సార్థక నామధేయుడు సంగీతరావు
సాహితీమిత్రులారా!
తల్లిదండ్రులు పెట్టిన పేరును బట్టి మనుషులుండడం అరుదు. శాంతారాం ముక్కోపి కావచ్చు. విద్యాసాగర్‌కు చదువబ్బకపోవచ్చు. సుందరం అనాకారి కావచ్చు. అలా జరిగితే వారిని తప్పు పట్టలేం కూడా. కానీ సంగీతరావుగారు ఈ కోవకి చెందరు. 1920లో జన్మించిన సంగీతరావు గారు మూర్తీభవించిన సంగీతమే. సంగీతరావుగారి గురించిన విశేషాలు తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది మన అభిమాన గాయకుడు ఘంటసాలకు ఆయన చాలా సన్నిహితుడూ, గురుపుత్రుడూ కూడా. రెండోది మద్రాసులో వెంపటి చినసత్యంగారి కూచిపూడి నృత్యనాటకాలు చాలావాటికి ఆయనే సంగీతదర్శకుడు. వీటన్నిటికన్నా నాలెక్కన ముఖ్యమైన విషయం ఆయనకు శాస్త్రీయ సంగీతంలో కనీసం ఏడున్నర దశాబ్దాలుగా పరిచయం, అభిరుచి, అభినివేశం, అనుభవం ఉన్నాయి. ఆయనతో మాట్లాడడం నిజంగా ఒక ఎడ్యుకేషన్. ముప్ఫై ఏళ్ళకు పైగా ఆయనతో పరిచయం ఉన్న నాకు ఇప్పటికీ మద్రాసు వెళ్ళినప్పుడల్లా ఒకటి రెండు రోజులు ఆయనను కలుసుకోవడానికి వెళ్ళడం ఆనందదాయకమే.
విజయనగరం సంగీత కళాశాల అధ్యాపకవర్గం.
1937 ప్రాంతాల తీసిన అరుదైన ఫోటోలో ఉన్నవారు ముందువరసలో ఎడమనుంచి శ్రీపాద సన్యాసిరావు (మృదంగ విద్వాన్), వాసా వెంకటరావు(ప్రఖ్యాత వైణికుడు కృష్ణమూర్తిగారి తండ్రి), ద్వారం వెంకటస్వామినాయుడు, పట్రాయని సీతారామశాస్త్రి, మునుస్వామి (నాదస్వర విద్వాన్). రెండో వరసలో ఎడమ నుంచి మునుస్వామిగారి ఒక శిష్యుడు, అయ్యగారి సోమేశ్వరరావు (వీణ విద్వాన్), చాగంటి గంగబాబు (అంధుడైన వయొలిన్ విద్వాన్), అవధానుల సూర్యనారాయణ (పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యుడు), లోవదాసు (మునుస్వామిగారి కుమారుడు). మూడో వరసలో వాసా వెంకటరావుగారి మనమడు(దౌహిత్రుడు), ప్యూన్ రామస్వామి.సంగీతరావుగారి కుటుంబ నేపథ్యం తెలిస్తే ఆయన గురించి కొంత అర్థమౌతుంది. సంగీతరావు గారిది ఉత్తరాంధ్రకు చెందిన సంగీత కుటుంబం. ఆయన తండ్రి పట్రాయని సీతారామ శాస్త్రిగారూ, తాత పట్రాయని వెంకట నరసింహశాస్త్రిగారూ జీవితమంతా సంగీతసాధన చేసినవారు. సీతారామ శాస్త్రిగారు (1900 1957) మంచి సంగీతజ్ఞుడు. ఆయనను సాలూరు చిన్నగురువుగా రనేవారట. ఆయన తండ్రి పట్రాయని వెంకట నరసింహశాస్త్రి (1872 1931) పెద్దగురువుగా పేరుపొందిన విద్వాంసుడు. తంజావూరు గురువులవద్ద సంగీతం అభ్యసించిన వ్యక్తి. త్యాగరాజ కీర్తనలు కచేరీల్లో పాప్యులర్ అవడం ఆయన కాలంలోనే మొదలైందట. ఇరవయ్యో శతాబ్దం తొలి రోజుల్లో తెలుగునాట కర్ణాటక సంగీతం వేళ్ళూనడానికి తోడ్పడినవారిలో బందరుకు చెందిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారొకరు. ఆయన శిష్యవర్గం నరసింహశాస్త్రి గారికి సమకాలికులు. త్యాగరాజు శిష్యుడైన మానాంబుచావడి (ఆకుమళ్ళ) సుబ్బయ్యగారి వద్దకు తంజావూరుదాకా కాలినడకన వెళ్ళీ సంగీతం నేర్చుకున్న మహానుభావుడు దక్షిణామూర్తి శాస్త్రి. ఆయన బాలమురళీకృష్ణకు గురువైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారికి గురువు. ఈ సంస్కారమంతా సంగీతరావుగారికి చిన్నతనంలోనే అవగతమయింది.
తన తండ్రి గురించీ, తన చిన్నతనంలో ప్రత్యక్షంగా విన్న ఇతర విద్వాంసుల గురించీ సంగీతరావుగారు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెపుతూ ఉంటారు. సంగీతరావుగారి తండ్రి సీతారామశాస్త్రిగారు విజయనగరం సంగీతకళాశాలలో 1936 నుంచీ గాత్రం నేర్పేవారట. ఎందరు అభ్యంతరం లేవనెత్తినా ఆయన కర్ణాటక సంగీతానికి హార్మోనియం పనికొస్తుందని శ్రుతిబద్ధంగా, గమకాలతో వాయించి మరీ నిరూపించారట. అలాగే సంగీతంలో సాహిత్యం ఇమడదు అనే ప్రతిపాదన తప్పని ఆయన వాదించేవారట. తన గాత్రకచేరీలలో సంగీత, సాహిత్యాల నుడికారాలు రెంటినీ సమన్వయం చేసి చూపించేవారట. ఇలా సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న ఈయన ధోరణి సంగీతకళాశాల ప్రిన్సిపల్ ద్వారం వెంకటస్వామి నాయుడుగారికి నచ్చేది కాదట. కళాశాలలో విద్యార్థులకు సిలబస్ ప్రకారమే నేర్పుతున్నాను కదా, ఆ తరవాత నేనెవరితో ఏమంటే మీకెందుకు అని శాస్త్రిగారు అనేవారట. బహుశా అందువల్లనే గాత్రంలో రాణిస్తారని అనిపించినప్పుడు నేదునూరి కృష్ణమూర్తివంటి విద్యార్థులను నాయుడుగారు డా. శ్రీపాద పినాకపాణిగారి వద్దకు పంపి ఉండవచ్చు. ఏది ఏమైనా పట్రాయని సీతారామశాస్త్రిగారి ప్రభావం 1938లో విజయనగరం కాలేజీలో చేరిన ఘంటసాలకు చాలా మేలు చేసింది. తెలుగు సినీ సంగీతానికీ, లలిత సంగీతానికీ తెలుగుదనాన్నీ, నేటివిటీనీ ఆపాదించడంలో అపూర్వ విజయాన్ని సాధించిన ఘంటసాలగారి ద్వారా ఆంధ్రదేశమంతా సీతారామ శాస్త్రిగారికి ఋణపడి ఉంది. తండ్రిగారి ప్రభావం తనమీద కన్నా ఘంటసాలగారి మీద ఎక్కువగా ఉండేదని సంగీతరావుగా రంటారు.
సంగీతరావుగారు ఘంటసాలకు సినిమాల్లో సంగీత దర్శకుడుగా సహకరించారు. చిన్నతనంలో స్వయంగా గానకచేరీలు చేసిన నేదునూరివంటి ప్రసిద్ధులకన్నా సంగీతరావుగారు సీనియర్. 1930లో నాలుగో, అయిదో క్లాసు చదివే రోజుల్లో సంగీతరావు బొబ్బిలి హైస్కూల్లో ఆకుండి నారాయణశాస్త్రిగారి ఒక కీర్తనను పాడారు. శాస్త్రిగారే స్వయంగా హార్మోనియంతో సహకరించారు. అది కల్యాణి, కదనకుతూహలం, దేవామృతవర్షిణి, మోహన, కానడ, ధర్మవతిలతో కూడిన రాగమాలిక. ఆ విధంగా బాలగాయకుడుగా పెద్దల మెప్పును పొందారు. ఆ తరవాత ఆయన మద్రాసుకు మకాం మార్చారు.
వ్యక్తిగతంగా సంగీతరావుగారు నిరాడంబరుడనీ, బిడియం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడనీ తెలిసినవారికి ఆయనకు రావలసినంత పేరు రాలేదని అనిపించడం సహజం. ఎటువంటి సామర్య్థమూ లేని అల్పులు స్వంత డబ్బా కొట్టుకుంటూ ఉండడం ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతున్నదే. అలాంటప్పుడు దగ్గరికి వెళ్ళి పలకరించితే తప్ప అపారమైన తన సంగీతజ్ఞానాన్నీ, అనుభవాన్నీ వివరించని సంగీతరావుగారివంటి ప్రతిభావంతుల గురించి అందరికీ తెలియదంటే ఆశ్చర్యం లేదు. తెలిసినవారు మాత్రం ఆయన ప్రతిభను కొంతవరకూ వెలికితీశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే “జీవితారోహణంలో ఎన్ని మెలికలు తిరిగినా, ఎన్ని గతుకులు దాటినా (ఆయనను) సూటిగా నడిపించినది సప్తస్వరార్చనమే”.
ఘంటసాలగారు కాలంచేసిన తరవాత చినసత్యంగారు సంగీతరావుగారిని తమ బృందానికి సంగీతం సమకూర్చమని ఆహ్వానించారు. దానికి సంగీతరావుగారు కొంత అయిష్టంగానే అంగీకరించడం నాకు గుర్తుంది. ఆ తరవాత కర్ణాటక సంగీతంలోని కొన్ని అపూర్వమైన కీర్తనలూ, అరుదైన రాగాలూ, వాటి ప్రయోగాలను గురించి సంగీతరావుగారికి ఉన్న పరిచయాన్ని గుర్తించిన మద్రాసు మ్యూజిక్ అకాడమీవారు తమ వార్షిక సంగీతోత్సవాల్లో ఉదయాన జరిపే పండిత సదస్సుల్లో ఆయన చేత డెమాన్‌స్ట్రేషన్‌లు ఇప్పించారు. వీటిలో ఒకటి హరికథకుగాను ఎంబార్ విజయరాఘవాచారిగారికి సంగీత కళానిధి బిరుదునిచ్చిన సందర్భంలో జరిగింది. రెండోది డా. శ్రీపాద పినాకపాణిగారి అధ్యక్షతన జరిగింది. వీటిలో సంగీతరావుగారూ, ఆయన కుమార్తె పద్మావతీ కలిసి ఆదిభట్ల నారాయణదాసుగారి కీర్తనలు పాడారు. అలాగే కొందరు తెలుగు వాగ్గేయకారుల మరుగుపడిన రచనలను వినిపించారు. అందులో నందిగాన వెంకయ్యగారి లోకావన అనే హరికాంభోజి రాగ కీర్తన ఒకటి. వెంకయ్యగారు పిఠాపురం ఆస్థాన విద్వాంసుడుగానూ, తూమరాడ సంగమేశ్వరశాస్త్రిగారి గురువుగానూ ప్రసిద్ధుడు. సంగమేశ్వరశాస్త్రిగారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారికీ, ఆయనకు అన్నయ్యా, గురువూ అయిన ద్వారం వెంకటకృష్ణయ్యగారికీ సంగీతం నేర్పిన గొప్ప వీణ విద్వాంసుడు. సగటు తెలుగువాడికి ఈనాడు శాస్త్రీయ సంగీతం గురించి ఎటువంటి భావాలున్నాయో చెప్పలేంగాని ఇదంతా మనం గర్వించదగ్గ పదహారణాల తెలుగు సంప్రదాయమే. సంగీతరావుగారు పాడి వినిపించిన ఇతర రచనల్లో తన తండ్రిగారి రచనలూ, హరినాగభూషణంగారి అఠాణా రాగకీర్తనా, వీణ కోసమని వాసా అప్పయ్యగారు రచించిన స్వరపల్లవులూ వగైరాలున్నాయి. వీటన్నిటి గురించీ ఈనాడు ఎవరూ పట్టించుకోకుండా సంగీతమంతా తమిళనాడులోనే ఉందనుకుని పొరబడితే అది తెలుగు సంస్కృతికి జరిగే నష్టమే అని మనమందరం గుర్తించాలి.
1970లలో సంగీతరావుగారు తరుచుగా మద్రాసులో మా ఇంటికి వచ్చి చాలా సేపు సంగీతం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పి, పాటలు కూడా పాడుతూ ఉండేవారు. మా రెండు కుటుంబాలకూ గాలి బాలసుందరరావుగారే ఫామిలీ డాక్టర్ అవడంతో అప్పుడప్పుడూ ఆయన దగ్గర కూడా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. మానాన్న కుటుంబరావుగారు చిన్నతనంలో విజయనగరంలో చదువుకోవడం, శాస్త్రీయసంగీతంతో ఆయనకు ఉన్న గాఢమైన పరిచయం, అభిరుచుల వల్ల మరిన్ని కామన్ టాపిక్స్ ఉండేవి. నేను సితార్ వాయించేవాడిని కనక సంగీతరావుగారు హిందూస్తానీ రాగాల గురించి నన్నడిగి తెలుసుకుంటూ ఉండేవారు. స్వయంగా అపారమైన శాస్త్రీయజ్ఞానం ఉన్న అంతటి గొప్ప వ్యక్తి ఎంతో వినయంగా తనకు తెలియని వివరాలు నావంటి యువకుణ్ణి అడగడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది.
ఈనాడు కర్ణాటక కచేరీలలోమృదంగానికి “తని ఆవర్తనం” అని సోలో అవకాశం ఇవ్వడం పరిపాటి. దీన్ని ప్రారంభించినది ఆదిభట్ల నారాయణదాసుగారేనట. నారాయణదాసుగారు వీధులవెంట అట్టహాసంగా నడుస్తూ, తన వెంట నడుస్తున్న శిష్యుడికి పబ్లిక్‌గా హరికథ పాఠాలు నేర్పేవారట. దాసుగారు ఒకేసారిగా నోటితో ఒక తాళంలో పాడుతూ, చెరొక చేత్తో చెరొక తాళంవేస్తూ, రెండు కాళ్ళతో మరి రెండు తాళాలకు అడుగులు వేసేవారని విన్నాం. ఇలా అయిదు తాళాలు ఏకకాలంలో నిభాయించడానికి చాలా పటిమ ఉండాలి. దీన్ని చూసిన సంగీతరావుగారు అది పంచముఖి అనే పేరుతో దాసుగారు చేసిన ఒక సంగీత రచన అనీ, లెక్కల్లో ఎల్‌సీఎమ్ పద్ధతిలో దాసుగారు అవసరాన్ని బట్టి ఒక్కొక్క మాత్ర మీద చేతులతోనూ, కాళ్ళతోనూ “దెబ్బ” వేసేవారనీ వివరించారు.
ఎంతో పేరుపొందిన విద్వాంసుడు వీణ వెంకటరమణదాసుగారు సంగీతరావుగారి చిన్నతనంలోనే పండుముసలి అనీ, ఆయనకు పుట్టెడు చెముడు ఉండేదనీ, తాను వాయిస్తున్న వీణ తీగలు శ్రుతి తప్పినా తెలుసుకోలేని ఆయన పరిస్థితి జాలి కలిగించేదనీ, కుర్రవాళ్ళు ఆయనను ఏడిపించేవారనీ చెప్పారు. ద్వారంవారు వయొలిన్ వాయిస్తూ, ముఖ్యంగా వయసు మళ్ళిన తరుణంలో, అతి తక్కువ స్వరాలతో అద్భుతమైన భావాన్ని పలికించేవారనీ, స్వరాలు ఖర్చయి పోతాయేమో అన్నట్టుగా “స్వర లుబ్ధుడి”లాగా ప్రవర్తించేవారనీ అన్నారు. ఈమని శంకరశాస్త్రిగారి వీణ ఆలాపనలో కూడా ఈ లక్షణం కనబడేది. వాయించిన స్వరాలకన్నా వాటి మధ్యనున్న విరామాలు ఎలోక్వెంట్‌గా అనిపించేవి. ఒక ఊపిరితిత్తిని కోల్పోయిన హిందూస్తానీ గాయకుడు కుమార్ గంధర్వ సంగీతం కూడా ఎక్కువ సేపు గుక్కపట్టలేకపోయినందువల్ల ఇదే పద్ధతిలో సాగేది.
రాగ ప్రస్తారం పోకడల గురించీ, నోరు పూర్తిగా తెరవకుండా మాటలను ఉచ్చరించే తమిళ (తంజావూరు) పద్ధతి గురించీ సంగీతరావుగారు ఆవేదన చెందుతారు. సాంప్రదాయం పేరుతో ఈనాడు చలామణీ అవుతున్న కర్ణాటక సంగీత పద్ధతులు కొన్ని ఆయనకు నచ్చనే నచ్చవు. సంగీతమంటే అయిష్టత లేని సగటు తెలుగువాడికి కర్ణాటక సంగీతంలో నచ్చని అంశాలలో ఇవీ ఉన్నాయి. అవసరమున్నా లేకపోయినా స్వరాలనూ, పదాలనూ అతిగా “రుబ్బడం” సంగీతరావు గారికీ నచ్చదు. అది తగ్గిస్తే కర్ణాటక గమకాలు అందరికీ వినసొంపుగానే ఉంటాయి. తన చిన్నతనంలో తోడి వంటి రాగాల ప్రస్తారం ఇప్పటికంటే భిన్నంగా ఉండేదని ఆయన అంటారు. అలాగే హిందోళం, నవరోజు, లలిత మొదలైన రాగాల్లో ఈనాటి లాగా శుద్ధ ధైవతానికి బదులు చతుశ్రుతి ధైవతం వాడే సంప్రదాయం ఉండేదట.
సంగీతరావుగారు చక్కని, గంభీరమైన కంఠంతో ఈనాటికీ రాగాలూ, కీర్తనలూ పాడి వినిపించగలరు. నోరు తెరిచి, స్పష్టమైన ఉచ్చారణతో, రాగ, సాహిత్య భావాలను మేళవించి, మనోధర్మం ఉట్టిపడేటట్టు, “జిడ్డు” అనిపించకుండా, హాయిగా కర్ణాటక సంగీతం పాడగలరు. రకరకాల శైలులను ఇమిటేట్ చెయ్యగలరు. ఎప్పుడు నేర్చుకున్నారో గాని, కూచిపూడి నాటకా లన్నిటికీ ఆర్కెస్ట్రాతో బాటు కూర్చుని వీణ వాయిస్తారు. హార్మోనియం మీద కర్ణాటక సంగీతం ప్రతిభావంతంగా వాయించగలరు.
రాగప్రధానమైన కర్ణాటక సంగీతపు కీర్తనలూ, కృతులలో మాత్రం సాహిత్యానిది ప్రధాన భూమిక కాదని సంగీతరావుగారి అభిప్రాయం. ఇతరత్రా అతి విశిష్టమైన సంగీతాన్ని అందిస్తున్న డా.బాలమురళీకృష్ణ సాహిత్యార్థం చెడకుండా పాడే ప్రయత్నం పూర్తిగా సఫలం కాజాలదని ఆయన అంటారు. త్యాగరాజువంటి వాగ్గేయకారులే తమ రచనలు కొన్నింటిలో సాహిత్యానికి చిన్న పీట వేసినప్పుడు గాయకులు చెయ్యగలిగింది ఏమీ లేదని ఆయన ఉద్దేశం. ఉదాహరణకు శరశర సమరైక శూర అనే కీర్తనలో పల్లవి తరవాత “శరశర సమరై” అన్నాక ఆపడం తప్పనిసరి అవుతుంది. గాయకుడు ఎవరైనా సరే కీర్తన పాఠం ఒకసారి అర్థవంతంగా పాడి వినిపించాక గమకాలూ, లయవిరుపులూ, స్వరాల గిరికీల వెల్లువలో సాహిత్యం మరుగుపడక తప్పదు. తెలుగు రాని గాయకుల ఉచ్చారణ దోషాలు ఇందుకు తోడైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇది శ్రోతలకు, ముఖ్యంగా తెలుగువారికి కాస్త ఇబ్బందిగా అనిపించినా వారు సాహిత్యాన్ని అంతగా పట్టించుకోక రాగపరంగా కచేరీని ఆస్వాదించాలి. ఏ వీణ మీదనో అదే రచనను వినిపిస్తున్నప్పుడు వాద్యకారుడు తన మీటును బట్టీ, వాయిద్యపు అవసరాలను బట్టీ పదాలను ఇష్టం వచ్చినట్టు విరవడం కద్దు. అది వినేవారిని బాధించదు.
కూచిపూడి నృత్య నాటికలకి సంగీతం సమకూర్చినప్పుడు సాహిత్యాన్నీ, లయనీ, తాళాలనీ, రాగాలనీ భావయుక్తంగా సమన్వయం చేసి, దృశ్యరూపకంగా మలచడానికి సంగీతరావుగారికి అనేక అవకాశాలు కలిగాయి. వీటిలో యస్వీ భుజంగరాయశర్మగారి రచనల అందాలకు సంగీతరావుగారి మధురమైన సంగీతం మెరుగులు దిద్దింది. చినసత్యంగారి నాటకాలకు శ్రావ్యమైన సంగీతం ప్రధాన ఆకర్షణ అయింది. సంప్రదాయబద్ధంగా కర్ణాటక రాగాలనే కాక, అవసరమనిపించినప్పుడు బిలాస్‌ఖానీ తోడి మొదలైన హిందూస్తానీ రాగాలను ఉపయోగించడానికి కూడా సంగీతరావుగారు వెనకాడలేదు. అవి నాటకీయతను పెంచి, ప్రేక్షకులను బాగా అలరించాయి. నిజమైన సాంప్రదాయం తెలిసినవారు చేసే కొత్త ప్రయోగాలు ఎప్పుడూ నిర్దుష్టంగా, సంతృప్తికరంగా ఉంటాయి. అభినయంలో చినసత్యం సాధించిన విజయాలకు సంగీతరావుగారి స్వరరచన ఎంతగానో తోడ్పడినందువల్లనే ఆ నాటకాలు నేటికీ ప్రపంచమంతటా ప్రజాదరణ పొందుతున్నాయి. కూచిపూడి పద్ధతిలోనే శిక్షణ పొందిన ఇతరులు కొందరు స్వంతంగా చేసిన ప్రయోగాలేవీ అంత సంతృప్తికరంగా లేదన్నది అందరికీ తెలుసు. దీనికి కారణం తగినంత ఆథెంటిసిటీ లేకపోవడం కావచ్చు.
సంగీతరావుగారికి ఘంటసాల మీద సహజంగా చాలా గౌరవం ఉంది. చిరంజీవులు సినిమా ట్యూన్లు కొన్ని సి.ఆర్.సుబ్బరామన్ చేసినట్టుగా అనిపించాయని నేనంటే, కాదనీ, అవి ఘంటసాల స్వయంగా తన సమక్షంలోనే కంపోజ్ చేశారనీ సంగీతరావుగారు ధ్రువపరిచారు. రాజేశ్వరరావు, పెండ్యాలవంటి తక్కిన ప్రముఖ సంగీత దర్శకులలాగే ఘంటసాలగారి సంస్కారమూ, వ్యుత్పత్తీ సినిమా సంగీతంలో ప్రతిఫలించేదని ఆయన అన్నారు. రహస్యం సినిమాలో మల్లాదివారి రచనలకు ఘంటసాల అందించిన శాస్త్రీయ సంగీతానికి సంగీతరావుగారు చాలా సహకరించారు. సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా లలితభావ నిలయా అని సరస్వతి రాగంతో మొదలయే రాగమాలిక ఘంటసాల, లీల తదితరుల గళాల్లో చాలా అందంగా రూపుదిద్దుకుంది. సంగీతరావుగారికి తమిళనాడు ప్రభుత్వం కలై మామణి బిరుదునూ, టి.వి.కె.శాస్త్రిగారి సంస్థ లక్ష రూపాయల పారితోషికాన్నీ ఇవ్వడం ఆయన అభిమానులను చాలా సంతోషపెట్టింది. సంగీతరావుగారు తన జ్ఞాపకాలనూ, అనుభవాలనూ గ్రంథస్థం చేస్తున్నారు. అముద్రితమైన ఆ వివరాలలో కొన్నింటినైనా ఆయన అనుమతితో పాఠకులతో పంచుకోవలసిన అవసరం ఉంది.
-----------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్,
ఈమాట సౌజన్యంతో