జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం
సాహితీమిత్రులారా!
“తమతమ లోనిచూడ్కి దము దార కనుంగొను మాడ్కి నింత గా
లము నిను నీవ చూచితి తలంపున నీవును నేన కావునన్”
మనమో కవిత చదివినప్పుడు అందులో కవి చెప్పదలచుకున్న విషయం ఒకోసారి వెంటనే అర్థం కాకపోవచ్చు. అప్పుడేం చేస్తాం? కవితని మళ్ళీ చదువుతాం (ఓపికుంటే!) ఒకోసారి అందులోని ఒకటి రెండు వాక్యాలు కీలకంగా అనిపిస్తాయి. ఆ వాక్యాల ఆధారంగా ఆ కవితకి మనదైన అర్థాన్ని ఊహించుకుంటాం. అస్పష్ట కవిత్వాన్ని కూడా ఇష్టంగా చదివేవాళ్ళకి ఇది అనుభవమే! సరిగ్గా అలాగే, పైనున్న రెండు వాక్యాలూ నాచన సోమన రచించిన ‘ఉత్తరహరివంశము’ మొత్తానికీ కీలకమైన వాక్యాలుగా నాకు కనిపించాయి. ఈ కావ్యం ద్వారా నాచన సోమన చెప్పదలుచుకున్న సారమంతా యీ రెండు వాక్యాలలోనూ నిక్షిప్తమై ఉందని నా ఊహ. ఇవి శివుడు శ్రీకృష్ణునితో అనే మాటలు.
అసలీ వ్యాసం మొదలుపెట్టినప్పుడు, నాచన సోమన పద్య నిర్మాణ విశేషాలని గురించి రాద్దామనుకున్నాను. పద్యాలని ఛందోబద్ధంగా నడిపించడం మాత్రమే కాకుండా, ఆయా ఛందస్సులలో దాగున్న నిర్మాణ విశేషాలకి అనుగుణంగా పద్యాలని నిర్మించి, వాటికొక ప్రత్యేకమైన నడకని సంతరించడం మొదటిసారి, ప్రస్ఫుటంగా కనిపించేది నాచన సోమనలోనే. అయితే ఆ విశేషాలని మాత్రమే ప్రస్తావించి ఊరుకుంటే అతనికి పూర్తి న్యాయం జరగదని అనిపించింది. ఎందుకంటే నాచన సోమన వ్యక్తిత్వం దానికన్నా మరింత విస్తృతమైనది. ఈ తరం సాహితీ ప్రియులకి ముందితని గురించి ఓ విపులమైన పరిచయం అవసరమని తోచింది. అంచేత యీ వ్యాసాన్ని ఆ దిశగా మళ్ళించాను.
తెలుగు సాహిత్యంతో ఏ కాస్తో పరిచయమున్న చాలామందికి శ్రీనాథుడు, పోతన, పెద్దన వంటి కవులు తెలిసినంతగా నాచన సోమన గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇతని కవిత్వం మిగతావాళ్ళ కవిత్వం లాగా ‘ప్రజాకర్షకం’ కాదు. దీనికే మనవాళ్ళు గంభీరంగా ఉండాలని ‘ప్రౌఢ’ కవిత్వం అని పేరు పెట్టారు. ఉత్తరహరివంశం మొదటిసారి చదివినప్పుడు కొఱుకుడు పడటం కష్టమే. మరైతే అంత కష్టపడి అసలెందుకీ కావ్యాన్ని చదవాలీ అనే సందేహం తెలుగు పాఠకుడన్నవాడికి తప్పకుండా కలిగి తీరుతుంది! కేవలం సరదా కోసం, ఎంతో శ్రమ పడి, నడుచుకుంటూ, పాకురుకుంటూ కొండలెక్కే వాళ్ళని (trekkersని) ఎందుకంత కష్టపడి కొండెక్కుతారు అని అడిగితే, వాళ్ళేమి సమాధానం చెప్పగలరు? ఆ పైకెక్కే పరిశ్రమ తర్వాత, ఎత్తైన కొండ మీదనుంచి చుట్టూ విశాలంగా కనిపించే ప్రపంచాన్ని చూడటంలో ఉన్న ఆనందం అనుభవిస్తే కాని తెలియదు కదా! ఇలాటి కవిత్వాన్ని చదవడం కూడా సరిగ్గా అలాటి అనుభూతినే ఇస్తుంది.
ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేశారు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం (literalగా!). సాధారణంగా మన కావ్యాలకి మొదట అవతారిక ఒకటి ఉంటుంది. ఇందులో, కవి కృతిభర్తల గురించిన సమాచారం, కావ్య రచనా నేపథ్యం మొదలైన విషయాలుంటాయి. ఈ కావ్యానికి అలాటి అవతారిక లేదు, లేదా మనకి దొరకలేదు. అలానే, సాధారణంగా కావ్యం చివర ఉండే గద్యలో అది సంపూర్ణమైనదని చెప్పబడుతుంది. ఈ కావ్యంలో అది కూడా లేదు! అందువల్ల మనకి దొరికిన యీ కావ్యం సంపూర్ణమేనా కాదా అన్న అనుమానం ఇంకా మిగిలే ఉంది. దానికి తోడు ఆ పేరొకటి, ‘ఉత్తర’హరివంశం అని! సంస్కృతంలో ఉన్నది ఒక్కటే హరివంశం. రామాయణానికి ఉత్తరరామాయణంలా దీనికి ఉత్తరహరివంశమేదీ లేదు. ఆ సంస్కృత హరివంశంలో కథలే తెలుగు ఉత్తరహరివంశంలో కనిపిస్తాయి, అన్నీ కావు, కొన్ని. మరి దీనికి ఉత్తరహరివంశం అని సోమన ఎందుకు పేరుపెట్టాడన్నది అంతు తేలని ప్రశ్న. దీని గురించి చాలామందే సాహితీ డిటెక్టివులు పరిశోధించారు.
హరివంశాన్ని ఎఱ్ఱన కూడా తెలుగులోకి అనువదించాడు. అతను హరివంశమనే పేరు పెట్టాడు కానీ, తన తెలుగు అనువాదాన్ని పూర్వ, ఉత్తర హరివంశాలుగా విభజించాడు. పోనీ ఎఱ్ఱన ఉత్తరహరివంశ భాగాన్నే సోమన తిరిగి రచించి, దానికలా పేరుపెట్టాడా అంటే అదీ కాదు! ఎఱ్ఱన ఉత్తరహరివంశ భాగంలో కనిపించే అన్ని కథలూ ఇందులో లేవు. పైగా, అందులో లేని కథ కూడా ఇందులో ఉంది. నాచన సోమన ఉత్తరహరివంశం మొదట్లోనే “హరివంశ ప్రథమ కథాంతరమున గల వింతలెల్ల దప్పక మదిలో దిరమయ్యెగదా” అని పూర్వ హరివంశ ప్రస్తావన ఉంది. వీటన్నిటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే, సోమన కూడా పూర్వ, ఉత్తర హరివంశాలని రచించాడని అనిపిస్తోంది. నాచన సోమన ఎఱ్ఱన హరివంశాన్ని చదివి ఉంటాడన్నది వాళ్ళ కావ్యాలని పరిశీలిస్తే స్పష్టంగా కనిపించే విషయం. ఎఱ్ఱన రచన సోమనకి సంతృప్తినివ్వక పోవడం చేత, సంస్కృత హరివంశాన్ని యథాతథంగా అనువదించకుండా, అందులో కొన్ని కథలని మాత్రం తీసుకొని తనదైన సంవిధానంతో తెలుగు హరివంశాన్ని తీర్చిదిద్దాడని నా ఊహ. ఇలాటప్పుడే అనిపిస్తుంది, టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అసలు నిజాలని తెలుసుకోగలిగితే ఎంత బాగుండునో అని!
సరే, ప్రస్తుతానికి పేరు గురించి పక్కన పెట్టి, సోమన కవిత్వంలోని ప్రత్యేకతలు ఏమిటని చూస్తే నాకు కనిపించిన ముఖ్య లక్షణాలు మూడు. ఒకటి వైవిధ్యం, రెండు వక్రత లేదా వైచిత్రి, మూడవది సూక్ష్మత. ఇతర కవులనించి ఇతణ్ణి వేరు చేసేవి కూడా యీ లక్షణాలే.
వైవిధ్యం
ఉత్తరహరివంశం ఆసాంతం వైవిధ్యభరితంగా సాగే కావ్యం. ఈ కావ్యంలో ఎంత గ్రాంధిక భాష కనిపిస్తుందో అంతే వాడుక భాష కూడా కనిపిస్తుంది. పూర్తి సంస్కృతంలో ఉన్న పద్యాలూ ఉన్నాయి. అచ్చ తెలుగులో సాగే పద్యాలూ ఉన్నాయి. పద్య రచనలోనూ, నిర్మాణంలోనూ కూడా చాలా వైవిధ్యం చూపించాడు సోమన. ఉదాహరణకి యీ పద్య శైలిని చూడండి:
నెయ్యము లేని సంగతియు, నిక్కము లేని వచోవిలాసమున్
వియ్యము లేని వైభవము, విందుల సందడి లేని ముంగిలిం
దియ్యము లేని చాగమును, ధీరత లేని యమాత్యకృత్యముం
గయ్యము లేని శూరతయు, గైకొని యూరక మెచ్చవచ్చునే!
ఇంతటి ప్రౌఢ కావ్యంలోనూ, నీతి శతకంలోని పద్యంలా ఉన్న శైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే, ఈ పద్యపాదం చూడండి: “నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కలు నాకు నిండునే”.
ఇవి నరకుడు ఊర్వశితో చెప్పే మాటలు. కృష్ణశాస్త్రి తన ఊహా ప్రేయసి అయిన ఊర్వశితో అనే మాటల్లా లేవూ! పద్య రచనలో ఎన్నో రకాల నడకలు ఉత్తరహరివంశంలో కనిపిస్తాయి. ముఖ్యంగా సీస పద్యాల విషయంలో ఎంతటి వైవిధ్యం చూపించాడో వివరించాలంటే, అదే ఓ వ్యాసం అవుతుంది. ఈ కావ్యంలో ముఖ్యంగా చెప్పుకోవలసినది అందులోని కథలు, వాటి కథనం, పాత్ర చిత్రణ – వాటిల్లో సోమన చూపించిన వైవిధ్యం. ఇందులో మొట్టమొదటి కథ నరకాసుర వధ, దుష్టశిక్షణ. నరకుడు విష్ణువు కుమారుడే. విష్ణువు వరాహావతారమెత్తినప్పుడు అతనికీ భూదేవికీ పుట్టిన వాడు. అయినా రాక్షసుడు, క్రూరుడు, అహంకారి. స్వర్గాన్ని ఆక్రమించడమే కాకుండా, మునులని కూడా హింసిస్తాడు. అందువల్ల శ్రీకృష్ణుడికి అతన్ని చంపక తప్పింది కాదు. పురాణ శైలిలో మొదలయ్యే కథనం ఊర్వశీ నరకుల సంభాషణలలో నాటకీయ శైలి సంతరించుకుంటే, నరకునితో సత్యభామా శ్రీకృష్ణులు చేసే యుద్ధం కావ్య శైలిలో సాగుతుంది. ఇక రెండవ కథ విప్ర సంతానాన్ని బ్రతికించడం, అంటే శిష్ట రక్షణ. ఈ కథలో ఉండేది శుద్ధ వేదాంతం. దీని వెంటనే వచ్చే కథ, కృష్ణుడు సంతానం కోసమై శివుని గురించి తపస్సు చేయడం. ఈ రెండు కథలు చాలావరకు పురాణ శైలిలో సాగుతాయి.
నాల్గవ కథ పౌండ్రక వధ, మళ్ళీ దుష్ట శిక్షణ. ఈ పౌండ్రకుడు రాక్షసుడు కాదు. మూర్ఖుడైన రాజు. తానే దేవుడనుకుంటాడు. నిజమైన వాసుదేవుడు తానేనని చాటుకుంటాడు. భౌతికమైన, యాంత్రికమైన ఆయుధాలతో శ్రీకృష్ణుని జయించగలనని విఱ్ఱవీగుతాడు. కృష్ణునిపై దండెత్తుతాడు కానీ అతని చక్ర ధాటికి తునాతునకలైపోతాడు. ఈ కథనం కావ్య పురాణ శైలీ మిశ్రమంగా సాగుతుంది. దీని తర్వాత వచ్చే కృత్యా సంహారం మరీ విచిత్రమైన కథనం. ఇందులో మూడువంతుల ముప్పావు పాచికలాట వర్ణనే! ఈ పాచికలాట గురించిన విశేషాలు చెప్పాలంటే దానికి మరో వ్యాసం అవసరమవుతుంది.
తర్వాత వచ్చేది హంసడిభకుల కథ. ఇది కూడా దుష్ట శిక్షణే. వీళ్ళు కూడా రాక్షసులు కారు. అయినా వీళ్ళు మూర్ఖులు కారు. వీళ్ళలో హంసుడు చాలా తెలివైనవాడు కూడాను. పౌండ్రకునిలా వీళ్ళు వట్టి భౌతికమైన ఆయుధాలమీద ఆధారపడరు. శివుని మెప్పించి దివ్యాస్త్రాలని పొందుతారు. దానితో వీళ్ళలో అహంకారం పెరుగుతుంది. సన్యాసి అని దుర్వాసుని అవమానిస్తారు. రాజులందరినీ గెలిచి రాజసూయ యాగం చెయ్యాలని హాఠాత్తుగా బుద్ధిపుడుతుంది వీళ్ళకి. శ్రీకృష్ణుని కూడా కప్పం కట్టమని అతని భక్తుడయిన జనార్దనుని రాయబారం పంపిస్తారు. అప్పటికే దూర్వాస మునిని అవమానించినందుకు వాళ్ళకి శాస్తి చెయ్యాలని ఆలోచిస్తున్న కృష్ణుడికి వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లవుతుంది. కప్పం కట్టడానికి ఒప్పుకోననీ యుద్ధానికి సిద్ధం కమ్మనీ జవాబు పంపిస్తాడు. యుద్ధం చేసి హంసుడిని యమునలో ముంచేస్తాడు. అన్న చావుతో డిభకుడు కూడా యమునలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కథ మొత్తం పూర్తి నాటకీయ శైలిలో సాగుతుంది. సోమనపై తిక్కన ప్రభావం యీ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఉత్తరహరివంశంలో చివరి కథ బాణుడి వృత్తాంతం. ఇది దుష్ట శిక్షణ అనీ చెప్పలేము, శిష్ట రక్షణ అనీ చెప్పలేము! బాణుడు రాక్షసుడు. బలి చక్రవర్తి కుమారుడు, శివునికి పరమ భక్తుడు అయిన అతడిలో క్రూరత్వం లేదు. బాణుడికి ఉన్నదల్లా చేతుల తీట. అతడికి వెయ్యిచేతులుంటాయి. వాటితో యుద్ధం చెయ్యకపోతే ఎలా అని అతడి బాధ. శివుని కోసం తపస్సు చేసి ఒక మహా యుద్ధాన్ని వరంగా కోరుకుంటాడు. తన భక్తుని మూర్ఖత్వానికి నవ్వుకొని, శివుడు సరే నంటాడు. నాటకానికి పార్వతీదేవి నాంది పలుకుతుంది. బాణుడి కూతురు ఉషకి, కాబోయే భర్త ఫలానా రోజు కలలో కనబడతాడని చెపుతుంది. కలలో కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడు కనిపించడంతో అతని ప్రేమలో పడుతుంది ఉష. చెలికత్తె ద్వారా తన అంతఃపురానికి అతడిని రప్పించుకుంటుంది. ఉషా అనిరుద్ధులు ప్రేమ సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. అది తెలిసిన బాణుడు అనిరుద్ధునితో యుద్ధం చేసి అతడిని బంధిస్తాడు. అది తెలుసుకున్న కృష్ణుడు బాణుడి మీదకి దండెత్తి వస్తాడు. శివుడు, కుమారస్వామి బాణుడికి అండగా నిలుస్తారు. ఘోర సంగ్రామం జరుగుతుంది. కృష్ణుడు చివరికి బాణుడి రెండు చేతులు మాత్రం మిగిల్చి తక్కినవన్నీ చక్రంతో నరికివేసి అనిరుద్ధుణ్ణి విడిపించుకొని తీసుకుపోతాడు. యుద్ధానంతరం బాణుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి శివుని ప్రార్థించి యథాస్థితిని పొందుతాడు. అలాగే శివుని ప్రమథగణాలలో స్థానాన్ని కూడా సంపాదిస్తాడు. ఇదీ కథ! ఇది చదివితే, ఇదంతా హరిహరులిద్దరూ ఆడిన పెద్ద నాటకమని అనిపించక మానదు. ఇది పూర్తిగా ప్రబంధ శైలిలో సాగే కథ.
ఇలా ఒకే కావ్యంలో యిన్ని శైలీ భేదాలని చూపించాడు సోమన. వైవిధ్య భరితంగా సాగే ఆ కథనం అర్థమైతే, చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
వక్రత
వక్రత అంటే, చెప్పే విషయాన్ని సాధారణంగా సూటిగా కాకుండా, విభిన్నంగా చెప్పడం అని నా ఉద్దేశ్యం. ఉదాహరణకి “శ్రామికుని నెత్తురు చెమటగా కారిపోతోంది” అని చెప్పడం సాధారణ అలంకారం. అదే, “శ్రామికుని నెత్తురు ఎఱ్ఱదనం కోల్పోయి పల్చబడి ఒంటిమీంచి జారిపోతోంది” అని అంటే అది వక్రత. వక్రత చెప్పే విషయాన్ని గూర్చి అనేక కోణాలని చూపించగలుగుతుంది, కానీ కొన్నిసార్లు కవిత్వంలో అస్పష్టతకి కూడా దారితీస్తుంది. ఉత్తరహరివంశంలో అడుగడుగునా యీ వక్రత అగుపడుతుంది. చెప్పే విషయం కానీ, చేసే వర్ణనకానీ ఏదో విలక్షణతతో, వక్రమార్గం లోనే సాగించడం సోమన ప్రత్యేకత. ఉదాహరణకి యీ పద్యం చూడండి:
కుజము కుంజరముచే కూలునో కూలదో?
కూలు; కుంజరము నీ కుజము గూల్చె!
మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో?
మడుగు; పేరేటి నీ మ్రాను మడచె!
గాలునో యొకనిచే గాలదో సాలంబు?
గాలు; నీ సాలంబు గాల్చె నొకని!
దునియునో పరశుచే దునియదో వృక్షంబు?
తునియు; నీ వృక్షంబు తునిమె బరశు!
ననుచు దమలోన జర్చించు నమరవరుల
కభిమతార్థ ఫలార్థమై యంద వచ్చు
పారిజాతంబు నా మ్రోల బండియుండ
నంద గంటి నా కోర్కుల నంద గంటి!
ఇది కృష్ణుడు శివుని స్తుతించే పద్యం. పద్యం చదివిన వెంటనే ఇందులో కవి చెప్పదలచుకున్న విషయమేమిటన్నది బోధపడదు. వాక్య నిర్మాణంలోనూ, చెప్పిన విధానంలోనూ ఉన్న వక్రత దీనికి కారణం. శివుని పారిజాతవృక్షంతో పోలుస్తున్నాడు కృష్ణుడు. చెట్టు ఏనుగు చేత కూలుతుందా కూలదా? కూలుతుంది. కాని ఇక్కడ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది! అలానే తర్వాత పాదాలలో చెట్టు పెద్ద ఏరువల్ల వంగిపోవడం, అగ్ని వలన కాలడం, గొడ్డలిచేత విరగడం శివుని విషయంలో తారుమారవ్వడం కనిపిస్తుంది. మొదటి పాదంలో ప్రశ్నకి రెండవ పాదం మొదటి పదంతో సమాధానం చెప్పడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకమైనది శివుని విషయంలో జరగడాన్ని ప్రస్తావించడం ఇక్కడ పద్య (వాక్య) నిర్మాణంలో సోమన చూపించిన వక్రత. ఇదే అస్పష్టతకి దారితీస్తోంది. అలాగే ఇక్కడ ప్రస్తావించబడిన అంశాలు అర్థమవ్వాలంటే కొంత పురాణ జ్ఞానం అవసరమవుతుంది. శివుడు గజాసురుని సంహరించడం, గంగ గర్వాన్ని అణచడం, మన్మథ దహనం – ఇవి మొదటి మూడు పాదాలలోని అంశాలు, ప్రసిద్ధమైనవే. నాల్గవ అంశం శివుడు పరశువుని ఖండించడం. దక్ష యజ్ఞ ధ్వంసమప్పుడు శివుడు విష్ణుమూర్తి పరశువుని ఖండించాడని ఒక కథ ఉంది. బహుశా ఇక్కడ ప్రస్తావించినది అదే. ఈ కథలు తెలియకపోతే పద్యం అసలు అర్థం కాదు.
ఈ సందర్భంలో నన్ను ఆశ్చర్యపరచిన మరొక విషయాన్ని చెప్పాలి. విశ్వనాథ తన ‘సాహిత్య సురభి’లో యీ పద్యాన్ని గురించి రాస్తూ, ఇది శ్రీకృష్ణుని గురించిన పద్యమని వివరించారు. కానీ ఆ వివరణ సరిగా లేదు. చివరి పాదం మాత్రం తనకి అర్థం కాలేదని కూడా చెప్పారు. కావ్యంలో ఇది కృష్ణుడు శివుని గురించి చెప్పినదని స్పష్టంగా ఉంటే మరి ఎందుకలా అర్థం చేసుకున్నారో అంతుబట్టడం లేదు. విశ్వనాథ అంతటివారే, ఈ పద్యాన్ని గురించి తికమక పడ్డారా అని ఆశ్చర్యం! అలాగే మరో పద్యం చూడండి:
దనుజేంద్రుడా తలోదరి
గనుగొని చొళ్ళెంబు నిమురు గ్రమ్మున బైకొం
గనువు పఱుచు గేదగి రే
కు నఖంబుల జీఱు గులుకు గోర్కుల దేలన్
సభకి రప్పించిన ఊర్వశిని చూడగానే నరకుడు చేసిన చేష్టలివి. కొప్పు నిమరడం, పైకొంగుని సర్దడం, గేదగి రేకులని గోళ్ళతో చీరడం. నరకుడు ఎవరి కొప్పు నిమిరాడు? ఎవరి పైకొంగుని సర్దాడు? ఊర్వశివని విశ్వనాథతో సహా చాలామంది అర్థం చెప్పారు. మరి చివరనున్న గేదగి రేకులని చీరడమేమిటి? లేత చెక్కిళ్ళని గేదగి (మొగలి) రేకులతో పోల్చడం ఆనవాయితీ. నరకుడు ఊర్వశి బుగ్గ గిల్లాడన్నమాట, అని వివరించారు. బుగ్గలని చెప్పకుండా, వాటిని పోల్చే గేదగి రేకులని మాత్రమే చెప్పి ఊరుకోవడము వర్ణనలోని వక్రత. అయితే యీ పద్యాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు.
నరకుడు తన కొప్పుని నిమురుకున్నాడు. తన పైకొంగుని సర్దుకున్నాడు. తన చేతిలోని గేదగి పూరేకులని గోళ్ళతో చీరాడు. ఇవి కూడా అందమైన స్త్రీని చూస్తే రసికుడు చేసే శృంగార చేష్టలే. నిజానికి యీ అర్థమే నాకు ఎక్కువ సమంజసమనిపిస్తోంది. ఎక్కడో సింహాసనం పైనున్న నరకుడు కిందగి దిగి ఊర్వశి వద్దకి వచ్చి, ఇంకా మాటలైనా మొదలుపెట్టకుండానే ఊర్వశితో అంత చనువు తీసుకున్నాడా అని నా అనుమానం. మొత్తానికి పద్యాన్ని రెండు విధాలుగానూ అర్థం చేసుకోవచ్చు. ఇది పద్య నిర్మాణంలో ఉన్న విలక్షణత, వక్రత. ఇలా పద్యాలని ప్రహేళికల్లా నిర్మించడం చాలా చోట్ల కనిపిస్తుంది.
ఇదే వక్రత సంభాషణలలోనైతే, కాకువుని ధ్వనించి నాటకీయతకి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, తన కొడుకుని యముని బారినుంచి కాపాడలేకపోయిన అర్జునుడితో బ్రాహ్మణుడు పలికే మాటలు:
నీ వేమి సేయు దీ గాం
డీవము నీకిచ్చి యిమ్ము డెప్పరమైనన్
లావు గలదంచు బలికిన
పావకుజే గాదె కోలుపడితి కుమారున్
ఉరుమురిమి మంగలమ్మీద పడ్డట్టు, తన దుస్థితికి అగ్నిని దోషిగా నిలబెడుతున్నాడా బ్రాహ్మణుడు! ఇది సంభాషణలోని వక్రత. అర్జునుడిని నిందించే సందర్భంలో అతనికి గాండీవాన్ని ఇచ్చిన అగ్ని దేవుడిని కూడా తన నిందలోకి లాగడం, ఆ బ్రాహ్మణుడి అమాయకపు ఆవేదనని చక్కగా స్ఫురింపజేస్తోంది. ఇలాగే, హంసడిభకుల కథలో హంసుడు జనార్దనునితో చెప్పే మాటలు, జనార్దనుడు దూతగా యాదవ సభలో మాట్లాడిన మాటలు వక్రతతో నిండి వారి వారి రాజకీయ చతురతని బాగా పట్టిస్తాయి.
వర్ణన సంభాషణలలోనే కాదు, సోమన రస నిర్వహణలో కూడా వక్ర మార్గాన్ని అనుసరించడం ఆశ్చర్యకరమైన విషయం, చాలామంది విమర్శకులకి మింగుడుపడని విషయం కూడానూ! సాధారణంగా కావ్యంలో ఒక రసం ప్రథానంగా ఉండి ఇతర రసాలు దానికి సహాయంగా ఉంటాయి. ఉత్తరహరివంశంలో ఉన్నది ఒక కథ కాదు. అది కొన్ని కథల సమాహారం. అంచేత మొత్తం కావ్యమంతా ఒకటే ప్రథాన రసం ఉండడం కష్టమైన విషయం. ఇలాటి సందర్భాలలో ఒకో కథకీ ఒకో రసం ప్రథానంగా ఉండడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఇందులో అలా కూడా లేదు! ఉత్తరహరివంశంలో ప్రతి కథలోనూ అనేక రసాలు కనిపిస్తాయి. ఏ ఒక్క రసమూ ప్రథాన రసంగా కనిపించదు. ఒకే సన్నివేశంలో రెండు రసాలని సమ ప్రాథాన్యంతో నిర్వహించడం కనిపిస్తుంది. ఒకోసారి, ఒకటి ప్రథాన రసమవుతుందని సాధారణంగా అనుకునే చోట మరొక రసానికి అధిక ప్రాథాన్యం ఉంటుంది! ఇది రస నిర్వహణలో సోమన చూపించిన వక్రత. ప్రతి కథా దీనికి ఉదాహరణే. నరకాసుర వధ ఘట్టంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇందులో శృంగార వీర రసాలని రెంటినీ నిర్వహించాడు సోమన. సాధారణంగా వీర రసం ఇక్కడ ప్రథానమవ్వాలి, కానీ శృంగార రసమే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకి, సత్యభామ కొంతసేపు యుద్ధం చేశాక కృష్ణుడు సంతోషించి ఏమి చేశాడో చూడండి:
చెలువచెక్కుల నెలకొన్న చెమట దుడిచి
తరుణి నుదుట బైకొన్న కుంతలములొత్తి
రమణి కుచమధ్యమునకు హారముల ద్రోచి
పొలతిపయ్యెద కొంగు పైబొందుపరచి
ఇది చదువుతూ ఉంటే అది నరకాసునితో వాళ్ళు చేసే యుద్ధంలా కాక, ఒక శృంగార కేళిలానే అనిపిస్తుంది.
ఇలాగే, విప్ర కుమారులని రక్షించే కథలో కరుణ అద్భుత రసాలు రెండూ కనిపిస్తాయి. పౌండ్రకుని కథలో హాస్య వీర రసాలు కనిపిస్తాయి. బాణాసుర వృత్తాంతం శృంగార, వీర, అద్భుత, శాంత రసాలు పెనవేసుకు పోయిన కథ. ఉషా అనిరుద్ధుల ప్రేమ వ్యవహారమంతా ప్రబంధ ధోరణిలో శృంగార రస ప్రథానంగా సాగుతుంది. సాధారణ ప్రబంధమైతే అదే రసం చివరిదాకా నిర్వహించబడాలి. బాణుడు అనిరుద్ధుని బంధించిన తర్వాత, ఉష విరహాన్ని చిత్రించి తిరిగి వాళ్ళ కలయికతో ఆ కథ పూర్తికావాలి. కాని ఇందులో అలా జరగదు. బాణుడు అనిరుద్ధుని బంధించిన తర్వాత ఆ కథలో శృంగారానికి మరి స్థానమే ఇయ్యలేదు సోమన! ఆ తర్వాత అనిరుద్ధుని యుద్ధ వర్ణనలో వీర రసం కనిపిస్తుంది. కృష్ణుడు బాణునితో చేసిన యుద్ధమంతా అద్భుత రసంతో సాగుతుంది. చివరికి యుద్ధానంతరం ఎవరికి వారు తమ యథాస్థితిని పొంది, శాంత రస ప్రథానంగా ముగుస్తుంది. ఉత్తరహరివంశం మధ్యలో, కృష్ణుడు సత్యభామా రుక్మిణులతో ఆడే పాచికలాట, కృత్యా సంహారమూ ఒక విచిత్రమైన పద్ధతిలో సాగే కథ. ఇందులో నిజానికి ఏ రసమూ కనిపించదు!
ఇదీ సోమన రస నిర్వహణలో చూపించిన వక్రత. సోమన ఎందుకిలాంటి వక్ర మార్గాన్ని అనుసరించాడు? ఈ ప్రశ్నకి ముందుముందు సమాధానం వెతుకుదాం. ప్రస్తుతానికి సోమన మరో ప్రత్యేక లక్షణాన్ని పరిశీలిద్దాం.
సూక్ష్మత
చెప్పే విషయాన్ని చాలా క్లుప్తంగానో, గుప్తంగానో చెప్పడం సూక్ష్మత. నాచన సోమన కవిత్వ లక్షణాలలో సూక్ష్మత ఒకటంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. సోమన కవిత్వంలో శబ్దాడంబరం తప్ప మరేమీ లేదన్న విమర్శకులున్నారు. అతను ఏ విషయాన్నైనా సమగ్రంగా వర్ణించకుండా ఉండలేడు అన్న వారున్నారు. కాని, వాటి వెనక సూక్ష్మంగా, సోమన తాను చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలా ఆవిష్కరించాడో గమనిస్తే అతని కవిత్వంలోని గొప్పదనం తెలుస్తుంది. వర్ణనలలో అయితేనేమి, పాత్ర చిత్రణలోనైతేనేమి సోమన చూపిన సూక్ష్మత అనన్యమైనది. ఉదాహరణకి యీ వర్ణన చూడండి:
నరకాసుర ప్రాణ నాళోత్తరణ కేళి
రణకేళి వలకేలి రమణ జూపె
గంసదానవ శిరః కమల కృత్తన మేలు
తన మేలుచేయి పెద్దలకు నొసగె
జాణూర ముష్టిక క్షతజ కీలాలంబు
నాలంబులో నెల్ల నలవు వఱపె
ముర హయగ్రీవాంత్రమూల ఫేనావలి
నావలి దలగ జీకాకు పఱచె
వీరరససార కాసార విహరణంబు
విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప
దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి
పాఱ వెంపళ్ళు తమకెంత బంటి యనుట
ఇందులో పైకి ఎక్కువగా కనిపించేది శబ్దాలంకార ఆడంబరం. విస్తారమైన వర్ణన. కాని వాటిని దాటుకొని అందులోని భావాన్ని తరచి చూస్తే ఏం కనిపిస్తుంది? నరకాసురుని ప్రాణాలనే తామర తూళ్ళని పెరికి పారెయ్యడమూ, కంసుని శిరస్సనే పద్మాన్ని తుంచి పారెయ్యడమూ, చాణూర ముష్టికుల రక్త జలాన్ని నలుదిక్కులా చిమ్మేయడమూ, ముర హయగ్రీవుల ప్రేగులనే నురగల సమూహాన్ని చిందరవందర చెయ్యడమూను. ఇది చదివాక, సరస్సులో స్వైర విహారం చేస్తున్న ఒక మత్త గజం మనకి కనిపించక మానదు! వర్ణన ద్వారా పాఠకుల మనసులలో ఒక చిత్రాన్ని రూపుకట్టించడం కవి ప్రతిభ. ఇక్కడ సోమన ప్రత్యేకతంతా విష్ణువుని మదగజంతో నేరుగా పోల్చకపోవడంలో ఉంది. అది పాఠకుల ఊహకి వదిలివెయ్యడమే ఇందులోని సూక్ష్మత. పైకి కనిపించే శబ్దాలంకారాలకి లొంగి అక్కడే ఆగిపోక, ‘లోనారసి’ చూస్తే ఇందులో దాగిన ఆ చక్కని చిత్రం దర్శనమిస్తుంది. అలాగే మరో వర్ణన చూడండి. నరకుని వలన మునులుపడ్డ బాధలని విని కృష్ణుడు కోపించినప్పుడు అతని క్రోధాన్ని వర్ణించే పద్యమిది :
అరుణాంభోరుహ పత్రనేత్రుడు సముద్యద్భ్రూకుటీ భంగ భా
సుర ఫాలస్థలుడుం జలాచల మనశ్శూలాయమానవ్యధా
పరివేషానన భానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబనన్
నరకాలంభ విజృంభణంబు నెఱపెన్ నారాయణుండాకృతిన్
ఈ పద్యములో ‘ప్రత్యక్ష రౌద్రంబనన్’ అంటే ఏమిటి? ‘రౌద్ర రసమే సాక్షాత్కరించిందా అన్నట్టుగా’ అన్నది సామాన్యంగా చెప్పే అర్థం. రుద్రుడే, అంటే శివుడే ప్రత్యక్షమయ్యాడా అన్నది సూక్ష్మంగా కవి స్ఫురింప జేస్తున్న అర్థం. భాసురమైన ఫాలస్థలి ప్రస్తావన దీనికి మరింత దోహదం చేస్తోంది. ఇది శ్లేష కాదు. ఒక చిత్రాన్ని లీలగా ఛాయగా ప్రదర్శించడం, ఇక్కడ మరో విశేషం. ఇలాగే వర్ణన ద్వారా శివుని రూపాన్ని లీలగా స్ఫురింపజెసిన సందర్భం, ఉత్తరహరివంశంలో మరొకటి ఉంది. పౌండ్రకుని వద్దకు నారదుడు వచ్చినప్పుడు, ఆ నారదుడెలా ఉన్నాడో వర్ణించే పద్యమిది :
ప్రాలేయాంశు మరీచి నిర్మల తనూ భాగంబు కృష్ణాజిన
వ్యాలోలామల యజ్ఞసూత్రములు సంసాసక్త వీణాలతా
లాలిత్యంబు, లలాటికా రుచులు గ్రాలన్నారదుండిచ్చలం
గైలాసంబుననుండి వచ్చె గలహోత్కస్వాంతుడచ్చోటికిన్
ఈ పద్యంలో ప్రస్తావించిన చంద్రకాంతిలా(తో) తెల్లగా వెలుగుతున్న శరీరము, లలాటము చిందే కాంతులు, కైలాసము నుండి విచ్చేయడము – ఇవన్నీ కైలాసం నుండి స్వయంగా శివుడే వచ్చాడా అన్న భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇంతకుముందు పద్యంలో లాగానే ఇందులో కూడా శ్లేష లేదు. ఇక్కడ ఉన్నది ధ్వని! ఇలా వర్ణనలలో సూక్ష్మంగా అంతరార్థాన్ని ధ్వనింప జేసే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. నేను తెలుసుకోలేక పోయినవి ఇంకా చాలానే ఉండి ఉంటాయి! దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు. మల్లంపల్లి శరభయ్యగారు చేసేరని విన్నాను కాని, అది నాకు దొరకలేదు.
పాత్ర నిర్వహణలో కూడా సోమన పాత్ర స్వభావాలని వాచ్యం చెయ్యకుండా సూక్ష్మంగా ధ్వనింపజెయ్యడం గమనించవచ్చు. పాత్ర నిర్వహణలో సోమన చూపించిన సూక్ష్మతకి మంచి ఉదాహరణ పౌండ్రకుని కథ. ఇందులో పౌండ్రకుని పాత్ర ప్రవేశంలో ఉన్న యీ పద్యం చూడండి:
ఇక్కడ బౌండ్రభూపతి వివేకవిహీనత జేవ యెక్కగా
“నెక్కడి వాసుదేవు డిల నేనొకరుండన వాసుదేవుడన్
దక్కినవాడు నందక సుదర్శన శార్ఙ గదాది హేతులన్
స్రుక్కక పట్టినన్, దెసల జుట్టిన నిర్మల కీర్తి పట్టునే!”
పౌండ్రకుని మాటల ద్వారా అతని మూర్ఖత్వం ఎంత వ్యంగ్యంగా బయటపడుతోందో చూడండి! నందకము, సుదర్శనము, శార్ఙము, గద – యీ ఆయుధాలు కృష్ణునికి ఉన్నాయని చెప్పి తనకీ చేయించుకున్నవాడు పౌండ్రకుడు. వాటివల్ల తనే అసలైన వాసుదేవుడనని భావిస్తున్నాడు. కాని వాసుదేవుడని లోకమంతా నిర్మల కీర్తి ఉన్నది శ్రీకృష్ణునికే. అందువల్ల ఇక్కడ పౌండ్రకుడన్న ప్రతి మాట నిజానికి తనకే వర్తిస్తుంది, కృష్ణునికి కాదు. ఆ సంగతి ఆ సభలో ఉన్నవారికందరికీ తెలుసు. పాఠకులుగా మనకి కూడా తెలుసు. తెలియనిదల్లా పౌండ్రకునికి. దీనివల్ల అతనెంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో అక్కడున్నవాళ్ళకీ, మనకీ కూడా బాగా అర్థమవుతుంది. పౌండ్రకుని స్వభావం మొత్తం ఆ రెండు వాక్యాల్లో ధ్వనింపజేశాడు సోమన! దీనిని dramatic-irony అనవచ్చునేమో!
తాను సూక్ష్మంగా చెప్పదలచుకున్న విషయాన్ని సోమన కథాకథనమూ, రసపోషణ ద్వారా కూడా సాధిస్తాడు. దానికి ఒక ఉదాహరణ నరకాసుర యుద్ధం. దీన్ని మొదట చదువుతున్నప్పుడు నాకొక సందేహం వచ్చింది. యుద్ధానికి శ్రీకృష్ణుడు సత్యభామని ఎందుకు వెంటబెట్టుకు వెళ్ళినట్టు? కనీసం దాని గురించి వాళ్ళ మధ్యనెలాంటి సంభాషణా జరగకపోవడమేమిటి? కథ మొత్తం చదివాక ఆ సందేహం తీరిపోయింది. ఇంతకుముందే వివరించినట్టు, యీ ఘట్టమంతా చదివితే అది సత్యభామ శ్రీకృష్ణుల శృంగార కేళిలానే అనిపిస్తుంది. ఇక అప్పుడు సత్యభామ కృష్ణునితో ఎందుకు వెళ్ళినట్టు, దాని గురించి వాళ్ళ మధ్య ఎలాటి చర్చ జరగలేదేమిటి అనే ప్రశ్నలకి తావే ఉండదు కదా! కథనము, రసపోషనల ద్వారా శ్రీకృష్ణునికి నరకాసుర వధ ఒక శృంగార కేళితో సమానమని సోమన ధ్వనిస్తాడు.
ఇలాగే మరొక కథ కాశీరాజు పంపించిన కృత్యని చంపడం. ఇంతకు ముందు చెప్పినట్టుగా దీని కథనం చాలా విచిత్రమైనది – చాలా భాగం పాచికలాటే! శ్రీకృష్ణుడు సత్యభామతో పాచికలాడుతూ ఆటలో వెనకబడతాడు. ఇంతలో కృత్య ద్వారక పైకి మంటలు చిమ్ముతూ వస్తుంది. ముసలివారు కొందరు వచ్చి శ్రీకృష్ణునికి మొరపెట్టుకుంటారు. దానికి కృష్ణుడిచ్చిన సమాధానం అటు పాచికలాట పరంగా సత్యభామతో అన్నట్టూ అన్వయించుకోవచ్చు, ఇటు కృత్య పరంగానూ అన్వయించుకోవచ్చు! ఈ కథనం ద్వారా కృత్యా సంహారం శ్రీకృష్ణునికి పాచికలాటతో సమానం అన్న ధ్వనిని సోమన సృష్టిస్తాడు.
ఉత్తరహరివంశంలో నాకు కనిపించిన ముఖ్య కవిత్వ లక్షణాలని ఇప్పటిదాకా ఒకటి రెండు ఉదాహరణలతో వివరించాను కదా. అయితే, యీ కావ్యంలో వీటి ప్రాముఖ్యం ఏమిటి, అసలు సోమన యీ కావ్యంలో చెప్పదలచుకున్న పరమార్థం ఏమిటన్నదానిపై నా ఆలోచనలు ఇప్పుడు వివరిస్తాను.
కావ్య ధ్వని
ఆధునిక కవిత్వం లాగానే ప్రాచీన కావ్యాలు కూడా చాలా రకాలు. కొన్ని చదవగానే గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఆ కావ్యాలకి అనుభూతే ప్రథానం. దాని వెనక మరేదీ దాగి ఉండదు. పోతన భాగవతం, శ్రీనాథుని కావ్యాలూ దీనికి ఉదాహరణలు. మరి కొన్ని కావ్యాలు చదివినప్పుడు మనకొక అనుభూతి కలుగుతుంది. కానీ అక్కడితో ఆగిపోక, వాటిని మరికొంత లోతుగా చూస్తే అందులో కవి చెప్పాలనుకున్న మరొక అంశమేదో స్ఫురిస్తుంది. అందరికీ ఒకే అర్థం స్ఫురించాలని లేదనుకోండి! మనుచరిత్ర దీనికొక ఉదాహరణ. ఇంకొన్ని కావ్యాలు అర్థమవ్వని అత్యాధునిక కవిత్వం వంటివి. సూటిగా పాఠకుల మనస్సుని తాకే అనుభూతి వీటికి ప్రథానం కాదు. సంక్లిష్టత ప్రథానం. ఇందులో కవి చెప్పదలచుకున్న అంశం ఏమిటన్నది మరింత అస్పష్టంగా ఉంటుంది. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్లు కొన్ని కొన్ని వాక్యాలు ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమని అనిపిస్తాయి. దాని బట్టి ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకొక్కరు ఒకో రకంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఉత్తరహరివంశం ఇలాంటి కావ్యం!
ఒకటి రెండు వాక్యాలని పట్టుకొని ఒక చిన్న కవితని అర్థం చేసుకోవచ్చునేమో కాని ఒక పెద్ద కావ్యమంతటినీ అర్థం చేసుకోవడం సాథ్యమయ్యే పని కాదు. ఆ కావ్య రచన – కథ, కథనం, పాత్ర చిత్రణ, వర్ణనలు – కవి చెప్పదలుచుకున్న అంశాన్ని ధ్వనింపజేయాలి. దానినే కావ్యధ్వని అంటారు. ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి విశ్వనాథ సత్యనారాయణ ‘ఒకడు నాచన సోమన్న’ అన్న పుస్తకాన్ని రాశారు. సోమన స్థాపించాలనుకున్న విషయం విష్ణువు యొక్క పరమస్థితి అని విశ్వనాథ ఆలోచన. పరమస్థితి అంటే అతని పరమాత్మ తత్వమన్నమాట. ఉత్తరహరివంశం లోని కథల సంవిధానము, వాటి కథనము విష్ణు పారమ్యాన్ని ఎలా ధ్వనింపజేస్తున్నాయో ఆ పుస్తకంలో వివరించారు. ముఖ్యంగా నరకాసురుని కథ గురించి, జ్యోతిష పరంగా ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నరకుడు నిజానికి భూమినుంచి విడిపోయిన ఒక గోళమని, అది భూమికి దగ్గరగా వచ్చి దాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, కాల స్వరూపుడైన విష్ణువు దాన్ని ఛిన్నాభిన్నం చేయడమే నరకాసుర వధ అని కొన్ని ఆధారాలతో వివరించారు.
కాని, విశ్వనాథ ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి ఇచ్చిన వివరణ నాకు పూర్తి సంతృప్తినివ్వలేదు. ఇంకా ప్రశ్నలు మిగిలిపోయాయి. అప్పటికే ఎఱ్ఱన హరివంశం ఉంది కదా. అది విష్ణువుని పరమాత్మునిగా స్థాపించడం లేదా? మళ్ళీ పనిగట్టుకొని సోమన ఎందుకు చెయ్యాలనుకున్నాడు? పోని అనుకున్నా, పోతన భాగవతంలా భక్తి ప్రథానంగా ఎందుకు రచించలేదు? లేదా కావ్యంగా రచించాలనుకుంటే తను గురువుగా భావించే తిక్కనని అనుసరించి కావ్యమంతా నాటకీయ శైలిలో ఎందుకు రచించలేదు? తిక్కనలో లేని సంక్లిష్టత, వక్రత ఎందుకిందులో ప్రవేశపెట్టినట్టు? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. అదిగో సరిగ్గా అప్పుడే యీ వ్యాసం మొదట పేర్కొన్న వాక్యాలు మనసులో నాటుకున్నాయి:
“తమతమ లోనిచూడ్కి దము దార కనుంగొను మాడ్కి నింత గా
లము నిను నీవ చూచితి తలంపున నీవును నేన కావునన్”
ఇవి శివుడు శ్రీకృష్ణునితో అనే మాటలు. భగవంతుడు భక్తునితో చెప్పే మాటలు. తపస్సంటే ఏమిటో చెప్పే మాటలు. తమ లోపలికి తొంగి చూసుకొని, తమని తాము తెలుసుకోవడమే తపస్సంటే. అలా తపస్సు చేస్తే చివరికి ఏమవుతుంది? భగవంతుడే తాను, తానే భగవంతుడన్న పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది. శంకరుల అద్వైత మతం చెప్పేదిదే. అయితే ఇంత లోతుగా ఆలోచించనప్పుడు, శివుడు మాటలు మరోలా అర్థమవుతాయి. శివుడు కృష్ణునితో “నీవును నేన కావునన్” అని అన్నాడు. అంటే శివుడూ కృష్ణుడూ ఒకటే. ఇది శివ కేశవుల అద్వైతం. ఈ మాటల్లో రెండు రకాల అద్వైతాలు మనకి కనిపిస్తున్నాయన్న మాట. పైకి కనిపించేది శివకేశవుల అద్వైతమైతే, మరొక రకంగా చూస్తే కనిపించేది జీవ పరమాత్మల అద్వైతం. నిజానికి యీ రెండూ కూడా ఒకటే. అద్వైత సిద్ధాంతంలోనే శివకేశవులకి అభేదం చెప్పబడింది.
ఉత్తరహరివంశం లోని పరమార్థం ఇదేనని నాకనిపించింది. హరిహరుల అభేదం ద్వారా, అద్వైత మతాన్ని స్థాపించడం నాచన సోమన ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కావ్యమంతా శ్రీకృష్ణుని కథలే అయినా, ఇందులో చాలా చోట్ల కనిపించే శివుని ప్రసక్తి నా ఆలోచనని బలపరుస్తోంది. కావ్యం మొదట్లోనే బలరాముని గురించిన వర్ణన ఒకటుంది.
పాతాళాధిపుడైన శేషుడు ప్రలంబఘ్నుండు నారాయణ
ప్రీతిం బుట్టిన శంకరుండని జనుల్ పేర్కొన్నచో నంధకో
ద్భూత స్నేహము గామపాలతయు దప్పుం దప్పుగాకేమి ప్ర
ఖ్యాతిం బొందడె పాండురాంగ మహిమన్ హాలాహలస్వీకృతిన్
బలరామునికి శివుడితో పోలిక చెప్పాడు. అదీ ఎంత వక్రతతో చెప్పాడో చూడండి! నారాయణుడు తాను కృష్ణావతారమెత్తుతూ తనకెంతో ప్రీతిపాత్రుడయిన శంకరుని బలరామునిగా జన్మించమన్నాడని ప్రజలు అనుకుంటారట. కాని అలా అనుకుంటే అంధక స్నేహము (అంధకుడు శివుడు చంపిన ఒక రాక్షసుడు, ఇది శివుని పరంగా. అంధకులన్న తెగ యాదవులకు మిత్రులు, ఇది బలరాముని పరంగా), మన్మథునిపై (ప్రద్యుమ్నుడు) చూపిస్తున్న ప్రేమ ఎలా కుదురుతాయి? అది కుదరకపోతే మాత్రమేం. తెల్లని శరీరం కలిగి ఉండడం, హాలాహలాన్ని (బలరాముని విషయంలో నాగలి, శివుని పరంగా విషము) ధరించడం అన్న విషయాలతో ప్రఖ్యాతిని పొందాడు కదా. ఇదీ అర్థం! ఈ సందర్భంలో బలరామ వర్ణన సంస్కృత హరివంశం లోనూ, ఎఱ్ఱన హరివంశంలో కూడా ఉంది. కాని అక్కడ శంకరునితో పోలిక లేదు. ఇది సోమన కోరుండి ప్రత్యేకంగా చేర్చినది.
ఉత్తరహరివంశం కథలలో, రెండిటిలో తప్పించి అన్నిటిలోనూ శివుని పాత్ర కనిపిస్తుంది. శివుడు కనిపించని రెండు కథలూ నరకాసుర వధ, పౌండ్రక వధ. అయితే ఇంతకుముందే వివరించినట్టుగా, నరకాసుర వధలో శ్రీకృష్ణుని వర్ణనలోనూ, పౌండ్రకుని కథలో నారదుని వర్ణనలోనూ శివుడు మనకి సూక్ష్మంగా దర్శనమిస్తాడు. ఉత్తరహరివంశంలోని కావ్య ధ్వని అద్వైతమే అన్నదాన్ని బలపరిచే మరొక దృష్టాంతం హంస డిభకుల కథలో కనిపిస్తుంది. హంస డిభకులు దూర్వాసుని అవమానపరిచడానికి కారణం, అతను గృహస్థాశ్రమాన్ని కాదని సన్యాసాన్ని ప్రచారం చేస్తున్నాడని. ఎఱ్ఱన హరివంశంలో లేని యీ కథని ప్రత్యేకించి సోమన తెలిగించాడు. సన్యాస స్వీకారాన్ని ప్రోత్సహించేది అద్వైత మతమే! అంటే హంస డిభకులు అద్వైత మతాన్ని విరోధించినందుకే కృష్ణుడు వాళ్ళని సంహరించాడని సోమన ఉద్దేశ్యమన్న మాట!
హంస డిభకుల కథలోనూ, బాణాసుర వృత్తాంతంలోనూ శివుని కన్నా శ్రీకృష్ణుడే అధికునిలా కనిపిస్తాడు. కాని తరచి చూస్తే వారిలో బయటకి కనిపించే తారతమ్యాలతో బాటు, మూల తత్వం ఒకటే అన్న విషయం కూడా ధ్వనిస్తుంది. ఈ అంశాన్ని ముందుగా, స్పష్టంగా స్థాపించే కథ శ్రీకృష్ణుడు శివుని గురించి తపస్సు చేసిన కథ. హరిహరుల అభేదాన్ని యీ పద్యం ఎంత అద్భుతంగా రూపుకట్టిస్తోందో చూడండి. ఇది శివకేశవులు ఒకరినొకరు కలుసుకున్నప్పటి దృశ్యం:
ఇత్తెఱగున నయ్యిరువురు
చిత్తముగతి నొడలు గలసి సిద్ధాంత పరా
యత్తులగు మునుల యెఱుకకు
విత్తై చెలువారె జమిలి వేల్పని తెలుపన్
‘జమిలి వేలుపు’ ఎంత చక్కటి తెలుగు పదం! శివకేశవుల పెనవేత, వాళ్ళు ఇద్దరు కాదు ఒకరే అన్న భావాన్ని ‘జమిలి వేలుపు’ (వేలుపులు కాదు, ఒకటే వేలుపు) అనే పదం అద్భుతంగా ధ్వనింపజేస్తోంది. చివరిదైన బాణాసుర వృత్తాంతముతో యీ జమిలి వేలుపు తత్వం పరమావధి సాధించింది. ఎఱ్ఱన హరివంశం విష్ణు పారమ్యాన్ని చాటేదే కాని అద్వైతాన్ని స్థాపించేది కాదు. అయితే, భక్తి ప్రథానంగానో లేక పూర్తి కావ్య శైలిలోనో ఎందుకు రచించలేదు అన్న ప్రశ్న ఇంకా మిగిలుంది. ఇంతటి వైవిధ్యమూ, వక్రత, సూక్ష్మత ఎందుకు తన కావ్యంలో ప్రవేశపెట్టాడు? రస నిర్వహణలో సాధారణ మార్గాన్ని అనుసరించకుండా కలగాపులగంగా ఎందుకు సృష్టించాడు?
ఈ ప్రశ్నలన్నిటికీ నాకు తోచిన జవాబు ఒకటే. సోమన తన కావ్యంలో చెప్పదలచుకున్న పరమార్థానికి అనుగుణంగానే ఇలాటి రచన చేశాడని. అద్వైత మతం శుద్ధ వేదాంతం. జ్ఞాన ప్రథానమైనది. దీనిని అర్థం చేసుకోవాలంటే, అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, భక్తి మార్గం సరిపోదు. రసానుభూతికి స్థానం లేదు. ఏ రసమూ, ఏ అనుభూతీ లేని ఒక స్థిర చిత్తం అవసరం. ఈ కావ్యం పాఠకుని మనసుని అలాటి స్థితివైపు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానికి సహాయపడేవే ఇందులోని వైవిధ్యం, వక్రత, సూక్ష్మత లక్షణాలు. ఎక్కడికక్కడ ద్వంద్వాలని చూపిస్తూ, దానికి శ్రీకృష్ణుడు ఎలా అతీతుడో వర్ణిస్తూ, అద్వైత మతాన్ని స్థాపించాడు సోమన. అందుకే యీ కావ్యంలో ఏ రసమూ నిజానికి రస స్థాయిని చేరుకోదు. చేరుకునే లోపలే పాఠకుని మనస్సుని వేరే వైపుకి మళ్ళిస్తాడు సోమన. ఎలా అయితే ఆధునిక జీవిత సంక్లిష్టతని ప్రతిబింబించడానికి కొందరు కవులు కవిత్వంలో అనుభూతికన్నా సంక్లిష్టతకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారో, అదే రకంగా క్లిష్టమైన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడం కోసం రసం కన్నా వక్రతకీ వైచిత్రికీ, తద్వారా సంక్లిష్టతకీ స్థానమిచ్చాడు సోమన. ఎలా అయితే కొందరు ఆధునిక కవులు దీనికోసం వ్యాకరణాన్ని తోసిరాజన్నారో, అలాగే నాచన సోమన అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న రస సిద్ధాంతం వంటి అలంకార శాస్త్రాలని తోసిరాజన్నాడు! కాకపోతే యీ సంక్లిష్టతకి శబ్ద సౌందర్యమనే చక్కెర పూత పూసి మనకీ కావ్యాన్ని అందించాడు.
అయితే అద్వైతమతాధారంగా, పూర్తి కావ్య శైలిలో కూడా కావ్యాన్ని నిర్మించవచ్చు. కొంతవరకూ తిక్కన చేసినది ఇదే. మరి సోమన ఎందుకలా చెయ్యలేదు అన్న అనుమానం ఇంకా పూర్తిగా పోదు. తనలా చెయ్యలేకనా? అలా అనుకోడానికి వీలు లేకుండా, హంస డిభకుల కథని అద్భుతమైన నాటకీయ శైలిలో నిర్మించాడు. కాబట్టి దీనికి వేరే కారణమేదైనా ఉండాలి. నాకు తట్టిన కారణం యిది. అతనీ కావ్యాన్ని ఉద్దేశించిన పాఠకవర్గం వేరు, తిక్కన పాఠక వర్గం వేరు. తిక్కన, కాస్తంత సాహిత్య పరిచయం ఉన్న సాధారణ పాఠకుల గురించి భారత రచన చేస్తే, నాచన సోమన కవులనీ, పండితులనీ, తత్త్వజ్ఞులనీ ఉద్దేశించి యీ ఉత్తరహరివంశం రచించాడనిపిస్తుంది. అలాటి పాఠకులే ఇలాంటి కావ్యాన్ని అర్థం చేసుకోగలరు. మరి కవి తాను ఉద్దేశించిన పాఠకులని యీ కావ్యం ఎంతవరకూ ప్రభావితం చేసిందో మనకి తెలియదు. అయితే నాచన రచనా శైలి చాలామందిని చాలా రకాలుగా ప్రభావితం చేసిందన్నది స్పష్టం. శ్రీనాథుడు, పోతన, తెనాలి రామకృష్ణుడు దీనికి సాక్ష్యం.
ఇక్కడ నేను వివరించిన విషయాలన్నీ, కేవలం ఉత్తరహరివంశం ఆధారంగా నేను చేసిన ఊహలే. వీటికి చారిత్రక ఆధారాలని వెతకడం అవసరం. ఉత్తరహరివంశానికి అవతారిక ఉండి అది మనకి దొరికితే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవచ్చు. తెలుగు పరిశోధకులెవరైనా యీ విషయమ్మీద దృష్టిపెడితే బాగుంటుంది.
ఉపయుక్త గ్రంథములు:
ఉత్తర హరివంశము – నాచన సోమనాథుడు
ఒకడు నాచన సోమన – విశ్వనాథ సత్యనారాయణ
నాచన సోమనాథుడు కావ్యానుశీలనము – నడకుదిటి వీరరాజు పంతులు
ఆంధ్రవాఙ్మయమున నాచన సోమనాథుని కీయదగిన స్థానము – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
నాచన సోముని నవీన గుణములు – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
ఎఱ్ఱన నాచన సోమనల కవితా తారతమ్య పరిశీలన – ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర రావు
హరివంశము – ఎఱ్ఱన
-------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు,
ఈమాట సౌజన్యంతో