Wednesday, January 4, 2017

తలుపు తట్టువాడెవ్వడు?


తలుపు తట్టువాడెవ్వడు?




సాహితీమిత్రులారా!


లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతంలోని
ఈ సంవాద చిత్రం చూడండి-
గోపిక - కృష్ణులసంవాదం ఇది చూడండి-

అఙ్గుళ్యా కః కవాటం ప్రహరతి?
కుటిలే మాధవః, 
కింవసన్తో?
నో చక్రి, 
కిం కులాలో? 
నహి ధరణిధరః, 
కింద్విజిహ్వః ఫణీన్ద్రః?
నాహం ఘోరాహిమర్ధీ 
కిమసి ఖగపతి?
ర్నో హరిః 
కిం కపీన్ద్రః?
ఇత్యేవం గోపకన్యా
ప్రతివచనజితః 
పాతు వ శ్చక్రపాణిః


గోపిక - అంగుళ్యా కః కవాటం ప్రహరతి?
             (ఎవ్వడు వ్రేళ్ళతో తలుపు తడుతున్నది)

కృష్ణుడు - కుటిలే మాధవః 
         (వంకరగా ఆలోచించేదానా మాధవుడను)

గోపిక -  వసంతః కిం? 
       (వసంతుడవా ఏమి)

కృ - నో చక్రీ (కాదు, చక్రముకలవాడను)

గో- కిం కులాలః?
    (ఓహో  కుండలు చేసే కుమ్మరివా)

కృ - నహి  ధరణిధరః
     (కాదు సమస్త భూమిని ధరించినవాడను)

గో- కిం ద్విజిహ్వః ఫణీన్ద్రః?
   (అట్లా నిజం చెప్పు, ఓహో భూభారం మోసే
     రెండునాల్కలుగల ఆదిశేషునివా)

కృ - నాహం, ఘోరాహిమర్ధీ
     (అబ్బేకాదు, నేను ఆకళింగ సర్పాన్ని మర్దన చేసినవాడను)

గో - కిమసి ఖగపతిః?
    (ఓహో అదా సంగతి. పాములను పట్టి తినే పక్షీంద్రునివా)

కృ - నో హరిః ?
     (కాదు, నేను హరిని)

గో- కిం కపీంద్రః?
   (అయితే పెద్దకోతివి అన్నమాట)

ఇత్యేవం గోపకన్యాప్రతివచనజితః పాతు వ శ్చక్రపాణిః
ఈవిధంగా గోపిక యొక్క బదులుమాటలచేత ఓడిపోయిన
చక్రపాణి(కృష్ణుడు) మమ్ము రక్షించుగాక

ఇందులో మాధవుడు - విష్ణువు, వసంతుడు
         చక్రి - చక్రమును ధరించువాడు 
                (విష్ణువు, కుమ్మరివాడు)
         ధరణిధరుడు - భూమిని ధరించినవాడు
                (విష్ణువు, ఆదిశేషుడు)
         అహిమర్ధి - పాములను మదించువాడు
                  (కాళీయమర్దనుడు, గరుత్మంతుడు)
         హరి - విష్ణువు, కోతి
ఈ విధంగా శ్లేషార్థాలు ఉండటంవల్ల
సంవాదం రసవత్తరంగా సాగింది.

No comments: