Thursday, May 31, 2018

రామ రామ మహాబాహో


రామ రామ మహాబాహో




సాహితీమిత్రులారా!

గతిచిత్రంలో
ఒక పద్యాన్ని లేదా శ్లోకాన్ని త్రిప్పి వ్రాసిన
వచ్చే శ్లోకం లేదా పద్యం వేరు అర్థాన్ని
ఇచ్చే ఒక ఉదాహరణ యమక భారతం
నుండి ఇక్కడ చూద్దాం-

అనులోమ శ్లోకం-
రామ రామ మహాబాహో మాయా తే సుదురాసదా
వాదసాదద కబ లోకే పాదావేవ తవాసజేత్
                                        (యమక భారతం - 71)
భావం -
ఓ రామా! నీవు ఆజానుబాహునివి. ఈ జగత్తులో కేవలం
బ్రహ్మపాదమే సరిపోలుతుంది నీ పాదంతో. నీ మాయను
అనుసరించటం చాల కష్టం. నీవు జ్ఞానప్రదాతవు.

ప్రతిలోమ శ్లోకం -
జేత్సవాతవ వేదాపాకేలోకోదద సాదవా
దాసరాదుసుతేయామాహేబాహా మమ రామ రా(రాః)
                                              (యమక భారతం - 72)

(ముందు చెప్పబడిన  అనులోమ శ్లోకాన్ని క్రిందినుండి
చదివిన ఈ ప్రతిలోమ శ్లోకం వస్తుంది గమనించండి.)

భావం -
ఓరామ! నీవు గాలితో సహా ఈ విశ్వానికి బోధకుడవు.
నీవు జ్ఞానప్రదాతవు మరియు ప్రపంచానికి క్రియవు.
నీవు నీ భక్తులలో భయాన్ని పోగొట్టి సంతోషాన్ని
చ్చేవాడివి. నీవు ఈశ్వరుని, స్కందుని, గణపతిని,
లక్ష్మిని నీ అధీనములో ఉంచుకొన్నవాడివి. నీవు
నరసింహ స్వామిగా రుద్రుని ఉవాహన చేసినవాడివి.
నీవే నా సంపద.

Wednesday, May 30, 2018

ఏమిసేతుర లింగా(పేరడీ)


ఏమిసేతుర లింగా(పేరడీ)




సాహితీమిత్రులారా!

పేరడీ అంటేనే వ్యంగ్యరచన
ఇక్కడ ఏమిసేతురా లింగా అనే జానపదగీతానికి
వ్యంగ్యంగా జొన్నవిత్తులవారు పేరడీ కూర్చారు
చిత్తగించండి-



Tuesday, May 29, 2018

ఆచార్య చింతామణి


ఆచార్య చింతామణి




సాహితీమిత్రులారా!

1600 - 85 మధ్యకాలంలో నివసించిన ఆచార్య చింతామణిగారు
ఢిల్లీ పాదుషా షాజహానుకు సమకాలికుడు. ఈయన హిందీ కవి,
ఆచార్యుడుగా ప్రసిద్ధుడు. ఇప్పటి కాన్పూర్(తికవాపూర్) నివాసి
అని తెలుస్తున్నది. ఈయన జీవిత విశేషాలు అంతగా తెలియరాలేదు.
ఇతడు ఆరు గ్రంథాలను రచించారు. అవి - పింగళ, కావ్యవివేకం,
కవికులకల్పతరు, కావ్యప్రకాశ, రసమంజరి, రామాయణం. వీటిలో
ఈయనకు విశేష కీర్తి తెచ్చినది కవికుల కల్పతరు. ఇందులో కావ్యశాస్త్ర
భాగాలు - కావ్య భేదాలు, కావ్య లక్షణం, గుణం, శబ్దాలంకారం, రీతి, దోషము,
శబ్దశక్తి, ధ్వని, రసము, నాయక నాయికా భేదాలు మొదలైన వాటిని గూర్చి
 8 ప్రకరణాల్లో వివరించారు. ఈ గ్రంథ నిర్మాణంలో
మమ్మటుడు, విశ్వనాథుడు,  ధనంజయుడు, అప్పయదీక్షితులు,
విద్యానాథుడు, భానుమిశ్రుడు మొదలైన వారి గ్రంథాలను ఆధారంగా
తీసుకున్నాడు. కవి ఈ గ్రంథంలోని లక్షణ భాగాన్ని పోరఠా
ఛందస్సులోనూ, ఉదాహరణ భాగాన్ని కవిత్త్, సవైయా ఛందస్సులలోనూ
 రచించారు. ఒకటి రెండు ప్రదేశాలలో గద్యాన్ని వాడాడు.
చింతామణి మొదటిసారిగా మమ్మటుడు, విశ్వనాథుల శైలిలో వివిధ కావ్యభాగాల
నిరూపణ కావించటం వలన ఇతనిని రీతికాలపు ప్రవర్తకుడు, ఆచార్యుడు అని భావిస్తారు.

పింగళ గ్రంథంలో ఛందశాస్త్ర వివరణ ఉంది.
వివిధ ఛందస్సుల లక్షణాలు, ఉదాహరణలు సరళమైన
వ్రజభాషలో వర్ణితాలు. కవిగా చింతామణి రస సిద్ధాంతవాది.
శృంగార రసచిత్రణలో సాఫల్యం లభించింది.
అక్బర్ షా అనే సామాన్య వ్యక్తి రచించిన శృంగారమంజరికి
హిందీలో ఛాయానుకరణం కూడా చింతామణి చేశారు.

Monday, May 28, 2018

పద్యప్రతిలోమము


పద్యప్రతిలోమము




సాహితీమిత్రులారా!


ఒక పద్యాన్ని మామూలుగా చదివితే
దాన్ని అనులోమ పద్యం అంటాం.
అదే పద్యాన్ని చివరనుండి మొదటికి
చదివిన ప్రతిలోమమవుతుంది
అంటే మరొక పద్యం అవుతుంది.
గతంలో ఒప పద్యాన్ని త్రిప్పి చదివినా
అదే పద్యం వచ్చేది చూచాము
దానికి భిన్నమైంది ఇది.
లక్ష్మిసహస్రకావ్యంలోని ఈ
పద్యం చూడండి.
ఇది విద్యున్మాలికా వృత్తంలో
కూర్చబడింది.
అనులోమ పద్యం -
సామాధామాసారాభీమా
కామారామాకామాభూమా
రామాధామారారాభామా
భామాకామాభామాభూమా

భావం -
సామవేదానికి పూర్ణ నివాసులగు పండితులకు నివాసమైనదానా
శ్రేష్ఠురాలా భయముగొలుపనిదానా కేవలము ఇహలోకమునందలి
కోరికలుగల వారియందు అనురాగం లేనిదానా భూదేవిరూపం
నొందిన లక్ష్మీ స్త్రీల యొక్క తేజస్సునకు స్థానమైనదానా
సత్యభామ అనే పేరుగలదానా రమ్ము రమ్ము స్త్రీలయొక్క
కోర్కెలయందు ఉండుదానా కాంతి సంపదయొక్క ఆధిక్యమునకు
స్థానమైనదానా రమ్ము రమ్ము


ప్రతిలోమ పద్యం - 
పై పద్యాన్ని క్రిందినుండి పైకి వ్రాసిన వచ్చు పద్యం

మాభూమాభామాకామాభా
మాభారారామాధామారా
మాభూమాకామారామాకా
మాభీరాసామాధామాసా

భావం -
భూమియొక్కయు, పార్వతిఅను స్త్రీ యొక్కయు, కోర్కెలయొక్క
విశేష ప్రకాశముగలదానా, (భూదేవి, పార్వతి లక్ష్మివలన సకల
సంపదలు పొందుతారని తెలుపుట), మాకు కష్టములైన
పనులందు ధైర్యము నిచ్చుదానా, రమ్ము మాతేజస్వరూపమైన
దానా రమ్ము, మాసంపదకు స్థానమైనదానా, మన్మథునియందు
పూరణమైన సంతోషంకలదానా విష్ణుపత్నీ, భయముగలవారికి
సుహృద్బలమైనదానా లక్ష్మీ ప్రదముకాని చోట తేజస్సు
ఉండనిదానా  రమ్ము రమ్ము

ఈ విధంగా భావం మారిపోతున్నది.

Sunday, May 27, 2018

భాషాచిత్రం


భాషాచిత్రం




సాహితీమిత్రులారా!

కాళ్ళకూరి నారాయణరావు గారి
పద్యం
మార్నింగు కాగానె మంచమ్ములీవింగు
మొగము వాషింగు చక్కగ సిటింగు

గరికపాటివారి వ్యాఖ్లలో వినండి-

Saturday, May 26, 2018

ఈ కవికి సాటి కలరా?


ఈ కవికి సాటి కలరా?



సాహితీమిత్రులారా!



మన తెలుగువారిలో సంస్కృత కవులు అనేకులున్నారు
19వ శతాబ్దిలోని నిట్టల ఉపమాక వేంకటేశ్వరకవి కూర్చిన
చతుశ్చిత్రగర్భ - రామాయణసంగ్రహ మనే కావ్యం గురించి
ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ పేరులోనే నాలుగు
చిత్రాల గర్భిత రామాయసంగ్రహ మని వుంది.
మొదట ఈ కవిని గురించిన విషయాన్ని తెలుసుకుందాం-
ఈయన విశాఖపట్టణం మండల మందలి విజయనగర
ప్రాంతానికి చెందినవాడు. ఈయన విశ్వనాథకామాంబల
తనయుడు. రామాయణసంగ్రహము చిత్రగర్భకవితలకు
ఆలవాలం. ఇందులో రామకవచ స్తోత్రము, రామాయణ
సంగ్రహమేకాక, గౌరీకల్యాణము, శ్రీరంగాదిక్షేత్ర మాహత్మ్యము,
భగవదవతార చరిత్రము, ద్రౌపదీకల్యాణము అనే నాలుగు
కావ్యాలు ఇమిడి ఉన్నాయి.
కవివిషయం - బాలకాండలోనే ఇమిడ్చాడు ఎలాగంటే
బాలకాండలోని ప్రతిశ్లోకప్రథమాక్షరం తీసుకుంటే
రామకవచం కనబడుతుంది. అలాగే ప్రతిశ్లోకంలోని
రెండవ పాదం మొదటి అక్షరం తీసుకుంటే కవి
విషయం కనబడుతుంది.
1. గౌరీకల్యాణం - పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఇందులో గర్భితమైంది
ఎలాగంటే రామాయసంగ్రహలోని అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ
వరకు గల శ్లోకముల మొదటి అక్షరాలను వరుసగా వ్రాసిన అది గౌరీ
కల్యాణమవుతుంది.

2. శ్రీరంగాది క్షేత్రమాహత్మ్యం -
13 దివ్యక్షేత్రముల మాహత్మ్యం ఇందులో ఇమిడ్చడం జరిగంది
ఎలాగంటే- అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ వరకుగల
శ్లోకాల రెండవపాదం మొదటి అక్షరం తీసుకొని వరుసగా వ్రాయగా
శ్రీరంగాది క్షేత్రమాహత్మ్యం ఏర్పడుతుంది.

3. భగవదవతార చరిత్ర -
ఇది అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ వరకు గల శ్లోకాల
మూడవ పాద ప్రథమాక్షరాలను తీసి వరుసగా వ్రాసిన
ఏర్పడుతుంది. ఇందులో విష్ణువు వివిధ అవతారాలను
గురించి వివరించడం జరిగింది.

4. ద్రౌపదీ కల్యాణం -
ఇది అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ వరకు గల శ్లోకాల
నాలుగవ పాదం మొదటి అక్షరాలను వరుసగా కూర్చిన
ఇది ఏర్పడును.

ఇలాంటి రసనలు చేయగల కవులు ఉన్నారా!
ఆయన మోధోశక్తి ఎంత గొప్పదో సరస్వతీదేవి
కృప ఎంతగా వుందో ఊహించతరంకాదుగదా!


Friday, May 25, 2018

ద్వ్యక్షరి


ద్వ్యక్షరి




సాహితీమిత్రులారా!



రెండు హల్లులతోనే కూర్చబడిన పద్యాన్ని
ద్వ్యక్షరి అంటాము. ఇక్కడ మనం
చిత్రబంధరామాయణంలోని
ఈ ఉదాహరణ చూద్దాం-

వారం వారం వారారావం వార్వరం రవివారరః
వారం వారం వారివిరో రురావ విరివావరః
                              (చిత్రబంధరామాయణం - 5 - 2)

ఇది , - అనే రెండు హల్లులతో కూర్చబడింది.
ఇది హనుమంతుడు సముద్రాన్ని లంఘించే సందర్భంలో
కూర్చబడినది.
దీని భావం -
హనుమంతుడు సముద్రాన్ని దాటే సందర్భంలో
సూర్యుని ఎర్రటి బంతిగా ఊహించి పట్టుకొన బోయే
సందర్భంలో జరిగిన సంఘటనలో హనుమంతునికి
బ్రహ్మ, ఇంద్రుడు ఇతరదేవతలు ఇచ్చిన వరాల
బలంతో అనేకమార్లు తాను ఎంతగా గర్జించగలడో
అంతగా గర్జించాడు సమగద్రంలోని అలలకంటే
శక్తివంతంగా. గరుత్మంతుని వలె ఆకాశంలోకి ఎగిరాడు.

Thursday, May 24, 2018

చిదంబర సుమతి


చిదంబర సుమతి



సాహితీమిత్రులారా!




"చిదంబర సుమతి" అనే కవి విజయనగరరాజు
"వేంకటరాయల"(క్రీ.శ. 1586-1614) ఆస్థానంలో
ఆస్థానకవిగా ఉండినవారు. రెండు కథలను
జోడించి ఒక కథగా కూర్చడాన్ని ద్వ్యర్థికావ్యం
అంటారు. అలాగే మూడు కథలను జోడించి
చెప్పడాన్ని త్య్రర్థికావ్యం అంటారు.
ఈ చిదంబర కవిగారు సంస్కృతంలో
"రాఘవపాండవ యాదవీయం" అనే
త్య్రర్థికావ్యాన్ని కూర్చారు. దీనిలో
రామ, పాండవ, కృష్ణుల కథలను
మూడింటిని జోడించి కూర్చారు.
ఇది ఎంతటి క్లిష్టమైనదో చెప్పడానికి
వీలుకాదు. అలాంటి కావ్యంతోపాటు
ఈయన ఐదు కథల జోడింపుతో
మరో కావ్యం కూర్చారు. దాని పేరు
"పంచకల్యాణచంపువు". ఈ కవి తనకు
శ్లేషలో గల ప్రావీణ్యాన్ని, శబ్దాధికారాన్ని
ప్రకటించుకున్నారు. ఈ కావ్యంలో రామ,
కృష్ణ, శివ, విష్ణు, సుబ్రహ్మణ్యుల ఐదుగురి
వివాహాలు ఒకేసారి శ్లేష సహాయంతో వర్ణించబడినవి.
కానీ ఈ కావ్యంలోని విషయం వివాహ వర్ణన కావున
పంచార్థాలున్న శ్లోకాల అవసరం కవికి అంత ఎక్కువగా
కలగలేదని చెప్పవచ్చు. ఈ కావ్యంలో రెండు స్తబకాలున్నాయి.
అలాగే దీనికి ఆయనే స్వయంగా టీకా వ్రాశారు.
ఏది ఏమైనా ఆ మేథాశక్తికి జోహారు అనవలసిందే కదా!

Wednesday, May 23, 2018

ముక్కుతో పనిలేని పద్యం


ముక్కుతో పనిలేని పద్యం




సాహితీమిత్రులారా!


ముక్కుతో పనిలేని పద్యం ఏమిటని
మీకు అనిపించ వచ్చు అంటే
ముక్కును ఉపయోగించకుండా
మీరు మాట్లాడగలరేమో చూడండి
తప్పని సరిగా ఏదో ఒకచోట ముక్కుతో
పలుకుతాము. మరి మనం మాట్లాడటానికే
ఇబ్బందికి గురైతే పద్యం ఎలా వ్రాశారు.
ఇక్కడ మరోప్రశ్న మనం ముక్కుండగా
ముక్కులేకుండా పలకాల్సిన పనేమి
సరే మనం ఒక విషయం గమనిద్దాం
మన రామాయణంలో శూర్పణఖ ముక్కును
మన రామసోదరుడు లక్ష్మణుడు కోశాడుకదా
అప్పుడు శూర్పణఖ రావణుని వద్దకు వెళ్ళి ఎలా చెప్పింది?
ఆలోచించాల్సిందేకదా!
సరిగ్గా ఇదే విషయాన్ని ఒక కవి ఆదినారాయణుడు
అనే ఆయన ఈ విధంగా పలికించాడు
ముక్కుతో పలుకని పదాలను ఏరి కూర్చాడు
మరో చిత్రం ఆయన వ్రాసిన పుస్తకం
నిరనునాశిక చంపువు అంటే పుస్తకమంతా
ముక్కుమూసుకొనే చదువచ్చు.
మన అదృష్టం ఏమిటంటే ఆయన అంతగా
వ్రాసిన ఆ పుస్తకం పూర్తిగా దొరకటంలేదు
సరే ఇక్కడ ఆ పద్యం చదివి చూడండి-

హా హా రాక్షసరాజ దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజాః
విద్యుజ్జిహువిపత్తిరేవ సుకరా క్షుద్రప్రతాప త్వయా
ధ్వస్తాపత్రప పశ్య పశ్య సకలైశ్చ్రక్షుర్భిరేతాదృశీ
జాతా కశ్యచిదేవ తాపసశిశోశ్శస్త్రాత్తవైవ స్వసా

మీరు చదివి చూడండి ముక్కుతో పలకాల్సివుందేమో
ఒకవేళ వుంటే అది నేను టైపు చేయడంలో లోపమై
వుండవచ్చు. అంతేకాని కవి లోపం కానేకాదు.


Tuesday, May 22, 2018

కా కామధుక్?


కా కామధుక్? 




సాహితీమిత్రులారా!



ఈ ప్రశ్నోత్తర చిత్రాన్ని చూడండి-

కవీంద్రకర్ణాభరణంలోనిది ఈ శ్లోకం

కా కామధుక్? ప్రియా కా వా విష్ణోః? విశ్వం బిభర్తి కా?
విఘ్నానా మధిపః కశ్చ ప్రణామా త్సర్వకామదః?


దీని సమాధానం - గౌరీభూః
                                 (గౌః - ఈ - భూః)

1. కా కామధుక్ ?
   కోర్కెలును తీర్చునది ఏది?
   - గౌః - (గోవు)కామధేనువు

2. ప్రియా కా వా విష్ణోః?
    విష్ణువునకు ప్రియురాలెవరు?
    - ఈ -లక్ష్మి

3. విశ్వం బిభర్తి కా?
   ప్రపంచమును మోయునదేది?
   - భూః - భూమి

4. విఘ్నానా మధిపః కశ్చ ప్రణామా త్సర్వకామదః?
   నమస్కరించినంతనే అన్ని కోర్కెలను తీర్చు 
   విఘ్నాధిపతి ఎవరు?
   - గౌరీభూః - గౌరీదేవి కన్నకొడుకు గణపతి

Monday, May 21, 2018

ఇది తెలిసినవాడే పండితుడు


ఇది తెలిసినవాడే పండితుడు




సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలిక చూడండి-
సమాధానం చెప్పగలరేమో?


గోపాలో న చ గోపాల త్రిశూలీ న చ శంకరః
చక్రపాణిః స నో విష్ణుయోం జానాతి స పండితః

అతనికి ఆవుల మంద వుంది కాని గోపాలుడు కాదు
అతనికి త్రిశూలం వుంది కాని శంకరుడు కాదు
చక్రం వుంది కాని విష్ణువుకాదు ఇదేమిటో
తెలుసుకున్నవాడే నిజమైన పండితుడు
అని అర్థం.

సమాధానం - మహోక్షః  (పెద్ద ఎద్దు)

Saturday, May 19, 2018

సెల్ ఫోను దండకము


సెల్ ఫోను దండకము



సాహితీమిత్రులారా!


మనం అనేక దండకాలను విన్నాము. కాఫీ దండకము,
తిట్లదండకము ఇలాగా ఇప్పుడు పూసపాటి కృష్ణ సూర్య కుమార్
గారు రచించిన సెల్ ఫోన్ దండకం చూడండి-

శ్రీమన్మహాదేవి! సెల్ఫోయను దేవీ!  విశాలంబుగా విశ్వవిఖ్యాతి గైకొన్న యంత్రమ్ముగా నీవె యెచ్చోట కేవేళనైనన్ సువార్తల్ కడున్ వేగ శ్రావ్యమ్ముగా చేర్తువే యంతదూరాన మేమున్న నేతావు లోనున్న నేతీరమందున్న నేకొండపై నున్న నేబండ క్రిందున్న నేచెట్టు పైనున్న నేగట్టు పైనున్న నేపుట్టలో నున్న నేహాలులో నున్న నేచాలులో నున్న నేదిక్కు  లోనున్న నేపక్క మీదున్న నే తల్లితో నున్న నే పిల్ల తోనున్న నే గల్లిలో నున్న నే రోడ్డు మీదున్న నే దేవి తోనున్న నేభామ తోనున్న  నేబైకు మీదున్న నే కారులోనున్న నే బస్సులోనున్న నే మిస్సు తోనున్న నే రైలులో నున్న నే రైతు తోనున్న నే యాటలోనున్న నే పాట తోనున్న, నిచ్చోట నచ్చోట నెచ్చోటలోనైనన్ విభేదాలు లేకుండ స్విచ్చేసి నొక్కంగ వేగాన వేంచేసి   మాతోటి  ముచ్చట్లు గుప్పించి మాయొక్క సందేశ సంక్షిప్త  రూపాలు  పంపించి  కోపాలు తెప్పించి తాపాలు తప్పించి  వేదాలు గుప్పించి స్తోత్రాలు మాచేత  చెప్పించి  పాపాలు వీక్షించి లోపాలు చూపించి సంగీత సాహిత్య నాట్యాలు    కోరంగ  నెట్లోనన  శోధించి సాధించి యందించి  సాయమ్ము నీయంగ  నానాడు మార్టిన్ను కూపర్ ప్రపంచాన సంతోష మొప్పంగ మేధస్సు పుష్పించ  మోట్రోల రీసెర్చి భాగాన  సృష్టించి నీకెంతయో ఖ్యాతి కల్పించ విశ్వాన విఖ్యాతితో నీవు నాట్యంబు లాడంగ నేపుణ్య కాలాన నిచ్చోట చేరంగ భూమండలమ్మందు మైమర్చి మేమెల్ల సంప్రీతితో మోజు కల్గంగ హస్తాలలో భూషణంబయ్యి  మాచెంత చేరంగ నీసేవ  లెన్నింటినో  మేము పొందంగ  నేరీతిలో నిన్ను నే స్తోత్రపాఠాలతో గొల్తు మిచ్చోట నీధాత్రి  యూజర్ల కెల్లప్డు సిగ్నల్సు వీకైన  నిత్యమ్ము నాటంకము ల్లేక నందించి నెట్వర్కు  రక్షించి  క్రొంగ్రొత్త   ప్యాకేజి లిప్పించి టచ్ ఫోనుతో త్రీజి  వేగాన మాచెంత  నేతెంచి దేశాన  గోతాలతో పాత నోట్లన్ని రూపాలు లేకుండగా మోడి చేయంగ  రూపాయ లేకుండ రూపేల ఖాతాలు చూపించి వ్యాపార ప్రాంతాన దూకంగ నీపైన  నిత్యమ్ముగోకంగ తాకంగ పంపించి వంటంటి సామాగ్రి కుద్దండ పిండానివే నిన్ను నేమంచు కీర్తింతు నీగొప్ప, యన్నంబు లేకున్న మేమంత  యీడ్వంగ నేర్చాము, ప్రాణాల నాపంగ లేమంట లేకున్న నీవింట, ప్రొద్దున్నె మేల్కొల్పు మోదాన నీ రింగు టోన్లన్ని, పూజింతు  మెల్లప్డు దేవుళ్ళ స్తోత్రాలు వల్లించగా నీవు, వంటింటిలో నీవు సూచించు మార్గాన  కాఫీల నుప్మాల నిడ్లీల  పెళ్ళాలు చేయంగ విందారగించంగ సంతోష మొప్పంగ నాకీర్తి  నీదే గదా దేవి, చాటింగు లెన్నెన్నియో  నీవు సాగించి లవ్వర్సుగా చేసి మ్యారేజి  బ్యూరోవుగా నీవు పేరొంది నావంట, పెళ్ళాలకు న్నట్టి దృశ్యాలు చూపించి డైవర్సు లిప్పించి న్యాయమ్ము చేసేటి నీ బోటిమేధావులం మేము కాలేము,  మా యోట్లు  కోరంగ పార్టీల కేజెంటు వైనీవు ఎన్నెన్ని సందేశముల్ బంపి ప్రార్ధించి మెప్పించి  గుప్పించి రప్పించి గెల్పించి సాయమ్ము చేసేటి  నీప్రజ్ఞకే  రోజుతూగంగ లేమమ్మ, లైన్లందు నిల్చోక  సిన్మాల టిక్కట్లు, ఆర్టీసి టిక్కెట్లు, రైళ్ళందు టిక్కెట్లు,దేవాలయాలందు  టిక్కెట్లు ఫ్లైట్లందు టిక్కెట్లు, క్లబ్లోన టిక్కెట్లు పబ్లోన టిక్కెట్లు ఇప్పించు నీసేవ గుర్తించి దేశమ్ము పద్మా ఆవార్డిచ్చి నిన్నెప్డు కీర్తించు భాగ్యంబు కల్పించి యానంద పుయ్యాలలో నీవ యూగంగ నీగొప్ప నేరీతి కీర్తింతు, లంచాల బాబుల్ని పట్టించి  జైళ్ళందు  తోయించి దేశాన్ని సౌఖ్యాన నుంచేటి నీగొప్ప తెల్పంగ లేమమ్మ, నీకీర్తిపై మచ్చలే వచ్చు ముచ్చట్ల నిచ్చోట చూపించి దూషింతు, మార్గంబుపై బండ్లు తోలేటి డ్రైవర్ల వెన్నంటి నీవుండ  స్వర్గాన చేర్చేటి నీతప్పు చూపంగ శక్యంబు కాదమ్మ, నీపొందు విద్యార్ధులుం జేర నీలోన కాపీల నుంచంగ  వ్రాయించి ఉత్తీర్ణులయ్యేట్టు మార్గంబు ప్రాప్తించు నీబుద్ధి నేరీతి  ఖండింతు, దేశాన్ని దోచేటి య యుగ్రవాదంపు మార్గాలలో చేరి దేశాన్ని క్లేశంబులో త్రోయు  నీదుష్ట సాoగత్య మేరీతి గర్హింతు, కోరంగ వేగాన  నగ్నంపు దృశ్యాలు  శోధించి గుప్పించి చూపించి  ప్రాయంబు నిర్వీర్యమౌనట్లు చేసేటి నీ చేష్టలేనాడు గర్హిoచ లేమమ్మ, లోపాల నెంచంగ స్వల్పంబు, నీ కీర్తి యాకాశమున్ దాక  నిత్యంబు నిన్గోరి మా గుండెలో దాచి  పూజింతు మెల్లప్డు చల్లంగ నీదృష్టి మాపైన చూపించి యాహ్లాద మొప్పంగ శ్రేయస్సు నందించి మేలైన ప్రోగ్రాములం జూపి సర్వత్ర మాబోటి వారందరిన్ నీవు రక్షించి బ్రోవంగ రావమ్మ సెల్ ఫోను దేవీ నమస్తే నమస్తే నమస్తే నమః.

(శంకరాభరణం బ్లాగు సౌజన్యంతో)

Friday, May 18, 2018

దీర్ఘసమాస చిత్రం


దీర్ఘసమాస చిత్రం



సాహితీమిత్రులారా!



సమాసములు చిన్నవిగా మనం గమనించి ఉంటాం.
సమాసం ఒక పద్యంలో ఒక పాదం కాకుండా మూడుపాదాలు
సాగిన ఈ పద్యం చూడండి. ఇది గణపవరపు వేంకటకవి
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము (1-126)లోనిది.
ఆ పద్యం -
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి
ఆనందనిలయావాసుడై దివ్యదీధితులతో విరాజిల్లుతున్న
స్వర్ణసింహాసనాన్ని అధిరోహించి తనను చూడవచ్చిన
భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహించినప్పటి దృశ్యంలోనిది.


నెలఱాతీనియ సంతనంపు మగఱా నీరాళపుం గొప్పటా
కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ
సల మేల్ బొబ్బమెకంబు చెక్కడపుఁ గీల్ జాగా జగా గద్ది యన్
జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁ గన్.

దీనిలో   మొదటి మూడు పాదాలూ ఒక్క సమాసం.

నెలఱాతీనియ సంతనంపు మగఱా నీరాళపుం గొప్పటా
కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ
సల మేల్ బొబ్బమెకంబు చెక్కడపుఁ గీల్ జాగా జగా గద్ది యన్
జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁ గన్.

దీని అర్థం-
నెలఱా తీనియ= చంద్రకాంతశిలావేదికపైని, సంతనంపు = తాపబడిన, మగఱా = వజ్రములయొక్క, నీరాళపున్ = స్వచ్ఛమైన వన్నెమీరిన, గొప్ప + టాకుల – గొప్ప = పెద్దవియైన, టాకుల = వసారాలలోని, నిద్దంపు = స్నిగ్ధమగు, పసిండి = బంగరు రంగు, నున్ = మనోహరమైన, చవికె = మండపముయొక్క, నిగ్గుల్ = కాంతులను, తొట్టు = ప్రసరించు, కట్టాణి పూసల = మిక్కిలి గుండ్రని ప్రశస్త మౌక్తికవిశేషముల, మేల్ = విలువైన, బొబ్బమెకంబు చెక్కడపు = సింహపీఠికయొక్క, కీల్ = అందముగా కీలుకొలిపిన, జాగా = విశాలమైన, జగా = గొప్ప, గద్దియన్ = ఆసనముపై, చెలువు + ఎచ్చన్ = సౌందర్యము అతిశయింపగా, ఎల్లరును = సర్వజనులును, జే! జే! అంచున్ = జయజయధ్వానములు సల్పుచు, తన్ = తనను, కొల్వఁగన్ = ఆరాధించుచుండగా, కొలువు + ఉండెన్ = సభతీర్చియుండెను అని భావార్థం.

ఇందులో సమాసదీర్ఘిమను మించిన దుర్ఘటార్థమేదీ లేదు.

(ఈ పద్యం అర్థం డా. ఏల్చూరి మురళీధరరావుగారి సౌజన్యంతో)

Thursday, May 17, 2018

ఏకాక్షర శ్లోకం


ఏకాక్షర శ్లోకం


సాహితీమిత్రులారా!


12వ శతాబ్దంలో భగవద్రామానుజుల వారి శిష్యుడు
శ్రీవత్సాంకులవారు (కూరత్తాళ్వార్) రచించిన
శ్రీకృష్ణస్తుతిపరకమైన ఒక ఏకాక్షరశ్లోకం ఇది.
అరవైనాలుగు లఘువుల అచలధృతి శ్లోకమంతా,
ద అన్న ఒక్క అక్షరంతోనే కూర్చబడింది

తనను చేరదీసి, ఆదరాభిమానాలను కురిపించి,
అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన
శ్రీకృష్ణ పరమాత్మను నోరారా సన్నుతిస్తున్న
బాల్యమిత్రుడు సుదాముని మనోగతం ఇది.

దదదదదదదదదదదదదద దదదదదద దదద దదదదదదదదద
దదద దదదద దదద దదద దదద దదదద దదదద దదదద దదదద.
                                                                     (యమక రత్నాకరం - 12 ఆశ్వాసం.)


దదదదదదదదదదదదదద – దదత్ + అదదత్ + అద + దదత్ + అదదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = దాతలయందు, అదదత్ = దానస్వభావము లేనివారియందు, అద = భక్షకులైనవారియందు,

దదత్ = ఆత్మసమర్పణము చేసికొను భక్తులయందు, అదదత్ = భవబంధముల పట్ల ఉదాసీనులగువారియందు, అద = ఆత్మజ్ఞానకరుడవు (లేదా) అదదత్ = లోకభక్షకులైన పాపులయందు, అద = పీడాకరుడవు అయిన లోకేశ్వరా;

దదదదదద – దదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధర్మశీలురైనవారిని, అదత్ = బాధించునట్టి లోకకంటకులను, అద = సంహరించు జగద్రక్షకా; దదద – దద = త్యాగశీలురగు ధర్మమూర్తులను, ద = ప్రభవింపజేయువాడా;

దదదదదదదదద – దదత్ + అదదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధార్మికులయందు, అదదత్ = కర్మాకర్మములయందు వైరాగ్యము నూనినవారియందు, అదత్ = కర్మబంధములకు లోగినవారియందు, అద = సమచిత్తము గలిగి యుగాంతవేళ సర్వమును ఉపసంహరించు పరమపురుషా; దదద – దద = ధార్మికులను, ద = చిత్తమున ధరించి యుండువాడా;

దదదద – దదదత్ = ధర్మమూర్తులగు ఋషులను హింసించు రాక్షసులను, అద = నశింపజేయు శ్రీ వాసుదేవా;

దదద – దదత్ = యజ్ఞములచే దేవతలకు హవ్యరూపములైన ఆహుతులను సమర్పించెడి యాజ్ఞికులకు, అద = రక్షకుడవైన పరమేశ్వరా;

దదద – దదత్ = నీ భక్తులగు ఉత్తములను, అద = శోధించెడివాడా;

దదద – దదత్ = లోకరక్షార్థమై కారుణికులగువారిని, అద = రక్షించు దయార్ద్రమూర్తీ;

దదదద – దద = ధర్మరతులైనవారిని, ద = బాధించు దుష్టులను, ద = మట్టుపెట్టువాడా;

దదదద – దదత్ = ధారకులకు, అద = ధారకులు కానివారికి, ద = కర్మఫలములను ప్రసాదించు స్వామీ;

దదదద – దదత్ = లోకకంటకులకు, ద = అండగా నిలిచి కాపాడు నీచులను, ద = హరింపజేయు పరమాత్మా;

దదదద – దదత్ = సర్వప్రదాతవగు, అదదత్ = కర్మఫలముల అంతమొందింపజేసి సద్భావమునొసగు, అ = శ్రీ వాసుదేవా!


తాత్పర్యం -
శరణాగతులకు స్వాధీనుడవై, ఉదాసీనులైనవారియందు ఉదాసీనుడవై, పాపస్వభావులకు సంహారకర్తవై, రాక్షసాంతకుడవై, సజ్జనులను ప్రభవింపజేయువాడవై, ధర్మాధర్మానుసారకులకు ఆధారభూతుడవై, సత్స్వభావులను కాపాడి ముక్తినొసగువాడవై, సత్స్వభావులను బాధించువారికి బాధకుడవై, సజ్జనరక్షకులకు రక్షకుడవై, జగత్తుయొక్క బహిరంతరాలలో వసించు వాసుదేవుడవైన పరమపురుషా! శరణు! శరణు!

(శ్లోకార్థం డా. ఏల్చూరి మురళీధరరావుగారి సహకారంతో)

Wednesday, May 16, 2018

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!


ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!




సాహితీమిత్రులారా!

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
అనే పేరున ఒక వ్యాసం డా. ఏల్చూరి మురళీధరరావుగారు
ఈ మాట అంతర్జాల మాసపత్రికలో వ్రాసియున్నారు
అందుండి ఈ పద్యాన్ని ఇక్కడ వారి వివరణను
యథాతథంగా ఉంచుతున్నాను ఆస్వాదించండి-

వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, అన్వయక్లేశం మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పుడా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో —

కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.

ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు; కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది; కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు, క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి – అని అన్వయించుకోవాలి. సుబ్రహ్మణ్యకవిగారు ప్రవచించిన సంప్రదాయార్థం లభింపనందువల్ల నేను ఉన్నంతలో పద్యాన్ని మేనమామ పోలికగా అన్వయించాను.

అల్లంరాజు సుబ్రహ్మణ్యంగారి వివరణకంటే ఇందే బాగుందని
నా అభిప్రాయం ఎందుకంటే అది నేను ఒకసారి చూసి
ఉన్నాను. అందుకే ఇది ఇక్కడ ఉంచడం జరిగింది.

Sunday, May 13, 2018

తెలుగులో అనేకార్థ కావ్యాలు


తెలుగులో అనేకార్థ కావ్యాలు




సాహితీమిత్రులారా!



ఈ వ్యాసం "నండూరి విశ్వేశ్వర రావు"గారు కూర్చగా
ఈమాట(అంతర్జాల మాసపత్రిక)లో మార్చి 2002న అచ్చైనది
మన చిత్రకవితా ప్రపంచం పాఠకులు ఆస్వాదించటానికి
ఇక్కడ....................

తెలుగుసాహిత్యాన్ని ద్విపద, ప్రబంధము, శతకము, యక్షగానము మొదలైన ప్రక్రియల్లాగే అనేకార్థ కావ్యాలు కూడ అలరింపజేసాయి. రెండర్థాలు వచ్చే కావ్యాలు ద్వ్యర్థి కావ్యాలు. మూడర్థాలు వచ్చేవి త్య్రర్థి కావ్యాలు. నాలుగర్థాలు వచ్చేవి చతురర్థి కావ్యాలు. వీటిలో ద్వ్యర్థి కావ్యాలే తెలుగులో ఎక్కువగా వచ్చాయి.

శ్లేష, ద్వ్యర్థికి కొన్ని గుణాలు సమానంగా వున్నా వాటిలో భేదముంది. శ్లేషకావ్యంలో ఏ పద్యానికి ఆ పద్యమే. ద్వ్యర్థికావ్యంలో రెండర్థాలు సమాంతరంగా కావ్యమంతటా ఉంటాయి. వసుచరిత్ర, విజయవిలాసం ప్రఖ్యాత శ్లేష కావ్యాలైతే రాఘవపాండవీయం, హరిశ్చంద్రనలోపాఖ్యానం ప్రసిద్ధమైన ద్వ్యర్థికావ్యాలు.

పఠనపద్ధతి

"పింగళి సూరన" రాఘవపాండవీయంలో అనేకార్థ కావ్యాలను చదివే పద్దతి ప్రత్యేకంగా వివరించాడు.

ఒక కథ వినియెడు తరి వే
రొక కథపై దృష్టి యిడిన నొక యర్థము తో
పక పోవు గాన నేకా
ర్థ కావ్య మెట్లట్ల వినగదగు నొకటొకటిన్‌

ఒక కథను చదివేటప్పుడు వేరొకకథపై దృష్టి వుంచితే ఏ ఒక్క అర్థమూ స్పష్టం కాదు. అందుకని ఏకార్థకావ్యం లాగా చదవాలి. అంటే ముందు ఒక కథను దృష్టిలో ఉంచుకుని పద్యం మొత్తం అన్వయించుకోవాలి. తర్వాత రెండో కథను దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్టు అన్వయించుకోవాలి.

అనేకార్థసాధన

అనేకార్థ కావ్యరచనలో కథాసంయోజనకు సూరన కావ్యాదిని కొన్ని నియమాల్ని ప్రకటించాడు.

ఆంధ్రభాషా సంస్కృతాభిభాషా శ్లేష
యొక్కొకచోట, నొక్కొక్కచోట
నుచిత శబ్దశ్లేష, యొక్కొక్కచోటన
ర్థశ్లేష, యొక్కొక్కతరిని ముఖ్య
గౌణవృత్తిని శ్లేషఘటన, యొక్కొకతరి
నర్థాన్వయము వేరె యగుచు నునికి
శబ్దాన్వయ విభేద సంగతి యొక్కొక
తరి నివి యొక్కొక్క తరిని రెండు
మూడు గూడుట యన సముజ్వ్జలముగాగ
నాకు తోచిన గతి పెక్కుపోకలమర
రామభారత కథలు పర్యాయదృష్టి
జూచు సుమతుల కేర్పడ నాచరింతు

రామభారత కథలు పర్యాయదృష్టితో చూసే సుమతులకు స్పష్టమయ్యే విధంగా ప్రధానంగా ఆరు మార్గాలను ప్రదర్శించాడు. అవి
1.  ఒక అర్థంలో ఆంధ్రభాషా పదాలుగా మరో అర్థంలో సంస్కృతభాషా పదాలుగా సమన్వయం. దీన్ని ఉభయభాషాశ్లేష అంటారు.
2. శబ్దాలు శ్లేషించి కథాద్వయ సంయోజన. ఇది ఆంధ్ర శబ్దశ్లేష కావొచ్చు, సంస్కృత శబ్దశ్లేష కావొచ్చు. దీన్ని సభంగ శ్లేష అని కూడా అంటారు.
3. నానార్థాలున్న శబ్దప్రయోగంతో శ్లేష. అభంగశ్లేష అంటారు దీన్ని.
4. ఒక పదానికున్న ముఖ్యార్థం, గౌణార్థం అనే వాటితో సమన్వయం.
5. పదము యొక్క ఒకే అర్థాన్ని వేరువేరుగా అన్వయించటం.
6. శబ్దాల అన్వయం విభేదించటం.

ద్వ్యర్థి కావ్యాలు.

రాఘవపాండవీయం ఇలాటి కావ్యాన్ని మొదటగా వేములవాడ భీమకవి చెప్పాడని విన్నట్లు పింగళి సూరన అన్నాడు.

భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని యందు నొం
డేమియు నేయెడన్నిలుచు టెవ్వరు గాన; రటుండనిమ్ము; నా
నామహిత ప్రబంధ రచనా ఘనవిశ్రుతి నీకు గల్గుటన్‌
నామది తద్వ్దయార్థకృతి నైపునియుం గలదంచు నెంచెదన్‌

లభిస్తున్న ద్వ్యర్థి కావ్యాల్లో పింగళి సూరన రాఘవపాండవీయమే ప్రథమం. అతను 1550వ ప్రాంతంలో  దీన్ని రచించాడు. ఇది ఆకువీటి పెదవేంకటాద్రి ప్రోత్సాహంతో విరూపాక్షునికి అంకితం ఇవ్వబడింది. అనేకార్థ కావ్యరచన చాల కష్టంతో కూడిన పని అని ఇలా ప్రకటించాడు

రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ సక్యంబు గా
కుండుం తద్గతి కావ్యమెల్ల నగునే నోహో యనం జేయదే
పాండిత్యంబున నందునుం దెనుగు కబ్బం బద్భుతం బండ్రు ద
క్షుండెవ్వాడిల రామభారత కథల్‌ జోడింప భాషాకృతిన్‌

సూరన నాటికే కవిరాజు సంస్కృతంలో రాఘవపాండవీయం రచించాడు. సూరన ఆ సంస్కృతకావ్యాన్ని ప్రస్తావించలేదు. సూరన నేరుగా వాల్మీకి రామాయణం, వ్యాసభారతాల నుంచి కథల్ని తీసుకుని సమన్వయం చేసాడు. ఇతని ప్రతిభకు రెండు ఉదాహరణలు

ఏనుంగని కరమరయక
పూనితి గాకిట్టిపనికి పొసగునె యేయన్‌
కానమె కాలనియమగతి
తో నావేట మునియుగము ద్రుంగించె తుదన్‌

రామాయణార్థం దశరథుడు మునిబాలుని మరణానంతరం చింతిస్తున్నాడు. ఏనుంగు, అని, కరము, అరయక ఏనుగని వేరే ఆలోచన లేకుండా, పూనితిగాక, ఇట్టిపనికి, యేయన్‌, పొసగునె, కాలనియమ గతితో, కానమె, తుదన్‌, నావేట, మునియుగము ముని యొక్క ఆయువు, ద్రుంగించె.
భారతార్థం పాండురాజు అడవిమృగాలనుకుని మునిదంపతులను చంపి బాధపడుతున్నాడు. ఏనున్‌, కనికరము, అరయక, కాన, మెకాలు, అని, యమగతితో, పూనితిగాక, ఇట్టిపనికి, యేయన్‌, పొసగునె, నా వేట, తుదన్‌, మునియుగము మునిదంపతులను, ద్రుంగించె.
ఇక్కడ “ఏనుంగని కరమరయక” అనే చోట రెండర్థాల్లోను తెలుగు శబ్దాల్తో సభంగశ్లేష సాధిస్తే, “కానమె కాలనియమగతి” అనేచోట కాల అనే సంస్కృతశబ్దం రామాయణార్థంలోనూ, కానమెకాలు అనే తెలుగు శబ్దం భారతార్థంలోనూ వాడి ఉభయభాషాశ్లేష సాధించాడు.

తానన్నమాట ఇంద్రున
కైన నలంఘ్యమయి పేర్చునట్లుగ నెంతే
బూనిక చెల్లింపుచు జగ
తీనుత విక్రముడొనర్చె దిగ్విజయంబున్‌

ఈపద్యంలో ఒక్క పదమే రెండర్థాలు ఇచ్చింది. మిగిలిన పద్యమంతా రెంటికీ సామాన్యమే. ఆ పదం “అన్నమాట” అనేది. రామాయణార్థంలో అది అనినమాట అని, భారతార్థంలో అన్నయొక్క మాట అని అన్వయించుకుంటే సరిపోతుంది.

"హరిశ్చంద్రనలోపాఖ్యానం" దీన్ని మూర్తి, భట్టుమూర్తి, రామరాజభూషణుడు అని పిలవబడే కవి 1580 ప్రాంతంలో రచించాడు. ఇది శ్రీరామ చంద్రునికి అంకితం ఇవ్వబడింది. భారతరామాయణాల్లో దిగ్విజయం, వేట, మునిశాపం, సంతతికై యత్నం, వివాహం, వనవాసం, యుద్ధం మొదలైనవి సామాన్యంగా ఉంటే హరిశ్చంద్ర, నల కథల్లో ఇలాటి సామ్యాలు చాలా తక్కువ.

క్షితిభర్తకుమారుడు లో
హితుడన విలసిల్లె జేర్చి హృదయంబున సం
తతముదమునను జనాదర
మతి సాంద్రముగా బహుశ్రుతానందితుడై

హరిశ్చంద్రకథాపరం క్షితిభర్త, కుమారుడు, లోహితుడన, హృదయంబున, చేర్చి, సంతత, ముదమునను, జనాదరమతి, బహుశ్రుత, ఆనందితుడై, సాంద్రముగా, విలసిల్లె.
నలకథాపరం  క్షితిభర్తకు, మారుడు, లో, హితుడన, విలసిల్లె, బహుశ్రుత, ఆనందితుడై,  సంతతము, దము ననుజను, హృదయంబున, చేర్చి, ఆదరము, అతి సాంద్రముగాన్‌

మనుజపతియును నాగాశ్వమణి సువర్ణ
పూర్ణ సామ్రాజ్య దాన విస్ఫురణ ననుప
మామ రమణీ జయశ్రీ సమన్వితుడయి
యాత్మపురి జెంది సుఖలీల నలరె నంత

హరిశ్చంద్ర కథలో ఇది విశ్వామిత్రునికి రాజ్యదానం చేసే సందర్భం. నల కథలో దమయంతితో నలుడు తన రాజ్యానికి వెళ్ళటం. ఐతే, ఒక పదమే రెంటికీ తేడా. అది “అనుపమామరమణీ” అనేది. హరిశ్చంద్రుడి అర్థంలో దీన్ని అనుపమ, అమర, మణీ అని విడదీస్తే, నల కథలో అనుప, మామ, రమణీ అని విడదియ్యాలి. అలా హరిశ్చంద్రుడి కథలో సంస్కృత పదాలుగా, నలుడి కథలో తెలుగు పదాలుగా వాడబడింది.

"నైషధపారిజాతీయం" దీన్ని కృష్ణాధ్వరి రచించాడు. రఘునాథరాయలకి అంకితం. 1620 ప్రాంతంలో రచింపబడింది. దీన్లో పారిజాతకథతో వివాహపర్యంతం నలకథ జోడించబడింది.

బలభద్రస్థితి వైరివర్గము నడంపన్‌ సత్యభామాదులు
జ్వ్జల సామ్రాజ్య భరార్హతం దెలుపగా శౌర్యాఖ్యచే మాగధా
దులు దీర్ణానత వర్ణతం జెలగ సంతోషశ్రిత శ్రీకుడౌ
నల భూమీపతి గారవించె మహిని న్నాయంబునన్‌ రుక్మిణిన్‌

దీన్లో బలభద్రస్థితి, సత్యభామాదులు, శౌర్యాఖ్య, నల భూమీపతి, రుక్మిణిన్‌ అనే పదాల్లో శ్లేష ప్రయోగించబడింది.

ధరాత్మజాపరిణయం ఈ కావ్యాన్ని క్రొత్తలంక మృత్యుంజయకవి 18వ శతాబ్ది తొలిభాగంలో రచించాడు. కావ్యం పేరులోనే శ్లేష వాడటం ఇక్కడ ఒక విశేషం. ధర, ఆత్మజ సీత ఐతే, ధరా, ఆత్మజ పార్వతి. ఆ యిద్దరి వివాహగాధలు కలిసిన నాలుగాశ్వాసాల కావ్యం ఇది.

వెలయు నిలయందు భూ భృ
త్కుల వర్యుడు సుగుణరత్నఖని జనకుం
డలఘు సమున్నతిచే ను
జ్వ్జలిత యశోభార మహిమవంతుండనగన్‌

దీన్లో జనకుడు జనకుడనే పేరుగా, తండ్రి అనే అర్థంలో వాడితే, యశోభారమహిమవంతుడు అనే పదాన్ని యశోభారమహిమ, వంతుడు గానూ, యశో,భా,రమ, హిమవంతుడు గాను విడగొట్టాలి.

అచలాత్మజాపరిణయం దీన్ని తిరుమల బుక్కపట్టణం వెంకటాచార్యులు రచించాడు. ఈతను 1730 ప్రాంతం వాడు. దీన్లో కూడ సీతాపరిణయం, గిరిజాకళ్యాణం వర్ణితాలు. ధర శబ్దానికి వ్యతిరేకంగా, అచల శబ్దం హ్రస్వాంతమైతే పర్వతమనీ, దీర్ఘాంతమైతే భూమి అని అర్థాలు.

అనుగత సదర్థపర మహి
మనగరి సకల భువనాగ్ర మహిత గజౌఘం
బున దనరు సదాగతి కృత
ఘన సంగతి మిథిల యనగ గరిమాస్పదమై

లంకావిజయం దీన్ని పిండిప్రోలు లక్ష్మణకవి 1797లో రచించాడు. దక్షారామ సమీపాన ఉన్న కుయ్యేరు గ్రామంలోని గోపాలస్వామికి అంకితం చేసాడు. ఇది రెండశ్వాసాల కావ్యం. కవి తండ్రి ఆనతితో తమ లంకమాన్యాన్ని లాక్కున్న దమ్మన్నను రావణునితో పోల్చి రాసిన కావ్యం ఇది. రావణదమ్మీయం అని కూడ పేరున్నది దీనికి. కవి మాత్రం లంకావిజయమనే పిలిచాడు.

అమరు సకలలోక సమితి కుయ్యేరీతి
రహితముగను సిరి కిరవును విబుధ
విలసితంబు నగుచు విపులంబయోధ్య య
ను నగరము సురపురి ననుకరించి

కృష్ణార్జున చరిత్రం దీన్ని మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి 1850 ప్రాంతంలో రచించాడు. దీన్లో పారిజాతాపహరణం, విజయవిలాసం కలిసి ఉన్నాయి. ఇదీ రెండాశ్వాసాల కావ్యం.

అవనిలోన మిగుల నలరారు ద్వారక
వాట రమ్య హేమకూట కనక
విద్రుమాది వస్తువితతి యింద్రప్రస్థ
పురములీల విబుధపూజ్యమగుచు

రామకృష్ణోపాఖ్యానం దీన్ని శ్రీపాద వెంకటాచలకవి రచించి, పూసపాటి విజయరామ గజపతికి అంకితమిచ్చాడు. ఇది మూడాశ్వాసాల కావ్యం. భాగవతంలోని దశమస్కంధంనుంచి కృష్ణకథ, భాస్కర రామాయణం నుంచి రామకథ తీసుకుని రాసిన కావ్యం ఇది. అముద్రితం.

శివరామాభ్యుదయం దీన్ని పోడూరి పెదరామామాత్యుడు 18వ శతాబ్దంలో రచించాడు.

ఇవికాక చెన్న కృష్ణకవి యాదవభారతీయం, కొత్తపల్లి సింగరాచార్యుని రాఘవవాసుదేవీయం, విక్రాల శ్రీనివాసాచార్యకవి సౌగంధికాపారిజాతీయం మొదలైన ద్వ్యర్థికావ్యాలున్నాయి. ఇంకా కొత్తపల్లి సుందరరామయ్య వసుస్వారోచిష మనుసంభవం, గౌరీభట్ల రామకృష్ణశాస్త్రి ఏకవీరకుమారీయం, రావూరి దొరస్వామి ఆంధ్ర రాఘవపాండవీయం, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు ఏసుకృష్ణేయం ఆధునిక ద్వ్యర్థి కావ్యాలు.

త్య్రర్థి కావ్యాలు

రాఘవయాదవపాండవీయం దీన్ని బాలసరస్వతి రచించాడు. ఇతను 17వ శతాబ్దికి చెందిన వాడు. ఇది నాలుగాశ్వాసాల కావ్యం. వేంకటేశ్వరునికి అంకితమివ్వబడింది.

యాదవరాఘవపాండవీయం దీన్ని నెల్లూరి వీరరాఘవకవి 1717 ప్రాంతంలో రాసాడు. ఇది నాలుగాశ్వాసాల గ్రంధం.

శ్రీలకిరవు బహుళ సిత భానుకులులకు
నాటపట్టు సజ్జనాస్పదంబు
మహినయోధ్య కాంతి మధురసాలోజ్వ్జల
నాగపురి దనర్చు నవ్యలీల

ఈపద్యంలో అయోధ్య, మధుర, హస్తినాపురం మూడు పట్టణాలు వచ్చాయి.

రాఘవపాండవయాదవీయం దీన్ని అయ్యగారి వీరభద్రకవి మూడాశ్వాసాల కావ్యంగా రాసాడు.

వర సంపద్గుణ కరిపురి
తరళమణీనాథ రాజిత రుచి మధురనా
గరమాతులిత స్వర్గజ
యరయు మహోద్భట యయోధ్య యనదగు ధరణిన్‌

రామకృష్ణార్జున రూపనారాయణీయం దీన్ని ఓరుగంటి సోమశేఖరకవి 1877లో పూసపాటి నారాయణరాజుకు అంకితం ఇచ్చాడు.

సారంగధరీయం దీన్ని పోకూరి కాశీపతి కవి 1930లో రచించి గద్వాల రాణి ఆదిలక్ష్మిదేవమ్మగారి భర్తకు అంకితమిచ్చాడు. సారంగం అంటే లేడి. దాన్ని ధరించినవాడు శివుడు. లేడి గుర్తుగా ఉన్నవాడు చంద్రుడు. అలా శివుడు, చంద్రుడు, సారంగధరుడు ఈ ముగ్గురి కథల్ని కలిపింది ఈ నాలుగాశ్వాసాల కావ్యం.

చతురర్థ కావ్యాలు

నలయాదవరాఘవపాండవీయం దీన్ని మరింగంటి సింగరాచార్యులు రచించాడు.

ఇదే పేరున్న కావ్యాన్ని గునుగుటూరి వెంకటకృష్ణకవి 1650లో రాసినట్లు  తెలుస్తోంది.

ఇవన్నీ కాక శతకాల్లో కూడ రెండర్థాలు వచ్చేవి కొన్ని ఉన్నాయి.

ముగింపు
అనేకార్థ కావ్యాలలో భీమన రాఘవపాండవీయం నామమాత్రావశిష్టం. భీమన తర్వాత ఐదు శతాబ్దాల పాటు ఇలాటి కావ్యాలు తెలుగులో రాలేదు. అలా, సూరన్నే ఈ ప్రక్రియకు పునఃశ్రీకారం చుట్టాడు. సూరనని అనుసరించి రామరాజభూషణుడు, కృష్ణాధ్వరి మొదలైన వారు తర్వాత ఎన్నో కావ్యాలు రాసారు. దక్షిణాంధ్రయుగంలోని కవులు ఈప్రక్రియలో మూడుపూలు ఆరుకాయలు కాయించారు. ఆధునికకాలంలో కూడ కొన్ని కావ్యాలు వచ్చాయి. వీటన్నిటి బట్టి ఆంధ్రులకు అనేకార్థకావ్యాలంటే ప్రత్యేకాభిమానం ఉన్నట్లు తోస్తోంది.

Saturday, May 12, 2018

గాలిని బంధింప వచ్చుగా రజ్జుతో


గాలిని బంధింప వచ్చుగా రజ్జుతో





సాహితీమిత్రులారా!



సమస్య -
గాలిని బంధింప వచ్చుగా రజ్జుతో


శ్రీ బాపట్ల వేంకట పార్థసారథిగారి పూరణ- 

"ఆలికరంబును - పతి ముం
గాలిని బంధింప వచ్చుగా రజ్జుతో
పాలును మీగడ పెరుగును
గ్రోలగ వచ్చుగద కృష్ణ" గోపసఖుడనెన్

గాలిని కాదు పతిముంగాలుని అని
కవి చక్కగా పూరించాడు

Friday, May 11, 2018

వర్ణవిన్యాసవక్రత


వర్ణవిన్యాసవక్రత




సాహితీమిత్రులారా!



"వక్రోక్తి జీవితము" అనే రచించిన కుంతకుని ప్రకారం
వక్రోక్తి ఆరు విధములు వానిలో మొదటిది వర్ణవిన్యావక్రత

వర్ణవిన్యావక్రతలో వర్ణ శబ్దానికి వ్యంజనము అని అర్థం.

ఏకో ద్వౌ బహువోవర్ణా బధ్యమానాః పునఃపునః
స్వల్పాంత రాస్త్రిధాసోక్తా వర్ణవిన్యాసవక్రతా

అంటే ఒక వ్యంజనముగాని, రెండు వ్యంజనాలుగాని
కొంచెం కొంచెం వ్యవధానంతో కూడి పునః పునరుప
నిబద్ధములైనచో అది వర్ణవిన్యాస వక్రత.
ఇది మూడువిధాలు -
1. ఏకవర్ణ పునః పునరావృత్తి
2. ద్వివర్ణ పునః పునరావృత్తి
3. బహువర్ణ పునరావృత్తి

ఏకవర్ణ పునః పునరావృత్తి -
ఒకే వర్ణము మళ్ళీమళ్ళీ రావడం దీన్నే ఇతర అలంకారికులు
"వృత్త్యనుప్రాసం" అని అంటారు.

నిరుపమవితరణజిత జల
ధరసురతరుసురభి తరణితనయ ఖచరశం
కరసఖసుధాఘృణికి వి
స్ఫురణనభోమణికి మంత్రిచూడామణికిన్
                                             (చిత్రభారతం - 1-77)
దీనిలో రేఫము సర్వత్రా పునరావృత్తమైంది.

ద్వివర్ణ పునః పునరావృత్తి -
రెండు వర్ణములు అంటే రెండు వ్యంజనములు
పునావృత్తి అయిన ద్వివర్ణ పునః పునరావృత్తి అంటున్నాము.

చెలఁగుచు మర్మపుఁ బలుకులఁ
గలఁగుచుఁ గరతాళగతుల కనురూపముగా
మలఁగుచు రాయంచలగతి
మెలఁగుచు నంతంత వేల్పుమెలఁతలు వరుసన్
                                          (చిత్రభారతం - 2- 122)

దీనిలో ల - అనే వర్ణం, గ - అనే వర్ణం రెండునూ
సర్వత్రా పునరావృత్తములైనవి.

బహువర్ణ పునరావృత్తి -

అనేక వర్ణాలు పునావృత్తమవడం బహువర్ణ పునరావృత్తి అనబడును.

మరువము మేనులతాంగీ
మరువము దగమమ్ము హరుని మాఱుకొనిన య
మ్మరువమ్ము మానుటకునై
మరువమ్మిది బ్రహ్మచేసె మానసమలరన్
                                           (చిత్రభారతం - 2 - 124)

ఇందులోప్రతి పాదం మొదటిలో మరువము అని
బహు వర్ణాలు ఆవృత్తములైనవి. అయితే
ఇక్కడ మరువము అనే పదం పునరుక్తి కావడం వల్ల
దీన్ని యమకము అని అని అనవచ్చు.

Thursday, May 10, 2018

కొన విరగని పువ్వు పేరేమి?


కొన విరగని పువ్వు పేరేమి?







సాహితీమిత్రులారా!




ఈ పొడుపుకథను
విప్పండి


1. సింగారమైన తోటలో 
    బంగారుపూలు కోసే చిన్నదానా
    కొన విరగని పువ్వు పేరేమి?



సమాధానం - గురుగు పువ్వు



2. సక్కని మానికి చిక్కని గజ్జలు
    ఏమిటవి?



సమాధానం - సజ్జ(సద్ద)కంకి



3. సలసల నీళ్లల్లో చంద్రబిళ్ల
    ఏమిటది?


సమాధానం - వడ

Wednesday, May 9, 2018

చారుచకోరక పూర్ణచంద్రమా!


చారుచకోరక పూర్ణచంద్రమా! 



సాహితీమిత్రులారా!



"ఎరగుడిపాటి వేంకటకవి" ప్రణీతమైన
"విష్ణుమాయావిలాసము"లోని
గుణిత పద్యం ఇక్కడ చూద్దాం-
గుణిత పద్యం అంటే
ఒక పద్యంలో ఒక అక్షరం(హల్లు) గుణింతం
ఉదాహరణకు క మొదలు కం వరకు
గుణింతము వచ్చేలా పద్యం కూర్చటం
కొన్ని సందర్భాలలో సగం పద్యంలో
ఒక అక్షరం(హల్లు) గుణింతం
మిగిలిన సగంలో మరో అక్షరం గుణింతం
కూర్చిన పద్యాలూ ఉన్నాయి.

కలిహర కాంతినీల కిటి గౌరవ కీర్తిరతా కుభృద్వరో
జ్జ్వల కరకూర్మరూప పరివర్ధిత కేశవకైటభారి కో
మల పదపద్మ కౌశల రమారత కంసవిమర్ధ వైరి హృ
జ్జలరుహ మిత్ర భక్తజన చారుచకోరక పూర్ణచంద్రమా!
                                                                            (విష్ణుమాయావిలాసము - 5 - 368)

దీనిలో మొదటి మూడు పాదాలలో క - గుణింతం వుంది
గమనించగలరు.

లిహర కాతినీల కిటి గౌరవ కీర్తిరతా కుభృద్వరో
జ్జ్వలకర కూర్మరూప పరివర్ధిత కేశవకైటభారి కో
మల పదపద్మ కౌశల రమారత కంసవిమర్ధ వైరి హృ
జ్జలరుహ మిత్ర భక్తజన చారుచకోరక పూర్ణచంద్రమా!

Tuesday, May 8, 2018

వచ్చి పొయ్యే వారికి బహు బేరగాడు


వచ్చి పొయ్యే వారికి బహు బేరగాడు




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి.


1. నల్లటోపీ వాడు
    పచ్చటంగీ వాడు
    వచ్చి పొయ్యే వారికి బహు బేరగాడు
    ఏమిటిది?


సమాధానం - వంకాయ



2. నన్నందరూ మామ అంటారు
    అమ్మకు తమ్ముణ్ణి కాను
    ఎవురునేను?


సమాధానం - చందమామ

Monday, May 7, 2018

తానుపోయి రాజుతో సరసమాడె


తానుపోయి రాజుతో సరసమాడె




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి


1. ఇసుకలో ఇల్లు కట్టి
    కొప్పులో తొంగి చూసి
    తానుపోయి రాజుతో సరసమాడె
    ఏమిటిది?


సమాధానం - మొగిలి పూవు


2. ఉన్న చోట ఉండి పరుల దాటింతు
    పయనమై నపుడె పయన మగుదు
    నాకు కాళ్లు రెండు, నరుడు కాళ్లు రెండు
    ఏమిటిది?


సమాధానం - నిచ్చెన
   

Saturday, May 5, 2018

కోపం వస్తే ఆకాశానికి ఎగిరిపోతాడు


కోపం వస్తే ఆకాశానికి ఎగిరిపోతాడు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి


1. తోకాయ గారికి కోపం వస్తే
    ఆకాశానికి ఎగిరిపోతాడు
    ఏమిటిది?


సమాధానం - తారాజువ్వ


2. తెల్లని వళ్లు
    ఎర్రని ముక్కు
    పొడుగ్గా పుట్టి
    పొట్టిగా పెరుగును
    ఏమిటది?



సమాధానం - మైనపు వత్తి(కొవ్వొత్తి)

Thursday, May 3, 2018

చెరకు తింటుంది బొగ్గు ఉమ్ముతుంది


చెరకు తింటుంది బొగ్గు ఉమ్ముతుంది




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి.


1. మూడు కాళ్ల ఏనుగు 
    చెరుకు తింటుంది
    బొగ్గు ఉమ్ముతుంది
    ఏమిటిది?


సమాధానం - పొయ్యి


2. మూడు కాళ్ల ముసలి నడినెత్తిన నోరు
    ఎన్ని పోసినా  తింటుంది
    ఏమిటది?


సమాధానం - గొర్రు


3. ముల్లు ముల్లు కోటలో
    ముంత మామిడి తోపులో
    గడ్డివామి లోపల కనబడింది వజ్రం
    ఏమిటిది?


సమాధానం - పనసగింజ

Wednesday, May 2, 2018

జానడే జానకు మూరెడు టోపీ


జానడే జానకు మూరెడు టోపీ




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథ
విప్పండి


1. జానడే జానకు
    మూరెడు టోపీ
    ఏమిటిది ?


సమాధానం - మొక్కజొన్న


2. జీడి వారి కోడలు
    సిరిగల వారి ఆడపడుచు
    వయసులు గులికే వయ్యారి
    వైశాఖమాసంలో వస్తుంది 
    ఏమిటిది?


సమాధానం - మామిడిపండు


3. గెనుపు లేని తీగలు
    ఏమిటిమి?



సమాధానం - వెంట్రుకలు

Tuesday, May 1, 2018

బరిణాల కాయ గాయు


బరిణాల కాయ గాయు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి


1. ఇసికాల పూవు బూయు
    బరిణాల కాయ గాయు
    ఏమిటది?


సమాధానం - ఉసిరి(వెల్లి)చెట్టు


2. ఈ కొండకు ఆ కొండకు ఇనుప గొలుసు
    ఏమిటది?


సమాధానం - నల్ల చీమల దారి


3. ఈడేసిన కట్ట బల్లాపురం జేరు
    ఏమిటది?


సమాధానం - జాబు