Thursday, April 29, 2021

ఏడు కాండలు ఒకే శ్లోకంలో........

 ఏడు కాండలు ఒకే శ్లోకంలో........




సాహితీమిత్రులారా!



వాల్మీకి నోట అప్రయత్నంగా వెలువడిన ఛందోబద్ధమైన వాక్యం
అవే వాక్యంలోని పదాలను గమనిస్తే అవి అనుష్టుప్ ఛందస్సులో
వ్రాయబడిన శ్లోకంగా గమనించ వచ్చు. ఆ శ్లోకం-

మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ శ్శాశ్వతీస్సమాః
యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్

                                                  (శ్రీమద్రామాయణం- బాలకాండ - 2 - 15)

ఓరి నిషాదుడా! పరస్పరం కామమోహంతో ఉన్న పక్షులలో పోతుపిట్టను
చంపిన కారణంగా ఎక్కువకాలం నువ్వుండరాదు సుమా! - అని ఒక
తిట్టు దీని భావం.

మంగళాచరణ శ్లోకంగా దీని అర్థం-

ఓ శ్రీనివాస!(మానిషాద) ఓరామా!  సీతవిషయంలో కామమోహితుడైన రావణుణ్ణి, రావణమండోదరుల జంటనుండి చంపి శాశ్వత ప్రిష్ఠనీ, కీర్తినీ పొందుదువుగాక!

రామాయణంలోని అన్నికాండల కథా వస్తువులు దీనిలో
ఉండాలని సరస్వతీదేవి ఇలా పలికించిందని చెబుతారు
దాని వివరణ-

ఏడు పదాలు ఏడు కాండలను సూచిస్తాయని
వివరించడం జరిగింది-

1. బాలకాండ - మానిషాద - సీతా భర్తా(సీత వివాహం ప్రధానమైంది)

2. అయోధ్యకాండ - ప్రతిష్ఠాం త్వమగమః - పితృవాక్యపరిపాలన జగద్విఖ్యాతి

3. అరణ్యకాండ - శాశ్వతీస్సమాగమాః - ప్రతిజ్ఞాపాలన కోసం అనేక సంవత్సరాలు వనవాసం

4. కిష్కింధకాండ - క్రౌంచమిథునాత్ -కుటిల ప్రవర్తనకల తారవాలి జంటలో వాలిని చంపడం

5. సుందరకాండ - ఏకమ్ - కార్యసాధకుడు ఒక్కడు, అసహాయశూరుడు హనుమంతుడు

6. యుద్ధకాండ - అవధీః - రావణవధ

7. ఉత్తరకాండ - కామమోహితమ్ - సీతారాముల వైకుంఠ ప్రయాణం

Monday, April 26, 2021

పద్యగోపన కవిత

 పద్యగోపన కవిత



సాహితీమిత్రులారా!



ఈ కవితలో ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి.

కాని వీటిని ఒక కవితగా వ్రాశాడు ఎలనాగగారు

చూడండి-

పుస్తకమే నయం

కుమిలిపోయిన ఆత్మల మీద

ప్రేమతో కాస్త ప్రమోదరశ్మిని

సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది

ఈ ఆస్తిని యెప్పుడూ

మన గృహాంతర సంపద

చేయగల్గినామా

స్తిమితం అనేది

మన మానసవీధిని

కమ్మటం నిజం


అక్షరమే అనంత నిధి

ఆ యెరుకే

వొక సాటి లేని భాగ్యం

క్షితిపై మనీష

తన కాంతిని పూసిన

సాధనం యిదే

సాక్షరుడైనవాడి మనసంత

వసంత విరాజితం!

అనంతాక్షర

సౌరభాల గనులైన

కితాబుల మైత్రి ఓ వరం

                                  (వాకిలి సాహిత్య పత్రిక  నుండి)


ఈ కవితలోని 

ఉత్పలమాల పద్యాలు-


పుస్తకమే నయం కుమిలిపోయిన ఆత్మల మీద ప్రేమతో 

కాస్త ప్రమోదరశ్మిని సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది ఈ 

ఆస్తిని యెప్పుడూ మన గృహాంతర సంపద చేయగల్గినా

మా స్తిమితం అనేది మన మానసవీధిని కమ్మటం నిజం


అక్షరమే అనంత నిధి ఆ యెరుకే వొక సాటి లేని భా

గ్యం క్షితిపై మనీష తన కాంతిని పూసిన సాధనం యిదే

సాక్షరుడైనవాడి మనసంత వసంత విరాజితం! అనం

తాక్షర సౌరభాల గనులైన కితాబుల మైత్రి ఓ వరం


Saturday, April 24, 2021

ప్రయాణం ఎందుకు ఆపుకున్నానంటే...........

 ప్రయాణం ఎందుకు ఆపుకున్నానంటే...........




సాహితీమిత్రులారా!



నాయకుడు దూరదేశ ప్రయాణానికి

పయనమై ఉండి నిలిచిపోయాడు దానికి

ఒక మిత్రుడు "చెలికాడా! ప్రయాణం

ఏల నిలుపుకున్నావు" అని ప్రశ్నించాడు

దానికి ఆ నాయకుడు చెప్పిన బదులు ఈ శ్లోకం -


శీతే శీతకరో2మ్బుజే కువలయద్వన్ద్వాద్వినిర్గచ్ఛతి

స్వచ్ఛా మౌక్తికసంహతిర్ధవళిమాహైమీం లతామఞ్చితి,

స్పర్శాత్ పఙ్కజకోశయోరభినవాయాన్తిస్రజ:క్లాన్తతా

మేషోత్పాతపరమ్పరా మమ సఖే, యాత్రాస్పృహాంకృన్తతి

                                                           (పంచబాణవిలాసం లోనిది)


ఆకాశంలోని చంద్రుడు నేలమీది కమలంనందు పడుకొన్నాడు,

ముత్యాలు నల్లకలువల్లో పట్టినవి, బంగారుతీగ స్వభావసిద్ధమైన

పసుపు రంగును వదలి తెల్లబడింది, అప్పుడే గుచ్చిన పువ్వుల సరాలు

తామరమొగ్గలు తగలడంతో వాడిపోయాయి ఇలాంటి దుశ్శకునాలు

కనిపించడం వల్ల మంచిది కాదనిఅంటారు

ఇన్ని ఉత్పాతాలు ఒక్కసారే రావడం చేత

ప్రయాణం ఆపుకొన్నాను - అని

చెప్పాడట.

ఇది పైకి కనిపించే అర్థం.


నిజమైన అర్థం -

ఆకాశంలోని చంద్రుడు నేలమీది కమలంలో పడుకున్నాడు

అంటే నా ప్రియురాలు నా వియోగం ఓర్చుకోలేక తనకమలాల్లాంటి

చేతుల్లో చంద్రునివంటి ముఖాన్ని పెట్టుకున్నది అని అర్థం.

ముత్యాలు నల్లకలువల్లో పుట్టాయి అంటే నల్లకలువల్లాంటి

రెండు కళ్ళనుండి ముత్యాల్లాంటి కన్నీరు వచ్చిందని

అంటే తన భార్య కంటికి కాటుకైనా పెట్టుకోనందున స్వచ్ఛమైన

ముత్యాల్లాంటి కన్నీరు కార్చిందని అర్థం.

బంగారు తీగలాంటి ఆమే శరీరపు రంగు

విరహతాపంచేత తెల్లబడింది అని అర్థం.

తామరమొగ్గల్లాంటి స్తనాలకు తగిలి వేసుకున్న

పూలదండలు వాడిపోయాయని

అంతటి విరహతాపం ఉందని అర్థం.

ఇన్ని అవస్థలు చూచినా ప్రయాణం

మంచిదికాదని మానుకున్నాను అని చెప్పాడు.

Thursday, April 22, 2021

పెదిమలు తగిలి - తగలని పద్యాలు

 పెదిమలు తగిలి - తగలని పద్యాలు




సాహితీమిత్రులారా!



చదివే సమయంలో
పెదవి మాత్రమే తగిలే పద్యం-

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా


చదివే సమయంలో  పెదవులు తగలిది-

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవితగలినిది తరువాతి అక్షరం తగిలేది

అంటే పెదవి తగలనిది తగలేది ఈ పద్యం -

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా



Sunday, April 18, 2021

చెప్పలేకున్న నగుదునే చిన్ననగవు

 చెప్పలేకున్న నగుదునే చిన్ననగవు





సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి 

సమాధానాలు చెప్పగలరేమో


ఆజ్యంబు, వీరుని యాత్మగుణంబునుఁ

              గలకాయ యోదియో తెలియవలయు

అతిమతి భ్రష్టుండు నలపుచ్చయును, రెండుఁ

              గలకాయ యోదియో తెలియవలయు

దేశంబు, జనుల హృదికిబాధయనునవిఁ

              గలకాయ యోదియో తెలియవలయు

చిఱుత తనంబును, చిన్నదె్బయు రెండుఁ

             గలకాయ యోదియో తెలియవలయు

దీనియర్థంబు చెప్పంగ మానవులకు

మహిని గడువిత్త పదునైదు మాసములను

సమ్మతిగఁజెప్ప భావజ్ఞ చక్రవర్తి

చెప్పలేకున్న నగుదునే చిన్ననగవు


ప్రతిపాదంలో రెండు పదాలున్నాయి 

వాటిని కలిపి వచ్చే ఒకేపదం ఉత్తరం

సమాధానాలు చెప్పగలరేమో గమనించండి-


సమాధానాలు-

ఆజ్యంబు, వీరుని యాత్మగుణంబునుఁ

              గలకాయ యోదియో తెలియవలయు

దీనిలో ఆజ్యము నెయ్యి, వీరుని ఆత్మగుణం బీరం

రెండిటిని కలిపిన కాయ

నేతిబీరకాయ సమాధానం


2. వెఱ్ఱిపుచ్చకాయ

3. సీమచింతకాయ

4. చిట్టిమొట్టికాయ

Friday, April 16, 2021

చెప్పలేకున్న నగుదునే చిన్ననగవు

చెప్పలేకున్న నగుదునే చిన్ననగవు





సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి-

సమాధానం చెప్పగలరేమో


కొమ్ములుగలవని కోపించి పొడువదు

            కట్టిబంధించిన కదలకుండు

నీనదుపొర్లదు యెన్నాళ్లకైనను

           బంధంబు వేసిన పాలుగలవు

మేతకాసించదు మేఘంబులోనీరు

          కావలెననికోరు కడుపునిండ

తనకడ్పునిండిన దారిద్య్రములు బాపు

          బహుజీవరాసులు బ్రతుకనేర్చు

దీని యర్థంబు నరులకుఁ దేటపడఁగఁ

మదివిచారించి పదునైదు మాసములకు

సమ్మతిగఁజెప్ప భావజ్ఞ చక్రవర్తి

చెప్పలేకున్న నగుదునే చిన్ననగవు


ఈ పొడుపుపద్యం విచ్చడానికి కవి 15 మాసాల 

సమయం ఇచ్చాడు అప్పటికి చెప్పలేకపోతే

చిన్న నవ్వు నవ్వుతాడట


సమాధానం - చెఱువు 

Tuesday, April 13, 2021

ఏ ఆవురా బావా!

 ఏ ఆవురా బావా!




సాహితీమిత్రులారా!



ఈ పద్యాన్ని చూచి

సమాధానం చెప్పగలరేమో చూడండి-


బావయు మఱదింగని, యీ

యావులలో నొకటి తెమ్మి యనఁగా నపుడే

యావన, యడిగిన వాక్యము

కావలయును భాషలైదుగా నొక పదమున్


బావ మరదిని చూచి  ఈ ఆవులలో ఒకదాన్ని తెమ్మన్నాడు

దానికి మరది ఏ ఆవురా బావా అని అడిగాడు

అడిగిన వాక్యం ఐదు భాషలుగా కావాలి ఆ పదమేది - 


సమాధానం-

ఏ ఆవురా బావా

దీనిలో 

ఏ - రమ్ము(మహారాష్ట్ర)

ఆవు - రమ్ము(ఉర్దూ)

రా  - రమ్ము(తెలుగు)

బా - కమ్ము (కన్నడ)

వా - రమ్ము(తమిళం)

Sunday, April 11, 2021

కుంభజుదేనిచేఁగూల్చెనరుడు

 కుంభజుదేనిచేఁగూల్చెనరుడు




సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం చూడండి

సమాధానాలు చెప్పగలరేమో


దివ్యసంఘములైన తేరిచూడఁగలేని

            కుంభజుదేనిచేఁ గూల్చెనరుడు

ప్రతినఁదీరకయుంటఁ బ్రాణావశిష్టుఁడౌ

            కౌంతేయు దేనిచేఁ గాచెనుహరి

సరసిజవ్యూహాన శత్రుసైన్యంబుల

            నభిమన్యుఁడెందుచే నడలఁగొట్టె

కౌరవ్య యోధులఁ గపట కేళినటించి

            తేజమున్ దేనిచేఁ దీసెహరియు

ధర్మపథ మెందుచేఁ జేరె ధర్మరాజు

యన్నిటికిఁజూడ మూఁడేసి యక్షరములు

మధ్యకడ యక్షరములు, సమానమన్ని

కూర్చె గంగాధరము చెల్సికొండు దీని


ఇందులో సమాధానాల్ని 3 అక్షరాలతోనూ

మధ్య చివరి రెండు అక్షరాలు అన్ని సమాధానలో

సమానంగా ఉండాలి

ప్రయత్నించండి-


సమాధానాలు-

1. భక్తిచే

2.యుక్తిచే      

3.శక్తిచే

4.రక్తిచే

5.ముక్తిచే

Friday, April 9, 2021

జేబున్నీసా పూరణ

 జేబున్నీసా పూరణ




సాహితీమిత్రులారా!

ఔరంగజేబు ఒకరోజు సభలోనివారితో

విచారగ్రస్తుడై విషయాన్ని తెలిపాడు.

తన కుమార్తె జేబున్నీసా నిరంతర సాహిత్య పఠనం కలిగి ఉంది

ఆమెను ఎలాగైనా దాన్నుండి మాన్పించాలి- అని తెలిపాడు.

దానికి కొందరు "మహారాజా! చింతించవద్దు ఆమెకు క్లిష్టమైన

సమస్యను ఒకదాన్ని ఇచ్చి పూరించమనండి

అది ఆమె పూరిస్తే ఆమెను నిరోధించవద్దు.

ఒకవేళ పూరించనిచో సాహిత్యసేవ మానివేయవలెనని చెప్పండి"- అని చెప్పారు.

దానికి ఔరంగజేబు సమ్మతించి ఆమెను పిలిపించి

 అదేవిధంగా ప్రశించాడు.

ఆ ప్రశ్న-


దురేఅబలక్ కసే కమ్ దీద్ మౌజూద్

(నల్లని ముత్యములు ఎవడైనా ఎక్కడైనా చూచి ఉండెనా)


దానికి తండ్రి ఎత్తుగడ అగ్థమైన

జేబున్నీసా సమాధానం -

వజుజ్ అశకే బతానే సుర్మా అలూద్

(కజ్జం కలుషితములైన యువతి కన్నీటి

బిందువులు తప్ప ఇతరము చూడలేదు)


దీనికి ఔరంగజేబు ఇంకేమీ చెప్పలేక పోయాడు. 

Wednesday, April 7, 2021

చతురక్షరాద్యంతైక నియమ యమకము

 చతురక్షరాద్యంతైక నియమ యమకము




సాహితీమిత్రులారా!



గణపవరపు వేంకటకవి కృత

శ్రీప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము

ఇది ఏకాశ్వాస కావ్యం

చిత్రవిత్వంలోనే అద్భుతమైన కావ్యం

దీనిలోని ప్రతిపద్యం అనేక ప్రత్యేకతలతో

కూర్చబడింది. దానిలో 836వ పద్యం

చతురక్షరాద్యంతైక నియమ యమకము

అని చెప్పబడే పద్యం ఇది.

దీనిలో నాలుగు నాలుగు అక్షరాలతో కూర్చబడినది కందపద్యం.

యమకాలంకారంలో కూర్చబడినది గమనించండి


ధారాధర రుచివంశా

ధారాధరవైనతేయ ధారాధరరా

ధారాధరతా నిబిడసు

ధారాధర వచన సేవ్యధారాధరదా


Monday, April 5, 2021

శ్రీకృష్ణఆశీర్వాదం

 శ్రీకృష్ణఆశీర్వాదం





సాహితీమిత్రులారా!



గూఢచిత్ర - శ్రీకృష్ణఆశీర్వాదం చూడండి-


నీరజమిత్రుని సుతుసుతు

కూరిమి సతిధవుని తండ్రి కొమరుని యన్నన్

ధీరత ననిఁ, బరిమార్చిన

సూరుని సుతుమామ సకల శుభములనొసఁగున్


తామరలకు మిత్రుడు సూర్యుడు, 

సూర్యుని సుతుడు యమధర్మరాజు, 

ఆతని పుత్రుడు ధర్మరాజు, 

ఆయనభార్య ద్రౌపది, 

ఆమె కూర్మి భర్త అర్జునుడు, 

ఆయన పెద్దతండ్రి ధృతరాష్ట్రుడు, 

ఆతని కొడుకు దుశ్శాసనుడు, 

అతని దుర్యోధనుడు, 

వానిని చంపినవాడు భీముడు, 

భీముని కొడుకు ఘటోత్కచుడు, 

అతని మామ శ్రీకృష్ణమూర్తి, 

ఆ దేవుడు మీకు సర్వసంపదలను ఇచ్చుగాక

Saturday, April 3, 2021

రెండక్షరాల సమాధానాలు ముక్తాక్షరంతో

 రెండక్షరాల సమాధానాలు ముక్తాక్షరంతో




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి

సమాధానాలు తెలుపగలరేమో


అమరుల కన్నుల నమరు కన్నులదెద్ది

               నేత్రముల్ చెవులుగా నెగడునెద్ది

పరిపాలనంబునుఁ బలము సూపునదెద్ది

               శిఖిఁగాచె శిబిమేను చేసియెద్ది

యగ్నిప్రమాణంబు నార్చిన సతియెద్ది

               మఱదికి భార్యయౌ మగువయెద్ది

కామినీ జనముల ఘనపాతకంబెద్ది

               కౌరవాచార్యునిఁ గన్నదెద్ది

యక్షరంబులు రెండుండు నన్నిటికిని

యంత్యవర్ణంబు చెపుదాని కాదిగాఁగ

భావ విజ్ఞానదీప్తులు ప్రకట బఱచ

కూర్చె గంగాధరము తెల్సికొండు దీని



దీనిలోని ప్రతిప్రశ్నకు సమాధానం రెండు అక్షరాలుగా ఉండాలు

మరో ప్రశ్నకు సమాధానం మొదటి సమాధానంలోని చివరి అక్షరం

రెండవదానికి మొదటి అక్షరంగా రావాలి ఈ విధంగా సమాధానాలు 

చెప్పగలరేమో ఆలోచించండి-


సమాధానాలు

1. చే

   2. పాము

       3. మూ

           4. కోసి

               5. సీ

                  6. తా

                      7.రంకు

                         8. కుం

         


Thursday, April 1, 2021

ఏకపాదాక్షర శ్లోకం

 ఏకపాదాక్షర శ్లోకం





సాహితీమిత్రులారా!



ఒక పాదానికి ఒక హల్లు మాత్రమే ఉపయోగిస్తూ నాలుగుపాదాలకు

నాలుగు వేరువేరు హల్లులను వాడటాన్ని ఏకాక్షర పాదం లేక

ఏకవ్యంజనపాదం అంటారు.


భారవి కిరాతార్జునీయంలో రాసిన

ఏకాక్షరపాద శ్లోకం గమనిద్దాం.


శ్లో. స సాసి: సాసుసూ: సాసో

     యేయాయేయాయయాయయ:

     లలౌలీలాం లలో2లోల:

     శశీశశిశుశీ: శశన్

                                          (కిరాతార్జునీయమ్ -15-5)

అర్థం :- సాసి: = ఖడ్గంతో ఉన్న, సాసుసూ: = ప్రాణాలను హరించే బాణాలు థరించినవాడు,సాస: = ధనువును థరించినవాడు, యేయ + అయేయ + అయయ + అయయ - వాహనంతోను, వాహనంలేకుండా శత్రువుని చేరి వారి వాహనాలను స్వాథీనం చేసుకున్నవాడు, లల: = అందమైనవాడు, అలోల: = చాపల్యంలేనివాడు, శశి +ఈశ + శశు + శీ: - ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామిని పరుగెత్తింపచేసే, స: = అర్జునుడు, లీలాం = శోభను, లలౌ = పొందాడు.