Friday, May 20, 2016

కమల బాంధవుడేతేర కలువ విచ్చె


కమల బాంధవుడేతేర కలువ విచ్చె


సాహితీమిత్రులారా!

ప్రశ్నలు సమాధానాలు ఒకే పద్యంలో ఉంటే
దాన్ని "అంతర్లాపిక ప్రహేలిక" అంటారు.
ఇలాంటివి ముందు కొన్ని తెలుసుకొని ఉన్నాము.
ఇక్కడ మరొకటి చూద్దాం.

విష్ణుదేవుని పత్నియై వెలయునెవతె
ఎవ్వరేతేర పాద్యాదు లిచ్చుచుంద్రు
హిమకరుడు పుట్టగా, రాత్రి ఏది వచ్చు
కమలబాంధవుడేతేర కలువవిచ్చె

1. విష్ణుపత్ని ఎవరు?
2. ఎవరు వస్తే పాద్యాదులు ఇస్తూ ఉంటారు?
3. హిమకరుడు(చంద్రుడు) పుట్టగా రాత్రి విచ్చేది ఏది?
కమల బాంధవుడు - సూర్యుడు,
ఏతేర - రాగా,
కలువవిచ్చె - కలువ వికసించింది -
విపరీతమైనదికదా!
ఎలాసాధ్యం?

దీనిలోని చిక్కును విడదీయడం ఏమిటి అంటే
చివరి పాదంలోని పదాలను
కమల- బాంధవుడేతేర - కలువ విచ్చె -
అని విడదీస్తే పై ప్రశ్నలకు సమాధానాలు
వరుసగా సరిపోతాయి.
చూడండి.

1. విష్ణుపత్ని ఎవరు?  - కమల (లక్ష్మి)
2. ఎవరు వస్తే పాద్యాదులు ఇస్తూ ఉంటారు?  - బాంధవుడేతేర (బంధువురాగా)
3. హిమకరుడు(చంద్రుడు) పుట్టగా రాత్రి విచ్చేది ఏది? - కలువ విచ్చె (కలువపూవు వికసించింది)

No comments: