Thursday, November 10, 2022

పంచపాషాణాలలోని ఒక పద్యం

 పంచపాషాణాలలోని ఒక పద్యం




సాహితీమిత్రులారా!



తెలుగులో పంచపాషాణాలు అని 5 పద్యాలున్నాయి.

వాటిలోని ఒక పద్యం ఇది గమనించండి-


అబ్జముఖీ మనోజ నరసాధిప నందన నీ యశం

బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ వితీర్ణిమం 

బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ పరాక్రమం 

బబ్జ కరాబ్జ  జాబ్జ నయనాబ్జ విలాసము చిత్రమిద్ధరన్ 

ఈ పద్యములో ఒక్కొక్క పాదములో ఒకే పదములున్నా కూడా 

వేర్వేరు అర్థములు వచ్చేట్టు రచించాడు కవి.

తా:--పద్మముఖులగు సుందరీ మణులకు మన్మథుడా,నరసరాజకుమారా!కృష్ణ రాయా!

1. నీ కీర్తి అబ్జ+కర+అబ్జ జాబ్జ నయనా=అబ్జ విలాసము=అమృతము,బ్రహ్మ ,సరస్వతి,శంఖము, వీటి యొక్క విలాసము వంటి కాంతి కలది.

2.నీ దాతృత్వము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ+వి+ల+అసము =పాలసముద్రమును, కర్ణుడిని, నిధులను పొందిన కుబేరుని, చంద్రుని విశేషముగా గ్రహించుటకు స్థాన మైనది.

3.నీ పరాక్రమము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ విలాసము --  శివుడు,కుమారస్వామి,కమలాక్షుడైన 

శ్రీపతి,అర్జునుడు,  వీరి యొక్క విలాసము వంటి కాంతి కలది గా ఈ ధరణి లో చిత్రంగా ప్రకాశిస్తున్నాయి.

తా:- నీ కీర్తి అమృతము, కమలమునందు పుట్టిన బ్రహ్మ, కమలముల వంటి కన్నులుగల సరస్వతి ,శంఖము, వీటి  అన్నింటి యొక్కవిలాసము వంటి కాంతి కలది. నీ దానగుణము పాలసముద్రమును, కర్ణుడినీ, నిధులుగల కుబేరుని, చంద్రుని, విశేషముగా గ్రహించుటకు స్థానమైనది.నీ పరాక్రమము శివుడు,కుమారస్వామి,శ్రీపతి,అర్జునుడు వీరి యొక్క విలాసము వంటి కాంతి కలదిగా ఈ ధరణిలో చిత్రముగా  ప్రకాశిస్తున్నాయి.

No comments: