Thursday, March 31, 2022

తాంబూలం పై పద్యాలు

 తాంబూలం పై పద్యాలు




సాహితీమిత్రులారా!



ఈ పద్యాలను గమనించండి

ఇవి తాంబూలానికి సంబంధించినవి.


శిలవృక్ష లతలఁబుట్టిన

చెలియలు మువ్వురును జేరి చెలువలరంగా

తలవాఁకిట రతిసేయఁగఁ

దలయుచుఁ దద్రరతికి రక్తధారలు కురిసెన్


రాతికి పుట్టిన సున్నం, వృక్షవగ నందుచుట్టిన వక్క, 

తీగయందు పుట్టిన తమలపాకు - తాంబూలం


వండిన దెండిన దొక్కటి

ఖండించిన చ్చిదొకటి కాలినదొకఁటై

తిండికి రుచియైయుండును

ఖండితముగఁ దీనిఁజెప్పు కవియుంగలఁడే


వండియెండినది పోకచెక్క, ఖండించిన పచ్చిది తమలపాకు, 

కాలినది సున్నం - తాంబూలం


Tuesday, March 29, 2022

పండగనాడు కూడ పాత మొగుడేనా

 పండగనాడు కూడ పాత మొగుడేనా




సాహితీమిత్రులారా!

పండగనాడు కూడ పాత మొగుడేనా

దీనికి గరికపాటి వారి వివరణ గమనించండి-



Sunday, March 27, 2022

శ్రీ శ్రీ మూడు హల్లుల పద్యం

 శ్రీ శ్రీ మూడు హల్లుల పద్యం




సాహితీమిత్రులారా!




శ్రీశ్రీ గారి సిప్రాలిలో సిరిసిరిమువ్వ -16లోనిది ఈ పద్యం.

మనసాని నిసిన సీమా
మనసా మసిమనిసి మనసు మాసిన సీనా
సినిమానస మాసనమా
సినిమానిసి సీమసాని (సిరిసిరిమువ్వా!)

దీనిలో సిరిసిరిమువ్వా అనేది మకుటం దాన్ని వదలితే
 మిగిలిన వాటిలో మ,న,స - అనే హల్లులు వాడి పద్యాన్ని
కూర్చడం జరిగింది.
దీనిలో 8 పదాలు ఉన్నాయి.
 1.మనసు,2. సాని, 3. నిసి, 4. సీమ,
5. మసి, 6. సీను, 7. సినిమా, 8. ఆసనము.

Wednesday, March 23, 2022

వీరెవరో చెప్పండి?

 వీరెవరో చెప్పండి?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు కత లోని వారెవరో చెప్పండి?


కడవ బుట్టిన కమనీయ చరితుడు

పుట్టి బుట్టినట్టి పుణ్యతముడు

పూరి నుదయమైన వీరాధివీరుడు

ఎవరు తెల్పుడీ సుధీంద్రులార

సమాధానం-

కడవ బుట్టిన కమనీయ చరితుడు - అగస్త్యుడు

పుట్టి బుట్టినట్టి పుణ్యతముడు -  వాల్మీకి

పూరి నుదయమైన వీరాధివీరుడు -  కుమారస్వామి


పతి యొకడుకాదు కాదామె పడుపు కత్తె

ఎవరి కడుపున బుట్టెనో ఎరుగలేము

ఆమె నామంబు బరగు మూడక్షరముల

సహన భావనరాజిల్లు జానయెవతె

సమాధానం - ద్రౌపది

Monday, March 21, 2022

ఒక హల్లు, రెండు హల్లుల పద్యాలు

 ఒక హల్లు, రెండు హల్లుల పద్యాలు




సాహితీమిత్రులారా!



గణపవరపు వేంకటకవి కృత

ప్రబంధరావేంకటేశ్వర విజయ విలాసము

లోని ఏకాక్షరి, ద్వ్యక్షరి పద్యాలు ఆస్వాదించండి-


ఒక హల్లుతో కూర్చిన పద్యం 

ఇది క-కారంతో కూర్చినది-


కైకోకీకాకెకుకై

కోకాకా కింక కూడి కూకకు కోకీ

కాకు కకు కేకికేకిక

కూకోకొక్కూక కింక కోకై కౌకా 

                                                         - 214వ పద్యం


రెండు హల్లులు న-మ-లతో కూర్చిన పద్యం

నిను నెమ్మనమున నమ్మిన

ననుమానము మాన మాననై నేమమునన్

మన నీ నామము నూనె

న్నను మానిన నిన్ను మానేమేనా

                                                                            - 222వ పద్యం

Saturday, March 19, 2022

ఏకసమాస పద్యం

 ఏకసమాస పద్యం




సాహితీమిత్రులారా!



పద్యంలోని అనేక చరణాల్లో ఒకే సమాసం కూర్చటం

ఏకసమాస చిత్రం అనబడుతుంది.

నృసింహపురాణంలో ఎర్రన కూర్చిన

ఈ పద్యం దీనికి

ఉదాహరణగా తీసుకోవచ్చు.


శ్రీ స్తనకుంకుమద్రవ నిషిక్త భుజాంతరభాగ విస్ఫుర

త్కౌస్తుభరత్ననూత్నరుచిర గర్వితనాభిసరోజసౌరభ

ప్రస్తుత మత్తభృంగ రవరాగరసోల్బణ భోగి భోగత

ల్పాస్తరణుం దలంచు సుకృతాత్ము లపాస్త సమస్త కల్మషుల్

                                                                                            (నృసింహపురాణము - 2- 37)

ఇందులో

శ్రీ స్తనకుంకుమద్రవ నిషిక్త భుజాంతరభాగ విస్ఫుర

త్కౌస్తుభరత్ననూత్నరుచిర గర్వితనాభిసరోజసౌరభ

ప్రస్తుత మత్తభృంగ రవరాగరసోల్బణ భోగి భోగత

ల్పాస్తరణుం దలంచు

                               వరకు ఒకే సమాసం

 కావున

ఇది ఏకసమాసచిత్రం


Thursday, March 17, 2022

పెదిమలు తగలని నాలుక మాత్రమే కదిలే పద్యం

 పెదిమలు తగలని నాలుక మాత్రమే 

కదిలే పద్యం




సాహితీమిత్రులారా!



పలికేప్పుడు పెదిమలు తగలని అక్షరాలతో

నాలుక మాత్రమే కదిలే పద్యం దీన్ని

నిరోష్ఠ్యాచలజ్జిహ్వము అంటాము. ఇక్కడ

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని 832వ

పద్యాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గమనించండి-


సగ్విణి వృత్తంలో కూర్చబడినది-

ఇది 832వ దండకంలో గర్భితమైన పద్యం

అంటే విడిగా ఈ పద్యం కనిపించదు మనం

ఇక్కడ విడిగా వ్రాసుకుంటున్నాం గమనించగలరు


నారదారాధనా నారతాహ్లాదితా

నీరదాశీల సన్నీల తేజః శ్రితా

సార దైత్యచ్ఛిదా చండ చక్రాంచితా

శ్రీ రసాలంకృతా శేషశైలస్థితా


గమనించండి దీనిలో ప,ఫ,బ,భ,మ - లు లేవు

పలికితే నాలుక మాత్రమే కదులుతుంది


Tuesday, March 15, 2022

మాలికా రామాయణము

మాలికా రామాయణము




సాహితీమిత్రులారా!



రామాయణాన్ని వాల్మీకి తరువాత ఇప్పటికీ

వ్రాస్తూనే ఉన్నారు వ్రాస్తారు కూడ

కాని ఇక్కడ రామాయణాన్ని మాలికరూపంలో

ఆరు మందికవులు కూర్చి సమర్పించారు

ఇది కొముదీపరిషత్ విజయనగరంలో 

జరిగిన విషయమిది


1. ఆకుండి వెంకటశాస్త్రిగారు  - బాలకాండ - 206 చరణాలు


2. పంతుల లక్ష్మినారాయణ శాస్త్రి - అయోధ్యకాండ - 743 చరణాలు


3. దేవగుప్తాపు వెంకటరమణ గారు - అరణ్యకాండ - 438 చరణాలు


4. చింతలపూడి సన్యాసిరావు గారు - కిష్కింధకాండ - 420 చరణాలు


5. మూలా పేరన్నకవి గారు          - సుందరకాండ - 228 చరణాలు


6. ఉప్మాక నారాయణమూర్తిగారు   - యుద్ధకాండ    - 1800 చరణాలు


ఈ విధంగా మాలికారామాయణం 1953లో వ్రాయబడింది

 

Sunday, March 13, 2022

అరచేతంత పట్నం- అరవై మేడల పట్నం

అరచేతంత పట్నం- అరవై మేడల పట్నం




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథకు విచ్చుకథ చెప్పండి


అరచేతంత పట్నం, అరవై మేడల పట్నం

మేడకు ముప్పయి గదులూ గదులకు పదిమంది బంట్లూ

బంటుబంటుకూ బందూకు, బందూకు చూస్తే భయమెచ్చూ,

మెచ్చావచ్చూ ఆపోరూ, మెలతా చెప్పేఎవ్వరో?


సమాధానం -

అరచేతంత పట్నం- అరవై మేడల పట్నం - తేనెతుట్ట


మేడకు ముప్పయి గదులూ గదులకు పదిమంది బంట్లూ

బంటుబంటుకూ బందూకు, బందూకు చూస్తే భయమెచ్చూ - తేనెటీగలు


మెచ్చవచ్చూ ఆపోరూ - తేనె


Friday, March 11, 2022

మత్తేభకందగర్భసీసము

 మత్తేభకందగర్భసీసము




సాహితీమిత్రులారా!



సీసపద్యంలో మత్తేభపద్యాన్ని, కందపద్యాన్ని

ఇమిడ్చి చెప్పడం మత్తేభకందగర్భసీసంగా

చెప్పబడింది. ఇది గర్భకవిత్వానికి చెందిన చిత్రం.

కోవూరి పట్టాభిరామశర్మకూర్చిన శ్రీమదాంధ్ర మహాభాగవతం

ఏకాదశ స్కందంలోని పద్యం ఇది గమనించండి-


అభవభీతాక్త్యపహా ధరారమణ దృ

                ప్యద్వైరిరా ణ్ణిగ్రహాద్వితీయ

త్రిభువనాధీశ్వర దివ్యకీర్తి నిలయా

                భూపుత్రికా వల్లభా పరేశ

సుకవివిద్వన్నుత శుభ్రనైజ చరితా

                కల్యాణ సంధాయకా నరేంద్ర

ప్రణవచాపారవపాటితారి హృదయా

                నాగేంద్రతల్పా శ్రయా గభీర

సురనికరవందితాంబుజ చరణ జనక

వాక్యకరణ సత్యవచన వార్ధరనిభ

మునివరసుత సుందరవేష భువననిలయ

నతపవనకులభవ ప్రణవ నాదవిదిత

(శ్రీమదాంధ్రమహాభాగవతం - 11- 1029)

దీనిలో మత్తేభం, కంద రెండు ఇమిడి ఉన్నాయి

ఎలా ఇమిడి ఉన్నాయో గమనిద్దాం-

భవభీతాక్త్యపహా ధరారమణ దృ

                ప్యద్వైరిరా ణ్ణిగ్రహాద్వితీయ

త్రిభువనాధీశ్వర దివ్యకీర్తి నిలయా

                భూపుత్రికా వల్లభా పరేశ

సుకవివిద్వన్నుత శుభ్రనైజ చరితా

                కల్యాణ సంధాయకా నరేంద్ర

ప్రణవచాపారవపాటితారి హృదయా

                నాగేంద్రతల్పా శ్రయా గభీర

సురనికరవందితాంబుజ చరణ జనక

వాక్యకరణ సత్యవచన వార్ధరనిభ

మునివరసుత సుందరవేష భువననిలయ

నతపవనకులభవ ప్రణవ నాదవిదిత

గర్భిత మత్తేవిక్రీడిత వృత్తము -

భవభీతాక్త్యపహా ధరారమణ దృప్యద్వైరిరా ణ్ణిగ్రహా

భువనాధీశ్వర దివ్యకీర్తి నిలయాభూపుత్రికా వల్లభా 

కవివిద్వన్నుత శుభ్రనైజ చరితాకల్యాణ సంధాయకా 

వచాపారవపాటితారి హృదయా నాగేంద్రతల్పా శ్రయా 

గర్భిత కందము-

సురనికరవందితాంబుజ చరణ జనక

వాక్యకరణ సత్యవచన వార్ధరనిభ

మునివరసుత సుందరవేష భువననిలయ

నతపవనకులభవ


సురనికరవందితాంబుజ 

చరణ జనక వాక్యకరణ సత్యవచన వా

ర్ధరనిభ మునివరసుత సుం

దరవేష భువననిలయన తపవనకులభవా

Wednesday, March 9, 2022

య,ర,ల,వ,శ,ష,స,హ - లతో కూర్చిన పద్యం

య,ర,ల,వ,శ,ష,స,హ - లతో కూర్చిన పద్యం





సాహితీమిత్రులారా!

య,ర,ల,వ,శ,ష,స,హ అనే 8 హల్లుల(వ్యంజనాల)తో

కూర్చిన పద్యం దీన్ని అపంచవర్గీయ పద్యం అంటారు.

కోవూరి పట్టాభిరామశర్మగారి శ్రీమదాంధ్ర మహాభాగవతము

ఏకాదశస్కందములో ఈ రకపు పద్యం గమనిద్దాం-


శివసహవాస! హేల సవిశేష! యశస్వి! సహస్రశీర్ష! యా

హవవివశాసురా! సురసహాయ! హయాస్యవిశేషవేష! వా

సవవశ! హ్రస్వలీల! శయశస్యశరా! వసువర్షవారివా

హ! విషయలోలవైరి! శశిహారి! హరీశ్వరసేవ్య! యీశ్వరా!

                                                                                   (శ్రీమదాంధ్రమహా భాగవతము - 11 - 1023)


ఈ పద్యంలో య,ర,ల,వ,శ,ష,స,హ - అనే హల్లుతప్ప వేరేవైనా ఉన్నాయా

గమనించండి

Monday, March 7, 2022

కంకణ బంధ రామాయణం

కంకణ బంధ రామాయణం




సాహితీమిత్రులారా!



సంస్కృత భాషలోని అద్భుతాలలో

కంకణ బంధ రామాయణాలు

ఒక మహాద్భుతం వీటిని 

ఒకటి వాశిష్ఠ కృష్ణమూర్తిగారు కూర్చితే

మరొకటి చర్ల భాష్యకారశాస్త్రి గారు కూర్చారు

ఇక్కడ చర్ల భాష్యకారశాస్త్రి గారి కంకణబంధ

రామాయణాన్ని గమనిద్దాం

ఇది ఏకశ్లోక రామాయణం దీనిని ఒక్కొక అక్షరంతో 

మొదలు పెట్టి అనులోమంగాను - విలోమం పద్ధతులతో చదివితే 

64 + 64 = 128 శ్లోకాలతో రామకథ పూర్తవుతుంది ఇలాంటివి మరొకరు 

కూర్చగల సామర్థ్యం ఉన్నా చదవగలిగే సామర్థ్యం 

ఉన్నవాళ్లు తగ్గిపోతున్నారు ఇది శోచనీయం

దీనికి వ్యాఖ్య ఉందో లేదో కూడ తెలియదు వ్యాఖ్య ఎవరి వద్దనైనా 

ఉందేమో అది నాకు అందజేయగలరని మనవి

ఆ శ్లోకం-

రామా నాథా భారా సాకా చారా వారా గోపా ధారా

ధారా ధారా భీమా కారా పారా వారా సీతా రామా


Saturday, March 5, 2022

చదివితే నాలుక కదలని పద్యం

 చదివితే నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!



పలికినపుడు నాలుక కదలని అక్షరాలతో

పద్యం కూర్చితే అది నాలుక కదలని పద్యం

అచలజిహ్వ అంటారు. ఇక్కడ

శ్రీకోవూరి పట్టాభిరామశర్మ విరచిత

 శ్రీమదాంధ్ర మహాభాగవతం

ఏకాదశ స్కందంలోని ఈ పద్యం పలికి చూడండి-


బహుపాపౌఘ విపాకా

పహ పంఖభవాంబకా విభా భవ మోహా

వహ భూమికా భవాపహ 

బహు భంగీ భూమి భూవివాహమహేహా

                                     (1026)

దీన్ని చదివి గమనించండి.


Thursday, March 3, 2022

ఆ చెట్టేది చెప్పగలరా?

 ఆ చెట్టేది చెప్పగలరా?




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూచి

ఆ చెట్టేదో చెప్పండి-


చెట్టుకు మూడక్షరములు

తొట్టతొలుత యక్షరంబు త్రోసిన త్రాడౌ

చెట్టెయ్యది త్రాడెట్లగు

బట్టుగ దెల్పుటకు గడువు పదినెలలిత్తున్


దీనిలో సమాధానం లేదు క్లూ మాత్రం ఉంది

అది ఆ చెట్టుకు 3 అక్షరాలు మొదటి అక్షరం

తీసేస్తే త్రాడౌతుందట. ఆ చెట్టేది త్రాడెట్లా అవుతుందో

చెప్పమంటున్నాడు కవి


సమాధానం - మందారం

దీనిలో మొదటి అక్షరం తీసివేస్తే

దారం

అదేమిటి దారం తాడెలా అవుతుంది

దారం సన్నది త్రాడు కొంత లావుగా ఉంటుంది 

అంతే కదా