Sunday, September 1, 2019

థాయ్‌లాండ్ యాత్రాగాథ-1


థాయ్‌లాండ్ యాత్రాగాథ-1

సాహితీమిత్రులారా!

సువర్ణభూమికి స్వాగతం!
“ఎలా ఉందీ థాయ్‌లాండ్ జీవితం?” అడిగాను కల్యాణిగారిని.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయనగరం నుంచి శ్రీకాకుళం దాకా ‘కథకోసం కాలినడక’న వెళ్లినపుడు మాతో కలిసి నడిచారావిడ. అయిదేళ్ల పరిచయం. ఆమెకూ సాహిత్యమంటే గొప్ప ఆసక్తి. రాస్తారు కూడానూ. ఏడాదినుంచీ బ్యాంకాక్‌లో ఉంటున్నారు.


“బావుంది. అదో ఆసక్తికరమైన ప్రదేశం. నిజానికి మేవూ బ్యాంకాక్ దాటివెళ్లి థాయ్‌లాండ్ దేశాన్ని పెద్దగా చూసింది లేదు. మీకు యాత్రలంటే ఇంత ఇష్టం కదా, ఓ అడుగు అటు వేయగూడదా… తెలుసుగదా మా సత్యజిత్‌కు కూడా ప్రయాణాలూ రోడ్డు ట్రిప్పులూ అంటే మహా ఇష్టం. రండి, ఓ వారం రోజులపాటు దేశమంతా తిరిగొద్దాం.”

ఇలా ‘కథ కోసం కాలినడక’ పెట్టుకొంటున్నామనగానే ఆమె ‘నేను సిద్ధం’ అంటూ ముందుకు వచ్చారు. ఆ నాలుగు రోజులు కలిసివేసిన ఎనభై కిలోమీటర్ల అడుగులు స్నేహానికి గట్టి పునాది అయ్యాయి. మార్చి నెలలో దంపతులిద్దరూ వచ్చి మా ఇంట్లో నాల్రోజులు గడపడంతో ఆ పునాది గట్టిపడింది.

ఆమె బ్యాంకాక్ రండి అనడం వెనక ఈ నేపథ్యం ఉంది.

నిజానికి నేను బ్యాంకాక్ వెళదామని ఏనాడూ అనుకోలేదు.

ఏదో ఆగ్నేయాసియాలోని చిన్న దేశం… పెద్దగా అభివృద్ధి చెందని దేశం… పాపం బీద దేశమనుకొంటాను, ప్రధాన ఆర్థిక వనరు మసాజ్ టూరిజం అనిపిస్తోంది… రాచరికమట… మధ్యలో సైనికపాలన అట… రిగ్గింగులు జరిగాయంటోన్న ఎలక్షన్ల ప్రహసనమట–ఇదీ థాయ్‌లాండ్ గురించి నా అరకొర అవగాహన. నా బకెట్ లిస్టులో శ్రీలంక, మలేషియా, ఈజిప్టు, భూటాన్, నేపాల్, సిక్కిం లాంటివి ఉన్నాయి గానీ థాయ్‌లాండ్‌కు అప్పటిదాకా చోటులేదు.


మళ్లా ఏప్రెల్‌లో కల్యాణి, సత్యజిత్‌ల నుంచి ఫోను. ‘ఈ జూన్ నెలాఖరుకల్లా బ్యాంకాక్ నుంచి ఇండియా వచ్చేస్తున్నాం. ఏప్రెల్ చివరికల్లా నా ఉద్యోగ బాధ్యతలు తీరిపోతాయి. మరో రెండు నెలలు ఇక్కడే ఉండి కాస్త దేశం చూద్దామనుకొంటున్నాం.’ సత్యజిత్; ‘మీ యాత్రా ధోరణి నాకు తెలుసు. టూరిస్టుగా కాకుండా ట్రావెలర్‌గా తిరగడం మీకిష్టమని తెలుసు. అలాగే తిరుగుదాం. ఇక్కడి గ్రామసీమల్లోకి తీసుకువెళ్లి అక్కడి గ్రామీణులతో రెండుమూడు రోజులు గడిపేలా ఏర్పాటుచేసే ఎన్జీవోలు నాకు తెలుసు. రండి. అలాంటి ట్రిప్పు ఒకటి వేద్దాం.’ కల్యాణి.

నిజంగా ఆశ కలిగింది.

ఇది అరుదైన అవకాశం అని మనసు పదేపదే హెచ్చరించింది. అయినా ఒక సంకోచం… కారణం బషో!

ఆ మధ్యే పదిహేడో శతాబ్దపు జపాను కవియోగి మత్సువొ బషో రాసిన ‘హైకూయాత్ర’ అన్న పుస్తకం చదివాను. మొదట్లో సమురాయ్ అవుదామనుకొని, ఆ తర్వాత దేశదిమ్మరిగా మారి, ఆ దిమ్మరి జీవితం నుంచి నెమ్మదిగా కవిగా పరిణమించిన మనిషి మత్సువొ బషో.


తన జీవితం గురించి చెపుతూ బషో, ‘నేను నడకనే పల్లకీగా మార్చుకున్నవాణ్ణి. ఇంటినెప్పుడో వదిలేశాను. నావి రిక్త హస్తాలు. దొంగల భయం లేదు. నా ప్రయాణాన్ని అడ్డగించే అనుచరగణం లేదు. నాకుండే కోరికలు రెండే రెండు – రాత్రికి ఎక్కడో ఒకచోట బస, నా పాదాలకు సరిపోయే పాదరక్షలు.’ అంటాడు. ‘నా అనుభవాలను ఒకచోట రాసుకోవడం, వాటిల్ని నలుగురికీ వినిపించాలనుకోవడం నా యాత్రా సరళి’ అంటూ తాను చేసిన యాత్రల వివరాలు హైకూలుగా చెప్తాడు. ఒక సందర్భంలో ‘ఒక అతిథికి ఒక పూట తీరిక దొరికిందంటే దానర్థం ఒక గృహస్థుకి ఒక పూట తీరిక పోయిందన్నమాటే!’ అంటాడు.

ఆ వాక్యం నాకు వెయ్యి ఓల్టుల షాకు ఇచ్చింది!

అప్పటిదాకా నేను నా ప్రయాణాల్లో ఎవరింటికైనా వెళ్లి ఉండటమంటే ఉవ్విళ్లూరేవాడిని. వాళ్లు అపరిచితులయితే మరీ మంచిది. మరో మనిషితో, మరో కుటుంబంతో సరికొత్త అనుబంధం ఏర్పడే అవకాశంగా దాన్ని తీసుకొనేవాడిని. అలా నా ప్రయాణాల్లో ఎంతోమంది ఇళ్లల్లో నిస్సంకోచంగా గడిపాను. కానీ బషో ఒక్కమాటతో నా ఉత్సాహానికి శీర్షాసనం వేయించాడు. కొత్త ఆలోచనలు. కొత్త కొత్త సంకోచాలు.

ఆ నేపథ్యంలో కల్యాణి-సత్యజిత్‌ల ప్రతిపాదన గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించవలసివచ్చింది. వాళ్లు బంధువులుగాదు. బాల్యమిత్రులుగాదు. ఇంకా ఆప్తమిత్రులు అవలేదు. మరి రమ్మనగానే వెళ్లిపోయి వాళ్లకి బషో చెప్పినట్టు వారం పదిరోజులు తీరికలేకుండా చేస్తానా? అసౌకర్యం కలిగిస్తానా?

అయినా నాదో నమ్మకం. నేను ఎవరి ఇంటికి అతిథిగా వెళ్లననీ, అపరిచితుల ఇళ్లల్లో కూడా క్షణాల్లో ఆ కుటుంబపు సభ్యుడిలా మారిపోతాననీ, వాళ్లకేరకమైన వత్తిడీ కలిగించననీ… ఈ నమ్మకానికి ఆధారాలు లేకపోలేదు. ‘నువ్వొస్తే మాకే వత్తిడీ ఉండదు. పైగా హాయిగా ఉంటుంది’ అన్న అనేకమంది హోతలు ఆ నమ్మకానికి ఆధారబిందువులు.

చివర్లో నా నమ్మకమే జయించింది. నేనిష్టపడే దంపతులతో ఓ వారం గడపడం, సరికొత్త చోట గ్రామీణ జీవితపు రుచి చూడటం, చిన్నప్పట్నించీ నేను వింటోన్న బ్యాంకాక్ నగరంతో పరిచయం ఏర్పరచుకోవడం అన్న విషయాలు నన్ను ఆకర్షించాయి. నాకు స్వతఃసిద్ధంగా ఉండే భ్రమణకాంక్ష సరే సరి.

సంకోచాలన్నీ పక్కనపెట్టి వెళదామనే నిశ్చయించుకొన్నాను.

వస్తున్నట్టు వాళ్లకు చెప్పాను. ఎప్పుడు వస్తే బావుంటుందీ, ఏయే ప్రాంతాలకు వెళితే బావుంటుందీ, వీసాల వివరాలు, కరెన్సీ వివరాలు, వాళ్లుంటోన్న ప్రదేశం వివరాలు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ సమాచారం–ఈ విషయాల గురించి మామధ్య ఫోన్ సంభాషణలూ, వాట్సప్ సందేశాలూ విరివిగా సాగాయి. ‘చెప్పాగదా, నేను ఆఫీసు నుంచి ఏప్రెల్ నెలాఖరుకల్లా విడుదల అవుతాను. మే మొదటి వారాంతంలో వచ్చేయండి,’ అన్నారు సత్యజిత్.

టికెట్టు కొనేశాను. మే నెల రెండో తారీఖు రాత్రి తొమ్మిదిన్నరకు నేను ఉండే ఢిల్లీ నుంచి బయల్దేరి మూడో తారీఖు ఉదయం మూడు గంటలకు బ్యాంకాక్ చేరేలాగానూ, మళ్లీ పదో తారీఖు అర్ధరాత్రి బయల్దేరి మర్నాటి ఉదయానికల్లా ఢిల్లీ చేరేటట్టూ టికెట్టు పోనూ రానూ కలిసి పదిహేడువేలకే దొరికింది.

అనేకానేక చర్చల తర్వాత అక్కడి నా కార్యక్రమం రూపుదిద్దుకొంది.

మే మూడున చేరుకోవడం, విశ్రాంతి, ఊరుతో పరిచయం.

మే నాలుగున పరిసరాల్లోని ఆసక్తికరమైన ప్రదేశాలు: రైల్వే మార్కెట్, ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్లిరావడం…

అయిదో తారీఖున బ్యాంకాకుకు ఉత్తరంగా గంటన్నర దూరాన ఉన్న అయుత్తయ్య అనే పురాతన రాజధానీ నగరాన్నీ, అక్కడి శిథిలాలయాలనూ చూసిరావడం…

ఆరూ ఏడూ ఎనిమిదీ రివర్ క్వాయ్ ఒడ్డున ఉన్న కాంచనబుర అన్న పట్నాన్ని స్థావరంగా చేసుకొని ఆ కొండలనూ అడవుల్నీ జలపాతాలనూ డెత్‌రైల్వే రైలుమార్గాన్నీ చూసిరావడం… వీలయితే ఒకరోజు పట్టాయా వెళ్లిరావడం…

తొమ్మిది సరేసరి… బ్యాంకాక్ నగర విహారం.

గ్రామాల్లో ఉందామనుకొన్న ప్రణాళిక చివర్లో చేజారిపోయినా, రివర్ క్వాయ్, డెత్ రైల్వే, జలపాతాలు నన్ను ఊరించసాగాయి. రివర్ క్వాయ్ నేపథ్యంగా అరవై ఏళ్ల క్రితం వచ్చిన ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ అన్న నవలా, అదే పేరుతో వచ్చిన క్లాసిక్ సినిమా, ఆ నేపథ్యం, ఆ వాతావరణం నాకు బాగా పరిచయమే. అవన్నీ చూడబోతున్నాను అన్న ఊహే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది!

ముందస్తుగా వీసా తీసుకోకుండానే భారతీయులు వెళ్లగల ఏభై పైచిలుకు దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి. వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం ఉందట. సత్యజిత్‌ను సంప్రదిస్తే, ‘వీసా నీకు అసలు సమస్యే గాదు… అయినా వీలయితే ఎలక్ట్రానిక్ వీసా అప్లికేషన్ పంపు. బ్యాంకాక్‌లో దిగాక కాస్తంత టైము కలసివస్తుంది.’ అని సలహా ఇచ్చారు. ప్రయత్నించాను. ఆయా సైట్లు సరిగ్గా పనిచెయ్యక ఈ వీసా ప్రక్రియ సరిగ్గా ముందుకు సాగలేదు. ఇహ ఆ ప్రయత్నం కట్టిపెట్టాను.

నువ్వెక్కడ ఉండబోతున్నావో ఆ స్పష్టమైన అడ్రసూ, చేతిలో కనీసం పదివేల బాథ్‌లూ ఉండటమన్నది థాయ్‌లాండ్ వీసాకు కనీసపు అర్హత. ఒక బాథ్ మన రెండ్రూపాయల ముప్ఫై పైసలకు సమానం. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ డీలర్లెక్కడున్నారా అని నెట్లో వెదికితే ఇంటికి రెండొందల గజాల దూరాన మూడు షాపులున్నాయని తేలింది. తీసుకొన్నాను.

పుష్కలంగా డేటా ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉంటేగానీ పూటగడవని ధన్యజీవుల జాబితాలో నేను కూడా చేరి రెండుమూడేళ్లయిపోయింది. అది ఎలా సాధించడం అని వెదికితే ఎయిర్‌టెల్‌వాళ్ల అతిసరళమైన ప్యాకేజ్ పదిహేనువందల్లో ఉందని బోధపడింది. సందేహించకుండా అది తీసుకొన్నాను.

మే రెండో తారీఖు రాత్రి ఆడుతూ పాడుతూ మా ద్వారకా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రెండున్నర గంటలు ముందే చేరుకొన్నాను.

చెకిన్ కౌంటర్ దగ్గరే థాయ్‌లాండ్ వాతావరణం కనిపించింది. ఎక్కువగా ఉన్నది భారతీయ టూరిస్టులే అయినా ఓ పాతిక ముప్ఫై మంది థాయ్‌లాండ్ దేశపు సీనియర్ స్కూలు విద్యార్థులూ అక్కడ కోలాహలంగా కనిపించారు. బుద్ధుడు తిరుగాడిన దేశాన్ని చూద్దామని పదిరోజులపాటు వచ్చారట. అంతా తిరిగి చూసిన సంతృప్తితో వెళ్తున్నారు. ఇమ్మిగ్రేషన్లో మన అధికారి ‘ఎందుకు వెళ్తున్నావూ?’ అని అడిగాడు. యథాలాపంగానే అడిగినా ఆ ప్రశ్న ఆశ్చర్యం కలిగించింది. ‘స్నేహితులతో గడపడానికి, దేశాన్ని చూడడానికి’ అనగానే పాస్‌పోర్ట్ మీద స్టాంపు వేసి ఇచ్చాడు. అన్నట్టు ఒకప్పటిలాగా ఇమ్మిగ్రేషన్ ఫారాలు నింపడాలూ ఆ తతంగాలూ లేవు.


విమానంలో నా పక్క రెండు సీట్లలోనూ ఆ థాయ్ విద్యార్థులే. కబుర్లలోకి దింపే ప్రయత్నం చేశాను గానీ భాష అడ్డంకి అయింది. ఏ ఒడిదుడుకులూ లేకుండా తెల్లవారుఝామున మూడింటికల్లా బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయంలో దింపింది మా విమానం. ‘విమానంలోనే అడిగి ఎరైవల్ కార్డ్ తీసుకో, అది నీకు వీసా ఇవ్వడానికి ముఖ్యమైన డాక్యుమెంటు.’ అన్న సత్యజిత్ సలహా ప్రకారం కార్డు కోసం అడిగాను. అది దిగాక ఎయిర్‌పోర్ట్‌లో దొరుకుతుంది అని సమాధానం.

వీసాలు ఇచ్చే చోట బాగా గందరగోళంగా ఉంది! ఏ ఫారం నింపాలో, అది ఎక్కడ దాఖలు చెయ్యాలో వివరించేవాళ్లు లేరు. అసలు ఆ ఫారాలు ఎక్కడ దొరుకుతాయో ఆ వివరమూ మర్రిచెట్టు తొర్రలోని చిలకను వెదికి పట్టుకొన్నట్టు పట్టుకోవాల్సివచ్చింది. ఆ శోధనలో అప్పటికే కాస్తంత అనుభవం సంపాదించినవాళ్లు కొంచం సహాయం చేశారు. దాన్ని నింపాక దాఖలు చెయ్యడానికి వెళితే అక్కడ రెండు కౌంటర్లు. ఏది ఎవరికో ఆ వివరం స్పష్టంగా లేదు…

ఒకదాని దగ్గర పాతికముప్ఫై మంది ఉన్న క్యూ. రెండోదాని దగ్గర సుమారు వందమంది. ఎందుకో అనిపించి పొడవు క్యూలో చేరాను. ఓ పావుగంట గడిచేసరికి ఆ చిన్న క్యూ ప్యాకేజ్ టూర్లలో వచ్చేవారికోసమనీ, ఆ టూర్లలోగాకుండా విడిగా వచ్చేవాళ్లు రెండువందల బాథ్‌లు అదనంగా కడితే అందులో చేరవచ్చుననీ అర్థమయింది… ఇదంతా జరిగేసరికి నాలుగు దాటిపోయింది.

మా క్యూలో నా ముందు ఓ ఘజియాబాద్ కుటుంబం–తల్లి, తండ్రి, కూతురు. ఆ అమ్మాయి సాఫ్ట్‌వేర్ అనుకొంటాను. అమ్మానాన్నలకు థాయ్‌లాండ్ చూపించాలని తీసుకువస్తోంది. నా వెనుక ఓ గురుగ్రామ్ యువతి. క్యూలో గంటసేపు గడిపాం గాబట్టి కాస్తంత పరిచయాలు, కబుర్లు.

ఒకసారి కౌంటరు చేరాక వీసా ప్రక్రియలో రెండుమూడు అంచెలు దాటవలసివచ్చినా అదంతా చెకచెకా సాగిపోయింది. వీసా ఫీజు కడదామని రెండువేల బాథ్‌ల నోట్లు సిద్ధంగా ఉంచుకొన్నాను. కానీ ‘వీసా ఫీ మినహాయించాం’ అన్నారు అక్కడి అధికారులు. ‘అసలీ మినహాయింపు మొన్న ఏప్రెల్ 30 దాకా నడిచింది. ఇపుడు మరో ఆరు నెలలు దాన్ని పొడిగించారట.’ అన్నారు అక్కడి క్యూలోని లోకజ్ఞులు.

వీసా ప్రక్రియలో అంచెలంచెలు దాటడం, దాటాక వెళ్లి మా మా లగేజ్‌లు సేకరించుకోవడం–వీటన్నిటిలో ఆ గురుగ్రామ్ యువతి నాకు తోడుగా ఉంది. కాస్తంత చనువు ఏర్పడింది. పొడవాటి మనిషి. ఏదో కాలేజీలో అధ్యాపకురాలు. కళ్లజోడు నిండిన ప్రశాంతమైన వదనం. చూడగానే గౌరవం ఉట్టిపడే రూపురేఖలు, హావభావాలు.

ఎందుకో విడివడేముందు చెప్పాలనిపించింది.

“అతి చనువు అనుకోక… ఒక మాట చెపుతాను. నువు చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నావు. అది నీకు సహజంగా అబ్బిన లక్షణం. పైగా నీ వృత్తికి అవసరం. వృత్తికి అవసరమే అయినా జీవితానికి ఈ లక్షణం చిన్నపాటి గుదిబండ అవుతుంది. స్వేచ్ఛగా ఉండనివ్వదు. ఈ ఇమేజ్ నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యి…”

‘నీకెందుకయ్యా నా హుందాతనం సంగతీ’ అని విసుక్కుంటుందనుకొన్నాను. కానీ చిన్నపాటి నవ్వు నవ్వి, “తెలుసు. అది నాకు అనుభవమే. నీ సలహా పాటించే ప్రయత్నం చేస్తాను… మెనీ థాంక్స్!” అన్నది. తేలికపడిన మనసుతో విడివడ్డాను.

లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు నాకు బ్యాంకాక్ చేరీచేరగానే అక్కడి లోకల్ రైళ్లలో వెళ్లాలని ఉబలాటం. సత్యజిత్ వాళ్ల ఇంటివరకూ రైలు వెళుతుందని సత్యజిత్ చెప్పారు కానీ ఆ రైళ్లు ఆరింటికి గానీ మొదలవవు. అయిదు లోపల ఎయిర్‌పోర్ట్ నుంచి బయటపడగలిగితే తిన్నగా టాక్సీ తీసుకొని వెళదాం, అయిదు దాటితే ఆరుదాకా ఆగి రైళ్లు పట్టుకొందాం, అని ఆలోచన.


అయిదుంబావుకల్లా అన్ని ఫార్మాలిటీలూ ముగించుకొని విమానాశ్రయం బయటకు చేరాను. ఒక పక్క మెట్రో స్టేషను, మరో పక్క టాక్సీ స్టాండు… మనసు కాస్తంత ఊగిసలాడినా కాళ్లు టాక్సీ వేపుకే దారితీశాయి. టాక్సీ దగ్గర భాష సమస్య అవుతుందనుకొన్నాను. అవలేదు. నా అడ్రసు స్పష్టంగా కాగితం మీద రాసి చూపించాను. దాన్ని మా డ్రైవరు మొబైల్‌తో ఫోటో తీసి గూగుల్‌కి చూపించాడు. అది వెంటనే రూట్‌మ్యాప్, నావిగేషన్ చూపించేసింది. అయ్యే ఖర్చు లెక్కగట్టి టాక్సీ ఛార్జి నాలుగొందల పాతిక, దారిలో టోల్ ఛార్జి మరో యాభై అన్నాడు మా పైలెట్. ఛలో అంటే ఛలో అనుకొని ముందుకు సాగిపోయాం.

అప్పుడే బ్యాంకాక్ నగరం మేలుకొంటోంది. ఆకాశంలో వెలుగు రేకలు. దారిలో ఏదో జలప్రవాహపు ఉనికి. చక్కని రోడ్లు… ఫ్లై ఓవర్లు… మెల్లగా పుంజుకొంటోన్న వాహనాల జోరు. నగరం గురించి సరళమైన ఇంగ్లీషులో నా చిన్న చిన్న ప్రశ్నలు. తడబడుటాంగ్లంలో అతని సమాధానాలు. కుదిరిన సామరస్యం. “ఇంకో గంట గడిస్తే రోడ్లన్నీ కార్లతో నిండిపొతాయి. ఇపుడు గంట పట్టే ప్రయాణం అపుడు రెండుగంటలవుతుంది…” మా వాహనచోదకుని వివరణ.

ఆరుగంటలకల్లా ఇంటికి చేరాం. అంతా కలసి పాతిక కిలోమీటర్లు.


సత్యజిత్‌వాళ్లు ఉన్నది సుఖమ్‌విట్ అన్న ప్రాంతంలో, 20వ వీధిలో, మిలేనియం రెసిడెన్స్ అన్న ఎపార్టుమెంటు కాంప్లెక్స్‌లో, టవర్ ‘డి’లో, ముప్ఫైమూడవ అంతస్తులో, 331 నెంబరు ఫ్లాటులో…

అప్పటికే అటు సత్యజిత్ నుంచీ, ఇటు కల్యాణి నుంచీ ఫోన్లూ, పలకరింపులూ, స్వాగతాలూ… ‘నేను అనుకోకుండా ఆఫీసు పనులమీద గత నాలుగయిదు రోజులుగా మలేషియా, సింగపూర్, ఇండోనేషియాల్లో తిరుగుతున్నాను. ఈరోజు రాత్రికి ఇంటికి చేరతాను. ఈనాటి నీ బాగోగులు కల్యాణి చూసుకుంటుంది.’ ఇదీ సత్యజిత్ వర్తమానం.

ఇంటికి చేరేసరికి తెల్లగా తెల్లారిపోయింది.

“వచ్చేశారా, నిజంగా వచ్చేశారా!” అని ఆవిడా, “వచ్చేశానా, నిజంగానే వచ్చేశానా!” అని నేనూ సంబరమే సంబరం!

కల్యాణిగారో నిరంతర జిజ్ఞాసి…

సాహిత్యమన్నా మనుషులన్నా ప్రపంచమన్నా వల్లమాలిన అభిమానం, ఆసక్తి. మేవు ఎపుడు ఎక్కడ కలసినా క్షణాల్లో కబుర్లూ చర్చల్లో పడిపోతాం. ఆరోజు అదే జరిగింది.

ఫిబ్రవరిలో మా కాలినడక దగ్గర వదిలిపెట్టిన కబుర్లు కామా ఫుల్‌స్టాపులు లేకుండా గలగలా కొనసాగాయి. ఢిల్లీ హైదరాబాద్‌ల సాహిత్యపు ముచ్చట్లు, కొత్త పుస్తకాలు, ఫేస్‌బుక్ చర్చలూ వాదోపవాదాలూ–గంటా గంటన్నర ఎడతెగని ముచ్చట్లు. వాళ్లు ఉంటోన్న ముప్ఫైమూడో అంతస్తు బాల్కనీలో చిన్నపాటి టేబులు దగ్గర కాఫీలు తాగుతూ, దూరాన ఉన్న నదినీ దగ్గరలో ఉన్న విశాల తటాకాన్నీ కింద సాగిపోతోన్న కారుల బారుల్నీ పరకాయిస్తూ కబుర్లు చెప్పుకోవడం, అదో గొప్ప విలాసం! కల్యాణి రాబోయే కార్యక్రమాన్ని మరింత వివరంగా చెప్పారు:

“రేపు మీరూ నేనూ ఓ కండెక్టడ్ టూర్ తీసుకొని గంటన్నరా రెండు గంటల దూరాన ఉన్న రైల్వే మార్కెట్టూ, ఫ్లోటింగ్ మార్కెట్టూ చూసి వద్దాం. దాదాపు రోజంతా పడుతుంది. ఎల్లుండి మీరూ సత్యజిత్తూ కలసి గంటన్నర దూరంలో ఉన్న అయుత్తయ్య అన్న పట్నం చూసి వస్తారు. ఆరూ ఏడూ ఎనిమిది తారీఖుల్లో ఒక వాహనం తీసుకొని మనమంతా కలసి కాంచనబుర వెళుతున్నాం. ఎనిమిదో తారీఖున ఎలాగైనా వీలు చూసుకొని మిమ్మల్ని పట్టాయా కూడా పంపాలని నా ప్రయత్నం. తొమ్మిదిన మీరు మీ బాణీలో పూర్తిగా బ్యాంకాక్ సిటీలో తిరుగాడుదురు గాని.”

పట్టాయా ప్రయాణాన్ని ఇంత గాఢమైన ప్రణాళికలో చేర్చడం కష్టమని నాకు అనిపించింది. అయినా ఏ నిరాశా కలగలేదు. నేను ఆశించని ఊహించని క్వాయ్ నది డెత్ రైల్వేల వెంట తిరిగే అవకాశం వచ్చినపుడు, అందులోనూ స్నేహితులతో కలసి వెళ్లే అవకాశం వచ్చినపుడు, పట్టాయాదేముందీ! దాని సంగతి మరోసారి చూడవచ్చు.

“మరి ఈ రోజు సంగతేమిటీ?” నా ప్రశ్న.

“మీ ఇష్టం. రాత్రంతా నిద్రలేదు గదా, రెస్టు తీసుకుంటానంటే సరేసరి. లేదూ అంటే మా లోకల్ రైల్వే నెట్‌వర్క్‌లో తిరిగి రండి. అది మీకు ఇష్టమైన పనిగదా… గమనించే ఉంటారు, ఢిల్లీలో ఉన్నట్టే ఇక్కడా పెద్ద మెట్రో నెట్‌వర్క్‌ ఉంది. మా ఇంటినుంచి కిలోమీటరు లోపే అశోక్ అన్న మెట్రో స్టేషన్…”

విశ్రాంతి ఎప్పుడైనా తీసుకోవచ్చు; ఒక పూట ఊరంతా రైళ్లలో తిరిగే అవకాశం వస్తే ఎలా వదులుకుంటానూ!

ఈలోగా కల్యాణివాళ్ల పాప మధుర వచ్చి పలకరించింది. కుదురైన బొమ్మలా ఉందావిడ. మద్రాసు కళాక్షేత్రలో సంగీతంలో డిగ్రీ చేస్తోంది. కొత్త మనిషినే అయినా ఆప్యాయంగా మాట్లాడింది. చూడగానే సానుకూల భావన కలిగింది. స్నేహశీలి అనిపించింది.

వారం తిరిగేసరికి నా అంచనా సరైనదేనని తేలింది.

గబగబా గూగుల్‌ను సంప్రదించాను.

బ్యాంకాక్ నగరంలో నాలుగయిదు రైలుమార్గాలు ఉన్నాయి.

మా ఇంటికి దగ్గర్లోని అశోక్ స్టేషన్ మీదుగా సాగే సుఖమ్‌విట్ లైన్ అందులో ఒకటి. దక్షిణాన ఖేహా అన్న చోటు నుంచి ఉత్తరాన మోఛిట్ వరకూ నేలకు ముప్ఫై నలభై అడుగుల ఎత్తున సాగే స్కైలైన్ ఇది. సువర్ణభూమి విమానాశ్రయం నుంచి వచ్చే ఎయిర్‌పోర్ట్ సిటీలైన్ ఈ సుఖమ్‌విట్ లైన్లో ఫయాథాయ్ అన్నచోట కలుస్తుంది. నావరకూ ఇవి ముఖ్యమైన లైన్లు. ఇవిగాక మరో రెండుమూడు లైన్లు ఉన్నాయి. అంతా కలసి సుమారు వంద కిలోమీటర్ల రైలుమార్గాలవి.


అశోక్ రైలుస్టేషన్‌లో రైలు పట్టుకొని ఉత్తర దక్షిణాలుగా ఆ మార్గమంతా వెళ్లివచ్చి నగరంతో కాస్తంత పరిచయం కలిగించుకోవాలన్నది ఆనాటి నా లక్ష్యం. రైళ్లలో మళ్లామళ్లా టికెట్టు కొనే ఇబ్బంది లేకుండా కల్యాణి తన స్మార్ట్‌కార్డ్‌ను ఇచ్చారు. “ఇది రైళ్ళకీ బస్సులకే గాకుండా చిన్నచిన్న కొనుగోళ్లకీ పనికొస్తుంది. మీరేం సందేహించకుండా కార్డు వాడండి.” అన్నారావిడ!

అశోక్ చేరడం, ఆ దారిలో అక్కడి వీధుల్ని పరిశీలించడం, ఆ భవనాలు, రోడ్డుపక్కన ఎంతో కుదురుగా ఉన్న బళ్లమీది వీధి ఫలహారశాలలు, మోటర్ సైకిల్ టాక్సీ కుర్రాళ్లు, మెయిన్ రోడ్డు చేరేలోగా కనిపించే ఆఫీసు భవనాలు, మసాజ్ పార్లర్లు, చిన్న పెద్ద షాపులు… అప్పుడే నగరపు వాణిజ్య కార్యక్రమం రెక్కలు విప్పుకొంటోంది. ఆఫీసులకు వెళ్లేవాళ్ల హడావుడి అనుభవానికి అందుతోంది. అశోక్ స్టేషను సెంటర్లో ఎటుచూసినా పెద్దపెద్ద భవనాలు… వాటిముందు నాలుగురోజుల్లో పట్టాభిషేకం చేసుకోబోతున్న ‘రామ10’ రాజుగారి బడాబడా చిత్రాలు…


రైలు పట్టుకొన్నాను. దక్షిణపు కొసన ఉన్న ఖేహా దాకా ప్రయాణం. నలభై ఐదు నిముషాలు. నగరపు ప్రధాన ప్రాంతాలమీదుగా సాగింది ప్రయాణం. అటూ ఇటూ ఆశ్చర్యం కలిగించే అత్యాధునిక భవనాలు. దిగువన రోడ్ల కూడళ్లలో బారులు తీరిన కారులు. వినిపించనే వినిపించని హారను కూతలు. కనిపించని ట్రాఫిక్ అతిక్రమణలు. మెల్లగా నగర వాతావరణం దాటుకొని, భవనాలు తగ్గి మైదానాలు పెరిగి… హఠాత్తుగా మూడు ఏనుగులు కలసి ఉన్న బృహత్తర విగ్రహం!

దూరం నుంచి ఆలోచించినపుడు థాయ్‌లాండ్‌ లాంటి అనేకానేక దేశాలు అనామకంగా అనిపిస్తాయి. ఎక్కడో ఆసియా ఖండపు పటంలో ఒక పక్కన చిన్నటి చుక్కలు అనిపిస్తాయి. అపుడపుడే కళ్లు తెరుస్తోన్న పసికూన దేశాలు అనిపిస్తాయి. ఆ దేశపు తెలివితేటల గురించీ, మేధావిత్వం గురించీ ఆలోచన రానేరాదు. ఒక రకమైన అహంకారం, ఆయాదేశాల గురించి ఉదాసీనతా చిన్నచూపూ, ఇంకా చెప్పాలంటే ప్రెజుడిసు పెంచిపోషించుకుంటాం.

అందుకు నేను ఏమాత్రమూ మినహాయింపు కాదు.


దగ్గరకు వెళ్లినపుడు థాయ్‌లాండ్‌ దాదాపు దక్షిణ భారతదేశమంత పెద్ద దేశమని బోధపడింది. ఏడుకోట్ల జనాభా అని అర్థమయింది. ఉత్తరదక్షిణాలుగా పదహారు వందల ఏభై కిలోమీటర్ల పొడవూ, తూర్పూపడమరలుగా ఎనిమిదివందల కిలోమీటర్ల వెడల్పూ ఉన్న భూఖండమని స్పష్టమయింది. ఆగ్నేయాసియాలో రెండవ అతిసంపన్న దేశమనీ, తలసరి ఆదాయం మన లెక్కల్లో ఏడాదికి అయిదులక్షల రూపాయలనీ తెలిసింది. అత్యాధునికమైన రహదారి వ్యవస్థ ఉందని తెలిసింది. రైలుస్టేషన్లనూ, రైల్లో ఎక్కేదిగే రకరకాల ప్రయాణీకులనూ చూసినపుడు వారి హావభావాలలోనూ వేషధారణలోనూ ప్రవర్తనలోనూ ఎంతో నాగరికం కనిపించింది. ఆధునికత అన్నది అమెరికాకో ఇండియాకో చెందిన గుత్త సొమ్ము కాదని మరోసారి బోధపడింది.

కానీ గూగుల్ చెప్పిన దాని ప్రకారం ఇంత పెద్ద దేశంలోనూ చరిత్రకు అందే మొట్టమొదటి జనావాసాలు పదకొండో శతాబ్దంలో చైనా నైరుతి భాగం నుంచి వలసవచ్చి స్థిరపడినవారివట.

నమ్మడం కష్టం. అంతకు ముందు ఇక్కడ మనుషులే లేరా? పల్లెలూ పట్నాలూ లేవా! పరిశ్రమలు గాకపోయినా కనీసం వ్యవసాయమన్నా లేదా?! నమ్మడం కష్టం.


ఆ పదకొండో శతాబ్దం నుంచీ చిన్నచిన్న రాజవంశాలు. అనేకానేక ఘర్షణలు, యుద్ధాలు. పొరుగున కంబోడియా, బర్మా, లావోస్, మలేషియా దేశాలు… పదమూడో శతాబ్దంలో ఏర్పడిన సుఖథోయ్ రాజవంశం నూటపదేళ్లు పాలించడం, ఆ తర్వాత 1351 నుంచి నాలుగువందల సంవత్సరాలపాటు అయుత్తయ్య వంశపు పరిపాలన, 1782లో ఉనికిలోకి వచ్చిన చక్రి రాజవంశం, వారు స్థాపించిన రతన్‌కోసిన్ రాజ్యం–ఇప్పటి థాయ్‌లాండ్‌ రాజ్యానికి ఆ వంశీయులే అధిపతులు.

థాయ్‌లాండ్‌ దేశంలో తొంభయ్యైదు శాతం మంది బౌద్ధ మతస్తులు. నాలుగు శాతం ఇస్లాం. అతి స్వల్పంగా హిందువులు. ప్రస్తుతపు రాజవంశీకులు ఆశ్చర్యకరంగా హిందూమత అనుయాయులు. ప్రతీరాజూ తమ అసలు పేరుకు ‘రామ’ అన్న గౌరవ వాచకం జోడించడం ఆ వంశపు ఆనవాయితీ. ప్రస్తుతం పాలన సాగిస్తోన్నది రామ 10.

పరిసర పరిశీలనలూ, సహప్రయాణీకుల్ని గమనించడాలూ, గూగుల్ అధ్యయనాలూ మధ్య రైలు ఖేహా స్టేషను చేరింది. ఖగరాజు వీపుమీద కూర్చుని గగన విహారం చేసిన అనుభూతి… థాయ్‌లాండ్‌లో నిఝంగా అడుగుబెట్టిన భావన.

ఇక్కడ్నించి ఇహ ఎక్కడికీ?

మళ్లా గూగుల్‌ను సంప్రదించాను. నాలుగయిదు కిలో మీటర్ల దక్షిణాన ఏన్షియెంట్ సిటీ అన్న సముద్రతీర ప్రాంతం కనిపించింది. ఆ పేరు ఆకర్షించింది. ఎండ ఎంతగా మండుతోన్నా పట్టించుకోకుండా అక్కడిదాకా నడచి చూద్దాం అనిపించింది. ఆ పక్కనే ఉన్న సముద్రం అదనపు ఆకర్షణ… మరికాస్త గూగుల్ శోధన చెయ్యగా, ఆ సముద్రం సుదూరంగా వ్యాపించి ఉన్న థాయ్‌లాండ్‌ అఖాతమనీ, దక్షిణ దిశలో అది మలేషియా, సింగపూర్, ఇండోనేషియాల మీదుగా సాగి సాగి ఆస్ట్రేలియా ఉత్తర తీరం తాకుతుందనీ తెలిసింది. అయినా సముద్రానికి అంతమెక్కడా?!

(సశేషం)
-------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments: