Tuesday, January 10, 2017

భాగవతములోని సర్వలఘు చిత్రం - 2


భాగవతములోని సర్వలఘు చిత్రం - 2



సాహితీమిత్రులారా!


శ్రీమహావిష్ణువు దేవేంద్రుని కోసం వామనావతారం
దాల్చడానికి సంకల్పించిన సమయంలోనిది
ఈ పద్యం -

హరిహరి సిరియురమునఁ గల 
హరి హరిహయుకొఱకు దనుజునడుగం జనియెనం
బరహితరతి మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్
                                                                  (శ్రీమధాంధ్రమహాభాగవతము - 8- 526)

ఇందులో రెండవ పాదంలో ఒక గురువు అధికమైంది.

ఔరా! తన రొమ్మున లక్ష్మిదేవిని గలిగినవాడు
విష్ణువు. అయినా అతడు ఇంద్రునికోసం
బలిని బిచ్చమడగడానికి ప్రయాణమైనాడు.
ఇతరులకు మేలుచేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం
కూడ గొప్పవారికి ఒక అలంకారం కాబోలు - అని భావం.

బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళుసమయంలో
వామనచరిత్రలో అవి రెండు ఇక్కడ -

అడిగెద నని కడువడిఁజను
నడిగినఁ దను మగుడ నుడుగఁడని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడు గిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
                                                                                                    (8-103)
గజేంద్రుని రక్షించేందు వెళ్ళే సమయంలో
 లక్ష్మీదేవి కొంగు పట్టుకొని వేగంగా
ఆర్తరక్షకు వెళుతున్న విష్ణువును
 అనుసరిస్తూ లక్ష్మీదేవి మనోభావన ఈ పద్యం.

భర్త ఎక్కడికి వెళుతున్నడో ఎందుకు వెళుతున్నాడో
అడగాలని ముందుకు వెళుతుంది అడిగితే
మారుమాటాడకుండా వెనుకకు పొమ్మంటాడని
నడక మానేది. చీకాకుతో తొట్రుపాటుతో మళ్ళీ మెల్లగా
ముందుకు అడుగులు పెట్టేది. మళ్ళీ ఆగేది.
అడుగులు కదలించక లేక తడబడుతూ నడిచేది - అని భావం.

మరో పద్యం -

వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడఁగా 
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడఁగ వడుగు సేరెన్ రాజున్
                                                                                                  (8-541)
వామనుడు మెల్లమెల్లగా అడుగులు పెట్టి నడిచాడు.
అక్కడక్కడా భూమి క్రుంగి పోతుంటే సరిగా అడుగులు పెట్టలేక కష్టడినాడు.
నడునడు కొద్దికొద్దిగా మాట్లాడుతూ తడబడుతూ కలవరపడుతూ
బలిచక్రవర్తిని సమీపించాడు - అని బావం.

దీనిలో నాలుగపాదం చివరన మూడు గురువు  ఉన్నాయి.
 'సేరెన్ రాజున్' అనే దానితో మూడు గురువులు చేరాయి.

పోతన ప్రియశిష్యునిగా  చెప్పుకొంటూన్న వెలిగందల నారయ
భాగవతంలోని  ఏకాదశ స్కందంలో విష్ణవును స్తుతిస్తూ చెప్పిన
ఈ సీసపద్యం చూడండి

నవవికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ
                గగనచరనదినిఖిలనిగమవినుత!
జలధిసుతకుచకలశలలితమృగమదరుచిర
                 పరిమళతనిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖసురనికరవిహితనుతికలితగుణ
                 కటిఘటితరుచిరతరకనకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత!
                 సతతవృతజపనియమసరణిచరిత!
తిమి కమఠ కిటి నృహరి ముదితబలినిహి
త పద పరశుధర దశవదనవిదళన!
మురమథన కలికలుషసుముదపహరణ!
కరివరదమునివరసురగరుడవినుత!
                                                                                    (11-72)

క్రొత్తగా వికసించిన పద్మముల
వంటి కన్నుల జంట కలవాడా!
పాదములందు ఆకాశగంగను
పుట్టించినవాడా!
వేదములచేత పొగడబడినవాడా!
లక్ష్మీదేవి యొక్క కలశములవంటి
వక్షోజములందు అలరెడి
కస్తూరిచే పరిమళించెడి హృదయంగలవాడా!
భూమిని మోసినవాడా!
బ్రహ్మ మొదలగు దేవతాసమూహముల
సంస్తుతులతో కూడినవాడా!
నడుమునందు బంగారుచేలము ధరించినవాడా!
గరుత్మంతుడు వాహనంగా గలవాడా!
కైలాసపతిచే స్తుతించబడినవాడా!
నిరంతర జపతపలముచేయు వారియందాసక్తికలవాడా!
మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ,
రామ, కృష్ణ, కల్కి అవతారములను దాల్చినవాడా!
గజేంద్రవరదా!
మునులు, నరులు, సురలు, గరుడులు
 మొదలైన వారిచే పొగడబడినవాడా! - అని భావం.

ఈ సీసపద్యంలో కేవలం లఘువులే కాదు దీనిలో ప్రతిపాదానికి
ఉన్న ఇంద్రగణాలకు నల బదులుగా, నలల గణం వాడబడింది.
గమనించగలరు.




No comments: