Monday, May 1, 2023

గాంగేయ గాంగేయ గాంగేయులకు బ్రతి

 గాంగేయ గాంగేయ గాంగేయులకు బ్రతి





సాహితీమిత్రులారా!


సంస్కృతంలో కొక్కొకుడు రతిశాస్త్రం అనేపేరున కామశాస్త్రం రచించాడు

దాన్ని కూచిరాజు ఎర్రన కొక్కోకం పేరున అనువదించాడు అందులో 

కృతిపతి కుంటముక్కల మల్లనమంత్రి అన్న గంగయామాత్యునిపై 

గూర్చిన పద్యం ఇది గమనించండి-


మాధవ మాధవ మాధవులకు సాటి

                       సౌందర్య విక్రమ సంపదలను

గోపాల గోపాల గోపాలు రకు జోడు

                      భోగసాహస కళా భోగములను

గాంగేయ గాంగేయ గాంగేయులకు బ్రతి

                       వర్ణ ప్రతాప పావన నిరూఢి

కుంభజ కుంభజ కుంభజులకు నీడు 

                        రణ తపస్సామర్ధ్య రాజసముల

నితర జనముల సరిపోల్చ నెట్లు వచ్చు

భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవముల

కుటిలరిపుమంత్రి హృద్వేది కుంటముక్ల

గంగయామాత్యునకు దాన కర్ణునకును


ఇందులో మొదటిపాదంలో 

1. మాధవ (వసంత ఋతువు) సొందర్యలోనూ

2. మాధవ (విష్ణుమూర్తి) విక్రమంలోనూ

3. మాధవ (ఇంద్రుని) సంపదలోనూ


రెండవపాదంలో-

1. గోపాల(కృష్ణుడు) భోగసాహసం అంటే పడగలమీద సాహసం(బహుశా)

    కాళీయవర్ధనం గంగనమంత్రి పరంగా బోగము, సాహసము

2. గోపాల(గొల్లవారు) కళ(పశువుల పోషించడం 64 కళల్లో ఒకటి) గంగయమంత్రి పరంగా 

     ముఖంలో కళ

3. గోపాల (రాజు) భోగంలోనూ


మూడవ పాదంలో -

1. గాంగేయ (బంగారు) వర్ణం రంగులో

2. గాంగేయ(భీష్ముడు) ప్రతాపంలో

3. గాంగేయుడు((కుమారస్వామి) పావనత్వంలో - కుమారస్వామి పరంగా పవన భక్షణలో, గంగయమంత్రి పరంగా బ్రాహ్మణత్వంలో

నాలుగవపాదంలో -

1. కుంభజ(ద్రోణుడు)రణంలోనూ

2. కుంభజ (వసిష్ఠుడు) తపస్సులోనూ

3. కుంభజ (అగస్త్యుడు) సామర్ధ్యములోనూ (అగస్తుడు సముద్రాన్ని తాగేశాడు. 

                                         వింధ్యపర్వతాన్ని శాసించాడు)వీళ్ళెవరూ నీకు సాటిరారు

అని చివరగా ముగించాడు.


No comments: