Saturday, November 30, 2019

శ్రుతిలయల నందనవనం


శ్రుతిలయల నందనవనం




సాహితీమిత్రులారా!


ఈ రోజుల్లో తమ పిల్లలకు సంగీతం నేర్పించాలని చాలా మంది తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరివద్ద నేర్చుకోవాలనేది ఒక సమస్య అయితే ఎటువంటి సంగీతం అనేది రెండో సమస్య. నేర్చుకున్నది ఏదైనా తరవాత పాడబోయేది శాస్త్రీయ సంగీతమా, సినిమా పాటలా, లలితసంగీతమా అనేది తేల్చుకోవడం కూడా కొంతమందికి కష్టమే. ఇటువంటి సందేహాలకు తావివ్వకుండా పిల్లలకు చక్కని సంగీతం నేర్పే మంచి స్కూళ్ళుంటే ఎంత బావుంటుంది? సరిగ్గా అలాంటిదే కోల్‌కతాలోని “శ్రుతి నందన్‌” అనే సంస్థ. దీని వ్యవస్థాపకుడు పండిత్‌ అజయ్‌ చక్రవర్తి అనే హిందూస్తానీ గాయకుడు. పేదకుటుంబంలో పుట్టిన అజయ్‌చక్రవర్తి తన తండ్రి అజిత్‌కుమార్‌ వద్ద సంగీతం నేర్చుకోవడం మొదలెట్టి తరవాత ఉస్తాద్‌ బడేగులాంఅలీఖాన్‌ కుమారుడైన మునవ్వర్‌అలీ వద్ద శిష్యరికం చేశాడు. ప్రకాశ్‌ఘోష్‌ అనే ఆయనవద్ద లలిత సంగీతం, హార్మోనియం వగైరాలు కూడా అభ్యసించి రవీంద్ర భారతి యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పుచ్చుకున్నాడు. ప్రఖ్యాత తబలా, హార్మోనియం విద్వాంసుడు జ్ఞానప్రకాశ్‌ ఘోష్‌ కూడా ఆయనకు గురుతుల్యుడే.

దేశ విదేశాల్లోఎన్నో కచేరీలు చేసి ప్రశంసలనూ, ప్రేక్షకుల అభిమానాన్నీ పొందిన అజయ్‌ చక్రవర్తికి 1993లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వపు “కుమార్‌ గంధర్వ” తొలి అవార్డు లభించింది. సంగీత రిసెర్చ్‌ అకాడమీ ఫెలోగా స్వర్ణపతకం కూడా పొందారు. కొన్నేళ్ళ క్రితం రేడియో (వివిధ్‌భారతి) లో క్లాసికల్‌ రాగాలను పరిచయం చేసే “సంగీత్‌ సరితా” కార్యక్రమాన్ని కూడా ఆయన కొన్నాళ్ళు నిర్వహించాడు. అందులో రాగేశ్రీవంటి రాగాలను శాస్త్రీయ, లలిత సంగీతాల్లో ట్రీట్‌ చేసే రెండు రకాల పద్ధతులను ఆయన ఆసక్తికరంగా వివరించాడు.

అజయ్‌ చక్రవర్తికి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇటీవల ముంబాయిలోని నెహ్రూ సెంటర్లో సన్మానం జరిగింది. సభలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు నౌషాద్‌, ఇళయరాజా, ఉత్తమ్‌సింగ్‌, ప్రసిద్ధ గాయకుడు దినకర్‌ కైకిణీ తదితరులు ప్రసంగించి అజయ్‌ చక్రవర్తి కృషిని మెచ్చుకున్నారు. ఆనాడు పటియాలా,జైపూర్‌ వంటి “ఘరానా”లు సంగీతానికి పేరు పొందితే ఇప్పుడంతా ఎమ్‌టీవీ ఘరానాయే వినబడుతోందని నౌషాద్‌ చమత్కరించారు. పాశ్చాత్యులకు ఆనాటి మొజార్ట్‌ను ఆరాధించడమే తెలుసనీ ఈనాడు అజయ్‌ చక్రవర్తి రెండు వందలమంది మొజార్ట్‌లను తయారు చేస్తున్నారనీ ఇళయరాజా మెచ్చుకున్నారు. ఆ సభలో అజయ్‌ కుమార్తె కౌశికి గానాన్ని అందరూ ప్రశంసించారు. అనంతరం “శ్రుతినందన్‌” సంస్థ గురించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. అది అయిదంతస్తుల “సెల్ఫ్‌ కంటెయిన్‌డ్‌” భవనం. దాని బేస్‌మెంట్‌లో స్టూడియో,ఇతర అంతస్తుల్లో సంగీత పాఠాలు నేర్పే గదులూ, కాంటీన్‌, అతిథులుగా వచ్చే సంగీతజ్ఞులకు వసతులూ, విద్యార్థులు సంగీతాన్ని ఆస్వాదించడమే కాక సంగీతంలో మైక్‌ల ఉపయోగాలూ, రికార్డింగ్‌ విశేషాలూ, హాల్‌ అకూస్టిక్స్‌ వివరాలూ ఇలా ఎన్నో నేర్చుకునే సదుపాయాలున్నాయి. శ్రుతినందన్‌లో ఎనిమిదివందలమందిదాకా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో అధికసంఖ్యాకులు స్థానికులూ, పొరుగు ప్రాంతాలవారే అయినా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవారు లేకపోలేదు. అజయ్‌, ఆయన భార్య చందన వీడియో మానిటర్ల ద్వారా ఒకేసారిగా ప్రతి క్లాసులోనూ ఏం నేర్పుతున్నారనేది పర్యవేక్షిస్తూ ఉంటారు. డాక్యుమెంటరీలో విద్యార్థుల సోలో, బృందగానాలు రెంటిలోనూ గొప్ప ప్రతిభ కనిపించింది. అందులో హిందూస్తానీ శాస్త్రీయగానం, వాద్య సంగీతం, లలిత సంగీతం, జానపదసంగీతం ఇలా అనేక రకాలు నేర్చుకోవడం చూపించారు. అన్నిటికన్నా ఆశ్చర్యపరిచినది ఆ బెంగాలీ పిల్లలు డా.బాలమురళీకృష్ణ స్వరపరిచిన కల్యాణి రాగ ఠాయమాలిక తిల్లానా పాడడం. (ఆ సంస్థకు విచ్చేసిన ప్రముఖులలో బాలమురళి కూడా ఉన్నారు) మంచి సంగీతం ఎక్కడిదైనా అనుకరించి నేర్చుకోదగినదే అనే అభిప్రాయం సంస్థ సంచాలకులకు ఉన్నట్టూ దీన్ని బట్టి తెలియవస్తోంది. ముంబాయి సభలో నౌషాద్‌గారు అన్నట్టు శాస్త్రీయసంగీతం మన దేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అతి ముఖ్యమైన అంశం. అజయ్‌ చక్రవర్తి వంటివారు దాన్ని పరిరక్షించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తే ఎంతో బావుంటుంది.

తెలుగు విద్వాంసులలో పారుపల్లి రామకృష్ణయ్య, ద్వారం వెంకటస్వామినాయుడు, శ్రీపాద పినాకపాణిగార్లు మూడు ముఖ్యమైన బాణీలకు ప్రతినిధులు. నేటి సంగీత విద్వాంసులూ,శిక్షకులలో వీరి శిష్యులు కానివారు అరుదు. వీరిలో కొందరైనా శ్రద్ధగా సంగీతం నేర్పుతున్నారు. ఇదికాక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంగీత శిక్షణాలాయాలున్నాయి. విజయనగరం,విజయవాడ, హైదరాబాద్‌ సంగీత కళాశాలలు ప్రసిద్ధమైనవి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర, కాకతీయ మొదలైన విశ్వవిద్యాలయాలన్నీ సంగీతానికి ప్రోత్సాహాన్నిస్తున్నాయి. తక్కిన పెద్ద నగరాలలాగే హైదరాబాద్‌లో భక్త రామదాసు కళాశాల, త్యాగరాయ సంగీత కళాశాల, సంస్కార భారతి,సంగీతాంజలి, సుర్‌మండల్‌, సింఫనీ అకాడమీ ఆఫ్‌ మ్యూజిక్‌, నాట్యసదన్‌, నాట్యవేద, నృత్యాంజలి వగైరా ఎన్నో సంగీత పాఠశాలలున్నాయి.వీటిలో చాలామటుకు నాట్యం, సంగీతం నేర్పిస్తాయి. తక్కినప్రాంతాల్లో విజయవాడలోని మానస్‌ ఇన్‌స్టిట్యూట్‌, వెంపటి సత్యం ఆర్ట్‌ అకాడమీ, కాకినాడలోని అభ్యుదయ ఆర్స్ట్‌, గుంటూరులోని నాగార్జున కళాకేంద్రం, ఏలూరులోని నృత్యభారతి, త్యాగరాజ గానసభ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంగీత సభల ఫెడరేషన్‌, తణుకులోని సిద్ధేంద్ర నృత్య సంగీత అకాడమీ, విశాఖపట్నంలోని విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ అకాడమీ, స్వరరంజని, కూచిపూడి కళాక్షేత్రం, విజయనగరంలోని విజయ కళాభారతి, వగైరాలు కాక సూర్యాపేటలోని గ్రామ వెలుగు నాట్యమండలి, ప్రొద్దటూరులోని చలన చిత్ర సంగీత నృత్య అనుకరణ కళకారుల సంఘం కూడా ఉన్నాయని ఇంటర్నెట్‌ వల్ల తెలుస్తోంది.

పూర్వం దేవాలయాల్లోనూ రాజాస్థానాల్లోనూ ఆశ్రయం పొందిన శాస్త్రీయ సంగీతం ఇప్పుడు వినడానికీ, నేర్చుకోవడానికీ అందరికీ అందుబాటులో ఉంది. భారతీయ సంగీతం నేర్పే సంస్థలు ఈనాడు చాలా దేశాల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని “ఆన్‌లైన్‌” శిక్షణ ఇస్తామని కూడా ఇంటర్నెట్‌లో ప్రకటిస్తాయి. మహారాష్ట్రలోని మీరజ్‌లో గ్వాలియర్‌ ఘరానా దిగ్గజాల్లో ముఖ్యుడైన విష్ణు దిగంబర్‌ పలూస్కర్‌ స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయం గత ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో హిందూస్తానీ సంగీతవ్యాప్తికి చాలా తోడ్పడింది. బైజూ బావ్‌రా సినిమా ద్వారానూ , తన మధురగానంతోనూ అందర్నీ అలరించిన డి.వి.పలూస్కర్‌ ఈ సంగీతవేత్త కుమారుడే. అలాగే అలహాబాద్‌, బెనారస్‌లలో పేరుపడ్డ సంస్థలున్నాయి. మరొక సంగీతజ్ఞుడి పేర నడుస్తున్న లక్నోలోని భాత్‌ఖండే మ్యూజిక్‌ యూనివర్సిటీ కూడా ముఖ్యమైనదే. ఇవన్నీ సంగీతంలో కోర్సులు నిర్వహించి పరీక్షలు పాసైనవారికి డిగ్రీలు ఇస్తాయి. కోల్‌కతాలో ఇండియన్‌ టొబాకో నడుపుతున్న సంగీత రిసెర్చ్‌ అకాడమీ సంగీతపు అరుదైన రికార్డింగులను భద్రపరచడమే కాక తగినవారికి స్కాలర్‌షిప్‌లిచ్చి ఉన్నత సంగీత శిక్షణ నందించే ప్రయత్నాలు చేస్తోంది. నేటి మేటి యువ గాయకుడు రషీద్‌ఖాన్‌ అలా నేర్చుకున్నవాడే.

ఇవికాక కొన్ని సంస్థలు కొందరు ప్రసిద్ధ సంగీతజ్ఞులు స్థాపించినవి కాగా మరికొన్నిటికి ప్రసిద్ధుల సహకారం అందుతోంది. పుణే యూనివర్సిటీ లోని లలిత్‌ కళాకేంద్ర ఈ రెండో రకానికి చెందినది. అందులో గురుకుల పద్ధతిలో శాస్త్రీయసంగీతం, నాట్యం, నాటకకళలలో శిక్షణ ఇస్తున్నారు. ఆ రంగాల్లో నిష్ణాతులు అక్కడికి “అతిథి” అధ్యాపకులుగా వస్తూ ఉంటారు. ప్రసిద్ధగాయని ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి, శ్రుతి ఫౌండేషన్‌ “సముద్రి” అనే సంగీత సంస్థను నిర్వహిస్తున్నారు. అందులో సంగీతశిక్షణకన్నా కార్యక్రమాల ఏర్పాటును గురించి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టు కనిపిస్తుంది. అమెరికాలో సాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలో సరోద్‌ విద్వాంసుడు అలీ అక్బర్‌ఖాన్‌ నడుపుతున్న సంస్థ చాలా ప్రసిద్ధమైనది. సితార్‌ విద్వాంసుడు రవిశంకర్‌ “రిమ్‌పా” అనే కేంద్రం స్థాపించారు. అందులో ముఖ్యంగా సితార్‌, వేణువు, తబలావంటి వాద్యాలను నేర్పుతారు. ప్రసిద్ధగాయకుడు జస్‌రాజ్‌ అట్లాంటాలో తన మ్యూజిక్‌ ఫౌండేషన్‌ ఒకటి నిర్వహిస్తున్నారు. ఈ విధంగా అనేకమంది వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ సంగీతానికి ప్రాచుర్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యాసంలో వీటన్నిటి గురించీ పూర్తిగా ప్రస్తావించడం అసాధ్యం కనక కొన్నిటిని మాత్రమే ఉదహరించడం జరిగింది.

తెలుగువారికి శాస్త్రీయ సంగీతం అంటే అంత ఆసక్తి ఉండదని అనిపిస్తుందిగాని అది పూర్తిగా నిజంకాదు. మనవాళ్ళకి “శాస్త్రకట్టు” కంటే “మెలొడీ” అంటే ఎక్కువ ఇష్టమేమో. లైట్‌ మ్యూజిక్‌ వినడానికి ఎంత బావున్నా లోతైనవేళ్ళు కలిగిన శాస్త్రీయ సంగీతంతో అది పోటీ పడలేదు. అందులో అభిరుచి ఏర్పడ్డాక ఈ తేడా మరింత బాగా అర్థం అవుతుంది.
-----------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Thursday, November 28, 2019

గంధర్వులెవరు?


గంధర్వులెవరు?




సాహితీమిత్రులారా!


మన పురాణాల్లో భూతలవాసులు కొందరు దేవతల్తో కలిసిమెలిసి తిరుగుతూంటారు. ఇంద్రుడి దగ్గరికెళ్ళడం, రంభాఊర్వశుల నాట్యాలు చూడ్డం, ఇంద్రుడితో అర్ధసింహాసనాలు పంచుకోవడం జరిగిపోతూంటాయి. ఇదంతా అభూతకల్పన అనుకుంటే సమస్యే లేదు. కల్పన కాకపోతే, ఈ కథల్లో కొంతైనా నిజం ఉండాలి. వెంటనే “అలా ఐతే ఆ రాకపోకలు ఏమయిపోయాయి? ఎందుకు తర్వాత ఆగిపోయాయి? వీటిల్లో నిజం పాలు ఎంత?” అనే ప్రశ్నలు తలెత్తుతాయి.

మనవాళ్ళ కథల్ని బట్టి చూస్తే, స్వర్గం లేదా త్రివిష్టపం (3) అన్నది ఇప్పటి టిబెట్‌, దానికి ప్రక్కన ఉన్న ప్రదేశాలు. ఎ్తౖతెన హిమాలయాల్ని (అప్పట్లో హిమాలయాల్ని హిమాలయాలని అనేవారు కారట. కాళిదాసు కాలానికి అలా పిలవడం మొదలైంది కుమార సంభవమ్‌ 1.1) ఎక్కి, అవతలి ప్రదేశాలకి వెళ్ళడం ఆ కాలం నుంచి ఈకాలం వరకూ కష్టమైన పనే. కాబట్టి, చాలా తక్కువ మంది దేవతల్నీ, దేవతా గణాల్నీ(గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలైన వాళ్ళు (3) ) కలుసుకునేవారు లేదా చూసేవారు. మిగిలిన జనమంతా వాళ్ళ గురించి కర్ణాకర్ణిగా వినేవారు. హిమాలయాలు ఆకాశాన్ని అంటుతూ కనిపిస్తూంటే దేవతలు ఆకాశంలో ఉన్నారని అనుకునేవారు.

రఘువు, దుష్యంతుడు మొదలైన రాజులు దేవతలకు యుద్ధాల్లో సహాయం చేసి స్వర్గం నుంచి (ఆకాశం నుంచి) క్రిందకి దిగినప్పుడు, అంతా హిమాలయాల దగ్గర దిగారే తప్ప (“క్షణాదాయుష్మాన్‌ స్వాధికార భూమౌ వర్తిష్యసే”అభిజ్ఞాన శాకున్తలమ్‌ (2) ), మరే ప్రదేశంలోనూ దిగినట్లు దాఖలాల్లేవు. అందువల్ల స్వర్గం టిబెట్‌ పశ్చిమ చైనాల ప్రాంతం అయే అవకాశం ఉంది. టిబెట్‌సౌందర్యం అందరికీ తెలిసిందే. మానస సరోవరపు అందం వర్ణించనలవి కాదని అనేవాళ్ళు ఈ రోజుల్లోనూ ఉన్నారు. అలాంటి సుందర ప్రకృతిలో బహుముఖంగా వెలిసిన ఒక గొప్ప ధనవంతమైన నాగరికత ఉండి ఉండాలి. అదే మన స్వర్గమై ఉండాలి. ఆ నాగరికతకు చుట్టూ, వాళ్ళని ఆశ్రయిస్తూ, కొన్ని జాతులు హిమాలయాలకు ఉత్తరాన (టిబెట్‌వైపు) పర్వతపుటంచుల్లో తూర్పు వైపుకు వ్యాపించి ఉండాలి. వాళ్ళే గంధర్వులూ, విద్యాధరులూ, యక్షులూ అయి ఉండాలి. యక్షులు మనకు ఆగ్నేయ మూలగా (అస్సాం ప్రాంతాల్లో) కుబేరుడనే రాజు పాలనలో ఉన్నారనీ, ఆ ప్రదేశాన్ని కామరూపమని అంటారనీ కథలు చెపుతున్నాయి. వీటి గురించి కాస్సేపట్లో మాట్లాడుకుందాం.

హిమాలయాలూ, మానస సరోవర ప్రాంతాలూ దేవతా గణాలకి విహార భూములు. దీన్ని బట్టి చూస్తే, వీళ్ళలో కొందరు చైనా వారికి పూర్వీకులు కావాలి. దేవతల కొన్ని లక్షణాల్ని పరిశీలించిన మీదట, పురాతన చైనా చరిత్రను చూసిన మీదట, గంధర్వులు చైనావారి పూర్వీకులై ఉండాలని అనిపిస్తుంది. చైనాకి పశ్చిమాన దేవతలు నివసించి ఉంటారు. ఎలాగూ ఈ రెండు జాతుల మధ్యా సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లు మన కధలు చెబుతున్నాయి గాబట్టి వాళ్ళ నాగరికతలు విపరీతంగా ఇచ్చి పుచ్చుకున్నాయని అనుకోవడంలో తప్పు లేదు. మన ప్రక్క దేశం వారైనందువల్ల మనకీ వాళ్ళకీ ఇలాంటి చారిత్రాత్మక సంబంధాలుండడంలో ఆశ్చర్యమేమీ లేదు.

సంస్కృతం కొద్దిగా చదివినా చాలు, మనకు ఇద్దరు గొప్ప గంధర్వు లున్నారని తెలుస్తుంది. వీళ్ళు సంగీతంలో ప్రసిద్ధులు. శబ్దమంజరిలో వీళ్ళపై ప్రత్యేకమైన శబ్దం కూడా ఉంది. విశ్వనాధ సత్యనారాయణ గారు వీరి పేర ఒక నవల కూడా వ్రాసారు. వీళ్ళ పేర్లు “హాహాహూహూ”. ఈ విధమైన ఇంటి పేర్లున్నవాళ్ళని ఈనాటికీ చైనాలో చూస్తాం. చైనా ప్రాచీన చరిత్ర చదివితే, క్రీ. పూ. 10,000 3000 సంవత్సరాల మధ్య “హూ” అనే ఒక చక్రవర్తి అత్యంత వైభవంగా కొంత చైనాను ఏలాడని తెలుస్తుంది (4). ఇతనికి సంగీతం అంటే మహా ఇష్టం. 500 అమ్మాయిలున్న సంగీత బృందాన్ని ఎప్పుడూ తన వెంట తిప్పుకుంటూ సంగీతంలో తేలి యాడేవాడట. తంత్రీ వాద్యాలు కూడా పురాతన చైనాలో ప్రసిద్ధి కెక్కాయి. మన గంధర్వులు కూడా తంత్రీ వాద్యాలు వాడటం మనకి తెలుసు. మన “హాహాహూహూ”ల్లోని “హూ” ఇతనేనేమో !!!

మన దేవతా గణాలకి ఆపాదింపబడ్డ కొన్ని లక్షణాల్ని చైనీయుల్లో చూడవచ్చు. ఉదాహరణకు కొన్ని

చెమట పట్టదు. వాళ్ళు నివసించింది చల్లని దేశం గనుక దీనిపై వేరే చర్చ అక్కర్లేదు.
చాలామంది బంగారపు రంగు వాళ్ళు. ఇదీ చైనీయుల్లో చూస్తాము.
దేవతా గణాల వాళ్ళు “అనిమిష లోచనులు” అంటే, కనురెప్పలు మూయని వాళ్ళు. చైనీయుల కళ్ళు సన్నవి, చిన్నవి. అందువల్ల వాళ్ళు కనురెప్పలు మూసి, తెరిచినట్లు అనిపించదు. పెద్ద కళ్ళున్న జాతుల వాళ్ళకి ఇది వింతగా అనిపించి ఉంటుంది. అందుకే దీని ప్రస్తావన చాలా కథల్లో కనబడుతుంది.
“నిర్జరులు” అంటే ముసలితనం లేనివాళ్ళు. కొండల్లో నివసించే వాళ్ళకు రోజూ చేసుకునే పనుల వల్లే చాలా వ్యాయామం చేసినట్లయి గట్టి దేహాలు ఏర్పడతాయి. శరీరం మీద ముడతలు కూడా త్వరగా రావు. చైనీయుల విషయంలో ఇది నిజమని మనకు తెలుసు.
“గగన యానం” (ఆకాశంలో తిరగడం) చేస్తూంటారు మన కథల్లో. దీని గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచిద్దాం. పురాతన కాలం నుంచీ చైనీయులు ఎన్నో రకాల పనిముట్లూ, పాత్ర సామగ్రీ, యంత్రాలూ చెయ్యడంలో నిపుణులు. ఆ రోజుల్లోనే వాళ్ళు వింతైన రధాలూ, వాహనాలూ వాడే వారు. “చక్రం” అన్నది రవాణాకై వాడింది మొట్టమొదట వీరేనని చరిత్రకారుల అభిప్రాయం. అలాంటి వాహనాల మీద హిమాలయ పర్వతాల పైన గాని, మన వైపుగా దిగుతున్నప్పుడు గాని కొందర్ని మన వాళ్ళు చూసి ఉంటారు. అప్పట్లో (ఇప్పటికి గూడా) హిమాలయాల పైన మేఘాలు ఎక్కువ సంఖ్యలో ఉండి ఉండవచ్చు. (కాళిదాసు హిమాలయాల్లో మేఘాల గురించి, వాటి వల్ల జరిగే వింతల గురించి కుమార సంభవంలో (1.5, 1.14) చక్కని శ్లోకాలు వ్రాసాడు (2)). అందువల్ల, మన వాళ్ళు కొండల మీద సంచరిస్తున్న వాళ్ళని చూసి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా అనుకుని ఉండవచ్చు. నారదుడు మేఘాల్లో నడవడం కూడా ఇలాంటిదేనేమో. భూలోకంలో వింతలు కనబడితే దివి నుండి భువికి దిగుతారు. లేకపోతే అలా వెళ్ళిపోతారు. ఈ అనుభవం కొత్తేమీ కాదు. ఆల్ప్స్‌పర్వతాలపై రైల్లో వెడుతుంటే అందరూ అనుభవించే ఆనందమే ఇది.

దేవతా గణాలు అందమైన వస్త్రాల్ని ధరించే వారు (1). ఋగ్వేదంలో ఎన్నో చోట్ల ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలైన వాళ్ళు బంగారపు రంగు బట్టలు, ద్రాపి (అలంకరింపబడ్డ వస్త్రం ఒక విధంగా, జరీ కాని, ఏవైనా విలువైన పోగుల్తో అలంకరించిన బట్ట) ధరించేవారని చెప్పబడింది (1). చైనాలో పట్టు పుట్టింది. “చీనాంబరం” అన్న మాట తర్వాతే వచ్చినా, “అంబరం” నుండి వచ్చింది గాబట్టి పట్టు వస్త్రాన్ని మన వాళ్ళు అంబరం అని ఉండవచ్చు. కేవలం నార, చర్మాలతో చేసిన బట్టల్ని కట్టిన సప్తసింధులోని మన వాళ్ళకి చైనాలోని పట్టుబట్టలు బాగా నచ్చాయి. పలుచగా అందంగా ఉంటూ చలిని ఆపే శక్తి ఉన్న ఇవి మనవాళ్ళని అమితంగా ఆకర్షించాయేమో!

ఆఖరుగా, దేవతా గణాల వాళ్ళ “కామరూపం” అంటే, కోరిన రూపాన్ని పొందడం గురించి. దీనిలో కూడా ఉన్న చిలవల్నీ పలవల్నీ విరిచి చూద్దాం. కామరూపాల్లో మనం చూసేవి (కథల్లో) చాలావరకు రకరకాల జంతువుల రూపాలు, మానవ రూపాలు. కొందరు భూలోక వాసులు (ముఖ్యం గా మునులు, రాక్షసులు, సిద్ధులు) కూడా దీన్ని కలిగి ఉండేవారు కాబట్టి ఇదేదో అద్భుత మహిమ అనుకోవడానికి లేదు. ఇది కేవలం పరిసరాల్ని బట్టి రూపం మార్చుకోవడమే, ఊసరవిల్లిలా. జంతు చర్మాన్ని కప్పుకుని జంతువులా ప్రవర్తించడం; వేషం, భాష మార్చి మానవ రూపాన్ని పొందడం. కామరూపానికి సంబంధించిన కొన్ని కథల్ని చూస్తే ఇది తెలుస్తుంది. ఉదాహరణకి, ఎవరు కామరూపంలో ఉన్నా, చచ్చే సమయానికి నిజరూపం వచ్చేస్తుంది అంటే, పైన కప్పుకున్న తోలు ఊడిపోతుందన్నమాట. (ఇలా కామరూపాల్లో క్రీడిస్తున్న ముని జంటల మీద బాణాలేసి భంగ పడ్డవాళ్ళున్నారు.) అలా చేయడం వల్ల, మిగిలిన వారికి తమ ఉనికి తెలియకుండా పనులు చేసుకోవచ్చు. పరదేశీయులైన దేవతాగణాలు మన భూముల్లో కామరూపంలో తిరగడంలో గల ఉద్దేశ్యాన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోగలం.

పై మీమాంస అంతా మన దేవతాంశలో చీనాంశ ఉందేమోనన్న అనుమానంతో. “అమెరికా”ను అమరదేశంగా ఊహిస్తూ, ఏదారినైనా సరే వచ్చెయ్యాలని, ఈ అమెరికా (అమర) సుఖాన్ని పొందలేక పోవడం ఒక చేతకాని తనంగా ఊహించుకునే “మన” జనాన్ని చూస్తూంటే, కొంత కాలం తర్వాత అమెరికాని రెండవ స్వర్గంగా గుర్తిస్తామేమో అనిపిస్తోంది. దూరపు కొండలు నునుపు అన్నది ఆర్యోక్తి.

ప్రమాణ గ్రంధాలు

1. “ఋగ్వేద ఆర్యులు” మహా పండిత్‌రాహుల్‌సాంకృత్యాయన్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
2. “కాళిదాస గ్రన్థావళీ” మోతీలాల్‌బనారసీ దాస్‌ప్రెస్‌, వారాణసీ.
3. “అమరకోశం” వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌, చెన్నపురి.
4. “ప్రాచీన నాగరికతలుచైనా” ఇంటర్‌నెట్‌ పబ్లికేషన్‌
-------------------------------------------------
రచన: భాస్కర్ కొంపెల్ల, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, November 26, 2019

శ్రుతిమించిన రాగం


శ్రుతిమించిన రాగం




సాహితీమిత్రులారా!


ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం కానిదంతా (జానపద సంగీతం తప్ప) లలిత సంగీతమే అనే భావన ఉండేది. అందులో భావగీతాలూ, సినిమా పాటలూ అన్నీ భాగంగా ఉండేవి. ఈనాడు అలా అనలేము. మనకు (అక్కర్లేకపోయినా) నిత్యమూ వినబడుతూండే సంగీతంలో ” లాలిత్యం ” ఏమాత్రం ఉండటంలేదు. గతంలో డా. బాలాంత్రపు రజనీకాంతరావు గారి వంటి సంగీత ప్రయోక్తలు రేడియో ద్వారా తెలుగులో మంచి కవితలకి సంగీతం కట్టి ప్రజలకు వినిపించారు. లలిత సంగీతం గురించీ, తన అనుభవాలను గురించీ రజనీగారు ఆసక్తికరమైన వ్యాసాలు కూడా రాసారు. రేడియో సంగీతం జనప్రియం కాకముందే మరొకవంక సినిమా పాటలు సామాన్య ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుపోయి జన సంస్కృతిలో ఒక ముఖ్యభాగమైపోయాయి. ఆ సంగీతంలో ఎంత వ్యాపార ధోరణి ఉన్నప్పటికీ సినిమా పాటల్లో ఉండే “శక్తి వంతమైన ” సంగీతం ముందు, రేడియో సంగీతం కొంచెం నీరసంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందుకు కొంత కారణం సినీ ఆర్కెస్ట్రాలో ఉండే హార్మొనీ! వీటన్నిటికీ దూరంగా శాస్త్రీయ సంగీతం ఆనాడూ,  ఈనాడూ కూడా నిలిచే ఉంది. ఈనాడు లలిత కళలకు కూడా ప్రజాస్వామిక ధోరణి అబ్బింది కనక, శాస్త్రీయ సంగీతం నేర్చుకోదలచిన వారికి ఏ అర్హతలూ ఉండనవసరం లేదు. కేవలం ఆసక్తీ, ఓపికా, వ్యవధీ ఉంటే చాలు. ఆపైన గురువు గారికి నేర్పూ, ఓపికా ఉండాలి.

ఈనాడు మనకెన్నో రకాల సంగీతం, ఎన్నో పోకడలూ వినిపిస్తున్నాయి. ఫ్యూజన్‌ (  Fusion ) సంగీతం అని ఒక కొత్తపేరు వినిపిస్తోంది. నిజానికి మనం రోజూవినే సంగీతం అంతా ఫ్యూజన్‌ అనే చెప్పాలి. మన దేశపు సినిమా పాటలన్నీ దాదాపుగా శాస్త్రీయ సంగీతపు రాగాలమీద అధారపడినవే! మరి తేడా ఎక్కడుంది? శాస్త్రీయ సంగీతం రాగాల మయం. అందులో సాహిత్యం ఉన్నా, పెద్దపీట రాగానిదే. ఎందరో మహానుభావులు,జగదానంద వంటి కీర్తనల్లోని చరణాలకు త్యాగరాజు గారు ముందు స్వరం కట్టి, తరవాత వాటికి సరిపోయే సాహిత్యం రాసాడని మా నాన్న గారూ, నేనూ అనుకొనేవారం.జయంతసేన రాగంలో ఆయన రాసిన ” వినతాసుత వాహన ” అనే కీర్తనకూడా కొన్ని సినిమా పాటల పద్ధతిలో ముందు ట్యూన్‌ కట్టినట్టుగా అనిపిస్తుంది. అందులో పల్లవికి స్వరాలు ” మగసా సగమా పదసా పమపా మగసా సనిదా దసగమపాపా ” అనిఉంటే వాటికి సరిపోయే మాటలు ” వినతా సుతవా హనశ్రీ రమణా మనసా రగసే వించెద రామా ” అన్న పద్ధతిలో విరుగుతాయి. సాహిత్యం కన్నా స్వరాల గురించి త్యాగరాజు ఎక్కువ శ్రద్ధ చూపాడనడానికి ఇలాంటివెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటి మేధావి కూడా ఇటువంటి అభిప్రాయాన్నే ఒక వ్యాసంలో వ్యక్తం చేసారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, శాస్త్రీయ సంగీతపు “గొడవ” అంతా ప్రధానంగా రాగాల గురించేనని చెప్పడానికి.

లలిత సంగీతం అలా కాదు. ఇందులో సాహిత్యమే ముఖ్యం. సాహిత్యపు భావానికి, రాగ భావం తోడైనప్పుడు పాట ఇంకా రాణిస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎస్‌ రాజేశ్వర రావు ఖమాస్‌ రాగంలో జావళీల ఫక్కీలో ఎన్నో పాటలు చేసారు. కాని, విప్రనారాయణలో భానుమతి పాడిన ” నను విడనాడకురా ” అనే పాటకన్నా, చరణదాసిలో సుశీల పాడిన జావళీ కన్నా, మల్లీశ్వరిలోని ” ఎందుకే నీకింత తొందరా ” అనేపాటే జనాదరణ పొందింది. ఇందుకు కారణం దేవులపల్లి వారి రచనే! శ్రీశ్రీ, దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవులు సినీగీతాలు రాసి సినిమాల్లో సాహిత్యపు విలువల్ని పెంచారు. ఈరోజుల్లో సినిమా పాటలు బాగుండక పోవటానికి కారణం చెత్త సాహిత్యమే! ఈనాటి కవులకు శక్తి లేదని కాదు. దంపుళ్ళ చప్పుడువంటి తాళమే పాటకు ముఖ్యమనే భావన బలపడింది. ముందు లయ ప్రధానమైన ట్యూన్‌ తయారవుతుంది.దానికి తరవాత మాటలు అతికిస్తారు. ప్రపంచంలో ఇతరత్రా వస్తున్న సామాజిక మార్పులవల్లనో ఏమోగాని, ఎవరు ఏం చెప్పినా వినదగినదేదీ లేదనే భావం పెరుగుతోంది. అందువల్ల పాట అంతా తెలుగువారు తయారు చేసినప్పటికీ, అది ” అరవ” పద్ధతిలోనే సాగుతుంది. పాత సినిమా పాట మాత్రం ఏది విన్నా అందులో తెలుగుదనం కనిపిస్తుంది.

తెలుగు సినిమాపాటలలో మనవాళ్ళు వాడినవన్నీ దాదాపు హిందూస్తానీ రాగాలే! ఇది తక్కిన దక్షిణభారత సినిమా పాటలకు కూడా చాలావరకు వర్తిస్తుంది. ముఖ్యంగా రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల సంగీతదర్శకత్వం నిర్వహించిన సినిమాల్లో ” మెలొడీ ” పాటలన్నీ ఇటువంటివే ! ఆమాటకొస్తే, భీంపలాస్‌ (అభేరి) రాగంలో హిందీ సినిమా పాటలు అతి తక్కువ. తెలుగులో కొల్లలు. నీలిమేఘాలలో, మేఘమాల, ఊరుకోవే మేఘమాలా, ఇలా తెలుగు మేఘాలన్నీ భీంపలాస్‌ మీదుగానే సాగినట్టనిపిస్తుంది. భాగేశ్వరీలో ” నీ కోసమె నే జీవించునది “, ” అలిగితివా సఖీ ప్రియా “, ” రారా కనరారా “, శుద్ధ సారంగ్‌ లో ” ఎవరో అతడెవరో (వెంకటేశ్వర మహత్మ్యం)”,  తిలక్‌ కామోద్‌ లో ” అలిగినవేళనె చూడాలి “, కేదార్‌ లో “నీ మధు మురళీ గాన లీల “, పట్‌ దీప్‌ లో ” కన్నుల దాగిన అనురాగం”, ” నీ అడుగులోన అడుగువేసి నడువనీ”, జైజవంతిలో ” మనసున మనసై “, ఇలా ఎన్నో పాటలున్నాయి. ఆది నారాయణ రావు వంటి సంగీత దర్శకులకు హిందూస్తానీ రాగాలే మక్కువ. కర్ణాటకంలో మోహన రాగాన్ని పోలినది హిందూస్తానీలో భూప్‌ రాగం. రాగ లక్షణం దృష్య్టా ఆది నారాయణ రావు చేసిన ” ఘనా ఘన సుందరా ” అనే పాట భూప్‌ రాగమే! మోహన కాదు.

“శుద్ధ కర్ణాటక రాగాల్లో లైట్‌ సాంగ్స్‌ చెయ్యలేమా ? ” అన్న సమస్య నన్ను చాలా కాలం వేధించింది. ఎన్నో సంవత్సరాలుగా ఘంటసాల గారికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసి, ప్రస్తుతం కూచిపూడి నృత్యనాటకాలకు సంగీతం సమకూరుస్తున్న సంగీత రావుగార్ని ఈ మాటే అడిగాను. తాను నాటకాలకు సంగీతం కడుతున్నప్పుడు ఉపదేశం, భక్తి వంటి భావాలను వ్యక్తం చెయ్యటానికి తప్ప కర్ణాటక రాగాలు తనకు అంతగా ఉపకరించలేదని ఆయన అన్నారు. శాస్త్రీయ సంగీతంలో ” పట్టు ” ఉంది. శాస్త్రీయ సంగీతం నచ్చని వారికి అందులో ఎబ్బెట్టుగా ఉండేది ఇదే! ఎటొచ్చీ హిందూస్తానీ సంగీతం పాడుతున్నప్పుడు అప్పుడప్పుడు పట్టు విడిచి మెలొడీ ప్రధానంగా పాడినా ఎవరూ తప్పు పట్టరు. నవాబుల ఆస్థానాల్లో ఆదరణ పొందిన సంగీతమది. అందుకని ” ఈస్తటిక్స్‌ ” పాలు ఎక్కువ. దేవాలయాల్లో మారుమ్రోగిన కర్ణాటక సంగీతంలో మాత్రం బాలమురళీకృష్ణ వంటి వారు కాస్త మధురంగా పాడితే సనాతనులు విరుచుకుపడుతూ ఉంటారు. శాస్త్రీయసంగీతమంటే మాధుర్యం మాత్రమే కాదని ఎవరైనా ఒప్పుకొంటారు. కాని, ” మధురంగా ఉండనిదే శాస్త్రీయ సంగీతం ! ” అన్న పద్ధతిలో ఛాందసంగా వాదించే వారివల్లనే కర్ణాటక సంగీతానికి అంత ప్రాచుర్యం రాలేదని నేననుకొంటాను. అది కర్ణాటక సంగీతంలోని లోపం కాదని అందరూ తెలుసుకోవాలి.

కానీ, కర్ణాటక రాగాలు భావయుక్తంగా పాడిన సంధర్భాలు కొన్నయినా ఉన్నాయి. కరుణశ్రీ రాసిన కొన్ని పద్యాలను ఘంటసాల రంజని, ముఖారి వంటి రాగాలలో స్వరపరచి అద్భుతంగా పాడారు. అందులో శాస్త్రీయతకు ఏమాత్రం రాజీ పడలేదు. ఎంతో మధురంగా కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకూ ఇటువంటి ప్రక్రియ మరెవరూ చెయ్యలేదు. ప్రముఖ సినీ దర్శకుడు బి. ఎన్‌ రెడ్డి గారికి ” ఆనంద భైరవి ” రాగమంటే ఇష్టమట. “స్వర్గ సీమ ” సినిమా నాటినుంచీ  ప్రతిసినిమాలోనూ కనీసం ఒక పాట కర్ణాటకరాగంలో చేయించుకొంటూ వచ్చారు. “బంగారు పాప ”  సినిమాలో ” తాధిమి తకధిమి తోల్‌ బొమ్మా ” పాటఒక ఉదాహరణ ( మరపురాని మరొక చక్కని గాయకుడు ” మాధపెద్ది సత్యం ” పాడారీ పాటను).ఎటొచ్చీ “భాగ్య రేఖ ”  లో పెండ్యాల చేసిన ” నీవుండేదా కొండపై ” అనే పాట ఎంత తియ్యగా ఉంటుందంటే అది ఆనంద భైరవి అని నాకు వెంటనే తట్టలేదు. ” బంగారు పంజరం” లో రాజేశ్వరరావు చేసిన “మనసే మారేరా” అనే పాట కూడా అంతే! ఈ పాటల్లో సంగీత దర్శకులు సాంప్రదాయమైన ” రాగ పట్టు” ను బుద్ధిపూర్వకంగా విడిచి పెట్టారు. శాస్త్రీయ పద్ధతిలో ” ఆనంద భైరవి  ” ఎలా ఉంటుందో తెలియాలంటే, “మిస్సమ్మ”  సినిమాలో ” శ్రీ జానకీదేవి సీమంత మలరే” లేదా ” పలుకే బంగార మాయెరా” అనే రామదాసు కీర్తన వినండి. తేడా తెలుస్తుంది.

శాస్త్రీయ రాగాలను గుర్తించటానికి సినిమా పాటలతో మొదలు పెట్టటం చాలా తేలికైన పని. టివీలో మహామహోపాధ్యాయ డా. నూకల చినసత్యనారాయణ వంటి విద్వాంసులు ఇలాటి కొన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. రాగాలు, స్వరాలూ గుర్తు పట్టి శాస్త్రీయ సంగీతంలోకి ” దొడ్డిదారిన” ప్రవేశించడం తప్పేమీ కాదు. ఎందుకంటే తిన్నగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటానికి ప్రయత్నించే వారికి కొందరు సంగీతం మేస్టార్లు అప్రయత్నంగా సంగీతం అంటే ఏవగింపు కలిగిస్తారు. సినిమా పాటలు వినేవారు అభిమానం కొద్దీ వింటారు. శాస్త్రీయ సంగీతాన్ని మాత్రం కేవలం గౌరవంకొద్దీ నేర్చుకోవడం మెదలుపెడతారు. వారికి ఏ బాలమురళి పాటో నచ్చినా తాము ఆ స్థాయిని అందుకోవటానికి చాలా కాలం పడుతుందని వారికి త్వరలోనే తెలిసిపోతుంది. అలాంటివారికి యూజర్‌ ఫ్రెండ్లీ పద్ధతి బావుంటుంది.

శాస్త్రీయ సంగీతం అంటే అభిరుచి పెరగడానికి కొంత సమయం పడుతుంది. బాలమురళి వంటి గాయకుడి గొంతు మధురంగా ఉంటుంది కనక వెంటనే నచ్చుతుంది. వోలేటి వెంకటేశ్వర్లు, ఎం. డి. రామనాధన్‌
మధురై మణి వంటి గాయకుల సంగీతం అద్భుతంగా ఉంటుందని ” పామరులకు” వెంటనే అనిపించక పోవచ్చు. మన దేశపు శాస్త్రీయ సంగీతంలోని ముఖ్య లక్షణాలు సాంప్రదాయం మాత్రమే కాక హృదయం, మేధస్సు కూడా! ఇవి అర్ధం అయినప్పుడు సంగీతం ఎంతో బాగుంటుంది. సంగీతానికి టైం డైమెన్షన్‌ ఒక్కటే అని మా నాన్నగారు అంటుండే వారు. అది నిజమే! శాస్త్రీయ సంగీతంలో ముఖ్యంగా మనో ధర్మసంగీతంలో ” ఏం అన్నాడు ” అనేది ఎంత ముఖ్యమో ” ఎప్పుడు అన్నాడు “, ” అంతకుముందు ఏం అన్నాడు ” అనేవి కూడా అంత ముఖ్యమే. మంచి ఉపన్యాసంతో ఆకట్టుకొనే వాడిలాగా సంగీతకారుడు కూడా సైకలాజికల్‌ మొమెంట్‌ ఎటువంటిదో తెలిసినవాడై ఉంటాడు. సంప్రదాయం, వ్యక్తి గత ప్రతిభ రెండూ ఉన్నవాడే రాణిస్తాడు. మరో ముఖ్య విషయం ఏమంటే, వినే వారికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండనక్కరలేదుగాని,పరిచయం మాత్రం ఉండి తీరాలి. అది విని ఆనందించడానికి ఓపిక ఉండాలి. అది చెరకుగడ నమిలినట్టుగా చాలాసేపు నమిలే వస్తువు. దానితో పోలిస్తే సినిమా పాటలు పెప్పర్మెంటు లాగా నోట్లో వేసుకొని కరకరా నమలవచ్చు.

సినీసంగీతంలో మన దేశపు రాగాలూ పాశ్చాత్య సంగీతపు కార్డ్‌ ( chord ) లూ కలిసి ఉంటాయి. ఇదే మనకు తొలి ప్యూజన్‌. రాగంపై ఆధారపడి లయబద్ధంగా నడిచే సినిమా పాటకు తబలా వంటి వాయిద్యాలతోబాటు గిటార్‌, పియానో వంటి వాయిద్యాలమీద అదే లయతో chords  వాయిస్తూ ఉంటారు. ఇందులో సామాన్యంగా మూడుస్వరాలు కలిసి మోగుతాయి. పాట ఆ క్షణంలో ఏస్వరంమీద నిలిస్తే దానికి తగిన ధఫలషన  మోగుతుంది. Chord లోని స్వరాల మధ్య స,గ,ప అనే పరస్పర సంబంధం ఉంటుంది. ఈ మూడు స్వరాలూ పాడుతున్న రాగానికి చెందినవే అయిఉండాలి. ఇది పాటకు అందాన్నీ, బరువునూ ఇస్తుంది. “ముద్దబంతి పూవులో…” అనే పాటను గిటార్‌ లేకుండా వింటే బోసిగా ఉన్నట్టు అనిపిస్తుంది.

లలిత సంగీతంలో మంచి రచన ఉండి దానికి తగిన ట్యూన్‌ జత పడితే chord లతో పరిపూర్ణంగా అనిపించే ఆర్కెస్ట్రా మరింత అందాన్ని ఇస్తుంది. పాత సినిమా పాటల్లో ఇవన్నీ సమకూరడం వల్లనే ఈనాటికీ యువతరానికి నచ్చుతున్నాయి. హిందీ సినిమా పాటల్లో కూడా ఇదే పరిస్థితి. 195060ల మధ్య కాలం మన దేశపు సినిమా పాటలన్నిటికీ స్వర్ణ యుగమే అనిపిస్తుంది. అంతకు ముందు కె. ఎల్‌. సైగల్‌ వంటి గొప్ప గాయకులున్నా నౌషాద్‌ వంటి అతిగొప్ప సంగీత దర్శకులు వచ్చి ఆర్కెస్ట్రేషన్‌  మెరుగు పరచి ఇతరులకు మార్గ దర్శకులైన తరవాతనే సినిమా పాటలు రాణించటం మొదలు పెట్టాయి.

సినిమా పాటలో గాయకుడికీ సంగీత దర్శకుడికీ వచ్చినంతగా కవికి పేరు రాకపోవచ్చు. సంగీతం ఆకర్షించినంతగా కవిత్వం ఆకర్షించక పోవడమే ఇందుకు కారణం. సాహిత్యానిదే పైచెయ్యి కావాలని హిందీ సినీరచయితా,మహాకవి అయిన సాహిర్‌ లూధియానీ పట్టుపట్టేవాడట. ఆయనతో ఎక్కువగా పని చేసిని రోషన్‌ సంగీత దర్శకత్వంలోని పాటలన్నిటిలోనూ సాహిత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ట్యూన్‌, సాహిత్యాన్ని మరుగుపరచదు. తెలుగులో ఒక్క దేవులపల్లివారి పాటలు మాత్రం రాజేశ్వర రావు చేసిన ట్యూన్‌ల ధగధగలను కూడా అధిగమించి మనని అలరిస్తాయి.

రచయితకూ సంగీత దర్శకుడికీ పొత్తు కుదరటం చాలా ముఖ్యం. ఇది హిందీ పాటల్లో ఎక్కువగా ఉండేది.పైన చెప్పిన సాహిర్‌రోషన్‌ ద్వయంలాగే షకిల్‌నౌషాద్‌ లూ, శైలేంద్ర హస్రత్‌ జైపూరీ,శంకర్‌ జైకిషన్‌ వంటి ద్వయాలు ఉండేవి. ట్యూన్‌ ముందు చేసి పాట రాయించారో పాటకు ట్యూన్‌ కట్టారో తెలియనంత అన్యోన్యత ఉండేది ఆ పాటల్లో. పాటను రచయిత ముందు ఒక లయలో రాసినా సంగీత దర్శకుడు మార్చెయ్యగలడు. ఉదాహరణకు “నీలిమేఘాలలో గాలికెరటలలో …” అనే పాట జంపె (తాళం పేరు) నడకలో సాగినా ట్యూన్‌ మాత్రం చతురశ్రంలోనే చేసారు. ఇలాంటి ఉదాహరణలు హిందీలోనూ కనిపిస్తాయి. ట్యూన్‌ ఎటువంటిదైనా డబ్బింగ్‌ పద్ధతిలో అద్భుతమైన  రచనలు చేసినవారు శ్రీశ్రీ, ఆరుద్రలు. ఉదాహరణకు శ్రీశ్రీ రాసిన “జోరుగా హుషారుగా …” అన్న పాట మొత్తమంతా లయను బట్టి ఒక గురువు వెంట ఒక లఘువు వచ్చేటట్టు సాగుతుంది. ఇది శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే అనితర సాధ్యం.

బాగా పాడితే ఏసంగీతమైనా బావుంటుంది.. కొన్నేళ్ళక్రితం బొంబాయిలో ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌ సితార్‌ కచేరీకి ఉత్సాహంతో వెడుతున్న నాతోబాటు ” ఏమిటో ఆ వింత చూద్దాం” అని సంగీతంతో ఏమాత్రం పరిచయంలేని పధ్నాలుగు మంది మిత్రులు వచ్చి చివరిదాకా కూర్చొని అద్భుతంగా ఉందని అన్నారు. గొప్ప కళకు దివిటీ పట్టి చూపించక్కరలేదు అనడానికి ఇది మంచి ఉదాహరణ.
--------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Sunday, November 24, 2019

మా ఈజిప్ట్ యాత్ర


మా ఈజిప్ట్ యాత్ర




సాహితీమిత్రులారా!



నేను కుటుంబ సమేతంగా ఆస్టిన్, టెక్సాస్ 2002 లో వదిలి మూడేళ్ళు ఫ్రాన్స్‌లో ఉద్యోగ రీత్యా ఉండవలసి వచ్చింది. అలా ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు నాతో కలసి పనిచేస్తున్న అమెరికన్ స్నేహితుడు (పేరు విక్టర్) భార్య ఈజిప్టియన్ కావటంతో, వారి ఆహ్వానం పై రెండు వారాల పాటు ఏప్రెల్ 2005లో ఈజిప్ట్ యాత్ర కోసం మా రెండు కుటుంబాలు కలసి వెళ్ళాం! ఆ వివరాలను ఈమాట పాఠకులతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ యాత్రలో మేం తీసుకొన్న ఫొటోలు కొన్ని ఈ వ్యాసంతో జతపరుస్తున్నాను!

ఫ్రాన్స్‌లో మేం పారిస్‌కి దాదాపు 600 కిలోమీటర్ల దూరంగా దక్షిణ-తూర్పు ప్రాంతంలో ఉన్న గ్రనోబుల్‌కి 20 కిలోమీటర్ల దూరంలో సెయింట్ ఇస్మైర్ (సెంటిమియే అని పిలుస్తారు) అన్న ఊరులో ఉండేవాళ్ళం. మా ఊరికి స్విజర్లాండ్‌లోని జెనీవా 140 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆదివారం జెనీవా నుంచి ఈజిప్ట్‌లో ప్రసిద్ధమైన షర్‌మల్ షేక్ అన్న సముద్రతీరపు బీచ్ రిసార్ట్‌కి డైరెక్ట్‌గా ఈజిప్ట్ ఎయిర్ విమాన సౌకర్యం ఉందని తెలిసి అలా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం! విక్టర్ భార్య “అమాని”కి తెలిసిన వారి ద్వారా ఒక మంచి టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఆరోజు ఆదివారం, ఏప్రెల్ 17, 2005. మామూలుగా అయితే మా ఊరు నుంచి జెనీవాకి డ్రైవ్ చేస్తే ఒక గంట 30 నిమషాలు పడుతుంది. అన్నట్లు, ఫ్రాన్స్‌లో కార్లు గంటకు 130 కిలోమీటర్ల (80 మైళ్ళు) వేగంతో నడపవచ్చు. జెనీవా, ఫ్రాన్స్ – స్విజర్లాండ్ దేశాల సరిహద్దులో ఉన్న పట్టణం. మా విమానం జెనీవా నుంచి బయలుదేరే సమయం మధ్యాహ్నం మూడున్నర. మేం ఇంటినుండి ఉదయం పది గంటలకు బయలుదేరాం! మేం బయలుదేరుతూ ఉండగా కొంచెం స్నో పడటం మొదలయింది. రాను రాను అది తీవ్రమై, దారి మధ్యలో ఉన్న కొండ ప్రాంతానికి వచ్చేసరికి ఉధృతమైంది! మేం వెడుతున్న రోడ్డులో ముందర ఎక్కడో ఏదో యాక్సిడెంటు అయిందేమో కార్లన్నీ రోడ్డుమీద ఆగిపోయాయి. ప్రతి పది, పదిహేను నిమషాలకి ఒక వంద మీటర్లు కదలటం మళ్ళీ ఆగిపోటం. ఇలా మూడు గంటలపాటు నడిచింది. కార్లో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు, బాత్రూంకి వెళ్ళాలంటే కూడా వీలు లేని పరిస్థితి. మొత్తం మీద మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తరవాత, కార్లు కొంచెం స్పీడుగా కదలటం మొదలయ్యింది. మాకు టైంకి విమానాన్ని అందుకోగలమనే నమ్మకం పోయింది. ఈ లోపల అమాని జెనీవా ఎయిర్‌పోర్ట్‌లోని ఈజిప్ట్ ఎయిర్ కౌంటర్ వాళ్ళకి సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసి, మేం కొంచెం ఆలశ్యంగా రావచ్చునని చెప్పింది – అందువల్ల పెద్దగా లాభం ఉండదు అని తెలిసినా! వారానికి ఒక్క ఫ్లయిట్ కావటం వల్ల, ఈ ఫ్లయిట్ మిస్సయితే, మళ్ళీ వారం దాకా ఏం చెయ్యాలి అని ఒక బాధ! ఎలాగయితే, మూడు గంటల పదిహేను నిమషాలకి ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాం! విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నా, మా కోసం విమానాన్ని ఆపారట! గబగబా సామాన్లు చెక్ఇన్ చేసి, నేను, విక్టర్ కార్లు పార్క్ చేసి, అది లాంగ్ టెరం పార్కింగ్ కావటం వల్ల అంతదూరం పరిగెత్తుకుంటూ ఫ్లయిట్ గేటు దగ్గరకి చేరుకున్నాం! ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడూ అలా పరిగెట్లా! ఈ లోపల మమ్మల్ని మా ఇంటి పేర్లతో పిలుస్తూ మైక్‌లో “విమానం లోకి రమ్మని ఆహ్వానిస్తూ” ఎనౌన్స్ చేస్తున్నారు. తరవాత నా భార్య కల్యాణి చెప్పింది. మేం పార్క్ చెయ్యటానికి వెళ్ళినపుడు, మా పేర్లు చాలా సార్లు పిలిచారట! అమెరికాలో ఇలా ఎప్పుడూ ప్రయాణీకుల కోసం విమానాన్ని ఆపటం నాకు అనుభవంలో లేదు. ఈజిప్ట్ ఎయిర్ కాబట్టి ఇది వీలయింది అనుకుంటూ విమానంలో మా సీట్లలో కూర్చున్నాం! విమానంలో ఉన్న తోటి ప్రయాణీకుల్లో కొంతమంది “మీ కోసం మేం అంతా వైట్ చేస్తున్నాం, తెలుసా!” అన్నట్లు అదో రకంగా చూసారు. మరికొంత మంది “మొత్తానికి చేరుకున్నారు” అన్నట్లు మొఖాలలో సంతోషం చూపించారు.

షర్‌మల్ షేక్
మా విమానం షర్‌మల్ షేక్ చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది. మమ్మల్ని రిసీవ్ చేసుకోటానికి అహమద్ అనే అతను వచ్చాడు. అమాని మాకు చెప్పింది ” ఇతనే మనకి మొత్తం రెండు వారాల ప్రయాణ సదుపాయాలన్నీ కుదిర్చాడు” అని. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తరవాత ఈజిప్ట్‌లో టూర్ చెయ్యటానికి అప్పటికప్పుడే అహమద్ మా పాస్‌పోర్ట్‌లు తీసుకొని వీసాలు తీసుకొని వచ్చాడు (అమెరికన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నవాళ్ళకి ఈజిప్ట్‌లో ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయినా అప్పటికప్పుడే వీసా తీసుకొవచ్చు). ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం మా కుటుంబం, విక్టర్ కుటుంబం పక్క, పక్కనే ఉన్న రెండు ఇమిగ్రేషన్ క్యుబికల్స్ నుండి క్లియరెన్స్ పని పూర్తి చేసుకున్నాం! ఇక మా సామానులు కోసం ఎదురు చూస్తుంటే, విక్టర్ “మీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ నీతో ఏమన్నా అన్నాడా?” అని అడిగాడు. “మా USA పాస్‌పోర్ట్‌లు చూసి ‘Bush’ అంటూ కోపంగా పాస్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ స్టాంపు వేసాడు” అన్నా! విక్టర్ నవ్వుతూ “మాకు సరిగ్గా ఇలాగే జరిగింది” అన్నాడు. అమెరికన్స్ అంటే ఈజిప్ట్ లాంటి అరబ్ దేశాల్లో ఇటువంటి స్పందన ఉండటం చూసి ఆశ్చర్యపోయాం!

సామాన్లు అన్నీతీసుకొని అహమద్ సాయంతో Savoy Hotelకి చేరుకున్నాం. హొటేల్‌లో ఉండటానికి కావలసిన ఫారాలు అవి నింపుతున్నాడు అహమద్. ఇంతలో హొటేల్‌కి సంబంధించిన ఒకతను లాంజ్‌లో కూర్చున్న మా అందరికీ ఎర్రటి రంగుతో ఉన్న వేడి టీ (పాలు లేకుండా) ఇచ్చాడు. ఒక సిప్ రుచి చూసి “ఈ టీ చాలా బాగుంది కదండీ?” అని కల్యాణి అంటూండగా, నేనూ కొంచెం రుచిచూసా! బాగానే ఉంది కానీ ఏదో తేడాగా అనిపించింది. తరవాత తెలిసింది. మేం తాగిన టీ మందారం లాంటి పువ్వులను ఎండబెట్టి వాటితో తయారు చేసిన టీ అని! దీన్నే bright-red hibiscus tea అని ఇంగ్లీషులో అంటారు. అరబిక్‌లో “కార్‌కడీ” అంటారు. ఈజిప్ట్‌లో ఈ పానీయం చాలా ప్రసిద్ధమైనది.

మేం హొటేల్ రూంలకు చేరుకొని, అన్నీ సర్దుకొని పడుకొనే సరికి అర్ధరాత్రి అయిపోయింది. మర్నాడు ఉదయానికి కాని షర్‌మల్ షేక్ ఊరు ఎంత అందంగా ఉందో మాకు తెలియలేదు. హొటేల్ నుంచి దూరంగా కనిపిస్తున్న ఎర్రటి కొండలు, పక్కనే చిక్కని నీలం రంగుతో కనిపిస్తున్న ఎర్ర సముద్రం (చుట్టు పక్కల ప్రాంతం అంతా మినరల్స్‌తో సారవంతమైన భూములు {వర్షపాతం మాత్రం దాదాపు శూన్యం} కావటంతో, ఎర్ర సముద్రానికి ఆ పేరు వచ్చింది!) ఎంతో అందంగా ఉంది. ఆ రోజంతా హొటేల్ ఆనుకునే ఉన్న ఇసుక బీచ్‌లో గడపటానికి నిశ్చయించుకున్నాం! పిల్లలు ఇసుకలో ఆడుకుంటుంటే, ఈత బాగా వచ్చిన పెద్దవాళ్ళం స్నోర్కలింగ్ (నీటి ఉపరితలానికి కనపడకుండా, నీటిలో చాలా సేపు ఉంచగలిగినటువంటి పరికరం) చెయ్యటం కోసం సముద్రంలో దిగాం. స్నోర్కలింగ్ (పరికరం పేరు, నీటిలో దీనితో ఆడే ఈత పేరు ఒకటే) అంటే, కళ్ళలోకి నీరు పోకుండా కళ్ళద్దాలు పెట్టుకొని, నీటి ఉపరితలానికి సమాంతరంగా ఈదుతూ, కళ్ళద్దాల పక్కనే ఉన్న చిన్న గొట్టం ద్వారా గాలి పీలుస్తూ, నీటిలో తేలటం అన్నమాట. ఈ రకంగా నీటిలో ఉన్న చేపల్ని, కోరల్స్‌ని (తెలుగులో పగడం అనొచ్చు), మిగతా జల చరాలని చూడొచ్చు. ఈ రకంగా ఈత కొట్టటానికి పెద్దగా అనుభవం అక్కరలేదు. కళ్ళల్లోకి (ఉప్పు) నీళ్ళు పోకుండా కళ్ళద్దాలని సరిగ్గా ఉపయోగిస్తూ, జాగ్రత్తగా అవసరమైనట్టు ఊపిరి తీస్తూ, వదులుతూ ఉంటే చాలా సేపు నీటిలో ఉండొచ్చు. మేం ఇలా మూడు గంటలకు పైగా గడిపాం! ఏప్రెల్ నెలాఖరులో ఈజిప్ట్‌లో వాతావరణం బాగానే ఉంటుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 90 F (36 C) కన్నా ఎక్కువగా ఉన్నా, రాత్రికి చల్లబడి 50 F (10 C) కన్నా తక్కువగా ఉండేది. అందువల్ల, సముద్రపు నీరు పగటి పూట చల్లగానే ఉండటం వల్ల, ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండలేకపోయాం! మామూలుగా ఇలాగ రకరకాలైన సముద్ర జీవుల్ని, ముఖ్యంగా అనేక రంగులతో ఉన్న కోరల్స్‌ని డిస్కవరీ వంటి టీవీ ఛానల్స్‌లో చూసాం గాని, సముద్రంలో ఈదుతూ ప్రత్యక్షంగా చూడటం ఒక గొప్ప అనుభవం! మేం ఉన్న ప్రదేశాన్ని సెనై పెనెన్సులా అంటారు. ఇది భూగోళంలో చాలా అందమైన ప్రదేశం. కొన్ని మిలియన్ల సంవత్సరాలనుండి, ఎటువంటి కాలుష్యం లేకుండా, మానవ నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల, ఈ ప్రాంతపు సముద్ర ప్రాణులు (sea life) ఎటువంటి పరిణామం (evolution) లేకుండా అల్లాగే ఉన్నాయని అహమద్ మాటల వల్ల తరవాత తెలిసింది. అందుకే ఆ చుట్టూ ఉన్న చాలా సముద్ర తీర ప్రాంతాలను మానవ సంచారానికి వీలు కాకుండా రక్షిత ప్రాంతాలు (protected areas) గా ఈజిప్ట్ ప్రభుత్వం నిర్ణయించిందట!



అలా వెళ్ళిన మొదటి మూడు రోజులు షర్‌మల్ షేక్ లోనే గడిపాం! ఒక రోజు సాయంత్రం, ఊరు చూద్దామని వెళ్ళాం. మొత్తం ఊరు అంతా వచ్చే పోయే యాత్రికులకోసం నిర్మించబడ్డ ఊరు కాబట్టి, ఊరులో ఎక్కువ భాగం షాపులు, రెష్టరెంట్స్, పెద్ద, పెద్ద హొటేల్స్‌తో నిండి ఉంది. స్నోర్కలింగ్ ద్వారా ఎర్ర సముద్రంలో ఉన్న చేపలు, కోరల్స్, మిగిలిన సముద్ర జీవాలను చూట్టానికి వీలుకాని వాళ్ళకోసం కొన్ని ప్రత్యేకమయిన మోటార్ బోట్స్ ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే, బోటు క్రిందలోని ఎక్కువ భాగం పూర్తిగా గ్లాసు లాంటి పారదర్శక పదార్ధంతో చెయ్యటం వల్ల, యాత్రికులు బోటులో కూర్చుని, కిందకు చూస్తూ సముద్రంలోని అందాలను చూడవచ్చు. మొత్తం మీద ఒక గంటకు పైగా మేమంతా అలాంటి బోటులో గడిపాం!

షర్‌మల్ షేక్ లో ఉన్న మూడు రోజుల్లో మేం ఎక్కువగా రష్యన్ యాత్రికుల్ని చూసాం. అమెరికన్, యూరోపియన్ యాత్రికులు సహజంగానే ఎక్కువగా ఉన్నా, రష్యన్ యాత్రికుల సంఖ్య అందరికన్నా ఎక్కువ అనిపించింది. అహమద్ మాటల ద్వారా తెలిసింది ఏమిటంటే, రష్యాలో పెట్రోలు, మిగిలిన వ్యాపారాల ద్వారా పెద్ద, పెద్ద లాభాలు తీసినవారు, సరదాగా సమయం గడపటానికి షర్‌మల్ షేక్ వస్తారట! పైగా, రష్యా నుంచి డైరెక్టు విమాన సౌకర్యాలు ఇక్కడికి ఉన్నాయట! ఈ రష్యన్ యాత్రికుల్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనించతగ్గది.రష్యన్ యాత్రికులు తమ సమయాన్ని బాగా తిరుగుతూ, తాగుతూ (రష్యన్ డ్రింక్ వోడ్కా) అక్కడ ఉన్న ఈజిప్షియన్ పోలీసులకు, షర్‌మల్ షేక్ పుర నివాసులకు తల నెప్పిగా ఉంటారుట! అయితే, ఈజిప్ట్ పేద దేశం కావటం, పైగా ఈ రష్యన్ యాత్రికులు విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టటం వల్ల ఈ ప్రాంతం ఆర్ధిక పరిస్థితి (local economy) బాగుండటం వల్ల ఎవరూ వీరిని ఏమీ అనరట! ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అహమద్ చెప్పాడు. డబ్బున్న రష్యన్ యువతులు, ముఖ్యంగా పిల్లల తల్లులు కావాలనుకొనే వారు, ఎక్కువ సంఖ్యలో వచ్చి, ఈజిప్షియన్ యువకుల ద్వారా గర్భవతులై, రష్యా తిరిగి వెళ్ళిపోతారట! ఇందులో నిజానిజాలు ఎంతో తెలియకపోయినా ( రష్యా ప్రస్తుత జనాభా తగ్గుదల దృష్ట్యా ఇది నిజం అయ్యే అవకాశాలే ఎక్కువ), ఇటువంటివి కూడా జరిగే అవకాశాలున్నాయని తెలిసి మేం ఆశ్చర్యపోయాం!

కైరో
నాలుగో రోజు ఉదయాన్నే, షర్‌మల్ షేక్ నుంచి విమానంలో ఈజిప్ట్ ముఖ్య పట్టణమైన కైరో చేరుకున్నాం. ఇది చాలా చిన్న ప్రయాణం. ఒక గంటలో కైరోలో ఉన్నాం. అహమద్ ద్వారా ఏర్పాటు చెయ్యబడ్డ ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని ఎయిర్‌పోర్ట్ నుంచి గీజా ప్రాంతంలో ఉన్న ల మెరిడియన్ హొటేల్ కి తీసుకొచ్చాడు. హొటేల్‌కి వస్తుంటే పెద్ద పెద్ద కొండల్లా ఉన్న గ్రేట్ పిరమిడ్స్ దూరంగా కనపడ్డాయి. ప్రపంచ వింతల్లో అతి పురాతనమైన వింతను చూడబోతున్నాం కదా అని సంబరపడ్డాం! హొటేల్‌లో ఉండటానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకొని, హొటేల్‌కి దగ్గరగా ఉన్న స్ఫింక్స్ (Sphinx) చూట్టానికి బయలుదేరాం. హొటేల్ నుంచి బయలుదేరినప్పుడు, హొటేల్ లాబీలో ఎవరో ఒకతను నవ్వుతూ పలకరించాడు. సభ్యత కోసం నేను కూడా ఒక చిరునవ్వుతో పలకరించా! నేను అప్పటికి ఆ విషయం మర్చిపోయా! (అన్నట్టు చెప్పటం మరచా! మేము ఈజిప్ట్ వచ్చినప్పటి నుంచి, చాలా మంది నాతో అరబిక్‌లో మాట్లడటానికి ప్రయత్నించే వాళ్ళు! అమానితో ఈ విషయం చెపితే, “లక్కీ! నిన్ను చూడగానే ఇక్కడ అందరూ ఈజిప్షియన్ అనుకుంటారు. నీకు మెడిటెర్రేనియన్ సముద్ర ప్రాంతాల్లో ఉన్న దేశాల వాళ్ళ పోలికలు చాలా ఉన్నాయి!” అంది. అప్పుడు నాకు ఎదురయ్యే ప్రతి ఈజిప్షియన్‌ని పరీక్షగా చూట్టం మొదలు పెట్టా! అమాని మాటల్లో నిజం తెలిసింది. ఏమో, మా పూర్వీకులు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళేమో!) మరొక ఐదు నిమషాల్లో మమ్మల్ని తీసుకెళ్ళటానికి ఒక మినీ వాన్ వచ్చింది. అందరం సర్దుకొని వాన్‌లో కూర్చోగానే, హొటేల్‌లో నన్ను నవ్వుతూ పలకరించిన వ్యక్తి వచ్చి, డ్రైవర్ పక్కగా ఉన్న ముందు సీట్లో కూర్చున్నాడు. మేమంతా, అతను డ్రైవర్‌కి సంబంధించిన వ్యక్తి అయివుంటాడని సరిపెట్టుకున్నాం! తరవాత తెలిసింది. ఈజిప్ట్ ప్రభుత్వం, అమెరికన్ యాత్రికుల రక్షణ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని – అతను, “మాకు ప్రొటెక్షన్ కోసం, ఒక స్టెన్ గన్‌తో సహా హొటేల్ ద్వారా నియమించబడ్డ సెక్యూరిటీ గార్డ్” అని. అసలు విషయం ఏమిటంటే, హొటేల్‌లో దిగేటప్పుడు యాత్రికులు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉన్న వాళ్ళయితే, హొటేల్ యాజమాన్యం వెంటనే ఈజిప్ట్ ప్రభుత్వపు హోం డిపార్టుమెంటుకి తెలియచేస్తుందిట. నలుగురు కంటే ఎక్కువ ఉన్న బృందానికి రక్షణ కోసం ప్రభుత్వ ఖర్చుతో బాడీ గార్డ్‌లను పెట్టాలని నిర్ణయించడం వల్ల, హొటేల్ నుంచి బయటకు వచ్చిన మరు క్షణం నుంచి తిరిగి హొటేల్‌కి వచ్చే దాకా, యాత్రికుల రక్షణ భారం ప్రభుత్వమే భరిస్తుందిట!

పిరమిడ్స్ – స్ఫింక్స్
“మనిషి కాలానికి లోబడి ఉంటే, కాలం పిరమిడ్స్‌కి లోబడి ఉంటుంది” – అరబ్ నానుడి.

మేం స్ఫింక్స్ దగ్గరకి వెళ్ళేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది. ఆరు గంటలకు “స్ఫింక్స్‌లో ప్రత్యేక ఆకర్షణ అయిన Sound & Lights Show ఇంగ్లీషులో ఉందని – అవి చూడటానికి అందరికీ టిక్కట్లు తీసుకున్నా” నని మా కైరో ట్రావెల్ ఏజంటు చెప్పాడు. పక్కనున్న కొంతమంది యాత్రికులు స్ఫింక్స్ చూట్టానికి మనిషి ఒక్కడికి ధర $25 కొంచెం ఎక్కువే అని అనుకోటం విన్నా! ఇన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఈ ఖర్చుకి వెనకాడటం సరైంది కాదనిపించింది. జీవితంలో ఇటువంటి ప్రపంచ వింతలు చూసే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఇలా అనుకుంటూ స్ఫింక్స్ షోలోకి కదిలాం! సుమారు 4,500 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ స్ఫింక్స్ ఇంకా అదే ప్రాంగణంలో ఉన్న గ్రేట్ పిరమిడ్‌గా చెప్పబడిన ఖుఫు పిరమిడ్ – మానవ నిర్మితమైన అతి ప్రాచీన కళాఖండాలు అనటంలో సందేహం లేదు! స్ఫింక్స్ అన్నపదం ప్రాచీన గ్రీకులు ఇచ్చిన పేరు – ఈ విచిత్రమైన ప్రాణికి స్త్రీ తల, సింహం శరీరం, పక్షిలాగా రెక్కలు ఉంటాయి. స్ఫింక్స్‌ని ఒక రకమైన సున్నపు రాయితో చేసారు. భూగర్భ శాస్త్రజ్ఞలు ఉత్తర ఆఫ్రికా సముద్ర ప్రాంతాల్లో 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం ఏర్పడ్డ Muqqatam Formation ద్వారా సముద్రనీటి భూమి ఉపరితలం పై పేరుకున్న సున్నపు రాయి తో స్ఫింక్స్ ని చేసినట్టు కనుగొన్నారు. మానవనిర్మితమైన రాతి కట్టడాలలో అతి పెద్ద కట్టడంగానూ, అందులో అతి గుండ్రమైన అంచులతో కట్టిన కట్టడం గానూ స్ఫింక్స్‌ని పేర్కొంటారు. ఈ స్ఫింక్స్ శరీరం 72 మీటర్ల పొడవు కలిగి 20 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. వాతావరణంలోని తేమ, కాలుష్యం , కోత (eroson) వల్ల ఇప్పటికి కనిపించే స్ఫింక్స్ రూపం చాలా మార్పులు పొందింది. నెపోలియన్ 1798 సంవత్సరంలో ఈజిప్ట్ పర్యటించేసరికి, స్ఫింక్స్ శరీర భాగం పూర్తిగా ఇసుకలో పూడుకుపోయి, ఒక్క తల మాత్రం కనపడుతూ ఉండేదట! అప్పటికి 400 సంవత్సరాలకి పూర్వమే స్ఫింక్స్‌కి ముక్కు పోయిందంటారు. స్ఫింక్స్ ఉన్న ప్రాంగణంలో ఇంకా, Khafre’s causeway, Old Sphinx Temple, Valley Temple of Khafre కూడా ఉన్నాయి.


ఎన్ని ఫొటోలు, టీవీ ప్రోగ్రాములు, వీడియోలు చూసినా, ప్రత్యక్షంగా పిరమిడ్లని చూస్తే కలిగే అనుభూతుల్ని వర్ణించటం కష్టం! ఎవ్వరీ పిరమిడ్‌లని కట్టించినవారు – కట్టిన వారు? ఏ కారణాల వల్ల ఇవి కట్టబడ్డాయి? గ్రేట్ పిరమిడ్ కట్టటానికి ఉపయోగించిన 2.3 మిలియన్ల పెద్ద పెద్ద సున్నపు రాళ్ళని ( ఒక్కొక్క రాయి బరువు 2.5 నుంచి 7 టన్నుల దాకా ఉంటుంది ) ఎక్కడ నుంచి తెచ్చారు? ఎలా తెచ్చారు? ఎన్ని వేల మంది, ఎన్ని సంవత్సరాలు కష్టబడి ఇవి సాధించారు? మానవ నాగరికతకు సాంకేతిక సూత్రమైన చక్రం (wheel) ని కనుక్కోకముందే ఇంత అద్భుతమైన కట్టడాలను ఎలా సాధించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ నాటికీ లేవు. గ్రేట్ పిరమిడ్‌గా చెప్పబడిన పిరమిడ్‌లోని రాళ్ళని ఒకదాని పక్క ఒకటి పేర్చుకుంటూపోతే అమెరికా సంయక్త రాష్ట్రాలలోని తూర్పు భాగంలో ఉన్న న్యూయార్క్ నుండి సుమారు 4000 మైళ్ళ దూరంలోని పశ్చిమ తీరాన ఉన్న శాండియాగో వరకూ వెళ్ళి తిరిగి న్యూయార్క్ రావచ్చు! ప్రపంచంలో అతి పెద్ద పిరమిడ్‌గా గా చెప్పబడుతున్న ఖుఫు పిరమిడ్ ఈజిప్షీన్ ఫెరో (మహా రాజు) చియొప్స్ కోసం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో కట్టబడింది! కట్టినపుడు 482 అడుగులు ఎత్తైన ఈ పిరమిడ్ కాలక్రమంలో 33 అడుగులు కోల్పోయింది. ప్రాచీన గ్రీకులు ఈ పిరమిడ్‌ని కనుక్కున్న సమయానికే దీనికి 2000 ఏళ్ళ వయస్సు! దీని పక్కనే ఉన్న మరొక పిరమిడ్ చియోప్స్ రాజు కొడుకు ఫెరో చెఫర్న్ ది. దీని ఎత్తు 446 అడుగులు ( కట్టినపుడు ఎత్తు 470 అడుగులు). దీన్ని కొంచెం ఎత్తైన ప్రదేశంలో తెలివిగా కట్టడం వల్ల తండ్రి పిరమిడ్ కన్న కొడుకుదే పెద్ద పిరమిడ్ అనిపిస్తుంది. తండ్రి పై గౌరవంతో కొడుకు పిరమిడ్ చిన్నదిగా కట్టారట!


గీజాలోని పిరమిడ్‌లు చూస్తుంటే, ఏదో తెలియని ఆధ్యాత్మికమైన భావాలు కలగటం మొదలైంది! వీటిని చూస్తూ కొన్ని గంటలు నేను ఒక్కడినే గడపగలననిపించింది! ప్రాచీన ఈజిప్ట్ ఫెరోలు చనిపోయిన కొంత కాలం తరవాత, తిరిగి అదే శరీరంలోకి వారి ఆత్మలు ప్రవేశిస్తాయని పూర్వుల నమ్మిక! అందుకు వీలుగా శరీరం కృశించకుండా మమ్మిఫికేషన్ వల్ల నిలవ (preserve) చేసి, పెద్ద పెద్ద సమాధుల్లో (పిరమిడ్) ఫెరోల శరీరాలను దాచేవారు. మరుజన్మలో జీవితం బాగా సాగటానికి వీలుగా ఎన్నో విలువైన సంపదలను, భోజన సదుపాయం కోసం కావలసిన సరుకులు, చివరకు వైన్ కూజాలు కూడా ఈ సమాధుల్లో దాచేవారు.

ఈజిప్ట్‌లో ఎన్నో పిరమిడ్‌లు ఉన్నాయి. గీజా ప్రాంతమే కాక, గీజాకి దగ్గరలో ఉన్న సక్కారా (పిరమిడ్లు కట్టటం అన్న సాంప్రదాయం మొదలైంది ఇక్కడ కట్టిన మొదటి Step పిరమిడ్ ద్వారానే!), ఇక్కడికి దక్షిణంగా ఉన్న లుక్సర్ ప్రాంతాల్లో ఉన్న వాలీ ఆఫ్ కింగ్స్ – క్వీన్స్ లో ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి. ఈ పిరమిడ్లలో ఉన్న సంపదలను దొంగలు ఎత్తుకు పోయినవి ఎత్తుకు పోగా, ఈ నాటికి అందుబాటులో ఉన్న ఈ సంపదలను విలువ కట్టటం అసాధ్యం. లెక్కలేనన్ని పిరమిడ్‌లలో ఉన్న ఫెరోల గురించి అన్నీ ఇక్కడ చెప్పటం కష్టం! ఇద్దరు మహా మహుల గురించి కొన్ని వివరాలిస్తాను!

మొదటిది : ఫెరో రాంసెస్ (II). ప్రాచీన ఈజిప్ట్ సామ్రాజ్య చరిత్రలో ఇతని పేరు చిరస్థాయిగా ఉంటుంది. 90 ఏళ్ళ దాకా రాజ్య పాలన చేసి, అనేక దేవాలయాలకి ఇతర కట్టడాలకి మూలమైన ఈ ఫెరో జనానాలో లెక్క పెట్టలేనంత మంది స్రీలు ఉండేవారట. ఇతని జనానాలో తన సొంత కుమార్తెలు ముగ్గురు, సొంత చెల్లి కూడా ఉండటం బహుశా చరిత్రలో ఇంతకు ముందు తరవాత కూడా ఏ రాజు జనానాలో కూడా జరగలేదేమో! 90 మందికి పైగా సంతానం కొన్ని వందలమంది మనుమలు మనుమరాళ్ళు కలిగిన రాంసెస్‌ను ప్రజలు దైవంగానే కొలిచేవారట! ఇతని మమ్మీ కైరోలోని మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. మా కైరో పర్యటనలో ఫెరో రాంసెస్ మమ్మీని చూసాం. జీవించి ఉన్నపుడు ఆరు అడుగులకు పైగా ఉండే ఫెరో రాంసెస్, మమ్మీగా మార్చబడిన తరవాత ఆరు అడుగులకన్న కొంచెం పొట్టిగా కనిపించాడు. ఈజిప్ట్ దేశంలో చాలా చోట్ల ఉన్న ప్రాచీన దేవాలయాల్లో లెక్కపెట్టలేనన్ని ఇతని రాతి విగ్రహాల ద్వారా ఫెరో రాంసెస్ ప్రజల మధ్య ఎటువంటి స్థానం సంపాయించాడో ఊహించవచ్చు. ఇక రెండవ ఫెరో టూటన్‌కామున్ (తేలికగా పలకాలంటే ఈయన పేరు రాజు టట్). 1922 సంవత్సరంలో జరిగిన తవ్వకాల్లో అతి విలువైన సంపదలతో భద్రంగా పొందుపరచబడి ఉన్న టట్ సమాధి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తి, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతను ప్రపంచానికి తిరిగి పరిచయం చేసింది. 19 ఏటనే చనిపోయిన టట్ చావు ఒక మిస్టరీ! ఇతని సమాధిలో దొరికిన వస్తువులు కూడా కైరో మ్యూజియంలో ఉన్నాయి! వాటిని కూడా మేం కైరో మ్యూజియంలో చూసాం.


పపైరస్ (ప్రపంచానికి నైల్ కానుక)
కైరోలో ఉన్న ఒక రోజు ఉదయాన్నే మా ట్రావెల్ ఏజెంటు, ఈజిప్టు ప్రాచీన నాగరికతకు అతి ముఖ్య చిహ్నమైన పపైరస్ (ఒక రకమైన కాగితం) అమ్మే షాపుకి తీసుకెళ్ళాడు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలకి పూర్వం కనిపెట్ట బడ్డ ఈ కాగితం తయారుచేసే పద్ధతి అతి రహస్యంగా దాచబడింది. పపైరస్ అన్న కాగితం (మనం మామూలుగా వాడే “పేపర్” అన్న పదం వచ్చింది ఇలానే!) తయారీకి ముడిపదార్ధం “సైప్రస్ పపైరస్” అన్న మొక్క. దిగువ నైల్ నది (నైల్ నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది. భారత దేశంలోనూ, ఉత్తర అమెరికాలోనూ నదులు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తాయి.) ప్రాంతం, అంటే అలగ్జాండ్రియా దగ్గరగా ఉన్న నైల్ నదీప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ మొక్క రాయడానికి పనికొచ్చే కాగితం తయారీకి మాత్రమే కాకుండా, తాళ్ళు అల్లడానికి, పడవల తయారీలకి కూడా ఉపయోగిస్తారు. కానీ, అతి ముఖ్యమైన ఉపయోగం ఒక్క కాగితం వల్లనే! చిత్రమైన విషయం ఏమిటంటే, కాగితం ప్రాచీన ఈజిప్టు నాగరికతలో ఒక ముఖ్య భాగమైనా, అది తయారుచేసే కీలకమైన వివరాలు రాత పూర్వకంగా ఎక్కడా పొందుపరచలా! అందువల్ల ఈ పపైరస్ తయారీ పూర్వులతోనే అంతరించిపోయింది. 1969 సంవత్సరంలో, పపైరస్ తయారీ అంతమైన దాదాపు వెయ్యి సంవత్సరాల తరవాత, హసన్ రగబ్ అన్న వ్యక్తి పపైరస్‌ను ఈజిప్టులో పునఃప్రవేశం చేయించాడు. ఈజిప్టులో అప్పటికే సైప్రస్ పపైరస్ మొక్క అంతరించటంతో, పొరుగునే ఉన్న సుడాన్ దేశం నుంచి ఈ మొక్క వేళ్ళు సంపాయించి తిరిగి కైరోలో గీజాకి దగ్గరగా ఉన్న జాకబ్ (Jacob) ద్వీపంలో నాటించి పునరుద్ధరించాడు. ఈ నాటికి కూడా ఇది ప్రపంచంలోని మానవ ప్రయత్నంతో తయారుచేయబడ్డ అతి పెద్ద పపైరస్ ప్లాంటేషన్‌గా చెప్పుకుంటారు! రగబ్‌కు తరవాత ఎదురైన సమస్య – ఈ మొక్కలనుంచి కాగితాన్ని ఎలా తయారుచెయ్యటం? మూడు సంవత్సరాలు, రగబ్ అతని కుటుంబ సభ్యుల నిరంతర కృషి వలన పపైరస్ తయారీ మళ్ళీ కనుక్కున్నారు! ఈనాటికీ రగబ్ తరవాత రెండు, మూడు తరాల కుటుంబ సభ్యులు ఈ పపైరస్ తయారీలోని సూక్ష్మాలను ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు.

మేం వెళ్ళిన షాపులో రకరకాలైన పపైరస్‌తో తయారు చెయ్యబడ్డ చిత్రాలు అమ్మకానికి ఉన్నాయి. అతి చక్కగా ఉపయోగించబడ్డ రంగులతో రకరకాలైన చిత్రాలు పపైరస్ పై చిత్రించబడి, అందమైన ఫ్రేములలో షాపంతా అలంకరించబడ్డాయి. షాపులో ఒక పక్కగా పపైరస్ కాగితాన్ని మొక్కలనుండి ఎలా తయారు చేస్తారో వివరంగా చూపించడానికి ఒక అందమైన ఈజిప్షియన్ అమ్మాయి నిల్చుని ఉంది. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి, పపైరస్‌ని ఇలా తయారు చేస్తారు. సైప్రస్ పపైరస్ మొక్కల నుండి కాండం కొంచెం పెద్దగా, దృఢంగా ఉన్న కాడలను (మనకు తెలిసిన జనప, గోగు కాడలు గుర్తొచ్చాయి) తీసుకొని, వాటికి పైనున్న ఆకుపచ్చని బెరడు తీసి, లోపల ఉన్న దవ్వ (pith)ని తీసి, పొడుగ్గా పల్చని బద్ద (strips) లాగ తీసి ఉంచుతారు. తరవాత వాటిని అతి పల్చగా రేకుల్లాగా నలక్కొట్టి మూడు రోజులు నీటిలో మెత్తగా (pliable) అయ్యేంత వరకు నానబెడతారు. తరవాత వీటిని సరైన పొడుగుకి కోసి, ఒక పల్చని మెతక గుడ్డపై పరుస్తారు. ఈ బద్దలని కొన్ని నిలువుగాను, మరి కొన్ని అడ్డంగాను పెట్టి, ఖాళీ స్థలం లేకుండా, ఒక చదరంగం లాంటి గడిని తయారు చేస్తారు. దాని పైన మళ్ళీ ఒక సన్నటి గుడ్డను కప్పి, వీటిని ఒక దానికి మరొకటి బాగా అతుక్కునేట్లు గట్టిగా నొక్కి ఉంచుతారు. ఈ మొక్కలో ఉన్న ఒక రకమైన జిగురు పదార్ధం వల్ల, ఇవన్నీ ఒకదానికి మరొకటి అతుక్కొని, ఒక పల్చని కాగితంలాగా తయారవుతుంది. ఈ కాడల్లో ఉన్న తేమ పూర్తిగా పోయేవరకు, వీటిని నొక్కిపెట్టి ఉంచి పపైరస్ తయారీ పూర్తి చేస్తారు!


ఈజిప్ట్‌లో రైలు ప్రయాణం
కైరోలో చూద్దామనుకున్నవన్నీ చూసిన తరవాత, ఈజిప్ట్‌లో దక్షిణ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద పట్టణమైన అస్వాన్ చేరుకోటానికి కైరో నుంచి రైలులో వెళ్ళాలని మా ప్లాన్. ఈజిప్ట్‌లో అన్ని ప్రాంతాల్లోకి నైల్ నది అస్వాన్ దగ్గర అత్యంత అందంగా ఉంటుంది. కైరో నుంచి అస్వాన్ దాదాపు 900 కిలోమీటర్లు దూరం. నాకు ఆంధ్రాలో బాగా అనుభవమైన హైదరాబాద్-విశాఖపట్నం రాత్రి పూట రైలు ప్రయాణం లాగ, కైరోలో బయలుదేరి ఒక రాత్రి అంతా ప్రయాణిస్తే, ఉదయానికి అస్వాన్ చేరుకోవచ్చు! మేం అలాగే వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం, కైరోలో రాత్రి 8 గంటలకి రైల్లో బయలుదేరాం. ఈజిప్ట్ దేశానికి ఎక్కువ ఆదాయం వచ్చేది టూరిజం ద్వారానే! అందుకని దేశంలో చాల చోట్ల యాత్రీకుల కోసం సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేసారు. మేం అందరం ఒక కూపేలో ఇద్దరు చొప్పున నాలుగు పక్క పక్క కూపేల్లో సర్దుకున్నాం. ఆ రాత్రి భోజనం రైల్లోనే చేశాం. ఇక్కడ కొంచెం ఈజిప్ట్ భోజనం గురించి చెప్పడం అవసరం! శనగ పిండితో చేసిన వడలు (ఫలాఫల్ అంటారు Falafel), నువ్వుల నూనె పెరుగు కలిపి చేసిన చట్నీ (తహిని అంటారు Tahini), వంకాయ – ఉల్లిపాయలు – టొమేటోలతో చెసిన ఒక కూర (ముసాక అంటారు Moussaka), ఒక రకమైన పెసలు ఉల్లిపాయలు కలిపి చేసిన అన్నం (Egyptian Rice), లెబనీస్ చపాతీలు ఆ రాత్రి మా భోజనంలో కొన్ని పదార్ధాలు. మాంసాహరులకు ముఖ్యంగా దొరికేవి లాంబ్ (అరబ్ దేశాల్లో లాంబ్ చాలా ఇష్టంగా తినే మాంసాహారం) తరవాత చికెన్. మా భోజనాలు అన్నీ అయిన తరవాత, రైల్లోనే ఉన్న ఒక రెష్టరెంట్‌లో ఈజిప్ట్‌లో ప్రసిద్ధమైన అరాక్ (భోజనం తరవాత తాగే మద్య పానీయం) తాగాం! అనుకోకుండా అక్కడ ఉన్న అమెరికన్ యాత్రికులతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఆష్టిన్, టెక్సస్ నుంచేనని తెలుసుకొని ఆశ్చర్యపోయాం! కబుర్లన్నీ చెప్పుకొని పడుకునే సరికి రాత్రి 12 దాటింది. పొద్దున్నే నిద్ర లేచేసరికి ఆరు గంటలయింది. ఒక్క నిమషం ఎక్కడ ఉన్నానో తెలియలా! రైలు కిటికీ గుండా చూస్తే చక్కని పొలాలు, తోటలు కనపడ్డాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం రైలులో వెడుతుంటే, రాజమండ్రి దాటిన తరవాత, కడియం ప్రాంతాల్లో ఎంతో అందమైన ప్రకృతిని చూస్తున్నానా అనిపించి, ఒక్క క్షణం నేను ఆంధ్రాలో ఉన్నట్టనిపించింది. రైలు అస్వాన్ చేరేసరికి ఉదయం 10 గంటలు దాటింది. రైల్ ష్టేషన్ నుంచి మేం వెళ్ళవలసిన క్రూజ్ బోటు చాలా దగ్గర. ఒక గంటలోపు మేం అందరం క్రూజ్ బోటులో మా గదుల్లోకి చేరుకున్నాం!

నైల్ నది
ఈజిప్ట్ గురించి వివరాలిస్తున్నప్పుడు, నైల్ నది గురించి చెప్పకపోతే అది సంపూర్ణం కాదు. నైల్ నది ఈజిప్ట్ దేశానికి గుండె వంటిది. చిన్నప్పుడు ఎప్పుడో నైల్ నది ఈజిప్ట్ నాగరికతకు మూలం అని చదువుకున్నా, మా ఈజిప్ట్ యాత్ర జరిగే దాకా అది ఎంత నిజమో నాకు అనుభవంలోకి రాలేదు. ప్రపంచంలో అతి పొడవైన నదిగా పేరుపొందిన నైల్ నది మొత్తం 6600 కిలోమీటర్ల పొడవులో, ఈజిప్ట్‌లో ప్రవహించేది 1500 కిలోమీటర్లు మాత్రమే. ఎక్కడో ఈజిప్ట్‌కి దక్షిణంగా ఉన్న విక్టోరియా సరస్సులో పుట్టి, సుమారు 8 దేశాల గుండా ప్రవహించి, ఈజిప్ట్‌లో ఉత్తరంగా ఉన్న మెంఫిస్ దగ్గర పాయలుగా విడిపోయి, మెడిటెర్రేనియన్ సముద్రంలో కలుస్తుంది. ఈజిప్ట్‌లో దక్షిణంగా ఉన్న అతి పెద్ద పట్టణమైన అస్వాన్ సమీపంలో ఉన్న నాసర్ సరస్సులో 80వ దశాబ్దంలో కృత్రిమంగా నిర్మించబడ్డ ఆనకట్ట వల్ల ఈజిప్ట్ దేశస్తులు ప్రతి ఏటా భయపడే అతి పెద్ద ప్రమాదమైన నైల్ వరదలు ఆపబడ్డాయి. పొడవులో అతి పెద్ద నది అయినా, నైల్ నది వెడల్పులో మాత్రం చిన్నదే! కొన్ని కొన్ని చోట్ల, నైల్ నది వెడల్పు, అర కిలోమీటరు కూడా ఉండదు. నైల్‌తో పోలిస్తే, గోదావరి నది రాజమండ్రి దగ్గర మూడు కిలోమీటర్ల కన్న ఎక్కువే పొడవు కదా! ఈజ్ఇప్ట్‌లో వర్షపాతం అతి తక్కువ కాబట్టి, నైల్ నది నీరు ఈజిప్ట్ ప్రజల జీవనాధారం! ఒక ఒడ్డునుంచి చూస్తే ఆవలి ఒడ్డు సుబ్భరంగా కనపడుతుంది. అంతే కాదు! చాలాచోట్ల, ఒడ్డుని ఆనుకుని చిన్న చిన్న మొక్కలు, గడ్డి పెరుగుతాయి. మరి కొన్ని చోట్ల ఒక పది మీటర్లు ఒడ్డు నుంచి బయటకు వస్తే, ఇసుక పర్రలతో, ఎడారి మొదలవుతుంది. ఈజిప్ట్ లోని పిరమిడ్‌లు అన్నీ, నైల్ నది పశ్చిమ తీరం పైనే కట్టడం గమనించ తగ్గది. ఇందుకు కారణం, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైన దేవత సూర్యుడు. (“రా” అని పిలుస్తారు) సూర్యాస్తమయం పశ్చిమాన జరుగుతుంది కాబట్టి, పిరమిడ్‌లు కూడా పశ్చిమాన్నే కట్టాలన్న సాంప్రదాయం వచ్చింది. మా నైల్ నదిపై క్రూజ్ విహారం అస్వాన్ నుంచి 90 కిలోమీటర్లు ఉత్తరంగా ఉన్న లుక్సర్ అన్న ఊరికి. ఇలా నైల్ నదిపై విహారం నాలుగు రోజులు (మూడు రాత్రులు). ఈ ప్రయాణంలో బోలెడన్ని ప్రాచీన దేవాలయాలు చూసాం. అన్ని దేవాలయాలు తూర్పు ఒడ్డున ఉన్నాయి, వాలీ ఆఫ్ కింగ్స్, క్వీన్స్ (ఇక్కడ ప్రాచీన ఈజిప్ట్ రాజు-రాణీల సమాధులున్నాయి) అన్నీ పశ్చిమతీరం వెంబడి ఉన్నాయి.


అస్వాన్ నుంచి లుక్సర్ దాకా
ఈజిప్ట్ యాత్రా విహారం కోసం వచ్చిన వాళ్ళు, నైల్ అందాలను, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాలను, శిధిలాలను చూడకుండా వెళ్ళరు! అలా చూడాలంటే, అస్వాన్ నుంచి లుక్సర్ దాకా ఉన్న 90 కిలోమీటర్ల దూరం మోటారు బోటులో ప్రయాణం చాలా వీలుగా ఉంటుంది. మేం అలానే చేసాం! ఇది నాలుగు రోజులు (మూడు రాత్రులు). ప్రాచీన ఈజిప్ట్ నాకరికతలో ముఖ్యమైనవి రకరకాలైన దేవతలు, వారికి కట్టిన దేవాలయాలు, వాటిలో ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో ఒకటయిన ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ (Egyptian Hieroglyphs) లో రాయబడ్ద రాతలు. ఈ ప్రయాణంలో నైల్ నదికి తూర్పు తీరాన, అస్వాన్ (Aswan), కొమొంబో (Kom Ombo), లుక్సర్ ((Luxor), కార్నాక్ దేవాలయం (Karnak Temple) ఉన్నాయి. పశ్చిమ తీరం వెంబడి ఎడ్పు (Edfu), ఎస్న (Esna), వాలీ ఆఫ్ కింగ్స్ (Valley of Kings), వాలీ అఫ్ క్వీన్స్ (Valley of Queens) ఉన్నాయి. ఒకటి, రెండు దేవాలయాలు చూడగానే, వాటిల్లో ఉన్న వివరాలు, వాటి కథల సమాచారాలతో ఉక్కిరి బిక్కిరి అవుతాం! అంతే కాకుండా, ఒకటి-రెండు దేవాలయాలు చూసిన తరవాత, మిగిలిన దేవాలయాలు ఇంతకు ముందు చూసిన దేవాలయాల్లాగే ఉన్నట్లు అనిపించటంతో ఏ దేవాలయం దేనికి ప్రసిద్ధమో మరిచిపోతాం! విదేశీయులు భారతదేశానికి యాత్రలకి వచ్చినపుడు, మన దేవాలయాలని, ప్రాచీన శిధిలాలను చూసి ఇలాంటి అనుభూతులకే గురి అవుతారనిపించింది. చాలా దేవాలయాల్లో, అనేక రకాలైన జంతువులను కూడా “మమ్మీ”ల క్రింద మార్చి భద్రపరచారు.


ఇందాకా చెప్పుకున్నట్టు, పశ్చిమ తీరంలో ఉన్న ప్రాచీన రాజు-రాణీల సమాధులు తప్పని సరిగా చూడవలసిందే! ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి, ఈ పిరమిడ్‌ల లోపలి గోడలపై చిత్రించిన అనేక రకాలైన చిత్రాలు, అందమైన నగిషీలతో మలచబడ్డ బొమ్మలు, శవపేటికల. అంతే కాకుండా, పిరమిడ్‌ల నిర్మాణంలో చూపించిన నైపుణ్యం మరువ లేనివి. ( ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి! మేం చూసిన సమాధులు {పిరమిడ్స్} అన్నిటిలోనూ ఫోటోలు తీయటం నిషేధం! ఒక యాత్రీకుడు తాను ఎవరికీ తెలియకుండా తెలివిగా ఫోటో తీస్తున్నాననుకొని, మేం చూస్తుండగానే, అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ కంటబడ్డాడు! వెంటనే, సెక్యూరిటీ గార్డ్ ఆ యాత్రికుడి నుంచి కెమేరా లాక్కొని తిరిగి ఇవ్వలేదు!) మా క్రూజ్ గైడు చెప్పిన దాని బట్టి, ఈజిప్ట్ ప్రభుత్వం ఇప్పటికీ కొత్త కొత్త సమాధులని తవ్వకాల ద్వారా కనుక్కుంటూనే ఉన్నారట! ఇప్పటి దాకా మేము చూసిన వాటికే మాకు మతి పోతుంటే, ముందు ముందు కనుక్కోబోయే విషయాలు ఇంకెన్ని ఉంటాయో అని తలచుకుని ఆశ్చర్యపోయాం!


పగలల్లా బోటులో ప్రయాణం, మరి ప్రయాణం లేకపోతే బోట్ ఆపి అక్కడక్కడ దేవాలయాలు, ఇతర యాత్రా స్థలాలు చూట్టం. మరి ప్రతి రాత్రీ బోటులో ఏదో ఒక విందు ఉండేది. ఒక రాత్రి, ఈజిప్ట్‌లో ప్రసిద్ధమైన బెల్లీ డాన్స్ (Belly Dance) ఏర్పాటు చేసారు. బెల్లీ డాన్స్ ఈజిప్ట్ ప్రాంతాల్లో ప్రసిద్ధమైన ప్రాచీన నృత్యం. మన హిందూ సాంప్రదాయంలో స్త్రీలు బొడ్డు చూపించకుండా బట్టలు వేసుకుంటారుకదా, ఈ బెల్లీ డాన్స్ అసభ్యంగా ఉంటుందేమో అనుకున్నా! నిజానికి ఈ డాన్స్ ఎటువంటి అసభ్య ప్రదర్శన లేకుండా ఉండే నృత్యం! కానీ నాకు ఎందుకో, ఈ బోట్ లో చూసిన నృత్యం అంత బాగా నచ్చలా. మా తిరుగు ప్రయాణంలో షర్‌మల్ షేక్‌లో చూసిన బెల్లీ డాన్స్ నాకు బాగా నచ్చింది. బెల్లీ డాన్స్ ప్రస్థుతం ఈజిప్ట్‌లో అంతరించి పోతున్న కళ అని అమానీ చెప్పింది. మరొక రాత్రి జల్లబియ (Jallabiya) విందు ఏర్పాటు చేసారు. జల్లబియ అంటే, శరీరం పైనుంచి క్రింద వరకు, అతుకుల్లేకుండా, ఒకే గుడ్డతో చేసిన డ్రెస్. ఇది ఈజిప్షియన్‌ల జాతీయ డ్రెస్. ఈజిప్ట్‌లో సంవత్సరం పొడుగునా ఉండే మండే ఎండ నుంచి శరీరం కాపాడుకోటానికి ఇటువంటి బట్టలే సరిపోతాయి. మేం పెద్ద వాళ్ళమే కాకుండా, చిన్న పిల్లలకి కూడా సరి అయిన జల్లబియలు కొనుక్కుని విందుకి వెళ్ళాం!


మా ఈజిప్ట్ యాత్రలో మరి కొన్ని పరిశీలనలు ఇవి. మేం ఎక్కడకు వెళ్ళినా, నాతో అంతా అరబిక్‌లో మాట్లాడటానికి ప్రయత్నించేవారని ముందే చెప్పాను కదా! నా మొఖంలో అరబిక్ తెలిసిన ఛాయలేవీ కనపడక పోవటంతో, వెంటనే నేను భారతీయడ్నని గుర్తు పట్టామని చెప్పటానికి “ఇండియా” అనేవారు. భారతీయుల్లో ఒకే ఒక వ్యక్తి ఈజిప్ట్ దేశస్థులందరికీ పరిచయస్థుడు. అతను ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్. నాతో మాట్లాడిన ఒకళ్ళిద్దరు ఈజిప్షియన్‌లు మాత్రం మహాత్మా గాంధీ పేరు చెప్పగలిగారు! కైరో నుంచి ఫెరో రాంసెస్ రాజ్యానికి ముఖ్య పట్టణమైన మెంఫిస్ వెడుతుంటే, చిన్న పిల్లలు నైలు నదికి సంబంధించిన పిల్ల కాలువల ఒడ్డున గాడిదలపై ఆడుకుంటూ కనపడ్డారు. కోనసీమ పరిచయం ఉన్న తెలుగు వారికి కళ్ళకి గంతలు కట్టి ఇక్కడ వదిలేస్తే, కోనసీమలో ఉన్నామన్న ఆలోచన తప్పకుండా వస్తుందనిపించింది. ఒకటే తేడా, మన వైపు పిల్లలు గేదెలమీద తిరుగుతూ ఆడుతుంటే, ఇక్కడి పిల్లలు గాడిదల మీద ఎక్కి ఆడుకుంటారు!

తిరిగి షర్‌మల్ షేక్
నైల్ నది పై క్రూజ్‌లో ఆఖరి మజిలీ లుక్సర్. నాలుగు రోజుల క్రూజ్‌లో అఖరు రోజు లుక్సర్‌లో గడిపి ఆ రోజు రాత్రి విమానంలో తిరిగి షర్‌మల్ షేక్ చేరుకున్నాం. మా తిరుగు ప్రయాణంలో జెనీవా వెళ్ళటానికి మరొక రోజు మిగలటంతో, షర్‌మల్ షేక్‌లో మళ్ళీ ఒక రోజు గడిపాం. ఈ సారి అందరం సముద్రం ఒడ్డునే పారా సైలింగ్ (Parasailing) లాంటివి చేస్తూ రోజంతా గడిపాం.

తిరుగు ప్రయాణం
మా తిరుగు ప్రయాణం రోజు పొద్దున్నే నాలిగింటికి లేచి, అందరం తయారయి, సామాన్లతో పాటు ఆరు గంటలకల్లా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. అన్ని పనులూ పూర్తి చేసుకొని విమానంలో కూర్చున్న తరవాత, ఎందుకో ప్రముఖ భాషా సేవకుడు, మహామహోపాధ్యాయ స్వర్గీయ శ్రీ తిరుమల రామచంద్ర గారి ఆఖరి రచన, బహుళ ప్రజాదరణ పొందిన రచన,”హంపీ నుంచి హరప్పా దాకా” పుస్తకంలో ఆఖర్న ఉదహరించిన ఈ క్రింది శ్లోకం గుర్తొచ్చింది.

యస్తు సంచరతే దేశాన్
యస్తు సేవేత పండితాన్
తస్య విస్తారితా బుధిః
తైల బిందు రివాంభసి
(ఎవరు దేశాలు తిరుగుతారో, ఎవరు పండితులను సేవిస్తారో, వారి బుద్ధి నీటిలో పడిన నూనె సెక్కలా విస్తరిస్తుంది!)

ఎక్కడో ఆంధ్రదేశంలో ఒక పల్లెటూర్లో పుట్టి, కొన్ని వేల మంది ప్రవాస ఆంధ్రుల్లాగే అమెరికా దేశం వచ్చి, పదిహేను సంవత్సరాలు అమెరికాలో ఉండి, వృత్తిరీత్యా ఫ్రాన్స్‌లో మూడేళ్ళు గడిపి, అమెరికా, యూరప్ అంతా చూసాను. ఇప్పుడు ఇలా ఈజిప్ట్ చూడటం జరిగింది కదా! ఇన్ని దేశాలు చూడటం వల్ల నా బుద్ధి ఏమైనా వికసించిందా లేదా అని ఆలోచిస్తూ, రెండు వారాల ప్రయాణ బడలిక వల్ల నిద్రలోకి జారుకున్నా!
-------------------------------------------------------
రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న, 
ఈమాట సౌజన్యంతో

Friday, November 22, 2019

తెలుగు సాహిత్యంలో హాస్యపాత్రలు


తెలుగు సాహిత్యంలో హాస్యపాత్రలు





సాహితీమిత్రులారా!

కన్యాశుల్కం నాటకం వచ్చేవరకు తెలుగువాడికి హాయిగా నవ్వుకోవడం తెలియదని మా గురువు డా॥ శ్రీపాద కృష్ణమూర్తి తెగేసి చెప్పారు. అది నిజమే. గిరీశం నించి బైరాగి దాకా అందరికీ గొప్ప వాగ్ధోరణి ఉంది. దాదాపు పదమూడు దశాబ్దాలుగా కన్యాశుల్కం పాత్రలన్నీ తెలుగువాళ్లని నవ్విస్తూ బతికేస్తున్నాయి. అసలు మన వాళ్లు కూడబలుక్కొని విజయనగరం కూడలిలో మధురవాణి శిలా విగ్రహం నిలబెట్టడం తెలుగుజాతి కనీస ధర్మం అన్నాడొక పెద్దమనిషి. కన్యాశుల్కంలో పాత్రలన్నీ లౌక్యంతోనో, ఆగ్రహంతోనో, అమాయకత్వంతోనో ప్రవర్తిస్తూ నాటకాన్ని నడిపిస్తారు. వెంకటేశం… గిరీశం మధ్య జరిగే ఓ సంభాషణను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

‘‘మీ వల్లొచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే…’’ పాఠం ఎప్పుడూ చెప్పని గిరీశానికి చురకేస్తాడు వెంకటేశం.

వెంటనే గిరీశం… ‘‘ఇది బేస్‌ ఆన్గ్రాటిట్యూడ్‌. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్‌…’’ అంటూ గొప్పగా చెప్పుకుంటాడు.

కాంతం పాత్రని సృష్టించి, కాంతం కథలు రాసిన మునిమాణిక్యం నరసింహారావు, ‘గురజాడది శబ్దాశ్రయ హాస్యం,’ అన్నాడని ఆరుద్ర, ముళ్లపూడి మునిమాణిక్యాన్ని ఏకి పడేశారు. ముళ్లపూడి వెంకటరమణ గిరీశాన్ని చెన్నప్పటం తీసుకొచ్చి సినీ మాయ మీద లెక్చర్లిప్పించి, గరజాడ కీర్తిలో వాటా దండుకున్నారు.

‘‘నేను, శ్రీశ్రీ రోజూ అయిదు నిమిషాలు కన్యాశుల్కం మాట్లాడుకుని ఆనక సొంత విషయానికొస్తాం,’’ అనేవారు ఆరుద్ర. అంటే సంభాషణ చాలావరకు కన్యాశుల్కంలోని సంభాషణలతోనే సాగేదన్నమాట. తరువాత కూడా చాలామంది కన్యాశుల్క ప్రియులు అందులోని మాటల్నే దాఖలు చేసేవారు. ఇప్పటికీ అలాంటివారు అడపాదడపా తగుల్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంటాం.

ఆధునిక కాల్పనిక సాహిత్యంలో పుట్టిన హాస్యపాత్రల్ని పరామర్శించే ముందు కాస్త వెనక్కి వెళ్దాం. సృష్టితో పాటు పుట్టిన హాస్య పౌరాణిక పాత్ర నారద మహర్షి. ఆయన తంపులమారి, కలహభోజనుడు. రాక్షసులకి, దేవతలకి, దేవునికి, భక్తునికి, అమ్మవారికి, అయ్యవారికి మధ్య అగ్గి రాజేస్తాడు. అయినా అది చినికి చినికి గాలివానై, లోకకల్యాణానికి దారితీస్తుంది. నారద మహర్షి చాలామందికి గర్వభంగాలు చేయించాడు. సతీ లీలావతికి ఆశ్రయం ఇచ్చి, హిరణ్యకశిపుడికి గర్భశత్రువుతో నరకం చూపించాడు. సత్యభామతో, మీరజాలగలడా, నా యానతి అని నాట్యం చేయించి సత్యవతిని దానంగా స్వీకరించి, చివరకు భలే మంచి చౌకబేరము అంటూ కృష్ణమూర్తిని నడివీధిలో అమ్మకానికి పెట్టాడు. సత్యభామ కన్ను తెరిపిస్తాడు. కృష్ణ తులాభారంలో సూత్రధారి నారద మహర్షి. మన పురాణాల్లో నారదుడు నడిపించిన రక్తి, ముక్తి, భక్తి కలగలసిన కథలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికీ సూత్రధారి నారుదలవారే. నారదుడంటే హాస్యం. నారదుడంటే విశ్వశాంతి!

మరో హాస్యస్ఫోరక పౌరాణిక పాత్ర వసంతకుడు. కథా నాయకునికి కూరిమి చెలికాడు. నాయికా నాయకుల మధ్య రాయబారం నడుపుతాడు. నాయకుడు సాక్షాత్తూ దేవుడే అయినా గులాబీరెమ్మతో చెమ్కీచెండుతో చిన్న వేటు వేస్తాడు.

రాధాకృష్ణ నాటకంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక సందర్భంలో వసంతకుడు తన బాధను వ్యాకరణంలోకి మార్చుకుని, ‘‘స్వామీ ఉంగరము తాము ధరించి, ముద్దు ఆమె కొసంగి, టుగాగమము మాత్రము నాకు దయచేసితిరి,’’ అని వాపోతాడు. వ్యాకరణరీత్యా ముద్దుGఉంగరము వెరసి ముద్దు టుంగరము అవుతుంది. ఇది చమత్కారంతో సాధించిన సరస శృంగారభరిత హాస్యం. ఇవి పానుగంటివారి పలుకులు. వసంతు కుని నోటి వెంట సందర్భోచితంగా వెలువడి స్వాతిముత్యాలుగా తెలుగువారికి అందాయి.

పానుగంటి సాక్షి వ్యాసాలు అప్పట్లో చాలా ప్రసిద్ధి. అందు లో జంఘాలశాస్త్రి ముఖ్య భూమిక. ఆయన రచనల్లో ‘కంఠా భరణము, వృద్ధవివాహము’ ప్రసిద్ధాలు. సాక్షి వ్యాసాల్లో కాలా చార్యుణ్ణి వర్ణిస్తూ, ‘‘…ఈతని తల పెద్దది. గుండ్రటి కనులుండు టచే, ముక్కు కొంచెం వెనుకాడుటచే, మొగము గుండ్రముగా నుడుటచే నీతడు నరులలో బుల్‌డాగ్‌ జాతిలోనివాడు. ఈతడు మాట్లాడినా మొఱిగినట్లుండును,’’ అని నవ్విస్తారు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం గణపతి నవల్లో ఒక మేధకుని పాత్రని సృష్టించారు. గణపతి ప్రహసనంగా రూపొంది గణపతి పాత్ర ప్రాచుర్యంలోకి వచ్చింది. అమాయకత్వాన్ని దాటిపోయి జడ్డితనం కనిపిస్తుంది గణపతి పాత్రలో. నాజూకుతనం ఏమాత్రం లేని మొరటుపాత్రగా, వగరు హాస్యంగా మిగిలింది. భమిడిపాటి కామేశ్వరరావు మోలియార్‌ నాటకాలను తెనిగించారు. ఆయన హాస్యంలో నవ్యత కనిపిస్తుంది. కానీ గుర్తుండిపోయే సజీవ పాత్రలు మనముందు నిలిచి నవ్వించే భాగ్యం లేకపోయింది. మొక్కపాటి నరసింహశాస్త్రి సృష్టించిన బారిష్టర్‌ పార్వతీశం పాత్ర ఇప్పటికీ తెలుగువారి మనోఫలకంపై తారట్లాడుతూనే ఉంది. నిజానికి అవి ఆయన స్వానుభావాలే చాలావరకు. మొక్కపాటి వ్యవసాయశాస్త్రం అభ్యసించడానికి లండన్‌ వెళ్లారు. చివరంతా లేకుండానే తిరిగి వచ్చారు. తన అనుభవాలను కథలు కథలుగా వినిపించి నవ్విస్తుంటే, ఈ నవ్వుల్ని గ్రంథస్తం చేయరాదా అని సాటి కవిమిత్రులు సూచించారు. మొదటి భాగం అలా వచ్చి తెలుగునేలను నవ్వుల్లో ముంచెత్తింది. కొంతకాలానికి పార్వతీశం రెండోభాగం రాశారు. ఇందులో సహజత్వం పాలు తగ్గి కల్పన పాళ్లు ఎక్కువైంది. చాపల్యం నశించక మూడోభాగానికి కంకణం కట్టుకున్నారు. రచయిత పార్వతీశాన్ని పూర్తిగా పూనేశాడు. అందుకే ఎక్కడ ఆరంభించాలో కాదు ఎక్కడ ఆపాలో తెలియాలని విజ్ఞులంటారు.

మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళ్తే, తెనాలి రామకృష్ణుడు, ఆయన పేరు మీద వచ్చిన చమత్కార కథలు గుర్తుకు వస్తాయి. వరాన్నీ, శాపాన్నీ ఏకకాలంలో అందుకుని వికటకవిగా వాసికెక్కాడు. ఆయన తెనాలి రామకృష్ణుడని కొందరు, కాదు రామలింగడని కొందరు అంటారు. ఆయన రచనల్లో హాస్యం కనిపించదు. కానీ ఆయన జీవితంలో చాలా హాస్యం వినిపిస్తుంది. ‘కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్‌,’ సమస్యను క్షణ కాలంలో రెండు విధాలుగా పూరించిన ప్రతిభాశాలి. చాలా హాస్య కథలను రామకృష్ణుని పరంగా చెబుతుంటారు. ఆ రోజుల్లో రాజుగారి కొలువులో ఆస్థాన విదూషకులుండేవారు. వారి పని తమ చమ త్కార భాషణతో రాజుని, సభని రంజింపజేయడమే. ఉత్తర భారతంలో బీర్బల్‌ పేరు పలు హాస్యకథల్లో వినిపిస్తుంది. మన జానపద కళారూపాల్లో ఎన్నో హాస్యపాత్రల సృష్టి జరిగింది. ప్రాచీన మైన తోలుబొమ్మలాటలో జుట్టుపోలిగాడు, కేతిగాడు, బంగారక్క తమ సంభాషణలతో నవ్వించడమే కాదు తమకు ఉదారంగా కానుకలివ్వని వారిపై విసుర్లు కూడా వుండేవి. అయితే వారి హాస్య సంభాషణలు విచ్చలవిడిగా ముతకగా ఉండేవి. అయినా ఇప్పటికీ ‘కేతిగాడు’ అనే మాట మనం తరచూ వాడుతూనే వుంటాం. ఇక జానపద కళారూపాలుగా వాటినే నమ్ముకుని జీవించేవారు కొందరుండేవారు. గాంధోళిగాడు, కొమ్మదాసరి, పగటి భాగవతులు, పిట్టలదొర` వీరంతా గడప గడపకూ వచ్చి వినోదపరచి యజమానుల ఆదరణను చూరగొనే వారు.

1950వ దశకంలో ఒక కొత్త తరం రచయితలు వచ్చారు. అప్పటిదాకా పల్లెల్లో తిరుగుతున్న కథలు బస్తీలకు, నగరాలకు వచ్చాయి. ముళ్లపూడి వెంకటరమణ చెన్నపట్నం నేపథ్యంలో దిగువ మధ్యతరగతి జీవితాలను అక్షరచిత్రాలుగా మలిచారు. పైకి వెళ్లాలన్న ఆశ, ఇంకా పడిపోతామేమోననే భయం క్షణక్షణం మధ్యతరగతిని వేధిస్తూ ఉంటుంది. రమణ జనతా ఎక్స్‌ప్రెస్‌ కథలో కథ కంటే పాత్రలే ముఖ్యపాత్ర వహిస్తాయి. పక్కింటి లావుపాటి పిన్నిగారు, రాధాగోపాళాలు, అప్పారావు, ప్రైవేటు మాస్టారు వీళ్లంతా ఒక ఎత్తయితే బుడుగు, సీగాన పెసూనాంబ మరో ఎత్తు. బుడుగు భాషని కూడా ప్రత్యేకంగా తెలుగు చెట్టుకి రమణ అంటుతొక్కారు.

‘బుడుగు’ గమ్మత్తులు కోకొల్లలు. వాటిల్లోంచి ఒకటి… ఇది బుడుగు సొంత బాధ. ‘మాస్టార్లకసలు తెలివుండదు. ఒక మేస్టారేమో కుడివైపు మెలి పెడతాడు. ఇంకొన్నాళ్లకి కొత్త వాడొ స్తాడు కదా? వాడేమో ఎడమవైపు మెలి పెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకనీ ఎటేపు మెలిపెట్టాలో కొత్త మేష్టరు ముందుగా పాత మేష్టరును కనుక్కుని రావాలి. లేదా మనలాంటి పెద్ద మనిషినడగాలి. ‘నేనేం చిన్నపిల్లాణ్ని కాదు అంటే అమ్మ వినదు. కుర్రకుంకా అంటుంది. ‘బుడుగు బొబ్బ పోసుకుందు గాని లాఅమ్మ,’ అనీ ‘బువ్వ పెత్తనా బులుగూ’ అని అంతే నాకు ఎంత అవమానం. చెపితే వినరూ…’

ఇక మునిమాణిక్యం వారి ‘కాంతం’ మాటల తూటాలకు మారుపేరు. ఒకరోజు భర్త, ‘మీ చెల్లెలు ఒక కోతి, మీ అక్కయ్య మరో కోతి. తోకలు మాత్రం లేవు,’ అని ఎగతాళి చేస్తే, ‘మీ చెల్లెళ్లకు ఆ లోటు లేదు,’ అని అంటుంది కాంతం తడుము కోకుండా! మరోసారి కాంతాన్ని భర్త పిలిచి, ‘నా కలం కనపడట్లేదు వెతికి పెట్ట,’మంటే… వంటగదిలోంచి, ‘నాకు అట్లకాడ కనిపించ డంలేదు. కాస్త వెతికి పెట్టండ,’ని తిరుగు సమాధానమిస్తుంది. ఇంకోసారి, ‘నేను ఒట్టి తెలివి తక్కువాడిననా నీ అనుమానం,’ అని అడిగిన భర్తతో, ‘అహహ అనుమానమేమీ లేదు. గట్టి నమ్మకం,’ అని బల్లగుద్ది చెబుతుంది. ఇలాంటి సన్నివేశాలెన్నో ‘కాంతం కథల్లో’ మనల్ని నవ్విస్తాయి.

రా.వి.శాస్త్రి తన రచనల్లో పలికిందంతా బంగారం చేశారు. అది హాస్యమా అంటే` చదివేటప్పుడు హాస్యంలానే ఉండేది. తరువాత కంటతడి పెట్టించేవి అందులోని వాక్యాలు, పాత్రలు… అడ్డబుర్ర, రక్తాలు నవ్విస్తూనే వెంటాడే పాత్రలు. ఆరుద్రని ఒక అభిమాని, ‘మీరు ఇన్ని గొప్ప రచనలు చేశారు కాని గుర్తుండి పోయే ఒక పాత్రని కూడా తెలుగువారికి ఇవ్వలేదెందుకని,’ అని అడిగితే, క్షణం కూడా ఆలోచించకుండా, ‘నేనుండగా వేరే పాత్ర లెందుకని ఆ పనిలో తల పెట్టలేదు,’ అని జవాబు చెప్పారట.
------------------------------------------
రచన: శ్రీరమణ, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, November 20, 2019

కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి


కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి




సాహితీమిత్రులారా!

ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ.కొత్తపాతల మేలుకలయికతో తెలుగువారి మత్తువదల గొట్టిన భావ విప్లవకారుడు గురజాడ.తనకి అవసరమైన సాహిత్యాన్ని ఆ తరమే సృష్టించుకొంటుందన్న సూక్తికి “కన్యాశుల్కం” ప్రత్యక్షనిదర్శనం. సాంఘిక నాటకాలు, స్వతంత్ర నాటకాలు, సామాజిక సమస్యగల నాటకాలు లేని లోటును “కన్యాశుల్కం” పూరించింది.

కన్యాశుల్కం నాటకం 1897 లో ప్రచురించబడింది. అంతకు ముందే 1892 లో విజయనగరంలో ప్రదర్శింపబడింది. కొద్ది మార్పులతో రెండవ ముద్రణ పొందింది.
అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. రాజావారు చేసిన సర్వే వల్ల ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెందగా “కన్యాశుల్కం” అనే ఒక గొప్ప సాంఘిక నాటకం మనకి లభించింది.

గురజాడ కన్యాశుల్కం గొప్పనాటకం నిరూపించే అంశాలు
1. వస్తువు,
2. పాత్రపోషణ,
3. హాస్యం, అధిక్షేపం,
4. సంభాషణలు,
5. భాష.

వస్తువు
కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక
నాటకం.  ఆనాటి హేయమైన మానవ నైజాలూ,జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచారు.

ఈ నాటకంలోని కధావస్తువు ” సంఘసంస్కరణ”కి ఉద్దేశించింది. అందులో ముఖ్యాంశాలివి.  చిన్న పిల్లల్నిముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం,వేశ్యావృత్తి హైన్యత స్త్రీల దుస్థితి, పెద్ద మనుషులుగా చెలామణీ అయే కుహనామేధావులు.

ఐదేళ్ళకే బాలికలకి పెళ్ళిచేసేవారు. ఈ అన్యాయాన్నిఎత్తి చూపారు గురజాడ. పసిపిల్లల్ని కాలం గడిచినవాళ్ళకిచ్చి పెళ్ళిచేస్తే వైధవ్యం రాక తప్పదు. బాలవితంతువులుగా జీవితం వెళ్ళబుచ్చవల్సిందే. ఈ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురిని లుబ్ధావధాని కివ్వడంలో ప్రేమ లేక కాదు ధనాశ వల్లనే. ఎందుకంటే తన కొడుక్కి కూడా డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి చెయ్యాలనుకుంటాడు కాబట్టి.

కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ,న్యాయాన్యాయాలూ లేవు.అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది ధనవ్యామోహం వీటిని గురజాడ వెల్లడించారు.

పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ,ఆదర్శాలకీ ఆచరణలకీ పొంతనలేని వ్యక్తుల్ని గురజాడ చూసి “గిరీశం” “రామప్పంతులు” వంటి పాత్రల్నికధలో పొందు పరచారు. మోసాలు, అబద్ధాలు,సొంతడబ్బా, ఎలాగో అలా పబ్బం గడుపుకోవడాలు …. వీటిని నాటక వస్తువులో ఉపాంగాలుగా చేసారు. “ఆధునికత” పేరుతో ఇంగ్లీషు చదువుపై గల వ్యామోహాన్ని వ్యక్తం చేసారు. ఈ నాటకంలోని వస్తువు మన సంస్కృతీరుగ్మతను హెచ్చరిస్తూ సంఘ సంస్కరణ ఎంత అవసరమో వెల్లడిస్తుంది.

ఈనాటి వాళ్ళకి కన్యాశుల్కంలోని వస్తువు పాతది.అందులోని ప్రధాన సమస్య అయిన కన్యాశుల్కం ఈనాడు లేనేలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా లేవు. కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది. వేశ్యలకి చదువు,  తెలివి, సంపద పోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఈనాటికీ ఈ నాటకం జనాదరణ పొందడానికి కారణం, ఈ నాటకాన్ని ఒక “సజీవసాహిత్య ప్రక్రియ”గా గురజాడ రూపొందించడమే. ఆయనలోని కళాప్రతిభ కూడా ఒక ముఖ్యకారణం. పాత్రల తీరుతెన్నులు,సంభాషణల్లోని నైపుణ్యం, నాటకాన్ని సజీవం చేసాయి.”గిరీశం” పాత్ర నాటకానికి పుష్టి కలిగించింది. హాస్యం అన్ని కాలాల్లో అందరూ ఆనందించేటట్టు పోషింపబడింది. ఈ రోగిష్టి సమాజం, మనసు పుచ్చిన మనుషు లున్నంతవరకూ ఈ నాటకం నిలుస్తుంది. నిలిచి శస్త్ర చికిత్స చేస్తుంది కూడా. ఈ నాటకం ఆధునిక నాటకసాహిత్యానికి “విఙ్ఞాన సర్వస్వం” వంటిది. ఈ నాటకాన్ని ఒక సాంఘిక అధిక్షేప నాటకమని గాని, సాంఘిక ఇతిహాస నాటకమని గాని అనవచ్చు.

పాత్రపోషణ
ఏ నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. ఈ నాటకంలోని పాత్రలు  సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం సజీవంగా నిలిచింది.

సర్దేశాయి తిరుమల రావు గారు “కన్యాశుల్క నాటకకళ” అనే విమర్శలో నాటకంలోని పాత్రల్నిరెండు వర్గాలుగా విభజించారు మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు. మనిషిలోని మంచిచెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డమంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపారు.  మధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి. గిరీశం,  రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు. సుబ్బి రంగస్థలంపైకి రాని “నాయిక” వంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెన్టిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది.కన్నీళ్ళు వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక  కర్త ఉద్దేశ్యం కావచ్చు. ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ. “సామూహిక పాత్రీకరణ” అంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక, రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది.ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.

ఈ నాటకాని ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర. ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొంది. నాటకం మొదలు, ముగింపూ ఈ పాత్రతోనే కాబట్టి రచయిత ఈ పాత్రవిషయంలో ఒక ఆద్యంతసమత పాటించాడనవచ్చు. గిరీశంవల్ల రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించాడు? ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి మనలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా, ఆ పనులవల్ల ఏ ప్రయోజనం,మార్పూ కనుపించదు.

గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక.మాయమాటల్తో పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్నితెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి,ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు. నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా  వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్నిఆశించి గిరజాడ సృష్టించి ఉండవచ్చు. “డామిట్‌ ! కధ అడ్డం తిరిగింది” అంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.

ఈ నాటకంలోని రెండవ ముఖ్య పాత్ర “మధురవాణి”. ఈ పాత్రలో అసాధారణత, పరిణామం,శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం. రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా” అని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది.

వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం,విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ, అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.ఆమె సంస్కారవతి.దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్నశిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి  తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితో “వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?” అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. “ఆహా! ఏమి యోగ్యమైన మనిషి” అని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు. అయితే నాలుగో అంకంలో “నీకు సిగ్గులేదే లంజా!” లాంటి మాటలు ఈ పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.

ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్రోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, ఈ పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. ఈ పాత్ర ఒక్కక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.

డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. “కాపు మనిషినై పుట్టి  మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమో” అనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు.

మిగిలిన పాత్రల గురించి
రామప్పంతులు పాత్ర చాలా ఆసక్తికరమైనది. ఇతను నిశిత దృష్టికలవాడు. “నమ్మిం చోట చేస్తే మోసం, నమ్మం చోట చేస్తే లౌక్యవూఁను” అనే సూక్ష్మబుద్ధి ఉంది. అయినా మధురవాణి వ్యూహంలో చిక్కుకుపోయాడు. ఇతను ఎవళ్ళెక్కువ డబ్బిస్తే వాళ్ళ పక్షం. ఒక మాటమీద నిలబడడు.

అగ్నిహోత్రావధాన్లు వేద వేత్త, అమాయక బ్రాహ్మణుడు,ధనాశాపరుడు, సనాతనాచారాలున్నవాడు.

సౌజన్యారావు న్యాయవాది . వివిధ స్వభావాలున్నమనుషుల్ని చూసినవాడు. వ్యవహారాన్ని నేర్పుగా చక్కబెట్టే ప్రవృత్తి గలవాడు. మొదట్లో గిరీశం పెద్ద మనిషని నమ్మినా, విషయం తెలిసాక, అతన్ని “గెట్‌ అవుట్‌ “అంటాడు. మధురవాణి వ్రతం సౌజన్యా రావుని పెద్దవాడిగా నిలిపిందా? లేక సౌజన్యా రావు ప్రవర్తన మధురవాణిని మంచిదానిగా చేసిందా అనిపిస్తుంది.

ఇకపోతే తనకు తానుగా చెడు చెయ్యని లుబ్ధావధాని, మంచి స్వభావంగల కరటక శాస్త్రి, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో మీనాక్షి.. ఇలా ఎన్నో.మొత్తం మీద కొన్ని లోపాలున్నా పాత్ర పోషణా నైపుణ్యం కన్యాశుల్కం సజీవంగా నిలబడడానికి దోహదం చేసింది.

హాస్యం – ఎత్తిపొడుపు
కన్యాశుల్కం అనగానే హాస్యం గుర్తొస్తుంది. నాటకంలో పాత్రలే ఒకరికిఒకరు పేర్లు పెట్టుకొని హాస్యమాడుకున్నారు.గిరీశం అగ్నిహొత్రావధానిని “అగ్గిరావుఁడ” న్నాడు. కరటక శాస్త్రి “మూర్ఖపగాడ్దె కొడుక” న్నాడు. గిరీశాన్ని రామప్పంతులు “గిర్రడు” “బొట్లేరు” అని కొట్టిపారేశాడు. అగ్నిహోత్రావధాన్లు కూడా గిరీశాన్ని “హనుమాన్లు”గా ఆట పట్టించాడు. మధురవాణి దృష్టిలో రామప్పంతులు,లుబ్ధావధాని లొట్టిపిట్టలు. లుబ్ధావధాని పెళ్ళి ముసలి మనువు కాబట్టి హాస్యాన్ని కల్గిస్తుంది.  మధురవాణి ఇంట్లో రామప్పంతుల్నీ, గిరీశాన్ని పూటకూళ్ళమ్మ చీపురుతో కొట్టడం,గిరీశం లుబ్ధావధానికి వ్రాసిన లేఖ,గిరీశంవెంకటేశాల సంభాషణలూ మొదలైనవి హాస్యాన్ని పుట్టించాయి. రామప్పంతులు “నాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాల పరిగెత్తరా?” అన్నప్పుడు, మధురవాణి లుబ్ధావధానిని “ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా?, చూడండి మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయో” అన్నప్పుడూ నవ్వుకుంటాం.

సంఘంలోని కొన్ని లోపాల్ని ఎత్తిచూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడాడు. ఉదాహరణకి, గిరీశం “లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనే గాని పల్లెటూళ్ళలో ఎంతమాత్రం పనికిరావు”  అంటాడు. అలాగే ” నీ మాస్టరుకు నన్ను చూస్తే గిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్‌ చేసాడు గానీ..”  అనడం గూడా. “పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌”, “మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!” అన్నప్పుడు సరదాగా నవ్వుకుంటాం. అలాగే, “సత్యం చ మే, ధర్మం చ మే” వంటి వేద మంత్రాలకు “చేగోడిం చ మే” లాంటి పేరడీలు హాస్యస్ఫోరకాలు.

సంభాషణలు
సంభాషణలు భాష ఈ నాటకానికి జవజీవాలు. తెలుగు పలుకుబడులతో, పాత్రోచిత భాషతో, వ్యంగ్యంతో, హాస్యంతో సంభాషణల్ని నడిపించిన గురజాడ ప్రతిభ అసామాన్యం. “నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజెస్‌ ఫర్ది డీజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడు గంటలు వక్క బిగిన లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగై పోయినారు” వంటి మాటలు గిరీశం పాత్రపోషణకు బలాన్నిచ్చాయి. గిరీశం సంభాషణలు తెలుగు వాళ్ళ నోళ్ళల్లో సామెతలుగా నిలబడిపోయాయి. ” మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌, “డామిట్‌ కధ అడ్డం తిరిగింది” లాంటివి సాక్ష్యాలు.

పూటకూళ్ళమ్మని గురించి “మీరుండగా వెధవెలా అవుతుంది” అనడం, కన్య వేషంలోని కరటక శాస్త్రి శిష్యుణ్ణి గురించి “ఈ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతోంది” అనడం లాంటి వాటి ద్వారా మధురవాణి సంభాషణా నైపుణ్యాన్ని చూపించాడు గురజాడ. “వీళ్ళమ్మా శిఖా తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే! తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి” అన్న వాక్యం నేటికీ ప్రజల్లో వినబడడమే గురజాడ సంభాషణల్ని నడిపిన చాతుర్యానికి నిదర్శనం.

భాష
కన్యాశుల్కం వాడుకభాషలో రాయబడ్డ మొదటి సాంఘిక నాటకం.ఒక్క వాడుక భాషేకాక, మాండలికాలు, పాత్రోచిత ప్రయోగాలూ కూడా ఉన్నాయి. కళింగాంధ్ర మాండలికాలకు ఉదాహరణలు “చెప్పాను కానా?”, “నా ఆబోరుండదండీ”, “గుంటవెధవ”, “కనిష్టీబు”,”నాను ఉంది”,  “అనాడీ చేస్తున్నారు”, “వగుస్తున్నారు”, “కొసాకి విను” మొదలైనవి.

పాత్రోచితంగా అగ్నిహోత్రావధాని “మానా! మానులా వున్చానంచావూ? గూబ్బగల గొడతాను.” వెంకమ్మ “మీకు మాత్రం అబ్బిమీద ప్రేఁవ లేదా యేవిషి?” గిరీశం “నేనే దాని హజ్బన్డై ఉంటే నిలబడ్డపాట్ననీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేసి ఉందును.”

మాట్లాడే భాషకి చాలా దగ్గరగా ఉన్న పదాల్ని ప్రయోగించి సహజత్వానికి అద్దం పట్టాడు గురజాడ. ఉదాహరణకి,సాన్దీ, యవరో, జంఝప్పోస, సమ్మంధం, నాలుగ్గింజలు మొదలైనవి ఇలాంటివే. “కుంచం నిలువుగా కొలవడానికి వీలులేనప్పుడు,తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి”,  “ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు చేన్జి చేస్తూంటేగాని పొలిటీషియన్‌ కానేరడు” వంటి కొత్త సూక్తులు కనిపిస్తాయి.

మానవత్వాన్ని చాటి చెప్పి, మానవుడిని క్రియాపరునిగా ప్రేరేపించగల శక్తి గలది ఉత్తమ సాహిత్యమైతే, “కన్యాశుల్కం” ఉత్తమ సాహిత్యరూపం. ఉదాత్తమైన నాటకం. తెలుగు వాడు గర్వించదగ్గ నాటకం.
--------------------------------------------------------
రచన: ద్వానా శాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో

Monday, November 18, 2019

ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం


ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం



సాహితీమిత్రులారా!


వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావు కలిసి, సుప్రసిద్ధ ఒరియా కవి సౌభాగ్య కుమార మిశ్ర కవిత్వం నుండి ఎంపిక చేసిన కవితలతో వెలువరించిన అవ్యయ గురించి, లోగడ మనం మాట్లాడుకున్నాం. సౌభాగ్య కవిత్వంలో కనపడే వేగం గురించి, ప్రతీకల విషయంలో అతని కచ్చితత్వం, సూక్ష్మదృష్టి గురించి, అతని కవిత్వం కలిగించే ప్రాంతీయ స్పృహ గురించి అప్పుడు కొంత చర్చించుకున్నాం. ఇప్పుడు, సౌభాగ్య కుమార మిశ్రకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (1986) తెచ్చిపెట్టిన ద్వాసుపర్ణా అనువాదం, మళ్ళీ ఈ ఇద్దరి శ్రమ ఫలితంగానే, యాభైరెండు కవితలతో నిండుగా మనముందుకొచ్చింది.


‘కాదేదీ కవిత కనర్హం’ అన్న శ్రీశ్రీ మాటలు తెలుగు కవిత్వానికి ఎంత చేటు చేశాయో మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఆ ఒక్క మాటనే తక్క, సరిగ్గా తరువాతి వాక్యంలోనే అతను కావాలన్న శిల్పం గురించి కాని, వస్తువు గురించి కాని, వాడే ప్రతీకలకూ వస్తువులకూ ఉన్న సంబంధం గురించి కాని, కవిత ఆసాంతం నిలబడాల్సిన ధోరణి గురించి కానీ పట్టింపుతో ఉన్న కవుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీటిని నిబంధనలుగా భావించి అతిక్రమించాలి అనుకునేవారే తప్ప, మంచి కవిత్వ లక్షణాలుగా గుర్తించి గౌరవించాలనుకునే వాళ్ళు కనపడటం లేదు. రోజువారీ వార్తలను కవిత్వానికి వస్తువులుగా వాడుకుంటూ, అక్కడ కనపడే అల్లర్లలో నలిగిపోయిన నినాదాలన్నీ సాపు చేసుకుని ముద్రించుకోవడమే మన ప్రస్తుత కవిత్వోద్యమాల్లో మొదటి అడుగవుతోంది.

ఇట్లాంటి వాతావరణంలోకి, కొత్త కాగితాల తాజా వాసనను మోసుకొచ్చిన అనువాద కవిత్వం ద్వాసుపర్ణా. కవి బలం వార్తలు కాక, ఊహాశక్తీ, కల్పనా చాతుర్యం అయితే, అతని కవిత్వానికి ఎలాంటి ఆకర్షణ ఉంటుందో చూపిన పుస్తకమిది. సౌభాగ్య సామాజిక అంశాల మీద, సమస్యల మీద తక్కువగానే రాసిన మాట నిజం. ఆ రాసిన కొన్నింటిలోనూ, ఈ వస్తువు మీద రాయడాన్ని ఒక రివాజులా మార్చుకోవాలనుకోని అతని దృక్పథం స్పష్టమవుతూనే ఉంటుంది. సమస్యలను ఎత్తి చూపే క్రమంలో, తనలోని కవిని అతడెక్కడా చిన్నబుచ్చుకోలేదు. నిజానికి, అతను ఇంటి రాజకీయాల మీద రాసినా, ఇరాన్ మీద రాసినా, అతని చూపు పారిందల్లా మనిషి హృదయ వైశాల్యం మీదనే. ఆ గుణమే అతని కవిత్వాన్ని నమ్మదగినదిగా చేసింది. కవిగా అతని వృత్తం పరిమితమైన కొద్దీ, కవిత్వం మరింతగా సాంద్రతరమవుతూ వచ్చింది. అది నాకు నచ్చింది. అవ్యయ చదివినప్పుడు, అందులోని కవితలు మూడు సంపుటుల నుండి ఎంచి ప్రచురించినవి కనుక, సౌభాగ్య అనుభూతివాద కవిగా కనపడుతోన్నా ఆ మాటను స్థిరపరచలేనని చెప్పాను. అయితే, ద్వాసుపర్ణా చదివాక, అప్పటి నా నమ్మకం బలపడింది.

అసలు దేన్నయినా అతను కవిత్వంగా మలుచుకునే తీరు, చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ క్రింది కవితను చూడండి:

ఇచ్చి పుచ్చుకునే భాగోతం
ఎంతో విస్తృతమైనది
ఏం పోయిందో, ఏమొచ్చిందో, ఏదీ గుర్తుండదు
నేను లెక్కబెట్టినప్పుడు పన్నెండు
మరొకడు లెక్కపెట్టినప్పుడు పదమూడు.
మనం దాగుడుమూతలాడటం మరచిపోయి
వంతెన మీద కూర్చుని కబుర్లాడుకుంటున్నప్పుడు
ఆ పోయిన ఒకటీ కాస్త పరిహాసంగా
సగం పండి, సగమై తిరిగి వస్తుంది (ఇచ్చిపుచ్చుకోవటం, పు: 49)

ఏదైనా వస్తువు చేతులు మారినప్పుడు, తీసుకున్నవాడి దృష్టిలోనూ, ఇచ్చిన వాడి దృష్టిలోనూ దాని విలువకూ తేడా ఉంటుంది. ఆ భేదాన్ని పూరించుకోవడానికి స్నేహం ఒక దారి. అరమరికలు లేని స్నేహం. దాపరికాలు లేని స్నేహం. అప్పుడూ వాళ్ళు కోల్పోయేది కొంత ఉండవచ్చు గాక. కానీ పొందిన ‘ఫలం’ మరింత పరిపూర్ణమైనది. మరింతగా పక్వమైనది. ఇది తెలియనివాడికి వెలితి మాత్రమే మదిలో నిలిచిపోతుంది. అతనికి ఏం వచ్చిందో తెలియనట్లే ఏం పోయిందో కూడా తెలియదు.

ఈ కవితలో స్నేహం గురించి కాని, మానవ సంబంధాల్లోని బలిమి, లేముల గురించి కాని, కవి బిగ్గరగా ఏమీ చెప్పడు. కానీ లోగొంతుకలో విన్న రహస్యాలే కదా మధురంగా తోచేవి.

ఈ నవ్యతనే చూపెట్టే మరో ఉదాహరణ: పెద్ద పెద్ద షాపింగ్‌మాల్‌ల ముందు, కూడళ్ళ దగ్గర, కరపత్రాలలో తమ వినతిని ముద్రించుకుని చదవమని వెంబడించేవాళ్ళను చూస్తూంటాం. మాటలు రాక, మాట్లాడలేక, మూగగా మన సాయం కోరుతూ నిలబడే వాళ్ళ ముఖాలు, వాళ్ళ వేదన, చాలాసార్లు మన గమనింపులోకి రావు. కొందరంటుంటారు, ‘అప్పటిదాకా కులాసాగా తోటివాళ్ళతో కూర్చుని కబుర్లు చెబుతూ, మమ్మల్ని చూడగానే మూగ నటన మొదలెట్టడం కళ్ళారా చూశాం’ అని. పక్క పక్క నిముషాల్లో వాళ్ళు పట్టుబడ్డట్టే, చాలామంది కవులూ అబద్ధపు జాలిని, కపట ప్రేమనీ కవిత్వం చేస్తూ, చేయలేకా, పట్టుబడిపోతుంటారు. సౌభాగ్య ఏం రాశాడో చూడండి:

ఏమిటి? భాష ఏమైనా చెయ్యగలదని
నువ్వు కచ్చితంగా నిశ్చయించుకున్నావా
మౌనంగా ఉండటంలో మెలకువలు నేర్చుకున్నాం
పాము చస్తుంది, కర్ర విరగదు.
నువ్వు మణికట్టు విరగ్గొట్టుకున్నావు;
మరొకడు ఇల్లు వరదలో కొట్టుకుపోనిచ్చాడు.
నీ కాగితమ్ముక్క జాగ్రత్తగా పదిలపరుచుకో

చాలా చెట్లు విరిగిపడవలసి ఉంది,
చాలా హృదయాలూనూ,
చాలా మంది కవులు పుట్టవలసి ఉంది,
నువ్వు మా దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోయాక. (నువ్వు చెప్తున్నావు, పు: 19)

నిడివి పరంగా చూస్తే, సౌభాగ్యకూ క్లుప్తతకూ చుక్కెదురనే చెప్పాలి. అతనికి పదాల లెక్క లేదు, అనుభవం నిండుగా అక్షరబద్ధం కావడమే అతని లక్ష్యం. కానీ, ఈ కవితలో మాదిరి (కవుల మీది వ్యంగ్యం, ఆ మూగవాని పట్ల అప్రయత్నంగా కలిగే సానుభూతి) భిన్న రసోద్వేగాలను ఒకేసారి స్ఫురింపజేయడంలో అతను చూపే నేర్పు నేర్చుకోదగ్గది. కవుల ప్రస్తావన ఇదే ధోరణిలో మరో రెండు కవితల్లో కనపడటం వల్ల, సౌభాగ్యకు కవులూ మనుషులేనన్న ఎరుకతో పాటు వాళ్ళ బలహీనతల పట్లా, పరిమితుల పట్లా స్పష్టమైన అభిప్రాయాలూ ఉన్నాయనుకోవాల్సి వస్తుంది.

నువ్వు పూలకు వాడిపోకండనీ, ఉత్తరానికి దారి తప్పవద్దనీ
చెప్పటం చాలాసార్లు విన్నాను
తేలిక శబ్దాలు వేలాడుతూండటానికి
ఒక్క ముహూర్త కాలాన్ని తీగలాగా సాగదీయడం చాలాసార్లు చూశాను (ఏడు కవితలు, పు: 219)

సౌభాగ్య ఎత్తుగడలలో కనపడే సొగసిది. ఎవరామె? పూలను వాడిపోవద్దనే భావుకురాలు, సున్నిత మనస్కురాలు? ఉత్తరాలకు దారి తప్పవద్దని చెప్పే ప్రేమికురాలు? ఒక్క ముహూర్త కాలాన్నలా తీగలా సాగదీస్తోందే, ఆమె కోరుకున్న తేలిక శబ్దాలు ఎలాంటివై ఉంటాయి? గాలి వీచే శబ్దమా? గాలికి ఆకులు రాలే శబ్దమా? పక్షి కూతలా? ఊఁ, ఉహూఁ లాంటి పొడి అక్షరాలా? కవిత నడిచే కొద్దీ, సహజంగా తలెత్తే ఈ ప్రశ్నలతో పాటుగా, ఆ భావనల తోడుగా మన మనసుల్లో మెల్లిగా పరుచుకునే నాజూకు సౌందర్యమంతా, కవి చేసే మాయాజాలం. అదే ఈ కవితలోని సౌందర్యం.

దాదాపు ఇలాంటి పరిచయంతోనే మొదలయ్యే మరో కవిత, సీతకోకచిలుక ప్రతి. నువ్వు పూవుల మధ్య పూవువి, తారల మధ్య తారవి అని సీతాకోకను కీర్తించడం సరే, అది మన ఊహకందుతుంది. కాని,

ఎప్పుడు చూసినా అతి వేగంగా
పొద నుండి పొదకూ, గోడపై నుండి పెంకు మీదకీ
వరండా నుండి గూటి అంచుకూ ఎగరడం, నరనరానికీ
అసహజమైన బరువుతో భుజం నెప్పెట్టి,
దించుకోవడానికి చోటు కోసం చూస్తున్నావు
అన్నిచోట్లా ఎవరో చెప్తున్నారు ఇక్కడ కాదు, ఇక్కడ కాదని (పు: 193)

అనడం మాత్రం నిస్సందేహంగా గొప్ప కవి ముద్ర. ప్రతి చోటా ఎవరో అడ్డు నిలబడి నెడుతుండబట్టి కానీ సీతాకోకచిలుకకు భుజం నొప్పి లేకనా అలా లోకమంతా ఎగరడం అనడంలోనే కవి సున్నితత్వం, ఊహాశక్తి రెక్కలు విప్పుకు కనపడుతున్నాయి. ఇదే కాదు, నది, వసంతం, చలిగాలి, చీకటి ఇలాంటి ఎన్నో మామూలు భావనలను, అసాధారణమైన చూపుతో గొప్ప కవిత్వంగా మార్చాడీ కవి. అనువాదకుల ఉత్తమ పదసంపద వల్ల, సరైన పదాన్ని వాడగల ప్రజ్ఞ, జాగ్రత్త వల్ల, అద్భుతంగా పండిన భావాల నుండి కొన్ని ఉదాహరణలు:

– జ్ఞాతుల చేతిలో పరాజయపు అనుభవంలా వేధిస్తున్నది చల్లటి గాలి

– కిన్నెర స్త్రీ ముఖంలాంటి ముఖమొకటి చీకటిలో చివాలున మంటలా ఎగసి…

– వేపపూల వాసన నన్ను తరుముతోంది, పాములా.

– చీకటి ఆకాశం పైనుండి వేలాడుతోంది.

– ఒకప్పటి నీ అవయవాల వేదన, ఆకాశంలో మెరుస్తూంటుంది, ఓర్పుగా

సాహిత్య వాతావరణంలో స్తబ్ధత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగేపని కాదు. అయితే, వచ్చే ప్రతీ రచన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణనిస్తుంది. అందుకే, సాహిత్య వాతావరణాల్లోని స్తబ్ధతను చెదరగొట్టేందుకు అనువాదాలు కావాలి. ఆ పని ద్వాసుపర్ణా తలకెత్తుకుంది.


అయితే, ఈ అనువాదం ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు అన్నవి రెండు మౌలికమైన ప్రశ్నలు. రచన అంటే, అందులోనూ కవిత్వమంటే, ఆలోచనల పొందిక, పదాల అమరిక. సాహిత్యాన్ని ఒక భాష నుండి మరొక భాషలోకి తీసుకురావడమంటే, ఆ ఆలోచనలను, పదాలను కూడా తిరిగి మన భాషకు, మన వాక్య నిర్మాణ పద్ధతులకు, వ్యాకరణ సూత్రాలకు అనుగుణంగా పొందిగ్గా అమర్చుకోవడం. పుస్తకంలో ఈ పొందికతో ఉన్న కవితలు ఎంత ఆకట్టుకుంటాయో, ఆ పొందిక లేక అటూ ఇటూ అయిన కవితలన్నీ అంతే ఇబ్బంది పెడతాయి. మూలంలోని పదాలకు కట్టుబడిపోయి తెలుగులో ఆ భావం సహజంగా ఎలా పలుకుతుందో గమనించని సందర్భాలలో, కొన్నిసార్లు ఒకే కవితలో చక్కటి తెలుగు చరణాలతో పాటు అసహజమైన తెలుగు వాక్యమూ కనిపించి, ఆ కవితలను ఆస్వాదించడంలో కొంత ఆటంకం కలిగిస్తాయి. కొన్ని కవితల్లో పదాలు, వాక్యాలు ఇబ్బంది పెట్టినా కొద్దిపాటి ప్రయత్నంతోనే భావం అందుతుంది. కొన్నింటికి ఆ వెసులుబాటూ లేదు. ఇది అనుసృజన అని అన్నారు కనుక, ఈ కవితలను తెలుగులో మెరుగుపరచి ఉండుంటే పాఠకులకు మరికొంత సులువయ్యేది, కవిత్వం ఎక్కువమందికి చేరడానికి వీలయ్యేది. ఒరియా, తెలుగూ రెండూ భారతీయ భాషలవడం, ఇది పక్క రాష్ట్రపు కవిత్వమవడం, సంస్కృత సాహిత్యం ఆ రాష్ట్రపు, ఆ కాలపు కవుల మీద చూపిన ప్రభావం తెలియడం, మొదలైన ఎన్నో అంశాలు ఈ కవిత్వాన్ని ఓ వంక దగ్గర చేస్తోన్నా, ఇది కేవలం అర్థానువాదమేనన్న స్పృహ పాఠకులను అంటిపెట్టుకునే ఉంటుంది. ఉదాహరణకు, ఈ పాదాలు చూడండి:

గాయత్రీ జపం చేసేవేళ
నేను తూలిపడ్డాను బ్రహ్మ ముహూర్తంలో;
ఇవాళ ఉదయమే తాళలేని వేడికి
కరిగి ప్రవహించి పోతున్నది ఆకాశం,
కలం ఒకటి విరిచేశా
నేను అభిమానంతో దుఃఖంగా.

గురి చేశాను పసుప్పచ్చని గుర్రానికి,
నా రక్తం నుంచి, ఆ దుఃఖం నుంచి వేరయింది,
ఆధారం లేని ఆ పశువు
ఒక వైపు కొట్టుకుపోతోంది,
మరొకవైపు తెలిసీ తెలియని నా భవిష్యత్తులాగా
ఒకే సమయంలో కోమలంగా, కఠోరంగా. (ఉత్తరం, పు: 111)

ఈ అనువాదం వల్ల మూలంలో ఉన్న భావం తెలుగులో పాఠకుడికి అందదు. అందువల్ల, ఈ అనువాదాలు తెలుగు పాఠకుల కోసం, ప్రత్యేకించి కవిత్వాన్ని చదివే పాఠకుల కోసం చేశారనుకుంటే, ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం సౌభాగ్య కవిత్వాన్ని తెలుగులోకి తీసుకురావడం కాకుండా, అతని కవిత్వాన్ని తెలుగులో, కవిత్వంగా అందజేయడం అయి ఉండాల్సింది.

అనువాదాల గురించే మాట్లాడుతూ, వెల్చేరు నారాయణరావు ఒక వ్యాసంలో ఇలా అంటారు: ‘ఒక విలుకాడు తన ఇష్టం వచ్చిన చోట బాణం వేయడం గొప్ప కాదు. అతను బాణం వేసిన చోట సూటిగా తగిలేట్టు మరో విలుకాడు బాణం వేయడం–అదీ గొప్ప సంగతి’. సూక్ష్మమైన దృష్టి లేకపోతే, అన్నిసార్లూ బాణం వేసిన చోటే సూటిగా తగిలేలా వెయ్యడం కాని పని. అయితే ప్రయత్నం ఏ దిశగా కొనసాగాలో, ద్వాసుపర్ణా తెలియజెప్తుంది.
------------------------------------------------------
రచన: మానస చామర్తి, 
ఈమాట సౌజన్యంతో

Saturday, November 16, 2019

స్వీడన్‌లో మాతృ భాష వాడకం


స్వీడన్‌లో మాతృ భాష వాడకం




సాహితీమిత్రులారా!


నేను ఈమధ్య స్వీడన్‌ వెళ్ళి అక్కడ కొద్ది వారాలపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు దొర్లించకుండా, అన్ని చోట్లా నిరభ్యంతరంగా మాట్లాడేసుకుంటూ ఉంటే చూడ ముచ్చటేసింది. వీళ్ళల్లా మన దేశంలో, మొహమాటం లేకుండా మనం ఎందుకు మాట్లాడుకోలేక పోతున్నామా అని అక్కడ ఉన్న ఐదు వారాలూ నా మనస్సులో ఒకటే తపన.

స్వీడన్‌ దరిదాపుగా కేలిఫోర్నియా అంత ఉంటుంది వైశాల్యంలో. కానీ, జనాభా పరంగా స్వీడన్‌ చాల చిన్న దేశం. స్టాక్‌హోం కి ఎగువన జనావాసాలు బహు కొద్ది. అంటే దేశం సగానికి పైగా ఖాళీ. జనావాసాలు ఉన్న స్థలాల్లో జనాభా అంతా కూడగట్టి జాగ్రత్తగా లెక్క పెడితే ఎనిమిది మిలియన్లు ఉంటారు మహా ఉంటే. కేలిఫోర్నియా జనాభా 33 మిలియన్లు.

మన ఆంధ్ర ప్రదేష్‌ కూడ వైశాల్యంలో ఉరమరగా స్వీడన్‌ అంత ఉంటుంది. మన తెలుగు దేశంలో తెలుగు మాతృభాషగా చెలామణీ అయేవారి సంఖ్య దరిదాపు ఎనభై మిలియన్లు ఎనిమిది కాదు, ఎనభై! అంటే స్వీడిష్‌ భాష మాట్లాడే వారి కంటె తెలుగు వారు  పదింతలు ఉన్నారు. అయినా మాతృభాష వాడకంలో మన వైఖరికీ వారి వైఖరికీ బోలెడంత తేడా ఉంది.

నిజానికి స్వీడన్‌లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళ వాడుక భాష స్వీడిష్‌ భాషే. రైలు స్టేషన్‌లో ఉన్న ప్రకటనలు బల్లల మీద రాసేవి, నోటితో చెప్పేవి అన్నీ స్వీడిష్‌ భాష లోనే. రైళ్ళ రాకపోకల వేళలు చూపే కరపత్రాలన్నీ స్వీడిష్‌ భాష లోనే. రైలు టికెట్టు మీద రాత అంతా స్వీడిష్‌ భాష లోనే. తుపాకేసి వెతికినా స్వీడిష్‌ పక్కన ఇంగ్లీషు కనిపించదు ఒక్క స్టాక్‌హోమ్‌ వంటి నగరాలలో తప్ప. బజారులో దుకాణాల మీద పేర్లు, బేంకుల మీద పేర్లు, మొదలైనవన్నీ స్వీడిష్‌ భాష లోనే. బజారులో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఆ పొట్లం మీద ఆ వస్తువు పేరు, అందులో ఉండే ఘటక ద్రవ్యాల (“ఇన్‌గ్రీడియంట్స్‌”) పేర్లు, ఆ వస్తువుని వాడే విధానం అంతా స్వీడిష్‌ భాష లోనే. నేను ఉన్న విద్యాలయపు అతిథిగృహంలో ఉన్న టెలివిజన్‌ లో వచ్చే వార్తా కార్యక్రమాలన్నీ స్వీడిష్‌ భాష లోనే. “సి. ఎన్‌. ఎన్‌.” లో ఇంగ్లీషు వార్తలు వినడానికి ఒక భారతీయుడి ఇంటికి వెళ్ళి వినవలసి వచ్చింది.

వీళ్ళు ఇలా వాళ్ళ భాషలో మాట్లాడుకుందికి వెసులుబాటుగా వీరికి పదసంపద ఉందా లేక ఇంగ్లీషు మాటలనే స్వీడిష్‌ లిపి లో రాసేసుకుని వాడేసుకుంటున్నారా అని ఒక అనుమానం వచ్చింది. ప్లాట్‌ఫారం, గేటు, టికెట్టు, ఓల్టేజి, కరెంటు, కంప్యూటరు వంటి మాటలని వారు ఏమంటున్నారో అని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసేను. వీటన్నిటికి వారికి స్వీడిష్‌ భాషలో వేరే మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎలా పుట్టుకొచ్చాయా  అని మరికొంచెం పరిశోధన చేసేను. ప్లాట్‌ఫారం అన్న మాటకి  సమానార్ధకాలుగా మనకి వేదిక, చపటా, తీనె, ఇలారం అనే మాటలు ఉన్నట్టే స్వీడిష్‌ భాషలో కూడ వారికి సమానార్ధకాలు ఉన్నాయి. వారు నిరభ్యంతరంగా, నిర్భయంగా, మొహమాటం లేకుండా ఆ మాటలలో ఒకదానిని ప్లాట్‌ఫారం కి బదులు వాడుతున్నారు తప్ప ఇంగ్లీషు మాటని వాడడం నాకు కనిపించ లేదు. ఇదే ఆచారాన్ని మన తెలుగుదేశం లో ప్రవేశపెట్టేమనుకొండి. అప్పుడు, మనవాళ్ళు, పుర్రెకో బుద్ధి కనుక, ఒకొక్కరు ఒకొక్క మాట వాడతారు తప్ప ఏకీభావంతో ఒక ఒప్పందానికి రారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి స్వీడిష్‌ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. రైలు స్టేషన్‌ లో ఉండే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో, ఉపన్యాసం ఇచ్చే  ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో మొదలైన విషయాలు ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయిట. అటుపైన ప్రభుత్వపు అధీనం నుండి విడుదలయే పత్రాలన్నిటిలోనూ ఆ మాటని ఆ అర్ధంతో వాడతారుట.

ఇక ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్న మాటల సంగతి చూద్దాం. స్వీడిష్‌ వాళ్ళు మనలా ఇంగ్లీషు మాటలని యథాతథంగా వాడడం తక్కువే. ఒక వేళ వాడినా, వారి వాడకంలో తత్సమాలకంటె తద్భవాలే ఎక్కువ కనిపించాయి. ఒకానొకప్పుడు తెలుగు దేశంలో కూడ ఇటువంటి ఆచారం ఉండేది. ఉదాహరణకి బందరులో వలంద పాలెం (డచ్‌ కోలనీ), పరాసు పేట (ఫ్రెంచి కోలనీ) ఉండేవి. పోర్చుగీసు వాళ్ళని బుడతగీచులు అనే వారు. హాస్పటల్‌ ని ఆసుపత్రి అనే వారు. ఇలా తెలుగులో తద్భవాలని తయారు చేసుకుని వాడే ఆచారం క్రమంగా నశిస్తోంది. నశించడమే కాదు; ఎవ్వరైనా ఈ తద్భవాలని వాడితే వారిని శుద్ధ పల్లెటూరి బైతులులా పరిగణించి వారిని చులకన చేస్తాం.

తత్సమాలకీ, తద్భవాలకి మధ్యే మార్గంలో కొన్నాళ్ళు గడిపేం. కారు, బస్సు, కోర్టు, మొదలైన ప్రథమా విభక్తితో అంతం అయే మాటలకి నెమ్మదిగా స్వస్తి చెప్పి, ఇటీవల హలంతాలైన తత్సమాలని వాడడం రివాజు అయింది కార్‌, బస్‌, కోర్ట్‌. అంటే ఏమిటన్న మాట? క్రమేపీ ఇంగ్లీషు సంప్రదాయాన్ని ఎక్కువెక్కువగా అవలంబిస్తున్నాం. అజంతమైన మన తెలుగు భాషలో హలంతమైన ఇంగ్లీషు మాటలు ఇమడవు. అయినా సరే ఎలాగో ఒకలాగ కష్ట పడి ఇముడ్చుతున్నాం. ఒక్క మాటలే కాదు. ఇంగ్లీషు వ్యాకరణ సూత్రాలని కూడ తెలుగుతో మేళవించి సరికొత్త భాషని పుట్టిస్తున్నామేమో అని ఒక అనుమానం పుట్టుకొస్తోంది.

స్వీడన్‌లో నలుగురు మనుష్యులు కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకునే భాష స్వీడిష్‌. తెలిసిన ముఖాన్ని కాని, తెలియని ముఖాన్ని కాని చూసినప్పుడు వారు ప్రత్యుత్థానం చేసేది స్వీడిష్‌ భాష లో. ఇలా అన్నానని స్వీడన్‌ దేశీయులకి ఇంగ్లీషు రాదనుకునేరు.  స్వీడన్‌ లో ఇంగ్లీషు రాని ఆసామి నాకు, నేనున్న ఐదు వారాలలో, కనపడ లేదు. ఉండడం ఉన్నారుట వయసు మీరిన వారిలోనూ, పల్లెటూళ్ళల్లోను వెతికితే కనిపిస్తారుట. నాకు స్వీడిష్‌ భాష రాదు కనుక నేను బస్సు డ్రైవర్లతోను, చెకౌట్‌ కౌంటర్‌ దగ్గర అమ్మాయిలతోనూ, స్టేషన్లో టికెట్లు అమ్మే గుమస్తాల తోనూ, రైల్లో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తుల తోనూ ఇలా తారసపడ్డ వారందరితోనూ ఇంగ్లీషులోనే మాట్లాడే వాడిని. వాళ్ళు చక్కటి ఇంగ్లీషులో సమాధానం చెప్పేవారు. వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవడమనే ప్రశ్నే లేదు.  మన దేశంలో సగటు భారతీయుడు మాట్లాడే ఇంగ్లీషు కంటే  మంచి ఇంగ్లీషు ఫ్రెంచి వాళ్ళు, జెర్మనీ వాళ్ళు మాట్లాడినట్లు యాసతో కాకుండా చక్కటి ఇంగ్లీషు, అమెరికా ఫణితితో మాట్లాడ గలిగే స్థోమత వారిలో కనిపించింది.  (తెలుగు వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడితే తెలుగులా వినిపిస్తుందనిన్నీ, తెలుగు వాళ్ళు రాసిన ఇంగ్లీషు వాక్యాలు చదువుతూ ఉంటే తెలుగు చదువుతూన్నట్టు అనిపిస్తుందనిన్నీ ఒక తెలుగాయన నాతో అన్నాడు.) స్వీడిష్‌ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అచ్చం అమెరికా వాళ్ళ ఇంగ్లీషులా వినిపించింది. కనుక స్వీడన్‌ వాళ్ళు స్వీడిష్‌ మాట్లాడడం ఇంగ్లీషు రాక కాదు; వాళ్ళ మాతృభాష మాట్లాడాలనే కోరిక గట్టిగా ఉండబట్టే.

ఇక్కడ, ఈ సందర్భంలో స్వీడనునీ మెక్సికోనీ పోల్చి చూద్దాం. స్వీడనులో స్వీడిష్‌ భాష ఎంత ప్రాచుర్యంలో ఉందో, మెక్సికోలో స్పేనిష్‌ భాష కూడ అంత ప్రాచుర్యంలోనూ ఉంది. కాని, స్వీడన్‌లో అండరికీ ఇంగ్లీషు బాగా వచ్చు. మెక్సికోలో ఇంగ్లీషు చాల తక్కువ మందికి వచ్చు. ఈ వచ్చిన వాళ్ళలో కూడ ఇంగ్లీషు బాగ వచ్చినవాళ్ళు బహు కొద్ది మంది. వైశాల్యంలోనూ, జనాభా లోనూ, సహజ సంపద, వనరుల లభ్యత లోనూ మెక్సికో స్వీడన్‌ కంటె మెరుగు. కాని కంటికి కనిపించే ఐశ్వర్యం లోనూ , ప్రపంచంలోని అంతర్జాతీయ వేదికల మీద చెలామణీ అయే పరపతి లోనూ స్వీడన్‌దే పై చేయి అని నాకు అనిపించింది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించేను. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషుకి మెక్సికోలో ఆలంబన లేక పోవడమూ, ఇంగ్లీషు స్వీడన్‌లో నిలదొక్కుకుని ఉండడమూ కారణాలుగా నాకు స్ఫురించేయి. స్వీడన్‌ దేశీయులు వారి మాతృభాష పై ఎంత అభిమానం ఉన్నా ఇంగ్లీషుని విస్మరించ లేదు. అలాగని ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయి వారి మాతృభాషని చిన్న చూపు చూడనూ లేదు.

ఇక సాహిత్య సారస్వతాల సంగతి చూద్దాం.  తెలుగు సారస్వతంతో పోల్చి చూస్తే స్వీడిష్‌ భాష లోని సాహిత్యం, సారస్వతం పూజ్యం కాక పోవచ్చునేమో గాని, రాసి లోను, వాసి లోను తేడా హస్తిమశకాంతరం అని నా కొద్ది అనుభవం తోటీ చెప్పగలను. అయినా సరే ఈ రంగంలో స్వీడన్‌ దేశీయులకి రెండో, మూడో నోబెల్‌ బహుమానాలు వచ్చేయి. తెలుగు సాహిత్యం లో గాలివాన అనే కథానిక కి అంతర్జాతీయంగా చిన్న గుర్తింపు వచ్చింది అంతే. ప్రతిభ లేక కాదు; ఉన్న ప్రతిభని చాటుకునే ప్రజ్ఞ లేక.

ఇక విద్యా బోధన విషయం చూద్దాం. స్వీడన్‌ లోని విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పాఠ్య గ్రంథాలు ఇంగ్లీషులోనే ఉన్నా బోధన అంతా స్వీడిష్‌ భాష లోనే. అక్కడి ఆచార్య వర్గాలు ప్రచురించే పరిశోధన పత్రాలు చాల మట్టుకు ఇంగ్లీషులోనే ఉన్నా, వాళ్ళ సమావేశలలోనూ, సదస్సులలోనూ వారు మాట్లాడుకునేది వారి మాతృభాష లోనే. వారి కులపతి చేరువలో ఆచార్యులు మాట్లాడే భాష వారి మాతృభాష.

ఏదీ, వి.సి. గారి ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తప్పులు తడకలతో అయినా సరే మనం ఇంగ్లీషే మాట్లాడతాం కాని తెలుగు మాట్లాడం. ఒక సారి మా హైస్కూల్లో హెడ్‌ మాస్టారు గారి ఆఫీసు నుండి సెలవు నోటీసు వచ్చింది. అది కూడా మా పెద్ద తెలుగు మేష్టారు పాఠం చెపుతూ ఉండగా వచ్చింది. ఆ నోటీసు ఇంగ్లీషులో ఉంది. మా తెలుగు మేష్టారు ఉభయభాషా ప్రవీణ. కనుక ఆ నోటీసుని చదవకుండా, అందులో ఉన్న సారాంశాన్ని మాకు చెప్పేరు. కుర్ర కుంకలం కదా! మేం మేష్టారిని ఆ నోటీసు చదవమని యాగీ చేసేం. “నెల తక్కువ వెధవల్లారా” అని ఆయన మమ్మల్ని తిట్టి ఊరుకున్నారు. ఇదీ బొడ్డూడని రోజుల దగ్గరనుండీ మన భాష మీద, మన భాషని నేర్పే గురువుల మీద మనకి ఉన్న గౌరవం!

స్వీడన్‌ లో నా ఆఫీసుకి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి అవతలకి వెళితే అక్కడ ఎరిక్‌సన్‌ వారి ఆఫీసు ప్రాంగణం ఉంది. ఎరిక్‌సన్‌ చాల పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ. ఆ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. అంటే స్వీడన్‌ దేశీయులు కూడ ఆ కంపెనీ ప్రాంగణంలో ఉన్నంత సేపూ మరొక స్వీడన్‌ దేశీయుడితోనైనా సరే   ఇంగ్లీషే మాట్లాడాలి. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అడిగేను. “అయ్యా, రోడ్డు దాటి అవతలికి వెళితే యూనివర్శిటీలో అధికార భాష స్వీడిష్‌. ఇటు వస్తే మీ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. ఇలాగైతే ఎలా?” ఈ ప్రశ్నకి సమాధానం చాల సులభం. ఎరిక్‌సన్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసే సంస్థ. వారికి వ్యాపారం లాభదాయకంగా కొనసాగడం ముఖ్యం. ఆ లాభాలకి మూలాధారం అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు. యూనివర్శిటీని నడపడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. కనుక యూనివర్శిటీలో అధికార భాష ఉండాలని ఆదేశించింది, ప్రోత్సహించింది. యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్ధులకి ఉద్యోగాలు కావాలంటే, వారికి ఇంగ్లీషు బాగా వచ్చి తీరాలి. కనుక ప్రజలు, ప్రభుత్వం ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నారు. మనం మన దేశంలో ఇటు ఇంగ్లీషూ రాక, అటు తెలుగూ రాక రెండింటికి చెడ్డ రేవళ్ళమైతే, స్వీడన్‌ వారు ఇటు ఇంగ్లీషు లోనూ అటు స్వీడిష్‌ లోనూ సామర్య్ధం సంపాదించి నాలాంటి వాళ్ళని ఆశ్చర్య చకితులని చేసేరు.

ఈ కథనం యొక్క నీతి ఏమిటి? ఇంగ్లండులో ఇంగ్లీషు, స్వీడను లో స్వీడిష్‌, జెర్మనీలో జెర్మన్‌, ఫ్రాంసులో ఫ్రెంచి, మెక్సికోలో స్పేనిష్‌, జపానులో జపనీసు, చైనాలో చైనీసు, కొరియాలో కొరియనూ, తమిళనాడులో తమిళం వినిపిస్తున్నాయి కాని తెలుగు దేశంలో తెలుగు వినపడడం లేదు. చెన్నపట్నంలో దుకాణానికి వెళితే వారు నన్ను తమిళంలో పలకరించేరు. నాకు తమిళం రాదని తెలిసిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేరు. హైదరాబాదులో బట్టల దుకాణానికి వెళితే నన్ను ఇంగ్లీషులో పలకరించేరు. నేను తెలుగులో సమాధానం చెబితే నాకు తిరుగు సమాధానం ఇంగ్లీషులో చెప్పేడు, అక్కడ ఉన్న తెలుగు ఆసామీ. ఒక నాడు రైలులో రిజర్వేషను చేయించుకుందికి సికింద్రాబాదు స్టేషన్‌కి వెళితే ఒక దరఖాస్తు కాగితం నింపమని ఇచ్చేడు అక్కడి గుమస్తా. అంతా హిందీలో ఉంది. నాకు హిందీ రాదు. అందుకని తెలుగులో ఉన్న దరఖాస్తు కాగితం కావాలని అడిగేను. లోపలికి వెళ్ళి వెతికి ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తు కాగితం పట్టుకొచ్చి ఇచ్చేడు. తెలుగులో ఉన్నది కావాలని మళ్లా అడిగేను. తెలుగులో అచ్చేసిన దరఖాస్తులు లేవన్నాడు. పోనీలే అనుకుని ఆ ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తునే తెలుగులో నింపి ఇచ్చేను. జూ లోంచి పారిపోయొచ్చిన జంతువుని చూసినట్లు చూసి తెలుగులో నింపిన దరఖాస్తు తీసుకోనన్నాడు. పైపెచ్చు, “అయ్యా, మీరు ఫారిన్‌ నుంచి వచ్చినట్లున్నారు. మీకు ఇంగ్లీషు రాకనా. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ” అంటూ నీళ్ళు నమిలేడు. ఇది మన తెలుగు రాష్ట్రానికి రాజధానీ నగరంలో జరిగిన ఉదంతం.

ఎలాగైతేనేం టికెట్టు కొనుక్కుని విశాఖపట్నం వెళ్ళేను. అక్కడ నా మేనగోడలు కొడుకుని కలుసుకున్నాను. వాడు హైస్కూల్లోనో, మొదటి సంవత్సరం కాలేజీలోనో ఉన్నాడు. వాడి చదువు ఎలా సాగుతోందో చూద్దాం అని వాడి పాఠ్య పుస్తకాలు తిరగెయ్యడం మొదలు పెట్టేను. వాడి దగ్గర తుపాకేస్తే తెలుగు పుస్తకం లేదు. తెలుగు కి బదులు సంస్కృతం చదువుతున్నాట్ట. ” ఏదీ నీ సంస్కృతం పుస్తకం చూపించు” అన్నాను. వాడు ఇచ్చిన పుస్తకం చూద్దును కదా! లోపల దేవనాగరి లిపిలో కాని, తెలుగు లిపిలో కాని మచ్చుకి ఒక్క అక్షరం ముక్క కంచు కాగడా వేసి వెతికినా కనిపించ లేదు. అంతా ఇంగ్లీషు లిపే! ఈ కుర్ర కుంకలకి ఇంగ్లీషే సరిగ్గా రాదు. ఆ వచ్చీ రాని ఇంగ్లీషు మాధ్యమంగా సంస్కృతం వెలగబెడుతున్నాడుట. వాడికి పోతన పద్యాలతో పరిచయం లేదు. తిక్కన భారతం గురించి తెలియనే తెలియదుట. లక్ష్మణ కవి సుభాషితాల గురించి విననే లేదుట. పోనీ సంస్కృతం దేవ భాష, అదైనా వస్తే ఏ శాకుంతలమో చదివుంటాడనుకున్నాను. అప్పుడు చెప్పేడు అసలు రహస్యం. సంస్కృతంలో నూటికి తొంభై మార్కులు గ్యారంటీట. అందుకోసం సంస్కృతం చదువుతున్నాడుట.

వాడు పాపం తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. “చదవడం, రాయడం వచ్చా?” అని అడుగుదామనుకుంటూ నాలిక కరుచుకున్నాను. వాడివ్వబోయే సమాధానానికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చేనా? ఎందుకొచ్చిన రభస, బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు అని అనుకుంటూ తెలుగు మీద అంత వరకు నేను చేసిన పరిశోధనకి తిలోదకాలిచ్చేసి, తోక ముడిచి తిరుగు ముఖం పట్టేను.
-----------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో