Thursday, June 27, 2019

కేనాపారా


కేనాపారా
సాహితీమిత్రులారా!

1.

గేజ్ నది దాటి కుట్రపారా పల్లె వైపుగా నడుస్తున్నాను. అటు ఇటు గోధుమపసుప్పచ్చ మట్టి దుబ్బ చేలు. పంటకోతలు ఐపోవచ్చాయి. కుట్రపారా ఇండ్ల పైకప్పుల మీదకెక్కివున్నాడు సూర్యుడు. ఇండ్లల్లోనుంచి పిల్లల్నీ పెద్దల్నీ తొందరపెడుతున్నాడు. పొగమంచు పలచబడింది. టౌనుకి పోయే సైకిళ్ళు ఎదురొస్తున్నాయి. జైరాంజీ పేడతట్టల కావిడి ఎత్తుకుని నన్ను దాటిపోయినాడు. ఉమేశ్ ఈపూట కూడా బడి ఎగ్గొట్టేసినట్టుంది. మేకలను తోలుకుని ఇటే వస్తున్నాడు. వాడు పాటందుకున్నాడు. ఆవుల మంద మూల మలుపు తిరుగుతున్నది. ఊరి ప్రారంభంలో రెండో ఇంటి మట్టిగోడకు వరిగడ్డి కట్టలను మోసే కావిడికర్రలు ఆనించి కూర్చున్న వృద్దులిద్దరూ లేతయెండను అనుభవిస్తూ ఏదో చెప్పుకుంటున్నారు. వీధుల్లోనుండి పిల్లల ఆటా పాటలు వినబడుతున్నాయి. నల్లపొడ కట్టిన ఇంటి పైకప్పుల మీద గుమ్మడిపువ్వులు నవ్వుతున్నాయి.

కుట్రపారాకు పోయే మట్టిబాట దిగి వరిచేను గట్టుమీదకి ఎక్కినాను. గట్టుమీద పాలపిట్ట కూర్చుని ఉంది. కొద్దిగా అవతల నదిగట్టుపైన మట్టిదిబ్బమీద అయిదారుగురు స్త్రీలు మూటలు పక్కన పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ‘ఏం ఫోటో తీస్తున్నావ’ని అడిగింది అందులో ఒక స్త్రీ నన్ను.

గట్టుమీద పాలపిట్ట ఎగిరిపోయింది.

దగ్గరగా వెళ్లి వారికి కెమెరా డిస్‌ప్లేలో పాలపిట్టను చూపించాను. ‘ఇంకా ఏమున్నాయో చూస్తామ’న్నారు. సాల్ చెట్లు, ఆకులు, పురుగులు, ఏట్లో కొంగలు, కెమెరాలో ఉన్నవి చూడమన్నాను. “మేమిప్పుడు పోయే అడివిలో ఇట్లాంటివెన్నో ఉంటాయి. అక్కడ నది కూడా ఉన్నది. మాతో వస్తావా?” అన్నది వాళ్ళల్లో ఒక యువతి.


అంటే ఆ స్త్రీలు బయలుదేరింది అడివికి. అడవి పిలిచేది. వెళ్ళటం ఎప్పుడూ వీలుకాలేదు. రానని ఎట్లా అంటాను! అప్పటికప్పుడు వాళ్ళతో ఎట్లా వెళ్ళాలన్న ఆలోచన రాలేదు. నమ్మలేక వస్తానన్నాను. అడవిలో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయన్న యువతి ఎప్పుడో నన్ను వాళ్ళ ఊరిలో చూసిందట. ఇప్పటికి కుట్రపారా రెండుసార్లు వెళ్లాను. ఆ ఊరిలో మొట్టమొదట ఎదురయ్యే ఇంట్లో పుష్ప, ఆమె చెల్లెలు సుమిత్రలతో పరిచయం ఉంది నాకు. నావెంట కుట్రపారా అంతా తిరిగి చూపించేది సుమిత్రనే. పుష్ప, సుమిత్రల వదినకు చెల్లెలట ఈమె. పేరు లీల.

మూటలు చంకన పెట్టుకుని వరిచేల గట్లమీద గబగబా నడుస్తూ ఒక దిక్కునుండి ఇద్దరూ, మరో దిక్కునుండి ముగ్గురూ వచ్చి కలిశారు. వచ్చినవారిలో పుష్ప, ఆమె తల్లి కూడా ఉన్నారు. వారివెనక మరొక స్త్రీ పరుగుపరుగున వచ్చింది. చంటిపిల్లవాడితో ఆలస్యమైందన్నది. మిగతా స్త్రీలను అందుకోగలిగినందుకు నవ్వింది. ఆమె పేరు పూర్ణ. ఆ తరువాత మాటల్లో తెలిసింది.

అందరు వచ్చినట్లేననుకున్నారు. మూటలెత్తుకుని అడవి దిక్కు తిరిగారు.

అందరిలో పెద్దవాళ్ళు శాంతాబాయి, కమ్లాదేవి. ఎన్నో ఏళ్లుగా అడివికి పోయి కట్టెలు తెచ్చిన అనుభవజ్ఞులు వాళ్ళు. వారి అడుగులతో అడుగులెయ్యబోయిన నన్ను, ఈమె కూడా వస్తుందా, అన్నట్లు చూశారు. వస్తానంటుందన్నారు లీల, ఆమెతో ముందు నదిగట్టు మీద కూర్చున్న నలుగురూ. శాంతాబాయి, కమ్లాదేవి నన్ను ఇంటికి తిరిగి పొమ్మన్నారు. అడవికి నేను రావొద్దన్నారు. చీకటి పడిపోతుందన్నారు.

ఏఏ కారణాలచేత వాళ్ళు నన్ను వద్దంటున్నారో నేను గ్రహించగలను.


నాకు తెలుసు. ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన రోజుల్లో ఒక సాయంత్రం మా క్వార్టరు కిటికీలోనుంచి చూస్తున్న నాకు సాలవృక్షాలకింద వీళ్ళు కనిపించారు. కట్టెల మోపులు చెట్టుకొమ్మలకి ఆనించి నిలబెట్టి ఉన్నాయి. చెట్ల మొదళ్ళమీద కూలబడ్డారు. ఒకరి తలలో ఒకరు పేలు చూసుకుంటున్నారు. ఇంకాస్త నడిస్తే ఊరు. చెట్ల నీడలు సాగి ఉన్నాయి. సాయంత్రపు నారింజ రంగు ఎండ. చెట్లమీద పడుతోంది. కట్టెల మోపులమీద పడుతోంది. ఆ స్త్రీల ముఖాలమీద తృప్తిపడి వెలుగుతోంది. ఒక్కోసారి కట్టెలెత్తుకుని సాలవృక్షాల కిందికి వచ్చేటప్పటికి చీకటైపోయేది. మసకగా ఆకారాలు మాత్రం కనిపించేవి. ఇప్పటికి రెండు వారాలైంది, సాయంత్రంపూట కేనాపారా స్త్రీలు కట్టెల మోపులెత్తుకుని అడవినుంచి వస్తూ నాకు దారిలో ఎదురయ్యారు. రేపు కూడా అడవికిపోతే వారి వెంబడి నేను కూడా వస్తానన్నాను. తెల్లవారుతూనే బయల్దేరతాం ఇక్కడికే వచ్చి ఉండమన్నారు, వాళ్ళతో అడివికి నేను పోవచ్చునన్నారు. మధ్యాహ్నానికి అన్నం బాక్సులో పెట్టుకున్నాను. నీళ్ళ బాటిల్ సంచిలో పెట్టుకున్నాను. కేనాపారా స్త్రీలు చెప్పిన వేళకి వాళ్ళు చెప్పిన కదంబవృక్షం కింద నిలబడి ఎదురుచూసి చూసి నిరాశతో వెనుతిరిగి పోయాను. వాళ్ళంతా చీకట్లోనే వెళ్లిపోయారని ఊళ్లోవాళ్ళు చెప్పారు.

ఈ పూట అడవికి పోయే అదృష్టం ఇట్లా నాకు కలుగుతుందని నేను అనుకోలేదు.

వారంతా మధ్యాహ్నానికి రొట్టెలు మూటల్లో కట్టుకుని వచ్చారు. కెమెరా తప్ప నావి వొట్టి చేతులు. ఇంట్లోనుండి వస్తూ పాలు త్రాగాను. చెట్లెమ్మడి, నదివెంబడి, చేలవెంబడి తిరిగి తిరిగి ఆకలైతేనే ఇంటికి చేరేది నేను. వస్తూ వస్తూ కడుపునిండా అన్నం తినే వచ్చానని, సాయంత్రందాకా నాకు ఆకలి వెయ్యదని చెప్పాను. అన్నం తిని వచ్చానని అబద్దం చెప్పక నాకు తప్పలేదు.

“బాత్ ఓ నహీ హై దీదీజీ. హమారె సాత్ జ్యాదా రోటీ బీ హై. ఇత్నా దూర్ చల్నా ఆప్కో ఆదత్ నహీ హైనా!” (మేమంటున్నది అదికాదు అక్కా. మా దగ్గర రొట్టెలు ఎక్కువే ఉన్నాయి. ఇంత దూరం నడవటం నీకు అలవాటు లేదు కదా!) పుష్ప అన్నది.

“మేడమ్‌జీ, ఆప్ కో కుచ్ హోగా తో?” (మేడమ్‌జీ, నీకెదన్నా జరిగితే?) నడుస్తున్నవాళ్ళ మధ్యలోనుంచి ఎవరో అన్నారు. అడవికి దూరమైనందుకే కదా!

వాళ్ళంతా మాట్లాడుతున్నది ఛత్తీస్‌గఢీ బాష. అందులో హిందీ ఎక్కువగా ఉన్నది. హిందీని నేను అర్థంచేసుకుంటాను. హిందీలో సమాధానం కూడా చెప్పగలను. శాంతాబాయి, కమ్లాదేవి మాట్లాడేది నాకు అర్ధం కానిది లీల, పుష్ప హిందీలో చెప్తున్నారు.

నేను నడుస్తానని వారితో ఎట్లా చెప్పేది? నాకేమీ కాదని ఎలా వివరించను? నా మూలంగా వారు ఎక్కడా ఆగిపోవలసిన పరిస్థితి ఎదురుకాదని నాకు తెలుసు. నేను నడుస్తానన్నాను. మొబైల్ చూపించాను. ‘నా దగ్గరిది ఉన్నది, ఏమన్నా జరిగితే ఇంటికి ఫోన్ చేస్తాను, మీకు భయం లేద’న్నాను. మరో అబద్దం ఆడవలసివచ్చింది. ఫోన్లో బ్యాటరీ ఎంతోసేపు నిలవదు. అడవిలో టెలిఫోన్ సిగ్నల్ కూడా ఉండకపోవచ్చు. అడవిని చూడాలన్న నన్ను కాల్చేస్తున్న ఆశ తప్ప నేను అడవికి పోడానికి నా చేతుల్లో ఏదీ లేదు.


మాటల్లోనే నది దూరమైంది. సాలవనం దాటి నడిచినాము. పత్రపాలివారి వరిచేలు, పత్రపాలి ఇండ్ల గుమ్మాలు దాటి నడిచినాము. గుమ్మాల ముందున్నవారు నిలబడి, కొత్తగా కట్టెలవాళ్ళ నడుమ నడుస్తున్న నన్ను, చేస్తున్న పనులాపి చూస్తున్నారు. అప్పటికే నన్ను తెలిసినవాళ్ళు చిరునవ్వు నవ్వుతున్నారు. పత్రపాలిని దాటేసినాము. అది నడక కాదు, పరుగూ కాదు. పరుగుపరుగున నడక. గట్లకి అలవాటైన అడుగులు.

మొదట తడబడినా వారి వేగాన్ని నా అడుగులు ఎప్పుడో అందుకున్నాయి. శాంతాబాయి, కమ్లాదేవి పరుగూపరుగున ముందుకు నడుస్తూ నన్ను వెనక్కి పొమ్మంటూనే ఉన్నారు ఇంకా.

సుశీల్ కుమార్జీ. పత్రపాలి గ్రామ సర్పంచి, ఎదురొచ్చాడు. మోటార్ సైకిల్ మీద మమ్మల్ని దాటిపోతున్నాడు. నాకు ముందూ వెనకా నడుస్తున్న స్త్రీలను పలకరించాడు. శాంతాబాయి, కమ్లాదేవి సర్పంచిని ఆపి చెప్పారు, నన్ను ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పమని.

ఆయన నన్ను బెహన్‌జీ అని అంటూ “జంగిల్ కో జానా జంగిల్ సే వాపస్ ఆనా కమ్‌సేకమ్ తీస్ చాలీస్ కిలోమీటర్ హోగా. ఏ ఔరత్ లోగోంకో ఆదత్ హై. ఓ లోగ్ రోజ్ జాతే హై. సోచ్ లో. ఆప్ జానా చాహ్తే తో కోయి నహీ రుకేగా…” (అడవికి పోనూ రానూ మొత్తం ముప్పై నలభై కిలోమీటర్ల దూరముంటుంది. వీళ్ళందరికీ అది అలవాటు. వాళ్ళు రోజూ వెళ్తారు. ఆలోచించండి. వెళ్లాలని నీకుంటే నిన్నెవరూ ఆపరు.) అని నవ్వి, బండి నడుపుకుని వెళ్ళిపోయినాడు.

‘అడవికి పోవాలని నీకుంటే నిన్నెవరూ ఆపరు’–ఇంత చల్లని మాట వింటాననుకోలేదు! ఇప్పటిదాకా ఇట్లా నాతో అన్నవాళ్లు లేరు. సుశీల్ కుమార్జీకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ మాటని, ఆయన్ని నేనెప్పుడూ మర్చిపోను.

పత్రపాలినీ, ముందున్న బడ్‌గాఁవ్‌నీ కలుపుతూ తారు రోడ్డుంది. తారు రోడ్డు కాకుండా వరిచేలల్లోకి మళ్ళినాము. అది అడ్డబాట. గట్లమీద ఏర్పడిన సన్నటి దారి. నడిచీ నడిచీ ఆ స్త్రీల అడుగులు ఎరిగిన బాటలు. ఒకరి వెనక ఒకరు వరిచేల గట్లమీద వారట్లా నడుస్తుంటే ఒక్కొక్కరూ నడుస్తున్నట్టులేదు. ఒక్కటిగా నడుస్తున్నట్టుంది. వరుసలో నేను ముందు నడుస్తున్నాను ఇప్పుడు. నా అడుగులు వారి అడుగులతో సమాన వేగంతో పడుతున్నాయి. నా నడక వారి నడకలో ఒకటయ్యింది.

నాకెవరూ దారి చూపించే అవసరం లేదిప్పుడు. ఎక్కడో రెండు బాటలుగా విడిపోయేచోట నాలుగడుగుల ముందే ఎవరో ఒకరు వెనకనుండి ఎటు తిరగాలో చెప్తున్నారు.

పన్నెండు మైళ్ళ పైన దూరం నడిచాము. పొలాలు దాటాము. అయిదారు పల్లెటూర్లు దాటాము. చుడీపహాడ్ దాటి నడిచాము. కాలువలూ చెరువులూ దాటాము. మెలికలు తిరుగుతూ నడిచాము. రాళ్ళ దారుల్లో నడిచాము. ఎగుళ్లూ దిగుళ్ళలో నడిచాము. చుడీపహాడ్ పక్కన నీళ్ళకుంట పక్కన ఒక్కచోట కొద్దిసేపు ఆగాము. అక్కడ అందరూ పొదల చాటుకి వెళ్లి వచ్చారు.

చుడీపహాడ్ దాటిన తరువాత దారిపక్కన నేలమీద నల్లటి బెర్రీపండ్ల కుప్ప కనిపించింది. ఇట్లాంటిది నేను నదివొడ్డుమీద సాలవృక్షాల క్రింద చూశాను. ఏమిటది అని అడిగాను. ఎలుగుబంటి విసర్జితమన్నది నా ముందు నడుస్తున్న సీమ. నేను ఊహించినది నిజమే. లేదంటే ఎవరు ఈ పండ్లన్నీ అక్కడ కుప్పపోస్తారు! రాత్రివేళల్లో ఎలుగుబంట్లు మా గది అవతల నదిలో దాహం తీర్చుకోడానికి వస్తాయేమో.

కుట్రపారా, పత్రపాలి ఊళ్ళ మధ్యలో, ఆమపారా పోయే దారిపక్కన ఒంటరి బూరుగు మహావృక్షమొకటుంది. దాని కొమ్మలనిండా తేనెపట్లున్నాయి. ఆ చెట్టుకిందికి ఎవరూ పోరు. సాయంకాలాల్లో నేను ఆ చెట్టుకింద గడుపుతుంటాను. అక్కడ కూడా చూశాను ఇటువంటిది. చీకట్లో ఎలుగుబంట్లు సంచరిస్తున్న చోట పగలు నేను తిరుగుతున్నాను!

2.
అడవిలో ప్రవేశించేటప్పటికి సూర్యుడు నడినెత్తిమీదికొచ్చాడు. తెల్లగా ఎండ కాస్తోంది. పైన నీలాకాశం. నీడల్ని దగ్గరకి లాక్కొని మిట్టమధ్యాహ్నపు ఎండను ఆనందిస్తున్నాయి చెట్లు. అప్పుడొకటి ఇప్పుడొకటి పసుపురంగుకి తిరిగిన ఆకులు రాలిపడుతున్నాయి. మధ్యాహ్నపు నిశబ్దాన్ని అనుభవిస్తోంది అడవి. పక్కనే ఎక్కడో దూరంగా మేక మెడలో గంట మోగుతూ ఉంది. నీటి చప్పుడు వినిపిస్తోంది.

నది ఎదురైంది. నడుములోతు మించి పారుతున్నది. రొట్టెల మూటల్ని నడుముకి బిగించి కట్టి, చీరల్ని మోకాళ్ళపైకి చెక్కారు. ఒక చేతిలో చెప్పులు పట్టుకుంటూ నావైపు చూశారందరు. ఇంత లోతు నీళ్లున్న నదిని దాటడం నాకిదే తొలి అనుభవం. ప్యాంటు మోకాళ్ళ దాకా లాగాను. ఒక చేతిలో నా బూట్లు పట్టుకున్నాను. రెండో చేతిలో కెమెరా ఎత్తి పట్టుకున్నాను. ఆ స్త్రీల వెనక నది దాటడానికి నేను సిద్దమయ్యాను. నీళ్ళలో రాళ్ళమీద నా అడుగులు తెలిసినట్లే పడుతున్నాయి.


“జంగిల్ మే ఆప్ క్యా కరోగీ!?” (అడవిలో ఏం చేస్తావు!?) ఇవతలి ఒడ్డుమీద నేను బూట్లు తొడుక్కుంటున్నప్పుడు పూర్ణ అడిగింది. ముదురాకుపచ్చరంగు మీద తెల్లని ఎంబ్రాయిడరీ పువ్వులున్న చీర కట్టుకుంది పూర్ణ. నిండుగా ఆమె నవ్వుతుంటే, ఓనాడు నేను చూద్దామని పోయినప్పుడు చెట్ల తలలనిండా గుత్తులు గుత్తులుగా విరబూసిన సాలపుష్పాలు నవ్వుతున్నట్టుగా ఉంది. అడవిలో ఏం చేస్తాను నేను! ఈ స్త్రీలంతా కట్టెలకోసం వచ్చారు. కట్టెలు ఏరుతారు. అడవికి నేనెందుకొచ్చాను అన్నట్లున్న ఆమె ప్రశ్నకు నేనేమని బదులిచ్చేది? నా ఆలోచనలు ఎప్పుడూ అడవి మీద ఉంటాయని చెప్పేదా? అడవి నన్ను పిలుస్తూ ఉన్నట్టుగా ఉంటుందని చెప్పనా? అడవిలో నాకేంపనని అడుగుతున్నది పూర్ణ!

నగరాల్లో నాకు ఊపిరాడదని, నున్నటి దారుల్లో నా అడుగులు తడబడతాయని, అడవీ ఆ పల్లెటూళ్ళూ తప్ప, చేలూ గట్లూ తప్ప నగరం తెలియని ఈ అమాయకురాలికి ఒక్క మాటలో ఎట్లా వివరించేది?

“తెలియదు,” అన్నాను.

ఆమె నవ్వింది.

నడుముకు కట్టిన రొట్టెల మూటలనట్లానే ఉండనిచ్చినారు. చెప్పులు వేసుకొని తలోదిక్కు చెదిరిపోయారు. వారి దృష్టంతా ఇప్పుడు ఎండిన కట్టెలమీద ఉన్నది. పొదల్లో దొరికినవి, ఎండి, నదిలోకి వంగిన కొమ్మలు విరిచి ఎవరి కుప్పలో వారు జమచేస్తున్నారు. మధ్యమధ్యలో ఓ ఓ అని కేకలు వేస్తున్నారు. మేక మెడలో గంట అందుకే. నాకు అందిన కట్టెలు నాకు అందుబాటులో ఉన్న కుప్పలో వేస్తున్నాను నేను. ఆ ప్రదేశమంతా ఇసుక, గులకరాళ్ళు, అక్కడక్కడా ముళ్ళ పొదలతో ఉన్నది. ఒకదగ్గర తపసిచెట్టు కొమ్మమీద కూకుడు గువ్వలు నాలుగు కబుర్లాడుకుంటున్నాయి. ఏరిన కట్టెలు పక్కన పెట్టి కెమెరా బయటికి తీశాను. వాటికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను.

నాక్కొంచం అవతల ‘భైంసా! భైంసా!'(అడవిడున్న! అడవిదున్న!) గుసగుసగా అన్నారు ఎవరో.

ఏది ఏదని మిగతావారు వచ్చి గుమికూడారు. కొమ్మమీద గువ్వలు ఎగిరిపోయాయి. వాళ్ళు చూస్తున్నవైపు చూశాను. నది ఆవల ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బమీద రెండు ముర్రాజాతి గేదెలు పడుకొని నెమరువేస్తున్నాయి. తలలు, కొమ్ములొక్కటే కనిపిస్తున్నాయి. వాటిని చూచి అడవి దున్నలనుకున్నారు వీళ్ళు. మామూలు గేదెలను చూసేదే తక్కువ. ఆవులు, ఎద్దులే వాళ్లకుండేది. జంగిల్ భైంసా కాదన్నారు శాంతాబాయి, కమ్లాదేవి. వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు. అందరు మళ్ళీ వెనక్కి తిరిగారు.

నేను నిలబడ్డ చోటుకి కొద్దిగా అవతల నిశబ్దంగా పట్టుపురుగు గూడు అల్లుకుంటున్నది. అటు కదలబోయాను. వారటు నాలుగడుగులు వేశారు. నేనిటు నాలుగడుగులు వేశాను. నాకు నాలుగంటే నాలుగడుగుల అవతల పొదపక్కన చెట్ల నీడలో ఆకులమీద సర్రున చప్పుడైంది. అప్పటిదాకా పొదల నీడలో చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్నట్టుంది. నిద్రాభంగమై ముందు బుస్సుమని లేచింది నల్లత్రాచు.

ఆ శబ్దానికి అడవి ఉలిక్కిపడ్డట్టైంది.

ఎక్కడివాళ్ళం అక్కడ బిగుసుకునిపోయాము. అది భయమో ఏమిటో తెలియడంలేదు. నేనొక అపూర్వ దృశ్యాన్ని చూస్తున్నట్టు ఉన్నది. పాముల్ని దగ్గరగా చూడాలని ఉంటుంది నాకు. ఆ క్షణం నేనొక కాలసర్పానికి అతి సమీపంలో నిలబడి ఉన్నాను. కళ్ళు కళ్ళూ కలుసుకున్న అనుభూతి. వెనక్కి తిరిగి పొదల్లో కలిసిపోయిందది. ‘కాలానాగ్!’ తేరుకుని అన్నారెవరో. శాంతాబాయి నావైపు చూస్తోంది. నాకేదన్నా ప్రమాదం జరగవచ్చని ఆ క్షణందాకా కలవరపడుతూ ఉందామె. ఆమె కళ్ళు ఇప్పుడు తేటగా ఉన్నాయి. అడవిని కాపాడేది కాలనాగేనని వీరు విశ్వసిస్తారు. అడవిలో అది కనబడటాన్ని పుణ్యం చేసుకున్నట్లు భావిస్తారు. నావల్ల తమకీ దర్శనభాగ్యం కలిగిందన్నారు సీమ, పూర్ణ, అక్కడ నుంచున్న స్త్రీలంతా.

3.
అప్పటిదాకా కూడబెట్టిన కట్టెలనన్నిటినక్కడనే ఉంచారు. అక్కడినుంచి మేము ఇసుక ప్రదేశాన్ని దాటి నది రెండో పాయను చేరుకున్నాము. పెద్ద దూరం కాదు.

కొరియా కేంద్ర పీఠభూమికి పడమరన సోన్హత్ కొండల్లో పుట్టి, గేజ్ నదిగా పేరుపొంది, వీరి గ్రామం కుట్రపారాతోపాటు కేనాపారా, పత్రపాలి, నర్సింగాపూర్, మోదీపారా, దేవరీ పల్లెల అన్ని అవసరాలనూ తీర్చి ఝిన్క్, అటెం వాగులను తనలో చేర్చుకుని, ఇప్పుడు మేమున్న చోటుకి కొద్దిగా ముందు ఈ అడవిలో ప్రవేశించి, రెండు పాయలుగా చీలి, వందమీటర్లు రెండుగా ప్రవహించి, మళ్ళీ ఒక్కటై అడివిదాటి, పట్మ అనే ఊరి దగ్గర హస్‌దేవ్ నదిలో కలుస్తుంది. వీరికది ప్రాణనది. పొద్దున్న నిద్రలేస్తే ఆ నది చుట్టూ తిరుగుతాయి వీరి జీవితాలు.

వారి ఊరినానుకుని పారే ఆ నదే ఈ నదని వీరికి తెలుసా అని నాకు సందేహమే.


నది రెండో పాయ, ప్రవాహాన్ని మేము దాటవలసిన చోట లోతు మరీ ఎక్కువగా ఉన్నది. నా నడుము దాటి ఉండవచ్చు. నాలుగైదు అడుగులు ఆ లోతుని దాటితే ఆ తరువాత ప్రవాహం విస్తరించింది. నేను దాటగలనా అని నా వైపు చూశారు మళ్ళీ. వారందరి వెనక నేను దాటుతానన్నాను.

నది విస్తరించి ప్రవహిస్తున్నచోట నా పాదాల లోతే ఉంది. అడుగున ప్రతి రాయి కనిపించేటంత తేటగా, చల్లగా ఉన్నది నదిలోని నీరు. కుట్రపారా స్త్రీలు కట్టెలేరడంలో పడిపోయారు. ప్రవాహంలో అటు ఇటు నడుస్తున్న నా ప్రాణాలు జివ్వుమన్నాయి చల్లదనానికి. అవతలి గట్టుమీద మూడు కాలిబాటలు కనిపించాయి. అవతలి గ్రామాల నుండి వచ్చేవాళ్ళు, లేదా ఇవతలి వాళ్ళు అటుపోవడం వల్ల ఏర్పడ్డవై ఉంటాయి. కొంచం ముందుకుపోయి కొండను ఒరుసుకుని ప్రవహిస్తున్నది నది. అటువైపు మనిషి దూరలేనంత దట్టంగా ఉంది అడవి. అడవిపక్షుల పాటలేవో వినిపిస్తున్నాయి. తెలియని చెట్లు కొండవాలులో కనిపిస్తున్నాయి. దట్టంగా ఉన్న ఆ అడివిలోకి ఎవరూ అడుగుపెట్టరన్నది పుష్ప.

కట్టెలు కూడినాయి. ఇక్కడ ఏరిన కట్టెలు ఎత్తుకుని ప్రవాహాన్ని దాటి తిరిగి ఇసుక ప్రాంతాన్ని చేరుకున్నాము.

ఇంకా నడుముకే ఉన్న మూటలు విప్పారు. మోపులకు కట్టే తాళ్ళను బైటికి తీశారు. మూడు తాళ్ళను ఎడంగా పరిచి వాటిమీద కట్టెలు పేర్చసాగారు. ఒక్కో కట్టెనీ పేర్చుతూ ఉన్నది పూర్ణ. మెల్లగా చెట్లక్రింద నీడలు అదృశ్యమైనాయి. వచ్చినంత దూరమూ తిరిగి నడవాలి. చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవాలి. పైకి చూసిన నాకు సూర్యుడు కనిపించలేదు. మేఘాలు మూసుకొస్తున్నాయి. దారిలో మోపు వదులు కాకూడదు. ఒక్కరు ఆగితే అందరూ ఆగాలి. పండిన ఆకులు రాలుతున్నాయి. గాలి తోసుకొచ్చింది. మట్టివాసననీ మోసుకొచ్చింది. పూర్ణ తన కట్టెలు మోపు కట్టేసింది. శాంతాబాయి, కమ్లాదేవి వారి మోపులు వారు కట్టేశారు. కొత్త కోడలు రాణికి కట్టెలు మోపు కట్టడంలో అనుభవం లేదు. రాణికి పూర్ణ సాయంచేసింది. నలుగురైదుగురూ ఆమెనే పిలిచారు. ఆమె పనిని ఒక ధ్యానంలా చేసుకుపోతుంది. ఆమె ఏది చేసినా అందంగా ఉంటుంది. వాన మొదలైంది. ఆకులమీద టపటపా సన్నటి చినుకులు. మేఘం జరిగింది. ఎండ కూడా తిరిగొచ్చింది.

వాన పెద్దది కాకముందే అడివి దాటిపోవాలన్నది పూర్ణ నావైపు చూచి.

చెప్పులు విడిచి కట్టెల మోపులో దూర్చారు. మూటలు విప్పి ఇంకా తెరవని టిఫిన్ బాక్సులని చిన్నగుడ్డలో కట్టి నడుముకి కట్టుకున్నారు. మూటలు కట్టి తెచ్చిన గుడ్డని మెలితిప్పి తాడులా పేని చుట్టలాగా చుట్టారు. అడవినుండి ఇంటికి తిరుగు ప్రయాణానికి అంతా సిద్దమైంది.

ఎవరి మోపుని వారు ఒక చివర ఒక చేత్తో పట్టుకున్నారు. ఎత్తి చెట్ల కొమ్మలకు ఆనించారు. చుట్టలా మడిచిన గుడ్డని తలమీద కుదురుగా పెట్టుకుని తలని మోపు మధ్యలో ఆనించి రెండో చివరని పైకెత్తారు. కట్టెల మోపులు అందరి తలలమీదకు వచ్చాయి. ఇంత సులువుగా ఇంత బరువుని ఎత్తుకోగలరని నాకెట్లా తెలియలేదు!

నడక మొదలైంది. చినుకులు ఆగిపోయినాయి!

వచ్చిన వైపున కాకుండా ఇంకోవైపు నదిని దాటలనుకున్నారు. అటువైపు నడిచాము. అక్కడ చూస్తే నది లోతు భుజాలను తాకేలా ఉన్నది. లోతు చూస్తానని ముందు కమ్లాదేవి నీళ్ళలోకి దిగింది. మరొక స్త్రీ ఆమెను అనుసరించింది. మేమంతా ఇవతలి ఒడ్డుమీద నిలబడి చూస్తున్నాం. వారిద్దరి భుజాలను తాకాయి నదిలో నీళ్ళు. ఎట్లాగో వాళ్ళు నది దాటగలిగారు. ఇక్కడ నది దాటవద్దనుకున్నారు. అటు చేరినవాళ్ళు ఇటు రాలేదు. వాళ్ళు ముందుకే సాగారు. దారిలో కలుస్తామని కేకేసి చెప్పారు. ఇవతల ఒడ్డుమీద ఉన్న మేమంతా వెనక్కితిరిగాం.

నదిపాయ వెంట ముందుకి నడిచి లోతు తక్కువగా ఉన్న చోట మోపులు దించారు. ఎవరి సహాయం ఎవరూ తీసుకోలేదు. ఏదో చెట్టు కొమ్మనో, మొదలునో చూసుకుని మోపుని కొద్దిగా ముందుకి వంచితే అది నేలను తాకింది. ఏటవాలు చేసి రెండోచివరని కొమ్మకు తాకించడమే. తిరిగి మోపుని ఎత్తుకోవడం ఎంత సులువు!


తిరిగి ఎండకాయడం మొదలైంది. నదిలో చేతులు కడుక్కొని, బండరాళ్ల మీద కూర్చుని రొట్టెలు తిన్నాము. నదిలో పారుతున్న నీటినే తాగారు. దోసిట్లోకి తీసుకొని అదే నీటిని నేనుకూడా తాగాను.

తలమీద బరువుని, బండరాళ్ళమీద అడుగులనీ బ్యాలన్స్ చేసుకుంటూ నదిని దాటారు. ఎత్తు గడ్డలు ఎక్కి పల్లాలు దిగి అడవినీ దాటాము. వారందరి వెనక నడుస్తున్నాను నేను, వారి వేగాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ. ఈసారి వాళ్ళతో సమంగా అడుగులెయ్యడం నావల్ల కావటంలేదు. తలల మీదున్న అంత బరువులతో అంత వేగంగా నడక ఎలా సాధ్యమైందన్నది నేనిప్పుడు స్వయంగా చూస్తున్నాను! కుడిచేయి తలపైకి చేరి మోపుని పట్టుకుంటే, ఎడమ చేతిని మోచేతివద్ద మడుస్తూ ఆడిస్తూ, భూమికి ఆనీ ఆననట్లు వేగంగా, లయబద్దంగా పడుతున్న వారి అడుగులు బరువుని అలకన చేస్తున్నాయి. అది నడకలా లేదు. అడవిపాటకు అడుగులేస్తున్నట్టుగా ఉన్నది. ఆడవి ఇచ్చినది ఎత్తుకుని ఆనందంతో ఇంటికి పరుగు తీస్తున్నట్టున్నది.

ముఖాల్లో చెదరని అదే నవ్వు. ప్రశాంతత.

4.
వర్షం మళ్ళీ అందుకుంది. ఈ సారి పెద్ద పెద్ద చినుకులు. అడవి వెలుపల అక్కడొకటీ అక్కడొక్కటీ ఇండ్లున్నాయి. వారి వ్యవసాయాలున్నాయి. చినుకులు పెద్దవవడంతో ఒక ఇంటి ముంగిట కట్టెల మోపులు దించి చెట్టుకానించి ఆ ఇంటి పంచకిందికి దూరాము. చిన్న పశువులకొట్టం అది. నున్నగా అలికిన నేలమీద మేకపిల్లలు ఆడుకుంటున్నాయి. ఇంట్లోవాళ్ళు బైటికొచ్చి వాన తగ్గేదాకా ఉండిపొమ్మన్నారు. మేకపిల్లల్ని వొళ్లోకి తీసుకుని అందులోనే సర్దుకుని కూర్చున్నాము. వాన ఎప్పటికి తగ్గుతుందన్న ఆందోళన వారి ముఖాల్లో కనపడలేదు. ఇండ్లవద్ద కళ్ళాల్లో వడ్లున్నాయి. వడ్లు తడుస్తాయనీ, కూరగాయల పంటకు నీళ్ళు ఎక్కువవుతాయనో తక్కువవుతాయనో అనుకోలేదు. వానని చూస్తూ కూర్చున్నారు.


ఒకనాడు నేను కొత్తగా కుట్రపారాను చూద్దామని ఆ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు ఇంటి వాకిలి ఊడుస్తూ పుష్ప నాకు కనిపించింది. కేనాపారాలో ప్రాథమిక పాఠశాలకు వచ్చిపోయే పిల్లలను దారిలో కలవడమే తప్ప ఆ ఊరితో నాకింకా పరిచయంలేదు అప్పటికి. ఎవరితోనో పరిచయం జరగకపోదు. ఇట్లానే మిగతా పల్లెలన్నీ నాకు తెలిసింది. ఊరు చూద్దామని వచ్చానంటే ముందు ఇంట్లోకి పిలిచి వద్దన్నా వరిపిండి పకోడీలు చేసిపెట్టి చెల్లెలిని తోడిచ్చి పంపింది. దగ్గరుండి ఊరు చివర బడిదాకా పోయి చూపించమని చెప్పింది. పెండ్లికాని యువతులు ఇద్దరూ. తండ్రి లేడు. ఇంటినానుకుని ఉన్న రెండెకరాల భూమిని వేరుపడి ఉంటున్న అన్న సాయంతో పండిస్తారు. వడ్లు, గోధుమలు, ఆలుగడ్డలు, ఆవాలు, వలిసెలు, కూరగాయలన్నీ పండుతాయి ఆ రెండెకరాల్లో. ఒక్క ఉప్పు కొనుక్కుంటే చాలు. అదే జాగాలో రెండు పెద్ద మామిడిచెట్లున్నాయి. చింతచెట్టుంది, రేగు చెట్టుంది, వెదురు చెట్లున్నాయి. చెట్లనల్లుకుని, ఇంటి పైకప్పునల్లుకుని చిక్కుడు, సొర, గుమ్మడి, నేతిబీర తీగలున్నాయి. ఆవులున్నాయి.

ఒక్క పుష్ప కుటుంబమే కాదు, కుట్రపారాలో ఇండ్లన్నీ, ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ ఇంతే.

ఇదిగో ఇప్పుడు అడివినుండి వంటకి ఎండుకట్టెలు ఎత్తుకుపోడానికి వచ్చారు. వరి కోసి, మడులు చేసి, కూరగాయల విత్తనాలు నాటి, కట్టెలకోసం వస్తారు. ఏడాదికి సరిపోయేటన్ని కూడబెడతారు. కూడేదాకా అడవికి వస్తారు. ఒక్క గురువారం అడవికి రారు. ఆ రోజు సంత.

వాన వెలిసింది. లేచి మోపులెత్తుకున్నారు. కొద్దిదూరం నడిచి దారిపక్కన ఇప్పచెట్టు కింద ఆగాము. చిన్నచిన్నరాళ్ళు అక్కడక్కడా వేసి ఉన్నాయి చెట్టు కింద. రోజూ ఆగే చోటనుకుంటాను. రాళ్ళమీద కూర్చున్నాము. ఒక రాయి మీద కూర్చుని బూట్లు విప్పాను. పొక్కులొచ్చి ఉన్నాయి పాదాలు. మూడు కిలోమీటర్లకి మించిన దూరము నేనెప్పుడూ నడవలేదు. కాలిపిక్కల్లో నొప్పిని నేను పైకి అనలేదు.

“ఆదత్ హోజాయేగా దీదీ!” లీల అన్నది. బూట్లు తొడుక్కుని లేచి నిలబడ్డాను. అందరూ లేచారు.


సాయంత్రపు నీరెండలో వరిచేల గట్లమీద వరుసగా నడుస్తున్న మా నీడలు మడులు దాటి సాగిపోయినాయి. ముందు నడుస్తున్న సీమ ఒకచోట మోపు దించి నిలబెట్టింది. మిగతా ఒక్కొక్కరు వచ్చి మోపులు దించి సీమ నిలబెట్టిన మోపుకి ఆనించారు. గూడులాగా తయారైంది. పక్కన కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. బడ్‌గాఁవ్ దాటింతరువాత పత్రపాలి వచ్చేముందు మరొకచోట ఈ సారి ముందు నడుస్తున్న పూర్ణ కట్టెల మోపు దించి నిలబెట్టింది. దాన్ని పట్టుకుని నిలబడింది. అంతా వచ్చి వారి మోపులు దించి నిలబెట్టి దాన్ని పట్టుకుని నిలుచున్నారు. నిలబడి రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాం.

పత్రపాలి దాటింతరువాత వెనక్కి తిరిగి చూశాను. సూర్యుడు చిరిమిరి కొండల్లోకి దిగిపోయాడు. ఇండ్లు చేరుకుని పిల్లాపాపలతో ఆడుకొని విశ్రాంతి తీసుకుంటే రేపటికి కట్టెలు అడవిలో అతడు సిద్ధంచేసి ఉంచుతాడు.

సాలవృక్షాల క్రింద మా దారులు వేరైన చోట దారి నుండి పక్కకి తొలిగి నవోదయ స్కూలుకు వెళ్ళే బాటలో నుంచున్నాను. నడిచి వచ్చిన వైపు మళ్ళా వెనక్కి తిరిగి చూశాను. అడవి కనబడలేదు. చుడిపహాడ్ మాత్రం మసకగా కనిపిస్తూ ఉన్నది.

“దీదీజీ ఆజ్ కా దిన్ హమ్‌కో బహుత్ అచ్చా లగా! కల్ బీ ఆయేగా క్యా ఆప్?” (ఈరోజు నువ్వు మాతో కలవడం మాకందరికీ చాలా నచ్చింది. రేపు కూడా వస్తావా?) లీల నన్ను దాటిపోతూ అడిగింది.

రేపు రాలేను. కాళ్ళు పుండ్లుపడి ఉంటాయి. ఎల్లుండి గురువారం. సంత రోజు. శుక్రవారం వచ్చి ఇదే సాలవృక్షాల క్రింద వేచి ఉంటానని చెప్పాను.

అడవి నాకింకా కావాలి.

[జయతి లోహితాక్షన్ అనుభవాల సమాహారం అడవి నుంచి అడవికి అన్న పుస్తకంగా వెలువడినది దాని నుంచి ఈ కథనాన్ని అందిస్తున్నాం.]
------------------------------------------------
రచన: జయతి లోహితాక్షన్, 
ఈమాట సౌజన్యంతో

No comments: