Sunday, June 23, 2019

అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం


అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం





సాహితీమిత్రులారా!

ఒకనాడు తెలుగునాట ప్రతి తల్లీ తన చిన్నారి ముద్దుబిడ్డ అన్నం తినడానికి మారాం చేస్తుంటే ఆ బుజ్జిని చంకలో వేసుకుని ఆరుబయటికి వచ్చి చంద్రుణ్ణి చూపించి
“చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటిపూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు తేవే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
అన్నిటినీ తెచ్చి మా పాపాయి కివ్వవే”
అని పాడుతూ అన్నం తినిపించే మధుర సన్నివేశం ప్రతి ఇంటా నేత్రానందాన్ని, హృదయానందాన్ని కలిగించేది. అయితే అంత చక్కటి పాటను రాసింది తాళ్ళపాక అన్నమాచార్యులని ఎవరికి తెలుసు? పాట ప్రజల్లోకి వెళ్ళినంతగా కవి వెళ్ళలేదు. అయినా పాట బతికిందీ అంటే కవి బతికినట్లే లెక్క.

పసిపిల్లల్ని ఉయ్యాలతొట్టెలోనో, కాళ్ళమీదనో పడుకోబెట్టి పాడే ఈ కింది జోలపాట కూడా అన్నమాచార్యులదే
“జో అచ్యుతానంద జోజో ముకుంద
లాలి పరమానంద లాలి గోవింద”

ఈ విధంగా ప్రజల నాల్కలపై నాట్యమాడే విధంగా, ప్రజలు పాడుకుని పరవశించటానికి అనువుగా, నిరక్షరాస్యుల్ని గాయకుల్ని చేసే విధంగా, జానపద కళారీతుల్ని ప్రతిబింబించేలా కీర్తనలు రాసి ప్రజాకవి అయ్యాడు అన్నమయ్య.

తాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. 1408లో జన్మించిన అన్నమయ్య తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు మనకు తెలిసినంతవరకు. పదహారో ఏటనే వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొందిన “పదకవితాపితామహుడు”. అన్నమయ్య మొత్తం 32వేల సంకీర్తనలు రాసాడని తెలుస్తున్నా 12 వేలు మాత్రమే దొరికాయి.
“హరి యవతారమీతడు అన్నమయ్య
ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు
భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాడు”
అని అన్నమయ్యను అతని పుత్రపౌత్రులు కీర్తించడంలో అతిశయోక్తిలేదు.

“ఏ వేల్పు సర్వేశ్వరుడే వేల్పు పరమేశు
డే వేల్పు … ఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రి విభుడు”
అంటూ తన్మయత్వంతో తనివి తీరా తెలుగు వారి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని నోరారా వర్ణించిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ అన్నమయ్య.

తనకు ముందున్న పురాణ, కావ్య పద్ధతుల్ని కాదని సరికొత్త రీతిలో సంకీర్తనా సాహిత్యాన్ని సృష్టించిన సాహితీతపస్వి అన్నమయ్య. ” If angels are asked to speak, they will speak in poetry ” అన్నట్టుగా తెలుగు కవిత్వానికి ఒక అపరదేవతామూర్తిగా అవతరించాడు అన్నమయ్య.
అతడు ఆడిన మాటెల్ల అమృతకావ్యమైంది.
పాడిన పాటెల్ల పరమగానమైంది.
ప్రతి కీర్తననీ మధురభక్తితో అలౌకికజగత్తులో రచించి ఆ సౌగంధికపుష్పాల్ని దేవదేవుని పాదాలకు సమర్పించాడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనల్లో పెళ్ళిపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళపాటలు, ఏలపాటలు, సంవాదపాటలు, తుమ్మెదపాటలు, కోలాటపుపాటలు, సువ్విపాటలు, చిందుపాటలు, తందానపాటలు.. ఇలా ఎన్నో రకాలున్నాయి. కీర్తనల్లో గల విషయాన్ని బట్టి భక్తిపాటలు, శృంగారకీర్తనలు, వేదాంతకీర్తనలు, సాంసారికకీర్తనలు, వేడుకపాటలు,.. మొదలైన విధంగా కూడా విభజించవచ్చు. ఏ విభజనకీ లొంగని పాటలూ ఉన్నాయి, అన్ని రకాలకూ చెందిన పాటలూ ఉన్నాయి.

వివిధ జానపద గేయ లక్షణాల్ని ఆకళింపు చేసుకోవటం
భగవంతునితో మమేకం చెందటం
లోకపరిశీలనాశక్తిని కలిగి ఉండటం
వాడుక భాషకు ప్రాముఖ్యత ఇవ్వటం
జీవిత తత్వ్తాన్ని విడమరిచి చెప్పటం
ఇవీ అన్నమయ్య కీర్తనల గొప్పతనానికి మూలకారణాలు. పాందిత్యప్రదర్శనలు, భాషాభేషజాలు లేని నిసర్గరామణీయకతకి ఇతని కవిత్వం నిలువుటద్దం.

అన్నమయ్య పెండ్లిపాటలు చాలా ఉన్నాయి. వాటిల్లో గంధం పాటలు, బంతులాటపాటలు, వధూవరుల పాటలు, నలుగు పాటలు మొదలైనవి ఉన్నాయి. పెళ్ళిలో ప్రతి సంఘటనా వినోదాన్ని కలిగించేదే. జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్ళీనాటి ముచ్చట్ల గురించి అన్నమయ్య “విడియో” తీసి చూపించాడు. తెలుగువారి సాంఘిక ఆచారాలకి ఈ పాటలు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
“పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత
పెడమరలి నవ్వేటి పెండ్లికూతురు
పేరుకల జవరాలె పెండ్లికూతురు, పెద్ద
పేరుల ముత్యాలమెడ పెండ్లికూతురు..”
అంటు అలవేలు మంగ అలంకార వైభవాన్ని, హావభావ విలాసాల్ని అన్నమయ్య వర్ణించినా కొంచెం అటూ ఇటూగా తెలుగువారింటి పెళ్ళికూతుర్నే దృష్టిలో పెట్టుకున్నాడు.

కృష్ణుడికీ కొండలరాయనికీ అభేదం పాటిస్తూ గొబ్బిళ్ళ పాటలు రాశాడు. మార్గశిరమాసం. బాలికలు గుమ్మాల ముందు గొబ్బిళ్ళు పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ నాట్యభంగిమలో పాడే ఈ పాట అత్యంత మనోహరం
“కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులస్వామికిని గొబ్బిళ్ళో

కొండగొడుగుగా గోవుల కాచిన
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో”
ఇందులో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపకులను రక్షించిన విధం సూచించబడింది. “కొండొక”, “వెండిపైడి”, “కొండలయ్య” వంటి తెలుగుదనం ఉండనే ఉంది.

తానే ఒక నాయికయై భగవంతునితో విరహం అనుభవిస్తున్నట్టు ఏలపాట రాశాడు అన్నమయ్య. సుదీర్ఘంగా సాగే ఏలపాట మధురభక్తికి పరాకాష్ట. అన్నమయ్య
“వేడుకుందామా వెంకటగిరి వేంకటేశ్వరుని..
ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే వాడు” అంటూ మనల్ని కూడ తన జట్టులో కలుపుకుంటాడు. మనతో నడిచివచ్చి అలిపురి, తలయేరు గుండు, మోకాళ్ళ ముడుపు మొదలైన వాటిని అక్షరీకరించి చూపిస్తాడు.
“అదివో అల్లదివో శ్రీహరివాసము”
“కొందలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు”
వంటివి ప్రచారం పొందటానికి కారణం ఛాందసమైన భక్తితత్వం కాదని గ్రహించాలి జీవనతత్వాన్ని బోధించే భక్తితత్వం ఆ కీర్తనల్లో ఉంది. వైరాగ్యచింతనతో, తాత్వికదృక్పథంతో, నిర్మలమైన ఆరాధనాభావంతో రాయటం వల్లనే అతని తలపులు తెలుగు వాడి మోక్షగృహానికి తలుపు లయ్యాయి.

సంవాదపాటలు ఎన్ని రాసినా
“రావే కోడల రట్టడి కోడల
పోవె పోవె అత్తయ్య పొందులు నీతో చాలును
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకుగొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డ వారిండ్ల
అంకెల దిరిగేవు అత్తయా”
అనే అత్తాకోడళ్ళ సంవాదపు పాట అన్నమయ్య లోకజ్ఞతని చాటి చెప్తుంది.

సువ్వి పాటలు అన్నమయ్య కీర్తనల్లో విశేషమైనవి. ఇవి దంపుడు పాటల కిందికి వస్తాయి. ధాన్యం దంచేటప్పుడు శరీరక్లేశాన్ని పోగొట్టుకోవటానికి “ఇస్‌” అనే ధ్వన్యనుకరణ శబ్దమే వేగంగా దంచుతూ అన్నప్పుడు ఆ ఊపులో “సువ్‌” అన్నట్టు వినిపిస్తుంది. అందుకే ఇలాటి పాటల్ని సువ్వి పాటలన్నారు. వీటికే “రోకటిపాటలు” అనే పేరు కూడా ఉంది.
“సువ్వి సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల
వనితలు మనసులొ కుందెన చేసిటు
వలపులు తగనించో లాల
కనుచూపులనెడి రోకండ్లను
కన్నెలు దంచెద రోలాల..”
అనే సరసమైన పాటలతో పాటు మధురభక్తి భావాలు గల సువ్వి పాటలూ వున్నాయి.

అన్నమయ్య 15వ శతాబ్దిలోనే అభ్యుదయ భావాలు గల పరమయోగి. వృత్తిపనుల్ని గౌరవించాలన్నాడు. కులభేదాలను, అంటరాని తనాన్ని నిరసించి బ్రాహ్మణుడూ, చండాలుడూ అంతా సమానులే అని ఎలుగెత్తి చాటి “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” అని బోధించిన జ్ఞాని అన్నమయ్య.
“ఎక్కువ కులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు
ఏ కులజుడేమి యెవ్వడైన నేమి
ఆకడ నాతడే హరి నెరింగిన వాడు”
అనటంలో అన్నమయ్య విశాలదృక్పథమే కాదు, మానవుడే మాధవుడన్న మహనీయసూక్తి దాగి ఉంది.

అన్నమయ్య కీర్తనల్లో ఉన్న మరొక గొప్పదనం వర్ణనావైభవం. శృంగారవర్ణనలు, వైరాగ్యవర్ణనలు, ప్రకృతివర్ణనలు, జీవితవర్ణనలు, .. అనేకం ఉన్నాయి. దేవదేవుని సౌందర్యాన్ని, అలమేలుమంగ విలాసాన్ని తనివితీరా వర్ణించాడు. జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డ పన్నెండు రాసులు ఉపమానాలుగా గ్రహించి
“ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి..” అంటూ అద్భుతంగా వర్ణించాడు.

అన్నమయ్య కవితా వైభవం అతని భాషలో ఉంది. “ఏటిలో పైరు”, “నీళ్ళు నమలు”, “జలధిలో వానలు,” “వరదం గలిపిన చింతపండు”, “పిండంతే నిప్పటికి” వంటివి ఎన్నో పలుకుబడులు. సామెతలు, సూక్తులు ఆహ్లాదం కలిగిస్తాయి. “చాంగుబళా,” “జాజర”, “తందనాన,” “పురే”, వంటి విశేషణాలు వినూత్నంగా ఉండి గానానికి ఊతం ఇస్తాయి. తెలుగుభాషలో గల స్వఛ్ఛమైన భావసంపదకీ, సహజమైన తెలుగుదనానికి అన్నమయ్య కీర్తనలు నెలవులు.  “వెన్నెలకు కొలలేదు”, అన్నమయ్య కీర్తనకి వెలలేదు.
--------------------------------------------------------
రచన: వి. సిమ్మన్న, 
ఈమాట సౌజన్యంతో

No comments: