Saturday, April 28, 2018

చందవరదాయి


చందవరదాయి
సాహితీమిత్రులారా!హిందీ సాహిత్యంలో చందవరదాయి కవిజీవితం గురించి,
అతని బృహత్కావ్యం పృథ్వీరాజ రాసో గురించి లెక్కలేనన్ని
వివాదాస్పదమైన అభిప్రాయాలున్నాయి. భారతదేశ చరిత్రలో 
సుప్రసిద్ధ చక్రవర్తి పృథ్వీరాజ చౌహాన్(12శ.), చందవరదాయి 
సమకాలికులేకాక, ఒకేరోజు ఒకే ప్రదేశంలో జన్మించారని, 
మరణించారని జనశ్రుతి. చందవరదాయి జన్మస్థానం లాహోర్ 
అని, ఈయన భట్ట బ్రహ్మణ వంశం వాడని ప్రచారంలో ఉంది.
చందవరదాయి పృథ్వీరాజు ఆస్తానకవి మాత్రమేకాదు సఖుడు, 
సామంతుడు కూడా. షట్ - భాషా వ్యాకరణాలు, కావ్యం, సాహిత్యం, 
ఛందశ్శాస్త్రం, జ్యోతిష్యం, పురాణం, నాటకం వంటి ఎన్నో ప్రక్రియల్లో
ఈయన అందెవేసిన చేయి. రాజ సభలోనూ, రణరంగంలోనూ, మృగయా వినోదంలోనూ, యాత్రల్లోనూ కూడా పృథ్వీరాజు వెంట చందవరదాయి సదా ఉండేవాడు. మహమ్మద్ గోరి పృథ్వీరాజును బంధించి తనతోబాటు గజనీ నగరానికి తీసుకువెళ్ళినపుడు చందవరదాయి కూడా వెంటవెళ్ళాడం, పథకం ప్రకారం అక్కడ పృథ్వీరాజు చేత శబ్దభేది బాణంతో మహమ్మదును చంపించి, ఆ వెంటనే మిత్రులిద్దరూ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని మరణించారనే కథ బహుళంగా వ్యాపించింది. ఆ రకంగా గజనీ నగరానికి వెళుతున్నపుడు అసంపూర్ణంగా ఉండిపోయిన తన కావ్యం పృథ్వీరాజ రాసోను తన పదిమంది  కొడుకుల్లో  ఒకరైన జల్హణునికి ఇచ్చి పూర్తి చేయించినట్లు కథనం. అయితే, మరోవర్గం  విద్వాంసులు చందవరదాయి ఉనికిని స్వీకరించకపోయినా, కావ్యాన్ని అప్రమాణం అన్నా కూడా పృథ్వీరాజ రాసో కావ్యం మాత్రం హిందీలోని ఆది కావ్యంగా మన్ననలు అందుకుంటూనే ఉంది. 
ఇది ప్రధానంగా పృథ్వీరాజు శృంగారాలకు సంబంధించిన రచన. ఆనాటికి అనుకూలంగా కవి స్త్రీ సౌందర్యవర్ణనను, నాయకుడు, ఆమెను వివాహమాడటానికి ఒక యుద్ధకల్పనము చేశాడు. ఇందులో సుమారు 50-60 యుద్ధవర్ణనలూ, వివాహవర్ణనలూ చేసినా పునరుక్తి దోషం లేదు. ఏరకమైన వర్ణన అయినా కవిది అందెవేసిన చేయి. నగరాలు, ఉద్యానవనాలు, కోటలు, సరోవరాలు, యుద్ధాలు, స్త్రీ - పురుష వర్ణనలు, సేనలు, అలంకరణలు ఇలా స్థావర జంగమాలనన్నిటినీ పదేపదే వర్ణించినా అటుకవికిగాని, ఇటు పాఠకునికిగాని విసుగు అనేదే రాదు. పద్మావతి, సంయుక్త మొదలైన నాయికలు అందరూ అపురూప సౌందర్యరాశులు.అలాగే నాయకుడు పృథ్వీరీజు సర్వగుణ సంపన్నుడైన చారిత్రక నాయకుడు. సౌందర్యం, శౌర్యం, దానం, క్షమ వంటి గుణాలన్నీ ఇతనిలో నిండి ఉన్నాయి. కవి యుద్ధ-శౌర్య వర్ణనల్లో వీరరసం చొప్పించాడు. సౌందర్యవర్ణన, వయః సంధి, అనురాగం, ప్రథవీక్ణం మొదలైనవాటిలో శృంగారం చిప్పిల్లుతుంది. ప్రసంగానుకూలంగా తదితర రసాలూ చోటుచేసుకున్నాయి.

         కావ్యంలోని భావ సౌందర్య వృద్ధికి కవి అనుప్రాస, యమక, శ్లేష, వక్రోక్తి, ఉపమ, రూపక, అతిశయోక్తి వంటి అలంకారాల నెన్నిటినో ఎన్నుకున్నాడు. అసలు అలంకార శాస్త్రమే గోచరిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఈ కావ్యంలో 68 రకాల ఛందస్సులు ప్రయోగించడం నిజంగా ఆశ్చర్యమే. విమర్శలెన్ని తలెత్తినా ఇన్ని గుణాలను సంతరించుకున్న ఈ గ్రంథం  హిందీలో తొలి మహాకావ్యంగానూ, చందవరదాయి తొలికవిగానూ మన్ననలు అందుకోవటం సహజమే.

No comments: