Thursday, March 31, 2016

ప్రహేళిక - 2

ప్రహేళిక - 2

సాహితీమిత్రులారా!

కరచరణంబులు గల్గియు

కరచరణ విహీనుచేత, గడు దుర్భలుడై,

జలచరుడు పట్టువడియెను,

శిరహీనుడు చూచి నవ్వె చిత్రముగాగన్!

కాళ్ళు చేతులు ఉన్నవాడు బలహీనుడై కాళ్ళు చేతులు లేని వానిచేత పట్టు బడగా శిరము లేనివాడు 
చూచి  నవ్వాడట ఎంత చిత్రమో! -  దీని భావం. కాళ్ళుచేతులు ఉన్నవాని కాళ్ళుచేతులు లేనివాడు ఎలా పట్టుకున్నాడు. అది చూచి తలే లేనివాడు ఎలా నవ్వాడు?

అంటే దీనికి అర్థం ఇదికాదు. 
కాదు కాదు ఇదే. మరెలాగంటే..........................
                                                                     కాళ్ళుచేతులు ఉన్నవాడు అంటే కప్ప, కాళ్ళుచేతులు లేనివాడు అంటే పాము. శిరసులేనివాడు - పీత (ఎండ్రి). ఇప్పుడు కాళ్ళుచేతులు ఉన్న కప్పను కాళ్ళుచేతులు లేని పాము నోట చిక్కింది. అది చూచి తలలేని పీత నవ్వింది. ఇది అసలు భావం.

Tuesday, March 29, 2016

ప్రహేళిక - 1


ప్రహేళిక - 1

సాహితీమిత్రులారా!

అరువదిరెండుకుచంబులు
శిరమొక్కడు రెండువేలు చెవులున్ తానున్
ఇరువైరెండు భుజంబులు
తరుణీ!  ఏయూరు నీది దాచక చెపుమా?


ఈ పద్యం చూడగా అరువదిరెండు కుచములు (చన్నులు), శిరము (తల) ఒకటి, తాను రెండువేల చెవులు, ఇరువైరెండు భుజాలు, దాచకుండా నీది ఏవూరో చెప్పుము తరుణీ (ఓ స్త్రీ)! అనే అర్థం కనబడుతోంది

ఇది సరైన అర్థంగా కనబడటంలేదుకదా! సరైన అర్థం కావాలంటే దీన్ని ఈ విధంగా అర్థం తీసుకోవాలి.
అరువది అంటే తమిళ స్త్రీ, ఇరువై అంటే ఇరువగు - ఒప్పినట్టి - అని.

ఓ తమిళ స్త్రీ! రెండు కుచములతో, ఒక శిరముతో, రెండు వ్రేలాడు చెవులతో, తగినట్టి రెండు భుజాలతో ఉన్నావు. ఏవూరునీది - అనేది అర్థం.

Saturday, March 26, 2016

సర్వగురు చిత్రం


సర్వగురు చిత్రం


సాహితీమిత్రులారా!

శ్లోకంగాని పద్యంగాని అన్ని గురువులతో కూర్చబడిన దాన్ని సర్వగురుచిత్రంగా చెప్పబడుచున్నది.

ఇది దండి కావ్యాదర్శం లోనిది.

అమ్నాయానా మాహాన్త్యావాగ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహోధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే

                                                              (కావ్యాదర్శమ్ -3-84)

అర్థం -
అమ్నాయానాం - వేదాలలో, అన్త్యా - చివరిదైన ఉపనిషత్తు, గీతీ: - గానములను, ఈతీ: - ఈతిబాధలుగాను,  ప్రీతీ: - దారాపుత్రాదులందు ప్రేమలను, భీతీ: - భయస్వరూపములైనట్టివిగాను, అహ - చెప్పుచున్నది. భోగ: - విషయోపభోగము, రోగ: - రోగహేతువు, మోద: - సాంసారిక సుఖానుభవము, మోహ: - అవివేకరూపమైనది, అందుచే, క్షేమే - పరమాదరహితమైన, దేశే - ఏకాంత ప్రదేశంలో, ధ్యేయేవా - ధ్యేయమగు పరమాత్మస్వరూపంనందు, ఇచ్ఛేత్ - మనసును నిలుపుటకు కోరుకొనవలెను. 


Friday, March 25, 2016

సర్వలఘు కందం


సర్వలఘు కందం

సాహితీమిత్రులారా!

కందపద్యంలో అన్ని గణాలు లఘువులయితే దాన్ని సర్వలఘుకందం అంటాము. కానీ రెండు, నాలుగు పాదాంతాలలో గురువు ఉంటుంది. ఇలాంటిది తెలుగులో మొదట నన్నెచోడుడు కుమారసంభవం(10వ ఆశ్వాసం 187వ పద్యం)లో రచించాడు.

తగుఁదగదని మనమున మును
వగవఁగ నొడఁబడఁగ వగవ వగవఁగఁబడయున్
దగుఁదగ దని వగ వని వగ
వగవఁగఁ బని గలదె తనకు వగ మఱి జగతిన్


తారకాసురునితో శుక్రాచార్యుడు - కుమారస్వామితో యుద్ధానికి వెళ్ళేసమయులో కొంత నీతిబోధ చేస్తూ అన్న పద్యమిది.
"ఈ పని చేయతగును ఈ పని చేయకూడదని మనసులో ముందుగా విచారించాలి. అలా ఆలోచించగా కర్త్యం బోధపడుతుంది. ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు అని ముందుగా ఆలోచింపని విధం తనకు లోకానికి మిక్కిలి దుఖం కలిగిస్తుంది తరువాత విచారించి ప్రయోజనంలేదు."  అని భావం.

ఇలాంటి పద్యమే పోతన గజేంద్రమోక్షణంలో గజేంద్రుని రక్షింపబోవు విష్ణువుతో లక్ష్మీదేవి తత్తరపడుతూ వెళుతూన్న ఆమె మనసులోని భావాన్ని ఈ పద్యంగా చిత్రించారు పోతన.

అడిగెదనని కడువడిఁజను
నడిగినఁ దను మగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
 

                                   (శ్రీమదాంధ్రమహాభాగవతం - 8- 103)


Thursday, March 24, 2016

ఏకాక్షర పాదం


ఏకాక్షర పాదం

సాహితీమిత్రులారా!

ఒక పాదానికి ఒక హల్లు మాత్రమే ఉపయోగిస్తూ నాలుగుపాదాలకు నాలుగు వేరువేరు హల్లులను వాడటాన్ని ఏకాక్షర పాదం లేక ఏకవ్యంజనపాదం అంటారు.
భారవి కిరాతార్జునీయంలో రాసిన ఏకాక్షరపాద శ్లోకం గమనిద్దాం.

శ్లో. స సాసి: సాసుసూ: సాసో
     యేయాయేయాయయాయయ:
     లలౌలీలాం లలో2లోల:
     శశీశశిశుశీ: శశన్

          (కిరాతార్జునీయమ్ -15-5)
అర్థం :- సాసి: = ఖడ్గంతో ఉన్న, సాసుసూ: = ప్రాణాలను హరించే బాణాలు థరించినవాడు,సాస: = ధనువును థరించినవాడు, యేయ + అయేయ + అయయ + అయయ - వాహనంతోను, వాహనంలేకుండా శత్రువుని చేరి వారి వాహనాలను స్వాథీనం చేసుకున్నవాడు, లల: = అందమైనవాడు, అలోల: = చాపల్యంలేనివాడు, శశి +ఈశ + శశు + శీ: - ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామిని పరుగెత్తింపచేసే, స: = అర్జునుడు, లీలాం = శోభను, లలౌ = పొందాడు.

Wednesday, March 23, 2016

తెలుగులో ఏకాక్షరి

తెలుగులో ఏకాక్షరి 

సాహితీమిత్రులారా!
                  సంస్కృతంలో వేంకటాధ్వరి రాసిన లక్ష్మీసహస్రం తెలుగులో వేదుల సత్యనారాయణ రాశారు దానిలోనిది ఈ పద్యం. 

ద్విపద:  రరరారరారోర రరరేరరైర
             రరరారరేరరోరారరారార  
   

                                       (లక్ష్మీసహస్రం - చిత్రస్తబకం - 35.)
ఇందులో ర- అనే వ్యంజనం(హల్లు) ఒకటే వాడబడినది.
అర్థం:-  ర = వజ్రాయుధంను, ర = గ్రహించు ఇంద్రునకు, రా = ధనంను, ర = ఇచ్చుదానా, (దుర్వాసశాపగ్రస్తుడైన ఇంద్రునకు తిరిగి రాజ్యం ఇచ్చినదానా అనుట), రా = రమ్ము, రో = ర + ఉ - ర = అగ్ని, ఉ = శివుడు, రర = వజ్రాయుధ హస్తుడగు ఇంద్రుడు వీరందరిని, ర = గ్రహింప చేయునట్టి, రా + ఇల = ధనమునకు భూమి అయినదానా, రై = ధనమును, ర: = గ్రహింపచేయుదానా, ర = నాశమును, ర = పొందునట్టి వారిని, రా = స్వీకరించుదానవును, అర = ధనహీనునకు, రా = ధనమునకు, రో = ఇలలో స్థానమైనదానా, రో = ర +అ , ర = కోరికతో,అ = విష్ణువును, ర = స్వీకరించువారికి, రా = ధనమును, ర = గ్రహింపచేయువారియందు, అ = సంపూర్ణమైన, ర = కోరికగలదానా!

ఈ కింది కందపద్యం విక్రాల శేషాచార్యుల శ్రీవేంకటేశ చిత్రరత్నాకరం పూర్వభాగంలోనిది.

కం. నిన్ను నిను నెన్న నీనే
      నెన్నిన నన్నన్న ననననిన నానే నా
      నిన్నూని నా ననూనున్
      నన్నూనన్నాను నేననా నున్నానా


అర్థం:-
అనిన = నీకుపైన ప్రభువులులేని, నానా = సర్వమునకు, ఇనా = ప్రభువైనవాడా, ఇనున్ = సర్వేశ్వరుడవైన, నిన్నున్, ఎన్నన్ = స్తుతించుటకొరకు, ఈనేను, ఎన్నినన్ = ఆలోచించినచో, ననను = చిగురును, (అల్పుడని అర్థం), అన్నన్న= చోద్యం, అనూనున్ = గొప్పవాడవైన, నినున్ = నిన్ను, ఊనినాను = ఆశ్రయించినాను, నున్న = త్రోసివేయబడిన, అనా = శకటముగలవాడవైన, అనా = తండ్రీ, నేను, నన్ను+ ఊను = ఆదుకొనుము, అన్నాను = అంటిని.

ఇతర భాషల్లో ఏకాక్షరి


ఇతర భాషల్లో ఏకాక్షరి

సాహితీమిత్రులారా!

కన్నడ భాషలో 12వ శతాబ్దికి చెందిన నాగవర్మ "కావ్యావలోకనం"లోని ఏకాక్షరి ఉదాహరణ.

ಶ್ಲೋ. ನಿನ್ನಿ ನೇನಿನ್ನ ನಾನನ್ನ |
         ನಿನ್ನ ನೆನ್ನ ನನೂನನಂ||
         ನುನ್ನ ನೈನನ್ನ ನೈನೇನೇ|
         ನೆನಿನ್ನನ್ನಂ ನಿನ್ನೆ ನಾನುನಂ||

                                (ಕಾವ್ವಾವಲೋಕನಂ - 8 - 584)
పై కన్నడ శ్లోకానికి తెలుగులిపి

                                       శ్లో. నిన్న నీనిన్న నానన్న
                                           నిన్ననెన్న ననూననం
                                          నున్న నైనన్న నైనేనే
                                          నెన్నిన్నం నిన్నెనానునం


హిందీలో లేఖరాజకవి రచిత "గంగాభరణ్ "లోని ఏకాక్షరి.

गंगी गोगो गो गगे, गुंगी गो गो गुंग ।
गंगा गंगे गंग गा, गंगा गंगे गंग ।। 

పై దోహేకు తెలుగులిపి

                               గంగీ గోగో గోగ గే, గుంగీ గోగో గుంగ
                               గంగా గంగే గంగ గా, గంగా గంగే గంగ


Monday, March 21, 2016

చిత్రకవిత్వంలో భేదాలు

చిత్రకవిత్వంలో భేదాలు

సాహితీమిత్రులారా!
చిత్రకవిత్వం అనేకులు అనేక విభాగాలుగా వివరించారు.
కొందరు 1. శబ్దచిత్రం 2. అర్థచిత్రం 3. ఉభయచిత్రం అని విభజించారు.
మరికొందరు శబ్దచిత్రం, గతిచిత్రం, గూఢచిత్రం, కూటచిత్రం, గర్భచిత్రం, ఆకారచిత్రం (బంధకవిత) ఇలా అనేక విభాగాలుగా విభజించారు.

శబ్దచిత్రం :-

దీనిలో అనేక రకాలు ప్రస్తుతం ఏకాక్షర శ్లోకం ఒకదాన్ని గమనిద్దాం.
ఏకాక్షర శ్లోకం 
మామామమామమేమామా మామూమామేమమేమమే
మామామేమిమిమేమా మమమోమామామమామమీ

ఇందులో  వ్యంజనం(హల్లు) ఒకటే ఉంటుంది కాని అచ్చులు ఏవైనా ఆ వ్యంజనం కూడి వస్తుంటాయి.
ఇది ఏకాక్షరగా  ''మ'' అనే ఒక వ్యంజనం కలిగి ఉన్నందున ఏకవ్యంజనముగా పిలుస్తారు.
శ్లోకం అర్థం
మమ = నాయొక్క, మా = బుద్ధి, ఇమాం మామ్ = ఈ లక్ష్మిని, ఆమ = పొందెను, అమేం - అమా = సహితురాలైన,
ఈ = లక్ష్మిగల, అమ్ = నీ పాదమును, ఆమామూమ = ఆశ్రయించితిమి, అమే = ఓ దుర్భుద్దీ జ్యేష్ఠాదేవీ, మే = నాకు, అమ = దూరంగా వెళ్లుము, అమామ్ = లక్ష్మి కంటె వేరైన దేవతను, మా , ఏమి =పొందను, అమ: = బంధరహితుడనై, మామం - మా = లక్ష్మి యొక్క, అమమ్ = ప్రాపును, మిమే = అపేక్షింతును, అమీ = ఈ మేము, మామ్ = ప్రమాణమైన శాస్త్రమును, మా అమామ = అతిక్రమింపము-

Sunday, March 20, 2016

చిత్రకవిత్వ ప్రశంస


చిత్రకవిత్వ ప్రశంస

సాహితీమిత్రులారా!
             ప్రకాశంజిల్లా, కలికివాయిగ్రామనివాసిగా ఉండిన శ్రీ విక్రాల శేషాచార్యుల వారి శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరం ఉత్తరభాగంలోనిది ఈ ప్రశంస.

మృదుల కవితరీతి మేదురమౌ చిత్ర
కవితగూడ కవికి గాంక్ష గొలుపు
పూలదండ యట్లు ముత్యాల దండయు
గన్నులున్న వాన్కిఁ గాంక్ష నిడదె 

ఏ కవితా వధూమణికి నెంచగ భూషలు శ్లేష ముఖ్యముల్
ప్రాకటమైన నాగముఖబంధము లా రతి కాల బంధముల్
స్వీకృత గర్భ ధారణము శ్రీకర గర్భ కవిత్వ విభ్రమం
బా కవితా వధూమణికి నారయ కబ్బము సంతుకాదొకో

కవితాచిత్రవిదుండు కోమల కథా కావ్యమ్మునున్మాడ్కి స
త్కవి సూక్తంబగు ప్రౌఢచిత్రకవితాకావ్యమ్మునుం గూడ చ
ద్వి వినోదించు, నదెట్లన సతి మాధ్వీకాభమౌ వాతెఱం
జవి గొంచుం గఠినమ్మటంచు వీడునే నాథుం డురోజద్వయిన్

కోమల కావ్య సారమును గ్రోలి ప్రమోదము నొందు రీతి
భూమినిఁ బ్రౌఢ చిత్రకృతిఁ బొల్పగు శబ్ద విచిత్రలక్ష్మి నేనీ
ధీమహితుండు కాంచి మరితృప్తిని గాంచునొ వాఁడె సాహితీ
ధీమహితుండు వాఁడె జగతిన్మము బోంట్లకు శ్లాఘనీయుడున్

ఎలాంటి పదాలతో ఎంత ఘాటుగా ఉందో ఈ ప్రశంస.
                                                                              మళ్ళీ కలుసుకుందాం.




Friday, March 18, 2016

చిత్రకవిత్వం


చిత్రకవిత్వం



సాహితీమిత్రులారా!

      కావ్యాలోకంలో డా. ఎన్.వి.ఆర్.కృష్ణమాచార్యులుగారు కావ్యభేదాలను రెండురకాలుగా వివరించారు.
1. ప్రాచీనం - ఆశు, మధుర, చిత్ర, విస్తరములు
2. నవీనం - ఆఖ్యానరీతి, నాటకరీతి, ప్రబంధరీతి, భావకవితారీతి - అని వివరించారు.
ఇందులో మనం చిత్రకవిత్వం - అనేదాన్ని విచారిస్తే ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ  అద్భుతాలను చేసే కవితాప్రక్రియ.
దీన్ని పాఠకుడు పొందాలంటే కొంత పరిశ్రమచేయాలి, మేధను ఉపయోగించాలి లేకుంటే కష్టమే. ఒక దాన్నిపొందాలంటే కొంత శ్రమచేయాల్సిందేకదా!
అలాంటి కవిత్వవిశేషాలు చాలా భాషల్లో ఉన్నాయి వాటిని గురించి ఇక ప్రతిరోజు కొంత కొంత ముచ్చటించుకుందాం.


        

Thursday, March 17, 2016

చిత్రకవితా ప్రపంచం

చిత్రకవితా ప్రపంచం


సాహితీమిత్రులందరికీ నమస్కారం.  
               కవిత్వం నాలుగు విధాలు అవి 
1. ఆశు కవిత్వం 
2. మధుర కవిత్వం 
3. చిత్ర కవిత్వం 
4. విస్తర కవిత్వం. 
ఇందులో చిత్ర కవిత్వ వివరాలతో కూడినది ఈ బ్లాగు దీన్ని చాలా కాలంగా ప్రారంభించాలని నేటికి భగవంతుని దయవలన, గురువుల ఆశీర్వాదంతో ప్రారంభించవీలైనది.మీరందరూ చదివి ఆనందించి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ......... 
                                                                                                                      ఏ.వి. రమణరాజు