Tuesday, May 31, 2016

వర్గపంచరహిత పద్యం


వర్గపంచరహిత పద్యం


సాహితీమిత్రులారా!

హల్లులలో క - వర్గము, చ - వర్గము,ట - వర్గము,
త - వర్గము,ప - వర్గము అని 5 వర్గాలు.
క - మొదలు మ - వరకు ఉన్న హల్లులు కాకుండా
మిగిలిన హల్లులను ఉపయోగించి పద్యం కూర్చడం
వర్గపంచకరహితము.

హార,హీర, సారసారి, హారశైల, వాసవో
ర్వీరుహా, హిహార, శేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం
హార! సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా
                                            (కావ్యాలంకారసంగ్రహము 5-245)

(హీరము - మణి, సారసారి - చంద్రుడు,
హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,
యాశసాంశుశీల - కీర్తికాంతులచే ఒప్పువాడు,
సూర్యహర్యవార్య సాహసా - సూర్యుని అశ్వములచేతను
వారింపరాని (చొఱవగల) సాహసము కలవాడా)

ఈ పద్యంలో క - మొదలు, మ - వరకు గల హల్లులు
ఏవికూడ వాడలేదు
కావున
ఇది వర్గపంచకరహిత పద్యమైనది.
ఇది శబ్దచిత్రంలోని ఒక రకము.

హనుమజ్జయంతి శుభాకాంక్షలు

హనుమజ్జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు 
హనుమజ్జయంతి శుభాకాంక్షలు

తరుణార్క కబళనోద్ధతిణ జూపెనెవ్వాఁడు రుచులచే ఫలమోహరుచులచేత
నకలంకరామముద్రికఁ బూనె నెవ్వాఁడు శయముచే హృత్కుశేశయముచేత
మున్నీరుఁ బల్వలంబుగ దాఁటె నెవ్వాఁడు జవముచే గుణగణార్జవముచేత
నక్షశిక్షాప్రౌఢి నలరారె నెవ్వాఁడు రణముచే నియమధారణముచేత
ధరణి నెవ్వాఁడు దానవద్విరదదళన
విహృతిఁ దనకేసరికిశోరవృత్తిఁ దెలిపె
నతని మత్కావ్య భవ్యవాగమృతఘటన
మంజులస్వాంతు హనుమంతు మదిఁదలంతు
                                                 (వసుచరిత్ర 1-8)
(బాల్యమున సూర్యుని మ్రింబోయి అమానుష శక్తినిసాటి, 
సీతాన్వేషణమునకు శ్రీరామమగద్రికను గైకొని స్వామికార్యనిర్వహణ శక్తిని ప్రకటించి, 
సముద్రమును పడియవలెదాటి జవాతిశయమును సువ్యక్తమొనరించి, 
అక్షకుమారాది రాక్షసుల దునిమి 
సంగ్రమనైపుణ్యమును ప్రకటించిన రాక్షసదంతావళులకు 
కేసరికికిశోరమగు 
ఆంజనేయునకు కవి 
మధురకవితార్థియై
నమస్కరించుచున్నాడు.) 


Monday, May 30, 2016

హ్రస్వ ఏక స్వరచిత్రం


హ్రస్వ ఏక స్వరచిత్రం


సాహితీమిత్రులారా!

దీర్ఘ ఏక, దీర్ఘ ద్వి స్వర చిత్రాలను చూశాముకదా
ఇప్పుడు హ్రస్వ ఏక స్వరచిత్రం చూద్దాం.
హ్రస్వమైన ఒకేఒక స్వరాన్ని ఉపయోగించి పద్యం
కూర్చటాన్ని హ్రస్వ ఏక స్వరచిత్రం అంటారు.
ఇందులో స్వరం ఒకటే ఉంటుంది కాని వ్యంజనాలు
ఏవైనా ఉండవచ్చు.
ఇక్కడ స్వరం యొక్క దీర్ఘ, హ్రస్వములేకాని
గురు లఘువులతో సంబంధంలేదు.


ఉరుగుం ద్యుగురుం యుత్సు చుక్రుశు స్తుష్టువు: పురు
లులుభు: పుపుర్షుర్ముత్సు ముముహుర్ను ముహుర్ముహు:
                                                                   (సరస్వతీకంఠాభరణము - 2 - 276)

(విలువైన వాక్కులు గల దేవతా గురువైన బృహస్పతిని
యుద్ధములందు భటులు శరణు కోరిరి మిక్కిలి స్తుతించిరి
మోదములందు లోభమును పొందిరి పుష్టినొందిరి
మరి మాటి మాటికిని మోహము నొందిరి.)

ఇందులో హ్రస్వ "ఉ" - కారమును ఒక్కదానినే
మొదటినుండి చివరవరకు ఉపయోగించారు.
ఒకే స్వరము అదియు హ్రస్వము ఉపయోగించుట
వలన ఇది హ్రస్వ ఏక స్వరచిత్రమగుచున్నది.

మున్నూరు తలలవాడు మిమ్ము ధన్యుజేయు


మున్నూరు తలలవాడు మిమ్ము ధన్యుజేయు


సాహితీమిత్రులారా!

ఈ పద్యం గమనించండి.

పదియు, నైదు, నైదు, పదునైదు, పదునైదు,
ఇరువదైదు, నూట యిరువదైదు,
ఎలమి మూడు నూరు, లిన్నూరు, మున్నూరు,
తలలవాడు మిమ్ము ధన్యు జేయు

ఏమైనా అర్థమవుతుందా?
అన్నీ అంకెలే
అన్ని తలలవాడు మిమ్మలిని ధన్యుల చేస్తాడట.
ఇంతకు ఆయనెవరు?
దీన్నంతా గమనించాలంటే
ఆ తలలు ఎన్నో తేలాలి.
చూద్దాం.
1వ పాదంలోనివి - 10 + 5 + 5 +15 +15 = 50
2వ పాదంలోనివి - 25 + 125 = 150
3వ పాదంలోనివి - 300 + 200 + 300 = 800
మొత్తం = 50 + 150 + 800 = 1000
వేయి తలలవాడు మిమ్ములను ధన్యుల చేస్తాడు.
వేయి తలలున్న ఆయన ఆదిశేషుడు.
ఆ ఆదిశేషుడు మనలను ధన్యుల చేస్తాడు - అని భావం.

Sunday, May 29, 2016

ధీరత సారభోగముల ధీనిధి ఈశ్వరనారసింహుడు


ధీరత సారభోగముల ధీనిధి ఈశ్వరనారసింహుడు


సాహితీమిత్రులారా!

కొన్ని పద్యాలు క్లిష్టాన్వయాలుగా, నిగూఢార్థాలతో ఉంటాయి
అలాంటి వాటిని గూఢచిత్రంలో చెప్పవచ్చు
అలాంటి ఒక పద్యం పెద్దన మనుచరిత్రలోది
గమనించండి.

శ్రీరుచిరత్వ, భూతి, మతి, జిత్వర, తాకృతి; శక్తి, కాంతులన్
ధీరత, సార, భోగముల, ధీనిధి, యీశ్వర నారసింహు, డా
వారిజనాభ, శంకరుల, వారి కుమారుల, వారి తమ్ములన్,
వారి యనుంగు మామలను, వారి విరోధుల, బోలు నిమ్మహిన్
                                                                                (మనుచరిత్ర 1-20)
(కృష్ణదేవరాయల తండ్రి నరసింహరాజు
లక్ష్మిని కలిగి ఉండటంతో హరిని,
అణిమాది ఐశ్వర్యములతో శివుని,
బుద్ధిబలంతో బ్రహ్మదేవుని,
జయశీలంతో కుమారస్వామిని,
రూపంతో మన్మథుని,
సామర్థ్యంతో వీరభద్రుని,
ప్రకాశంతో చంద్రుని,
ధైర్యంతో మైనాకుని,
బలంలో రాహువును,
భోగాలతో ఇంద్రుని
యథాప్రకారంగా పోలి ఉన్నాడని భావము.)

ద్వ్యక్షరి


ద్వ్యక్షరి


సాహితీమిత్రులారా!

ఏకవ్యంజన(ఒకేహల్లు)మును ఉపయోగించి కూర్చిన శ్లోకం
లేదా పద్యాన్ని ఏకాక్షరి అని తెలుసుకొని ఉన్నాము.
అదే విధంగా రెండు హల్లులను(వ్యంజనాలను) ఉపయోగించి
కూర్చిన శ్లోకం లేదా పద్యాన్ని "ద్వ్యక్షరి" అంటారు.
ఇందులో అచ్చులు ఏవైనా ఎన్నయినా ఉండవచ్చు.


సూరి: సురాసురాసారిసార: సారససారసా:
ససార సరసీ: సీరీ ససూరూ: స సురారసీ
                                     (కావ్యాదర్శము-3-94)
(పండితుడును దేవతల విషయమునను అసురుల
విషయమునను ప్రసరించు బలము కలవాడును,
మద్యమునందు ఆసక్తి కలవాడును అగు
బలరాముడు అందమైన ఊరువులు గల ప్రియురాలుతో
కూడినవాడై, ధ్వనితో కూడిన (ధ్వని చేయుచున్న)
సారసపక్షులు గల సరస్సులను సంచరించెను.)

దీనిలో , - అనే రెండు వ్యంజనములు(హల్లులు)
మాత్రమే ఉపయోగించబడినది.

Saturday, May 28, 2016

చలజిహ్వ


చలజిహ్వ


సాహితీమిత్రులారా!

అచలజిహ్వ - అని నాలుక కదలకుండా
చదివే పద్యలను శ్లోకాలను చూశాము.
ఇపుడు చలజిహ్వ అంటే కేవలం నాలుకమాత్రమే
కదులుతూ చదివే శ్లోక - పద్యాలు.
చూడండిమరి.

దనుజారిర్నతో ధాతృ ధూర్జటీన్ద్రాది నిర్జరైః
దురితం తటినీరత్నోదరే దో ధోతునిద్రితః

                              (అలంకారశిరోమణే శబ్దాలంకారప్రకరణం-36)

(బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలయిన దేవతలచే
నమస్కరించబడిన వాడున్నూ,
నదులనూ రత్నాలనూ గర్భంలో నిలుపుకొన్న
సముద్రమునందు నిద్రించు వాడున్నూ
రాక్షస వైరియూ అయిన
శ్రీరంగనాధుడు
మా పాపాలను విదలించి
రూపుమాపుగాక!)
చదివారుకదా నాలుక మాత్రమే కదలుతూందికదా!
ఇది ఏ అక్షరాలకు నాలుక కదలుతుందో
వాటిచే మాత్రమే కూర్చబడినది.

దీర్ఘ ద్వి స్వరచిత్రం


దీర్ఘ ద్వి స్వరచిత్రం


సాహితీమిత్రులారా!

దీర్ఘ ఏక స్వరచిత్రం అని చూచి ఉన్నాము.
ఇపుడు రెండు దీర్ఘాచ్చులతోటి కూర్చబడిన పద్యం
లేక శ్లోకంను దీర్ఘ ద్వి స్వరచిత్రం అంటాము.

శ్రీ దీప్తీ హ్రీ కీర్తీ ధీనీతీ గీ ప్రీతీ
ఏధేతే ద్వే ద్వే తేయే నేమే దేవేశే
                            (కావ్యాదర్శము- 3- 86)

(దేవేంద్రుని యందుకూడ లేని శోభాదీప్తులు,
లజ్జాకీర్తులు, బుద్ధినీతులు, వాక్ప్రేమలు
రెండు రెండు నీకు వృద్ధినొందుచున్నవి.)

దీనిలో మొదటి అర్థము అనగా శ్లోకము పూర్వభాగము అంతా ఈ - స్వరంతోను,
రెండవ భాగము అనగా ఉత్తరార్థశ్లోకం అంతా ఏ - స్వరం తోను కూర్చబడినది.
ఈ రెండును దీర్ఘ స్వరములే
కావున
ఇది దీర్ఘ ద్వి స్వరచిత్రం.

Friday, May 27, 2016

ఏకపాది


ఏకపాది


సాహితీమిత్రులారా!

ఒక పద్యం లేక శ్లోకంలో అన్ని పాదాలు ఒకటిగా ఉంటే దాన్ని ఏకపాది అంటారు.
దీనిలోని పదములు ఆవృత్తి అయిన మహాయమకము అనికూడా అంటారు.

సమానయాసమానయా
సమానయాసమానయా
స మా న యాసమానయా
సమానయాసమానయా
                        (కావ్యాదర్శము 3-71)

హే అసమ = ఓ సాటిలేని స్నేహితుడా, స = అట్టి నీవు, మా = నన్ను,
సమాన-యాస-మానయా = సమానమైన ఆయాసముయొక్క
 ప్రమాణము కలదియు, సమానయా = మానముతో కూడినదియు,
అసమాన మా = సాటిలేనిదియు అగు, అనయా = ఈ నాయికతో,
సమానయ = కలుపుము. యా = ఏ నాయికతో,
అసమానయా = లక్ష్మీ నయములతో కూడినది కానిది,
న = కాదో, ఆమె లక్ష్మీ - నయములు గల నాయిక అగుటచే
ఉపేక్షింపదగినదికాదు అని భావము.

కమ్మటి రోగాలకు తియ్యటి మందులు


కమ్మటి రోగాలకు తియ్యటి మందులు


సాహితీమిత్రులారా!

కాళిదాసు శృంగారతిలకం(14) లోని ఈ శ్లోకం చూడండి.

క్వ భ్రాత శ్చలితోసి? వైద్యక గృహే; కిం తద్రుజా శాంతయే;
కింతే నాస్తి సఖే గృహే ప్రియతమా సర్వం గదం హన్తియా
వాత తత్కుచకుంభ మర్దన వశాత్! పిత్తంతు వక్త్రామృతాత్!
శ్లేష్మాణం వినిహన్తి హంత సురతవ్యాపార కేళీ శ్రమాత్!

తన మిత్రుడు రోజురోజుకు క్రుంగి కృశించి పోవటం
ప్రియావిరహం వల్లనే అని గ్రహించాడు ఓ రసజ్ఞ మిత్రుడు.
ఆ రోగనిదానానికి మథురమనోజ్ఞమైన మైథున వైద్యవిధానాన్ని
సూచిస్తున్నాడు.
ఆ మిత్రుల సంభాషణ
ఈ శ్లోకరూపంలో జరిగింది.
వారి సంభాషణ..........

ప్రశ్న - ఏం తమ్ముడూ ఎక్కడికి ప్రయాణం?
సమాధానం - వైద్యునింటికి.
ప్ర - ఎందుకూ?
సమా- ఒంట్లో నలతగా ఉంది.
ప్ర - సహధర్మచారిణి సర్వరోగహారిణి ప్రేయసి. నీ ప్రియురాలు ఇంట్లో లేదా?

మిత్రమా! వాతదోషం అయితే స్తనమర్దనం వల్ల హరిస్తుంది.
పిత్తదోషమయితే ప్రియురాలి అధరపానంవల్ల నశిస్తుంది.
శ్లేషదోషం అయితే ఆమెతోటి సురతక్రీడా పరిశ్రమవల్ల తగ్గిపోతుంది.
అందువల్ల
ఆమెతో సుఖించు
అన్నిరోగాలు
అవే పోతాయి.
- అని సలహా ఇచ్చాడట.

Thursday, May 26, 2016

పేరడీ పద్యం


పేరడీ పద్యం


సాహితీమిత్రులారా!
ఈ చాటుపద్యం చూడండి.

అంతా సుకవులు గారా?
అంతింతో పద్య చయము నల్లగలేరా!
దంతివి నీతో సమమా?
కాంతా సుమబాణ! సూరకవి నెరజాణా!

దీనికి శ్రీశ్రీ పేరడీ చూడండి.

అంతా సురా ఘటేశులె
అంతింతో ఆచమాన మడిగేవారే
పంతానికి మాత్రం శివ
చింతా దీక్షితుల మండ్రు, సిరిసిరిమువ్వా

పొడుపు పద్యం


పొడుపు పద్యం


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యం చూచి సమాధానం ఊహించండి.

కరణాల చేతిలో గలుగు నాయుధ మేది?
కానకు గుణమీయఁ గలుగు నేది?
బాలుండు వ్రాతకై పట్టుకొనెడి దదేది?
పరగృహంబునకేది వరలు కప్పు?
యింటి లోపలికేగ నేమిదాటఁగవలె?
భర్తకై యిల్లాలు బఱచునేమి?
శార్కరి నేమని జనులు వాకొందురు?
చెలఁగి మూషక మేమి జేయుచుండు?

నన్నిఁటికి జూడ మూఁడేసి యక్షరములు
నీ వలావల గనసరి నెన్నవలయు
(చిత్త భవ భంగ శివలింగ చిన్మయాంగ
వృషతురంగ శుభాంగ గౌరీశ లింగ)
                                 (అమరాబాదు లక్ష్మయ్య రచన)

దీని సమాధానాలు మూడు అక్షరాల్లోనే ఉండాలి.
సమాధానం నీవల ఆవల అంటే ముందుకు ఒకసారి
రెండవది వెనుకకు తీసుకోవాలి.
ఈ విధంగా గమనిస్తే సమాధానాలు దొరకుతాయి.

1. కరణాల చేతిలో గలుగు నాయుధము ఏది? - కలము
2. కానకు గుణమీయ గలుగు నేది? - ములక (కలము నకు విలోమము)
3. బాలుడు వ్రాతకై పట్టుకొనెడి దదేది? - పలక
4. పరగృహంబునకేది వరలు కప్పు?  - కలప (పలక కు విలోమము)
5. యింటిలోపలికేగ నేమి దాటగవలె? - గడప
6. భర్తకై యిల్లాలు బఱచునేమి?  - పడక (గడప కు విలోమము)
7. శార్కరి నేమని జనులు నాకొందురు?  - గులక
8. చెలగి మూషిక మేమి జేయుచుండు?  - కలుగు(గులక కు విలోమము)

Wednesday, May 25, 2016

గోపుచ్ఛాకృతి చిత్రం



గోపుచ్ఛాకృతి చిత్రం


సాహితీమిత్రులారా!

పుచ్ఛం అంటే తోక, గోపుచ్ఛాకృతి
అంటే గోవు తోకలా మొదట లావుగా ఉండి
పోనుపోను సన్నగా అయితే అది గోపుచ్ఛాకృతి.
ఇలాటివి చిత్రకవిత్వంలో కనిపిస్తాయి.
ఇక్కడ కొన్ని చూద్దాం.


ధరసుధా రసుధా సుధా ధాకదళికా దళికా ళికా లిత మగుచు,
మవరమా వరమా రమా మానుజ లవలీ లవలీ వలీ లీల లవని మెఱయ
శరతుషా రతుషా తుషా సాలవసితా వసితా సితా తార ఫణి సమంబు,
శరదశా రదశా దశా శాంభగణితా గణితా ణితా తారకా పథంబు,
ఖగముఖాగ ముఖా ముఖా భాగ మగుచు
హరిపురా రిపురా పురా రాతి యగుచు
భవసభా రసభా సభా భవ్యమగుచు 
యశము, శము, ముద మొదవు యాచాథిపతికి

                                                     (చాటుపద్య రత్నాకరం 3-109)

ఇందులో ప్రతిపాదంలో మొదట ఉన్న అక్షరంలో
ఒక అక్షరం తగ్గుతూ రావడం గమనించ వచ్చు.
ఇది ఆవుతోకలా కనిపిస్తుంది
కావున
ఇది గోపుచ్ఛాకృతి చిత్రం.




పేరడీ పద్యం


పేరడీ పద్యం


సాహితీమిత్రులారా!

ఈ పద్యం మీరు వినే ఉంటారు.
మల్కిభరామునిపై చెప్పిన పద్యం.

ఆకుంటే వృక్షంబగు;
ఈకుంటే లోభియౌను హీనాత్ముండౌ
మీకుంటే మాకీయుడు
మాకుంటే మేమురాము, మల్కిభరామా!

దీనికి పేరడీగా ఈ పద్యం చెప్పవచ్చు. చూడండి.


మీకుంటే చాలు నొకో
మా కుంటే గాదె విద్య మాన్యత గాంచున్
ఆ కుంటే గల దిచ్చట
ఈ కుంటే లేకయున్న నీప్సితమవుగా

Tuesday, May 24, 2016

అనులోమ ప్రతిలోమ శ్లోకం


అనులోమ ప్రతిలోమ శ్లోకం


సాహితీమిత్రులారా!

ఒకశ్లోకం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివితే ఒక అర్థం వస్తుంది.
ఆ శ్లోకాన్నే చివర నుండి మొదటికి చదివిన మరో శ్లోకం వచ్చి మరోఅర్థం వస్తుంది.
దీన్నే అనులోమ ప్రతిలోమ శ్లోకం అంటారు.

నసమాశనవాగారం నమేమత్వామజేయతం
తరసారమ్యనవ్యాభమరామాదయమా విభో
                                          (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం - 34)

(ఆశలు కోరికలు లేని నిష్కాముల యొక్క యజ్ఞాలు
నిలయంగా కలవాడవు, జయింప వీలుకానివాడవు,
నిత్యనూతన తేజస్సుకలవాడవు, శీఘ్రంగా ఫలాలను
ఇచ్చేదయగలవాడవు. అయిన
లక్ష్మీ వల్లభా! రంగనాధా! నమస్కారం)

ఇదే శ్లోకాన్ని చివరినుండి మొదటికి రాయగా


భోవిమాయదమారామ భర్యా నమ్య రసారత
తం యజేమత్వామమేన రంగావాన శమాసన
                                     

(మాయా రహితులైన ఇంద్రియ మనోనిగ్రహాల
చేత క్రీడించు పుణ్యాత్ముల చేత నమస్కరింప
దగిన శ్రీరంగపుణ్యభూమి యందు
ఆసక్తి కలవాడా! ఆనందంగా ఉండేవాడా!
శ్రీరంగనిలయుడవాన నిన్ను
సన్నిధిలో సేవిస్తాను.)

సుదతీ నూతన మదనా


సుదతీ నూతన మదనా


సాహితీమిత్రులారా!

శబ్దాలంకారాలలో ముక్తపదగ్రస్తము ఒకటి.
ముక్తపదం అంటే విడిచి పెట్టబడిన పదం,
గ్రస్త అంటే తిరిగి గ్రహించడం. ముక్తపదగ్రస్తం అంటే
ఒక పదాన్ని విడిచి పెట్టి మళ్ళీ తీసుకోవడం.
అది పాదం అంతంలో అయితే పాదాంతముక్తపదగ్రస్తం అంటాము.

ఈ ఉదాహరణ చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ.
 .

సుదతీ నూతన మదనా
మదనాగ తురంగ పూర్ణమణిమయ సదనా
సదనామయగజరదనా
రద నాగేంద్రనిభకీర్తిరసనరసింహా
                                            (కావ్యాలంకారసంగ్రహము 4-83)

నరసింహా = ఓ నరసరాజా
సగదతీ నూతన మదనా = స్త్రీలకు నవమన్మథుడగువాడా,
మదనాగ తురంగ పూర్ణమణిమయసదనా = మదించిన ఏనుగులతోను గుఱ్ఱముతోను నిండిన,
మణిమయసదనా = మణిమయగృహములు కలవాడా,
సదనామయ గజరదనా = మంచివారికి శుభములు కూర్చుటకు విఘ్నేశ్వరుడగువాడా,
రదనాగేంద్రనిభకీర్తిరస = దంతములతోను, అనంతునితోను సాటియగు
(తెల్లనై) రసమువలె వ్యాపించు కీర్తికలవాడా!

ఎవరు చెప్పినా ఇదే చెబుతారు.
 నేను మొదట్లో ఇంకలేవేమో!
అందుకే ప్రతి ఒక్కరు ఇదే చెబుతారు అనుకునే వాణ్ణి.

కానీ తరువాత నాకు తెలిసిందేమంటే
ఇది ఒక్కటే కంఠస్థమైనది సులభమైనది.
అందుకే ఇలా... అని అర్థమైంది.

Monday, May 23, 2016

దీర్ఘ ఏక స్వరచిత్రం


దీర్ఘ ఏక స్వరచిత్రం


సాహితీమిత్రులారా!

ఒక శ్లోకం లేదా పద్యంలో ఒకేఒక స్వరం(అచ్చు)వాడితే
అది ఏకస్వరచిత్రం దానిలో కేవలం దీర్ఘస్వరాలనే వాడితే
అది దీర్ఘ ఏకస్వరచిత్రం అవుతుంది.
ఈ శ్లోకం చూడండి.


వైధై రైనై రైశై రైంద్రై రైజై రైలై ర్జైనై: సైద్ధై:
మైత్రై ర్నైకై ర్దై ర్యై ర్వై రై దై: స్వై: స్వైరై ర్దేవైస్తైస్తై:
                                                 (సరస్వతీకంఠాభరణము)


దీనిలో అంతటా "ఐ" -త్వమే ఉపయోగించి
శ్లోకం కూర్చడమైనది.
కావున దీన్ని
"ఐ" - త్వ శ్లోకం అనికూడా పిలువవచ్చు.
అర్థం - బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు, మన్మథుడు, భూమి,
జినుడు, సిద్ధులు, సూర్యుడు కుబేరుడు అనువారికి సంబంధించిన
వారిచేత, అనేక దేవతల చేతను సుష్టుగా ఒసగబడిన
వారివారి ధైర్యములచేత సమగ్రముగా సమృద్ధి నొందుదును.

వంచయన్ గిరిసుతాం గంగాధర: పాతువ:


వంచయన్ గిరిసుతాం గంగాధర: పాతువ:

సాహితీమిత్రులారా!

ఈ సంవాదం గమనించండి.
పార్వతి ప్రశ్నకు పరమేశుని
సమాధానాలు ఎలా ఉన్నాయో? గమనించండి.


మౌలౌ కిం సు? మహేశ! మానిని! జలం. కిం వక్త్రం? అంభోరుహం.
కిం నీలాలక వేణికా? మధుకరీ, కింభ్రూలతా? వీచికా.
కిం నేత్తే? శఫరౌ, కిము స్తనయుగం? ప్రేంఖత్ రథాంగద్వయం
సాశంకా మితి వంచయన్ గిరిసుతాం గంగాధర: పాతువ:

పార్వతి - పరమేశా నీతలపై నున్నదెవరు?
శివుడు - అభిమానవతీ (శ్లిష్ట వక్రోక్తితో) నీరు(జలం) సుమా(గంగ)
పా.- ఏదో ముఖంలాగా కూడా అక్కడ కన్పడుతోంది అదేమిటి?
శి.- ఆ నీటిలో మొలిచిన కమలము(అంభోరుహము) సుమా!
పా.- అదేమిటండీ నల్లని వెంట్రుకలతో జడమాదిరిగా కూడా కనపడుతోంటే?
శి.- ఔను, అది ఆ పద్మాలలోని, తేనెను ఆస్వదింప వచ్చిన తుమ్మెదల గుంపు.
పా.- అయితే, తీగలవలె కనుబొమ్మలు కూడా కనబడుచున్నాయేమిటి?
శి.- ఏమీలేదు. ఆ నీటిలోని తరంగాలు(అలలు) సుమా!
పా.- రెండు కళ్లు కూడా కనపడుతుంటే వాటినేమిటి దాస్తారు?
శి. - అబ్బే! అవి ఆ నీళ్లలోని చేపలు సుమా!
పా. - గుండ్రంగా రెండు కుచాలు(స్తనాలు) కూడా ఉన్నాయండీ?
శి.- ఔను! ఆ జలంలో తిరుగుచున్న చక్రవాక పక్షులజంట.

      ఇలా అసూయతో అనుమాన పడిన,
ఆ అంబకు(పార్వతికి) నర్మగర్భంగా, అలంకారిక సాంప్రదాయానుసారంగా,
వక్రోక్తులతో సమాధానమిచ్చి సరిపెట్టిన
ఆ గంగాధరుడు (ఈశ్వరుడు) మనందరిని రక్షించుగాక.!

Sunday, May 22, 2016

గుణితపద్యం


గుణితపద్యం


సాహితీమిత్రులారా!

ఇంతకుముందు మనం గుణితపద్యం ఒకదాన్ని చూశాము.
అందులో పద్యం మొత్తం గుణితం ఉంది.
అది ఒక రకము కాగా సగం పద్యంలోనే గుణింమంతా రావడం రెండవ రకం గుణింత పద్యం.
అంటే ఒక పద్యంలో రెండు గుణింతాలు కూడా కూర్చిన వారున్నారు.
ఈ పద్యం గణపవరపు వేంకటకవి
"ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము"లోని
148వ పద్యం.

డి గాటపు గిరి గీముల
గుడి గూబల గెబ్బు గైగొల్లలు గౌలన్
(దడలుచు గండరిగర్వము
విడుతురు నీరిపులు జేరి వేంకటశౌరీ)

రరాముఁగోరిరీతఁడు
గురురూపిమ రేవురైయెకుదిరిరొయొనరౌ
నాధునిరతినీచుల
నురినూకువనేర్పనైనోపికనౌఁగా
(ఉరిన్ - ఉచ్చులో, ఊకువన్ - పూనికను, ఏర్పన్ - ఏర్పరచుట)
ఈ పద్యంలో "" - మొదటి సగం పద్యంలోను, "" - రెండవ సగం పద్యంలోను గుణితము కలదు.
(ఇది నాదెళ్ళ పురుషోత్తమకవి "అద్భుతోత్తరరామాయణము"లోనిది)





పార్వతీ పరమేశ్వర సంవాదం

పార్వతీ పరమేశ్వర సంవాదం


సాహితీమిత్రులారా!

ఈ వింత ఆశీర్వాద శ్లోకం చూడండి.
ఇది సంవాదరూపంలో ఉంది.

కస్త్వం? శూలీ, మృగయ భిషజం? నీలకంఠ: ప్రియే2హమ్
కేక మేకాం కురు? పశుపతి:, నైవ దృశ్యే విషాణే?
స్థాణు: ముగ్ధే!? న వదతి తరు: జీవితేశ: శివాయా:
గచ్ఛాటవ్యాం, ఇతి హతవదా: పాతు వ: చంద్రచూడ:

పార్వతి - ఎవరునీవు?
శివుడు - శూలీ (త్రిశూలాన్ని ధరించే శివుని)
 (శూలీ -శివుడు, కడుపునొప్పిగలవాడు)
పా.- శూలరోగం గలవానివి వైద్యుని వెతుక్కుంటూ వెళ్ళు.
శి.- ప్రేయసీ నేను నీలకంఠుడనే
(నీలకంఠ - శివుడు, నెమలి)
పా.- నీలకంఠవైతే ఒక కేక(నెమలి అరుపు) వేయి.
శి.- నేను నందీశ్వరుడను.
(నందీశ్వరుడు - శివుడు, పశువులకు, గోవులకు ... పతి)
పా.- అయితే పశువులకు కొమ్ములుండాలికదా అవి నీకు కనపడడంలేదే?
శి.- ఓసి మూర్ఖురాలా! నేను స్థాణువును.
(స్థాణువు - శివుడు, కదలని చెట్టు, మొద్దులు..)
పా.- చెట్టు లేదా మొద్దు అయితే మాట్లాడవుకదా! నీవు మాట్లాడుతున్నావే!
శి.- నేను పార్వతికి ప్రాణేశ్వరుడను శివుడను.
(శివా - పార్వతి, నక్క)
పా.- నీవు నక్కవైతే అడవిలో తిరగాలి అక్కడ ఉండక ఇక్కడికెందుకొచ్చావు పో అడవికి పో.

 పార్వతి ప్రశ్నలకు జవాబివ్వలేని చంద్రశేఖరుడు మిమ్మలను రక్షించుగాక!

Saturday, May 21, 2016

నీవీబంధ విమోచనంచ


నీవీబంధ విమోచనంచ


సాహితీమిత్రులారా!

పూర్వకాలంలో చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారుకదా!
అలాంటి బాలవధువు(12,13 సం.లోపు పిల్ల) పురుషాసక్తత అసలే లేని పిల్ల
తన తల్లితో ఇలా చెబుతున్నది.


మాత! శ్వశ్రుగృహం నయామి శయితుం, కస్మచ్చ చంద్రాననే?
జామాతా అతినిర్దయో భుజలతాపాశేన మాం పీడతే
వక్షోజగ్రహణం కరోతి సతతం ఓష్ఠం దశత్యాదరాత్
నీవీబంధ విమోచనంచ కురుతే నిద్రాం నలేభే నిశి

బాలిక - అమ్మా! నేను అత్తవారింటికి శయనానికి వెళ్ళను.
అమ్మ - చంద్రముఖీ! కారణమేమి?
బాలిక - నీ అల్లుడు దయారహితుడు!
             నన్ను గట్టిగా కౌగిలించుకొంటున్నాడు.
             ఉరోజములను ఎప్పుడూ పట్టుకొంటున్నాడు.
             పెదవి కొరుకుతున్నాడు.
             చివరకు చీరముడికూడా విప్పేస్తన్నాడు.
             రాత్రంతా నిద్రలేకుండా చేస్తున్నాడు!

బుద్ధజయంతి (బుద్ధపౌర్ణిమ) శుభాకాంక్షలు


బుద్ధజయంతి (బుద్ధపౌర్ణిమ) శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు 
బుద్ధ(జయంతి)పౌర్ణిమ శుభాకాంక్షలు.


గిరియుష్మద్ధనురస్త్రతాప్రభృతిమోఘీకృద్వధూశీలవి
స్ఫురణావర్మభిదాఢ్యదార్ఢ్యసఫలీభూతప్రభూతత్రిపూ
ర్వరదైతేయజిఘాంసనపరోగ్రప్రాప్యసారూప్యని
ర్భరరమ్యాంగతథాగతాంగకపర బ్రహ్మన్! స్తుమస్త్వామనున్


ఈశ్వరుడు మేరుపర్వతమును ధనుస్సుగను, 
నారాయణుని బాణముగను పూనియు, 
త్రిపురాసులను, వారిభార్యల పాతివ్రత్నమహిమచేత గెలువలేకపోయెననియు, 
పిమ్మట బుద్దుని స్మరించి, ఆయన అనుగ్రహమున దిగంబరత్వము పొంగి, 
అసురకాంతల పాతివ్రత్యమును భంగపరచి, ఆ అసురులను  గెలిచె అనియు - తాత్పర్యము.
(ఈశ్వరుడు బుద్ధభగవానుని ధాయనించి సారూప్యమును పొందెనని భావము.)

Friday, May 20, 2016

నరసింహ జయంతి శుభాకాంక్షలు


 నరసింహ జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు 
నరసింహ జయంతి శుభాకాంక్షలు


డింభద్రోహివధోత్కటోత్ర్కమణఘృష్టిక్లిష్టతా రోమకూ
పాంభోజప్రభవాండభాండదళనోద్యద్ద్వానధీకృత్సభా
స్తంభాంతస్స్ఫుటనస్ఫురత్ఫళఫళధ్వన్యార్తినిశ్చేష్టని
ర్దంభోద్వేగదిశావశాప నృహరిబ్రహ్మన్! స్తుమస్త్వా మనున్

బాలుడగు ప్రహ్లాదుని బాధించుచున్న హిరణ్యకశిపుని 
సంహరించుటకై నరసింహమూర్తి స్తంభమును చీల్చుకొని 
వెలువడుటలో ఫెళఫెళయను మహాధ్వని యయ్యెననియు, 
ఆ ధ్వని, భగవంతుడట్లు వెడలివచ్చుటలో కలిగిన సంఘర్షణవలన, 
ఆయన రోమకూపములందున్న బ్రహ్మాండభాండములు బ్రద్దలగుటవలన 
పుట్టినది కాబోలు అన్నట్లు ఉండెననియు, 
ఆ ప్రచండశబ్దమునకు దిగ్గజములు చెవుడుపడి 
నిశ్చేష్టములయ్యె ననియు తాత్పర్యము.

కమల బాంధవుడేతేర కలువ విచ్చె


కమల బాంధవుడేతేర కలువ విచ్చె


సాహితీమిత్రులారా!

ప్రశ్నలు సమాధానాలు ఒకే పద్యంలో ఉంటే
దాన్ని "అంతర్లాపిక ప్రహేలిక" అంటారు.
ఇలాంటివి ముందు కొన్ని తెలుసుకొని ఉన్నాము.
ఇక్కడ మరొకటి చూద్దాం.

విష్ణుదేవుని పత్నియై వెలయునెవతె
ఎవ్వరేతేర పాద్యాదు లిచ్చుచుంద్రు
హిమకరుడు పుట్టగా, రాత్రి ఏది వచ్చు
కమలబాంధవుడేతేర కలువవిచ్చె

1. విష్ణుపత్ని ఎవరు?
2. ఎవరు వస్తే పాద్యాదులు ఇస్తూ ఉంటారు?
3. హిమకరుడు(చంద్రుడు) పుట్టగా రాత్రి విచ్చేది ఏది?
కమల బాంధవుడు - సూర్యుడు,
ఏతేర - రాగా,
కలువవిచ్చె - కలువ వికసించింది -
విపరీతమైనదికదా!
ఎలాసాధ్యం?

దీనిలోని చిక్కును విడదీయడం ఏమిటి అంటే
చివరి పాదంలోని పదాలను
కమల- బాంధవుడేతేర - కలువ విచ్చె -
అని విడదీస్తే పై ప్రశ్నలకు సమాధానాలు
వరుసగా సరిపోతాయి.
చూడండి.

1. విష్ణుపత్ని ఎవరు?  - కమల (లక్ష్మి)
2. ఎవరు వస్తే పాద్యాదులు ఇస్తూ ఉంటారు?  - బాంధవుడేతేర (బంధువురాగా)
3. హిమకరుడు(చంద్రుడు) పుట్టగా రాత్రి విచ్చేది ఏది? - కలువ విచ్చె (కలువపూవు వికసించింది)

భోగాంబువాహవాహ


భోగాంబువాహవాహ


సాహితీమిత్రులారా!

నాలుక కదలకుండా చదవవీలయ్యే పద్యం శ్లోకం తెలుసుకొని ఉన్నాము.
దీన్ని అచలజిహ్వ అంటారనీ తెలుసుకొన్నాము.
మరొక ఉదాహరణ ఇక్కడ గమనిద్దాం.

ఇది "నరసభూపాలీయమ"ని పేరొందిన
"కావ్యాలంకారసంగ్రహము"(3-160)లోనిది.

భోగాంబువాహవాహవి
భాగేహాభావుకాంగభావభవమహా
భాగమహీభాగమహా
భోగావహబాహుభోగిపుంవభోగా

ఇది చదివే సమయంలో
నాలుక కదలదు
కావున
దీన్ని "అచలజిహ్వ" అంటున్నారు.

భోగాంబువాహవాహా = సుఖానుభవమున ఇంద్రుడైనవాడా,
విభాగేహా = కాంతికి స్థానమైనవాడా,
భావుకాంగభావభవ = భవ్యదేహమున మన్మథుడైనవాడా,
మహీభాగ మహాభోగావహ = భూభాగమున గొప్ప భోగములను పొందిన,
బాహు = బాహువనెడు,
భోగిపుంగవ = పాముయొక్క,
భోగా = భోగము(పడగ)కలవాడా!-
అనగా
నరసరాజు అఱచేయి పడగవలెను,
అతని బాహువులు పామువలెను ఉన్నవని - భావము.

Thursday, May 19, 2016

తరు వెయ్యదొ కోఁతెవ్వరొ


తరు వెయ్యదొ కోఁతెవ్వరొ


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చదివి సమాధాన మివ్వండి.

తరువున మూఁడక్షరములు
స్థిరముగ నడి మక్షరంబు తీసిన కోఁతౌ
తరు వెయ్యదొ కోఁతెవ్వరొ
యెఱిఁగింపుము దీని నాకు నింపొద వంగన్

ఈ పద్యంలో ఉన్నదేమిటంటే
ఒక చెట్టు పేరుకు మూడు అక్షరాలు ఉన్నయి.
వాటిలోని ఆ మూడక్షరాల్లో మధ్య అక్షరం తీసివేస్తే
మిగిలిన రెండక్షరముల అర్థం కోతి వస్తుంది.
మరి ఆ చెట్టు పేరేమి?

సమాధానం - వావిలి

ఇందులో మూడక్షరాలు ఉన్నాయి.
వావిలి అనేది చెట్టుపేరు.
దీనిలోని మధ్య అక్షరం "వి" -  తీసివేస్తే వాలి.
వాలి అనేది కోతి కదా!

మ్రొక్కితి, వేడుకొంటి, నను ముట్టకుమంటి, నికేమి చేయుదున్!


మ్రొక్కితి, వేడుకొంటి, నను ముట్టకుమంటి, నికేమి చేయుదున్!


సాహితీమిత్రులారా!

నాయిక చెలికత్తెను నాయకుని దగ్గరకు పంపింది.
చెలికత్తె నాయకునితో కలిసినది.
చెలికత్తె నాయకునిపై నాయికకు ఫిర్యాదు చేస్తున్నది.
చెలికత్తెకు - నాయికకు మధ్య జరిగిన సంభాషణ
ఈ పద్యం చూడండి.



చెలికత్తె - అక్కరొ! నీదు వల్లభుడహుకృతి చేసిన చేష్టవింటివా?
నాయిక - ఎక్కడ ఎక్కడే? (మరియు) నెవ్వరి? నెవ్వరి?
చె- నన్నె నన్నె!!
నా- నీ వక్కడికేల పోవలయు?
చె- అంపవ?
నా- అంపితి, కూడుమంటినా?
చె- మ్రొక్కితి, 
       వేడుకొంటి, 
          నను ముట్టకుమంటి, 
                   నికేమి చేయుదున్!

Wednesday, May 18, 2016

హరి యగు నా కల్కి ముఖము




హరి యగు నా కల్కి ముఖము


సాహితీమిత్రులారా!
ఒక శబ్దాన్ని అనేక అర్థాలలో ఉపయోగించుట జరిగితే
దాన్ని "శబ్దనానార్ధోపయోగచిత్రం" అంటారు.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.


హరి యగు నా కల్కి ముఖము
హరి యగు నా కల్కినుడులు హరి యగు జడయున్
హరి యగు నా కల్కి నడుము
హరి వేరే కల్కిరూపమగుటేల యిలన్
                                      (సారంగధరీయము 2-144)

దీనిలో హరి శబ్దానికి వరుసగా
చంద్రుడు, చిలుక, సర్పము, సింహము, విష్ణువుగా
అర్థాలు తీసుకోబడింది.
ఆ కల్కి ముఖము చంద్రుడని,
పలుకులు చిలుకలని,
జడ సర్పమని,
నడుము సింహమని
స్వభావార్థము.
ఆ కల్కి ముఖాద్యవయవములు
హరి వాచ్యములగుచున్నవి.
హరికి (విష్ణువుకు) తనివిదీరక వేరుగా
మోహిని అనే రూపం తాల్చడం దేనికి,
లేక
కల్క్యవతారం దాల్చడందేనికి
అని భావం.


ఆడువారి మాటలకు అర్థాలె వేరులే


ఆడువారి మాటలకు అర్థాలె వేరులే


సాహితీమిత్రులారా!

ఒక పాంథుడు అరుగుమీద కూర్చొని ఉన్నాడు.
అతనితో ఒక కామిని ఇలా అన్నది.


వాణిజ్యాయ గతస్సమే గృహపతి ద్వార్తాపి నశ్రూయతే
శ్వశ్రూ: తద్భగినీ ప్రసూతి సమయే జామాతృ గేహం గతా
బాలాహం నవ యౌవనా కులవధూ: ఏకాకినీ మందిరే
సాయం సంప్రతి వర్తతే పథికహే! స్థానాంతరం గమ్యతామ్!
                                           (కాళిదాసు శృంగారతిలకం లోనిది)

నా భర్త వ్యాపారానికై పరదేశం పోయినాడు
ఇంతవరకు కబురులేదు.
అత్త ఆయన చెల్లెలికి ప్రసూతి సమయంకావటంతో అల్లుని ఇంటికి పోయింది.
నవ యౌవనంలో ఉన్న నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను.
 ప్రొద్దు క్రుంకిపోతోంది.
ఓ పాంథుడా!
నీవు వేరొక చోటుకు వెళ్ళిపో
( అనగా వెళ్ళిపోతావేమో పోవద్దు అని- ధ్వని)

Tuesday, May 17, 2016

ఏత్వకందం


ఏత్వకందం


సాహితీమిత్రులారా!

తలకట్లకందం, గుడుసుల(ఇ-స్వరచిత్రం),
కొమ్ముల పద్యం తెలుసుకొన్నాము.
ఇప్పుడు ఏత్వకందం. ఎ,ఏ - స్వరములతో కూడిన కందం.
ఇది కూడా ఏకస్వరచిత్రమే.


కే లేదే తే తేవే
వే లేవే మెట్లె దేబెవే యేల్చేడె
న్నే లేనే వేరే యె
గ్గే లేనే లేదే యేడ్చెదేలే మేలే
               (సారంగధరీయము - 3-43)

కేలు = హస్తము, ఏదే = ఎచ్చటనే, తే తేవే = తెమ్ము తెమ్ము,
వే = శీఘ్రముగా, లేవేమెట్లె = లేవవేమి ఎట్లనే,
దేబెవే = దీనురాలవా, ఏల్చేడెన్ = రక్షించువనితను,
నేలేనే = నేనుండలేదా, వే = వేరుగా,
ఎగ్గేలేనేలేదె = కీడు లేక దోషం లేనేలేదె,
ఏడ్చెదేలే = ఏడ్చెదవెందులకు,
మేమే = శుభమా?

తప్పు చేసిన వారినే పట్టుకొనవలెను


తప్పు చేసిన వారినే పట్టుకొనవలెను


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి గోపిక - గోపాలుని మధ్య జరిగినది.
ఇందులో ధ్వని గమనించండి.

యుక్తం కిం చవ శర్వరీశముఖ! మద్వేణీ సమాకర్షణం
వీథ్యాం? త్వత్కుచ మండలం మమకథ గృహ్ణాతి చేతో జవాత్?
వ్యత్యస్తం క్రియతేత్వయా జహిజహి స్వామిన్! వచస్సాధుతే?
ఆగోయ: కురుతే స ఏవభవతా దండస్య యోగ్య: ఖలు!

గోపిక - చంద్రముఖా! నడివీథిలో నా జడ పట్టుకొనుట తగునా?
గోపాలుడు- నీ కుచములు నా మనస్సును హటాత్తుగా ఏల హరించినవి?
గోపిక- కృష్ణా! నీవు తారుమారుగా చేయుచున్నావు! చాలుచాలు విడువిడు! 
           ఏమి మాటయిది? తప్పుచేసినవారినే పట్టుకొనవలెను కాని ఇది యేమి?

(అంటే
మనస్సు హరించి తప్పు చేసినవి కుచములు
వాటిని వదలి జడను పట్టుకొంటావా?
కావాలంటే కుచాలనే పట్టుకోవలెనుకదా! -
అని ధ్వని.)

Monday, May 16, 2016

మనసిజు మామమామ........


మనసిజు మామమామ........


సాహితీమిత్రులారా!

కొందరు ఆశీర్వదిస్తే మామూలుగా ఉంటుంది.
దాన్ని ఎవరు పట్టించుకోరు.
ఎవరైనా
నమస్కారం అంటే ఇందులో ఆశ్చర్యంలేదు.
మనము నమస్కారం అంటాం.
అంతేనా! మరి అలా కాకుండా దానికిసమానమైన మరోపదం వాడితే
ఆలోచించాల్సివస్తుంది కదా!
అలాంటిదే
ఈ ఆశీర్వాదపద్యం.

మనసిజు మామమామ, యభిమానమడంచినవానిమామ, నం
దను విరోధి నందనుని నందను సుందరి, మేనమామ, జం
పినజెగజెట్టి పట్టి బొడి చేసిన శూరుని తండ్రి గన్నుగన్
గొనిన సురాధినాథుని తనూభవునాయువు మీకు నయ్యెడున్

మన్మథునిమామ చంద్రుడు,
చంద్రునిమామ దక్షుడు,
దక్షుని అభిమానాన్ని అణచినవాని
(శివుని)మామ - హిమవంతుడు,
హిమవంతుని కుమారుడు మైనాకుడు,
మైనాకుని విరోధి ఇంద్రుడు,
ఇంద్రుని కుమారుని కుమారుడు - అభిమన్యుడు,
అభిమన్యుని  సుందరి - ఉత్తర,
ఉత్తర మేనమామ - కీచకుడు,
కీచకుని చంపినవాడు - భీముడు,
భీముని కొడుకు ఘటోత్కచుని చంపినవాడు - కర్ణుడు,
కర్ణుని తండ్రి సూర్యుడు,
సూర్యుని కన్నుగా గలవాడు - విష్ణువు,
విష్ణువు కుమారుడు - బ్రహ్మ-
ఆ బ్రహ్మదేవుని ఆయుస్సు
మీకు కలుగుగాక -
---దీని భావం.

కొమ్ముల పద్యం


కొమ్ముల పద్యం


సాహితీమిత్రులారా!

ఇంతకుమునుపు మనం తలకట్లకందం,
 కేవలం గుడులతో ఉన్న పద్యాలను తెలుసుకున్నాము.
ఇప్పుడు కేవలం కొమ్ములతోటి కూర్చిన పద్యం గమనిద్దాం.
ఇందులో ఉ,ఊ - స్వరాలను మాత్రమే ఉపయోగించటం చిత్రం
వీటిని ఏకస్వర చిత్రం అనికూడా అంటాము.


పూషుఁడు నుడుపుఁడును భూజుండును బుధుఁడు
న్గురు సుగుణుఁడు గురుఁడును సుకురుఁడును
సూరుసుతుఁడు నుడుపుసూడు ధూమ్రుఁడు భూపు
శూరు నుసులు పూన్చుచుంద్రు సుమ్ము
                                                  (సారంగధరీయము 0-8)

(సూర్యుడును, చంద్రుడును, అంగారకుడు,
బుధుడును, బృహస్పతియును,
శుక్రుడును, శనియు, రాహువును, కేతువును,
కృతిపతియగు రాజును
సౌఖ్యమును పొందింతురు సుమీ
- అని అర్థం.)

Sunday, May 15, 2016

ఏకస్థాన చిత్రం


ఏకస్థాన చిత్రం


సాహితీమిత్రులారా!

కంఠము, తాలువు, మూర్ధము, దంతము, ఓష్ఠము అనే
ఈ అయిదు వర్ణ ఉత్పత్తి స్థానములు.
కంఠం నందు పుట్టేవాటిని కంఠ్యములు అని అంటారు.
ఒక ఉత్పత్తిస్థానంనుండి పుట్టే వాటిని తీసుకొని కూర్చిన
దాన్ని ఏకస్థాన చిత్రం అంటారు.
మిగిలిన వర్ణోత్పత్తి స్థానాలను
పరిహరించడం జరుగుతుంది.

ఈ శ్లోకం దండి కావ్యాదర్శంలోనిది చూడండి.

అగా గాం గాంగకాకాంక గాహకాఘక కాకహా
అహాహాంగఖగాం కాగగ కంకాగ ఖగాంకగ

(హానిలేని అంగముగల సూర్యుని(గరుడుని)గుర్తుగా
ధరించిన పర్వతము(మేరువు)నందు సంచరించు
కంఖములనెడి పర్వతపక్షులచేత
ప్రస్తుతిగొన్న గమనము కలవాడా!
గంగాజలము నందలి కుటిలమైన
అంకమునందు వ్రేలాడుచున్న కుత్సితపాప
మనెడి కాకమును(చంపినవాడవేని)చంపి
స్వర్గమునకు పోయితివి.)

అ,ఆ,క,ఖ,గ,ఘ,ఙ,హ,(విసర్గ)-
అనేవి కంఠమునుండి పుట్టేవి
కావున
వీటిని కంఠ్యములు అంటారు.
ఈ శ్లోకంలో ఈ చెప్పబడిన వాటినుండి మాత్రమే
తీసుకొని శ్లోకం కూర్చడం జరిగింది.
కావున
ఇది ఏకస్థానచిత్రం అనదగినదే.

పేరడీ పద్యం


పేరడీ పద్యం


సాహితీమిత్రులారా!

పెద్దనగారి మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు సిద్ధుని ప్రశ్నించిన పద్యం ఇది.

ఏయే దేశమువన్ జరించితిరి మీరేయే గిరుల్ చూచినా
రేయే తీర్థములందుఁగ్రుంకిడితి రేయే ద్వీపముల్ మెట్టినా
రేయే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి రేయే తోయముల్ డాసినా
రాయా చోటులఁ గల్గువింతలు మహాత్మా నా కెఱింగింపరే  (1-68)

ఈ పద్యానికి అనుకృతి లేదా
పేరడీ దుర్మార్గ చరిత్రలోనిది.......

ఏ యే వేశ్యగణంబు నారసితి? రే యే శిష్టులం దిట్టినా?
రే యే కొంపలయందు జొచ్చితిరి? మీ రే చెఱ్వులం బూడ్చినా?
రే యే దారుల కంప గొట్టితిరి? మీ రే తోటలం బీకినా?
రా యా దుష్ట విదుష్ట చేష్టలను భ్రష్టా! నాకు చెప్పంగదే!

పై పద్యానికి ఈ పద్యాన్ని
ఎంత హాస్యభరితంగా
కవి మార్చాడో!
 చూడండి.

Saturday, May 14, 2016

విగత వికారో, వినాయకో లక్ష్మ్యా

విగత వికారో, వినాయకో లక్ష్మ్యా


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం గమనించండి.

అధునా, మధుకర పతినా, గిళితోపి అపకార, దంపతీ
త్రాత, స్సపాల యేన్మాం, విగత వికారో, వినాయకో లక్ష్మ్యా:

అధునా= ధ - కారములేని,
మధుకరపతి=(ధకారము తేస్తే) మకరపతిచే,
అపకార= ప-కారము లేని,
దంపతీ = (ప-కారం తీస్తే)దంతీ(ఏనుగు),
త్రాత = రక్షించిన,
విగతవికారో = వికారములేని,
లక్ష్మ్యా: = లక్ష్మియొక్క,
వినాయక:  -  (వి - తీసివేస్తే) నాయక: = భర్త,
మాం = నన్ను,
పాలయేత్ = రక్షించుగాక!



పుస్తక విలాపం


పుస్తక విలాపం


సాహితీమిత్రులారా!

కరుణశ్రీ పుష్పవిలాపానికి ఇది పేరడీ వినండి మరి.........


Friday, May 13, 2016

"ఇ"-కార స్వరచిత్రం


"ఇ"-కార స్వరచిత్రం


సాహితీమిత్రులారా!

అచ్చులలో "ఇ"- మాత్రమే ఉపయోగిస్తూ రాయబడిన శ్లోకం ఇది.
ఇదే పద్యం అయితే గుడుల పద్యం అంటాము.
ఇందులో "ఇ" - అనే ఒకేఒకస్వరం ఉపయోగించడం వలన
ఇది ఏకస్వరనియమం క్రిందికి వస్తుంది.
ఇక్కడ శ్లోకం మాత్రమే చూద్దాం.


గిరిభిద్ద్విట్చి దిక్లిష్టిక్షితి శ్రితి సితి త్విషి
స్విష్టి సిద్ధిర్నిర్విచ్ఛి త్తిస్థితిర్విధివినిర్మితి

(అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-24)

(శ్యామలాంగుడైన విష్ణువు తాను ఉద్ధరించిన
భూమిపై అవతరించి రాక్షస సంహారం చేయగా
సృష్టియందు అందరికోరికలు సిద్ధించినవి.
యాగాలు సఫలీకృతమైనవి.)

అచలజిహ్వ- శుద్ధౌష్ఠ్యం



అచలజిహ్వ- శుద్ధౌష్ఠ్యం


సాహితీమిత్రులారా

నాలుక కదలకుండా మరియు పెవులుమాత్రమే
కదులుతూ చదివే పద్యం
ఉదాహృత పద్యం
కొడవలూరి రామచంద్రరాజుగారి
"మహాసేనోదయము" (2-252)లోనిది.


భావ భవోప మవామా
భావి భవా భవ భావ  పాపా విపవీ
భూ విభు బోమా వాపా
భావామ విభోప భవప భభవ ప్రభువా


ఈపద్యం చదివే సమయంలో
ఎక్కడైనా నాలుక కదలుతుందేమో
గమనించండి.

Thursday, May 12, 2016

ఆదివర్ణావృత్తి



ఆదివర్ణావృత్తి


సాహితీమిత్రులారా!

పద్యంలో మొదటిపదానికి వచ్చిన అక్షరమే పద్యంలోని
ప్రతి పదానికిరావడం దీనిలోని చిత్రం.
ఉదాహరణకు ఒక పద్యం "ర"- అనే దానితో ప్రారంభమైన
పద్యంలోని ప్రతిపదం "ర"-తోనే ప్రారంభించబడుతుంది.
గణపవరపు వేంకటకవిగారి
"ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము" నుండి
ఈ పద్యం చూడండి.

లకంఠము రెపులుగును
లవింకము కంకణంబు హ్వము రుడున్
లరవము నకభుక్కును
ళకును కంకమును గాకి క్కెరకైదన్ (230)

నిరోష్ఠ్యం



నిరోష్ఠ్యం


సాహితీమిత్రులారా!

ఓష్ఠం అంటే పెదవి.
ఓష్ఠ్యం అంటే పెదవులయందు పుట్టేది.
వ్యాకరణ పరిభాషలో ఓష్ఠ్యం అంటే పెదవుల కలయికతో
పలకడానికి వీలయ్యే అక్షరం.
నిరోష్ఠ్యం అంటే పెదవుల
కలయికతో అవసరంలేకుండా పలుకబడేవి.

ప,ఫ,బ,భ,మ,వ,ఉ,ఊ,ఒ,ఓ,ఔ - అనేవి
పెదవుల సాయంతో పలుకబడేవి.
ఇవి లేకుండా పద్యం లేక శ్లోకం లేక వచనం లేక దండకం
ఇలా ఏదైనా రాస్తే అది నిరోష్ఠ్యం అవుతుంది.

అథాగ్రే హసతా సాచిస్థేతేన స్థేరకీర్తనా
సేనాన్యా తేజగదిరే కించిదాయస్తచేతసా
                                  (కిరాతార్జునీయమ్ - 15-7)

(ఈవిధంగా పరుగెత్తిపోతున్న సేనను చూచి
వారికెదురుగా ముందుభాగంలో నిలిచి సేనాని
కార్తికేయుడు ఖిన్నులైన ప్రమథగణంతో
ఇట్లా అన్నాడు.)

ఈ శ్లోకంలో ఒక అక్షరంకూడా పెదవిస్పర్శకలదిగాలేదు.
కావున
ఇది నిరోష్ఠ్యం.

Wednesday, May 11, 2016

క్రమస్థ సర్వవ్యంజనం



క్రమస్థ సర్వవ్యంజనం


సాహితీమిత్రులారా!

క్రమంగా క- వర్ణం మొదలు హ - వర్ణం వరకు ఉన్న
అన్ని హల్లులను ఉపయోగించి రచించిన వర్ణచిత్రం
ఈ క్రమస్థ సర్వవ్యంజనం.
దీనికి భోజమహారాజు రచించిన "సరస్వతీకంఠాభరణము"
శబ్దవివేచనం లోనిది ఉదాహరణ
చూడండి.

క: ఖగౌ ఘాఙ చిచ్ఛౌ జా ఝాఞ్ జ్ఞో2టౌఠీడడంఢణ:
తథోదధీ న్పఫర్బాభీర్మయో2రిల్వాశిషాంసహ:  (263)

(దేవతల సమూహముచేత పూజింపబడువాడును,
అజ్ఞానమును ఛేదించెడి ఓజస్సు గలవాడును,
శత్రుబలములను ఆరగించువాడును,
పండితుడును యుద్ధభటులను బాధించువారికి ప్రభువును,
అచంచలుడును, అంబుధులను పూరగించినవాడును,
భయములేనివాడును ఎవడు శత్రుసంహారకములైన
ఆశీస్సులను భరించెడి మయుడు(అనెడి దైత్యరాజు))

ఈ శ్లోకంలో
వరుస క్రమంలో
అన్ని హల్లులు వచ్చినవి.
కావున
ఇది క్రమస్థ సర్వవ్యంజనము.

"టం టం ట టం టం ట ట టం ట టం టమ్"


"టం టం ట టం టం ట ట టం ట టం టమ్"


సాహితీమిత్రులారా!
ఒకరోజు భోజరాజు సభలో
"టం టం ట టం టం ట ట టం ట టం టమ్" - అనే
ఈ సమస్యను తన ఆస్థానంలోని కవీశ్వరులకు ఇచ్చాడట.
వెంటనే కాళిదాసు లేచి ఈ విధంగా పూరించాడు

రాజాభిషేకే మదవిహ్వలా యా
హస్తా చ్చ్యుతో హేమ ఘటో యువత్యా
సోపాన మార్గేఘ కరోతి శబ్దం
టం
        టం 
                 ట 
                        టం టం ట 
                                         ట టం ట 
                                                        టం టమ్

(రాజుగారి స్నానానికి నీళ్ళు
తెచ్చిన యువతి
అతని సౌందర్యానికి సమ్మోహితయై
చేతిలో ఉన్న బంగారు బిందెను జాఱ నిడిస్తే
అది మెట్లమీదపడి
టం టం టమ్మన్న శబ్దాన్ని చేసింది.)

ఇది యదార్థ గాథని వినికిడి.

Tuesday, May 10, 2016

మామకు మామయైన పరమాత్ముడు


మామకు మామయైన పరమాత్ముడు

సాహితీమిత్రులారా!
విచిత్రమైన చమత్కార ప్రార్థన.
ఇందులో 8 మంది మామలున్నారు.
చూడండి.

మామను సంహరించి, యొకమామకు గర్వమడంచి, యన్ని శా
మామను రాజుజేసి, యొకమామతనూజునకాత్మబంధువై
మామకుగన్నులిచ్చి, సుతుమన్మథుపత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్ను డయ్యెడున్

1. కంసుడనే మామను చంపి,
2. సమగద్రుడనేమామకు గర్వమణచి(రామావతారంలో)
3. చందమామను రాత్రికి రాజును చేసి (నానార్థాలలో రాజు అంటే చంద్రుడు అని ఒక అర్థం)
4. ఒకమామకొడుక్కు(అర్జునునికి) ఆత్మబంధవై,
5. ఒకమామకు కన్నులిచ్చి(రాయబారంలో ధృతరాష్ట్రునికి)
6. రతీదేవికి తానే మామయై,
7. సముద్రుడు విష్ణువుకు మామ,
8.ఈయనకు గంగను ఇచ్చినందున మామకు మామయైనాడు,
అటువంటి విష్ణువు ప్రసన్నుడై మాకు అనుగ్రహం కలిగించుగాక.

"స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి"



"స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి"


సాహితీమిత్రులారా!

శ్రీభగవాన్ రమణ మహర్షులవారిచే నాయనా అని పిలిపించుకున్న
వాసిష్ఠ గణపతిముని తన యౌవన ప్రారంభ దశలో నవద్వీపం వెళ్లి
అక్కడి పండిత పరిషత్తువారి సభలో పాల్గొని ఆశుకవిత,
సమస్యాపూరణ, వ్యాఖ్యాన నైపుణి అద్భుతంగా
ప్రదర్శించి కావ్యకంఠ నిరుదును పొంది
తెలుగువారి విజయపతాకం వచ్చాడు.
అక్కడ ఇవ్వబడిన సమస్య ఒకటి
ఇప్పుడు తెలుసుకుందాం.
"స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి"
- అనేది సమస్య
(అనగా- కుచాలమీది గుడ్డను తీసివేసి కోడలు
మామను కోరుతున్నది.)

దీన్ని పతివ్రతాపరంగా పూరించాలని పృచ్ఛకుని నియమం.


సమాధానం(పూరణ)-

హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా
స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి

(భీముని భార్య హిడింబ ఆటవిక. ఎండవేళ చెమట
బాధతో ఆమె ఉపరివస్త్రం తొలగించి వావగారైన
వాయువును కోరింది.
అంటే గాలికోసం పై గుడ్డ తీసేసిందని. అర్థం.)

ఇది అనేక అవధానాలలో సమస్యగా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ కొన్నిటిని గమనిద్దాం.

1. కుస వస్త్రంబు పరిత్యజించి సతి తా కోరెన్ తమిన్ మామనున్
దీనికి శ్రీ కడిమెళ్ళ వరప్రసాదుగారు
ఈ విధంగా పూరించారు.

శుచి సాహస్రము మిన్ను ముట్టినదియో చోద్యమ్ముగా సూర్యుడే
అచలుండౌచును ఆత ప్రసరణ వ్యాపారమున్ పూనెనో
విచలత్ గాత్రి హిడింబ గత్తమున పెన్వీకుల్ జనింపంగ తత్
కుచ వస్త్రంబు పరిత్యజించి సతి తా కోరెన్ తమిన్ మామనున్


2. శ్వశరునిగోరె సాధ్వి స్తనవస్త్రము తానె త్యజించి అద్దిరా
దీన్ని శాంతిశ్రీ బొత్సాకవిగారు
ఈ విధంగా పూరించారు.

అశమిత భీష్మగ్రీశ్మ సమయంబున ఊష్మభరంబు నోర్వగా
వశమది గాక ప్రాణులకు ప్రాణము త్రాణము వాయుదేవునిన్
విశచరియైన భీము రమణీమణి అల్ల హిడింబ డంబునన్
శ్వశరుని గోరె సాధ్వి స్తనవస్త్రము తానె త్యజించి అద్దిరా

ఏకవి ఏభాషలో పూరించినా
ఈ సమస్య భావము మాత్రం
కావ్యకంఠునిదే చెప్పి ఉన్నారు.

Monday, May 9, 2016

అపునరుక్త వ్యంజనం


అపునరుక్త వ్యంజనం

సాహితీమిత్రులారా!

ఒక పద్యం లేక శ్లోకం వచ్చిన హల్లు మళ్ళీరాకుండా(అపునరుక్తం) రాయడమే
అపునరుక్తవ్యంజనము అంటారు.

ఈ శ్లోకం చూడండి వచ్చిన హల్లు మళ్ళీ వచ్చిందేమో.

హతోచ్చండో ఢాఘ ఝాటావేల్లిదోషా మిళచ్ఛఠం
ఫణిశయ్యం రఙ్గనాథం భజే బుధ సుఖావకమ్

   (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-20)

(క్రూరపాపులు అయిన రాక్షసులను హతమార్చిన వానిని,
నాగేంద్రునిపానుపుగా కలిగిన వానిని,
దేవతలకు జ్ఞానులకు సుఖములను కూర్చువానిని
శ్రీరంగనాథుని సేవిస్తాను.)

అనులోమప్రతిలోమపాదం


అనులోమప్రతిలోమపాదం


సాహితీమిత్రులారా!
అనులోమము అనగా మొదటినుండి చివరకు,
ప్రతిలోమం అనగా చివరినుండి మొదటికి.
అనులోమప్రతిలోమపాదం అంటే
ఒక పాదం మొదటినుండి చివరకు మళ్ళీ చివరనుండి మొదటికి గల పాదం.
ఒకపాదం మొదటినుండి చివరకు రాసినది ఒకటవ పాదం.
 అదేపాదాన్ని చివరనుండి మొదటికి రాసిన అది రెండవ పాదం.
ఇదేవిధంగా మూడవ పాదం తిప్పిరాస్తే అది నాలుగవ పాదం ఏర్పడుతుంది.
ఈ విధంగా కూర్చబడిన శ్లోకం లేదా పద్యం అనులోమ ప్రతిలోమపాదం.
ఇక్కడ అలంకారశిరోభూషణే శబ్దాలంకారంలోని
32వ శ్లోకం ఉదహరించుకుందాం.

రంగవానరతం దేవం
వందేతం రనవాగరం
హారిదాన హితోమేయో
యోమేతోహి నదారిహా

(ఎవరు నిష్కల్మషదాటులకు మేలు చేస్తారో,
పరిమితిలేని ప్రభావం కలవాడో,
నిత్యశత్రువులయిన అరిషడ్వర్గాన్ని నాశనం చేస్తారో,
లక్ష్మిదేవి చేత ఆశ్రయించబడిన వాడో అట్టి
శ్రీరంగక్షేత్ర వాసాసక్తుడైన శ్రీరంగనాథుని ముందుగా
రసాత్మకమైన వాక్కులుగల కవినై
నేను నమస్కరిస్తున్నాను.)

ఈ శ్లోకంలో 1వ పాదం చివరనుండి చదివిన రెండవ పాదం ఏర్పడుచున్నది.
అలాగే 3వ పాదం చివరనుండి చదివిన 4వ పాదం ఏర్పడుచున్నది.
ఈ విధంగా ఏర్పడేదాన్ని అనులోమ ప్రతిలోమపాదం అంటారు.

Sunday, May 8, 2016

పాదగోపనం


పాదగోపనం

సాహితీమిత్రులారా!
పద్యంలో ఒక పాదాన్ని మిగిలిన పాదాలలో గోపనంచేసి చెప్పడాన్ని
పాదగోపనం లేక పాదగూఢం అంటారు.
ఈ గోపనం ఒక క్రమంలో కొందరు కూర్చారు.
క్రమరహితంగా కొందరు కూర్చారు.
ఇది ఇలా ఉంటే ఏపాదాన్ని గోపనం చేస్తారో దాన్ని
ఆ పేరుతో పిలుస్తారు.
మొదటి పాదం గోపనమైతే అది ప్రథమగూఢమని,
రెండవదైతే ద్వితీయ గూఢమని,
మూడవదైతే తృతీయ గూఢమని,
నాల్గవదైతే చతుర్థ గూఢమని పిలుస్తారు.
ఇక్కడ మనం
"అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం"లోని
26 వ శ్లోకాన్ని తెలుసుకుంటుంన్నాము.
ఇది ఒక క్రమంలో పాదగూఢం చేయబడిన చతుర్థపాదగూఢం.

పాపం మహిష్ఠం శ్యమాంగ స్థిరతారక్ష్య గమాధునా
శమయస్వాబ్ధి కన్యేశ పాహిమాం రంగనాయక


(నీలదేహా నిరంతరం మొక్కవోని విక్రమం
గల దృఢుడైన గరుడునిపై ప్రయాణించువాడా!
సాగరకన్యకా వల్లభా! రంగనాయకా!
గొప్పదైన ఈ లోకమందలి కలుషాదులను
అణచివేసి నన్ను రక్షించు.)

ఈ శ్లోకంలో 1,3,5,7,9,11,13,15 అక్షరాలను వరుసగా
తీసుకుంటే పాహిమాం రగనాయక - అని వస్తుంది.
అది నాల్గవపాదం. ఇక్కడ మరో విషయం గమనించాలి
రంగనాయకకు బదులుగా రగనాయక అని వచ్చింది.
చిత్రకవిత్వంలో పూర్ణనుస్వార విసర్గలకు
నియమం సడలింపు కలదు.

ఏవి తల్లీ - పేరడీ


ఏవి తల్లీ - పేరడీ

సాహితీమిత్రులారా!

ఖడ్గసృష్టి లో
శ్రీశ్రీ రాసిన
"ఏవి తల్లీ"
("THE SNOWS OF YESTER YEAR" )
 (ఇది F. Villon  అనుసరణ.)
అనే కవిత చూడండి.

చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?

కాళిదాస మహా కవీంద్రుని 
కవన వాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా
ఉంది? చూపించు?

షాజహాన్ అంత:పురములో
షట్పదీ శింజాన మెక్కడ!
ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన
సైంధవం నేడేది తల్లీ?

రుద్రమాంబా భద్రకాళీ
లోచనోజ్వల రోచులేవీ!
ఖడ్గతిక్కన కదనకాహళ
కహకహ ధ్వనులెక్కడమ్మా?

ఎక్కడమ్మా కృష్ణరాయని
బాహు జాగ్రద్బాడబగ్నులు?
బాలచంద్రుని బ్రహ్మనాయని
ప్రాణవాయువు లేవి తల్లీ?

జగద్గురువులు, చక్రవర్తులు, 
సత్కవీశులు, సైన్యనాధులు
మానవీరులగు మహారాజ్ఞులు
కానరారేమీ?

పసిడిరెక్కలు విసిరికాలం
పారిపోయిన జాడలోవీ?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన


హిమ సమూహములు?

పై కవితకు పేరడీ
అబ్బూరి వరదరాజేశ్వరరావు
కవితాసంచికలోనిది

నిరుడు విరిసిన నీలగగనం
నేడు కనపడదమ్మా
నిరుడు విరసిన శీతవాయువు
నేడు మసలదు తల్లీ!

నీలిరెక్కల కాలవిహంగం
నీడ జిక్కితి  తల్లీ!
జాలికన్నుల కారుచీకటి
మ్రోల నిలిచితి నమ్మా!

ఖంగుమన్నవి మృత్యుదేవత
కాలి యందెలు తల్లీ!
చరమ రాత్రించరుల సన్నిధి
జలదరించితి నమ్మా!

కలల బ్రతుకున గాలిమేడలు
కరిగిపోయినవమ్మా!
వెలితి కన్నుల వెలుగుకోసము
వెదకికొందును తల్లీ!

స్వేచ్ఛకోరిన పేదరక్తము
వెల్లబారిన దమ్మా
జనసమరమున పరాజితుడను
సెలవొసంగుము తల్లీ!

ధ్యేషబుద్ధిని ధిక్కరిస్తే
దోషమెవరిది తల్లీ!
తీరులేనిది నేటిలోకము
నేరమెవ్వరి దమ్మా!


Saturday, May 7, 2016

దేవీఅశ్వధాటీ


దేవీఅశ్వధాటీ


సాహితీమిత్రులారా!
అశ్వధాటీవృత్తంలో
అత్యద్భుతమైన కాళిదాసుగారి రచన దేవీఅశ్వధాటి
దాన్ని శ్రీమాడుగుల నాగఫణిశర్మగారి గాత్రంతో వినండి. 
తెలుగు అర్థంతోటి చూస్తూ ఆలకించండి.




ఏకాక్షరి


ఏకాక్షరి(ఏకవ్యంజనము)


సాహితీమిత్రులారా!

ఇంతకు మునుపు ఏకాక్షరి గురించి వివరించుకొని ఉన్నాము.
ఒకే హల్లుతో కూర్చబడిన పద్యం లేక శ్లోకం.
ఇక్కడ మరొక ఏకాక్షరి యమకరత్నాకరంలోనిది చూడండి.

యాయాయాయాయాయా
యాయాయాయాయయాయయాయాయా:
యాయాయాయాయాయా
యాయాయాయాయయాయయాయాయా: (12 - 54)

(ఓ జగదీశుడా! సకలైశ్వర్యసంపన్నుడా! లక్ష్మీసహచరుడా!
స్థావరజంగములయొక్క సమృద్ధికిని,
బ్రహ్మాదులయొక్క ఉత్పత్తిసంపత్యాదులకును,
కారణభూతురాలైన లక్ష్మీదేవితోగూడ
నీవు నా ముందరకు వచ్చి సేవప్రసాదిచవలెను.)

సర్వగురువచనము



సర్వగురువచనము


సాహితీమిత్రులారా!

ఒక పద్యంకాని, శ్లోకంకాని, వచనంకాని అన్నీ గురువులే
ఉంటే దాన్ని సర్వగురు చిత్రం అంటారు.
అదే వచనం అయితే సర్వగురు వచనమని,
పద్యం అయితే సర్వగురు పద్యం అని అంటారు.

ఇక్కడ
గణపవరపు వేంకటకవి ప్రణీతమైన
"ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము"
లోని 447ది.
చూడండి.

వ. ఆవేశం దాశ్చర్యారూఢాత్మాం
భోజాతోద్యత్కందర్పాటోపస్ఫాయన్నా
రాచస్తోమశ్రేష్టోద్బోధాదీనాం చ ద్బోధానైపుణ్య 
ప్రౌఢిశ్రీనారీరత్నం నిట్లూహించెన్.

Friday, May 6, 2016

"రామాసామారామా"


"రామాసామారామా"


సాహితీమిత్రులారా!
నాలుగు స్వరాలు(అచ్చులు) ఉపయోగించి కూర్చిన
శ్లోకం లేదా పద్యంను చతుస్స్వరనియమము అంటారు.
అది దీర్ఘాలతో కూర్చిన దీర్ఘచతుస్స్వరనియమము అంటాము.
ఇప్పుడు చెప్పుకునే ఉదాహరణ అన్నీ దీర్ఘాలతో కూడినది.
ఇది ఆంధ్రకావ్యాదర్శములోనిది.

రామాసామారామా
కీమీ స్ఫీతీ నీశ్రీ
రోమోద్బోదోద్యోగో
త్ప్రేమేభేంద్రేడ్యేట్టే (3-87)




దీనిలో ప్రతిపాదానికి ఒక స్వరం చొప్పున నాలుగు పాదాలకు నాలుగు స్వరాలు
 అవి దీర్ఘస్వరాలతో కూర్చబడ్డాయి.
 మొదటిపాదం - "ఆ",
2వ పాదం - "ఈ",
3వ పాదం- "ఓ",
4వ పాదం - "ఏ"
 
- అనే స్వరాలు తీసుకోవడం జరిగింది.
(రామా, సామ - సామవేదం, ఆరామ - విరామస్థానంగా గలవాడా,
 కీ - సుఖముగలవాడా, మీ - లక్ష్మిగలవాడా, భీ - కాంతిగలవారియొక్క,
ఇతీ - పొందుటగలవాడా, అధవాభీ - కాంతిగలవాడా, ఇతీ - జ్ఞానముగలవాడా,
నీశ్రీ. రోమోద్బోధ - రోమాంచముయొక్క, ఉద్యోగ - ఎక్కువగా కూర్చుటగల,
ఉత్ప్రమ - గొప్పభక్తిగల, ఇభేంద్ర - గజేంద్రునిచే, ఈడ్య - స్తుతింపదగ్గ,
ఈట్టే - ప్రభవిష్ణువే - నీశోభ భక్తశ్లాఘ్యమును దురితహరణ సమర్థముననుట)

ఇది స్వరముతోటి కూడిన చిత్రం.
కావున ఇది "స్వరచిత్రం".

శ్రీశ్రీ - త్య్రక్షర కందం


శ్రీశ్రీ - త్య్రక్షర కందం


సాహితీమిత్రులారా!

కేవలం మూడు హల్లులతో పద్యాన్ని లేదా శ్లోకాన్ని
కూర్చిన  దాన్ని "త్య్రక్షరి" అంటారు.
అది కందం అయితే "త్య్రక్షరకందం" అంటారు.
ఈ పద్యం సిప్రాలిలో సిరిసిరిమువ్వ -16లోనిది.

మనసాని నిసిన సీమా
మనసా మసిమనిసి మనసు మాసిన సీనా
సినిమానస మాసనమా
సినిమానిసి సీమసాని (సిరిసిరిమువ్వా!)

దీనిలో సిరిసిరిమువ్వా అనేది మకుటం దాన్ని వదలితే
 మిగిలిన వాటిలో మ,న,స - అనే హల్లులు వాడి పద్యాన్ని
కూర్చడం జరిగింది.
దీనిలో 8 పదాలు ఉన్నాయి.
 1.మనసు,2. సాని, 3. నిసి, 4. సీమ,
5. మసి, 6. సీను, 7. సినిమా, 8. ఆసనము.

Thursday, May 5, 2016

అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్


అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్


పాహితీమిత్రులారా!
మంచి వయసులో ఉన్న అందగత్తె నాకూతురుంది.
ప్రౌఢ శృంగార నిపుణను నేనున్నాను.
కొత్తగా ఆరంగేట్రం చేసిన మనుమరాలుంది.
మరి వీళ్ళలో ఎవరుకావాలి?
ఆ కూతురుని వరించి అల్లుడవుతావా?
 నన్ను వరించి మగడివవుతావా?
 లేక మనుమరాలిని వరించి మనుమడివవుతావా?
 అని ఒక వేశ్య విటుని అడిగందట.
దానికి విటుడు ఈ విధంగా చెప్పాడు.

మొల్ల సుగంధి కూతురది ముంగిట నున్నది దాని మాన నీ
వెల్ల విధంబులన్ రతుల నేలెడు దానవు నిన్ను మాన ను
త్ఫుల్ల సరోజ గంధి వరపుత్రిక పుత్రిక దాని మాన - నీ
కల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెద నీ మనుమండ నయ్యెదన్

నేనెవరినీ వదలను.
నీకు అల్లుడిని, మగడిని, మనుమడిని అన్నీ అవుతానన్నాడట
ఆ విటుడు.

ఇది గతంలోని చమత్కారపద్యం.
కానీ దీనిలోని
"అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్"- అనే సమస్యను
కొంచెం మార్చి అక్రమ సంబంధంకాకుండా సక్రమ సంబంధం వచ్చేవిధంగా చెప్పమని
అవధానంలో ఒక పృచ్ఛకుడు మిన్నెకంటి గురునాథశర్మగారిని అడిగాడట.
దానికి వారి పద్యం చూడండి.

ఎల్ల సురల్  వినంగ హరి యిట్లనె భూ సుత సీత బొందితిన్
నీళ్ళను మున్గనట్టి ధరణీ సతిఁగౌగిట గ్రుచ్చి యెత్తితిన్
తల్లికి తల్లియౌ సతి నెదన్ ధరియించితిగాన భూమికిన్
అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్

అని పూరించాడు.

(దేవతలందరూ వినగా విష్ణువు ఇలా అన్నాడు -
భూపుత్రిక సీతను పెండ్లాడాను(రామావతారంలో)
భూమిని పెళ్ళాడాను (వరాహావతారంలో)
లక్ష్మిని పెళ్ళాడాను (సముద్ర మథనానంతరం) -
ఇక్కడ విష్ణుపాదంలో గంగ పుట్టింది.
విష్ణువు భార్య భూదేవి.కనుక గంగ భూమికి కూతురువరుస.
గంగ సముద్రుని భార్య. నదులన్నీ సముద్రుని భార్య కదా!
సముద్రంలో పుట్టింది లక్ష్మి కావున లక్ష్మి గంగ కూతురి వరుస.
భూమికి మనుమరాలి వరుస.
కూతురును తల్లీ అని పిలువడం ఉంది.
కనుక ఈ వరుసల ప్రకారం భూమికి, భూమిసుతకు, గంగాసుతలక్ష్మికి -
మూడు తరాల వారికి విష్ణవు భర్త కనుక
భూమికి అల్లుడు, మగడు, మనుమడు వరుసలు సరిపోయాయి.
ఇవన్నీ ధర్మబద్ధమైన బంధాలే.)

తలకట్ల కందం


తలకట్ల కందం

సాహితీమిత్రులారా!
ఒక పద్యంలో కేవలం తలకట్లనే ఉపయోగించి కూర్చిన దాన్ని తలకట్ల పద్యం అంటారు.
అది కందపద్యం అయితే తలకట్లకందం అంటాము. ఇది కేవలం తెలుగులో మాత్రమే కలదు.
అంటే కేవలం "అ" - స్వరాన్ని ఉపయోగించి పద్యాన్ని కూర్చటం.
దీనికి ఉదాహరణగా పోకూరి కాశీపతిగారి
"సారంగధరీయం"(త్ర్యర్థి కావ్యం)లోనిది.

గజచర్మ వసన కనదం
గజమదహర యచలసదన గరళగళ లస
ద్గజవదనజనక యస్మ
ద్భజనం బరయం గదయ్య భయమడఁప దయన్ (2-125)

(ఏనుగు తోలును ధరించినవాడా! ప్రకాశమానమైన మన్మథుని
గర్వమును హరించినవాడా! పర్వతనిలయుడా!
విషమును కంఠమునందుగలవాడా!
మనోజ్ఞమైన వినాయకునికి తండ్రివైనవాడా!
ప్రేమతో నాభయం తగ్గేందుకు
నాసేవను ఓ అయ్యా చూడగదవే.)
ఈ పద్యంలో దేనికి కూడా తలకట్టు తప్ప
వేరే గుణితము లేదుకదా!
కావున
ఇది తలకట్లకందం.

Wednesday, May 4, 2016

ఐషుడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరు సేతు నెప్పుడున్


ఐషుడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరు సేతు నెప్పుడున్


సాహితీమిత్రులారా!

బహుభాషాకోవిదులైన ఆదిభట్ల నారాయణదాసుగారు చేసిన
ఈశ్వర ప్రార్థన చూడండి.

హెడ్డున మూను, స్కిన్ను పయి నెంతయు డస్టును, ఫైరునేత్రమున్,
సైడున గ్రేటు బుల్లు, బహు చక్కని గాంజెసు హైరులోపలన్,
బాడికి హాఫెయౌచు నల పార్వతి మౌంటెను డాటరుండ, ఐ
షుడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరుసేతు నెప్పుడున్

(తలపై నెలవంక, శరీరమంతా భస్మలేపనం,
నుదుట అగ్నినేత్రం, ప్రక్కనే గొప్పనంది,జటలో(తలపై) గంగ,
శరీరంలో సగం పర్వతరాజపుత్రి పార్వతి తో
సాక్షాత్కరించెడి శివుని ప్రార్థింతును.)

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు

సాహితీమిత్రులరా!

పేరడీ పద్యాలు మరికొన్ని చూడండి.

నాయని సుబ్బారావుగారు రాసిన చంద్రాస్తమయమును ఉద్దేశించిన పద్యం

ఎవ్వడా క్రూరకర్మకు డెవడు? నీల
జలద నిర్ముక్త శైశిర శర్వరీ ప్ర
శాంత మలవాటుపడిన నిశాంతమందు
అకట! నట్టింటి దీపమ్ము నార్పినాడు?


జరుక్ శాస్త్రి పేరడీ

ఎవ్వడా చచ్చునాగమ్మ యెవడు?
నేను ప్రేయసీ విరహాన నిర్మించుకొన్న
రమణి మంజుల ప్రణయ చిత్రమ్ముపైన
నిండు నీల్కాలు బుడ్డి తన్నేసినాడు?


సుమతీ శతక పద్యం

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!

పై పద్యానికి పేరడీ

అక్కరకు రాని బస్సును
చక్కగ సినిమాకు రాక సణిగెడు భార్యన్
ఉక్కగ నుండు కొంపను
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!

Tuesday, May 3, 2016

"పరమహిలా జారపురిసేహిం "


"పరమహిలా జారపురిసేహిం "


సాహితీమిత్రులారా!

ప్రాకృతంలో "సురసున్దరీచరియం" అనే కావ్యం ఒక ప్రేమాఖ్యానం.
దీన్ని క్రీ.శ. 1095లో "ఘనేశ్వరసూరి" రచించాడు.
ఇందులో 4001 గాథలున్నాయి. దీనిలో ప్రధానమైన కథ సురసుందరీ కథ.
ఇది చాల చిన్నకథ. దీనిచుట్టు అనేక కథలు అల్లబడ్డాయి.
దీనిలో సురసుందరి మకరకేతును పెండ్లాడుతుంది.
వీరిద్దరు ఉద్యానవనంలో క్రీడించే సమయంలోని
ప్రశ్నోత్తరచిత్రం ఇక్కడ గమనిద్దాం.


కిం ధరఇ పిన్నచందో, కిం వా ఇచ్ఛంతి పామరా భిత్తే
ఆమంతసు అంతగురుం కిం వా సోక్ఖం పుణో సోక్ఖం
దట్ఠూణ కిం విసట్ఠఇ కుసుమవణం జణియజణమణాణందం
కహ ణు రమిజ్జఇ పఢమం పరమహిలా జారపురిసేహిం

ఇందులోని అన్ని ప్రశ్నకు సమాధానం - స-సం-కం

1. పూర్ణచంద్రుడు తనలో దేనిని ధరిస్తాడు
జ.- ససం (చెవుల పిల్లిని ధరిస్తాడు)

2. వ్యవసాయదారులు వ్యవసాయానికి ఏమి కావాలని కోరుకుంటారు
జ.- కం (జలం)

3. చివర గురువున్న (గణం) ఏది
జ.- స (స - గణం)

4. సుఖం ఏది
జ.- సం -శం(సుఖం)

5. మళ్లీ సుఖం ఏది
జ.- కం (సుఖం)

6. పుష్పసముదాయాలు ఎవనిని చూచి వికసిస్తాయి
జ.- ససంకం - శశాఙ్కమ్ (చంద్రుణ్ణి)

7- పరస్త్రీ ఎవరైనా జారపురుషునితో మొదట ఎలా రమిస్తుంది
జ.- సశంకం (శంకిస్తూ, భయపడుతూ)

రాంగు గోయింగు ఈ మాడరన్ లివింగు!!


రాంగు గోయింగు ఈ మాడరన్ లివింగు!!


సాహితీమిత్రులారా!
చిత్రకవిత్వంలో భాషాచిత్రం అనేది ఒకటి.
ఇందులో ఆంగ్లపదాలు ఎక్కువగాను తెలుగు పదాలు తక్కువగాను
కూర్చిన సీసపద్యం ఇది. చూడండి.


సందులో శ్టాండింగు సతులకై వెయిటింగు
      మోడరన్ డ్రస్సింగు పోజ్ గివింగు!
సిగరెట్సు స్మోకింగు - సినిమాస్కు గోయింగు
      ప్రెండ్సుతో మూవింగు వాండరింగు!
ఇరిటేటు మైండింగు హిప్పీసు కట్టింగు
      రెకులెస్సు టాకింగు రీజనింగు!
కోయిన్సు స్పెండింగు గుడ్నాట్టు హియరింగు
      రెఛడుగా హెడ్ స్ట్రాంగు రిప్లయింగు!
విలను పోజింగు తండ్రికి వేవరింగు
తల్లి ఫియరింగు కార్యసాధన నథింగు
భవ్యవైఖరి తమ్ముళ్ళు ఫాలొయింగు
రాంగు గోయింగు ఈ మోడరన్ లివింగు!!

Monday, May 2, 2016

పేరడీ పద్యాలు - అనుకరణ పద్యాలు


పేరడీ పద్యాలు - అనుకరణ పద్యాలు


సాహితీమిత్రులారా!

ఇది బద్దెన సుమతి శతకంలోనిది.

అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుఁడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర చొరకుము సుమతీ!

దీనికి శ్రీశ్రీ పేరడీ పద్యం

ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీనొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా

 అనుకరణ పద్యాలు

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచెముండు టెల్లఁగొదువ కాదు
కొండ యద్దమందుఁగొంచమై యుండదా
విశ్వదాభిరామ! వినురవేమ!

దీనికి అనుకరణ పద్యం

అనువుగాని వేళ నధికుల మనరాదు
కాలమెఱింగి రీతిఁగడపవలయు
విశ్వమేలు నకులుఁడశ్వశిక్షకుఁడాయె
నేమి సేయవచ్చు నీశ్వరాజ్ఢ

"నహీతో ఛోడో గాంవ్"


"నహీతో ఛోడో గాంవ్"


సాహితీమిత్రులారా!

క్రీ.శ. 1324లో నివసించిన అమీర్ ఖుస్రూ పారశీక కవి.
ఈయన హిందీలోనూ కవిత్వం చెప్పినవాడు.
ఒకానొకచోట తను ఢిల్లీపరిసరాల్లో మాట్టాడే భాషలోనే కవిత్వం రాస్తానన్నాడు.
ఒక ఫారసీ పద్యంలో ఈ విధంగా అన్నాడు.

చు మన్ తూతియే హిందమ్, అర్ రాస్త్ పుర్సీ
జెమన్ హిందు యీ పుర్స్, తానగ్జ్ గోయమ్
(వాస్తవంగా నేను భారతీయ శుకమను-
నన్నేదయిన అడుగదలచిన హిందుయీ లో అడుగుడు.
అందు మధురముగా మాటాడ గలను.)
ఇక్కడ హిందుయీ అనగా హందీకి మొదటి పేరు.

ఈ కవి చెప్పిన ఒక పొడుపు పద్యం

బాలా థాజబ్ మన్ కో భాయా
బడా హు వా కుచ్ కామ్ న ఆయా
ఖుస్రూ క హ దియా ఉస్కా నాఁవ్
బూఝై నహీతో ఛోడో గాంవ్

(బాల్యమున అది మనోహరమైనది.
 పెఱిగిన పిదప ఎందుకును పనికిరాలేదు
(ఖుస్రూ అన్నాడు) దానిపేరు ఊహించండి
లేదా ఊరు విడిచి పొండు)
సమాధానము - దీపం

మరో పొడుపు పద్యం

ఏక్ థాల్ మోతీసే భరా,
సబ్ కే సర్ పర్ ఔంథా ధరా,
చారోఁ ఓర్ వో థాల్ ఫిరై,
మోతీ ఉన్ సే ఏక్ న గిరై.

(ముత్యములతో నిండిన ఒక పళ్లెరము
 అందఱ తలలపైన బోర్లించి ఉన్నది
 ఆ పళ్లెరము నాల్గు వైపుల తిరుగుచున్నను
 అందుండి ఒక ముత్యమైనను రాలదు.)

సమాధానము - ఆకాశము

Sunday, May 1, 2016

దీని భావమేమి?


దీని భావమేమి?


సాహితీమిత్రులారా!

ఈ క్రింది పద్యం భావమేమిటో గమనించండి.

మూడు శిరములుండు, ముద మొప్ప పదికాళ్ళు
కరములుండు రెండు, కన్నులారు
కొమ్ములెన్న నాలుగును, తోకలు మూడు
దీని భావమేమి తిరమలేశ!

సమాధానం - నాగలిదున్నే రైతు

నాగలికి రెండు ఎడ్లను కట్టినపుడు 2 ఎడ్లు 1 మనిషి మొత్తం మూడు తలల,
రెండెడ్లకు 8, మనిషికి రెండు మొత్తం 10 కాళ్ళు,
మనిషి మాత్రమే కరములు అవి రెండు,
రెండెడ్లకు మనిషికి మొత్తం 6 కండ్లు, రెండెడ్లకు 4 కొమ్ములు,
రెండెడ్లకు నాగలికి(మేడితేక) మొత్తం మూడు తోకలు.
ఇదీ దీని అర్థం.