Wednesday, August 14, 2019

మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం: తొలిభాగం


మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం: తొలిభాగం




సాహితీమిత్రులారా!

“1936 జూన్‌ నెల! సుదీర్ఘ శీతాకాలపు కత్తికోతల విపత్తుల నుంచి కాస్త తెరిపిని పడ్డ సమయం! వేసవి ఒక నెల గడిచింది. లండన్‌ మహానగరంలో అంతర్జాతీయ సర్రియలిస్టు చిత్రకళాప్రదర్శనం ఏర్పాటయింది! మేధావాతావరణంలో పిడుగులజడి ప్రారంభమయింది. ఆశ్చర్యమూ, సంశయమూ, ఇంద్రజాలమూ, తృణీకారమూ వంటి విరుద్ధభావాలు ప్రేక్షకులలో చెలరేగాయి. సంస్కృతికీ, నాగరికతకూ ప్రఖ్యాతి వహించిన దినపత్రికలకు ప్రతిష్టంభన వ్యాపించింది. ఏం రాయాలో పాలుపోలేదు. వెక్కిరించడమా? ఈలలూ చప్పట్లూ చరచడమా? అవమానించడమా? దేనికీ దారి కనిపించలేదు! అయినా లండన్‌ నగర మేధావులంతా ఈ ప్రదర్శన గురించే మాట్లాడుకున్నారు. ఎవరికీ ఏ వివరణా దొరకలేదు! ఎలా వ్యాఖ్యానించాలో అర్థం కాలేదు! అంతా ఒక సంశయాత్మక పరిస్థితి ….”

అని వర్ణించిన వాడు హెర్బెర్ట్‌ రీడ్‌ మహాశయుడు! ఆయన అప్పటికే సర్‌ బిరుదు పొందినవాడు!

సరిగ్గా ఇలాంటి పరిస్థితే 1940వ దశకం తొలిరోజుల్లో తెలుగు కవితాక్షేత్రంలో సంభవించింది! ఇక్కడ అధివాస్తవిక చిత్రప్రదర్శన వల్ల కాదు. శ్రీశ్రీ, నారాయణబాబులు అధివాస్తవిక కవితాప్రయోగాలు ఆవిష్కరిస్తున్న తొలిరోజులవి! అధివాస్తవికతకే కాదు, అత్యాధునిక కవితాధోరణులకు సైతం ఆచార్య రోణంకి అప్పలస్వామి భాష్యకారుడు! ఆయన సన్నిహిత మిత్రులు నారాయణబాబు, శ్రీశ్రీ, చాసోలు నూతనోత్సాహం పొంది నూత్న కవితారీతులకు అంకురార్పణ చేస్తున్నారు. వేరొక ప్రక్కనుండి పురిపండా అప్పలస్వామి వంగభాషలో అతినవ్య విప్లవ కవిత్వాన్ని వెలయిస్తున్న కాజా నజ్రుల్‌ ఇస్లాం కవితల్ని గొంతెత్తి గానం చేస్తూ తెలుగులో వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ రెండు ప్రాక్పశ్చిమ ధోరణులూ ఆ నాటి అగ్రేసరకవులకు ఉత్సేకమందిస్తున్నాయి! శ్రీరంగం శ్రీనివాసరావు, అధివాస్తవిక కవిత్వం గురించి ఎంత ఎక్కువ చెప్పేవాడో అంత తక్కువ రాశాడు! కానీ శ్రీరంగం నారాయణబాబు అధివాస్తవిక కవిత్వం అచ్చమైన స్వరూపస్వభావాల్ని రచించి చూపాడు!

శ్రీ.నా.బా. మౌనశంఖం రచించినది 1943 చివరలో! నేను తొలిసారి అతని ముఖతా విన్నది 1944 ఏప్రిల్‌, మే నెలల్లో. అందుకు సాక్ష్యం నా డైరీలో ఉంది. ఎందువల్లనో శ్రీ.నా.బా. రుధిరజ్యోతిని నవోదయ పబ్లిషర్స్‌ ప్రథమ ముద్రణగా వేసిన 1972లో కాని, 1976 నాటి ద్వితీయముద్రణలో గాని, ఈ మౌనశంఖం రచించబడిన తేదీ ఇవ్వబడలేదు. అది సరికొత్త కవితారీతిని, ఒక అంతర్జాతీయ అభివ్యక్తి పథాన్నీ సాధించింది. అతను అతినవ్యకవితలు 1933 నుంచీ రాస్తూనే వున్నట్లు మనకు సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. రుధిరజ్యోతిలో 41 కవితలు సంకలితమయ్యాయి! మరికొన్ని కవితలు కాలగర్భంలో కలిసిపోయాయి! అతనికి రాత అలవాటు లేదు! దస్తూరీ మరీ పసిపిల్లవాని రాతలా కొంకర్లు పోతుండేది! అందువల్ల ప్రతి కవితా ధారణలోనే బ్రతికేది! ఈ కారణం వల్లనే మరో పదికవితలు అదృశ్యమై పోయాయని చాసో వంటి సన్నిహితులు జ్ఞాపకం చేసుకునే వారు.

పూర్వాశ్రమంలో శ్రీ.నా.బా భావకవిగా మిణుగురులు రాశారు. వాటి గురించి జ్ఞాపకం చేసుకునేవారే కాదు!

నారాయణబాబు నేపథ్యం.

నారాయణబాబు గొప్ప సంపన్నునిగా జన్మించాడు. నికృష్టదరిద్రునిగా చనిపోయాడు! శ్రీ.నా.బా తండ్రి శ్రీరంగం సుందరరామయ్య గారున్నూ శ్రీశ్రీ తండ్రి వెంకటరమణయ్య గారున్నూ స్వయానా అన్నతమ్ములై పూడిపెద్దివారింట పుట్టారు! ఇరువురూ శ్రీరంగం సోదరులకు దత్తులయ్యారు. శ్రీశ్రీ చిన్న స్కూలు మాస్టరు కొడుకు! నా.బా తండ్రి పెద్ద ఆస్తిపరునికి దత్తుడై ప్లీడరుగా మరింత సంపాదించాడు. ఆయన దత్తతతండ్రి విజయనగర సంస్థానంలో ఉద్యోగస్తుడై ఆస్తి సంపాదించుకున్నాడు. ఈ కలిమిలేముల వ్యత్యాసం వల్ల కలిగిన ఈర్య్షాద్వేషాలు ఈ రెండు కుటుంబాల మధ్యా సహజాతాలుగా పెంపొందాయి. నారాయణబాబు, శ్రీశ్రీ కవులయిన తర్వాత ఆ వైషమ్యాలు గతించాయి. దానికి కొంత కారణం నారాయణబాబు తండ్రి దాయాదుల నుంచి తనకు సంక్రమించవలసిన ఆస్తికోసం ఉన్నదంతా ఊడ్చి, కోర్టులెమ్మట తిరిగి, అపజయం పాలయ్యాడు. కొడుక్కి దరిద్రం మిగిల్చాడు. కనుకనే ఆ దరిద్రనారాయణుడికి మరొకరిని ద్వేషించవలసిన అవసరం లేకుండా పోయింది! కాని శ్రీశ్రీకి మాత్రం ఎంత అణచుకుంటున్నా చివరివరకూ ఆ అసహనం మిగిలిపోయింది.

కారణమేమిటని ఆ దరిద్రుని అడిగితే “అది అంతే, స్వభావాన్ని ఎవరు మార్చగలరు? వేపకు చేదు వుందంటే ఎవరేం చేయగలరు?” అని ప్రశ్నించాడు. ఆరుద్ర ఇరువురికీ సన్నిహిత బంధువు.

ప్రఖ్యాతుడైన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి దౌహిత్రుడు ఉపాధ్యాయుల సూర్యనారాయణ అనే సహృదయుడుండేవాడు. ఆజానుబాహువు. స్ఫురద్రూపి, అభ్యుదయవాది, నాకు సన్నిహిత మిత్రుడు, అవసరాల, చాసో, సోమరాజు, శెట్టి ఈశ్వరరావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, రోణంకి మాస్టారు, ఆ.నా. శర్మ ప్రభృతి విజయనగరం మేధావులందరికీ సూర్యనారాయణ సన్నిహితుడు. బంకులదిబ్బ సమీపంలో ఉన్న సుందరరామయ్య గారి మేడ ఆయన పోకముందే అప్పుల నిమిత్తం ఇతరులకు పోయింది. 1969లో మహారాజా సంస్కృత కళాశాల శతవార్షికోత్సవాలకు ఒక ఉపన్యాసకుడిగా నన్ను ఆహ్వానించారు. వెళ్ళి రెండు రోజులున్నాను. నన్ను ఆహ్వానించడానికి పెద్ద కారణమేమీ కనిపించలేదు. సర్వశ్రీ భాట్నం శ్రీరాంమూర్తి, అన్నాప్రగడ శేషసాయి, సాంబశివరావు అనే వారు నాకు మిత్రులు! శ్రీ భాట్నం రాజావారి ప్రతినిథిగా, సంస్కృత కళాశాల కార్యదర్శి! శేషసాయి ప్రిన్సిపాల్‌! సాంబశివరావు అధ్యాపకుడు. నూత్నవస్త్రాలతో నాకు సన్మానం కూడా చేశారు. నేను విజయనగరంలో ఉన్నంతకాలం మిత్రుడు ఉపాధ్యాయుల నన్ను విడిచిపెట్టలేదు. నారాయణబాబు పుట్టినయిల్లు చూద్దామనే ఇద్దరం కలిసి బంకులదిబ్బ దగ్గరకు వెళ్ళాం! ఆ ఇంటి ప్రస్తుత యజమాని శ్రీ పులిపాక సీతాపతిరావు అని తెలిసింది. ఆయన మాకు దూరపుబంధువు! గాయని పి. సుశీలకి స్వయానా పినతండ్రి. ఉపాధ్యాయుల సూర్యనారాయణ అర్థాయుష్కునిగా 1970 ప్రాంతంలో చనిపోయాడు. శ్రీ.నా.బా అంటే అతనికి ఎంతో ప్రాణం! అతని స్వదస్తూరీతో రాసిన శ్రీ.నా.బా గీతాల పుస్తకం నా దగ్గర చాలాకాలం ఉండిపోయింది. శ్రీ.నా.బా ను ఆత్మీయంగా ప్రేమించిన వారు విజయనగరంలో ఎందరో వున్నారు. ద్వారం వెంకటస్వామినాయుడు, ఆయన కుమారుడు భావన్నారాయణరావు, చొప్పెల్ల సూర్యనారాయణ భాగవతార్‌ వంటి వారెందరో!

మౌనశంఖం.

ఈ కావ్యారంభంలో కవితాస్వరూపంలోనే పరిచయవాక్యాలు రాయడం ఇదే ప్రథమం! పూర్వకావ్యాలలో అవతారికలుండేవి! కాని వాటిలో కావ్యగతార్థాల గురించి కాక, ఇతరేతర విషయాలు ప్రస్తావించబడేవి! కృతిపతి వర్ణన, అతని వంశావళి, షష్య్టంతాలు వగైరాలుండేవి. కాని మౌనశంఖంలో మాత్రం జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ఈ కావ్యం గురించి ప్రస్తావిస్తాడు. తాను శ్రీశ్రీ ద్వారా విన్నసంగతీ, పొందిన అనుభూతీ వర్ణించాడు. నారాయణబాబు కావ్యం మౌనశంఖం శ్రీశ్రీ చదివి వినిపించాడు. తానెంతో ఆనందించాడు. హృదయపూర్వకంగా పాదాభివందనం చేద్దామని వచ్చాడు. ప్రేమతో అతని గుండెల్లో తన తల దాచుకో దలిచాడు. గుండెలో అనే పదం ఇక్కడ కవితాప్రతిభకూ ప్రేమాభిమానాలకూ ప్రతీక! తన తల అనేక ఆలోచనలతోనూ సంప్రదాయక కావ్య మర్యాదల తోనూ అనుస్యూతమై కళపెళలాడుతుంది. నీ మాటల్లో అనగా కవితామయ వాక్యాల్లో తన చిరంతన వ్యధను డించుకోదలచానని జరుక్‌ అన్నాడు. తన ఆత్మను అతని ఆత్మతో విలీనం చేయదలచాడు. అయితే ఆ కవితావిజయానికి తన ఆంతరంగిక ఆమోదం అందించాలని ఆత్రపడుతున్నాడు!

నా పతంగి తాళ్ళు తెంపి

పతంగం అంటే పక్షి! పతంగ్‌ అని హిందీలో గాలిపడగకు కూడా వాడతారు. తెలుగుదేశంలో పతంగి అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఆంగ్లంలో కైట్‌ మాదిరిగా గ్రద్దకీ, గాలిపటానికీ ఉభయార్థకంగా ఒకే పదం ప్రయుక్తమవుతుంది. ఆ పతంగి తాళ్ళు మనిషి చేతుల్లో ఉన్నప్పుడు దాని పోకడలు తన కంట్రోల్‌లో ఉంటాయి. అట్టి అదుపు లేకుండా వాటిని తెంపి, పతంగికి యధేచ్ఛాగమనం కలిగిస్తానంటాడు. నిత్య కావ్యాధ్యయనం వల్ల తన పతంగి నిరంతర సంశమనంలో తన రసభావాలను అదుపు చేస్తోంది. సంప్రదాయ జాటిల్యం ఒక జాడ్యంగా తయారయింది. వాటిని తెంపేస్తే తప్ప, ఆ మానసిక పతంగికి పూర్తి స్వేచ్ఛ లభించదని నా.బా అంటున్నాడు. ఆ పని ఎప్పుడో చేయగల్గాడు. అతని కవితాభివ్యక్తిలో యధేచ్ఛ స్పష్టాకృతి పొందింది. ఆ మాట శ్రీశ్రీ కూడా ఆమోదించాడు, జలసూత్రం దగ్గర!

పైగా జరుక్‌ జలానికే సూత్రబద్ధం చేసినవాడు. పతంగికి సూత్రబద్ధత ఉండదా? కనుక నీ నా పతంగి తాళ్ళు అని ఉభయుల కట్టడులూ తెంపెయ్యాలని నిశ్చయించానంటున్నాడు.

రూపాయి మీద చల్లడం.

ఇక్కడ శవం మీద చిల్లరడబ్బులు చల్లడం అనే పద్ధతిగా కాదు. కనకాభిషేక సందర్భంలో బంగారుకాసులు తలమీంచి పోస్తారు. అది సంప్రదాయం. కాని, మనం పరాయిపాలనలో బానిసలుగా బ్రతుకుతున్నాం. మనకారోజులలో జార్జిమొగం వెండిబిళ్ళలే సర్వం! కనక, కనకాభిషేకానికి బదులు రూపాయిలే అతని మీద జల్లి తన గౌరవాన్ని వెల్లడించగలనంటున్నాడు జరుక్‌! ఆ కర్తవ్యం నిర్వర్తించి వెళ్ళిపోదామని తద్వారా రసజ్ఞునిగా తన బాధ్యత నెరవేర్చుకుంటాననీ వ్యక్తం చేస్తున్నాడు.

ఇంత గంభీరమైన ఆకాంక్షతో జలసూత్రం వచ్చేసరికి, నా.బా అయిపు లేడు. అతడికి ఆశాభంగమయింది. కోపం వచ్చింది. ఆ కోపంలో తమ మధ్య గోప్యంగా వున్న కొన్ని సంగతులు బహిర్గతం చేస్తున్నాడు. “ముంగంబాకంలో ఆమె పక్కలో దూరాడా ఈ త్రాష్టుడు?” అనుకున్నాడు. అది ప్రేమపూర్వకనింద. అభియోగం కాదు. ముంగంబాకంలో ఒక అరవవేశ్యతో ఎప్పుడు రూపాయి దొరికితే అప్పుడు నా. బా దాంపత్యం నడిపేవాడు. అప్పుడప్పుడు మైథునాదికాలు చేయకపోతే శారీరక ఆరోగ్యం చెడిపోతుందని బహిరంగంగానే చెప్పుకునే వాడు. అతడికి కళత్రయోగం లేదు. చిన్నప్పుడే ఒక అయోగ్యురాలితో వివాహం జరిగింది. ఆమె మరుగుజ్జు, మాచకమ్మ. వచ్చినదారినే వెళ్ళిపోయింది. అతనెప్పుడూ సహజాతాల గురించి గుప్తం చేయడం గానీ అవి రహస్యప్రక్రియలుగా భావించడం గాని ఆత్మవంచనగా నిరసించేవాడు. చలం గారి తర్వాత పుట్టిన ఆధునిక కవులు ఇన్‌హిబిషన్స్‌ దాచుకుంటే మనసుకి జబ్బు పడుతుందని బాహాటంగా చెప్పేవారు.

“అరవ ఆర్భాటం ఎదురుగుండానో”

అని జలసూత్రం అన్న మాటకు ఒక పురాస్మృతి వుంది. నా. బా నివసించే బ్రహ్మచారి గది కెదురుగా అరవస్త్రీలు నిత్యం పెద్దగా అరుచుకుంటూ రహస్యాలు మాట్లాడుకునేవారు. లేదా, జగడాలు సాగించేవారు. అతని గది ఓనరు లావుగా, పొట్టిగా, వికారంగా వుండేవాడు. అతన్ని వీళ్ళంతా “పందికొక్కు”గా వ్యవహరించుకునే వారు. నా. బా అంతరాత్మ ఎక్కడికెక్కడికో విహరిస్తూ జలసూత్రంకు దొరక్కపోవడం వల్ల తన ఆనందాన్ని వ్యక్తం చేయలేక, రకరకాల ఊహలు సారిస్తాడు. ఇదంతా మౌనశంఖం కావ్యానికి ఉపోద్ఘాతం!

యధాలాపంగా ఫేక్చువల్‌ ్‌ మేటర్‌గా సాధారణాలాపం ప్రారంభమవుతుంది. కాడ్‌లీవర్‌ ఆయిల్‌లో డి విటమిన్‌ వుంది. కోడుగుడ్లు ధాతుపుష్టి. అంతవరకూ ఫరవాలేదు. ఆటోమేటిక్‌ రైటింగ్‌ సర్రియలిజంలో అంతర్భాగం. ఈ సాధారణవిషయాల నుంచి కవి వెంటనే ఒక ఉత్తుంగ లంఘనం చేస్తాడు.

“కాకా తువ్వ తెలుపు”

అంటాడు. ఇది కూడా మననాటి వాడికకు దూరమైందే! అతనుద్దేశించినది నిర్దుష్టంగా తెలియదు. కాకాతువ్వ అనేది కాకరపువ్వొత్తి వంటి దీపావళిసామగ్రికి ప్రాంతీయ పరిభాషగా భావించవచ్చునా? “కోయిల నలుపు” అనేది ఆ పక్షి స్వరూప చిత్రణ.

ఆకాశం పొడవు, భూమి వెడల్పు అన్న మాటల జంటతో వాటి నడుమ దాంపత్యం నెలకొల్పుతాడు. ఆ భావాన్ని బలపరచడానికే తర్వాతపాదంలో ఆకాశం ప్రవళాధరం అందుకొస్తే కదా మాధుర్యం తెలిసేది? ప్రవాళం అంటే పగడం. పగడపు రంగు పెదవి అనడం కవిసమయమే! అందితే మాధుర్యం తెలుస్తుంది కాని అందదు.

కవి పడుకున్నాడు. మాగన్ను పట్టింది. సబ్‌కాన్షస్‌ మేలుకుంటోంది. అంతశ్చేతనకు లోకంలో విసిరే లక్ష మెలికలు స్ఫురించాయి. దానితో తన శరీరమే మెలికలు తిరిగినట్లు భ్రమ కలిగింది. పైగా సెక్సు వాంఛ కూడ అర్థజాగృతిలో విజృంభిస్తోంది! ఆ మెలికల వల్ల స్వపరభేదం పోయింది. సెంట్రల్‌ ఈగో నిస్తబ్ధమయింది. అంతా కొత్తగా వుంది.

ఎవరు నువ్వు అని అడుగుతోంది. ఇందులో మెట్టవేదాంతులు బోధించే నువ్వెవరు? నేనెవరు? అనే ప్రశ్నల పరంపర కూడా ధ్వనిస్తుంది.

ఇక భూమి యావత్తూ మరకతమణులు పరిచినట్లు పసరిక అంకురించగా దాని చివురు సూదిమొనలతో తన పాదం గోకి, నీవెవరు? అని అడుగుతుంది. “నేను కనిపించే శరీరమా? కనిపించని ఆత్మా?” ఏం చెప్పాలి కవి?

గాలి ఉదయాస్తమయాలలో తప్పక తన భుజం తడుతుంది. పెద్ద తెలివిగా నీవెవరు అని అడుగుతుంది.

ఆకాశం విశాలఫలకంపై రెండు ప్రశ్నార్థకాలను చిత్రించింది. అవి బ్రహ్మాండమంతా ఆవరించాయి. ఆ ప్రకృతి చిత్రాలున్నూ అడుగుతున్నాయి, నీవెవరు, నీవెవరు?

ఏమని చెబుతాడు కవి? తన పేరూ వూరూ చెబితే ఆ పంచభూతాలకేం తెలుస్తుంది? అసలు “బీయింగ్‌” కు పేర్లతో పనేముంది? వ్యక్తిత్వం భౌతికమా? అభౌతికమా? అంతా మిథ్య.

ఊటీ అని ప్రాచుర్యంగా పిలవబడే నీలగిరి ప్రాంతం (ఉదకమండలం) అతిశీతల ప్రదేశం. నీళ్ళు గడ్డకడతాయి. అక్కడ ఒక అభాగ్యురాలు పురుడు పోసుకుంది. శీతవాతం సోకి చనిపోయింది. డాక్టరు శవపరీక్ష జరిపాడు. ఆ చూలాలి వక్షంలో గడ్డకట్టిన “చనుబాల జిడ్డును” అని తనను తాను వర్ణించుకుంటాడు నా. బా. గడ్డకట్టినపుడు ద్రవపదార్థానికి ఘనపదార్థపు లక్షణాలేర్పడతాయి. ఆ విధంగా తనకేర్పడిన ఆకృతి ఒక తల్లి విషాదనిష్క్రమణ నుంచి రూపొందిందనే కరుణామయచిత్రం ప్రదర్శిస్తాడు. అతని బ్రతుకు భయంకరవిషాదంతో ఆరంభమయిందని కవి వివరించాడు. గడ్డకట్టిన పాలజిడ్డు తన శరీరాకృతితో ఉపమించుకుంటున్నాడు.

తన జననానికి వేరొక ప్రారబ్ధసంచితార్థకమూ వుంది. తాగి చనిపోయిన పుండాకోరుని, డాక్టరు శవపరీక్ష చేయగా అతని కడుపులో అరగకుండా మిగిలిపోయిన సారాచుక్క పైకి ఒలుకుతుంది. అదీ తానేనని చెప్పుకున్నాడు. తాగి తాగి మైకంలో చనిపోగా కడుపులో మిగిలిపోయిన సారాయే తన రూపము! అన్న దానిలో ఒక గుప్తార్థం ఉంది. తన తండ్రి ధనదాహంతో దాయాదుల ఆస్తులకు తానే వారసుడనని వ్యాజ్యం చేసి సర్వనాశనమైపోగా, తాను నాశనం చెందక, మిగిలి పైకి ఒలికిన మాదకద్రవ్యం వంటిది తన జీవితం అని ధ్వనిస్తాడు. ఈ రెండు అధివాస్తవిక పదచిత్రాలూ విషాదాంతగాంభీర్యాన్ని సద్యస్ఫూర్తిగా నిలుపుతున్నాయి. ఒకటే నేపథ్య వారసత్వానికి తన దయనీయ జీవితావరణమే ప్రతీకాత్మక రూపమని కవి చెప్పడం రహస్యంగా ద్యోతకమౌతుంది. తెలుగుసాహిత్యంలో నా.బా తో ఏర్పడిన భవిష్యత్‌ సూచన అది!

ఇంకా తానెవరని అడిగేవాళ్ళుంటారా? ఉంటే అంతకన్న విషాదాంతము, బాధాకరచిత్రణలతో తనను ప్రతిష్టించుకుంటాడు.

“చూలాలై మృతశిశువుని కని గుండెల్లో పాలే పాముకాటులా బాధపెడితే ఒక ఇల్లాలు ఒక చీకటి రాత్రిలో వీధికాలువలో కురిపించిన పాలవానను”

అని మరీ దయనీయంగా చిత్రించుకున్నాడు. అందరిలాగే గర్భవతి అయిన ఒక ఇల్లాలు సాధారణప్రసవం పొందక గర్భంలోనే శిశివు చనిపోగా ఆ మృతశిశువును డాక్టర్లు తొలిగించారు. తాగడానికి బిడ్డ లేకపోయినా చూలాలుకు స్తన్యం చేపుకు వస్తుంది. వక్షం పోట్లు పెడుతుంది. దుస్సహబాధ; ఎవరూ చూడని రాత్రివేళ వీధికాలువలో తను చనుబాలు పిండి వాన కురిపించగా తానై రూపు దాల్చానంటాడు నా. బా. ఈ పదచిత్రాన్ని ఊహిస్తూ అనుభవించడమే తప్ప అర్థవివరణమో, వ్యాఖ్యానమో అందించడం సాధ్యం కాదు కదా! తన పుట్టుక ఎంత విషాదాంత సంఘటనో గాఢంగా చెప్పాలంటే ఈ ఘోరచిత్రాలు తప్ప, కవికి మరో ఆధారం ఏముంటుంది?

ఇంతకీ అసలు ప్రశ్న మిగిలేవుండిపోయింది. తానెవరు? ఎక్కడివాడు? ఎలా వచ్చాడు? అనే ప్రశ్నలతో పాఠకుడు వేగిపోవడం నిష్ఫలమే! తానెవరైనా చనుబాల బిడ్డైనా, కడుపులో మిగిలిన సారా చుక్కైనా, వీధికాలువలో కురిసిన పాల వానైనా, మన బ్రతుకులను కలవరపెట్టవు! దారుణ దుఃఖం ఆచ్ఛాదితమై పుట్టినవాడు కవి! తన గురించి చెప్పుకోవాలంటే తన ప్రవర చెప్పాలి. అది మిత్రబృందాల సంబంధి మాత్రమే! వైయక్తికం కానేకాదు!

“ఇంతకూ ఎవరైతేనే రుక్మిణీకళ్యాణ తపస్సులో కుటుంబచింతనలో కలిసాం నీవూ నేనూ”

అంటూ జరుక్‌శాస్త్రికి వివరిస్తాడు. “రుక్మిణీకళ్యాణ తపస్సు” అనేది ఒక గుప్తసంకేతం! జరుక్‌ చాలా ఆలస్యంగా నలభై సంవత్సరాలు దాటాక వివాహం చేసుకున్నాడు. అంతవరకూ అతనికి కళ్యాణం గురించి తపస్సే! అలాగే కుటుంబచింత కూడా ఒక గుప్తసంకేతమే! కొడవటిగంటి కుటుంబరావు సమకాలీన మేధావులలో ప్రముఖుడు. దాదాపు సమవయస్కుడు. కుటుంబచింత అంటే ఒక ఫేమిలీవర్రీ అని అర్థం కాదు. చింతనాపరుడైన కుటుంబరావుతో సంయోగాలూ వియోగాలూ అని మాత్రమే అర్థం! అలా కలిసిన తాము

“నీవు నేను కత్తిపీట మీద కలిసిన అరటిపండు అరిసె లాగ ఎన్ని మార్లు నీవు లెక్క పెట్టినా నన్ను మరచినా నీవు ఉన్నవాళ్ళం ఇద్దరం”

అంటూ ప్రసక్తాంతరమైన ప్రతీకలను ప్రతిష్టిస్తాడు. కత్తిపీట అసమకోణంలో ఉండే పరికరం. దాని మీద ఉండే అరిసె స్త్రీలింగ ప్రతీక, అరటిపండు పుంలింగ ప్రతీక, అని వేరే చెప్పనక్కరలేదు! అవి కత్తిపీటపై కలవడం ఎలా సాధ్యమయింది? ఆ రెంటికీ కత్తిపీటతో సంబంధం అసందర్భంగా ఏర్పడి కలుసుకున్నారు. కాని స్త్రీలింగ ప్రతీకాదులు వాడినా స్త్రీపుంస సంబంధంగా అని కాదు.

నా. బా సాధారణ వాక్యనిర్మాణ మర్యాదలను పాటించడు. పైగా భంగపరుస్తాడు. స్థూలదృష్టికి సంబంధం పొసగనట్లు గోచరించే విడి పదాలను పేరుస్తాడు. సింటాక్స్‌ను భంగపరచడం అతని వైయక్తిక సంవిధానం. కనుక నడుమ అవసరమైన ధాతువులను విభక్తులను పాఠకుడే సప్లయి చేసుకోవాలి. అప్పుడుగాని అసలు విషయం బోధపడదు. ఇందరు కవులలో నా. బా అత్యంత ఆధునికుడు. వే. మో. అయినా వేముల అయినా అతను నిర్మించిన లక్ష్మణరేఖలను స్పర్శించనైనా లేడు.

కత్తిపీట మీద కలిసిన ఈ అరటిపండు, అరిసె ఈ సందర్భంలో స్త్రీపురుష ప్రతీకలు కావు. కేవల శరీరవర్ణసంకేతాలే! అరటిపండు పచ్చనిది. అది శ్రీశ్రీ శరీరవర్ణసంకేతం. అరిసె నలుపు తెలుపుల దోరరంగు. అది తన వంటిరంగుకు సమానమైనది.

“ఎన్ని మార్లు లెక్కపెట్టినా … రక్తం చిక్కన” అన్న వాక్యంలో తామిరువురే అతినవ్య కవితా ప్రవక్తలు ప్రయోక్తలూ అనే సత్యాన్ని చాటుతూనే అప్పుడప్పుడు శ్రీశ్రీ నా. బా ని మరచిపోయినట్లు, తానొక్కడే ప్రవక్తనని చెప్పుకున్నా నీటికన్న రక్తం చిక్కన కాబట్టి కవులమైనా అన్నదమ్ములమైనా గర్భశత్రువులమే అయినా శ్రీశ్రీ, నేనూ ఇరువురమే పరిగణించబడవలసిన వాళ్ళం! నీటి కన్న రక్తం చిక్కన అనేది ఆంగ్లసామెతకు అవసరార్థం వచ్చిన తెలుగు సేత! వీరిరువురికీ విడదీయలేని రక్తసంబంధం వుంది. విడదీయరాని కవితాస్థాయి సంబంధమూ వుంది. కనుక “ఇద్దరమే” నంటూ పాఠకులం పూర్తిచేసుకుంటే సార్థక్యం కలుగుతుంది.

సిరాబుడ్డీ కలం మరో దాంపత్యం.

పై అభివ్యక్తికి కొనసాగింపు ఉంటుందని పాఠకుడు భావిస్తాడు. కాని, ఈ సాధారణపద్ధతిని బ్రేక్‌ చేసి మరోదూరదృశ్యానికి కవి ఎగిరిపోతాడు. ఇప్పుడు మనకు ఎదురవుతున్న భావం స్థూలదృష్టికి గొప్ప క్లిష్టతరమైనదిగా కనిపిస్తుంది. కారణం డీకన్‌స్ట్రక్షన్‌ టెక్నిక్‌ను కవి బుద్ధిపూర్వకంగా ప్రయోగించడం ఒకటి, సాధారణసంబంధాలను విచ్ఛిన్నం చేయడం రెండవదీను. సిరాబుడ్డిలోని సాలెపట్టును యూటిరస్‌కీ, సర్వెక్స్‌కీ సంకేతించడం ఒక ముఖ్యమైన డీవియేషన్‌! సిరాబుడ్డి నిత్యోపయోగం. కాని, దానిలో కలం ముంచి రాయబోతాడు. సిరా తగలదు. కలం సాగదు. సాలెపట్టు కలానికి తగులుతుంది. దాన్ని పైకి తీసి చూశాడు. తాను నిర్మించుకున్న వలలో తానే చిక్కుకుపోయి సాలెపురుగు చచ్చి పడివుంది. కాని ఆ వలలో పడ్డ మక్షికాలు మాత్రం సజీవంగానే వున్నాయి. తన అఖండ కీర్తిని కొల్లగొడుతున్న ఈ దోపిడీండ్రను ఉక్కణచాలని, సాలెపురుగులా కృష్ణశాస్త్రి కవిత్వరచనకు ఆధారభూతమైన సిరాబుడ్డిలో ఒక వల నిర్మించాడు. కాని తన వ్యూహానికి తానే తగులుకుని మరణించాడు. ఎవరి కోసమైతే ఆ వలను నిర్దేశించాడో ఆ మక్షికాలు రెండూ సజీవంగా సిరాబుడ్డిలో కదలాడుతున్నాయి. ఆ రెండు మక్షికాలూ తానూ శ్రీశ్రీ. సాలెపట్టును సిరాబుడ్డిలోంచి బయటకు తీయగా, చచ్చింది సాలెపురుగు! బయటకు తీయగా చచ్చిన సాలెపురుగు, బ్రతికున్న ఈగలూ దర్శనమిచ్చాయి. వలకు తగులుకుని రెక్కలూడిపోయాయి. రెంటికీ ఇంక తప్పదు కదా! “డేకురుకుంటూ పోదాం పద” అని శ్రీశ్రీని హెచ్చరించాడు కవి. పెద్ద ఈగ గనుక తాను అనుభవశాలి.

ప్రక్కనున్న శ్రీశ్రీని పిలిచి “ఏమిట్రా తంబీ?” అన్నా .. తమిళభాష ప్రభావంతో తమ్ముడ్ని ముద్దుగా తంబీ అన్నాడు . “సాలెపట్టు” లేదు అదంతా కవివ్యూహం అన్నాడు కుశాగ్రబుద్ధి శ్రీశ్రీ. వెంటనే పోల్చుకున్నాడు. ఇక్కడ సూక్ష్మంగా పాత్రశీలపరిశీలన చిత్రించాడు నా. బా. అంతేకాదు, ఇంకా విశదపరిచాడు

“మక్షికాలు నీవు నేను పట్టులో చిక్కి చచ్చాం కామని ఆకాశం చూరునుంచి సిరాబుడ్డిలో పడి ఆత్మహత్య చేసుకున్న కృష్ణశాస్త్రి”

రెక్కలు తెగాయి కాబట్టి డేకురుకుంటూ పోదాం పద వీధి లోకి అన్న మాటల సందర్భాన్ని బట్టి శ్రీశ్రీ చెప్పినవిగా పోల్చుకోవాలి. తమ సిరాబుడ్డిలోనే తాము పడి పట్టులో చిక్కి చనిపోవాలని ఆశించిన కృష్ణశాస్త్రి ఆశాభంగం పొందాడు. ఆయన ఎప్పుడూ “దిగిరాను దిగిరాను దివి నుండి భువికి” అంటూ లోగొంతులో పాడుకుంటాడు కదా! అందుకే ఆకాశపు చూరు నుంచి సిరాబుడ్డిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు పాపం, అవమానం భరించలేక. ఆ విధంగా బ్రతికిపోయారు. రెక్కలూడిపోయిన శ్రీశ్రీ, నా.బా లు కనీసం డేకురుకుంటూనైనా విశాలమైన వీధిలోకి పోకతప్పదు. తమ విజయం చాటక తప్పదు. తమ అస్తిత్వాన్ని నిలుపుకోక తప్పదు. తమకు ఎవరైనా అడ్డంకులు, పితలాటకాలూ కల్పించినా అన్నిటినీ అధఃకరించక తప్పదు.

అదీ శ్రీశ్రీ, నా. బా లు చేసుకున్న సంకల్పం. దీనితో కవితలోని కంఠధ్వని మారింది. అందుకే “రాత అయిపోయింది” అంటూ తర్వాత భాగం ప్రారంభిస్తాడు కవి.

“వ్రాత అయిపోయింది. సిరా మిగిలిపోయింది. ఏం సాధనం” అన్నా… “ఉంచు నా మహాప్రస్థానంలోకి వచ్చే మహారాజులకు నీలిశాలువాలల్లి కానుకలిస్తా!” అన్నాడు శ్రీశ్రీ.

ఈ చివరి మాటతో ఒక చారిత్రక సత్యం బోధపడుతుంది. మహాప్రస్థానంలోకి చేర్చుదామనుకున్న చాలా రచనలు శ్రీశ్రీ మనస్సులో భావరూపంలో మిగిలిపోయివున్న దశలోనే ఈ కవిత రచించబడింది. అప్పటికి జగన్నాథరథచక్రాలు గాని, నీడలు వగైరా తదుపరి రచనలు గానీ పూర్తికాలేదు. ఆ చారిత్రక సత్యానికి ఇది ఆధారభూతం!

పైగా మరో ధర్మసూక్ష్మం కూడా అభివ్యక్తమవుతుంది. గతకాలంలో మానుషత్వాన్ని తెగపీడించిన మాహారాజులెందరో మహాప్రస్థానంలోకి రావలసినా బయట మిగిలిపోయారు. వాళ్లంతా వచ్చినపుడు మహారాజులు కదా, నీలిశాలువాలల్లి కానుకలిస్తానన్నాడు. నీలిరంగు విషాదాంతానికి చిహ్నం. పోనీ మరో పని చెయ్యమని శ్రీశ్రీ గడుసుగా సలహా ఇస్తాడు. ఇష్టంలో అయిష్టం వ్యక్తమవుతుంది. అవచేతనలో రహస్యంగా ముద్దకట్టిన భావానుభావాలు పిలవని పేరంటంగా కవిత్వంలోకి చొరబడతాయి. ఆ సలహా ఏమిటి?

“కాకపోతే నీ నెత్తురు నల్లబడేదాకా నీవే త్రాగీ! అప్పుడు వెలిగించు దీపం! ఈ మానవజాతికి నీవు ఎర్రదీపానివి ప్లేగువ్యాధికి కనిస్టీపువి!” అంటాడు. ఈ వాక్యాలు స్తుతిపూర్వక అభిశంసలు; నిందాగర్భితాలు! ప్లేగు వ్యాధి చొరబడకుండా కాపలా కాసే కనిస్టీపుగా నా. బా ఉండాలని, మానవజాతికే ఎర్రదీపంగా వెలగాలనీ శ్రీశ్రీ ఆశిస్తాడు.

నిజమే! మానవజాతి కుక్షింభర కలాపంలా అక్షయుగ్మాన్ని సంధించుకుని, సాధిమ్చుకుంది. తన కన్న ముందేపుట్టిన దేవతలపై ఒట్టుపెట్టుకుంటూ సాగింది. కాని ఆ ఒట్లెప్పుడూ నిలుపుకోదు. అందుకే అసలును విడిచి నకిలీలను ఆరాధిస్తూ గుడ్డిగా సాగిపోతోంది. శూన్యస్థలాలలో తడుముళ్ళాడుకుంటోంది. పెద్ద అన్వేషి వలె ఆత్మవంచన చేసుకుంటోంది. అట్టి మానవజాతికోసం కవి ఎర్రదీపమై వెలగక తప్పదు.
----------------------------------------------------------
రచన: సోమసుందర్ ఆవంత్స, 
ఈమాట సౌజన్యంతో

No comments: