనల్ పార్క్‌కు వెళ్లడం, అక్కడి జలపాతాలు చూడటం, ఇంకా ఎగువన ఉన్న ఏదో ఆనకట్ట దాకా వెళ్లడం… అంతా కలసి ఆరేడు గంటల కార్యక్రమం. ఇక్కడే గంటా గంటన్నర రూములకోసం ఆగే బదులు ఆయా ప్రయాణాలన్నీ ముగించుకొని ఏకంగా సాయంత్రమే చెకిన్ చెయ్యచ్చుగదా అనిపించింది. మా సామానంతా రిసెప్షను వాళ్లకి అప్పగించాం. వెళుతోంది జలపాతాల దగ్గరకి కాబట్టి రిసార్ట్‌ వాళ్లనడిగి తలా ఒక టర్కిష్ టవలు తీసుకొన్నాం. (టవలు పోయిందంటే ఒక్కోదానికి అయిదొందల బాథ్‌లు కట్టాలి–బిక్కుబిక్కుమంటూ రిసెప్షన్‌ అమ్మాయి!) ఛలో ఇరావన్! అంటూ సాగిపోయాం.

రికీ మాటకారి. కామాలూ ఫుల్‌స్టాప్‌లూ పట్టింపు లేదతనికి. ఏభై ఏళ్ల క్రితం చూసిన గైడ్ సినిమాలోని దేవానంద్‌ను గుర్తుకుతెచ్చాడు. ముప్పై అయిదు-నలభై ఏళ్ల మనిషి.

“ఈ నది పేరేమిటి?” గూగుల్‌లో చూడొచ్చు గానీ గైడ్‌ను అడిగి తెలుసుకొంటే అదో ముచ్చట. “మెయిక్‌లాంగ్” అన్నది రికీ జవాబు.

“మరి రివర్ క్వాయ్?”


“ఓ… అదా? అయితే కొంచం వివరంగా చెపుతాను. ఇక్కడికి ఉత్తరాన ఉన్న కొండల్లో పెద్ద క్వాయ్ నది–స్థానిక భాషలో క్వాయ్ యాయ్–పుడుతోంది. దక్షిణాన చిన్న క్వాయ్: క్వాయ్ నాయ్. ఆ రెండు నదులూ ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల ఎగువన సంగమించి ఈ మెయిక్‌లాంగ్ నదిగా కొత్తపేరు సంతరించుకొంటున్నాయి. ఈ మెయిక్‌లాంగ్ మరో నూట పాతిక, నూటయాభై కిలోమీటర్లు దక్షిణంగా సాగి సాగి గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో సముద్రాన్ని చేరుతుంది.”

“గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండా!? మెయిక్‌లాంగ్… మొన్న మేం వెళ్లిన రైల్‌మార్కెట్ స్టేషను పేరు అదేననుకుంటాను.”

“అదే అదే! మీరు తిరుగాడిన ప్రదేశానికి ఆ సాగర సంగమస్థలం ఆట్టే దూరం లేదు,” వివరించాడు రికీ. మనసులో క్వాయ్-మెయిక్‌లాంగ్‌ల చిత్రపటం రూపుదిద్దుకొంది.

ముందుగా పెట్టుకొన్న పని బ్రేక్‌ఫాస్ట్. మా రిసార్టువాళ్ళు దానికీ బాగా టైమ్ పడుతుందనేసరికి, సరే ఊర్లో చూద్దాం, అని బయల్దేరాం. నేనూ కల్యాణిగారూ ఆ నది ఒడ్డునే ఎక్కడన్నా ఆగి ఏది దొరికితే దానితో ముగిద్దాం అని ముచ్చటపడ్డాం గానీ మిగిలినవాళ్లు రెగ్యులర్ రెస్టారెంటుకే ఓటు వేశారు.

ఊరు మరీ పెద్దదేంగాదు. అడిగితే, ‘మహా అయితే ఏభై అరవై వేల జనాభా ఉంటుందేమో…’ అని చెప్పాడు రికీ. కానీ తీర్చిదిద్దినట్టుగా ఉంది. పెద్ద పట్నాల్లోలాగా అడుగడుగునా రెస్టారెంట్లు. శుభ్రంగా ఆకర్షణీయంగా ఉన్న రోడ్లూ భవనాలూ… ఆకట్టుకొనే పట్నం… ఒక సొగసు సంతరించుకొన్న పట్నం! ఆ జిల్లాకు ముఖ్యపట్టణమట. అన్నట్టు మన కాంచనపురి అన్న పదానికి స్థానిక రూపం ఈ కాంచనబురి.

మా ప్రయాణం పెద్ద క్వాయ్ నదిని ఒరుసుకుంటూ సాగింది.

గంట గడిచేసరికి నదికి తోడుగా అడవి వచ్చి చేరింది. ‘ఇరావన్ నేషనల్ పార్క్ పరిసరాలివి,’ వివరించాడు రికీ.

ఆ గంట ప్రయాణంలో సగానికి పైగా రికీ మాటలే సాగాయి. పరిసరాల వివరాలే కాకుండా అక్కడి గ్రామాలు, గ్రామీణులు, వారి వారి అలవాట్లు, తన బ్రతుకు, అభిరుచులు, వృత్తి-వ్యాపకాలు, పెళ్లి-పెటాకులు, పిల్లలు, ఒంటరి జాలీ జీవితం… ‘మాటలూ వివరాల మోతాదు శ్రుతిమించుతోందా? మూడు రోజులు ఎలా భరించాలీ?’ అనిపించిన మాట నిజం. మాటల మధ్య తానొక మంత్రవేత్తననీ చెప్పుకొచ్చాడు! వాస్తు నిపుణుడు కూడానట… మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలియదు కానీ మంత్రగాళ్లు అనగానే ఎవరికైనా గుండెల్లో చిన్నపాటి గుబులు కలుగుతుంది. నాకూ కలిగింది! అది చూసి నా మీద నాకే చిరాకు వేసింది.


మరికాసేపటికి నేషనల్ పార్క్ చేరుకొన్నాం.

చూడగానే ఇదేదో భారీ వ్యవస్థలా ఉందే అనిపించింది. సువిశాల పార్కింగ్ ప్రాంగణం. పరిశుభ్రమైన రోడ్లూ, కాలిబాటలూ, బృహత్తర స్వాగత ఫలకాలూ… 1975లో నెలకొల్పిన 550 చదరపు కిలోమీటర్ల పార్కుట అది. అంతా అడవి… పార్కును దాదాపు ఆనుకొని ప్రవహించే క్వాయ్ నది… పార్కులోని కొండల మీదుగా దిగివచ్చి క్వాయ్ నదిలో కలిసే ఓమ్‌తల అన్న చిన్నపాటి కొండవాగు. ఇలాంటి నేషనల్ పార్కులు దేశంలో పన్నెండు ఉన్నాయట.


పార్కులో ముఖ్యమైన ఆకర్షణ ఈ ఓమ్‌తల అన్న ప్రవాహం దివినుంచి భువికి దిగివచ్చే ప్రక్రియలో ఏర్పడిన ఏడు అంచెల జలపాతం. ఆ ఏడు అంచెలూ రెండున్నర మూడు కిలోమీటర్ల కొండమార్గంలో పరచుకొని ఉన్నాయట. పర్యాటకులు అయిదో అంచె వరకూ వెళ్లిరావచ్చు. ఏడో అంచె దగ్గర జలపాతపు ఆకృతి మన మూడు తలల ఐరావతాన్ని (అది మూడు తలల గజరాజం అని నాకు అప్పటిదాకా తెలియదు!) పోలి ఉంటుంది కాబట్టి జలపాతానికి ఇరావన్ అన్నపేరు…

వెళ్లింది సోమవారం గదా, అందులోనూ బ్యాంకాక్‌కు బాగా దూరాన ఉన్న ప్రదేశం గదా పర్యాటకులు అంతగా ఉండరనుకొన్నాను. అంచనాలకు మించి ఉన్నారు. అందులో అత్యధికులు స్థానికులే. విదేశీయుల సంఖ్య బాగా తక్కువ. భారతీయులు దాదాపు లేరు. ఎండలు మాడ్చుతోన్న వేసవి గదా, జలపాతాల్లో నీళ్లు ఉంటాయో లేదో అని సందేహపడుతూ ముందుకు సాగాం.

పర్యావరణ పరిరక్షణ విషయంలో పార్కు అధికారులు మహా పట్టుదలగా కనిపించారు. రెండో అంచె దాటి తిండి పదార్థాలు అనుమతించం అన్నారు. మా ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లు వాళ్లు అట్టేపెట్టుకొని వాళ్ల దగ్గర ఉండే గట్టిపాటి వాటర్ బాటిల్స్ అందించారు, నామమాత్రపు రుసుముతో. దారిపొడవునా ప్లాస్టిక్ సంచులు గానీ, బాటిళ్లు గానీ, మరే ఇతర వ్యర్థపదార్థాలు గానీ లేకుండా, అడవి మనోహరత్వానికి ఏ భంగమూ లేకుండా కనిపించింది.

జలపాతపు అయిదో అంచు వరకూ వెళ్లాలన్నది మా సంకల్పం.


ఆట్టే శ్రమ లేని ఆరోహణ. ఆహ్లాదం కలిగించే పచ్చదనం. అతి సులభంగా అందుబాటు లోకి వచ్చిన జలపాతపు మొదటి రెండు అంచెలు… శ్రుతి అయిన మనసులతో మా కబుర్లు, ఛలోక్తులు… హఠాత్తుగా రికీ ‘ఆ చెట్టు వేపు చూడండి!’ అంటూ చూపించాడు. ఓ నిడుపాటి వృక్షపు కాండం మీద పదిహేను ఇరవై అడుగుల ఎత్తున కాండం రెండుగా చీలిన చోట చిక్కని పచ్చదనం. పచ్చదనం కాదు. విష సర్పం! ‘ఈ అడవుల్లో ఇవి బాగా కనపడతాయి. కానీ మందకొడి జీవులు. మనం మరీ వాటిల్ని రెచ్చగొడితే తప్ప మనమీదకు రావు.’ వివరించాడు రికీ.

ఒక్కో అంచెకూ ఒక్కో ఆకృతి. ఒక్కో సౌందర్యం. నీళ్లు ధారాళంగా లేవుగానీ జలపాతపు స్ఫూర్తిని మాత్రం కలిగిస్తున్నాయి. అయినా నీళ్లూ మనుషుల నిష్పత్తి తగుమాత్రంలో లేకపోవడం వల్ల నీటిలోకి దిగి జలపాతం క్రింద తడవాలి అన్న కోరిక మాలో నీరుగారిపోయింది. రికీ మాత్రం మాకన్నా ఎక్కువగా బాధపడ్డాడు: ‘ఇప్పుడిలా ఉన్నాయి గానీ వర్షాకాలంలో నీటి సౌందర్యం, జలసంపద చూడండి’ అంటూ తన స్మార్ట్ ఫోన్‌లోని ఈ జలపాతాల పాత ఫోటోలు పదేపదే చూపించాడు. ‘పర్లేదయ్యా! మాకో సామెత ఉంది. చక్కనమ్మ చిక్కినా అందమే అని. బావున్నాయి. బాధపడక.’ మేమే అతణ్ణి ఓదార్చాల్సి వచ్చింది.


నాలుగో అంచె చేరే ప్రయత్నంలో కొండ బాగా ఎక్కేశాం. మధ్యలో చక్కని వ్యూపాయింట్లు… పచ్చని లోయలు… ఫోటోలు దిగడానికి అనువైన ప్రదేశాలు… ఆ నాలుగో అంచె జలపాతం మేవు చూసిన అయిదింటిలోనూ అతి చక్కనిది. ఒక పద్ధతి ప్రకారం నలభై అడుగుల వెడల్పునా సుమారు వంద అడుగులు నిలువునా పడుతోన్న పాల ధారలు, వాటి వెనక కూడా కూర్చోవటానికి అవకాశం, అలా కూడినవారి ఆటలూ కేరింతలతో ఉల్లాస వాతావరణం, దిగువున మడుగులో కాళ్లుజాపితే వచ్చి ఆ పాదాల ‘రుచి చూసి’ గిలిగింతలు పెట్టే చిన్న చిన్న చేపలు… గంట చులాగ్గా గడిచిపోయింది.

అయిదో అంచె చిన్నది. అంతా కలసి పదిహేనూ ఇరవై అడుగుల నిడివి. కానీ అక్కడో సౌలభ్యం ఉంది–ఆ నీరంతా వాలుగా ఉన్న రాళ్ల మీదుగా ప్రవహించడం వల్ల చిన్నపిల్లలూ, పసితనం కోల్పోని పెద్దవాళ్ళూ చక్కగా అక్కడ జారుడుబండ ఆడుకోవచ్చు. వాటర్ స్లైడ్ అన్నమాట!

దిగేటపుడు ‘మరో దారిలో వెళదాం రండి,’ అంటూ దారితీశాడు రికీ.


క్షణాల్లో జనసందోహం మటుమాయమయింది. పచ్చని చిక్కని వెదురు పొదలు ప్రత్యక్షమయ్యాయి. సరళమైన కాలిబాట. తమకే సాధ్యమయిన నేవళమూ సరళరేఖా సౌందర్యాలతో ఆకాశంలోకి చొచ్చుకుపోతూ చక్కని ఆకృతులు సృష్టిస్తోన్న వెదురు పొదలు. ఊహించని ఆ అందానికి మనసు లయ తప్పింది. చూసిన జలపాతాలు ఒక ఎత్తు, ఈ వెదురు వనాలు ఒక ఎత్తు అనిపించింది. ఆ ఆనందానికి కారకుడయిన రికీ మీద అనంతంగా ప్రేమ కలిగింది. నమ్మకం పెరిగింది. హఠాత్తుగా ‘ఇది చూశారా? వెదురు బియ్యపు కంకులు. చూడండి, చూడండి!’ అంటూ రికీ హడావుడి చేశాడు. వరి కంకులతోనూ వరి గింజలతోనూ పోలిస్తే సగానికి సగం పరిమాణంలో కంకుల రాశి. వెదురూ వరీ స్థూలంగా ఒకే తృణజాతికి చెందినవన్న చిన్ననాటి పాఠం గుర్తొచ్చింది. వెదురు బియ్యం గురించి వినడమే కానీ చూడటం మా అందరికీ అదే మొదటిసారి.

‘ఈ క్వాయ్ నది మీద కాస్తంత ఎగువన పది కిలోమీటర్ల దూరంలో శ్రీనగరిండ్ డామ్ ఉంది, చూసి వద్దాం పదండి.’ దారి తీశాడు రికీ. దారి పొడవునా నది ఒడ్డున చిన్న చిన్న ఇళ్లు. గెస్టుహౌసులు. ఇరిగేషన్ వాళ్ల ఆఫీసులు. ఆ పచ్చని ప్రకృతిలో నది ఒడ్డునే ఒద్దికగా అమరి ఉన్న ఆ ఇళ్లను చూసేసరికి దిగిపోయి కనీసం ఒకటి రెండు వారాలు ఇక్కడే ఉండిపోదామా అనిపించింది.


డామ్ బృహత్తరమైనదే. ఎగువున జలాశయం, దిగువున క్వాయ్ నదీ పిక్చర్ పోస్ట్‌కార్డుల సౌందర్యంతో వెలిగిపోతున్న మాటా నిజమే. అయినా అప్పటిదాకా నడచి నడచి ఉండటం వల్లనో, ఎండ తారాస్థాయికి చేరడం వల్లనో, అక్కడ చెట్ల నీడ అంటూ లేకపోవడం వల్లనో, అందరిలోనూ సౌందర్య పిపాస స్థానంలో పిసరంత చిరాకు వచ్చి చేరింది. గబగబా చూశాం అంటే చూశాం, ఫోటోలు తీశాం అంటే తీశాం అనుకొంటూ ఆ ప్రదేశం వదిలిపెట్టాం.

పరేంగిత జ్ఞాని రికీ మా మానసిక స్థితిని పసిగట్టాడు. భరోసా ఇచ్చాడు: ‘అంతా డస్సిపోయినట్టున్నారు కదా, పదండి. చక్కని ప్రదేశంలో భోజనానికి ఆగుదాం,’ అంటూ నది ఒడ్డున, చెట్ల నడుమన, విశాలమైన ప్రాంగణంలో, సహజమైన అలంకరణతో, ఉండీలేని కస్టమర్లతో ఆహ్వానం పలుకుతోన్న ఓ చక్కని రెస్టారెంటులోకి మమ్మల్ని నడిపించాడు. దాన్ని నడిపేవాళ్లు అతనికి బాగా తెలిసిన మనుషులే. గైడ్ అన్నతర్వాత ఇలాంటి ప్రదేశాల్లో ఉండే మనుషులంతా తెలిసి ఉండటం సహజం అనిపించింది.


మధ్యాహ్నం రెండు దాటేసింది. ఇహ ఆ రోజుకు మేము మరే కార్యక్రమమూ పెట్టుకోలేదు గాబట్టి హడావుడి లేకుండా గంటా గంటన్నరసేపు డైనింగ్ టేబుల్ దగ్గరే గడిపాం. చుట్టుపక్కల అంత సుందరంగా ఉండటం పుణ్యమా అని నేను ఆయా వంటకాల రుచీపచీ ఏ మాత్రం పట్టించుకోలేదు!

తిరిగి ప్లకాన్ రిసార్ట్ చేరేసరికి సాయంత్రం అయిదయింది.

గదులు తీసుకోవడం, సామాన్లు తెచ్చుకోవడం, రెండురోజుల నివాసానికి అనువుగా ఆయా సామాన్లను కప్‌బోర్డుల్లో సర్దుకోవడం, కాసేపు ఒత్తిగిల్లడం, కాఫీమేకర్ వాడి ఒక స్ట్రాంగ్ కాఫీ సేవించడం–అరగంటా గంటకల్లా ఇంట్లోనే ఉన్న భావన! ఫీలింగ్ ఎట్ హోమ్!


గది బయటకు రాగానే అద్భుత సంధ్య మా కోసం ఎదురుచూస్తూ కనిపించింది. చీకటీ వెలుగూ కాని అమృత ఘడియలు. ఆ నీలివర్ణపు దిగువన నింపాదిగా విశాలంగా ప్రవహిస్తోన్న మెయిక్‌లాంగ్ నది. గడ్డాల రుషుల్లా నిశ్చలంగా వృక్షాలు. వాటిమీద మెరిసే విద్యుద్దీపాలు, దూరాన ఉనికిలోకి వస్తోన్న రాత్రి దీపాలు. అప్పుడే హెడ్‌లైట్లు వేసుకుని వంతెన దాటుతోన్న వాహనాలు. అలాంటి మంత్రబద్ధమైన స్థలకాలాల్లో మేమంతా మంత్రముగ్ధులైపోవడం సహజంగా జరిగిపోయింది.

రిసార్టుకు చెందిన రేవులో లంగరు వేసి ఉన్న రెండంతస్తుల పడవ మీదకు చేరాం. కబుర్ల కోసం అనుకొన్న ఆ బైఠక్ కాస్తా అక్కడి రాగభరిత వాతావరణంలో శ్రుతిలయలు సంతరించుకొని మాటలు, పాటలుగా మారింది. యూ ట్యూబ్ వినిపించే అలనాటి అద్భుత సినీగీతాలు సరేసరి. మనమీద మనకే అసూయ కలిగేలాంటి అతి చక్కని సంధ్యాసమయం అది! తనివి తీరలేదే… అనుకొంటూ ఆ రోజుకు వీడ్కోలు చెప్పాం.

మే నెల ఏడో తారీఖు. కాంచనబురిలో రెండోరోజు, థాయ్‌లాండ్‌లో అయిదోది.

కాంచనబురి పరిసరాల్లో రైలు ఎక్కి, క్వాయ్ నది ఒడ్డునే ఏభై కిలోమీటర్లు పశ్చిమంగా సాగి, థమ్‌క్రసె బ్రిడ్జ్ అన్న చోటుకు చేరి గంటా రెండు గంటలు గడపడం మా కార్యక్రమంలో మొదటి అంశం. అక్కడ్నించి మళ్లా నది ఒడ్డునే మరో ఏభై కిలోమీటర్లు వాయువ్య దిశలో సాగి సైయాక్ నేషనల్ పార్క్‌లో ఉన్న హెల్‌ఫైర్‌ పాస్–నరకాగ్ని కనుమ–అన్న ప్రదేశాన్ని చూసి రావడం కార్యక్రమంలో రెండవ అంశం. తిరుగు ప్రయాణంలో ఆ నేషనల్ పార్కులో ఉన్న సైయాక్ జలపాతాన్ని చూడటం ఆనాటి మా కార్యక్రమంలో చివరి అంశం.


“మీరు రైలు ఎక్కే స్టేషను మన రిసార్టు నుంచి ఐదారు కిలోమీటర్లు ఉంటుంది. మీ వెహికిల్ తీసుకువస్తే దాన్ని స్టేషన్లో పార్క్ చేసి రైలు ఎక్కాలి. థమ్‌క్రసె బ్రిడ్జి నుంచి మళ్లీ మనదంతా రోడ్డు ప్రయాణమే… అక్కడ వాహనం లేకపోతే ఇబ్బంది అవుతుంది. నాదో సలహా, రేపంతా మీ వెహికిల్ వాడకండి. నా బండి తీసుకొస్తాను. రైల్వే స్టేషన్లో మిమ్మల్ని దింపి థమ్‌క్రసెకు రోడ్డు పట్టుకొని వచ్చి కలుస్తాను. రోజంతా నా బండిలో తిరిగాక సాయంత్రం రిసార్టులో దింపుతాను.” రికీ ప్రతిపాదన. అతని కారులో నలుగురమూ కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుందేమోనని సందేహిస్తూనే ఆ సలహాలో ఉన్న ఇతర సుగుణాలకు లొంగి సరే అన్నాం.

తెలతెలవారుతుండగానే తన ఎస్.యు.వి.తో ప్రత్యక్షమయ్యాడు రికీ! అది మా వెహికిల్ అంత విశాలంగానూ ఉంది! థాయ్‌లాండ్‌లో గైడ్‌లు కూడా అతి చక్కని జీవన ప్రమాణాలతో బ్రతకగలుగుతున్నారన్నమాట అనిపించింది. సంతోషం కలిగింది.


ఊరు చివర పల్లెటూరి పరిసరాల్లో ఉంది రైల్వే స్టేషను. స్టేషన్లో దింపి, మాకు టికెట్లు కొని ఇచ్చి, ముందుకు సాగాడు రికీ. రైలు బయల్దేరేది అక్కడ్నించే. ఇంకో ఇరవై నిముషాలు టైమ్ ఉండటంతో ఆ పరిసరాలలో ఆ ప్రభాత సమయాన తనివితీరా తిరుగాడాం. ఫోటోలు తీసుకున్నాం. ఆహ్లాదంతో మనసును నింపుకున్నాం. ఆహ్లాదాల సంగతి ఎలా ఉన్నా ఆ రైలు మార్గపు చరిత్ర చాలా విషాదం నిండినది. ఇప్పటికీ ఆ థాయ్‌లాండ్-బర్మా రైలుమార్గాన్ని వాడుకలో డెత్ రైల్వే–మృత్యుమార్గం–అనే పిలుస్తారు.

1942 నాటి సంగతి అది.

రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతోన్న రోజులవి. పర్ల్ హార్బర్ మీద దాడి ద్వారా జపాన్ విజయవంతంగా ఆ యుద్ధంలో అడుగుపెట్టిన సందర్భమది. ఆగ్నేయాసియా దేశాలన్నీ జపానువారి అధీనంలో ఉన్న సమయమది. అండమాన్ నికోబార్ ద్వీపాలు కూడా ఆక్రమించబడిన సమయమది. భారతదేశం మొత్తాన్ని జయించాలన్న సంకల్పంతో జపాను ఉరకలు వేస్తోన్న వేళ అది.


థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి బర్మాలోని రంగూన్ వరకూ రైలుమార్గం నిర్మించగలిగితే తమ భారతదేశ విజయానికి మార్గం సులువవుతుందని జపానువాళ్ల ఆలోచన. బ్యాంకాక్ పరిసరాల్లోని బన్‌పాంగ్ అన్నచోటు నుంచి బర్మాలోని బంగాళాఖాతపు రేవుపట్నం థన్‌బయుజాయట్ దాకా నాలుగువందల కిలోమీటర్ల రైలు మార్గం ఏడాదీ ఏడాదిన్నరలో పూర్తిచెయ్యాలన్నది వారి ప్రణాళిక. అనుకొన్న ప్రకారం పదిహేను నెలల్లో పని పూర్తయింది. మూడు లక్షలమంది శ్రమ ఫలితమది. అందులో ఎక్కువమంది థాయ్‌లాండ్, మలేషియాల నుంచి తీసుకువచ్చిన కూలీలు. వాళ్లతోపాటు వేలాదిమంది యుద్ధ ఖైదీలు–అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, హాలెండ్; వీళ్లే కాకుండా పదివేలమంది జపాను పనివాళ్లూ, అధికారులూ. పని విజయవంతం అయినమాట నిజమేగానీ ఆ విజయం ఖరీదు లక్ష ప్రాణాలట! అందులో వెయ్యిమంది జపనీయుల ప్రాణాలూ ఉన్నాయన్నది ఓ పొయెటిక్ జస్టిస్!

బయల్దేరిన పది నిముషాల్లో రైలు ఒక గంభీరమైన వంతెన దాటింది. అదేనట ప్రఖ్యాతి చెందిన ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్! “అయ్యో! ఆగకుండా వెళ్లిపోతున్నామా!” నా ఆక్రోశం. “తిరుగు ప్రయాణంలో ఆగుదాం.” సత్యజిత్ హామీ.


మూడు రోజుల క్రితం రైల్‌మార్కెట్‌కు చేసిన రైలు ప్రయాణం ఒక రకపు అనుభవమయితే ఈనాటి ప్రయాణం అందుకు భిన్నమైన అనుభవం. ఆనాడు పరిసరాల్లో ఉప్పుమళ్లు, సముద్రపు గాలి. ఈ రోజు చుట్టుపక్కల అంతా కొండగాలి. అడవి పచ్చదనం. మధ్యలో గ్రామాలు, పొలాలు, ఎర్రెర్రని పూల చెట్లు, చిన్న చిన్న రైల్వే స్టేషన్లు, ఎక్కే దిగే గ్రామీణులు, వాళ్లతో కబుర్లు. జీవితంలో మొట్టమొదటిసారి రైలు ప్రయాణం చేస్తున్నంత పరవశం! అన్నట్టు కాంచనబురి పరిసరాల్లో పెద్ద క్వాయ్ (క్వాయ్‌ నాయ్) నదిని దాటిన మా రైలు బండి తన మిగిలిన ప్రయాణమంతా చిన్న క్వాయ్ (క్వాయ్ యాయ్) పరిసరాల్లో సాగించింది. ఉదయం ఏడున్నరకు థమ్‌క్రసె బ్రిడ్జి చేరేసరికి రైలుమార్గం నదిని ఒరుసుకొంటూ కనిపించింది. అపారమైన సౌందర్యంతో!

ఆ సౌందర్యమే ఈ ప్రదేశాన్ని విలక్షణ పర్యాటక గమ్యంగా నిలబెట్టింది.

Video Player

00:00
00:60


ఒంపులు తిరుగుతూ ప్రవహించే నది, కుడివేపున నిడుపాటి కొండ చరియలు, ఎడమవేపున నది ఒడ్డున అందమయిన ఇళ్లు, రిసార్టులు, నది లోపలికి చొచ్చుకు వచ్చిన పడవల జెట్టీలు, టూరిస్టు కాటేజ్‌లు, ఆ పక్క నుంచి నింపాదిగా సాగే రైలు, నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతం మీదుగా అప్పట్లో కట్టిన నాలుగయిదు వందల మీటర్ల దిట్టమైన చెక్క వంతెన, అడుగడుగునా మా అడుగుల్ని నిలిపి ఫోటోలు తియ్యమని శాసించే ప్రకృతి–నలుగురమూ మళ్లా చిన్నపిల్లలం అయిపోయిన సందర్భమది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ప్రకృతి ఒకే రకమైన సౌందర్యంతో కనిపించగలదన్న విషయం స్ఫురణకు వచ్చిన సందర్భమది. అడుగు ముందుకు వేస్తే ఆ ప్రకృతిలో భాగమై పోగలమన్న ఎరుక మరోసారి మరోసారి కలిగిన సందర్భమది.


సౌందర్యం కలిగించిన దిగ్భ్రమలోంచి బయటపడ్డాక అందరం మెల్లగా అయిదువందల మీటర్ల ‘వంతెన’ మీద ఉన్న రైలుపట్టాలపైన నడక ఆరంభించాం. ‘మళ్లా ఇప్పట్లో మరో రైలు రాదు. మీరు నింపాదిగా పట్టాల మీద తిరిగి రండి’ అని స్థానికులు ప్రోత్సహించారు. పట్టాల మీది నడకతో తనివి తీరక వంతెన దిగువున కాలిబాటలు కనబడితే వాటిల్నీ పట్టుకొని తలపైన కనిపిస్తోన్న బలమైన చెక్క వంతెనను ఆరాధనగా చూస్తూ గంటా గంటన్నర గడచిపోయింది. రైలుమార్గం పక్కనే ఉన్న గుహలో ఆకర్షణీయమైన బుద్ధప్రతిమ కనపడితే, అక్కడో పావుగంట. స్టేషను పరిసరాల్లో ఇంకా నగరపు వాసన సోకని దుకాణాల బారులు. రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబ్ షెల్ అంటూ నిలబెట్టిన లోహపు తునక. పెద్దాళ్లంతా తమ దుకాణాల బేరసారాల్లో మునిగి ఉంటే ఆ పరిసరాల్లో తమ సైకిలు మీద ఆడుకుంటోన్న అన్నాచెల్లెళ్లు…


డెత్ రైల్వే నిర్మాణంలో జరిగిన దారుణాలను విప్పిచెప్పే రెండు ముఖ్యమైన నవలలూ సినిమాలూ వచ్చాయి. 1952లో ఒక ఫ్రెంచి రచయిత రాసిన ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ అందులో ఒకటి. ఆ నవల ఆధారంగా అదే పేరుతో డేవిడ్ లీన్ దర్శకత్వంలో 1957లో సినిమా వచ్చింది. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఏడు ఆస్కార్ అవార్డులు గెలుచుకొంది. అరవై ఏళ్ల తర్వాత కూడా వీక్షకుల్ని అనేకానేక స్పందనలకు ఏకకాలంలో గురిచేస్తూ ఆకట్టుకొనే శక్తి ఉన్న క్లాసిక్ సినిమా అది.

హెల్‌ఫైర్ పాస్ అన్నచోట ఉన్న కొండల్ని ఛేదించి రైలుమార్గం నిర్మించే క్రమంలో దారుణాలు చోటుచేసుకున్నాయి. ఆయా సంఘటనల ఆధారంగా 2013లో ది రైల్వే మాన్ అనే సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల చారిత్రక ప్రామాణికత మీద ఎన్నో విమర్శలు వచ్చినా, వాస్తవాన్నీ కల్పననూ అగ్రరాజ్య పక్షపాతాన్నీ కలగలిపారన్న నిందలు వచ్చినా–ఆనాటి ఘటనల విషయంలో ఈ సినిమాలను మించిన కళారూపాలు ఇప్పటికి లేవనే చెప్పాలి.

ఇక్కడో విశేషం చెప్పుకోవాలి.

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు, శతాబ్దాల తరబడి, ఆగ్నేయాసియా దేశాలన్నీ యూరోపియన్ దేశాల వలసలుగా మనుగడ సాగించాయి. థాయ్‌లాండ్‌కు తూర్పున ఉన్న లావోస్, కంబోడియాలు ఫ్రెంచి పాలనలో ఉంటే, దక్షిణాన ఉన్న మలేషియా, పశ్చిమాన ఉన్న బర్మా బ్రిటిషు వలసలు. ఇహ భారతదేశం సంగతి సరేసరి. మధ్య ఒక్క థాయ్‌లాండ్ మాత్రం స్వతంత్ర దేశంగా మనగలిగిందట. తమ తమ వలసదేశాల మధ్య ఒక తటస్థ ప్రదేశం ఉండటం మంచిదని భావించిన ఫ్రెంచ్, బ్రిటిష్ పాలకులు థాయ్‌లాండ్‌ను అలా స్వతంత్ర తటస్థ దేశంగా ఉంచారని చరిత్రకారుల నిర్ధారణ! యుద్ధం సమయంలో థాయ్‌లాండ్ జపాన్ వేపు మొగ్గు చూపి మిత్ర రాజ్యాల ఆగ్రహానికి గురి అయింది.


థమ్‌క్రసె బ్రిడ్జ్ దగ్గర నదినీ, వంతెనలనూ, ప్రకృతినీ వదలలేక వదలలేక వదిలిపెట్టి మా మరుసటి మజిలీ, హెల్‌ఫైర్‌ పాస్ వేపుగా సాగాం. ఉత్తర దిశలో ఏభై కిలోమీటర్లు. గంటన్నర. దారికి కుడివేపున నిన్నంతా గడిపిన ఇరావన్ నేషనల్ పార్క్ అయితే ఎడమవేపున సైయాక్ నేషనల్ పార్కు. రెండింటి నడుమన ఈ హెల్‌ఫైర్ పాస్, నరకాగ్ని కనుమ. అదంతా బర్మా సరిహద్దు ప్రాంతం. కొండలు, అడవులు, పచ్చికబయళ్లు–మనోహరమైన ప్రయాణమది. సినిమాల్లో చూసే స్విట్జర్లాండ్ గుర్తొచ్చింది.


డెత్ రైల్వే నిర్మాణంలో అతి కీలకమైన ఘట్టం హెల్‌ఫైర్ కనుమ దగ్గర కొండల్ని ఛేదించడం, రైలు మార్గం నిర్మాణానికి అనుగుణంగా మలచి పట్టాలు వెయ్యడం. రేయింబవళ్లు పని జరిగిందట. అతి దారుణంగా పని చేయించారట. శ్రుతిమించిన శారీరక శ్రమ, సరిపోని ఆహారం, మలేరియా లాంటి వ్యాధులతో వేలాది మరణాలు! అలా మరణించిన యుద్ధ ఖైదీలలో వందలాదిమంది ఆస్ట్రేలియన్లు ఉన్నారట. వారికి నివాళిగా 1987లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించింది. అప్పటి పరికరాలను, జ్ఞాపకాలను ఒకచోట చేర్చి అక్కడే ఒక మ్యూజియం స్థాపించింది. మ్యూజియం ఉన్న ప్రాంతం నుంచి దిగువన రైలుమార్గం దాకా సరళమైన కాలిమార్గాన్ని నిర్మించింది.

ముందుగా మ్యూజియం లోకి వెళ్లాం. చిన్నపాటి మ్యూజియం. గబగబా ఒక చుట్టుచుట్టి వచ్చాం. అప్పటి ఫోటోలు, ఆ యుద్ధ ఖైదీలలో ఇంకా బ్రతికివున్నవారితో జరిపిన సంభాషణల వీడియోలు, ది రైల్వే మాన్ సినిమా నిర్మాణ వివరాలు… ఇవన్నీ వివరంగా చూసేముందు ఒకసారి ఆ కనుమలో నడచివస్తే బావుంటుందని అటువేపు మళ్లాం.


అంతా కలసి రెండు కిలోమీటర్లు. అందులో పావువంతు దిగువకు మెట్లు దిగడం. కొండను తొలచిన ఆనవాళ్లు. అక్కడక్కడ అప్పటి రైలుపట్టాలూ, స్లీపరు బద్దీలూ; ఆ పనికోసం వాడిన పనిముట్లూ. ఒక పక్కనంతా పచ్చని లోయలు. కనుమ గోడలకు తాపడం చేసిన ఆనాటి యుద్ధ ఖైదీల ఫోటోలు, వారికి ఇప్పటి వారసులు పంపిన సందేశాలు. ఆ కాలిబాట చివర ఏ ఆడంబరాలూ లేని చిన్నపాటి శిలాఫలకం, ఆ ఫలకంతో పాటు తమ తమ ఖైదీలను కోల్పోయిన నాలుగు దేశాల జాతీయ జెండాలు… మనసున్న ఏ మనిషికయినా గుండెలు బాధతో నిండిపోయే ప్రదేశమది.


కనుమలో తిరుగాడి సంతరించుకొన్న పరిజ్ఞానంతో మ్యూజియంలో మరో అరగంట గడిపాం. అక్కడ ప్రదర్శించిన చిత్రాలూ వివరాలూ మనసుకు మరికాస్త గాఢంగా హత్తుకున్నాయి. ఇలా రైలుమార్గాల నిర్మాణంలోనే ఇంతింత దారుణాలు జరిగి వేలాది జీవితాలు అంతరించిపోతే, అనంత విషాదం మిగిల్చి వెళితే, మరి ఏ నాజూకులూ లేకుండా తిన్నగా విషవాయువుల ఛాంబర్లలోకి మనుషుల్ని పంపేసినపుడు అది ఎన్ని లక్షల రెట్ల విషాదాన్ని మిగిల్చి ఉంటుందోగదా అన్న ఆలోచన ఒళ్లు జలదరింపజేసింది.

నరకాగ్ని కనుమ విడిచిపెట్టేసరికి నాలుగు దాటేసింది.

తిరుగు ప్రయాణం నైసర్గిక సౌందర్యం పుణ్యమా అని మరింత సంతోషంగా సాగింది. ఎక్కడో రోడ్డు పక్కన విరగబూసిన ఎర్రపూల ఒంటరి చెట్టు కనిపిస్తే పనిగట్టుకుని వాహనం ఆపించి ఫోటోలు… మరికాస్త దూరం వెళితే సైయాక్ జలపాతం… జలధారలు పెద్దగా లేక అంతగా మమ్మల్ని ఆకట్టుకోలేదు గానీ నిండువర్షాల కాలంలో ఆ బండలన్నీ ఉప్పొంగి పొంగే నదీజలాలతో నిండి ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకొని సంతృప్తిపడ్డాం. ‘ఒట్టి ఊహించుకోవడమే ఎందుకూ? ఈ జలపాతపు వర్షాకాలం ఫోటోలు చూపిస్తాను చూడండి…’ అంటూ రికీ సెల్‌ఫోన్లో అవన్నీ చూపించి మా ఊహలు ఒట్టి ఊహలు కావని నిరూపించేశాడు.

కాంచనబురి పొలిమేరల్లో మళ్లీ రివర్‌ క్వాయ్ మీది బ్రిడ్జి దగ్గరకు చేరాం. నా పట్టుదల పుణ్యమా అని అక్కడో నలభై నిముషాలు.


కర్నల్ నికల్సన్ అన్న బ్రిటిష్ అధికారి ఆగ్నేయాసియా యుద్ధరంగంలో బ్రిటిష్ ప్రభుత్వం జపానువారికి లొంగుబాటుకు అంగీకరించినపుడు తన దళంతోపాటు జపానువారికి ఐచ్ఛికంగా లొంగిపోవడం, తాము ఖైదీల స్థాయికి చెందినవారమే అయినా యుద్ధ ఖైదీలకు చెందవలసిన గౌరవమర్యాదల కోసం ప్రాణాలకు భయపడకుండా ప్రతిఘటించడం, ఆ జపానువారు క్వాయ్ నది వంతెన నిర్మాణంలో తన బ్రిటిష్ దళాన్ని వినియోగించినపుడు వృత్తి నిబద్ధతతో అతినాణ్యమైన వంతెనకు రూపకల్పన చేసి నిర్మించడం, తమ బ్రిటిష్ గూఢచారులే ఆ వంతెనను కూల్చే ప్రయత్నాలు చేసినపుడు నిరోధించి మరణించడం–ఇదీ ఆ ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ చలనచిత్రపు గాథ. ఎన్నెన్ని సినిమాటిక్ కల్పనలు ఉన్నప్పటికీ ఆ సంఘటనా, ఆ పాత్రలూ నిజ జీవితంలోంచి తీసుకున్నవే అన్నది విజ్ఞుల అభిప్రాయం. సినిమానూ నవలనూ పదే పదే చదివి చూసిన నాకు ఆ మీమాంసతో పనేలేదు.


ఆ వంతెన, దాని దిగువన పర్యాటకుల కోసం పునర్నిర్మించిన యుద్ధ ఖైదీల శిబిరం, అందులో నిలబెట్టివున్న అప్పటి వాహనాలు, తాత్కాలిక నివాస స్థలాలు ఒక్కసారిగా నన్ను 1942లోకి తీసుకువెళ్లాయి. నవలలోని పాత్రలన్నీ ప్రాణం పోసుకొని తమ తమ స్థానాల్లో నిలబడి పలకరిస్తోన్న భావన… ఆ మనఃస్థితికి ఊతమిస్తూ తడిపీ తడపని సన్నపాటి వర్షపు జల్లు… అనిర్వచనీయమైన అనుభూతి. అన్నట్టు డేవిడ్ లీన్ తీసిన సినిమా చిత్రీకరణ ఇక్కడ జరగలేదట. అసలు థాయ్‌లాండ్‌లోనే తియ్యలేదట. ఇలాంటి పరిసరాలే ఉన్న శ్రీలంకలోని మరో లొకేషన్‌లో చిత్రీకరించాడట. అప్పటికి హైస్కూలు విద్యార్థిగా ఉన్న బాలూమహేంద్ర ఆ సినిమా షూటింగులు చూసి చూసి, సినిమాలమీద ఆసక్తి పెంచుకొని ఆ రంగంలోకి అడుగుపెట్టాడట!

“ఇప్పటితో నా డ్యూటీ అయిపోతోంది. రేపు మీరు తిన్నగా బ్యాంకాక్ వెళ్లిపోకండి. మీ రిసార్ట్ దగ్గర్లోనే ఒక చక్కని కలువల కొలను ఉంది. రెండు ఆకట్టుకొనే బౌద్ధాలయాలు ఉన్నాయి. ఉదయం అక్కడ గడిపి వెళ్లండి” అని చెపుతూనే రికీ మమ్మల్ని ఆ దారులంతా తిప్పి చూపించాడు!


“ఈ రెండు రోజుల ప్రయాణం నీలాంటి వాళ్లకు సంతృప్తి ఇవ్వదని నాకు తెలుసు. కనీసం వారం రోజులు ఇక్కడ తిరుగాడాలి నువ్వు. మళ్లీ రా. బ్యాంకాక్ నుంచి బస్సు పట్టుకొని కాంచనబురి వచ్చెయ్యి. వచ్చి నాకు ఫోన్‌చెయ్యి. ఒక మోటారు సైకిలు ఇప్పిస్తాను. ఎక్కడెక్కడ, ఏయే కొండకోనల్లో తిరగాలో వివరంగా చెపుతాను. ఇదంతా నేను వృత్తిధర్మంగా చెప్పటం లేదు. మిత్రధర్మంగా చెపుతున్నాను. నన్ను నమ్మి మరోసారి రా!” అంటూ రికీ చెవిలో గుసగుసలాడాడు. స్నేహాన్నీ ధనాన్నీ విడివిడిగా చూడగల పరిణత మనస్కుడు రికీ!
(సశేషం)
-------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments: