Sunday, July 29, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 6


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 6






సాహితీమిత్రులారా!
మంత్రి మహిషం 10
నువ్వు ఒళ్ళు విరుచుకుని పండించిన ధాన్యాన్ని ఎత్తుకు పోవచ్చే అధికారులు నీకు అన్నలా? తమ్ముళ్ళా? అంటూ మహిషానికి మరో బంధుత్వం అంటగడుతున్నాడు మంత్రి!

ఉన్మత్తా ద్రవిణాధికార వశత స్స్తంభం గతా దుర్గుణైః
సంజాతా వృషలేశతో విరచితా న్యాయా విభూత్యాదృతాః
కేచి చ్ఛృంగ భృత శ్చ సంప్రతి సుబేదారా ధమాః కాసర
జ్యేష్ఠాః కిం భవతో? వద త్వ మధనా సత్యం సనిష్ఠా ఇమే

కాసర రాజా! ఈ సుబేదారులనే అధములకు నీ పోలికలే కనిపిస్తున్నాయి. వీళ్ళూ నీ కన్నలా? తమ్ముళ్ళా? ఎందుకంటున్నానంటే, నీకున్న బలం వల్ల అనేక విధాల గొంతెత్తి అరుస్తూ (ఏదైన గేదెను చూచినప్పుడు మరీనూ!) వెర్రెత్తినంటుంటావు. వాళ్ళేమో డబ్బు, అధికారం తమ చేతిలో ఉన్నాయి కదా అని వెర్రెత్తి వున్నారు. నువ్వు, మొరటైన తాళ్ళతో కట్టడ వల్ల కట్రాటకు కట్టుబడి వున్నావు. వాళ్ళు దంభం, అహంకారం వంటి దుర్గుణాల పాలై, బిగుసుకు పోయి వున్నారు. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అనే జ్ఞానం నశించి మసలుతున్నారన్న మాట! ఏపాటి కొద్ది పుణ్యం వల్లనో ఇలా పుట్టేవు. నువ్వు, నిన్ను పోషించే రైతులకు ఆదాయాన్ని పుష్కలంగా సమకూర్చి ఐశ్వర్యంతో తులతూగుతూంటే, వాళ్ళు సచ్ఛూద్ర వంశాలలో పుట్టి అన్యాయాలు చేస్తూ, లంచాలు పట్టి డబ్బు సంపాదించి, ధనవంతులయ్యారు. నీకు కొమ్ములే వున్నాయి. వాళ్ళకు అధికార చిహ్నంగా కొమ్మువాద్యముంది. (అంటే వారు వస్తూంటే అధికార చిహ్నంగా ఆ వాద్యం వినవస్తుంది.) పోలికలు సరిపోయి, నాకు అలా అనిపించింది. (శ్లోకంలో కవి వాడిన పదాలు రెండర్థాలు సూచిస్తున్నాయి.) అయినా దున్నపోతుది ఉత్తమస్థానమే! దున్నపోతుతో మంచిమాటలాడుతూ, తనకు ద్రోహం చేసిన సుబేదారును యముడికి పట్టియ్యి అని ప్రార్థిస్తున్నాడు మంత్రి.

తృణ్యాదాన జలావగాహన తనూ సంఘర్షణాది క్రమైః
కామం సైరిభ రాజరాజ భవత స్సేవా మకారం చిరమ్
ఏతావ త్వ్తహ మర్థయే పితృపతిం దేవం త్వదారోహణం
క్షిప్రం ప్రాపయ సన్నిధిం నను సుబేదారస్య మ ద్ద్రోహిణః

నీకు గడ్డివేసి, నీరు పోసి, నీ ఒళ్ళు మురికిపోయే లాగ తోమి, స్నానం చేయించి అనేక విధాలుగా చాలాకాలంగా నీ సేవ చేస్తున్నాను. దున్నపోతు రారాజా! నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను. నాకు ద్రోహం చేసిన సుబేదారు దగ్గరకు, నిన్ను వాహనంగా వాడుకొనే యమధర్మరాజును తొందరగా తీసుకువెళ్ళు. (సుబేదారు నాకే కాదు, నీ శ్రమను దోచుకు పోయాడు కనుక నీకూ ద్రోహే!)

మంత్రి – మహిషం – 11

మంత్రి మానసికంగా ఎంతగా రగిలిపోతున్నా, తనకు సహజంగావున్న వ్యంగ్య హాస్య ప్రవృత్తిని విడిచిపెట్టకుండా, మహిషంతో ఇలా అంటున్నాడు.

క్షుద్బాధాం యది యాసి కాసరపతే
తర్హీదు మాకర్ణ్యతా
మస్మాభి ర్హి తృణీకృతాన్` భువి సుబే
దారాన్` సుఖం భక్షయ
నిస్సారా నపరాధ లేశ రహితా
నేతాన్ పలా లోత్కరా
న్నిత్యం భక్షయతా త్వయా క ఇహ హా
లోకోపకారో భవేత్`.

మహిష ప్రభూ! నీకు ఆకలి వేస్తే నా దృష్టిలో గడ్డిపరకలతో సమానులైన, సుబేదారుల్ని హాయిగా తిను. నేను చెప్పేది విను. ఇలా చేస్తే లోకోపకారం చేసిన ఖ్యాతి నీకు దక్కుతుంది. గడ్డికి రుచీ, పచీ లేదు. పాపం గడ్డిపరకలు ఏ తప్పిదం చేయనివి. వీటిని ఎప్పుడూ తినే నువ్వు, తప్పిదాలు చేయడం తప్ప మరొకటి ఎరగని సుబేదారుల్ని తిన్నావంటే, లోక కంటకుల్ని తొలగించినట్టే లెక్క! పైగా నువ్వు కాసరపతివి! తృణప్రాయుల్ని తినేసే హక్కు సహజంగా నీకుంది అని మంత్రి ఆంతర్యం. ఆ సంగతి అలా వుంచవయ్యా, రాజ సభలో ప్రవేశించి ఠీవీగా కూర్చో, నీకేమి తక్కువ? అంటూ మహిషాన్ని ప్రోత్సహిస్తున్నాడు మంత్రి –

కర్షం కర్ష మహర్నిశం వసుమతీం
క్లి శ్నాసి కిం కాసర?
త్వం సభ్యై రధునాతనై ర్నృప సభం
సాకం సుఖే నా వస,
న జ్ఞానం న చ మే స్తి కౌశల
మితి వ్యర్ధాం మతిం మా కృథా
స్త్వత్తో మూఢతమా ఇమే; భవసి హి
త్వం తేషు వాచస్పతిః.

దున్నపోతా! రాత్రీ పగలూ భూమిని దున్నుతూ శరీరాన్నెందుకు కష్టపెట్టుకుంటావు? నన్నడిగితే, ఈనాటి రాజసభలో కూర్చునే సభ్యులతో సుఖంగా కలిసి, కూర్చో. “నా కంత జ్ఞానం లేద”నో, “నాకంత నేర్పరితనం లేద”నో అనవసరపు ఆలోచనకు తావివ్వకు. వీళ్లు నీకంటె మూర్ఖులు. నిజం చెప్పాలంటే, వాళ్లలో నువ్వే బృహస్పతివి! సందేహించకు కానియ్యి.
మంత్రికి ఆనాటి రాజసభలను “అలంకరించే” సభ్యుల బుద్ధి విశేషం మీద అంతటి అభిప్రాయం వున్నదన్న మాట! దున్నపోతులను మించిన జ్ఞానశూన్యులు “సభ్యులు” గా చెల్లిపోతున్నారని మంత్రికి ఆవేదన!!
--------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments: