Sunday, March 31, 2019

జీవిత నవల – 2


జీవిత నవల – 2




సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.............

ఇంతకుముందు చెప్పినట్టు, జీవిత నవల ఇంకా శైశవ దశలోనే ఉంది. అందువల్ల, నేను రాసిన మెదటి జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్ (Lust For Life) నుండీ మొన్నటి ఇమ్మోర్టల్ వైఫ్ (Immortal Wife), లవ్ ఈజ్ ఎటర్నల్ (Love is Eternal) నవలల వరకూ నా రచనలలో నేను పైన చెప్పిన నియమాలని, పద్ధతులని ఏ విధంగా ఆచరణలో పెట్టానో సోదాహరణంగా విశదీకరిస్తే బహుశా ఆసక్తి ఉన్నవారికి అది ఉపయోగపడవచ్చు.

లస్ట్ ఫర్ లైఫ్ నవలకి ముందు నాకు జీవిత నవలలు రాయడంలో ఎటువంటి అనుభవమూ లేదు. ఆరోజుల్లో నేను నాటకరచయితని. ఒకరోజు, పారిస్‌లో నా స్నేహితులు నన్ను బలవంతంగా విన్సెంట్ వాన్‌గో (Vincent van Gogh) చిత్రాలు చూడటానికి తీసుకొని పోయారు. అది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన. ఒక పెద్ద హాలంతా నిండిపోయిన వాన్‌గో వర్ణచిత్రాలు నన్ను ఆమూలాగ్రం కదిలించి వేశాయి. ఆనాటి భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది, మొదటిసారి బ్రదర్స్ కరామజోవ్ (Brothers Karamazov) నవల చదివినప్పుడు ఎటువంటి అనుభూతికి లోనయ్యానో అటువంటి ఉద్వేగమే, నన్ను అంతే తీవ్రంగా, కదిలించింది. ఎలాగైనాసరే, నన్నంతగా కదిలించిన వాన్‌గో గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే పట్టుదల నాలో కలిగింది. న్యూయార్క్ తిరిగి వచ్చేశాక, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలలో దొరికినంతవరకూ చెదురుమదురుగా విన్సెంట్ గురించిన వివరాలు అన్నీ చదివాను. ఒకపక్క నేను రాస్తున్న నాటకాలపై పనిచేస్తూనే, సాయంత్రాలన్నీ ఫిఫ్త్ ఎవెన్యూలోనూ, ఫార్టీ-సెకెండ్‌ స్ట్రీట్‌లోనూ ఉన్న పబ్లిక్ లైబ్రరీలలో విన్సెంట్‌ తన తమ్ముడు థియోకి రాసిన ఉత్తరాలు, మూడు సంపుటాలు, అన్నీ శ్రద్ధగా చదివాను. ఇదంతా అతని గురించి తెలుసుకోవాలనే కోరికతోనే గానీ, అతనిపై ఒక నవల రాయాలనే ఆలోచన నాలో ఏ కోశానా లేదు. కాని, అలా నాకు తెలియకుండానే, నా ప్రయత్నమేమీ వేరేగా లేకుండానే విన్సెంట్ నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అతని కథ నన్నెంతగా వశం చేసుకుందంటే, అర్ధరాత్రి మూడింటికి లేచి థియో, విన్సెంట్ మధ్య సంభాషణలో లేదా, ‘ఓవెర్ స్యుర్ వాస్‌’లో (Auvers sur Oise పారిస్ నగరంలో ఒక ప్రాంతం) విన్సెంట్ మరణ సన్నివేశమో రాస్తుండేవాడిని. ఆటుపోట్లతో నిండిపోయిన విన్సెంట్ జీవిత ప్రయాణం ఎంతో భావంతో నిండుకుని, ఒక గొప్ప కథగా నాకనిపిస్తుండేది. ఆ సంవత్సరాంతానికల్లా నాకింక వేరే ఏ ఆలోచన పొసగక, ఆఖరికి అతన్ని నా ఆలోచనలనుంచి నెట్టివెయ్యడానికైనా సరే, విన్సెంట్ జీవిత నవల రాయాలని నిర్ణయించుకున్నాను.

కాని, అటువంటి కథని రాయడానికి నాకున్న నేపథ్యం ఏమాత్రమూ సరిపోదు. నేను పెరిగింది శాన్ ఫ్రాన్సిస్కోలో. చచ్చి, తలకిందులుగా వేలాడుతున్న రెండు కుందేళ్ల బొమ్మ కూడా అక్కడ గొప్ప కళాఖండమే! అందుకని నా మెదటి కర్తవ్యం ఆధునిక చిత్రకళ, చిత్రకారుల గురించి సాంతంగా చదివి తెలుసుకోవడం, ఆనక వీలయినంతగా వారు గీసిన చిత్రాలని చూడడం. భుజానికి ఒక సంచీ తగిలించుకుని, నేను యూరోప్‌కి వెళ్ళి విన్సెంట్ జీవితాన్ని అనుసరించాను. అతను నడిచిన దారిలో నడిచాను – బొరినాజ్‌లో (Borinage, బెల్జియం దేశంలో ప్రాంతం) అతను దిగిన బొగ్గుగనుల్లోకి నేనూ దిగాను, మేడమ్ డెనిస్ బేకరీలో అతనే గదిలో పడుకున్నాడో అక్కడే నేనూ పడుకున్నాను, హాలండులో అతను తన కుటుంబంతో నివసించినచోటే నేనూ ఉండి నోట్సు రాసుకున్నాను, దక్షిణ ఫ్రాన్స్‌లో అతను పనిచేసిన యెల్లో హౌస్‌లో పని చేశాను, సాన్ రేమీలో (Ste. Remy) అతనిని బంధించిన పిచ్చాసుపత్రిలోనే నేనూ కొన్నాళ్ళు ఉన్నాను, చివరికి అతని నలభయ్యవ వర్ధంతినాడు ఓవెర్ స్యుర్ వాస్‌ లోని చిన్న హోటల్లో అతను అద్దెకున్న గదిలో, అదే పక్క మీద, పడుకున్నాను.

జీవిత నవల రాయడంలోని లోటుపాట్లు నాకెంత తెలుసో, తెలీదో నాకే తెలియదు కాబట్టి, లస్ట్ ఫర్ లైఫ్ నవల రాయడానికి పూనుకున్న మొదటి ఉదయం, నాకు గుర్తుగా నాలుగు నియమాలు రాసుకున్నాను. అవి – 1. నాటకీయత; 2. వీలయినంత ఎక్కువగా సంభాషణ; 3. సజీవమైన పాత్రలు; 4. సున్నితమైన హాస్యపు సన్నివేశాలు.

అవే ఆనాడు నన్ను నడిపించిన నాలుగు సూత్రాలు. ఇప్పుడైతే, నవల ఎలా ఉండాలో, ఉండకూడదో యాభై పేజీలకి తక్కువ కాకుండా ముందే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రాసిపెట్టుకుని దాన్నే అనుసరిస్తున్నాను. అయినా, ఇప్పుడు వచ్చిన నా నవలలేవీ లస్ట్ ఫర్ లైఫ్ కంటే గొప్పగా లేవనే ప్రజాభిప్రాయం. అందుకే ఒక్కోసారి, ఆ రోజుల్లో సహజసిద్ధంగా తెలిసినదానినే ఈ పాతికేళ్లలో విశ్లేషించి వివరంగా చెప్పగలగడం మించి ఇంకేమీ కొత్తగా సాధించినదేమీ లేదేమో అనే సందిగ్దం నన్ను వేధిస్తూ ఉంటుంది.

ఏ ప్రేరణైతే నాచేత లస్ట్ ఫర్ లైఫ్ రాయించిందో సరిగ్గా అటువంటి ప్రేరణే ఇమ్మోర్టల్ వైఫ్ నవల రాయడానికి నన్ను పురికొల్పొంది. ఈ రెంటికీ మధ్య మూడు జీవిత చరిత్రలు రాసేంత కాలం ఎలా జీవిత నవలకు దూరంగా ఉండగలిగానో, నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులపై దే ఆల్సో రాన్ (They Also Ran) అనే నవల రాశాను. అందులో జాన్ ఫ్రీమాంట్‌పై అధ్యాయం రాస్తుండగా, ఆయన సతీమణి జెస్సీ బెంటన్ ఫ్రీమాంట్ మరోసారి నా తలపు తలుపు తట్టింది — కాలేజీ రోజుల్లో ఆమే నా ఆరాధ్య దేవత, నా భార్యని ఎంచుకోవడంలో కూడా ఆమే నాకు స్ఫూర్తి. విన్సెంట్ కథ నన్ను ఎలా ఆవహించిందో, జెస్సీ కథ కూడా అలానే నన్ను ఆక్రమించుకుంది.

ఇమ్మోర్టల్ వైఫ్ రాయడానికి పూనుకునేముందు, అంటే 1943లో, సుమారుగా అరవైమూడు సూత్రాలతో జీవిత నవల రాయడానికి రచయితకున్న స్వేచ్ఛాపరిమితులు, అతని ఎల్లలు, సరిహద్దులపై ఖచ్చితమైన నియమావళి రాసుకున్నాను. అందులోంచి ఒక ఉదాహరణ:

కథలో వడి ఉండాలి. పాటలా హాయిగా సాగిపోవాలి. ప్రధానంగా వ్యక్తుల కథ కాబట్టి చరిత్ర నేపథ్యంలోనే ఉండాలి. కనీసం సగం పైగా సంభాషణలుండాలి. జెస్సీ స్వగతాలు, ఆలోచనలు చాప కింద నీరులా ఉండాలి. ప్రతీది ఆమెగానే ఆలోచించాలి. పాత్రలన్నీ సజీవంగా, చైతన్యవంతంగా ఉండాలి. ప్రతీ సన్నివేశం, ప్రతీ పదం ఇప్పటి భాషలో ఉండాలి. పాఠకుడు జెస్సీతో మమేకమైపోవాలి. 1840 నుంచీ 1900 మధ్య కాలంలో ప్రపంచాన్ని ఆమె దృష్టితోనే చూపించాలి. వర్ణన కోసం వర్ణన ఉండకూడదు. వర్ణనలు జెస్సీ జీవితానికి అనుబంధంగా, ఆమె చూసి చేస్తున్నవిగానే ఉండాలి. చారిత్రక సత్యాల ఏకరువు కాకుండా అవి జీవితంలో భాగమైనవిగానే ఉండాలి. విషయ సామగ్రి కొత్తగా ఉండాలి. అది పడుగూ పేకలా వర్ణిస్తున్న ఆ జీవితంలో ఇమిడిపోవాలి. అంతర్లీనంగా హాస్యం వాడి కథకు తేలికదనాన్ని తేవాలి. కథలో ప్రధానాంశాలు ప్రవేశపెట్టడంలో, వాటిని అభివృద్ధి చెయ్యడంలో ఓపిక అవసరం. మొదట ఇదొక ప్రేమ కథ అని మర్చిపోకూడదు. జాన్, జెస్సీల మధ్య అనుబంధం ఎప్పటికప్పుడూ మారుతున్నా, వారి ప్రేమానురాగాల స్వభావం ఎప్పుడూ ఒకటే. మానవ సహజమైన పొరబాట్లు, తప్పిదాలు ఈ కథకి మూడో కోణం. ఒకరంటే ఒకరికి, అలానే వారిద్దరికీ ప్రపంచంపై ఉన్న విశ్వాసం, ఆశావహ దృక్పథమే జీవనానికి పునాది అనే వారి ఆదర్శం, ఈ కథకు నాలుగో కోణం. ప్రేమ, వివాహంపై కూలంకషంగా, లోతుగా కథనం ఉండాలి. ఆ బంధం సహజానుబంధంగా చూపాలి. ఏ వివరం వొదిలి పెట్టకుండా, ఏ విషయం ఎక్కువగా వర్ణించకుండా, అప్పటి కాలాన్ని కళ్ళకి కట్టినట్టుగా చిత్ర్రించాలి. కథాస్థలాలైన వాషింగ్టన్, సెయింట్ లూయిస్, మారిపోసాల మధ్య వైవిధ్యం ప్రస్ఫుటమవ్వాలి. చరిత్రను ఆసక్తికరంగా కథలో ఇమిడ్చి, ఏ ఒక్క జీవితమైనా సర్వమానవాళి జీవితానికి ప్రతీక అనే భావన కలిగించాలి.

ఏడేళ్ళ తర్వాత, ది ప్రెసిడెంట్స్ లేడీ (The President’s Lady) నవలకి అవసరమైన పథకం తయారుచేసుకుంటున్నప్పుడు, “రేచల్ మనసు తెలుసుకోవడం ఎలా” అని నేను మథనపడుతూ, నాకై నేను రాసుకొన్న సలహాలు ఇప్పుడు అప్రస్తుతం కావు.

పరిస్థితులకి ఆమె మనస్సుతో మనం స్పందించాలి. ఆమె కళ్లతో మనుషులని చూడాలి; ఆమె విలువలే మన విలువలు కావాలి; ఆమెని తబ్బిబ్బుచేసే సంగతులే మనల్ని కూడా కలవరపెట్టాలి; ఆమెకి ఏది కావాలో అది ఆమెకి దొరకాలని మనం కోరుకోవాలి; ఆండ్రూపై ఆమెకి గల ప్రేమని మనం సొంతం చేసుకోవాలి. ఆమెతో పాటుగా, ఆమె సుదీర్ఘమైన ఒంటరితనంలో మనమూ క్రుంగిపోవాలి; ఆమె కలతలే మన కలతలు, ఆమె అవసరాల నేపథ్యంతోనే మనం సంఘటనలని బేరీజు వెయ్యాలి. ఆవిడ స్నేహితులు, బంధువులు మనకూ అంతే దగ్గరవాళ్ళు. ఆండ్రూకి గుర్తింపు, కీర్తి లభించాలని మనం కోరుకోవాలి. వాటివల్ల అతను మనకు దూరమైపోతాడని భయపడాలి కూడా. ఆమె మతాన్ని ఆరాధించినప్పుడు మతమే మనకి కూడా ఆసరా కావాలి. రేచల్ అనే వేదిక మీద చరిత్ర నటించినట్టుగా చూపించాలి. ఆమె సామాజిక విజయాలకి మనం ఉప్పొంగిపోవాలి, ప్రాణాంతకమైన దెబ్బకి ఆమెతో మనం కూడా మరణించాలి. రేచల్‌ని మనం ప్రేమించాలి, ఆమెతో స్నేహం చెయ్యాలి, ఆమెని అర్థంచేసుకోవాలి. ఆమె జీవితాన్ని ఆమె హృదయంతో, మనస్సుతో మనం అనుభవించగలగాలి.

ఇదంతా ఆర్ద్రతతో, ఆమె పట్ల కరుణతో రచయిత కథ చెప్పగలిగితేనే సాధ్యం. ఆమెని మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే సాధ్యం. నిజాయితీగా, సూటిగా, ఉత్ప్రేక్షలు లేని కథనంతోనే సాధ్యం. అలా అయితేనే, పాఠకుడు రేచల్ పట్ల సహానుభూతికి లోను కాగలడు. కథలోని సన్నివేశాలలోంచి, అన్ని సంఘటనల లోనుంచి రేచల్‌ను చురుకుగా నడిపించుకుంటూ రావాలి. ప్రేమలోనూ, వైవాహిక జీవితంలో ఆమె పడిన బాధలు విశ్వసామాన్యమని చూపిస్తూనే, ఆమె జీవితం మిగతా అందరి స్త్రీలకంటే భిన్నమైనదని వెల్లడించాలి. ఆమె కూడా మనందరి లాగానే విధివైపరీత్యాలకు తల వంచినదిగానే చూపిస్తూ, రేచల్ లాంటి జీవితం నభూతో నభవిష్యతి అని ఆమె ప్రత్యేకతను నిరూపించగలగాలి.

నవలపై ఏడాదిన్నరపాటు పనిచేశాక, చివరి అధ్యాయం రాసేముందు, నవల ద్వారా ఏ సిద్ధాంతనిరూపణలు చెయ్యనవసరం లేదు గానీ, రేచల్ జీవితాన్ని వెలుగులోకి మరింతగా తీసుకుని వచ్చే బాధ్యత నాదే కదా? అని నాకు నేను చెప్పుకుంటూ, నవల ఎందుకోసం మొదలుపెట్టానో ఆ ఉద్దేశం నెరవేరిందా లేదా, ఈ నవలను ఒకటిగా పట్టి వుంచే అంతస్సూత్రం ఏమిటి? అనే మీమాంసలో పడ్డాను.

లింకన్ల జీవితకథపై నాకున్న అమితమైన ఆసక్తి కారణంగా ఆ విషయంపై చాలా చదివాను, కాని చాలా కాలం వరకూ నాకంటూ ఒక కొత్త కోణం చిక్కలేదు. అందరి లాగా నేను కూడా, “పాపం ఏబ్రహాం, మేరీతో ఎలా వేగాడో” అనే అనుకున్నాను. కొత్తగా చెప్పేదేం దొరక్క, ఓ పదేళ్ళపాటు ఆ కథని అలానే మగ్గనిచ్చాను. ఇంతలో లింకన్ల దాంపత్యంపై ఒక పత్రికకి వ్యాసం రాయవలసి వచ్చింది. ఆ వ్యాసానికి అవసరమైన సామగ్రి కోసం వెతుకుతుండగా, లింకన్ల రోజువారీ జీవితానికి సంబంధించిన వివరాలతో ఉన్న అరుదైన వ్యాసం ఒకటి దొరికింది – ముఖ్యంగా ఏబ్రహాం లింకన్ భర్తగా ఎలా మెసలుకునేవాడో ఆ వ్యాసంలో ఉంది. అది చదివి, “పాపం మేరీ!, ఏబ్రహాంతో ఎలా వేగిందో” అనుకున్నాను. ఆ క్షణం, వారి దాంపత్యంలో సమానత్వం నాకు అర్థమయింది. ఇక నేను వారి కథ చెప్పకుండా తప్పించుకోలేను. లింకన్ పెళ్ళిరోజున, “Love is Eternal” అని చెక్కిన ఉంగరాన్ని మేరీ వేలికి తొడిగాడు. అదే కథా వస్తువుగా వారి జీవితకథని చెప్పడానికి పూనుకున్నాను.

జీవిత నవలా రచయితకి తన కథపై చిన్న పిల్లవాడికుండే అంతులేని కుతూహలం ఉండాలి. ఉదాహరణకి, లింకన్ల జీవితకథలో నాలుగో అధ్యాయం రాయడం కోసం నేను రాసుకున్న నోట్సు నుంచి:

ఏబ్రహాం, మేరీలలో వివాహం తరువాత ఎటువంటి మార్పులు వచ్చాయి? ఏబ్రహాం ఆమెతో రోజులో ఎంత సమయం గడిపేవాడు? హోటల్లో మేరీ ఉండే గది ఎక్కడ ఉంది – ముందువైపా, వెనకనా, పక్కనా, మూలగానా? అందులోకి ఎంత వెలుగు వచ్చేది? గది వెచ్చగా ఉండేదా? ఆమె గదిని తనకి నచ్చినట్టు సర్దుకునేదా, ఉన్నది ఉన్నట్టుగానే వదిలేసేదా? గది ఏమాత్రం ఉంటుంది? గదిలోంచి చూస్తే బయట ఏం కనిపించేది? ఆమె హోటల్లో గడిపిన సమయంలో గదిలో ఎంతసేపు ఉండేది, బయట ఎంతసేపు గడిపేది? తనకోసం – చదువుకునే బల్ల, రీడింగు లాంపు వంటివి – ప్రత్యేకంగా అమర్చుకుందా? ఉదయం ఖాళీ సమయంలో ఆమె ఏం చేసేది – చదువుకునేదా, కుట్లు అల్లికలు, ఉత్తరాలు రాయడం, తిరిగి జవాబివ్వడం వంటి వ్యవహారాలు చక్కదిద్దుకునేదా? డబ్బు విషయంలో ఆమె ఏ విధంగా వ్యవహరించేది? ఏబ్రహాం ఆమెకి చేతి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేవాడా? ఆమెకంటూ స్వంతానికి డబ్బు ఉండేదా? ఏబ్రహాం పొదుపరి కాబట్టి, ఆమె కూడా అతని లాగనే పొదుపుగా ఉండేదా, విరివిగా ఖర్చుపెట్టేదా? చుట్టాలు, స్నేహితులని భోజనానికి పిలిచేదా? చివర్లో ఆమెని పిసినారిగా పేరు పొందింది – పిసినిగొట్టుతనం ఆమెకి ఏబ్రహాం నుంచే వచ్చిందా? గ్లోబ్ హోటల్లో వారి భోజనాల గది ఎక్కడుండేది? ఏబ్రహాం అందరితో కలిపి తినడానికి ఉత్సాహం చూపేవాడా, లేక ఇద్దరూ ఏకాంతంగా భోజనం చేసేవారా? లింకన్లకి పక్క గదుల్లో ఎవరుండేవారు? మనకి బ్లెడ్‌సో గురించి తెలుసు – ఆమె ఏ పియానో ఉపయోగించేది, ఏ పాటలు వాయించేది? మేరీని కూడా వాయించమని ఎప్పుడైనా ఆహ్వానించేదా?

చివరి రెండు అధ్యాయాలు రాయడానికి తయారవుతూ, నాకు నేను క్రమశిక్షణతో విధించుకున్న నియామావళి:

చెప్పేదానిని సరళంగా చెప్పాలి. కథని సాగదీయవద్దు. కథకి ఆయువుపట్టయిన సన్నివేశాలు మాత్రమే ఉండాలి – కథ వేగంగా, వడిగా సాగిపోవాలి. మొత్తం తిరుగుబాటునంతా మనం పనిగట్టుకుని పోరాడనక్కరలేదు, వైట్‌ హౌస్‌కి సంబంధించినంతవరకే అది కథకి అవసరం. అనవసరపు భేషజాలు, అభిప్రాయాలు, నిందాపూర్వక ధోరణి ఉండకూడదు. పాఠకులలో పగ, జాలి, కరుణలు రెచ్చగొట్టకూడదు. ఆవేశకావేషాలు లోతట్టుగానే ఉండాలి. రచయితని అవతలకి నెట్టి, కథ తనంతట తానుగా చెప్పుకోనివ్వాలి.

ఏదో ఒక నవల కోసం కాకుండా, జీవిత కథాప్రక్రియకి సాధారణంగా వర్తించే కొన్ని సూత్రాలు నేనిలా వ్రాసుకున్నాను:

తర్వాత ఎక్కడో అవసరమని కథలో ప్రతి వివరం ముందే ఇవ్వకూడదు. కథకి అక్కరలేని వ్యక్తుల, ప్రదేశాల, సంఘటనల ప్రస్థావన అనవసరం. డాంబికం, ఆడంబరం, ముందెప్పుడో ఏర్పరుకున్న పక్షపాతం, దురభిమానం; చరిత్రనంతా మనకి అనువైన సిద్ధాంతంలోకి నెట్టేసే వృథా ప్రయాస; ఆలోచనని అణగదొక్కే భావోద్వేగాలు – పాఠకుల అభిప్రాయాలు, అభిరుచులు, ఊహలు, విజ్ఞత గురించిన అంచనాలు; ఏ ఒక్క వర్గం కోసమో, ఒక వయసువారి కోసమో, ఒక ప్రదేశంవారి కోసమో రాయడం; వ్యక్తులని, సంఘటలని దుయ్యబట్టటం; తాత్వికధోరణి, ఉద్రేకం; ముఖ్యమైన ఆధారాలని దాచడం; లేదా మసిబూసి మారేడుకాయ చేసి పాఠకుడిని తప్పుదారి పట్టించడం; అర్థంలేని సాగతీతలు, మితిమీరిన కోపోద్రేకాల వర్ణనలు; ఇవి జీవిత నవలా రచయితగా చూపకూడని లక్షణాలు.

కథలో వ్యక్తులకి వారికి దక్కవలసిన సముచిత స్థానం వారికివ్వాలి, తీర్పు భగవంతుడికి వదిలెయ్యాలి; బాగా తెలిసిన విషయాలకి అధిక ప్రాధాన్యతనిచ్చి, అంతగా తెలియని విషయాలని నీరుగార్చి కథలో సమతౌల్యతని దెబ్బతీసే ధోరణి ప్రయత్నపూర్వకంగా అధిగమించాలి. పాండిత్యం ప్రకటించుకోడానికి తప్ప మరి దేనికీ పనికిరాని విషయసామగ్రి ఆవగింజంత కూడా అనవసరం. వేరేవారి పక్షపాత ధోరణులకి కొమ్ముకాయడం, ఒక వాదాన్నో, ఇజాన్నో, ఒక సిద్ధాంతాన్నో, ఎజండానో సమర్ధించడానికి చేసే ప్రయత్నాలు కూడవు. కృత్రిమమైన కొత్తపోకడలు, నిరాశావాదం, విధ్వంసం, డొంకతిరుగుడు వాదనలు పాఠకుడిని తప్పుదోవ పట్టిస్తాయి. బాగుంది కదా అనో, భావుకత్వం ఉంది కదా అనో కథ దారి మళ్ళించే సన్నివేశాలు అనవసరం.

జీవిత నవల శైశవదశలోనే ఉండటం మూలాన, దాని స్వరూప స్వభావాలపై, పరిమితులపై, శక్తి సామర్థ్యాలపై ఇంకా పూర్తి అవగాహన లేదు. అందుకని ఈ విషయాలపై పూర్తి స్థాయి చర్చ జరగవలసి ఉంది. అది నవలా? చరిత్రా? జీవిత చరిత్రా? పై మూడింటిలో అన్నీనా? లేక ఏదీ కాదా? ఇటువంటి విషయాలపై నిర్ణయాత్మకమైన, శాస్త్రీయమైన విమర్శకి మార్గం సుగమం చెయ్యడానికి తెర తీసే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాసం నేను రాస్తున్నాను. నా తరువాతి విమర్శకులు, రచయితలు ఈ వ్యాసంలో ప్రతిపాదించిన వాదనలకి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారనే నమ్మకం నన్ను ఈ మొదటి అడుగు వేయించింది. “గత దశాబ్దంలో ఎంతోమంది ప్రముఖులు జీవిత నవలకు ఉదాత్తత, గంభీరత ఆపాదించే ప్రయత్నాలు చేసినప్పటికీ, అనాచ్ఛాదిత అయిన జాణ లాగానే ఇప్పటికీ అది ఎంచబడుతోంది. అందువల్ల జీవిత నవలా ప్రక్రియలో ఇప్పటిదాకా వచ్చిన అభివృద్ధి సరిపోదు. ఈ ప్రక్రియ ఎంత శక్తివంతమో, ప్రభావితమో విమర్శకులు ఇంకా పూర్తిగా గుర్తించలేదు” అని మేరీలాండ్ యూనివర్శిటీ ఆచార్యుడు కార్ల్ బోడే (Karl Bode), కాలేజ్ ఇంగ్లీష్ అనే పత్రికకి రాసిన వ్యాసంలో అభిప్రాయపడతాడు.

బోడే ప్రస్తావించిన వగలమారి పోకడలు, బహుశా ఫరెవర్ ఆంబర్ (Forever Amber), కిట్టీ వంటి నాసిరకం రచనల గురించి అయ్యుండాలి. ఎందుకంటే, ఇటువంటి నవలల రచయితలు ఎన్నో చోట్ల నుంచి సంగ్రహించిన కల్లిబొల్లి కబుర్లతో, విపరీత వ్యాఖ్యానాలతో, కాల్పనికతతో విచ్చలవిడిగా చరిత్రను కలిపివేయడం కారణం. జీవిత నవలా రచయితగా తమకు లేని స్వేచ్ఛను తీసుకోవడం కారణం. జీవిత నవల రచయితకి కాల్పనిక రచయితకి ఉన్న స్వేచ్ఛ ఉండదు, ఎందుకంటే అతను ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని చిత్రించదలచుకున్నాడో, ఆ వ్యక్తి జీవిత వాస్తవాల పరిధికి కట్టుబడి ఉండాలి. అందుకని, ఇటువంటి నవలలని గత్రీ (W. R. Guthrie) లేదా పెన్ వారెన్‌లు (Robert Penn Warren) చారిత్రక నవలలుగా పరిగణించరు, అదే కారణాల చేత నేను కూడా వాటిని జీవిత నవలలుగా అంగీకరించను.

నా ఉద్దేశంలో అసలు సమస్య విశృంఖలత్వం కంటే కూడా రచయితల మర్యాద, సంస్కారాల భారం అని. బహుశా తమ నవలలోని పాత్ర్రలు ఒకప్పుడు వాస్తవంగా జీవించిన వ్యక్తులు కాబట్టి, వారి ఆంతరింగిక వ్యవహారాలని బైటపెట్టడం మర్యాద కాదనే సంకోచం వల్ల నిజాన్ని చెప్పడంలో, వెలికితీయడంలో రచయితలు వెనకాడవచ్చు. ఉదాహరణకి తమ పాత్రల లైంగిక జీవితం గురించిన వివరాలు. ఎంతో ముఖ్యమైన ఇలాంటి విషయాలు వెల్లడి చేయడంలో రచయిత ఎంతో సున్నితంగానూ, చాకచక్యంగానూ అదేసమయంలో నిజాయితీగానూ మసలుకోగలగాలి.

కొంచెం స్వాతంత్ర్యంతో, ప్రొఫెసర్ బోడే నా నవలలపై తన వ్యాసంలో రాసిన విశ్లేషణని ఇక్కడ యథాతథంగా ప్రస్తావిస్తాను. ఆయన విశ్లేషణలో నాకు జీవితనవల ప్రాథమిక నమూనా లభించింది. విన్సెంట్‌ వాన్ గో నవల తర్వాత వచ్చిన నవలలపై బోడే విశ్లేషణ ఇది:

“వ్రాసే ప్రతీ నవల శైలిలో మరింత మెరుగు పడింది. అధ్యయనపు లోతులు కూడా పెరిగాయి. స్టోన్ రాసిన మేరీ టాడ్ లింకన్ నవలతో ఈనాటి జీవిత నవల ఒక ఉచ్ఛస్థితికి చేరుకుందని చెప్పవచ్చు. ఈ నవల శాస్త్రీయమైన జీవిత చరిత్రలకి కూలంకషమైన పరిశోధనలో ఏమాత్రం తీసిపోదని లింకన్ల చరిత్రని లోతుగా అధ్యయనం చేసిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. స్టోన్ ఈ నవలలో ప్రదర్శించిన సమగ్ర శాస్త్రీయ దృష్టికి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. ఉదాహరణకి, లింకన్ల కాలం నాటికి వైట్‌హౌస్ ఎలా ఉండేదో ఖచ్చితమైన నమూనాని ఎంతో శ్రమకోర్చి స్టోన్ పునర్నిర్మించాడు. ఈ ఒక్క అంశమే స్వతంత్రమైన పరిశోధనగా నిలబడగలది. అంతే కాకుండా, నవలలోని సంభాషణలన్నీ కూడా చారిత్రకంగా వాస్తవమైన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే రాశాడు. మేరీ వివాదాస్పదమైన వ్యక్తి, అటువంటి వ్యక్తిని స్టోన్ తన చిత్తం వచ్చిన రీతిలో చిత్రించవచ్చు. పైగా, ఆయన మేరీకి న్యాయం చేస్తాననే సంకల్పంతో నవల మొదలుపెట్టాడు. తను సంకల్పించిన ధ్యేయానికి కూడా అతీతంగా మేరీ సంక్లిష్ట మానసిక స్థితిని ఆయన ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా, నిజమైన కథగా మలిచాడు. మేరీ, ఏబ్రహాంలలో ఒకరు గొప్పవారైతే కావొచ్చు గాక, కానీ ఈ నవలలో వారిద్దరూ మరుపురాని మనుషులుగా మనకి చిరకాలం గుర్తుండిపోతారు. ఇక నవలలో చిన్న పాత్రలపై కూడా రచయిత చూపిన శ్రద్ధ వలన, వారిని నిరర్థకమైన చారిత్రక సమాచారంగా మనం విస్మరించలేం. నవలలోని సన్నివేశాల పూర్వరంగం మనకి తెలిసినప్పటికీ, కథనం ఉత్కంఠభరితంగా సాగింది. స్టోన్ వర్ణన కథకు రంగులద్దింది… పై పైన కనిపించే వాస్తవాలని చీల్చుకుంటూ లోపల దాగిన సత్యపు అసలు రంగు చూపించటం నవలాకారుడు, చరిత్రకారుడికంటే ప్రతిభావంతంగా చెయ్యగలడు. అటువంటి లక్ష్యం చాలా గొప్పది.”

హార్వర్డ్ విశ్వవిద్యాలయపు చరిత్ర అధ్యాపకుడు సామ్యుయెల్ మోరిసన్ (Samuel Morrison) తన హిస్టరీ యాజ్ ఎ లిటరరీ ఆర్ట్ వ్యాసంలో అన్న మాటలు జీవిత నవలా రచయితలందరూ గుర్తుంచుకోదగ్గవి. “చరిత్రకారులు నవలా రచయితల దగ్గరనుంచీ నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక సాధారణ పాఠకుడు చరిత్రని తెలుసుకోవడానికి ఏ కెన్నెత్ రాబర్ట్ నవలనో, మార్గరెట్ మిచెల్ నవలనో దొరకబుచ్చుకుంటాడు గాని, ఫలానా చారిత్రకుడు ఏం రాశాడు, ఫలానా పండితుడు ఏమన్నాడు అని వెతకడు కదా? ఎందుకని అని ప్రశ్నించుకుంటే, సమాధానం అమెరికన్ చరిత్రకారులు చరిత్ర రచన అనే కళని పూర్తిగా మరిచిపోయారని చెప్పుకోక తప్పదు. ఎప్పుడైతే చరిత్ర సాహిత్యం నుంచి వేరుపడిందో, అప్పుడే సామాన్యపాఠకుడు దూరమయాడు. అందుకని అమెరికన్ చరిత్ర చదవడానికి విసుగు పుట్టించే, ఒక మింగుడుపడని కషాయంగా మిగిలిపోయింది.” ఈ దుస్థితిని చక్కదిద్దే బాధ్యత జీవిత నవలది.

జీవిత చరిత్రకి, జీవిత నవలకి, చారిత్రక నవలకి, కాల్పనిక నవలకి మధ్య తేడాలని స్పష్టపరచడం కూడా ఇక్కడ చాలా అవసరం.

కొన్నేళ్లక్రితం కీ వెస్టులో హెమ్మింగ్వేని కలిసినప్పుడు, మేమిద్దరం అప్పడు రాస్తున్న నవలల గురించి విపులంగా మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో హెమ్మింగ్వే “కల్పన అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఏ నవలైనా మన జీవితం నుంచో, మనం గమనించిన జీవితాల నుంచో కదా వచ్చేదీ? అని అభిప్రాయపడ్డాడు. అయితే, కాల్పనిక నవలాకారుడికి తన అనుభవాలని తన చిత్తం వచ్చిన రీతిలో అమర్చుకునే సౌలభ్యం ఉంది. పది జీవితాలను రంగరించి ఒక పాత్రని పుట్టించుకోగలడు. తన అవసరం కోసం, తన ఆదర్శం కోసం, ప్రపంచాన్ని ఒక స్వర్గం గానో నరకం గానో మార్చుకోగలడు. తను కల్పించిన పరిస్థితులకి ప్రత్యామ్నాయాలు కూడ అతనే సూచించుకుంటాడు.

కానీ, జీవిత నవలాకారుడు వాస్తవాలకి బందీ అయివుంటాడు. అయినంత మాత్రాన, అతడు వాస్తవాలకి కేవలం వార్తావహుడిగా మిగిలిపోతే కథకుడిగా రాణించలేడు. రాబర్ట్ గ్రేవ్స్ (Robert Graves) అన్నట్టు, “జీవిత నవల రచయితకి తన పాత్ర గురించిన ఊహాజ్ఞానం ఉండాలి. ఆ ఊహలు నిజమని అతను తర్వాత నిర్ధారించుకోగలగాలి. అలా తన పాత్ర తత్వాన్ని సహజంగా అర్థం చేసుకోగల దృష్టి రచయితకు వుండాలి. అంతేగాని, కేవలం పరిశోధనలోంచి కథ పుట్టుకొస్తుందనుకుంటే, ఆ రచయితకి కథపై అవగాహన లేనట్టే”.

ఇవన్నీ విస్తృతమైన పరిధులు. ఈ పరిధులకి కట్టుబడుతూ, జీవిత నవలా రచయిత, తన కల్పనా చాతుర్యాన్ని ప్రద్రర్శిస్తూ, కథని రక్తి కట్టించడానికి ఎంత స్వేచ్ఛగానో తన ఊహాలోకంలో విహరించవచ్చు. శిల్పపరంగా కాల్పనిక నవలకి, జీవితనవలకి తేడాలు పెద్దగా ఉండవు. జీవితనవల చదువుతున్న పాఠకుడు “ఇది నిజంగా జరిగిందా?” అని ప్రశ్నిస్తాడు. అదే కాల్పనిక నవల చదువుతున్న పాఠకుడు “ఈ విధంగా జరిగే అవకాశం ఉందా?” అని ఆలోచిస్తాడు. అటువంటి నమ్మకం పాఠకుడికి కలిగించే గుణం రెంటికి ఒకటే. ఒకవేళ చరిత్ర అసలేమీ తెలియని పాఠకుడు యాదృచ్ఛికంగా ఈ రెండు నవలలు చదివితే, వాటి మధ్య తేడాలని అతను కనిపెట్టలేడు. కాల్పనిక నవల నిజంగా జరిగిందేమో అని, జీవిత నవల చతురమైన కల్పన అని, అతను అబ్బురపడాలి. ఒకరోజు, మా శ్రీమతి వాళ్ళాఫీసులో పనిచేసే టెలిఫోను ఆపరేటరు దగ్గర లస్ట్ ఫర్ లైఫ్ పుస్తకం చూసి, అదెలా ఉందని అడిగిందట. “చాలా బావుంది కానీ, స్టోన్ చివర్లో పాపం హీరోని చంపకుండా ఉంటే బావుండేది” అందట ఆ అమ్మాయి. ఆ మాటలని నేనెంతో సంతోషంతో గుర్తుపెట్టుకున్నాను.

పరిధిలోనూ, స్వభావంలోనూ చారిత్రక నవల జీవిత నవలకు కొంత దగ్గరగా ఉంటుంది. జీవిత నవలలోని పాత్రలన్నీ ఒకప్పుడు ఈ ప్రపంచంలో జీవించిన వ్యక్తులు; గొప్ప చారిత్రకనవలలో కూడా, అంటే వార్ అండ్ పీస్ వంటి వాటిల్లో కూడా, చరిత్ర మాత్రం సత్యం, పాత్రలన్నీ కల్పితం. వాటిల్లోని పాత్రలు ఎందరెందరో వ్యక్తుల నమూనాలోంచి వచ్చినవి, అవి ఆనాటి చారిత్రక శక్తులకి, పరిస్థితులకి ప్రతీకలు. అంటువంటి వ్యక్తులు నిజంగా ఉండేవారు, నవలలోని ప్రధాన పాత్రలు ఎలాగైతే చరిత్రని ప్రభావితం చేశాయో, అలాగే వారూ నిజజీవితంలో చరిత్రని శాసించారు – అంతవరకే. అయితే, ఒక్కోసారి చారిత్రక నవల జీవిత నవలకి మరీ దగ్గరగా వస్తుంది – హ్యూయీ లాంగ్ (Huey Long of Louisiana) జీవితం నేపథ్యంగా రాబర్ట్ పెన్ వారెన్ రాసిన ఆల్ ది కింగ్స్ మెన్ (All the king’s men) నవలలో పాత్రల పేర్లు, కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్పించి అంతా వాస్తవమైన వ్యక్తుల జీవితాలే. అలానే హెచ్.జీ. వెల్స్ (H.G.Wells) రాసిన ది వర్‌ల్డ్ ఆఫ్ విలియం క్లిసోడ్ (The world of William Clissold) నవలలో, క్లిసోడ్, అతని ప్రేమికులు కల్పిత పాత్రలైతే, కథలోని ముఖ్యపాత్రలన్నీ వారి నిజజీవితపు పేర్లతోనే వ్యవహరించబడ్డారు. వారు నిజజీవితంలో ఏ పాత్ర్రలు పోషించారో నవలలోనూ అదే పాత్రని పోషించారు. ఇక, మరో తరహా చారిత్రక నవలల్లో సగం పాత్రలు చారిత్రక వ్యక్తులైతే, మరికొన్ని పాత్రలు ముఖ్యంగా, కథా నాయికా నాయకులు కల్పిత పాత్రలైయుంటారు.

జీవిత నవలలో చారిత్రక నేపథ్యమే కాకుండా, వ్యక్తులు కూడా నిజజీవితంలోని వారే కదా? అటువంటప్పుడు జీవిత నవలకన్నా చారిత్రక నవల ఎందుకు ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది? ఇది నాకిప్పటివరకూ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇకపోతే, శాస్త్రీయమైన జీవిత చరిత్రకి, జీవిత నవలకి వ్యత్యాసం చాలా ఉంది. రెంటికీ వస్తుదాత చరిత్రే అయినా, శిల్పం, రూపం, దృక్పథం, వ్యక్తిత్వం, రచయితకీ పాఠకుడికీ ఉన్న సంబంధంలో ఈ రెండు ఉత్తర దక్షిణ దృవాల వంటివి.

స్వాభావికంగా, జీవిత చరిత్ర ఒక ప్రసంగం లాంటిది. ఒక వ్యక్తి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసిన రచయిత, తన సొంత గొంతుతో పాఠకుడనే మూడో వ్యక్తికి చెప్పే ఉపన్యాసం అది. కానీ జీవిత నవలా రచయిత పాఠకుడిని పాత్రల మధ్యకి తీసుకొని పోతాడు. పాత్రల సంభాషణలని పాఠకుడు తన చెవులతో తానే స్వయంగా వింటాడు. అందుకే, తన ప్రధాన పాత్రల ప్రేరణలని రచయిత అవగాహన చేసుకోవడంతో జీవిత నవల రచయిత కర్తవ్యం అయిపోదు, వారి మనసుతో అతను ఆ ప్రేరణలకి స్పందించాలి. అప్పుడే, పాఠకుడు కూడా కథానాయకుడు లోనైన అనుభూతికి లోనవుతాడు. అతని విజయాలని ఆస్వాదిస్తాడు, అతని ఓటమికి కన్నీరు కారుస్తాడు. ఆ రకంగా నిరాపేక్షత జీవిత చరిత్ర లక్ష్యమైతే, అనుభూతితో తడిసి మెరిసిన సత్యత జీవిత నవలకి ఆత్మ.

ఇప్పుడిప్పుడే జీవిత నవల ప్రభావంతో జీవిత చరిత్రలు రాసే పద్ధతిలో మార్పులు వస్తున్నాయి. నేను చదువుకునే రోజుల్లో జీవిత చరిత్రలో ప్రతి పేజీ లోనూ పాదపీఠికలు ఉండేవి, ఏవైనా సంభాషణలు పాఠంలో భాగంగా ఉంటే, వాటిని ప్రత్యేకంగా చిన్న అక్షరాలతో కుదించి అచ్చువేసేవారు. 1937లో, సెయిలర్ ఆన్ ది హార్స్ బాక్ (Sailor on the horse back) రాసినప్పుడు, నేను జాక్ లండన్ (Jack London) మాటలు యథాతథంగా వాడి, కొటేషన్లలో పెట్టి, పాఠంలో భాగంగా ఉంచి అచ్చుకి పంపాను. ప్రెస్సులో, కంపోజర్ అప్పటి సంప్రదాయాన్ని అనుసరించి, సంభాషణలని చిన్న అచ్చులోకి మార్చేశాడు. నాకు నచ్చలేదు. అప్పుడు, ఆ పుస్తకం ప్రధాన సంపాదకుడు, నేనూ, కంపోజరుతో చాలా వాదించి అతన్ని ఒప్పించవలసి వచ్చింది. అప్పటినుండీ, అదే అనవాయతీగా మారింది.

మొన్నమొన్నటివరకూ, జీవిత చరిత్రలలో సంభాషణలు ఉండేవి కావు. ఒకవేళ, ఏదైనా సంభాషణకి చారిత్రకంగా, అక్షరబద్ధమైన సాక్ష్యాధారాలు ఉన్నా వాటిని ఉపయోగించేవారు కాదు. వాటిని పాఠంగా మార్చి రాసేవారు. అలా లేకుంటే, పాఠకుడు మొత్తం రచననే కథో, కల్పితమో అనుకునే ప్రమాదం ఉందని పండితుల అభిప్రాయం. అయితే, ఈ ధోరణి నాకు సమంజసంగా అనిపించదు. 1940లో నేను క్లారెన్స్ డారో ఫర్ ది డిఫెన్స్ (Clarence Darrow For the Defense) రాసినప్పుడు సంభాషణలు యధాతథంగా రాసి, పుస్తకం చివర్లో వాటికి ఆధారాలు ప్రచురించాను. ఉత్తమ పురుషలో రాసిన సంభాషణల వల్ల చరిత్ర పాఠకుడిపై ప్రగాఢమైన ముద్ర వెయ్యగలిగిందని నా అభిప్రాయం.

మా చిన్నతనంలో ఎవరో పండితులు తప్పించి జీవిత చరిత్రలు ఎవరూ చదివేవారు కాదు. ఈ విధంగా జీవిత చరిత్రల వైఫల్యం, జీవిత నవల ప్రాచుర్యంలోకి రావడానికొక కారణమేమో. అందుకే, జీవిత చరిత్ర రచన జీవిత నవలా ప్రక్రియనుండి కొత్త పాఠాలు నేర్చుకుంటుందని నేననుకుంటున్నాను. పుస్తకం సమాచార వ్యవస్థకి పందిరిరాట వంటిది. చదివించుకోలేని, చదవలేని పుస్తకాలు రాయడం వల్ల ఏం ప్రయోజనమో నాకు అర్థం కాదు. అయితే శాస్త్రీయ పరిశోధనా పద్ధతులు, చారిత్రక సమాచారాన్ని క్రోడీకరించుకునే మెలకువలు నేరిపినందుకు జీవిత నవల, జీవిత చరిత్ర ప్రక్రియకి సదా కృతజ్ఞరాలై ఉంటుంది.

చైతన్యమూర్తులన్నిటి లాగనే, జీవిత నవల కూడా సంఘర్షణ లోంచే పుట్టింది. అయినప్పటికీ, జీవిత చరిత్ర, నవల అనే రెండు ఉదాత్తమైన తల్లితండ్రులకి పుట్టిన అక్రమ సంతానంగా అది అపవాదులు మొయ్యటంలేదూ? ఇటు నవల, అటు జీవిత చరిత్ర, రెండింటి పరువూ తీసిందని, వాటిని భ్రష్టు పట్టించిందని, వాటికి గౌరవభంగం కలిగించిందనీ, జీవిత చరిత్రకున్న నమ్మశక్యమైన పరిశోధనా ప్రాతిపదిక దీనికి లేదనీ, రచయిత వ్యక్తిత్వ దోషాలతో చరిత్ర కలుషతమై పోతుందనీ, కథారూపంలోకి మార్చే క్రమంలో చరిత్ర స్వభావం మారిపోతుందనీ, వాస్తవమేదో, కల్పనేదో తెలుసుకోలేని సందిగ్దంలోకి పాఠకుడిని నెడుతుందనీ, చెల్లుబాటయ్యే విషయాలనే ఎంచుకొని, చరిత్రకి అన్యాయం చేస్తుందనీ, ఎప్పుడో మరణించిన వ్యక్తుల ఆంతరింగిక జీవితాలని ఎవరి అనుమతి లేకుండా బహిర్గతం చేస్తుందనీ, శిల్పం కోసం పాత్రలని వంచిస్తుందనీ జీవిత నవలపై ఘాటైన విమర్శలే ఉన్నాయి.

ఈ విమర్శలలో అంతో ఇంతో నిజం లేకపోలేదు. ఇవే కాకుండా, మరెన్నో లోపాలు ఇంకా విమర్శకుల కళ్లబడలేదేమో! అయితే, కొన్ని దోషాల కారణంగా ఒక సాహిత్య ప్రక్రియని బహిష్కరించడం, మనిషిలోని బలహీనతల కారణంచేత మొత్తం మానవాళినే అంతమెందించాలనే అర్థం లేని ఆలోచన వంటిదే. గడిచిన పాతికేళ్లలో ఈ ధోరణిలో మౌలికమైన మార్పు వచ్చిందనే నా స్వానుభవం. జీవిత నవల ఒక సాహిత్య ప్రక్రియగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని, గౌరవాన్ని సంపాదించుకుందని విమర్శకులు గుర్తించారు. ముందుచూపు వున్న విమర్శకులు ఇప్పుడు సాహిత్య పరిషత్తులలో జీవిత నవలకి కూడా భాగం కల్పిస్తున్నారు. అదే విశాలదృక్పథంతో, ప్రతీ జీవిత నవల అత్యున్నతమైన ప్రమాణాలని అందుకోవాలని పట్టుదలగా కోరుతున్నారు కూడా. ఒక సాహిత్య ప్రక్రియని ఏకమొత్తంగా నిరాకరించే ధోరణిని మాని, ప్రతి రచనని దాని శైలి, దానివెనకున్న పరిశోధనలోని పటిష్టత, కథన చాతుర్యం మొదలైన ప్రాతపదికల ఆధారంగా బేరీజు వేస్తున్నారు. ఇవన్నీ హర్షించదగ్గ పరిణామాలు.

అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని మనుగడ సాధించడం మానవాళికి ప్రత్యేకమయిన గొప్ప లక్షణం. చరిత్ర, జీవిత చరిత్ర, రెండూ కూడా నిరంతరంగా పెరిగే ఈ అనుభవాల పాఠాలే. ఆధునిక ప్రపంచంలోని సమస్యలకి, సంఘర్షణలకి ఆ అనుభవసారంలోని జ్ఙానదీపికని అందించాలనేదే జీవిత నవలా కారుడు కనే అందమైన కల.

ఏ భేషజము లేకుండా మనుషుల జీవితాల్లో చిన్న విషయాలకే లోతుగా, నిజాయితీగా స్పందించడం, కష్టాలతో, సమస్యలతో కొంతమంది వ్యక్తుల మొక్కవోని పోరాటాన్నే కథలుగా తోటి పాఠకులతో పంచుకోవాలనే తపన – ఈ రెండే నా నవలలన్నిటికీ ప్రేరణలు.
-----------------------------------------------------------
రచన: నాగరాజు పప్పు,
మూలం: ఇర్వింగ్ స్టోన్,
(ఆంగ్ల మూలం: The biographical Novel.)
ఈమాట సౌజన్యంతో

Saturday, March 30, 2019

కాళోజీ కవిత్వంలో మనిషి


కాళోజీ కవిత్వంలో మనిషి




సాహితీమిత్రులారా!

సమాజానికి, సాహిత్యానికి కేంద్ర బిందువు మనిషి. సమాజం, సాహిత్యం మనిషి కోసం మనిషి సృష్టించినవి. మనిషికి మనిషికి మధ్య వైరుధ్యాలను పరిష్కరించే క్రమంలో రూపొందే నిర్మాణాలు, భావజాలం వాటిని నానాటికి ఉన్నతీకరిస్తుంటాయి. మనిషి తను ఎవరినన్న జిజ్ఞాసతో తనను తాను తెలుసుకొనటానికి, తనను తాను నిర్వచించు కొనటానికి చేసే నిరంతర అన్వేషణ ఫలితమే తత్త్వశాస్త్రం. అది సమాజానికి,సాహిత్యానికి కూడా చోదక శక్తి. అందువల్ల మనిషి తనను తాను గుర్తుంచుకొని, తనను తాను నిర్వచించుకొనే క్రమంలో ఆ అనుభవాన్ని నలుగురి తోనూ పంచుకొనటానికి కవి కావటం జరుగుతుంది. కవి అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అని చలం చెప్పిన మాటలు ఈ సందర్భంలో గుర్తు చేసుకోదగినవి. ఈ నేపధ్యంలో కవి కాళోజీ మనిషిగా మనిషి గురించి పడిన తపన ఆయన కవిత్వంలో ప్రతిఫలించిన తీరు తెలుసుకొనటం ఆసక్తికరంగా ఉంటుంది.

ఆధునిక కాలంలో మనిషి కేంద్రంగా అభివృద్ధి చెందిన తత్త్వశాస్త్రం అస్తిత్వవాదం (Existentialism). మనిషికి సర్వ స్వతంత్రత, స్వేచ్ఛానువర్తన, స్వయం సంపూర్ణత సహజం అని, మనిషి అస్తిత్వం ఒక్కటే ఉన్నతమయిన వాస్తవం అని, ప్రపంచం వైపు చూడటం, దాని గురించి ఆలోచించటం, వ్యక్తిగా ప్రతిస్పందించటం, ప్రవర్తించటం — ఆ క్రమంలో తన స్వభావాన్ని నిర్వచించుకొంటూ మనిషిగా రూపొందటం నిరంతరం జరుగుతూనే ఉంటుందని అస్తిత్వవాదం చెప్తుంది. ఈ సిద్ధాంత ప్రకారం భగవంతుడి పేరు మీదనో, సంఘం పేరు మీదనో, మతం పేరు మీదనో మనిషిని శాసించటం, నిర్దేశించటం కుదరదు. ప్రతి మనిషి తన జీవిత సూత్రాలను, విలువలను తానే సృజించుకొని, వాటి ప్రకారం జీవిస్తూ తనకు తానే బాధ్యత వహించటం జరుగుతుంది. ఆ రకంగా మనిషి తన జీవితానికి తానే కర్త, తన జీవిత పరమార్ధ నిర్ణేత. మనిషి గురింఛి 1940-1960ల మధ్యకాలంలో అభివృద్ధి చెందిన ఈవిధమయిన భావజాల ప్రభావానికి ప్రత్యక్షం గానో పరోక్షం గానో లోనయిన బుద్ధి జీవులలో కాళోజీ కూడా ఒకడు. అస్తిత్వ చేతన మూర్తీభవించిన కాళోజీ వ్యక్తిత్వానికి నిలువుటద్దం ఆయన కవిత్వం.

1914 సెప్టెంబర్ 9న పుట్టి హైస్కూల్ చదువుల నాటి నుండే అధికారంపై ఆగ్రహ ప్రకటన ఒక ప్రజాస్వామిక చర్యగా చేపట్టి, అటు నిజాం ప్రభుత్వ పాలనను, ఇటు బ్రిటిష్ వలస పాలనను ఆనాడు ఎంతగా నిరసించాడో, స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ అధికార రాజకీయాలను అంతగా విమర్శకు పెట్టాడు. ప్రజాస్వామ్య మనుగడకు ప్రధాన షరతు అయిన పౌర చైతన్యం గురించి, పౌరుల పట్ల పాలకవర్గపు బాధ్యత గురించి తపన పడి కవిత్వం రాశాడు. 1953లో ఆయన మొదటి కవిత సంకలనం నా గొడవ అచ్చు అయింది. యాభయ్ ఏళ్ల కాలం మీద ఆయన రాసి అచ్చు వేసిన కవిత్వమంతా నా గొడవ అన్న పేరు తోనే వచ్చింది. గొడవ ప్రపంచానిది. దానిని తనదిగా చేసుకొన్నాడు. అలా చేసుకోనటం లోనే ప్రజాకవి అయినాడు. ‘నా’ అనటంలో అస్తిత్వ చేతన మేల్కొన్న లక్షణం ఉన్నది. ఆ అస్తిత్వ చైతన్యం కాళోజీ కవిత్వంలో మనిషిని నిర్వచించటంలో, నిలబెట్టటంలో, మనిషి పక్షాన నిలబడటంలో కూడా కనిపిస్తుంది.

“జరిగిందంతా చూస్తూ
ఎరగనట్లు పడి ఉండగ
సాక్షీ భూతుణ్ణి గాను
సాక్షాత్తూ మానవుణ్ణి”

అని మానవుణ్ణి అన్న చిన్న కవితలో తనను తాను నిర్వచించుకున్నాడు కాళోజీ. సూర్యుడిని సర్వసాక్షి అంటారు. సూర్యుడు అన్నిటినీ చూస్తాడు. కానీ దేని పైనా తన అభిప్రాయం చెప్పలేడు. పంచభూతాల సాక్షిగా, దేవుని సాక్షిగా, అనే పదప్రయోగాలు ఉన్నాయి. కానీ అవసరానికి నోరు విప్పి సత్యం చెప్పగలవి కావు. అందుకే రావిశాస్త్రి వాటికి సంబంధించిన అసలు వాస్తవాన్ని కోర్టుకు రాని సాక్షులు అనే కధలో బయట పెట్టాడు. అవసరానికి రాలేని, మాట్లాడలేని శక్తులకు ఎంత తెలిసినా తెలియనట్లే అన్నది కాళోజీ అభిప్రాయం. ఉపయోగానికి రాని చదువుల వలె ఉపయోగానికి రాని ఎరుక కూడా వృధానే. ఎరగనట్లు పడి ఉండగ / సాక్షీభూతుణ్ణి కాను అని చెప్పటం ద్వారా సూర్యుని ఆధిక్యతను తగ్గించి సాక్షాత్తు మానవుణ్ణి అని మానవుని ఆధిక్యతను అంతిమ తీర్పుగా ప్రకటించాడు. మానవులంటే ప్రపంచాన్ని చూస్తూ మౌనంగా ఉండేవాళ్ళు కాదు, ఆలోచిస్తూ, ప్రతిస్పందిస్తూ అవసరము, ఔచిత్యము అయిన చర్యకు దిగేవాళ్ళు అన్నది కాళోజీ భావన. ఈ క్రమంలో కాళోజీ దేవుని ఉనికిని కూడా నిరాకరించటానికి సందేహించలేదు. ఉన్నది కేవలం మానవుడు అని ప్రకటిస్తూ ఆయన ఒక కవిత రాశాడు.

“దేవ దానవుల హయాము లో
శిష్ట రక్షణ దుష్ట సంహారం చేయ
అవతారాలెత్తి యెత్తి
విసుగెత్తిన దేవుడు
మానవుణ్ణి సృష్టించి ఉంటాడు”

అన్న ఎత్తుగడతో ప్రారంభించిన కవితలో కాళోజీ దాని పరిణామం దేవతలు రాక్షసులు మాయం కావటమూ శిష్ట, దుష్ట అనే నిర్దిష్ట రూపాలు నశించటమూ అంటాడు. మనిషి లోనే శిష్ట దుష్ట లక్షణాలు భాగమయి ఉంటాయి. మనుషులను మంచివాళ్లనో చెడ్డవాళ్లనో విడదీసి చెప్పలేము. వాళ్ళ వాళ్ళ చర్యలను బట్టి ఆ నిర్దిష్ట సందర్భం నుండి వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అవుతుంటారు. ఈ అస్తిత్వ భావనను పలికించటంతో పాటు ఈ కవిత దేవుడి అవసరాన్ని కూడా నిరాకరించింది.

“దేవుడు, దేవతలు, రాక్షసులు ఎవరూ లేరు
ఉన్నది కేవలం మానవుడు –
వాడే అంతాను”

అని మానవుడి అస్తిత్వం ఒక్కటే సత్యమని నిర్ధారిస్తూ తన కవితను ముగించాడు.

మనిషిలో మంచి చెడులు అనే వైరుధ్యాలు అవిభాజ్యంగా ఉంటాయని, మంచి చెడులు అని ఒకరనుకునేవి నిరపేక్షమైనవి కావని చాలా సరళంగా, సున్నితంగా, చమత్కారంగా మనిషి అనే కవితలో చెప్పాడు కాళోజీ.

“మనిషి ఎంత మంచివాడు!
చనిపోయిన వాని చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు”

ఇది కవితలో మొదటి భాగం.

“మనిషి ఎంత చెడ్డవాడు!
బ్రతికి ఉన్నవాని మంచి
గుర్తించడు కాని వాని
చెడును వెతికి కెలుకుతాడు”

అన్న నాలుగు పంక్తుల రెండవ భాగంతో కవిత ముగుస్తుంది. చెడును మరవటం, మంచిని తలవటం – ఒకరి విషయంలో; మంచి గుర్తించక పోవటం, చెడును వెతికి కెలకటం – మరొకరి విషయంలో; ఎందుకు జరుగుతున్నది? ఎలా జరుగుతున్నది? అన్నది ప్రశ్న. వీటిల్లో ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించి చెప్పే ప్రమాణాలు ఎవరు రూపొందించారు అన్న విచికిత్స లేకుండానే మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చే మనిషి గురించిన దిగులు కాళోజీది. అందులోనుండి పుట్టిన వేళాకోళం ఈ కవితను దీప్తిమంతం చేసింది.

మనిషి అస్తిత్వానికి భంగకరంగా మనిషికి మనిషికి మధ్య, మనిషికి సమాజానికి మధ్య ప్రబలమవుతున్న పరిస్థితులపై కాళోజీ కవితలు విమర్శను సంధించాయి. మనిషికి స్వీయ అస్తిత్వ చేతన ఎంత సహజ హక్కో తోటి మనిషి అస్తిత్వాన్ని గుర్తించటం, గౌరవించటం అంత సహజమైన బాధ్యత. ఆ బాధ్యత మరచిన పౌరుల పట్ల కాళోజీకి అసహనం. ఎవనికి వాడే కవిత ఆ అసహనం నుండే పుట్టింది. ఎవనికి వాడుగా, ఎవని గొడవ వానిదిగా మనిషి మనుగడ సాగటం కాళోజీకి కష్టమైన విషయం. అందరి గొడవను తన గొడవగా చేసుకొన్న కాళోజీకి అది సహజమే. అందుకే ఎవని గొడవ వాళ్ళదిగా కుంచించుకు పోవద్దని చెప్పాలన్న తపనతో వినేవాళ్ళ కొరకు వెతుకులాట ఈ కవితలో కనపడుతుంది.

సమూహంగా జీవించటం సౌకర్యవంతంగా, సౌఖ్యంగా ఉంటుందని మనుషులు సమాజాన్ని నిర్మించుకున్నారు. మనుషుల ఇచ్ఛ శక్తిగా మారి మనుషులనే శాసించటం అసలు విషాదం. “మనుజుల చేతనే మనెడు ప్రపంచము / మానవునే మననీదు ప్రపంచము” అని కాళోజీ ప్రపంచము (1942)కవితలో చెప్పినది అదే.

“శాస్త్రకార్లు శాసనకర్తలు / జనులకు తాళీ కట్టని భర్తలు“(ద్వైత జగత్తు) అని చెప్పటంలో కూడా గతాను గతికమయిన నీతులు, ధర్మ సూత్రాలు, శాసనాలు మనిషి మీద బరువై కూర్చున్న తీరును గుర్తించి నిరసించటం కనిపిస్తుంది. “మానవుని మానవుడు మానవుని మాదిరిగ /మన్నించ లేనంత మలినమైనాది”అని హృదయ మాలిన్యం కవితలో వేదన పడ్డాడు. జాతి, రీతి, దేశం, వేషం మొదలైనవి మనుషుల మధ్య విద్వేషాలకు కారణమవుతున్నాయని ఈ కవితలో చెప్పాడు. సంఘ నియమాలు, సనాతన సంప్రదాయాలు, లంచాలు, లాంఛనాలు మొదలయినవి మనిషి లోని కుళ్ళు మారు రూపాలు అని చెప్పటం (మారు రూపాలు) కూడా దానికి కొనసాగింపే. మనిషి సృష్టించిన మర మనిషి జీవితాన్ని నియంత్రించటం గురించి నిరసనతో, మర జీవితం అనే కవిత రాశాడు కాళోజీ.

“మనిషి బ్రతకాలనుకుంటే అయిపోవాలే మర / మరగా మారిన మనిషే ఏలుతాడు సమాజాన్ని” అన్న పంక్తులు కీలకమైనవి. స్వతహాగా, సహజ అస్తితతో, సృజనాత్మకంగా తన బ్రతుకుకు తానే బాధ్యుడుగా బ్రతికే అవకాశం మనిషికి అభావం చేస్తున్న సామాజిక శక్తుల మీద కోపాన్ని ఇవి ప్రతిధ్వనిస్తాయి.

మనిషిగా బ్రతకటమంటే ఆత్మ గౌరవంతో జీవించటం. ఇష్టమైనది చేయటం. చేసే దానికి చెప్పే దానికి మధ్య వైరుధ్యం లేకుండా ప్రవర్తించటం. ఈ మూడిటికి తప్పి చరించే వాళ్ళను ఏం మనుషులు అని ఈసడించుకున్నాడు కాళోజీ. ఏం మనిషి అన్న కవిత ఈవిధమయిన కాళోజీ ద్రుక్పధానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

“ఆత్మకు అవమానం జరిగినా
దవడ పళ్ళు రాలతాయన్న భయంతో
పెదవి విప్పలేని మనిషి ఏం మనిషి”

అని ప్రారంభమవుతుంది ఈ కవిత.

“లాభాల కొరకు
లాభంతో సమకూడె హాయి కొరకు”

ఇష్టం లేని పని చేయటమయినా, ఇష్టమున్న పని మానుకొనటమయినా మనిషిని మనిషిగా మిగలనీయదని భావించాడు కనుక అటువంటి మనిషి మనిషే కాదని తరువాతి భాగంలో సూచించాడు. మూడవ భాగంలో పాము నెపంగా ద్వంద్వ వైఖరి మనిషిని మనిషిగా మిగల్చదని హెచ్చరించాడు.

“బ్రతికున్న పాము
ఎక్కడ బుస్సని పడగ విప్పుతుందోనని
పగబట్టి కాటేస్తుందని
ఆపాద మస్తకం వణికి పోతూ
నాగ స్వరాల ఆసరాతో మెప్పిస్తూ
పూజిస్తూ నాగులచవితి మొక్కుబళ్ళు చెల్లిస్తూ
చచ్చినపామును బడితల్తో బాది
నిరసన జూపి, భర్సన జరిపి
విషనాగుల్ని చితక పొడవాలె
అని నినదించే మనిషి ఏం మనిషి”

ఇక్కడ పాము ఒక సంకేతం మాత్రమే. అది అధికారం. దానిని చూస్తేనే భయపడేట్లు మనిషి తరతరాలుగా పొందుతూ వచ్చిన శిక్షణ ఫలితమే భక్తి. పూజించటం, మొక్కుబళ్లు చెల్లించటం భక్తికి పరిణామం. అధికారం పట్ల భయ భక్తులు ప్రదర్శించటం ఒక పద్ధతి అయితే అధికారాన్ని దువ్వుతూ ప్రశంసలతో మెప్పిస్తూ పబ్బం గడుపుకోనటం మరొక పద్ధతి. బ్రతికి ఉన్న పాము పట్ల మనుషుల సాధారణ ధోరణి అది. అదే మనుషులు చచ్చిన పాము పట్ల వీరుల వలే ప్రవర్తించటం హాస్యాస్పదం. అధికారాన్ని అవసరమయినప్పుడు ఎదిరించలేరు గానీ తమ బ్రతుకు భద్రతకు ముప్పు లేదని తెలిసినప్పుడు తెలివిగా, అధికారం నశించాలి అని నినదించే మనుషుల మనుష్యత్వాన్ని సందేహించాడు కాళోజీ. దుష్టులకు దూరంగా ఉండాలంటూ సౌకర్యవంతంగా తప్పించుకొనే వాళ్ళే దుష్టులను శిక్షించాలని నినదిస్తుంటే అందులో నిజాయితీ ఏ పాటిది అని కాళోజీ సంధించిన ప్రశ్న ఈ కవితకు ముక్తాయింపు. కాళోజి మనిషి తన సౌఖ్యం గురించి, ముద్దు ముచ్చట్ల గురించి ఆలోచించేటప్పుడు మనిషిగా తోటి మనుషులపట్ల బాధ్యతగా ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఆ విశాల ప్రజా క్షేమ కామనను, ముక్తకం అనే చిన్న కవితలో గొప్పగా వ్యక్తీకరించాడు.

“ఎరుగుదువా నేస్తం
ఎన్ని మొద్దు బ్రతుకుల
ముద్దులు ముచ్చట్లు
రంపపు కోతల పాలైతే
మన ముద్దు ముచ్చట్లు”

నేస్తం అని సంబోధించటంలో మనిషిగా తాను తోటి మనిషితో సమస్థాయి సంబంధాలను నెరిపే ప్రజాస్వామిక దృక్పధం ఉంది. నేస్తం కట్టిన చోట వాళ్ళ హితవును కోరటం ఉంటుంది. ఎరుక కలిగితేనే హితం కలిగేది. కాళోజీ తన మిత్రులందరికి ఎవరయినా తమ అభివృద్ధి గురించి ఆలోచించేటప్పుడు అందరికీ అది అందుబాటులో ఉందా లేదా అనీ, ఎంతో మందిని అభివృద్ధి ఆవలి అంచులకు నెట్టేసే అభివృద్ధి వాంఛనీయం కాదనీ తెలిసి ప్రవర్తించాలని అనుకొంటాడు. ఆ విధంగా ఒక సమగ్ర మానవుడి ఆవిష్కరణ కాళోజీ కల. ఆ కలను పదుగురికి పంచిన కళ ఆయన కవిత్వం.
--------------------------------------------------------
రచన: కాత్యాయనీ విద్మహే, 
ఈమాట సౌజన్యంతో

Friday, March 29, 2019

జీవిత నవల – 1


జీవిత నవల – 1




సాహితీమిత్రులారా!

జీవిత నవల (Biographical Novel)
మనిషి జీవితం లాంటి ఒక మామూలు ముడి పదార్థాన్ని తీసుకొని స్వచ్ఛమైన కళారూపంగా మార్చి చూపే పరుసవేది జీవిత నవల. ఒక జీవనయానాన్ని, ఆ ప్రయాణంలో నమోదైన మైలురాళ్ళవంటి సంఘటనలను, ప్రామాణికమైన ఆధారాల పునాదుల మీద కేవలం పునర్నిర్మించడమే కాదు; వాస్తవబద్ధమైన మానవ జీవనాన్ని అద్భుతమైన సాహిత్యంగా మలిచి మనకు ప్రదర్శించి అబ్బురపరుస్తుంది.

వాస్తవ జీవితాల్లో కనిపించే రమణీయత కాల్పనిక సాహిత్యంలోని సృజనకు ఏ మాత్రమూ తీసిపోదని, మానవ వ్యక్తిత్వంలోని అంతులేని, అంతు చిక్కని సంక్లిష్టతలని మించిన కథావస్తువు లేదనే బలమైన నమ్మిక జీవిత నవలకు పునాది, ప్రాతిపదిక. ‘మనిషే మానవాళి అధ్యయనం’ అన్న అలగ్జాండెర్ పోప్ మాటలని అక్షరబద్ధం చేసే సవాలుని తన భుజాలపైకి ఎత్తుకుంది జీవిత నవల. అందుకే, పాత్రలే దానికి వస్తువు. పాత్రల వికాసం, విస్తరణే దానియొక్క అంతస్సూత్రం. వాటి పరిపూర్ణత్వమే దాని అంతిమ తీర్మానం, ముగింపు.

జీవిత నవలా ప్రక్రియ తన మాతృకలైన కాల్పనిక కథా శిల్పాన్ని, జీవిత వాస్తవాలను కలగలుపుకొంటుంది. అక్కడితో ఆగకుండా వాటికి మాతామహి అయిన చరిత్రను కూడా తన కథనంలో సమ్మిళితం చేసుకుంటుంది. జీవిత నవల లక్ష్యం జీవితంలో జరిగిన ప్రతీ సంఘటననీ ఏకరువు పెట్టటం కాదు. ఆ జీవితాన్ని సంగ్రహంగా పరికల్పించడం; కథానాయకుడి వ్యక్తిత్వాన్ని అతని దేశ కాల చారిత్రక నేపథ్యంలో ప్రామాణికంగా పునఃప్రతిష్టించగలగడం; అన్నిటికీ మించి నవలాశిల్పం యొక్క నిర్దిష్టమైన ప్రమాణాలని, అంచనాలనీ అదే సమయంలో అందుకోగలగడం, జీవిత నవల ఆశయము, లక్ష్యము కూడా.

ప్రధానంగా జీవిత నవలా రచయిత ఒక మేలిమి పటకారుడని నేను నిస్సంకోచంగా చెప్పగలను. అంతేకాదు, జీవిత నవల ఒక బలమైన సాహిత్య ప్రక్రియ అనీ, అది మానవ చరిత్రలో వాస్తవంగా జరిగిన గొప్ప కథలని చెప్పడానికి సృష్టించబడిందని కూడా చెప్తాను. నవలకున్న గొప్ప లక్షణం పాత్రల పెంపుదల. ఆ శిల్పలక్షణాన్ని సలక్షణంగా వినియోగించుకోగల అవకాశం సంపూర్ణంగా చేజిక్కించుకున్న భాగ్యశాలి జీవిత నవల. నవలాగమనం కదలకుండా, పెరగకుండా స్థిరంగా ఉండే స్థాణువు కాదు – పాత్రల పెంపుదల, వాటి వికాసం మంచి చెడుల దిశగానో, సృష్టి లయల రూపంగానో పరిణామం చెందుతూనే ఉంటుంది. పాత్రలలో ఈ పరిణామాన్ని గమనించడం కంటే ఉత్కంఠ కలిగించే సాహిత్యానుభూతి నవల పాఠకుడికి ఇంకొకటి లేదు. ఈ విషయంలో జీవిత నవలకు సాటి రాగల సాహిత్యప్రక్రియ మరొకటి లేదు – ఎందుకంటే, పాత్రల పెంపుదల అనే ఈ నవలాలక్షణం, జీవితానికి స్వభావసిద్ధమైనది. జీవిత చరిత్రలో (Biography) ప్రధానం మనిషి, అతని పెంపుదల మాత్రమే కానీ, నిరాపేక్షమైన చరిత్ర కాదు.

ఒక వ్యక్తి జీవితాన్ని అక్షరబద్ధం చేసే చరిత్రకారుడికి (Biographer) లేని స్వేచ్ఛ, ఆ వ్యక్తి మనస్తత్వాన్ని విశ్లేషించడంలో, జీవిత నవలారచయితకి (Biographic Novelist) ఉంటుంది. అందువల్ల తను చదువుతున్న వ్యక్తిని ప్రభావితం చేసిన ప్రేరణలతో మమేకమయి, ఆ వ్యక్తితో సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకొనే అవకాశాన్ని పాఠకుడికి కలిగించ గలుగుతాడు. అయితే, ఈ ప్రక్రియలో చారిత్రక వివరాలు పలుచబడే అవకాశం లేకపోలేదు. సాధారణంగా మనం మన జీవితంలో పదింట తొమ్మిది వంతుల వివరాలని విస్మరించి, మన జ్ఞాపకాలలో ఘనీభవించిన అనుభవాలనుంచే జీవితానికి అర్థం చెప్పుకున్నట్లుగా, జీవిత నవలలో కూడా చారిత్రక వాస్తవాలు వివరంగా లేకపోవటం సహజమే! జీవిత నవల కేవలం వాస్తవాల ఏకరువు మీద ఆధారపడ్డది కాదు. మానవజీవితంలో సహజమైన, న్యాయమైన ఆవేశకావేషాల ఆటుపోటులను చిత్రించడమే దాని ధ్యేయం. మనం అప్పుడే విన్న గణాంకవివరాలని వెంటనే మరచిపోగలం; కానీ మనం ఒకసారి అనుభవించిన భావోద్వేగాన్ని స్మృతిపథం నుంచి తీసిపారెయ్యడం అంత సులభం కాదు! అలాగని, పాఠకుడిలో కృత్రిమంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసే చేసే ప్రయత్నం సఫలీకృతం కానేరదు.

ఒక వ్యక్తి జీవితాన్ని సందేశాత్మకంగా ప్రదర్శించడానికి గానీ, దేశకాలమాన పరిస్థితులను క్రోడీకరించడానికి ఆలంబనగా తీసుకొని గానీ, జీవిత చరిత్ర (Biography) రాయవచ్చు. కానీ జీవిత నవల (Biographical Novel) వ్యక్తి యొక్క అంతఃవైరుధ్యాల నుంచో, వ్యక్తుల మధ్య సంఘర్షణల నుంచో, లేదా వ్యక్తికీ విధికీ మధ్య జరిగే పోరాటాల నుంచో సహజంగా, సహజాతంగా ఎదగాలి. మనం పంచుకోగల అనుభవం మన సొంతమై, స్వీయానుభవంలో అంతర్భాగమైపోతుంది కాబట్టే, జీవిత నవల పాఠకుడిని కథలోని భావోద్వేగమనే నెగడులోకి నెట్టి, ఆ స్పందనని తన సొంతం చేసుకోమంటుంది. ఈ రకంగా పుట్టిన స్పందన ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని, జ్ఞానాన్ని కలిగి మేధకు అందనిదిగా ఉంటుంది.

శాస్త్రీయమైన చరిత్ర రచనలలో పాఠకుడు ఒక సాధారణ ప్రేక్షకుడు మాత్రమే. పుస్తకం పుటల్లో తను చదువుతున్న సంఘటన ఏనాడో తనకి సంబంధం లేని వ్యక్తుల మధ్య జరిగినది. కానీ, అదే సంఘటన జీవిత నవలగా మలిచినప్పుడు పాఠకుడు కూడా అందులో భాగస్వామి అవుతాడు. మొదటి పుట తెరచిన మరుక్షణం నుంచే ఆ కథ అతనని తనలోకి లాగేసుకుంటుంది. ఆ కథతో అతను తాదాత్మ్యం చెందడంతో, పాఠకుడికి సంబంధించినంత వరకూ కథ అతని వర్తమానంలోనే జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా కథని ప్రేరేపించే ప్రధాన పాత్రధారిగా పాఠకుడు మారిపోతాడు. అందువల్ల చరిత్ర సమకాలీనమయిపోతుంది – నిజానికి ఎప్పుడూ ఇలానే కదా జరిగేది? ఈ రకంగా చరిత్రతో తాదాత్మ్యం చెందగలిగే సౌలభ్యం వల్లనే చారిత్రక జీవిత కథలు అంత ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయేమో! ఈ రకంగా కథలో, చరిత్రలో మమేకత్వం పొందగలిగే లక్షణమే పఠనాన్ని క్రియాశీలకంగా మార్చగలదు. పాఠకుడు ఒక వెయ్యి జీవితాల అనుభవాన్ని ఏకకాలంలో పండించుకోగలడు. నెపోలియన్ కథలో పాఠకుడినే నెపోలియన్ చెయ్యగలిగే మహిమ – ఈ సాహిత్యప్రక్రియలోని సమ్మోహన శక్తి.

మెరెజ్కోవ్‌స్కీ (Dmitry Merejhkovsky) రాసిన లియొనార్డో డావించీ ప్రేమకథ, విజేత అనే పేరిట గెర్ట్రూడ్ అథెర్టన్ (Gertrude Atherton) రాసిన అలగ్జాండర్ హామిల్టన్ జీవిత కథ తప్పించి, అమెరికాలో మూడు దశాబ్దాల క్రితం వరకూ జీవిత నవలలు ఆమోదించబడలేదు, లేవు కూడా. కానీ, ఈనాడు చెప్పుకోదగ్గ ప్రతి ప్రచురణకర్త జాబితాలోనూ ఇవి చోటు సంపాదించాయి. శైశవదశని దాటింది కాబట్టి, జీవిత నవలని రాయడంలోని మెళకువలని, మౌలికనియమాలని చర్చించే కాలం ఆసన్నమయిందేమో!

జీవిత నవల రాసే రచయిత పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం ఒకటుంది. చరిత్ర అతనిని, అతని కథని నిర్దేశించే పాలకుడే గాని, అతని కథకి లొంగిపోయే బానిస కాదు. చారిత్రక పరిశోధన ఎంత లోతుగా, సమగ్రంగా ఉంటే ఆ కథ అంత లోతుగా, సమగ్రంగా ఉంటుంది. రచయిత పరిశోధన సారహీనంగా, సందిగ్ధంగా, రెచ్చగొట్టే విధంగా ఉంటే పర్యవసానంగా కథ కూడా అంతే పలుచగా, రెచ్చగొట్టే రీతిలోనే ఉంటుంది.

అన్ని జీవితాలలోనూ కథలకి పనికొచ్చే ముడిపదార్థం ఉండదు. ఎందరో మహానుభావులు ఉండవచ్చు గాక, వారి ఘనత ఎంతో విలువైనది కావొచ్చు గాక – కానీ, అవన్నీ వాటంతటవిగా ఒక కథాక్రమానికి లొంగకపోవచ్చు. కాని, కొంతమంది వ్యక్తులు, తామొకనాడు ఏదో కథలో ప్రధాన పాత్రధారులమవుతామనే స్పృహతో జీవించారా! అనిపిస్తుంది. వారు అప్రమేయంగానే తమంత తాముగా ఒక కథకి అవసరమయిన శిల్పాన్ని సృష్టిస్తారు. అటువంటి వ్యక్తుల జీవితంలో నవలకి అవసరమయిన ప్రత్యేకమైన నాటకీయపు హంగులు, జయాపజయాలు, వ్యధలు, బాధలు, సంఘర్షణలు పడుగుపేకలై ఆ జీవితం ఒక కథగా తనని తానే ప్రకటించుకుంటుంది.

రచయిత తనకి పనికొచ్చే జీవితాలని ఎన్నుకోడానికి స్వతంత్రుడైనప్పటికీ, తనెంచుకున్న కథాక్రమానికి అనువుగా వాస్తవాలనీ, సత్యాన్నీ వక్రీకరించకూడదు. చారిత్రక వాస్తవాలని మెలిపెట్టి, వంచించి తన కథని రక్తి కట్టించాలని ప్రయత్నించే రచయితల దౌర్భాగ్యపు ప్రయత్నాలు ఈ రంగంలో చెల్లవు. అలాగే, నీతి బోధలు, రాజకీయ ప్రయోజనాలు ఆశించే రచయితలకీ, కరపత్ర రచయితలకీ తేడా లేదు. ఇంతకుముందు అమెరికన్ రచయితలు, జీవిత కథలని తమకి కావాలసిన విధంగా మలచుకుని, చరిత్రని వంచించి, సత్యానికి తిలోదకాలిచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఆ కథలేవీ సహేతుకమైన జీవిత చరిత్రలు కావు, విశ్వసనీయమైన నవలలూ కావు. ఒక లక్ష్యానికో, ప్రయోజనానికో అవసరమైన హంగులన్నీ విస్తారంగా ఈ చారిత్రక నవలల్లో ఉంటాయి. జీవిత నవలా ప్రక్రియ, ఇంకా యవ్వన దశలోనే ఉన్నప్పటికీ మోసపూరితమైన ప్రయోజనాలకి వాడుకోబడింది. అయితే, ఈ ప్రమాదం ప్రతి కళకీ ఎప్పుడూ పొంచే ఉంటుంది – ముఖ్యంగా మనిషి మేధని, ఆలోచనలని ఆక్రమించాలని పోరాటం జరుగుతున్న సమయాలలో ఇటువంటి ప్రయత్నాల దుర్గంధం మనల్ని విముఖులని చేస్తుంది. రచయిత యొక్క వ్యక్తిగతమైన, వృత్తిపరమైన చిత్తశుద్ధి మాత్రమే అతను సృజించిన జీవిత కథ కాలపరీక్షలో నెగ్గి చిరాయువు కాగలదా లేదా అనే అంశాన్ని అంతిమంగా నిర్ణయిస్తుంది.

కథాసామగ్రికి, రచయితకి మధ్య – సున్నితమూ, స్వచ్ఛము, పరస్పర త్యాగశీలతతో కూడి – సమతుల్యమైన బాంధవ్యం ఏర్పడితేనే జీవితచరిత్రలు సుసంపన్నమయిన కథలుగా రూపాంతరం చెందుతాయి. నవల తయారయ్యే ప్రక్రియలో ఈ ఇద్దరూ – జీవిత చరిత్ర (Biography), రచయిత (Novelist) – ఒకరితో ఒకరు తులతూగే ముఖ్యమైన పాత్రధారులు. కథాసామగ్రి రచయితని లోబరుచుకుని, కథాశిల్పాన్ని వెక్కిరించే మలుపులు తీసుకోవచ్చు, లేదా రచయిత కథాసామగ్రిని తన ఇష్టానుసారంగా లోబరుచుకోవచ్చు. ఇలా ఏ ఒక్కరు, రెండవ వారికి లొంగినా, లోబరుచుకున్నా, నవలలో సమతౌల్యత నశిస్తుంది. ప్రతి కథనీ గొప్పగా చెప్పడం ఏ రచయితకీ సాధ్యపడదు. తెలివైన రచయిత, తను అర్థం చేసుకోగలిగే కథ కోసం, తనని కదిలించే కథ కోసం, తను సజీవంగా సృజించగలిగే కథ కోసం నిరంతరం వెతుకుతాడు; అది దొరికేవరకు ఆగుతాడు. తమ శక్తిసామర్థ్యాలు తప్పుగా అంచనా వేసుకొనో, లేక కథని, కథాసామగ్రిని పూర్తిగా అర్థం చేసుకోలేకో, వివేకహీనంగా రంగంలోకి దూకే నవలాకారుల రచనలు సారహీనమైన పిప్పిలా మాత్రమే ఉంటాయి.

‘ఈ వ్యక్తి జీవితం నేను చెప్పదలచుకున్న కథకి ఉపయోగపడుతుందా?’ అని తర్కించే అధికారం లభించాలంటే రచయిత ముందుగా ‘ఈ వ్యక్తి జీవితాన్ని కథగా రాయడానికి నేను తగినవాడినేనా?’ అని తనని తాను ప్రశ్నించుకోవాలి.

జీవిత నవలారచయిత జీవితాన్నుంచి అనుభవాల గంజి వార్చేవాడు కాదు. మానవ జీవితానుభవం అనే మరిగే ద్రావణం లోంచి సాహిత్యాన్ని తేటపర్చగల నైపుణ్యుడైన కలాలి. అందుకే, జీవిత, సామాజిక చరిత్రల ఊనిక ఎంతగా ఉన్నప్పటికీ, అంతిమంగా జీవిత నవల రచయిత మేధస్సుని దాటిపోలేదు. కౌశలం లేని రచయితను ఎంత బలమైన చరిత్ర అయినా, ఎంతో అద్భుతమైన జీవిత చరిత్ర అయినా, కాపాడలేవు. కథా సామగ్రిలో, చరిత్రలో ఎంత ఉద్రేకమున్నప్పటికీ, రచయిత ఉద్విగ్నరహితుడైతే, నవల కూడా ఉద్వేగరహితమవుతుంది. రచయితలో హాస్యచతురత కొరవడితే రచనలోనూ హాస్యరసం లోపిస్తుంది, రచయిత లక్ష్యం సంకుచితమైతే, నవల కూడా తన హృదయవైశాల్యాన్ని కోల్పోతుంది. కథానాయకుడి జీవితం ఎంత మహోన్నతమైనదైనా, రచయిత కపటి అయితే రచన కూడా బూటకమే అవుతుంది. అందుకనే, జీవిత నవల కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్ర చిత్రణ మాత్రమే కాదు. అది ఆ నవలా రచయిత ప్రతిభ, నైపుణ్యతలకు తార్కాణం కూడా!

చరిత్రని లోతుగా అధ్యయనం చెయ్యని ఒక సాధారణ పాఠకుడు ఒక జీవిత నవల సత్యతను, పరిపూర్ణతను ఎలా నిర్ధారించుకోగలడు? ‘ఇదెంత వరకు నిజం’ అన్న ప్రశ్నకి సమాధానం ఎలా కనుగొనగలడు? దానికొకటే మార్గం ఉంది – శాస్త్రీయమైన చరిత్ర రచనలలోనూ, జీవిత చరిత్రలలోనూ ఎంత సాధికారమైన ఆధారాలు ఉంటాయో, జీవిత నవలలో కూడా అంతే సాధికారత ఉండాలి.

ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడానికి నాలుగేళ్ళు, ఔషధ నిర్మాతకి ఐదేళ్ళు, దంత వైద్యుడికి ఆరు, న్యాయవాదికి ఏడు, వైద్యుడికి ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అవసరం అయినప్పుడు, అంతకు తక్కువ సమయం లోనే ఒక సుశిక్షితుడైన జీవిత నవలారచయితగా ఎదగడం ఎలా సాధ్యం?

సంక్లిష్టమైన కథాశిల్పాన్ని ఊహించే కుశలత, పాఠకుడిలో ఉద్వేగాన్ని కలిగించే నేర్పు, రక్తి కట్టే సన్నివేశ రూపకల్పన, ఆకట్టుకునే సంభాషణలు నడిపించే ఒడుపు – వీటి సరసన సాహిత్యపు సౌరభం నిండిన వాక్యరచనా పటిమ, ఉత్కంఠభరితమైన కథన చాతుర్యం; వీటన్నితో కుస్తీలు పట్టి, కాల్పనికరచనలో ప్రవీణుడైన రచయితే జీవిత కథలని నేర్పుగా రాయగలడు. జీవిత నవల రాయడానికి ముందు కనీసం ఐదూ పది నాటకాలు రాసి, నాటకరచనలోని అంతర్లీనమైన పోడిమిని గ్రహించాలి. కథని రంగస్థలం మీద ప్రదర్శించే నేర్పు రచయితకి చాలా అవసరం, ఎందుకంటే కళ్లకి కట్టినదే కథ, అటువంటి కథే రక్తి కడుతుంది.

జీవిత నవలారచయిత చరిత్రరచనలో సుశిక్షితుడు కావాలి. ఒక వ్యక్తికి గానీ, లేదా కొంతమంది వ్యక్తులకి సంబంధించిన సమాచారాన్ని సమకూర్చుకోవడంలోనూ, దానిని సమ్మిళితం చేసుకుంటూ అమర్చుకోవడం లోనూ, ఒక జీవిత గమనంలో ముందువెనుకలుగా, అంతర్గతంగా పెనవేసుకుపోయిన కథని ఆకళించుకోవడంలోనూ, రచయిత నిష్ణాతుడై ఉండాలి. చెప్పదలచుకున్న కథని సజీవమూ, చైతన్యవంతమూ చెయ్యడానికి అనువయే శైలివిన్యాసాలను అలవర్చుకోవాలి. ప్రాణపతిష్ట చేసి, ఒక చారిత్రిక వ్యక్తిని ఆ వ్యక్తిత్వంతో తిరిగి పాఠకుడి అనుభవంలో సజీవుడుగా నిలపగలిగే సాహిత్యమర్మాన్ని రచయిత ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ప్రతి జీవితానికీ తనదంటూ ఒక ప్రత్యేకమైన రూపురేఖలు ఉంటాయి, వాటిని ఒడుపుగా పట్టుకోవడంలోనే ఆ కథ శతకోటి కథలనుంచి వేరుపడి తనదైన అస్తిత్వాన్ని సంపాదించుకోగలదు.

జీవిత నవలారచయిత జోనాస్ సాల్క్ లాగా (Jonas Salk) సునిశితుడైన శాస్త్రీయ పరిశోధకుడు అయ్యుండాలి. శాస్త్రీయ పరిశోధన ఎలా చెయ్యడం అనే విషయం నేను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదివిన ఆరేళ్లలోనూ బోధనాంశంగా ఉండేది కాదు. శాస్త్రీయంగా పరిశోధన చెయ్యడం ఎలా అనేది నాకు నేనుగా, తప్పటడుగులు వేస్తూ నేర్చుకోవలసి వచ్చింది. ఈనాడు పరిస్థితులు చాలా మారాయి. శాస్త్రీయ పరిశోధన ఒక పాఠ్యాంశంగా ఎన్నో కళాశాలలు బోధిస్తున్నాయి. అటువంటి పరిశోధన యొక్క సాధన సామగ్రి నేర్చుకోడానికి ఈనాడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

పలుగు, పార పనిముట్లుగా, అకుంఠిత దీక్షతో పురాతన నగరాల చారిత్రక శోభని వెలికితీసే పురాతత్వ శాస్త్రవేత్తని మరిపించేటట్టుగా, చారిత్రక పరిశోధనలో దొరకని వాస్తవమంటూ ఉండదనీ, కఠోరమైన ఓరిమితో, అంతకుమించిన చతురతతో, వెతికితే ఏనాటికైనా ప్రతీ ప్రశ్నకి సమాధానం దొరికి తీరుతుందనే అచంచల విశ్వాసం జీవిత నవలారచయిత అలవరచుకోవలసిన పరిశోధనా దృక్పథం. వినూత్నమైన రీతుల్లో ఒక కళాకారుడు తన ఊహాలోకాన్నే విధంగా కొత్తపుంతలు తొక్కిస్తాడో అదే విధంగా పరిశోధకుడు తనకి అవసరమైన ఆధారాల కోసం ఎక్కడ, ఎలా వెతకాలో నిరంతరం నిత్యనూతనమైన మార్గాలు కనిపెడుతూ ఉండాలి. అంతే కాకుండా, ఒక ప్రేమపిపాసి కుండే మొక్కవోని దృఢచిత్తం చారిత్రక నవలాకారుడికి అవసరం. ఎందుకంటే, సర్వసాధారణంగా, తన కథకి ఎంతో అవసరమైన సమాచారం ఎక్కడో లోతుగా దాగి ఉంటుంది. పొదివి పట్టుకున్న తన సౌశీల్యాన్ని, సొగసులని తనని ఎంతగానో ప్రేమించిన మనసుకే అది అర్పిస్తుంది.

ఒక ప్రహేళిక పూరించడంలో, ఒక అపరాధ పరిశోధనలో ఉన్న ఉత్కంఠత చరిత్ర పరిశోధనలో కూడా ఉంటుంది, కానీ చారిత్రక పరిశోధన చాలా కష్టమైన పని – అలుపెరుగని, నిరంతరాయమైన కృషి కావాలి. పరిశోధకుడు ఒక్కోసారి సమాచారం అనే ఊబిలో కూరుకుపోవడమో, వాస్తవాల కాననంలో చిక్కుకుని తప్పిపోవడమో జరుగుతూ ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే, జీవిత కథ సముద్రంలో తేలుతున్న హిమపర్వతం వంటిది. ఎలాగైతే, తొమ్మిదొంతుల మంచుకొండ నీటి మట్టానికి దిగువనే ఉండి, పైనున్న ఒక్కవంతు గంభీరంగా కదలడానికి తోడ్పడుతుందో, అలాగే నవలలో పాఠకుడికి చెప్పిన కథ కంటే అన్నిరెట్లు ఎక్కువ వివరాలు రచయితకి తెలిసుండాలి, లేకుంటే కథ తేలిపోతుంది. తను దాచిన తొమ్మిదొంతుల పరిశోధనా సామగ్రి నవలలోని ప్రతి పేజీ నేపథ్యంలోనూ నిమ్మళంగా ఒదిగి పాఠకుడికి పెద్దదిక్కులా నమ్మిక కలిగిస్తుంది. ఒక కావ్యంలోనో, కథలోనో ప్రతి ఉదంతం చెట్టుకి పండిన ఫలం వంటిదే – ప్రతి ఫలానికి ఎలా తనదంటూ ఒక ప్రత్యేకమైన రంగు, రుచి, వాసన ఉంటాయో, నవలలో ప్రతి ఉదంతానికి తనదంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. నేపథ్య పరిశోధన, జీవిత నవలలోని ప్రతి ఉదంతానికి చిక్కదనాన్ని ఆపాదిస్తుంది, అదే పాఠకుడిలో ఈ సాహిత్యం మేడిపండు కాదనే స్పందనని కలుగజెయ్యగలదు. అందుకే, జీవిత కథలకోసం రచయిత చేసిన పరిశోధన రక్తమాంసాదుల వంటి నిర్మాణం. పైకి కనిపించే సాహిత్యం ఆ పరిశోధనకు రూపునిచ్చే చర్మం వంటిది.

ఒకసారి, ఏదో అంతుచిక్కని విషయం గురించి అమెరికాలో ప్రసిద్ధులైన చరిత్రకారుల్లో ఒకరైన చార్లెస్ బెర్డ్ (Charles A. Beard) సహాయం కోరి న్యూ కానన్ లో ఆయన లైబ్రరీలో ఆయన్ని కలిశాను. మాటల సందర్భంలో “ముప్పై ఏళ్ళుగా నేను నమ్మినది అసత్యమంటూ ప్రతి రోజూ ఏదో కొత్త సమాచారం నాకు ఎదురుపడుతూనే ఉంటుంది” అని ఆయన అన్నారు. అదే రీతిని, ఒక్కోసారి పరిశోధకుడికి ఒకే విషయానికి సంబంధించి పరస్పర వైరుధ్యమైన కథనాలు, వేరువేరు తారీఖులతో, సందర్భాలతో సహా దొరుకుతాయి. అటువంటప్పుడు రచయితకి సత్యం ఏనాటికైనా బయటపడుతుందని, దొరికినవే కాకుండా సిసలైన కథనం ఎక్కడో ఉందని, కొత్త మార్గంలో అన్వేషిస్తే అది బలమైన సాక్ష్యాధారాలతో దొరుకుతుందని, ధృఢమైన విశ్వాసం ఉండాలి.

జీవిత నవలారచయితకి సంబంధించినంత వరకూ, చరిత్ర అచంచలమైన పర్వతం కాదు, అది ఒక నిత్యచలితమైన ప్రవాహం. ఒక సరికొత్త లోజూపో, మరొక ఆధునిక భాష్యమో పాత కథకే కొత్త అర్థాన్నో, దృక్పథాన్నో స్ఫురింపచేయవచ్చు. ఎప్పుడో జీవించిన వ్యక్తుల చరిత్రకి ప్రాణపునఃప్రతిష్ట చెయ్యడంలో జీవిత నవలా రచయిత పురాతత్వ శాస్త్రజ్ఞుడే – అతని పనిముట్లు కేవలం పలుగు, పార కాదు. మండుటెండలో శిథిలాల తవ్వకంలో నుదుట పట్టిన చెమట, కాయలు కాచిన చేతివేళ్ళు, అటుపిమ్మట రాబోయే అసలైన పరిశోధనకి, కొత్త భాష్యాలకీ తెరతీసే పురోభావ సూచనలు మాత్రమే!

సమాజంలో వేళ్ళూనుకొనిపోయిన చారిత్రక సమాచారాన్ని సవాలు చేసే ప్రశ్నార్థక దృక్పథం జీవిత నవలారచయితకి ఎప్పుడూ ఉండాలి. నా తోటి రచయిత రాబర్ట్ గ్రేవ్స్ (Robert Greaves), టసిటస్ నవల చదివినప్పుడు, ‘ఇది ఖచ్చితంగా అబద్ధమే’ అని అతని మనసుని పట్టి ఊపేసిన అలజడి ‘ఐ, క్లాడియస్’ అనే చారిత్రక నవలకి ప్రాణం పోసిందని, మయోర్కాలో (Majorca or Mallorca) జరిగిన ఒక సభలో నాతో చెప్పాడు.

ఈనాటికీ చరిత్రలో నిజాలుగా పాతుకుపోయి గౌరవించబడుతున్న సత్యాలు, అర్థసత్యాలు నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఎన్నో ముఖ్యమైన, విస్తారమైన అంశాలు (ఒక ఉదా: అమెరికా అంతర్యుద్ధం) కూడా క్షుణ్ణంగా పరిశోధించబడలేదు. మరి కొన్ని చారిత్రకాంశాలను అసలెవరూ పట్టించుకోలేదు కూడా! సరిగ్గా, ఈ నిర్లక్ష్యమే, సరికొత్త దృక్పథంతో, యవ్వనోత్సాహంతో ఉరకలేస్తున్న జీవిత నవలారచయితకి అందివచ్చిన సువర్ణావకాశం అని నా అభిప్రాయం. ఎందుకంటే అతను పాతుకుపోయిన సంప్రదాయంలో అసత్యాన్ని ‘ఇది కచ్చితంగా అబద్ధం’ అని ఆరోపిస్తాడు. ఆ పైన ‘అవును, ముమ్మాటికీ ఇదే నిజం’ అని యదార్థాన్ని నిరూపిస్తాడు. ఆవిధంగా అతడు చరిత్ర చీకటి గుహల్లో మగ్గిపోతున్న ఎన్నో జీవితాలలో తన పరిశోధనా కరదీపికలతో నిజమనే వెలుగుని నింపగలిగే సాహిత్య సత్యాన్వేషిగా భాసిస్తాడు.

అందుకే, అతను ఒక సాహసవంతుడైన యోధుడు కూడా అయ్యుండాలి. సాధారణంగా అర్థవంతమైన, బలమైన, కథలన్నీ చరిత్రలో ఉపేక్షించబడ్డ, వివక్షకి గురికాబడ్డ, అపఖ్యాతిపాలైన వ్యక్తులవే అయ్యుంటాయి. నా రచనల నుంచే యుజీన్ డెబ్స్, రాకెల్ జాక్సన్, మేరీ టాడ్ లింకన్ కథలనే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దురభిప్రాయాలని నిర్ద్వంద్వంగా తోసిరాజని, ఆర్ద్రతతో, సమతౌల్యంతో, వివేకంతో సత్యాన్ని కనుగొని, ప్రదర్శించే ప్రయత్నమేదైనా ఎదురుకోళ్లకి, తిరస్కారానికి తట్టుకుని నిలబడవలసి ఉంటుంది. సాధారణంగా మనిషి ఆస్తికి ఎంతగా అనురక్తుడై ఉంటాడో, అంతకంటే ఎక్కువగా సనాతన విశ్వాసాలకీ, మూఢనమ్మకాలకీ కట్టుబడిపోయి వుంటాడు. అంతేగాక, ఆ శృంఖలాలని తెంచుకోటానికి సిద్ధపడడు.

చివరగా, జీవిత నవలారచయితకి పుస్తకం సనాతనమనే విశ్వాసం ఉండాలి, పుస్తకాలని అతను అమితంగా, గాఢంగా ప్రేమించాలి. ఎందుకంటే, అతని జీవితకాలంలో సింహభాగం రకరకాల పుస్తకాల అధ్యయనంలోనే గడపవలసి ఉంటుంది – అందులో చాలాభాగం కొరకరాయి కొయ్యలై ఉంటాయి. చిన్న చిన్న అక్షరాలని పట్టిపట్టి చదవడంలో అతని కళ్ళు కలకబారతాయి. పచ్చబారి పెళుసైపోయిన ప్రతులు, పాతబడిపోయి, క్షీణించిన ఆంతరంగిక పత్రాలు, ఉత్తరాలలోని వెలిసిపోయిన సిరాకి అలవాటు పడడంలో తలనొప్పులు అతనికి ప్రీతిపాత్రాలు కావాలి. అన్నిటికీ మించి, సాహసించి బిగ్గరగా చదివితే పళ్ళు రాలగొట్టే శక్తి ఉన్నవిగా నమ్మబడే మృత్యు సముద్రపు ఫలకాలను (Dead Sea Scrolls) సైతం అతను సాహసోపేతంగా, అమితంగా, గాఢంగా ప్రేమించాలి.

ఇక, కొన్ని నిర్దిష్టమైన విషయాలని సంక్షిప్తంగా పరిశీలిద్దాం.

లియొనార్డో డావించీదో, అలక్జాండర్ హామిల్టన్దో జీవిత కథని నవలగా రాయాలని నిర్ణయించుకున్న రచయిత ఒక ఆరునెలలు లేదా ఒక ఏడాది పాటు తానొక రచయితననే భ్రాంతిని తన మనస్సులోంచి పూర్తిగా తుడిచిపెట్టి, పుస్తకాల పురుగై గ్రంధాలయాలు పట్టుకు వేలాడాలి. తనెంచుకున్న చారిత్రిక వ్యక్తికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అతను సేకరించాలి, ఆకళించుకోవాలి. ఆ వ్యక్తికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు, ఆ వ్యక్తి రచనలో, గీసిన చిత్రాలో, సృష్టించిన శిల్పాలో క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలి. కథానాయకుడికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అతని ఆంతరంగిక పత్రాలు, జ్ఞాపకాలు, అదే నాయిక అయిన పక్షంలో బీరువా మధ్య అరల్లో భద్రంగా దాచి ఉంచిన లేఖలు – అవి విప్పిచెప్పగలగే అద్బుతమైన కథలు – ఒక్క మాటలో చెప్పాలంటే, తన కథానాయకుడికి లేదా నాయికకి సంబంధించిన ప్రతి అక్షరాన్ని పట్టి, పట్టి పట్టుదలతో చదవాలి. ఒకవేళ, కథానాయకుడు సమకాలీనుడైతే, అతనిని ఎరిగిన వ్యక్తులతో, అతని జీవిత నాటకంలో పాత్రధారులందరినీ ప్రత్యక్షంగా కలిసి వారితో ముఖాముఖీ చర్చలు చెయ్యవలసి ఉంటుంది.

ఈ విధంగా తను చెప్పదలచుకున్న కథాస్వరూపాన్ని ఆకళించుకున్నాక, రచయిత వీథిన పడాలి – తన నాయకుడు నివసించిన ప్రదేశాలు, అక్కడి నైసర్గిక, వాతావరణ పరిస్థితులు, అక్కడి కాలికింద భూమి వాసన, ఆ చోట సూర్యుడు పంచే వెలుగురేఖలు, అక్కడి నగరాల వ్యక్తిత్వం, పల్లెల సౌందర్యం ఇవన్నీ అతను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి – అప్పుడే, అతనికి తన కథని ఆత్మీయంగా తడిమిచూసిన అనుభూతిని అందులో పలికించగలుగుతాడు.

ఇవన్నీ రచయిత మొదటగా చెయ్యవలసినదైతే, ఆపైన చెయ్యవలసిన పరిశోధన కూడా అతి ముఖ్యమైనది. తన కథానాయకుడి కాలాన్ని, అప్పటి సమాజాన్ని, ఆనాటి స్థితిగతులని, అలవాట్లని, ఆనాడు ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న అధిక సంఖ్యాకుల వాదాలనీ, అలాగే అల్పసంఖ్యాకుల నమ్మకాలనీ, ఆనాటి సమాజపు మత, తాత్విక, రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ, సంఘర్షణలనీ లోతుగా అధ్యయనం చెయ్యాలి. క్లుప్తంగా చెప్పాలంటే – ఎటువంటి సాంఘిక, ఆధ్యాత్మిక, అలౌకిక, మానసిక, శాస్త్రీయ, అంతర్జాతీయ వాతావరణంలో తన కథలోని పాత్రలు జీవించాయో, ఏ విధంగా వారి ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మాలు మార్పులు చెందాయో తెలుసుకోవాలి. అప్పటి నేపథ్యాన్ని అవగతం చేసుకోడానికి ఆ కాలంలో ప్రచురించిన పుస్తకాలని చదవాలి. ఆ కాలాన్ని, అప్పటి సమాజాన్ని సజీవంగా పునఃసృష్టించడానికి అవసరమయిన సహస్రాధికమైన వివరాలు గుప్పెట్లోకి రావాలంటే అప్పటి పాత దినపత్రికలు, కరపత్రాలు, పత్రికలు, నవలలు, నాటికలు, కవితలు చదవాలి – ఆ విధంగా, ఆనాటి ప్రజల వస్త్రధారణ, వారి ఇండ్ల రూపురేఖలు, వారు వాడిన గృహోపకరణాలు, శీతాకాలంలో వారి ఇండ్లను ఎలా వెచ్చగా ఉంచుకునేవారో, ఏ కాలంలో ఏ సమయంలో ఏమి తినేవారో, సంతలో వారే వస్తువులు, ఎందుకు, ఎలా కొనేవారో, వాటి ధరలెంతో, వాటి రంగు, రుచి, వాసనలు ఎలా ఉండేవో, వారే అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారో, వాటికి ఏ మందులు వాడేవారో, వారి సంభాషణల్లో ఎటువంటి చెణుకులు, ప్రత్యేకమైన వ్యక్తీకరణలు ఉండేవో, వారి మతాధికారులు వారికి ఎటువంటి ఉపదేశాల నిచ్చేవారో, కళాశాలల్లో ఉపాధ్యాయులు ఏ బోధనలు చేసేవారో – సమస్తం జీవిత నవలారచయితకి తెలియాలి.

తన కథ పట్ల లోతైన స్పందన రచయిత కున్నప్పుడు, విస్తారమైన చారిత్రకసామగ్రిలో నుంచీ, నవలకి ప్రధానమైన వస్తువుని, ఆ నవలకి సహజమైన ఆకృతి, నిర్మాణం, శైలి, శిల్పవిన్యాసాలని – సంగీత కచేరీలో ఆలాపనలోనే రాగలక్షణాలు ప్రస్ఫుటం అయ్యేటట్లు – అతను సులువుగానే కనుగొనగలుగుతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, మానవజీవితపు బృహత్పథకాన్ని అతను చూడాలి – ప్రతి జీవితం పకడ్బందీగా అల్లిన కథాశిల్పం. ఎప్పుడైతే రచయిత కథాగమనానికి, దిశానిర్దేశానికి మధ్య తేడాని గుర్తించలేకపోతాడో, అప్పుడు కథలో కృత్రిమమూ, అసహజమూ ఐన కథనం చేరి, మొత్తం కథాచిత్రాన్నే సమూలంగా ధ్వంసం చేసే ప్రమాదం ఉంది.

అయినప్పటికీ, జీవిత నవలా రచయిత, తను సేకరించి, క్రోడీకరించిన కథా సామగ్రిని శాసించే ప్రభువు. తన పరికరాలపై నియంత్రణ లేని పనివాడి చేతి లోంచి కథ జారిపోతుంది. తన కథకి అవసరమైన పరిశోధన పూర్తి చేశాక, అతను పరిశోధకుడి పాత్ర చాలించి, ఒక నవలారచయితగా, తన కథని ప్రత్యేకమైన కథాశిల్పాన్ని తయారు చేసుకోడానికి తన శక్తినీ, కాలాన్నీ వెచ్చించాలి. తన పరిశోధనలలో అతను కైవసం చేసుకున్న జ్ఞానం పాఠకుడికి, కథనానికి మధ్యలో అడ్డుగోడగా ఉండకూడదు. జీవిత నవల వర్తమానంలో, పాఠకుడు చదువుతున్నప్పుడే జరుగుతున్నట్టుగా ఉండాలనేది రచయిత ఉల్లంఘించలేని మౌలికమైన శిల్ప సూత్రం. అందువల్ల, రచయిత కథలో దూరి పాఠకుడికి రాబోయే కాలంలో జరిగేదాని గురించి సూచనలు, బోధనలు చెయ్యకూడదు. పాఠకుడు కూడా కథలో ముఖ్యమైన పాత్రధారి అనుకుంటే, కథలో పాత్రలకి ఎంతవరకూ తెలుసో, అంతవరకే పాఠకుడికి కూడా తెలియాలి. పాఠకుడికి ఏది తెలిసినా, అతనేది తెలుసుకున్నా అది కథలోని పాత్రల ద్వారానూ, కథలోని సంఘటనల ద్వారానే గానీ, రచయిత కథలో ప్రవేశించి స్వారీ చెయ్యకూడదు. రచయిత కథలోని కార్యకారణ సంబంధాలని వివరించే ప్రవక్త కాకూడదు. కథలో ముందు ఏం జరగబోతోందో పాఠకుడు తనకు తానుగా ఊహించుకోగలగాలి గాని కథలోని కాలగమనం రచయిత చేత వక్రింపబడడం మూలంగా కారాదు. రచయిత వివేకవంతుడైతే (భగవంతుడు అప్పుడప్పుడైనా రచయితకి వివేకాన్ని ప్రసాదించుగాక!) కథ స్వభావం నుంచీ, ఆ కథాచట్రానికి లోబడి అతనెంచుకున్న సామగ్రి నుంచీ, ఆ కథలోని పాత్రల తృష్ణ, కోరిక, ప్రేరణలపై అతను పెంపొందించుకున్న అవగాహన నుంచీ, నవల అత్యంత సహజంగా జన్మించి, ఎదిగి పరిపూర్ణమైన జీవికను సాధించుకుంటుంది.
                                            (ఇంకా వుంది)
-------------------------------------------------------
రచన: నాగరాజు పప్పు,
మూలం: ఇర్వింగ్ స్టోన్,
ఈమాట సౌజన్యంతో

Thursday, March 28, 2019

ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల


ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల




సాహితీమిత్రులారా!


1.
సాహిత్యశాఖలో నవల కొత్తది. రెండు శతాబ్దాల క్రిందటనే రూపొందినా అన్ని సాహిత్యశాఖల సద్గుణాలను ఏకముఖం చేసి బహుముఖాల వర్ధిల్లినది. ఇంకా విజృంభించే అవకాశాలు కానవస్తూ, ‘నవలాంతమ్ సాహిత్యమ్’ అనిపిస్తున్నది.

నవలకు మూలభూతమైనది కథ. నవలలో కథాకథనంతో పాత్రసృష్టి చేయవచ్చు. సాంఘిక, ఆధ్యాత్మిక జీవితము చిత్రించవచ్చు. వాఙ్మయ సంఘర్షణలు ప్రదర్శించవచ్చు. నేటి జీవితాన్ని విమర్శించి ఆదర్శజీవితం సూచించవచ్చు. ఇంకా ఎన్నో సాధించి ఆనందం కలిగించవచ్చు. స్థూలంగా నిర్వచనం చేస్తే, పూర్వకాలానికి సంబంధించినదైతే చారిత్రక నవల అవుతుంది.

చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.

వేదవేదాంతాలలో, పురాణాలలో, కొన్ని కథలు వినీ వినడంతోనే ఎవరికో ఎప్పుడో తప్పక జరిగిన సంఘటనే అనిపిస్తవి. అది చరిత్ర బీజము. అగస్త్యుడు వింధ్యపర్వతము దాటి దక్షిణానికి వచ్చిన కథ దక్షిణాపథమంతా ప్రభావితం చేసి బహువిధాల రూపుదాల్చింది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలంటున్నాము. ఆ రెండు గ్రంథాలు భారత భూమినంతా ప్రభావితం చేసి నిత్యజీవితంతో పెనవేసుకొన్నవి. ఇతిహాసలక్షణ మిట్లా పెద్దలు చెబుతున్నారు:

“ధర్మార్థ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితమ్
పురావృత్తం కథాయుక్తమ్ ఇతిహాసం ప్రచక్షతే (ప్రచక్ష్యతే?)”

కాబట్టి చరిత్రాత్మక నవలకు రామాయణ మహాభారతాలు మార్గదర్శకములుగా భావించవచ్చు.

చరిత్రకూ నవలకూ వైరుధ్యం లేదు. డాక్టరు గోపాలరెడ్డి ఒకచో “చరిత్రాత్మక నవల ఇతిహాసకత్వమూ కల్పనాసౌందర్యమూ సమరసమొందిన కూర్పు .. లేక సత్యసౌందర్యముల సమ్మేళనము” అన్నారు. అది ఒక మనోహర సూత్రప్రాయంగా గ్రహింపవచ్చు.

మనము ప్రత్యక్షముగా చూస్తూ వింటూ వున్న నేటి సంఘటనలను కథావస్తువులుగా గ్రహించి వ్రాయడము సులభ మనిపిస్తుంది. కాని ఆ సంఘటనల లోని ప్రధాన విషయాలు గ్రహించి రచన చేయడానికి కొంత ఆర్షదృష్టి ఉంటేనే కాని రాణించదు. అది లేకపోతే వార్తాలేఖనం లోకి దిగజారుతుంది. లేకపోతే ధనికులంతా దుర్గుణ పుంజాలుగానూ, దరిద్రులంతా సద్గుణమూర్తులుగానూ చిత్రిస్తూ పరశ్శతంగా ఈ కాలంలో వస్తున్న ప్రచార నవలలుగా రూపొందే ప్రమాద మెక్కువ ఉన్నది. కాబట్టి నేటికాలానికంటే గడచిన కాలాన్ని చిత్రిస్తేనే కొంత నిర్లిప్తతతో రచన చేసి సారస్వతసిద్ధి కలిగించేందుకు ఎక్కువ అవకాశమున్నదేమో!

చారిత్రక నవలాకారులను ఎదుర్కొనే ప్రమాదమొకటి ఉన్నది. ఇప్పటి తమ ఆదర్శాలూ, భావాలూ పూర్వకాలాలవారికి అన్వయించి చరిత్రను తారుమారు చేయడము. ముఖ్యంగా నేటి రాజకీయవాదులు చేస్తున్న దోషమిది. ఇట్టి రచనల వల్లనే నేటి సంఘంలో లేనిపోని ద్వేషాలు, కక్షలు ప్రబలుతున్నవి. సార్వకాలికమైన ధర్మసూత్రాలు బుద్ధిలో దృఢంగా ఉంచుకుంటేనే రచనలు ఉత్తమస్థాయి నందుకొంటవి.

పాశ్చాత్యులు శవాలను, శల్యాలను భద్రపరచినట్లే, జరిగిన సంఘటనలు వ్రాతపూర్వకంగా పదిలపరుస్తారు. అందువల్ల అక్కడ చరిత్ర శల్యాలకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది. మన అదృష్టం వల్ల మన గతచరిత్ర వివరాలు అంత ఎక్కువగా లేనందువల్ల చారిత్రక నవలాకారులకు స్వతంత్ర కల్పనలు చేసేందుకు అవకాశా లెక్కువ ఉన్నవి. మన కావ్యాదులవల్ల ఆయా కాలాల సాంఘిక మతాచారాదులు తెలియవస్తున్నవి. వాటిని మాత్రము ఉల్లంఘించకుండా జాగ్రత్తపడితే చాలును. చరిత్రాత్మక నవల విశృంఖలంగా ఊహావీధులలో స్వైరవిహారము చేయవచ్చును.

2.
ఆంధ్రభాషలో నవలతో పాటుగానే చరిత్రాత్మక నవల కూడా క్రీ. శ. 19వ శతాబ్దము చివరి దశాబ్దంలో అవతరించింది. అప్పుడు టాడ్ సేకరించి ప్రచురించిన రాజస్థాన్ కథావళి దేశాన్ని ఆకర్షించింది. దాన్ని ఆంధ్రీకరించిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము, హేమలత అనే మొదటి చరిత్రాత్మక నవల వ్రాశారు. అది రాజపుత్ర స్థానానికి సంబంధించినదే. ఆ తర్వాత శివాజీ మొదలైన మహారాష్ట్ర వీరుల గాథలు ప్రచారంలోకి వచ్చినవి. హోల్కారు రాజ్యానికి సంబంధించిన అహల్యాబాయి అనే నవల కూడా చిలకమర్తివారే రచించారు. తర్వాత విజ్ఞాన చంద్రికా గ్రంథమండలివారు హిందూ మహాయుగము, మహమ్మదీయ మహాయుగము, చంద్రగుప్తుడు, శివాజీ చరిత్ర ప్రచురించినారు. శ్రీ చిలుకూరి వీరభద్రరావు ఎంతో పరిశ్రమచేసి ఆంధ్రుల చరిత్ర ప్రకటించారు. ఐనా మండలివారి ప్రథమ బహూకృతులందిన శ్రీ భోగరాజు నారాయణమూర్తి ‘విమలాదేవి’, శ్రీ వేలాల సుబ్బారావు ‘రాణీ సంయుక్త’ కూడా రాజస్థాన కథలకు సంబంధించినవే.

ఆంధ్రచరిత్రకు సంబంధించిన మొదటి నవలలు 1914లో వచ్చినవి. శ్రీ దుగ్గిరాల రాఘవచంద్రయ్య ‘విజయనగర సామ్రాజ్యము’, శ్రీ కేతవరపు వేంకటశాస్త్రి ‘రాయచూరు యుద్ధము’ – ఇవి కూడా మండలివారి బహూకృతులందినవే. ఐనా బహుకాలము వరకు ఆంధ్ర నవలాకారులకు రాజపుత్ర మహారాష్ట్ర వీరగాథలే అభిమానపాత్రమైనవి. ఆ రచయితలు ఆ దేశకాలాలతో గాఢపరిచితి లేనివారు గనుక అవి నామమాత్రానికే చారిత్రక నవలలు. శ్రీ వేంకట పార్వతీశ్వర కవుల వసుమతీ వసంతములో మౌర్య చంద్రగుప్తుడు ప్రధానపాత్రగా వచ్చుట ఒకటే కొంత మార్పు. అశోకచక్రవర్తి జీవితాన్ని చిత్రిస్తూ శ్రీ కేతవరపు వేంకటశాస్త్రి రచించిన ఇచ్ఛినీకుమారి అనే నవల చిన్నదైనా మొదట వచ్చిన చరిత్రాత్మక నవలలలో ఉత్తమమైనది.

మేధావులు స్వాత్రంత్ర్య సమరముతో సతమత మవుతున్నందు వల్లనేమి, రచయితల దృష్టి ప్రధానంగా కవిత్వరంగం మీద ప్రసరించినందు వల్లనేమి, వచన రచయితలు ప్రసిద్ధ నవలల ఆంధ్రీకరణాలతో తృప్తిపడుచున్నందు వల్లనేమి, బహుకాలము వరకు ఆంధ్రులచరిత్ర నవలాకారులను తగినంతగా ఆకర్షించలేదు.

3.
ఆంధ్ర చారిత్రక నవలకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ‘ఏకవీర’తో 1932 ప్రాంతాలలో కొత్తమలుపు ఇచ్చారు. అది తమిళదేశానికి సంబంధించినదైనా, మధుర నేలిన ఆంధ్ర నాయకరాజుల చరిత్రకు సంబంధించిన దైనందున ఆంధ్రుల చరిత్రకు గూడా సంబంధించినది. అందులో ప్రధాన పాత్రలు ఆంధ్రదేశం నుంచి వలసపోయిన కుటుంబాలవారు. ముద్దుకృష్ణప్ప నాయకుని మరణమూ, ఆ తర్వాతి తిరుమల నాయకుడు పట్టాభిషిక్తుడు కావడము జరిగిన కాలపు కథ. ఈ నవలలో ప్రధాన కథ ఇద్దరు మిత్రుల సాంసారిక జీవనానికి సంబంధించినదైనా సందర్భవశాత్తుగా అప్పటి సాంఘిక పరిస్థితులు, పోర్చుగీసువారి దుండగాలు-దోపిడులు, రాబర్టు నోబిలి తత్త్వబోధకస్వామి అనే సన్యాసి వేషంతో చేసిన దొంగమతబోధ, దేవాలయాలలోని శిల్పనైపుణ్యాదులు చక్కగా ప్రదర్శింపబడ్డవి. తమిళ కవయిత్రి అవ్వయారు వ్రాసిన ‘అతిచ్చూడి’ లోని ఆరంజేవిరుంబు (ధర్మము చేయుము) ఆరవదు శివం (కోపపడకుము) ఇత్యాది బాలబోధలు ప్రౌఢబోధలై ప్రధాన పాత్రలను ధర్మపథాన నడిపించడము రమ్యముగా చిత్రింపబడ్డది. ఆంధ్రులు తమ నివాసము ఎక్కడ ఏర్పరచుకొన్నా అక్కడ ఉత్తమ సంస్కృతిని స్వాయత్తము చేసుకొనే తీరు మనోహరంగా సూచించారు నవలాకర్త. ఏకవీరలో కల్పనకూ చరిత్రకూ మంచి కుదిరిక ఏర్పడ్దది.

ఆ తర్వాత శ్రీ విశ్వనాథ బద్దన్న సేనాని, ఇత్యాది చారిత్రక నవలలు వ్రాశారు. కాని అవి ఏకవీర స్థాయిని అందుకోలేదు. వారీమధ్య శరపరంపరగా ప్రచురిస్తున్న పురాణ వైర గ్రంథమాల లోని నవలలు ప్రత్యేకముగా ప్రస్తావిస్తాము.

ఇంతలో ఆంధ్రుల చరిత్రకు సంబందించిన ప్రామాణిక గ్రంథాలు ఎన్నో రాసాగినవి. శ్రీయుతులు చిలుకూరి వీరభద్రరావు, భావరాజు కృష్ణారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, కురుగంటి సీతారామయ్య, డాక్టరు నేలటూరి వేంకట రమణయ్య, డాక్టరు మారేమండ రామారావు ఎన్నో ప్రత్యేకగ్రంథాలు ప్రచురించారు. ఐతిహాసిక మండలివారు రాజరాజ నరేంద్ర సంచిక, కళింగ సంచిక, రెడ్డి సంచిక, కాకతీయ సంచిక, శాతవాహన సంచిక మొదలైన అమూల్య గ్రంథాలు ప్రచురించి ఆంధ్రుల చరిత్రతో పాటు మూలాధారాలు కూడా పాఠకుల అందుబాటులోకి తెచ్చారు. కాని వాటినన్నిటినీ కొద్దిమంది నవలాకారులు మాత్రమే ఉపయోగించుకున్నారు. వారిలో గణింపదగినవారు ఆంధ్ర విశ్వవిద్యాలయం బహుమతు లందిన ముగ్గురూ, తక్కినవారిలో శ్రీయుతులు అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి. ఈ ఐదుగురి నవలలతో ఆంధ్ర చరిత్రాత్మక నవల సంపూర్ణ పుష్టితో అవతరించినది.

4.
ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ఇంటర్మీడియేటు క్లాసుకు ఉపవాచకాలుగా నిర్ణయించే నిమిత్తము ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ఉత్తమ నవలకు ఒక్కొక్కదానికి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు. 1951 నాటికి ఆంధ్రదేశములో నవలాకారులలో ఏ కొద్దిమందికో తప్ప అంత ప్రతిఫలము నవలారచన వల్ల ముట్టడము లేదు. ఇందువల్ల అంతకు ముందు నవలలు వ్రాయనివారు చరిత్ర శ్రద్ధగా పఠించి చారిత్రక నవలలు వ్రాయడానికి పూనుకొని మంచి నవలలు వ్రాశారు.

అట్టివారిలో అగ్రగణ్యురాలు శ్రీమతి మల్లాది వసుంధర. ఆమె మొదటి నవల తంజావూరు పతనము. ఆ బహుమతు లందిన నవల లన్నిటిలో సర్వవిధాల అగ్రగణ్యమైనది. ఆమె కాలేజీ విద్యార్థినిగా ఉన్నప్పుడే అటువంటి నవల వ్రాయడము ఆశ్చర్యకరమైనది. ఏకవీరలో వలెనే దీనిలోని కథాంశము కూడా తమిళదేశములో జరిగినదైనా, తంజావూరు పాలించిన ఆంధ్ర నాయకరాజులలో చివరివాడగు విజయరాఘవరాయల పాలనము చిత్రించినందువల్ల ఒకవిధంగా ఆంధ్రుల చరిత్రకు సంబంధించినదే. ఇందులో ఆ యాస్థానములో కవిత్వము, సంగీతము, నృత్యము, శిల్పము పరాకాష్ట నందుట చక్కగా పోషింపబడ్డది. కాని రాజు భోగలాలసత, వేశ్య రంగాజమ్మ యందు వ్యామోహము, ముఖస్తుతి యందు ప్రీతి, ఆస్థానకవులు స్తుతించుచున్నట్లు తాను నిజముగా భగవంతుడనే అనుకొనుట, శ్రీకృష్ణదేవరాయల యంతవాడనని గర్వించుట, తన అష్టమహిషులతో దక్షిణ నాయకత్వము సమర్థింపలేకుండుట, వెంకన్న కుట్ర కననగుట ఏవిధముగా రాజ్యపతనమునకు దారితీసినవో అద్భుతముగా చిత్రింపబడినవి. పరమభక్తుడైన పెద్దిదాసు పాత్ర, అమాయకుడైన ఎల్లు సోమయాజుల రాయబారములు, యువరాజును బంధించినందున కోపోద్దీపితయైన పట్టమహిషి రాజగోపాలాంబిక విజృంభణము, విజయరాఘవనాయకునకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మ తనకు సోదరియని చివరకు తెలిసినందున కలిగిన నిర్వేదము, పాఠకుల హృదయములలో చిరకాలము నిలిచిపోవును. ఈ నవల వసుంధర సర్వతోముఖ ప్రజ్ఞకు ప్రతీక.

కాకతీయ రాజ్యపతనమును గూర్చి ఆమె రచించిన సప్తపర్ణి కూడా బహుమతి నందినది. ఇందులో గూడ కక్షలు, ద్వేషములు, దురభిమానము, ఆడంబరముల కాస్థాన గౌరవము ఏ విధముగా రాజ్యపతనమునకు దారి తీసినవో వర్ణించుటకు ప్రయత్నించినది. ఇందులో జక్కనాచార్యుడను మహాశిల్పి తన మంత్రతంత్రశక్తిని జోడించి సప్తపర్ణిని అష్టవర్ణినిగా చేసి రాజ్యము మరియొక తరము వరకూ నిలుపుటకు చేసిన ప్రయత్నానికి అవకాశము లభింపకపోవడమనే కల్పనమీద కథ నడచినది. ఈ భావనలోనే కొంత అసంబద్ధత ఉన్నందువల్ల హృదయానికి హత్తుకోదు. రాజవంశములో ఏడుగురు రాజులు ఉండిరనే విషయ మాధారము చేసుకొని సప్తపర్ణి కల్పన నడచినది. ఐనా ఈ నవల కూడా గణింపదగినదే.

ఆమెయే ఈమధ్య రచించిన రామప్పగుడి అనే నవల విశ్వవిద్యాలయ బహుమతు లందినది కాకపోయినా ఈ సందర్భములో ప్రస్తావింపదగినది. రామప్పగుడి లోని శిల్పసౌందర్యము అనన్య సామాన్యము!

శ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తి రచించిన భువన విజయము, గృహరాజు మేడ, విశ్వవిద్యాలయము బహుమతు లందినవి. ఆయన సాహిత్యవేత్త. ‘భువన విజయము’లో శ్రీకృష్ణదేవరాయలు ఆదిల్షాను జయించుటతో ప్రారంభించి ప్రాచీ దిగ్విజయయాత్ర చేసి దుర్గములెన్నిటినో జయించి కటకము వరకూ యాత్ర చేసి గజపతి కుమార్తె యయిన తుఖాదేవిని వివాహమాడి భువనవిజయ సభా నిర్మాణము పూర్తిచేయించుటతో పర్యవసిస్తుంది. ఐనా ఈ కథయంతటిలో సూత్రరూపంగా నడిచిన కథ చిన్నాదేవి తిరుమలదేవితో పాటు శ్రీకృష్ణదేవరాయల మహిషిగా గౌరవింపబడిన వృత్తాంతము. ఆమె నిజముగా రాజపుత్రికయే ఐనను వేశ్యమాతచేత పెంపబడి ‘గాండ్లసంగి’ అను పేర రాయలకు ప్రేమభాజన మవుతుంది. ఆమె ప్రణయకోపము వల్ల రాయలకు ఆమె పైన అనుగ్రహము తప్పుతుంది. నందితిమ్మన అనే మహాకవి తన పారిజాతాపహరణ కావ్యము రచించి రాయలకు మరల అనుగ్రహము కలిగించినాడను ఐతిహ్యము మీద ఈ మూలకథ నడిచినది. ఇందులో శ్రీరామమూర్తి సూక్ష్మాతిసూక్ష్మ సన్నివేశములతో తన సాహిత్య వైశారద్యము ప్రదర్శించి ‘పారిజాత’ సౌరభము నవలలో అంతటా గుబాళింపజేసినాడు. ఈ నవలలో తిరుమలదేవి ఉదాత్తత, తిమ్మోజు కుండోజుల శిల్పప్రావీణ్యము, నంది తిమ్మన కవితా మాధుర్యము, పెద్దన మహాకవి సహృదయత హృదయంగమంగా రాణించినవి. రాయల వీణామధువగు కృష్ణపండితుని చక్రవాకరాగము తిరుమలదేవి కంఠములో విరహవేదనగా మధురాతిమధురంగా పొంగి పాఠకుల శ్రోత్రాలలో ప్రతిధ్వనిస్తుంది.

వారి గృహరాజు మేడలో కూడా సాహిత్య వైశారద్యము ప్రతిబింబిస్తున్నది.

మరొక విశ్వవిద్యాలయ బహుమతి నందిన నవల శ్రీ పాటిబండ మాధవ శర్మ ‘రాజశిల్పి.’ ఇది కొండవీటి రెడ్డిరాజ్యమును కుమారగిరి పరిపాలించిన నాటి చరిత్రను చిత్రించునట్టిది. కుమారగిరి జీవించియుండగానే కొండవీటి రాజ్యము నుండి రాజమహేంద్రవర రాజ్యము చీలిపోయినది. కొండవీటి రాజ్యానికి ఆయన దూరపు జ్ఞాతియైన పెదకోమటి వేమారెడ్డి, రాజమహేంద్రవర రాజ్యమునకు కుమారగిరి మేనల్లుడూ ప్రభువులైనారు. కుమారగిరి హృదయపూర్వకముగా రెండు రాజ్యములు అర్పించి తాను కొండలలో ఎక్కడనో శిల్పిగా ఉండుటకు నిశ్చయించుకొనడముతో నవల అంతమవుతుంది. కుమారగిరి భోగలాలసుడైన ప్రభువనీ, లకుమాదేవి అతని ఉంపుడుకత్తె యని చారిత్రకుల భావము. ఈ నవలలో కుమారగిరి మకరంద మధురమైన హృదయము గల ఉత్తమ వ్యక్తి గాను, లకుమాదేవి ఉత్తమాదర్శములు గల కేవల కళోపాసన చేయు నాతని సోదరి గాను చిత్రింపబడినది. ఆ తర్వాత వేమభూపాల చరితము సంస్కృత పద్యకావ్యముగా రచించి గద్యకవి సార్వభౌముడని, వామన భట్టబాణుడని బిరుదములందిన వామను డిందులో ఎక్కువ రాజనీతిధురంధరుడుగా భాసించును. ఆయన వైదుష్యము కంటె కాటయవేముని వైదుష్యము ఎక్కువ ప్రకాశిస్తున్నది. పెదకోమటి వేమారెడ్డి (వేమ భూపాల చరిత నాయకుడు) అల్పుడుగా భాసిస్తాడు. ఆయన రాజ్యకాలములో విద్యాధికారియైన శ్రీనాథ కవిసార్వభౌముడు కూడా ఈ నవలలో అల్పుడుగానే చిత్రింపబడ్డాడు. మంత్రిసింగన కూడా వీరశైవ కోలాహలముతో కలసినాడు. ఒకవిధంగా చూస్తే ఇది కుమారగిరి పక్షము వహించి వ్రాసిన నవల. అట్లా చేయడానికి నవలాకారులకు నిస్సందేహంగా స్వాతంత్ర్యమున్నది. మొత్తము మీద ఇందులో ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు ప్రతిబింబించినవి. వెంకోజు ఇంద్రజాలము, తిప్పయశెట్టి సమ్మానము, మల్లాంబిక సంగీతము, లకుమాదేవి నాట్యము, వీరాస్వామి సన్నాయి వాద్యము నవల యంతటా ప్రతిధ్వనిస్తవి! సామాన్యముగా నవలలోని భాషకంటె ఇందులోని భాష ప్రౌఢతరమైనది.

5.
ఆంధ్ర చారిత్రక నవలను ఆంధ్ర సారస్వత పరిధిని దాటించిన వారిలో ప్రథముడు అడవి బాపిరాజు. ఆయన మూడు చారిత్రక నవలలలో ‘హిమబిందు’ నిస్సందేహంగా ప్రపంచ భాషలలోని ఉత్తమ నవలల స్థాయి నందుకొన్నది. బాపిరాజు కొంతకాలము లాయరు, కొంతకాలము జాతీయ కళాశాలలో అధ్యాపకుడు, కొంతకాలము దిన పత్రికా సంపాదకుడు, కొంతకాలము వెండితెర మీద చిత్రనిర్మాత. స్వయముగా చిత్రకారుడు, కవి, కథకుడు. మెత్తని హృదయము కలవాడు. తరుగని ఉత్సాహముతో పొంగులు వారేవాడు. ఆయన బహుముఖానుభవము, ఆర్ద్రహృదయము హిమబిందుగా రూపొందింది.

ఇది శ్రీముఖ శాతవాహన చక్రవర్తి కాలము చిత్రించును. చక్రవర్తి యాదర్శము తన రాజ్యము చతుస్సముద్రవలయిత మొనర్చి ధర్మము నాలుగు పాదముల నడిపించి రాజ్యము స్వర్గధామముగా చేయవలెనని. రాజగురువుల యాదర్శము శాతవాహన వంశమును నిష్కల్మషమొనర్చి, ప్రపంచమును విరించి యజ్ఞ యాగాదులతో దేవతాతృప్తి మానవ రక్తి ప్రసాదింప జేసి, వైదిక ధర్మమును నిరసించు బౌద్ధ జినములను నిర్మూలింపవలెనని. తుదకు ఇరువురి యాశయములు సిద్ధించును గాని చక్రవర్తి మతసహనము వల్లనే సాధ్యమవుతుంది కాని రాజగురువు మతద్వేషము వల్ల కాదు. ఈ నవలలో మూడు రకముల ప్రేమ కథలు కల్పింపబడ్డవి. విషకన్య శ్రీకృష్ణ శాతవాహనుని దైవముగా ప్రేమిస్తుంది. హిమబిందు సువర్ణశ్రీని ప్రేమించి భర్తగా భావించును. నాగబంధునికా సమవర్తుల ప్రేమ గుణసామ్యముచే పరస్పరాకృష్టలైన వారి ప్రాపంచిక ప్రేమ. పవిత్రప్రేమ సమస్తావరోధాలను అధిగమించి విజయము సాధిస్తుంది.

ముద్రారాక్షసములో విషకన్యాప్రయోగమే చెప్పబడినది. ఈ నవలలో చిన్ననాటి నుండి అభిచార హోమములయు, విషవైద్యుల యొక్కయు సహాయముచే విషకన్య ఎట్లయినదో అద్భుతముగా వర్ణింపబడినది. తుదకా విషకన్య శ్రీకృష్ణ శాతవాహనుని ప్రేమించి, తాతగారిని ప్రతిఘటించి అమృతకన్యగా ఎట్లు పరివర్తన మొందినదో అద్భుతతరముగా కల్పింపబడినది.

శ్రీ కురుగంటి సీతారామయ్య అన్నట్లు ఇందులో “బాపిరాజు ధర్మము నిర్వచించునపుడు ధర్మవేత్తయై, యుద్ధములు వర్ణించునెడల సమరశాస్త్ర విశారదుడై, ప్రేమికుల సంభాషణలలో రసమూర్తియై, శిల్పచాతుర్యము నుగ్గడించువేళ శిల్పియై, గానము పాడించునెడల గాయకుడై, బాలికల యాటల నిరూపించునెడల బాలుడై, శాస్త్రచర్చలు సల్పునెడల సకల శాస్త్రవేత్తయై, పాత్రోన్మీలనవేళలలో సహృదయుడై మొత్తముమీద నవలారచనమందు మహాకవియైనాడు!”

ఆయన మరియొక నవల అడవి శాంతిశ్రీ. ఇందులో కూడా బౌద్ధ వైదిక మతముల సంఘర్షణము చిత్రింపబడ్డది. కథ ఎక్కువ భాగము విజయపురిలో జరిగినది. నాగార్జున బోధిసత్త్వులు ధర్మబోధ చేయుచుండిన కాలమది. ఇందులో కూడా మూడు ప్రేమకథలున్నవి. కాని కథానాయిక శాంతిశ్రీ ప్రేమకథయే విశిష్టమైనది. ఆమె విజయపురి నేలిన శాంతిమూలుని పుత్రిక. ఆమె బౌద్ధ ధర్మముచే సంపూర్ణముగా ప్రభావితయై సన్యాసిని వలెనుండి ప్రేమస్వరూపమే ఎరుగనిది. తండ్రి యాజ్ఞకు బద్ధురాలై ఆమె కథానాయకుడగు బ్రహ్మదత్తుని వద్ద వైదిక ధర్మబోధ వినే శిష్యురాలవుతుంది. ఆయన ధర్మబోధ వల్ల కంటె సంఘటనల వల్ల ఆమెలో నెమ్మదిగా ప్రేమ అంకురిస్తుంది. బ్రహ్మదత్తుడు గాలివాన వల్ల కొట్టుకొనిపోయిన నౌకతో కొంతకాలము కనబడకపోగా ఆమె ఉద్విగ్నత పొందుతుంది. తర్వాత రాయబారిగా వెళ్లిన బ్రహ్మదత్తుని పులమావి బంధించినట్లు తెలిసిన వెంటనే ఆమె వీరాంగనాసైన్యము కూర్చుకొని నిరాఘాటముగా పులమావిపై దండెత్తుతుంది. ఆ విచిత్ర కథా ఘట్టము బాపిరాజు తన ప్రతిభచే సత్యమనిపించేట్లు చేసినాడు. బౌద్ధ ప్రచారమువల్ల జనములు సన్యసిస్తూ, గృహస్థాశ్రమ విముఖులు కాగా ధర్మబద్ధమైన కామముతో వైదికము దానిని లోగొన్నదన్న భావానికి ప్రతీకగా శాంతిశ్రీ ప్రేమకథ కల్పింపబడ్డది.

శాంతిమూలుడు వైదికమతనిష్ఠుడు. ఆయన పత్నులు బౌద్ధమత నిష్ఠులు. తుదకు అమరావతిలో శాతవాహనవంశ మంతరింపగా శాంతిమూలుడు సమస్తజనుల అభ్యర్థనము పాటించి, నాగార్జునుల ఆశీర్వాదముతో చక్రవర్తి పదవి స్వీకరించి ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు కావడంతో నవల ముగుస్తుంది. పై రెండు నవలలలోను బాపిరాజుకు బౌద్ధమందు అభిమానమూ, వైదికమందు గౌరవమూ ద్యోతమవుతవి.

ఆయన ‘గోన గన్నారెడ్ది’ కాకతీయ రుద్రాంబ కాలానికి సంబంధించిన కథ. రుద్రాంబ అంతరంగిక విప్లవములను అడచి, మహారాష్ట్రుల దండయాత్ర నెట్లు ప్రతిఘటించినదో దీనిలో వర్ణితమైనది. బాపిరాజు రచనలన్నిటిలో రెండు లక్షణములు ప్రాధాన్యము వహించును. మొదటిది ప్రేమికుల ప్రేమ. రెండవది అపరిమితమైన ఆంధ్రాభిమానము. ఈ నవలలో ఆ రెండు గుణాలు ప్రత్యేకముగా కానవస్తవి.

6
శ్రీ నోరి నరసింహశాస్త్రి ప్రకృతి ఒకవిధంగా బాపిరాజు ప్రకృతికి విరుద్ధమైనది. బాపిరాజు ఉత్సాహము నిరంకుశంగా పొంగులెత్తుతుంది. నోరి ఉత్సాహము సంయమనంతో నిండి ఉంటుంది. బాపిరాజుకు ఆంధ్రాభిమాన మెక్కువ. నోరికి మహాభారతాభిమాన మెక్కువ. బాపిరాజు నాయికానాయకులు ప్రేమావేశములతో తబ్బిబ్బులవుతారు. నోరి నాయికానాయకుల ప్రేమ సాంసారిక మాధుర్య మనుభవించే వారిది గానో, వీరనారులకు వీరులకు సంబంధించినది గానో ఉంటుంది. బాపిరాజుకు బౌద్ధమం దభిమానము, వైదికమందు బలవంతపు గౌరవము. నోరికి వైదికమతమందు నిష్ఠ, బౌద్ధాది సకల మతములందు ద్వేషములేని సహనము. దురాచారము లెవరిలో ఉన్నా సహించడు.

ఆంధ్రదేశము ఉత్తరదక్షిణ భారతములకు సంధి ప్రదేశముగా ఉన్నందున యావద్భారతమును ఏకముఖము చేయగల లక్షణాలు ఆంధ్రభూమిలో ఎక్కువ ఉన్నందుకే నోరికి ఆంధ్రదేశాభిమానముగాని తానీ జన్మలో అక్కడ పుట్టినందుకు కాదు. ఆంధ్రకవులకు పూజ్యతమమైన గ్రంథము కవిత్రయము ఆంధ్రీకరించిన వ్యాస మహాభారతము. కవిత్రయము కాలములు చిత్రించుచు నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి అనే నవలాత్రయము రచించినాడు. శ్రీనాథ కవిసార్వభౌముడు విద్యానగరయాత్ర చేసి డిండిమభట్టును జయించి ఆయన కంచుఢక్కను పగులగొట్టించిన వృత్తాంతము కవిసార్వభౌముడులో వర్ణించినాడు.

నారాయణభట్టు క్రీ. శ. 1053 సం. వృత్తాంతము. అప్పుడు ఉత్తరభారతము ఛిన్నాభిన్నమై విదేశీయుల దండయాత్రలకు అనుకూలముగా ఉన్నది. అప్పుడు దక్షిణమున చోళచక్రవర్తులు దక్షిణభూమిని ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చి భారతీయధర్మము పరిరక్షించుచున్నారు. గంగవరకు విజయయాత్ర చేసిన గంగైకొండ చోళుని అల్లుడగు రాజరాజనరేంద్రుడు కలికాల కలంకపంకము హరించుచు రాజమహేంద్రవరములో రాజ్యము చేయుచున్నాడు. అప్పుడు ఆంధ్రభూమి లోని బౌద్ధ సంఘారామములు తాంత్రిక దురాచారాలకు ఆటపట్టులై రాజకీయవిప్లవము సాగింపగా దానిని సకాలములో అడచి వేసి, సామాన్య ప్రజలకు సంస్కృత భాషలో నున్నందున అందుబాటులో లేని మహాభారత ధర్మమును మహాభారతాంధ్రీకరణముతో అందుబాటులోనికి తెచ్చుటతో ఈ నవల ముగియుచున్నది.

క్రీ. శ. 1248 నాటికి ఉత్తరభారతము తురుష్కాక్రాంతమైనది. ఢిల్లీ సుల్తానుల దృష్టి దక్షిణభారతము పైకి ప్రసరిస్తున్నది. కాకతీయ సామ్రాజ్యమును అన్ని వైపుల నుండి పొరుగురాజులు ముంచివేయుటకు యత్నింపగా రుద్రమదేవి రాజ్యరక్ష చేసినది. ప్రధానశత్రువైన దేవగిరి యాదవరాజును జయించినది. ‘ఆంధ్రులకూ మహారాష్ట్రులకూ తల్లులైన గోదావరీ మంజీరా నదులు సోదరు లిట్లా వృథా కలహాల పాలవుతున్నారే’ అని శోకిస్తున్నట్టుగా రెండు దేశాల ప్రభువులకు తోచి సంధి చేసుకుంటారు.

రుద్రమ భర్త వీరభద్రేశ్వరుడు. తనకు మరియొక పత్ని వలన కలిగిన సంతానానికి రాజ్యపదవి కావలెనని ఆశిస్తాడు. కాని చక్రవర్తి రుద్రమకే పట్టాభిషేకము చేస్తాడు. భర్త రుద్రమ మీద అంతఃకలహాలు ప్రేరేచి శత్రురాజుల దండయాత్రలు కూడా ప్రోత్సహిస్తాడు. రాజధర్మానికీ, వ్యక్తిధర్మానికీ రుద్రమలో ఘర్షణ ఉదయిస్తుంది. రాజధర్మం పాటించి నిర్దోషురాలైన సీతనే శ్రీరాముడు పరిత్యాగము చేసినది మనస్సుకు తెచ్చుకొని, దోషియైన భర్తను రాజధర్మాన్ని ఆశ్రయించి ప్రతిఘటిస్తుంది. భర్త అమాయకులైన జైనప్రజలలో విప్లవము తెస్తాడు. వారిలో నాయకులను మాత్రము కఠినముగా శిక్షించి, సామాన్య ప్రజలను పొరపాటున తప్పుచేసిన సంతానము వలె క్షమించి, వారిలో నిష్కల్మషులైన వీరభల్లటదేశికులను, సిద్ధినంది వంటివారిని పూజిస్తుంది.

సందర్భవశాత్తుగా ఆనాడు ఏకశిలానగరములో విలసిల్లిన అన్ని తరగతుల జనుల జీవితము చిత్రింపబడినది. తిక్కన సోమయాజి నిర్లిప్తుడై మహాభారత రచన కొనసాగిస్తూ, గడ్డు సమయాలలో రాజకీయనౌకను యోగ్యులైనవారి చేత నడిపిస్తాడు.

కొప్పెరుల జింగడు (రాజసింహుడు) అనే కాడవ ప్రభువు గోదావరీ తీరము వరకు భూసేనను, నౌకాసేనను నడిపించుకొంటూ దండయాత్ర సాగించాడు. అతనికి సాహిత్యమల్లుడు, ఖడ్గమల్లుడు, అనే బిరుదాలున్నవి. ఆంధ్రసేనలు గోదావరి వద్ద భూమి మీదను, సముద్రము మీదను అడ్డగిస్తవి. రాజసింహుడు తన సేనానులకు యుద్ధాలు నడపడానికి ఆజ్ఞలిచ్చి తన సాహిత్యమల్లత్వము గోదావరి పండితులకు ప్రదర్శించడానికి పూనుకుని ఇష్టదైవమైన కనకసభాపతి పూజకు అంగముగా భాసుని ‘ఊరుభంగము’ ప్రదర్శింపజేస్తాడు. భీమసేన దుర్యోధనుల గదాయుద్ధమునే ఆవల రెండు యద్ధములూ అనుకరిస్తవి. ఆంధ్రుల గజఘంటలకూ, కాడవుల అశ్వదళాలకూ, ఆంధ్రుల పెద్దనౌకలకూ, కాడవుల అసంఖ్యాకములైన చిన్ననౌకలకూ, యుద్ధాలు దుర్యోధనునికి ఊరుభంగమైనట్లే పరిణమించినది. వర్ణించిన ఘట్టము అద్భుతశక్తితో నిర్వహింపబడ్డది. సాహిత్య అకాడెమీవారు ఈ నవలను భారతీయ భాష లన్నిటిలోకి అనువదింప నిశ్చయించారు.

మల్లారెడ్డి క్రీ. శ. 1328 నాటిది. మహమ్మదు బిన్ తుఘ్లకు దక్షిణదేశములో అరాజకము ప్రబలజేసెను. అప్పుడు సామాన్య ప్రజలలో నుండి మహావీరులు పుట్టి విప్లవము సాగించి ధర్మబద్ధమైన రాజ్యాలు స్థాపించారు. మొదట విముక్తి సాధించినది కృష్ణానది దక్షిణతీరాన రెడ్డి ప్రభువులు. రెడ్ల కులదైవము నందికంత పోతరాజు అనే కఠారి దైవము వెలుస్తాడు. శ్రీ శంకరస్వామి చేయించిన సహస్ర చండీయాగముతో ధర్మవృషభము ఆవిర్భవించినట్లయి ప్రజలు నిర్భయంగా మహాయుద్ధాలు చేస్తారు. దేశాంతరాలలో, ద్వీపాంతరాలలో అనేక మహానౌకలతో వ్యాపారము చేసే అవచి దేవయ నౌకలు, గజాలు, హయాలు తెప్పించి సహాయం చేస్తాడు. కథా ప్రారంభంలో శ్మశాన సదృశంగా ఉన్న ఆంధ్రభూమి చివరకు సర్వసంపన్న మవుతుంది. ఎర్రయ మహాకవి మహాభారతరచన హరివంశముతో సహా పూర్తిచేస్తాడు.

కవిసార్వభౌముడులో శ్రీనాథకవి కొండవీటి నుండి క్రీ. శ. 1420 లో శ్రీవిద్యానగరానికి సాంస్కృతిక విజయయాత్రకై బయలుదేరి, యుద్ధయాత్రలలో వేసే ఎత్తులన్నీ వేసి అక్కడ డిండిమ భట్టారకుణ్ణి ఉద్భటశాస్త్ర వాదంలో జయించి ఆయన కంచుఢక్కను పగులగొట్టిస్తాడు. ఆ తర్వాత వారిద్దరికి పరస్పరమూ ఆదరగౌరవాలు కలుగుతవి. ఆస్థానములో శ్రీనాథుడు తన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించి కవిసార్వభౌముడుగా కనకాభిషేకము పొందుతాడు. ఆనాడు శ్రీవిద్యానగరములో వేదవేదాంతములకు, దర్శనములకు ఉండిన ప్రాభవము సామాన్య పాఠకులకు కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. పర్వతమల్లుకూ, విద్యామల్లుకూ, వాళ్ల శిష్యులకూ జరిగిన మల్లయుద్ధాలు శాస్త్రవాదాల ప్రతిధ్వని వలె ఉండి నవలకు రమ్యత చేకూరుస్తుంది. రాజకీయముగా శ్రీవిద్యానగరానికి, కొండవీటికి, రాచకొండ, దేవరకొండలకు ఎన్నెన్ని స్పర్థలున్నా, విద్వాంసులను గౌరవించడములో విరోధ ముండేది కాదనీ, శాస్త్రవాదాలలో ధర్మదీక్షతో పరిషత్తులు నిర్ణయము చేసేవనీ ఇందులో ప్రదర్శింపబడ్డది. ఆ తర్వాత కొద్దికాలానికి ఆంధ్రులకు అభిమానపాత్రమైన భాగవతము వ్రాయనున్న పోతన, కన్నడములో ‘గదగిన భారత’ రచించి బాలవ్యాసుడనే ప్రసిద్ధి పొందనున్న నారనప్ప ఈ నవలాకథ నాటికి యువకులై ఉత్తమ కావ్యరచనకు ఎట్లా ఆదర్శపూరితు లవుతుండిరో ఇందులో చిత్రింపబడ్డది.

కవి, నాటికాకర్త, కథకుడు, సాహిత్య విమర్శకుడు, ధర్మదీక్షితుడు ఐన నోరి పరిణత వయస్సులో చారిత్రక నవలారచనకు పూనుకొని తన సర్వతోముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దానికి సంపూర్ణ వికాసము కలిగించినాడని విమర్శకుల నిర్ణయము!

7.
భారత చరిత్ర పరిధులను దాటి రచించిన ఆంధ్ర నవల తెన్నేటి సూరి ‘చెంఘిజ్‌ఖాన్’. ఆ నవల సర్వాంగ సుందరమై అడుగడుగునా గోబీ ఎడారి వాతావరణముతో అక్కడి జనముల తీవ్ర రాగద్వేషాలతో స్పందిస్తున్నది. ఎక్కా మంగోలుజాతి నాయకుడైన యాసుకై మెర్కెట్ తండాలోని వాళ్లనందరిని చంపి పెళ్లికూతురు యాలమను బలవంతముగా ఎత్తుకొని పోవడముతో కథ ప్రారంభిస్తుంది. యాలమ మొండిగా బహుకాలము యాసుకై భార్యగా ఉండడాన్ని ప్రతిఘటిస్తుంది. కాని సోదరుడైన కరాచర్ బోధ పాటించి చివరకు ఒప్పుకొని టెమూజిన్ను కంటుంది. యాసుకై మంగోలు తండాల నన్నిటిని ఐక్యము చేసి కెరెటు ప్రభువైన తుఘ్రలుఖానుకు సహాయము చేయగల స్థితికి వస్తాడు. యాసుకై అకస్మాత్తుగా మోసము పాలై శత్రునిచే హతుడవుతాడు. మళ్లీ మంగోలు తండాలు విచ్ఛిన్నము కాబోతున్న సమయంలో టెమూజిన్ ప్రభుత్వము చేబట్టుతాడు. యువకుడైనా, నయానా భయానా అతడు సమర్థతతో గోబి తండాలను కూడగట్టుకొని, తుఘ్రలుఖాను, చీనా చక్రవర్తి, టర్కీ ప్రభువు చేసే కుట్రలన్నిటినీ ఎదురెత్తులతోనూ, సాహసంతోనూ ఎదుర్కొని చెంఘిజ్‌ఖాన్ (జగజ్జేత) అవుతాడు. అతని సోదరుడు చమూగా చదువుకొన్నవాడు. వీరుడైనా శాంతిప్రియుడు. అతన్ని నైమాన్ ప్రజలకు ప్రభువుగా టెమూజిన్ పంపుతాడు. అతడు ప్రజల చేత ఆయుధ విసర్జన చేయించి దేశాన్ని సస్యశ్యామలంగా తాత్కాలికంగా చేయగలుగుతాడు. బౌద్ధము, ఇస్లాము, క్రైస్తవము ప్రచారము చేసేవారి ద్వారా శత్రురాజులు చేసిన ద్రోహము వల్ల చమూగా ప్రయత్నమంతా విఫలమైన ఘట్టము కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. క్రీ. శ. 1206లో వసంత ఋతువులో జరిగిన విజయోత్సవాలతో టెమూజిన్ చెంఘిజ్‌ఖాన్ ‘జగజ్జేత’ కావడంతో నవల పూర్తి అవుతుంది. ఈ నవల ఆనాటి అనాగరక సాహస వీర ప్రపంచాన్నే చిత్రించినా, ఈ కాలములో మనము ఎంత నాగరకులమని గర్విస్తున్నా జాతులను ఆడించే మూల మహాశక్తి ‘పశుశక్తే’ అనిపిస్తుంది. నవల చదువుతున్నంతసేపూ ఆంధ్రభాషలో పుట్టి ప్రాణవంతమైన ఉత్తమ నవలలలో దీనికి నిస్సందేహంగా స్థానమున్నది. ఈ ఒక్క నవలే వ్రాసి చిన్నతనములోనే తెన్నేటి సూరి గతించినందువల్ల నవలా ప్రపంచానికే తీరని లోటు కలిగింది.

8.
ఆంధ్రభాషలో ఇంకా ఎన్నో చారిత్రక నవలలు పుట్టినవి. వాటిలో శ్రీ వేదుల సూర్యనారాయణశర్మ ఆర్యచాణక్యుడు నవలని ప్రశంసించక తప్పదు. అందులో చారిత్రక విషయాలెన్నో ఉన్నవి. కాని అది చరిత్ర అనిపిస్తుంది. కాని నవల అనిపించదు.

ఆంధ్ర చరిత్రకారులలో ప్రామాణికులైన డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య రచించిన పశ్చాత్తాపము, ఛత్రగ్రాహి, మధుమావతి, మొదలైనవి పెద్దకథ లనదగినవే కాని వాటికి నవల కుండవలసిన విస్తృతి లేదు. వారి కథలలో చరిత్ర-కల్పన ఎంత చక్కగా జోడింపవచ్చునో ఆదర్శప్రాయంగా ప్రదర్శించారు.

ఉన్నత పాఠశాలలలో పాఠ్యగ్రంథాలుగా ఉద్దేశింపబడి ఎన్నో చిన్న చారిత్రక నవలలు పుట్టినవి. అట్టివాటిలో శ్రీ వావిలాల సోమయాజులు రచించిన నాలందలో ఆనాటి ఆచార్య వైభవము చక్కగా పోషింపబడ్డది. అనవేమారెడ్డి జైత్రయాత్రను వర్ణించిన వసంతరాయలు, విహారి-శాతవాహన రచించినది, కూడా గణ్యమైనది. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల అభయ ప్రదానము కూడా ఎన్నతగినది. ఇంకా ఎన్నో చిన్న నవల లున్నవి.

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ నేటి ఆంధ్ర సారస్వత రంగములో సర్వతోముఖ ప్రతిభ ప్రకటించి ఎన్నో ఉత్తమ నవలలు వ్రాసిన తర్వాత ఈ మధ్య ‘పురాణవైరి గ్రంథమాల’ పేరుతో 16 నవలలు వ్రాయ సంకల్పించి చాలా భాగము పూర్తి చేశారు. ఈ వ్యాసము ఉపక్రమణములో మన పురాణాదులలో ఎన్నో చారిత్రక విషయాలు నిక్షిప్తములై ఉన్నవనీ, రామాయణ మహాభారతాలే ఐతిహాసిక నవలలకు మార్గదర్శకముగా ఉండదగుననీ సూచించినాము. ఈ గ్రంథమాల నవలలలో శ్రీ విశ్వనాథ ఒక అడుగు ముందుకు పోయినారు. పురాణకథలే చరిత్రగా గ్రహించి శ్రీ కోటవారు భారతజాతి చరిత్ర రచించారు. అదే నిజమైన చరిత్ర అని శ్రీ విశ్వనాథ నిశ్చయము. పాశ్చాత్యుల దృష్టితో ప్రారంభింపబడిన భారత చరిత్ర అత్యంతము పునఃపరిశీలన చేసి రచింపవలసి ఉన్నదనుటలో మాకెట్టి సందేహము లేదు. కాని శబ్దసామ్యాన్ని బట్టి హూణ మిహిరగులుడు హూణుడు కాడని, మిహిరకులుడైన ఆదర్శ భారతీయ వీరుడనేవరకూ మా బుద్ధి ప్రస్తుతము ప్రసరింపలేకున్నది. ఈ గ్రంథమాల నవలలలో రచనలోను, కల్పనలోను తొందరపాటు, విశృంఖలత్వము గోచరించడము సంతాపకరమైన విషయము. మధ్యమధ్య శ్రీ విశ్వనాథ మహాప్రతిభ తెరచాటు నుండి గోచరిస్తూ ఉండకపోతే వాటిని పరిగణించ వలసినది కాదు. ఏమైనా పురాణవైరి గ్రంథమాలలోని శ్రీ విశ్వనాథ నవలలు చారిత్రక నవలా రచయితలకు, విమర్శకులకు ఒక సవాలువంటివని మాత్రము అంగీకరించక తప్పదు!
----------------------------------------------------------
రచన: నోరి నరసింహ శాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, March 27, 2019

యథార్థ చక్రం -5


యథార్థ చక్రం -5




సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి...................

అప్సరసల సౌందర్యమే నందుడి మనస్సులో నిలిచి పోయింది. వారి పొందుకోసం తపో దీక్షలో నిమగ్నమయ్యాడు.

చపలచిత్తమైన మనస్సుని నియంత్రించడం కష్టంగా ఉన్నా కఠోర దీక్ష పాటిస్తున్నాడు నందుడు.

మెల్ల మెల్లగా సుందరి రూపం కనుమరుగవుతోంది నందుడి మనస్సులో ! ఇప్పుడతని ధ్యాస ఆ అప్సరసల వైపు మళ్ళింది.

భార్యా విముఖుడైన నందుణ్ణి చూఇ ఆనందుడు ఆశ్చర్యపోయాడు. అదే విషయం నందుడితోనూ అన్నాడు.

” నీ అకుంఠిత దీక్ష చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఇలా నియమ పాలన చేయడం సామాన్యులకు బహు దుర్లభమైన విషయం! నీవు అవలీలగా ఇలా చేయడం చూస్తే ఈ కుటీరంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కోపిష్టివాడికి సహనం, లోభికి ధన వ్యామోహ రహితం, కామికులకు బ్రహ్మచర్యం సులభం కావు. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ”

ఆనందుడి మాటలు విని చిన్నగా నవ్వాడు నందుడు.

ఆనందుడు బౌద్ధ ధర్మం గురించి ప్రస్తావించాడు.

” ఇంధనం వల్ల అగ్ని, జలం తో సాగరం, భోగాల వల్ల విషయ వాసనలు ఎప్పటికీ తృప్తి చెందవు. మనస్సుని నియంత్రించే బ్రహ్మచర్యం వల్ల ఆనందం లభిస్తుంది. అవ్యాజమైన సంతోషం లభిస్తుంది. కోరికలు తుంచివేస్తే నెమ్మ నెమ్మదిగా బంధాలు కూడా వాటంతటవే తెగుతాయి. ఆత్మానందం చేరుకోవడం అప్పుడే సాధ్యం! అప్సరసలకోసం నువ్వు ఈ దీక్ష పాటిస్తున్నావని అందరూ అనుకుంటున్నారు, ఇది నిజమేనా? లేక పరిహాసమా? ”

“అప్సరసల కోసమేనా ఈ దీక్ష” అన్న మాటలు నందుడి మనస్సుని బలంగా తాకాయి. సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆనందుడు వెళ్ళాక నందుడు తపస్సులో మనస్సు లగ్నం చేయలేకపోతున్నాడు. ఆనందుడు అన్న మాటలు నిజమేనా? తను అప్సరసలకోసం తపోదీక్ష మొదలుపెట్టినది నిజం. కానీ మెల్ల మెల్లగా మనస్సుని నియత్రించగల ధైర్యం వచ్చింది. ఆనందుడి మాటలు తను అబద్ధం అని నిరూపించగలడు. తనకి ఆ సామర్థ్యం, నియమ పాలన అలవాటయ్యాయి. తనూ జయించగలడు, ఈ విషయవాంచలని. ఒక్కసారి అతని కి జ్ఞానోదయమయ్యింది.
నియమ బద్ధుడై తపోదీక్షలో మునిగి పోయాడు.
రాత్రి పగలూ, ఎండా వానా లెక్క చేయకుండా నందుడు అకుంఠిత దీక్షా బద్ధుడవ్వడం చూసి తథాగతునికి సంతోషం వచ్చి ఓ సారి నందుణ్ణి ప్రశ్నించాదు.

“ప్రియ నందా! సుందరిపైన ఆలోచనలు నీ యోగ దీక్షని భంగపరచడం లేదు కదా?”

” ఓ భగవానుడా! ఈ యోగ దీక్షలో నిమగ్నమైన నా మనసుని సుందరే కాదు..ఈ ప్రపంచంలో ఎవ్వరూ సమీపించలేరు. ఈ యోగంలో ఆత్మానందం ఉంది…ఏదో తెలియని ఒక అనుభూతి శరీరాన్ని, మనసుని దూదిపింజలా చేస్తోంది…ఈ ఆనందం ఇలాగే ఉండాలని నా ఆకాంక్ష! ”

నందుడు మాటలు విని బుద్ధుడూ ఆనందించాడు.

తనంతట తానుగా బౌద్ధ ధర్మాన్ని నందుడికి బోధించాడానికి ఉపక్రమించాడు బుద్ధుడు.



యశోధర వెచ్చి వెళ్ళాక సుందరికి మనో ధైర్యం వచ్చింది. ముందుగా నందుణ్ణి కలవాలి. కానీ నగర వెలుపల బౌద్ధ కుటీరంలోకి తనని రానిస్తారా? భిక్షువులకి తప్ప సామాన్యులకి ప్రవేశం ఉంటుందా? ఇంతకాలం యశోధర ఒక్క సారి కూడా ఆ కుటీరం వైపు వెళ్ళకపోవడం ఆశ్చర్యకరమే! యశోధర సాయంతో తను ఆ కుటీరాన్ని చేరలేదు. మరి నందుణ్ణి కలవడం ఎలా? ఇలా పరి పరి విధాల నందుణ్ణి ఎలా కలవాలా అని ఆలోచిస్తోంది సుందరి.

మహారాణి మాయావతి బుద్ధ కుటీరాన్ని తరచు దర్శిస్తుంది. కనుక ఆమెతో తన గోడు చెప్పుకొని సహాయం అర్థిస్తే?

ప్రస్తుతానికిదొక్కటే మార్గం అనుకుంటూ సుందరి మహారాణి మాయావతి నివాసం వైపుగా వెళ్ళింది.

మాయావతిని చూడగానే సుందరికి ఒక్కసారి దుఖం కట్టలు తెంచుకొచ్చింది. మాయావతి సుందరిని దగ్గరగా తీసుకొని, తల నిమురుతూ అంది.

” నాకంతా తెలుసు బాధ పడకు! సిద్దార్థుడు కారణజన్ముడు. తన తమ్ముడైన నందుణ్ణి సరి అయిన మార్గం వైపు మళ్ళించి మంచిపనే చేసాడు. నువ్వు అంతగా చింతించనవసరం లేదు.
నువ్వు కూడా ఆ బుద్ధుని ప్రవచనాలు వింటే నా మాటలు నిజమని నమ్ముతావు..”

సుందరి ఈ మాటలకి ఒక్కసారి అవాక్కయ్యింది.

“మహారాణీ! మీకు నాకూ, నందుడికీ మధ్య ప్రేమ తెలుసు. మేము ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వారమనీ తెలిసి ఇలా అనడం ఆశ్చర్యంగా ఉంది. బుద్ధ భగవానుడంటే నాకూ గౌరవమే! ఆ మహానుభావుడి ప్రవచానాలు కర్ణ ప్రియమే! కానీ నా ప్రియుడ్నే ఆ ప్రవచనాలు నాకు దూరం చేస్తే నేను సహించలేకపోతున్నాను. నా నందుణ్ణి ఎలాగైనా ఒకసారి కలవాలి. దానికి మీ సహాయం కావాలి.”

“నా సహాయం ఎందుకు సుందరీ! నువ్వు ఆ ఆశ్రమమానికి వెళ్ళ వచ్చు! నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు..”

“స్త్రీలకి ప్రవేశం లేదు…అని విన్నాను”

“బౌద్ధ భిక్షునిగా అవ్వడానికి స్త్రీలకి కొన్ని నియమాలు ఉన్నాయి కానీ సామాన్యులెవరైనా ఆ ప్రవచానాలు వినవచ్చు. అనేకమంది స్త్రీలు ప్రతీ దినమూ ఆ ప్రవచనాలు విని తమ భర్తలని బౌద్ధం వైపు మళ్ళిస్తూ, భిక్షువులవడానికి దోహదం చేస్తున్నారు…” మాయావతి అంది.

“స్త్రీలందరూ తమ తమ భర్తల్ని భిక్షువులుగా మారుస్తున్నారా? మరి వారి సంసారాలు ఎలా సాగుతాయి?”

“ఆ స్త్రీలే గృహసంవిధాన బాధ్యతలూ నిర్వహిస్తారు..అందులో తప్పేముంది? ”

“తప్పేముందా? ఇది అన్యాయం…భర్తలందరూ భిక్షువులుగా మారితే, స్త్రీలందరూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలా? సంసారం అంటే భార్య భర్తలిద్దరూ కలిసి ఉండాలి. అంతే కానీ ఇలా పెళ్ళయిన ప్రతీ పురుషుడూ సన్యసిస్తే, ఇహ వివాహమెందుకు..ఈ సంతానమెందుకు? అయినా ఇది సృష్టి విరుద్ధం! ప్రతి స్త్రీ పురుషుడుకి దూరంగా ఉంటూ పుట్టిన ప్రతీ మగాణ్ణి ఇలా భిక్షువులుగా మారిస్తే…ఇదంతా ఒక గందరగోళంగా ఉంది…మీరవ్వరూ ఈ విషయాన్ని బుద్ధుడి వద్ద ప్రస్తావించలేదా? ” గట్టిగా అంది సుందరి.

“నీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఆ తథాగతుడే నీకు సరిగ్గా చెప్ప గల వ్యక్తి. వెళ్ళి కలు…”

సుందరి కోపాన్నంతా అణచుకుంటూ అంది.

“అడుగుతాను. సృష్టి విరుద్ధమైన ఈ సన్యాసం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటని ఆ బుద్ధుణ్ణే సరా సరి అడుగుతాను. నా నందుణ్ణి నాకివ్వమని అర్థిస్తాను.”

అక్కడనుండి బయల్దేరి బుద్ధుడి కుటీరంవైపుగా వెళ్ళింది. దూరంగా రథాన్ని ఆపించి, తన పరివారాన్ని వెనక్కి పంపించి, కుటీర ద్వారం వైపుగా వెళ్ళింది.

కొంతమంది భిక్షువులు సుందరి రాకును గమనించారు. ఆ భుక్షువుల్లో ఒకరు సుందరికి తెలుసు. అతన్ని గుర్తుపట్టింది సుందరి. ఇంతకుముందు అతను రాజాస్థానంలో ప్రముఖ వ్యక్తి.

“బుద్ధ భగవానుణ్ణి కలవాలి..” అంది.

ఆ భిక్షువేమీ మాట్లాడ లేదు. మౌనంగా ఇటు రమ్మన్నట్లు సైగ చేసాడు. సుందరి అతణ్ణి అనుసరించింది.

అతను ఒక కుటీరం వైపు తీసుకెళ్ళాడు. ఒక్కడ తథాగతుడు నందుడికి ప్రవచనాలు బోధిస్తున్నాడు. బుద్ధుదు సుందరి రాకను గమనించాడు కాని నందుడు తల తిప్ప లేదు.

అక్కడే ఉండమన్నట్లు బుద్ధుదు సైగ చేసాడు. వారిద్దరూ ఆగి పోయారు. ప్రవచనాలు మధ్యలో ఆపి బుద్ధుడు సుందరి వైపుగా వచ్చాడు.

దూరాన్నుడి నందుణ్ణి గుర్తు పట్టింది సుందరి.

నందుడు వెనక్కి కూదా చూడకుండా కుటీరంలోకి వెళిపోయాడు.

ఇదంతా చూస్తూ నమ్మశక్యంగా లేదు సుందరికి. నల్లగా నిగ నిగలాడే శిరోజాలతో అత్యంత సుందర రూపుడైన నందుడు, శిరోముండనం చేయించుకొని కాషాయాలు ధరించి…తనని తన రాకని ఏ మాత్రం గమనించకుండా ఉండడం…ఇది కలా..నిజమా!

తను లేనిదే క్షణ కాలం కూడా ఉండలేని నందుడు ఇలా సర్వ సుఖాలు పరిత్యజించి…

సుందరికి దుఖం ముచుకొచ్చింది..నందుడి రూపంకేసి చూస్తూ ఒక్క సారి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎప్పటికైన తన నాధుడు తనకు దక్కుతాడు అన్న నమ్మకం ఒక్క సారి కుప్ప కూలిపోయింది.

అచేతనంగా క్రింద పడిపోయింది! పడింది సుందరి కాదు…ఆమే మనో నిబ్బరం…
( ఇంకా ఉంది…)
---------------------------------------------------------
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, March 26, 2019

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?


ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?





సాహితీమిత్రులారా!

ఈ విశ్వం (universe) ఏ ఆకారంలో ఉంది?

తాడులా ఉందా? గొట్టంలా ఉందా? చపాతీలా ఉందా? సబ్బు బుడగలా ఉందా? బందరు లడ్డులా ఉందా? ఉల్లిగడ్డలా ఉందా?

విశ్వం ఏ ఆకారంలో ఉంటే మనకేమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియకపోతే వచ్చిన నష్టం ఏమిటి? విశ్వం ఏ ఆకారంలో ఉందో తెలిస్తే ఇప్పటివరకు మనకి అవగాహన కాని ప్రకృతి రహస్యాలు బహిర్గతం అవుతాయి. చిన్న ఉదాహరణ చెబుతాను. నేల మీద ఉన్న గుండుసూదిని భూమి ఆకర్షిస్తున్నాది కనుకనే అది నేల మీద పడి ఉంది. ఆ గుండుసూదిని చిన్న అయస్కాంతంతో – భూమి ఆకర్షణని ప్రతిఘటిస్తూ – పైకి లేవనెత్తవచ్చు. అంటే చిన్న అయస్కాంతం పెద్ద భూమి కంటె బలమైనదన్నమాట! ఎందువల్ల? విశ్వపు ఆకారం ఎలా ఉందో తెలిస్తే ఈ రకం ప్రశ్నలకి సమాధానాలు చెప్పొచ్చు.

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్నకి సమాధానం, గణితంలో ప్రవేశం ఉన్నవాళ్ళకి కూడా ఇంగ్లీషులో చెప్పటమే చాల కష్టం. గణితంలో ప్రవేశం లేని వారికి ఇంగ్లీషులో చెప్పబూనుకోవటం కష్టతరం. గణితంలో ప్రవేశం లేని వారికి తెలుగులో చెప్పటానికి ప్రయత్నించటం కష్టతమం. అయినా, ప్రయత్నిస్తాను.

లెక్కల సహాయం లేకుండా చెప్పాలంటే విరివిగా నమూనాలు ఉపయోగించాలి. నమూనా ఉపయోగించినప్పుడల్లా అసలులో ఉన్న మెరుపు ఒక వాసి తగ్గిపోతుంది. అయినా సరే అధ్యయనం చెయ్యదలుచుకున్న అంశాన్ని అర్ధం చేసుకోవడానికి నమూనాలు బాగా సహకరిస్తాయి.

నేను బందరులో హిందూ కాలేజీలో ఇంటరు చదువుతున్న రోజుల్లో ఆంధ్రజాతీయ కళాశాల వార్షికోత్సవాలు చూట్టానికి వెళ్ళేను. ఆ ఉత్సవాలలో ఒక అంశం నాటకాల పోటీలు. నేను చూసిన నాటకాలన్నిటిలోకీ, నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది ‘నీడ నాటకం’. ఈ నాటకంలో రంగం మీద నటించే పాత్రధారులకీ, ప్రేక్షకులకి మధ్య ఒక తెల్లటి పారభాశకమయిన (translucent) తెర ఉంటుంది, సినిమా తెరలా నాలుగు పక్కలా బిగుతుగా లాగి కట్టినటువంటి తెర ఇది. ఆ తెర మీద పాత్రధారుల నీడలు మాత్రమే పడేటట్లు తెర వెనక దీప్తిమంతమైన దీపాలు అమర్చేరు. ప్రేక్షకులకి కనిపించేవి నీడలు మాత్రమే. తెర మీద నీడలే పడినా, ప్రేక్షకులకి ఆ నీడలలో భావోద్వేగాలతో నిండిన సజీవ పాత్రలు కనిపించేయి.

ఈ నీడబొమ్మల నాటకంలో ‘నిజం’ తెర వెనక రంగం మీద ఉంది. మన కంటికి కనిపించేది నిజం కాదు; నిజంగా రంగం మీద జరుగుతున్న సంఘటనలకి తెరమీద జరిగిన ప్రక్షేపణ (projection) మాత్రమే. తెర వెనక ఉన్న నిజ రంగానికి పొడుగు, వెడల్పు, లోతు ఉన్నాయి, కాని తెర మీద కనిపించే భ్రమకి రెండు కొలతలు మాత్రమే – పొడుగు, వెడల్పు.

“ఈ చరాచర జగత్తు నిజం కాదు, ఉత్త భ్రమ” అని స్వాములవార్లు చెప్పినట్లే, తెర మీద నీడ బొమ్మల నాటకం కేవలం ఒక భ్రమ. స్వాములవార్లు ఒక పక్క నుంచి ‘ఇదంతా భ్రమ’ అని చెబుతున్నా మనం ‘ఇది’ నిజమనే నమ్ముతున్నాము కదా. నిజం తెలిసే వరకూ తాడుని చూసి పామనే నమ్ముతాం!

ఇప్పుడు ఒక కొత్త లోకాన్ని ఊహిద్దాం. ఈ ఊహాలోకంలో అసలు నాటక రంగానికి పొడుగు, గిడుగు, వెడల్పు, గిడల్పు, లోతు, గీతు అనే ఆరు కొలతలు ఉన్నాయనుకుందాం. ఈ ఆరు కొలతలు ఉన్న నిజమైన నాటక రంగం మీద జరుగుతూన్న నాటకాన్ని సూత్రధారుడు పొడుగు, వెడల్పు, లోతు అనే మూడు కొలతలు మాత్రమే ఉన్న ‘తెర’ మీదకి ‘ప్రొజెక్టు’ చేసేడనుకుందాం. ఇలా ప్రక్షేపించబడ్డ నాటకమే మనం రోజూ చూస్తున్నాం. చూసినదే నిజం అని భ్రమ పడుతున్నాం. ఈ నాటకం నిజంగా ఆరు కొలతల ప్రపంచంలో జరుగుతోంది. మన అజ్ఞానం వల్ల ఆ ప్రపంచాన్ని చూడలేక పోతున్నాం” అని స్వాములవారు చెబితే మనం నమ్మగలమా?

ఈ విశ్వం యొక్క రూపు రేఖలు, ఆకార వికారాలు, ఎలా ఉంటాయో అన్న సమస్య ఎదురయినప్పుడు కొమ్ములు తిరిగిన భౌతికశాస్త్రవేత్తలు – “స్థావర జంగమాత్మకమయిన ఈ చరాచర జగత్తు మూడు దిశలలో వ్యాప్తి చెందిన త్రి-మాత్రకమైన (3-dimensional) తెర మీద మనకి కనిపిస్తూన్న దృశ్యం మాత్రమే, నిజమైన విశ్వాకారం పదకొండు దిశలలో వ్యాప్తి చెంది ఒప్పారుతోంది” అని అంటున్నారు. అంటే, మనం మన ఇంద్రియాలతో స్పృశించగలుగుతూన్న విశ్వం మూడు కొలతలతో వ్యాప్తి చెందినట్లు మనకి అనిపించినా అది కేవలం తెర మీద చూసే నీడ నాటకం లాంటి భ్రమ మాత్రమే. ఆసలు రంగస్థలం తెర వెనక ఎక్కడో ఉంది. దానికి పొడుగు, వెడల్పు, లోతు అనే చిరపరిచితమయిన కొలతలతో పాటు కొత్త కొత్త పేర్లు గల కొలతలు ఉన్నాయి. మన అవగాహనకి అందని ఇలాంటి కొలతలు ఇంకా ఎన్ని ఉన్నాయి? అవి ఏవి? ఈ రకం ప్రశ్నలు వేసి వాటికి సమగ్రంగా సమాధానాలు వెతకటం మొదలుపెడితే ఇది ఒక ఉద్గ్రంథం అవుతుంది. కాని ఈ దిశలో ప్రయాణం చెయ్యటానికి అవసరమైన కొన్ని మౌలికమైన అంశాలని ఇక్కడ పరీక్షిద్దాం.

సైన్సులో ఉత్కంఠకి తావు లేదు కనుక చెప్పబోయే విషయాన్ని ముందు సంగ్రహిస్తాను. మొదట్లో – అంటే, కొన్ని శతాబ్దాల కిందటి వరకు – భూమి బల్లపరుపుగా, చాపలా ఉండేదని అనుకునేవాళ్ళం. భూమి బల్లపరుపుగా లేదు, దరిదాపు బంతి ఆకారంలోనో, కోడిగుడ్డు ఆకారంలోనో ఉందనే అవగాహన వచ్చేసరికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇదే విధంగా, మొదట్లో ఈ విశ్వం కూడా బల్లపరుపుగా, చాపలా ఉండేదని న్యూటన్ (Isaac Newton) అంతవాడే అనుకున్నాడు. అటు తరువాత గుండ్రంగా బంతిలా ఉందని కొందరు, గుర్రపు జీను ఆకారంలో ఉందని కొందరు తగువులాడేసుకున్నారు. పొడుగు, వెడల్పు, లోతు అనే కొలతలు ఉన్న క్షేత్రంలో బంతిని ఊహించుకోవటం కష్టం కాదు. విశ్వం యొక్క ఆకారాన్ని వర్ణించటానికి పొడుగు, వెడల్పు, లోతు చాలవు; కాలం అనే నాలుగవ కొలత కూడ ఉండాలని మనకి ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభంలోనే అవగాహనకి వచ్చింది. ఈ నాలుగు కొలతల క్షేత్రంలో విశ్వం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? గణితశాస్త్రం ప్రకారం మామూలు బంతిలా ఉండటానికి వీల్లేదు. ఈ నాలుగు కొలతల క్షేత్రంలో బంతిని పోలిన ఆకారం పిల్లలు ఆడుకోవడం కోసం మనం బజారులో కొనే లక్క బంతి. ఈ రకం లక్క బంతిని రెండు అర్ధ గోళాలుగా విడగొడితే లోపల మరొక లక్క బంతి ఉంటుంది. ఇటువంటి ‘బంతి కడుపులో మరొక బంతి’ ఆకారాన్ని గణితంలో ‘అతిగోళం’ (hypersphere)అంటారు. గుండ్రటి ఉల్లిగడ్డ అతిగోళానికి మరొక ఉదాహరణ. ఈ ఉల్లిగడ్డ కేంద్రం ‘ప్రస్తుత కాలం’ అని ఊహించుకుంటే, కేంద్రం చుట్టూ ఒకదానిమీద ఒకటిగా ఉన్న పొరల దొంతరలు గతించిన కాలాన్ని సూచిస్తాయి. కేంద్రం నుండి ఎంత దూరం పైకి వస్తే అంత పురాతన కాలానికి వెళుతున్నామని ఊహించుకోవాలి. కనుక నాలుగు కొలతల విశ్వంలో ఉన్న గోళానికి ఉల్లిగడ్డ ఒక నమూనా. ఇది అయిన్‌స్టయిన్ (Albert Einstein) ఊహించిన ప్రపంచం.

ఈ విషయం మన అవగాహనలోకి వచ్చి పూర్తిగా ఒక శతాబ్దం అయినా కాలేదు. అప్పుడే ఈ నమూనాకి సవరింపులు, సవాళ్ళు వస్తున్నాయి. ప్రస్తుతం బాగా చలామణీలో ఉన్న సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం అనే నాటకరంగానికి పొడుగు, వెడల్పు, లోతు, కాలం అనే నాలుగు కొలతలే కాక ఇంకా ఏడు, మొత్తం పదకొండు, కొలతలు ఉన్నాయి (దీని ఎం సిద్ధాంతం (M-Theory) అంటారు). ఈ పదకొండు కొలతలు గల రంగం మీద ఆడుతూన్న నాటకం పొడుగు, వెడల్పు, లోతు, కాలం అనే నాలుగు కొలతలు ఉన్న ‘తెర’ మీద ప్రక్షేపించబడుతోంది. మన పనిముట్లకీ (scientific tools), పరికరాలకీ ఈ నాలుగు కొలతల మీద ప్రక్షేపణ పొందిన నీడ నాటకం మాత్రమే కనిపిస్తోది. ఈ సిద్ధాంతానికి పునాదులు ఎలా పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం రోజూ చూసే భూమి బల్లపరుపుగా కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు గుండ్రంగా పళ్ళెం మాదిరి కనిపిస్తాయి. గ్రహాలు దూరదర్శని సహాయంతో చూస్తే చిన్న పళ్ళేలలా కనిపిస్తాయి. నక్షత్రాలు దూరదర్శనితో చూసినా సరే చుక్కలలాగే కనిపిస్తాయి.

చాల కాలం క్రితం భూమి బల్లపరుపుగానే ఉందని నమ్మేవారు. కాని ఈ బల్లపరుపుగా ఉన్న భూమి గుండ్రంగా – అంటే, అప్పడంలా వృత్తాకారంలో – ఉందా, లేక చదరంగా – చాపలా – ఉందా అన్న విషయం ఎవ్వరూ ఆలోచించినట్లు లేదు. ఒక విశాలమైన మైదానంలోకి కాని, సముద్రం మధ్యకి కాని వెళ్ళి చూస్తే భూమి బల్లపరుపుగా – అప్పడం ఆకారంలో – ఉందేమో అనిపిస్తుంది, కాని గోళాకారంగా అనిపించదు. కాని భూమి పైన ఉండే ఆకాశం బల్లపరుపుగా కాకుండా గోళాకారపు కప్పులా (like a dome) కనిపిస్తుంది.

సూర్యుడు, చంద్రుడు, భూమి గుండ్రమైన అప్పడాల ఆకారంలో (like a circular disk) కనిపిస్తూన్నా సరే, ఆకాశం గోళాకారంలో (like a sphere) కనిపిస్తూన్నా సరే, చాలా కాలం భూమి బల్లపరుపుగా ఉందనే నమ్మేరు ప్రజలు. మరొక విధమైన ఆలోచనకి వారికి అవకాశం వచ్చినట్లు లేదు. మన పురాణాలలో కూడ హిరణ్యాక్షుడు భూమిని చాపని చుట్టబెట్టినట్లు చుట్టబెట్టేసేడని చెబుతారు.

ఒకానొక రోజున గ్రీకుల మెదడులో “భూమి ఆకారం ఎలా ఉంటుంది?” అన్న ప్రశ్న పుట్టినప్పుడు, దానికి సమాధానం వారు వెతికినప్పుడు, దానికి పర్యవసానంగా క్షేత్రగణితం (Geometry) అనే శాస్త్రానికి పునాదులు పడ్డాయి. గ్రీకు భాషలో “geo” అంటే భూమి, “metry” అంటే కొలిచే శాస్త్రం అని అర్ధాలు స్ఫురిస్తాయి కనుక geometry అంటే భూమిని కొలిచే శాస్త్రం. ఈ శాస్త్రం పరిపక్వం చెందటానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. మొదట్లో అనుభవం మీద కొన్ని విషయాలు తెలుసుకున్నారు. తరువాత ప్రయోగాలు చేసి తమ అనుభవాల వెనక ఉన్న అర్ధం అవగాహన చేసుకున్నారు. అటుపైన అనుభవాలని, ప్రయోగాలని రంగరించి సిద్ధాంతాలు లేవదీశారు. ఈ సమయంలోనే రుజువు అక్కరలేని విషయాలని ‘స్వయం విదితం’ (self-evident) అని చెప్పి వాటిని ‘విస్పష్ట సత్యాలు’ (axioms) గా స్వీకరించి, రుజువు చెయ్యవలసిన వాటిని ‘ప్రవచనాలు’ (propositions) అనిన్నీ, రుజువు చెయ్యగలిగిన వాటిని ‘సిద్ధాంతాలు’ (theorems) అనిన్నీ విడదీసి, తర్కబద్ధమైన సిద్ధాంత సౌధాన్ని నిర్మించారు. ఈ పని అంతా క్రీస్తు పూర్వం 300 నాటికి జరిగిపోయి, యూక్లిడ్ (Euclid) రాసిన ‘ఎలిమెంట్స్’ (Elements) అనే పుస్తకంలో నిక్షిప్తం చెయ్యబడింది. యూక్లిడ్ క్షేత్రగణితంలో బొమ్మలన్నీ బల్లపరుపుగా ఉన్న తలం పై (అంటే, కాగితం మీద కాని, పలక మీద కాని) గీసినట్లు ఊహించుకుంటాం. ఉదాహరణకి, ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని యూక్లిడ్ క్షేత్రగణితంలో ఒక సిద్ధాంతం చెబుతుంది. కాని ఈ త్రిభుజాన్ని గోళాకారంగా ఉన్న తలం మీద గీసి, మూడు కోణాల మొత్తాన్నీ చూస్తే ఆ మొత్తం 180 డిగ్రీలు ఉండదు.

ఈ కథనం చదివి క్షేత్రగణితపు సూత్రాలని మొట్టమొదటగా వాడినది గ్రీకులు అని అనేసుకోకండి. అంతకు 1700 సంవత్సరాలకి ముందే – క్రీస్తు పూర్వం 2000 ప్రాంతాలలో – క్షేత్రగణితానికి బాబిలోనియాలోనూ, ఈజిప్టులోనూ, చైనాలోనూ పునాదులు పడ్డాయి. (ఆ సమయంలో భారతదేశంలో కూడ ఈ జ్ఞానసంపద ఉండే ఉండొచ్చు కాని ‘ఎవరు ముందు?’ అనే చారిత్రక విషయం ఇక్కడ చర్చనీయాంశం కాదు.) ఏది ఏమైనప్పటికీ, క్రీస్తు పూర్వం 2000 నాటికే మనం ఈ రోజు పైథాగరస్ సిద్ధాంతం (Pythagorean Theorem)అని పిలచే లంబకోణ త్రిభుజ లక్షణాలు పైన ఉటంకించిన దేశాలలో విజ్ఞులకి తెలుసు. ఈ దేశాలలో ఉన్న పండితులకి గణిత, ఖగోళ శాస్త్రాలలో పాండిత్య ప్రకర్ష ఉన్నప్పటికీ భూమి గోళాకారంలో ఉందని ఎవ్వరూ విస్పష్టంగా వక్కాణించిన దాఖలాలు లేవు. భూమి గోళాకారంలో ఉంది అనటానికి అక్కడా అక్కడా ఆధారాలు కనబడుతూన్నా ఏ ఒక్కడూ తెగించి తర్కం చూపెడుతూన్న దారి వెంబడి మేధోలంఘనం (intellectual leap) చెయ్యలేదు.

అలాగే, ఎక్కువగా ప్రయాణాలు చేసే వర్తకులు ఒక విషయం గమనించేరు: దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూన్నప్పుడు, దూరం వెళుతూన్న కొద్దీ ధ్రువ నక్షత్రం (pole star) ఆకాశం లో దిగువకి జరుగుతూ కనిపిస్తుంది. అదే ప్రయాణంలో, నడి మధ్యాహ్నపు సూర్యుడు క్రమేపీ నెత్తి మీదకి ఎక్కుతూ కనిపిస్తాడు. భూమి బల్లపరుపుగా ఉంటే ఈ రెండు సంఘటనలు సాధ్యం కావు. ఈ ప్రత్యక్ష నిదర్శనం కనిపిస్తూన్నా ఎవ్వరూ అంత దూరం తర్క బద్ధంగా ఆలోచించినట్లు లేదు.

చైనావారు మరొక అడుగు ముందుకు వెళ్ళి , లంబకోణ త్రిభుజపు లక్షణాలు ఉపయోగించి (లేదా, ఈ నాటి పరిభాషలో పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి), సులభంగా చేరలేని ద్వీపం మీద ఉన్న కొండ శిఖరం ఎంత ఎత్తు ఉందో లెక్క కట్టేరు. అదే పద్ధతిని ఉపయోగించి భూమికి సూర్యుడు ఎంత దూరమో కూడ లెక్క కట్టేరు. తరవాత చైనా వారు ఇదే సూత్రాన్ని ఉపయోగించి భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో అంచనా వేసేరు. (కొండ శిఖరం ఎత్తుని కొలిచినట్లే సూర్యుడి “ఎత్తు”ని కొలిచి ఉంటాడు.) ఈ అంచనా ప్రకారం సూర్యుడు హాస్యాస్పదమైనంత దగ్గరగా ఉన్నాడని తేలింది! వీటిద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, ఈ ఫలితంలో ఖచ్చితత్వం లేకపోయినా పద్ధతిలో దోషం లేదని. A నుండి B కి ఉన్న దూరం భూమి ఆకారాన్ని బట్టి మారుతుంది; గోళాకారంగా ఉన్న భూమి మీద నడిస్తే ఈ దూరం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ స్వల్పమైన తేడా వల్ల లెక్క కట్టిన సూర్యుడి దూరంలో చాలా మార్పు కనిపించింది. ఇదే రకం ప్రయోగాన్ని క్రీ. పూ. 3 వ శతాబ్దంలో ఎరాతోస్తనీస్ (Eratosthenes) అనే గ్రీకు శాస్త్రవేత్త మళ్ళా చేసేడు. కానీ, ఈయన భూమి గుండ్రంగా, గోళాకారంలో ఉందనే భావించి సూర్యుడి దూరాన్ని సరిగ్గా కొలవటమే కాకుండా భూమి ఎంత పెద్ద గోళమో కూడ అంచనా వెయ్యగలిగేడు.


క్రీ. పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. పదిహేడవ శతాబ్దానికి వద్దాం. గెలిలియో (Galilio) దూరదర్శినితో ఆకాశంలోకి చూసిన తరువాత మన దృక్పథమే పూర్తిగా మారిపోయింది. అటు తరువాత న్యూటన్ వచ్చి ఈ విశ్వాన్ని అనంతమైనదిగా ఉహించుకున్నాడు. అంతే కాకుండా న్యూటన్ తన సిద్ధాంతాలన్నిటికీ ఆసరాగా ఈ అనంతమైన విశ్వం బల్లపరుపుగా ఉన్నాదని ఊహించుకున్నాడు. ఈ నమ్మకంతోటే న్యూటన్ తన సిద్ధాంత సౌధాన్ని యూక్లిడ్ నిర్మించిన క్షేత్రం మీద నిర్మించేడు. యూక్లిడ్ క్షేత్రం బల్లపరుపుగా ఉంది కనుక న్యూటన్ ఊహించుకున్న విశ్వం కూడ బల్లపరుపుగానే ఉందని మనం అనుకోవచ్చు కదా?

న్యూటన్ తను నిర్మించిన ‘మేడ’ బీటలుదేరి కూలిపోబోతున్నాదని కలలో కూడ అనుకొని ఉండడు. కానీ, న్యూటన్ తరవాత రెండు శతాబ్దాలైనా తిరగకుండానే విశ్వాకారం యూక్లిడ్ క్షేత్రంలా బల్లపరుపుగా లేదని తేలిపోయింది, ఆ విశ్వంలో అనువర్తించే చలన సూత్రాలు న్యూటన్ ఉద్ఘాటించినట్లు వాడడం కుదరదనీ, వాటికి కొద్ది కొద్ది మార్పులు చెయ్యవలసి ఉంటుందనీ తేలిపోయింది. న్యూటన్ నిర్మించిన సౌధం ఇలా కూలిపోవటానికి రెండు వైపుల నుండి దాడి జరిగింది. ఒక వైపు నుండి యూక్లిడ్ నమ్ముకున్న ‘విస్పష్ట సత్యాలు’ విస్పష్టమూ కాదు, సత్యమూ కాదు అని ఆక్షేపణ వచ్చింది. ఈ ఆక్షేపణకి సారథ్యం వహించినది రష్యా దేశపు నికొలాయి లొబచేవ్‌స్కీ (Lobachevsky) మరియు హంగరీ దేశపు యానోస్ బోల్యాయీ (Bolyai). రెండవ వైపు నుండి జరిగిన దాడి విశ్వాకారం ‘యూక్లిడ్ క్షేత్రం’ లా ఉంటుందనే న్యూటన్ నమ్మకం మీద. ఈ దాడికి సారథి జెర్మనీ దేశస్తుడైన బెర్నార్డ్ రీమాన్ (Bernard Riemann).

తన మనోభావాలనీ, సిద్ధాంతాలనీ రీమాన్ ఎలా ప్రభావితం చేసేడో అయిన్‌స్టయిన్ ఇలా చెబుతాడు: “…రీమాన్ ఏకాకిలా జీవితం గడుపుతూ ఎవ్వరికీ అర్థం కాకుండా ఉండిపోయినా, విశ్వాకారానికి రూపులు దిద్దటంలో అతని మేధోత్పత్తి విజ్ఞుల హృదయాలని జయించింది..”. ఈ ప్రశంసకి ప్రేరణ కారణం 28 ఏళ్ళ రీమాన్ గోటింగెన్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ‘క్షేత్రగణితపు ప్రాతిపదికల పై వ్యాఖ్యానం’ (“On the hypotheses on which geometry is based”)అన్న అంశం పై ఇచ్చిన ప్రసంగం. ఈ ప్రసంగంలో రీమాన్ ఎన్నో కొత్త భావాలని ప్రవేశపెట్టేడు; ‘స్థలం’ (space) లేదా ‘అంతరాళం’ అన్న మాటకి కొత్త భాష్యం చెప్పేడు.

యూక్లిడ్ క్షేత్రగణితానికి మౌలికాంశాలు బల్లపరుపు కాగితం మీద కొలబద్ద, వృత్తలేఖిని ఉపయోగించి గీసే బొమ్మలు . రీమాన్ ఈ పాత భావాలని, పాత పదజాలాన్ని, కాగితాల మీద గీసే బొమ్మలనీ పక్కకి తోసి సరికొత్త పద్ధతిలో, సరికొత్త పదజాలంతో సరికొత్త క్షేత్రగణితాన్ని నిర్మించేడు. రెండు దిశలలో మాత్రమే వ్యాప్తి చెందిన ‘బల్లపరుపు ప్రదేశం’ అనే భావన వేసిన సంకెళ్ళని సడలించి ఈ సరికొత్త క్షేత్రగణితం కొత్త భవనానికి పునాదులు వేసింది. రీమాన్ ప్రవేశపెట్టిన కొత్త పదజాలంలో మొదటిది మేనిఫోల్డ్ (manifold). మేనిఫోల్డ్ అంటే మరేమీ కాదు – అదొక బిందువుల సమూహం; మనకి ఇంతవరకు పరిచయమయిన ఆకారాలతో నిమిత్తం లేకుండా ఈ బిందుసమూహాన్ని ఊహించుకొండి. ఒక క్షేత్రంలో ఒక బిందువు ఎక్కడ ఉందో తెలియచెయ్యటానికి కొన్ని సంఖ్యలు వాడతాం కదా. ఉదాహరణకి విశాఖపట్నం ఎక్కడుందో చెప్పాలంటే దాని అక్షాంశం, రేఖాంశం చెబితే సరిపోతుంది. ఎవరెస్టు శిఖరాగ్రం ఎక్కడుందంటే దాని అక్షాంశం, రేఖాంశం, ఎత్తు చెబితే సరిపోతుంది. “ఒక బిందువు ఉనికిని వర్ణించటానికి, గణితశాస్త్రం దృష్ట్యా, మూడే మూడు కొలతలు ఉండాలనే నిబంధన ఏదీ లేదు, ఎన్ని కొలతలు కావలిస్తే అన్ని కొలతలు వాడుకోవచ్చు, అవసరమైతే అనంతమైనన్ని కొలతలు వాడుకోవచ్చు” అని రీమాన్ అన్నాడు. ఇది తొందరగా మింగుడు పడని క్లిష్టమైన భావన అయినప్పటికీ చిన్న ఉపమానంతో ఉదహరిస్తాను. ఒక మనిషిని వర్ణించాలంటే పొడుగు, బరువు, మాట్లాడే భాష, శరీరపు ఛాయ, జుత్తు రంగు ‘కొలతలు’ గా వాడి ఆ మనిషిని 5-దిశల క్షేత్రంలో ఒక బిందువుగా చూపవచ్చు. ఈ రకం క్షేత్రంలో ఉన్న బిందుసమూహం పేరు మేనిఫోల్డ్. మనం తెలుగులో ‘బిందుసమూహం’ అనొచ్చు.

రీమాన్ ప్రవేశపెట్టిన రెండవ భావన మెట్రిక్ (metric), లేదా కొలమానం. యూక్లిడ్ క్షేత్రగణితంలో రెండు బిందువుల మధ్య దూరం కావాలంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని కొలమానంగా ఉపయోగించి లెక్క కడతాం. యూక్లిడ్ గణితంలో కాగితం మీద ఉన్న ఒక బిందువుని వర్ణించటానికి రెండు అక్షాంశాలు (co-ordinates) కావాలి. “రెండు బిందువుల x-అంశాల మధ్య దూరాన్నీ y-అంశాల మధ్య దూరాన్నీ వర్గీకరించి కలపగా వచ్చిన మొత్తం ఆ రెండు బిందువుల మధ్య దూరపు వర్గానికి సమానం” అన్నది మనందరికి పరిచయమైన పైథాగరస్ సూత్రం. ఈ సూత్రం రీమాన్ క్షేత్రంలో ఎలా మార్పు చెందుతుందో చూద్దాం. ఉదాహరణకి, రెండు కొలతలు గల రీమాన్ క్షేత్రంలో రెండు బిందువుల మధ్య దూరం యొక్క వర్గం కావాలంటే ఆయా బిందువుల x-అంశాల మధ్య దూరాన్నీ y-అంశాల మధ్య దూరాన్నీ వర్గీకరించి, వాటిని ఆ పళంగా కలిపేయకుండా, ఆ వర్గాలని వేర్వేరు నిష్పత్తులలో కలిపగా వచ్చిన మొత్తాన్ని ఆ బిందువుల మధ్య దూరంగా నిర్వచించవచ్చు అన్నాడు రీమాన్. (The square of distance between two points can be defined as the weighted average of the square of the differences between the individual coordinates). ఇది కేవలం సాధరణీకరించిన పైథాగరస్ సిద్ధాంతం (Generalized Pythagoras Theorem) అని గమనించండి.

రీమాన్ ప్రవేశపెట్టిన మరొక రెండు కొత్త భావాలు: ఒంపు లేదా వక్రత (curvature), సంస్థరణం(embedding). యూక్లిడ్ నిర్మించిన ప్రపంచంలో వక్ర రేఖలు (curved lines), వక్ర తలాలు (curved surfaces) ఉంటాయి. వృత్తంలో ఒక భాగమైన చాపం (arc) వక్ర రేఖకి ఒక ఉదాహరణ. గోళం (sphere) యొక్క ఉపరితలంలో ఒక భాగం వక్ర తలానికి ఉదాహరణ. కాని యూక్లిడ్ ప్రపంచంలో ‘వక్ర స్థలం’ (curved space) అనే భావన లేనే లేదు. కాని రీమాన్ ప్రపంచంలో ఎన్ని కొలతలు ఉన్న ప్రదేశంలో అయినా, ఏ బిందు సమూహానికయినా వక్రత (curvature) ఉండొచ్చు; ఒకే ఒక దిశలో వ్యాప్తి చెందిన తీగకి వక్రత ఉండొచ్చు, రెండు దిశలలో వ్యాప్తి చెందిన అప్పడానికి వక్రత ఉండొచ్చు, మూడు దిశలలో వ్యాప్తి చెందిన బంతికి వక్రత ఉండొచ్చు, నాలుగు దిశలలో వ్యాప్తి చెందిన ‘మరొకదాని’కి వక్రత ఉండొచ్చు. ఈ వక్రతని గణితపరంగా తప్ప బొమ్మల రూపంలో ఊహించుకోవటం కష్టం.

రెండు దిశలలో వ్యాప్తి చెందిన పూరీ నూనెలో పడగానే ‘పొంగటం’ ఒక రకమైన వక్రత. ఇలా రెండు దిశలలో వ్యాప్తి చెందిన పూరీ వక్రత చెందినప్పుడు మూడవ దిశలోకి పొంగింది. కనుక రెండు దిశలలో ఉన్న పూరీ పొంగినప్పుడు మనం బల్లపరుపుగా ఉన్న ప్రపంచంలో బంధితులమై ఉండుంటే ఆ పొంగు కనిపించి ఉండేది కాదు; మనం మూడు దిశల ప్రపంచంలో ఉన్నాం కనుక చూడగలుగుతున్నాం. ఇదే విషయాన్ని మరొక విధంగా చెబుతాను. రెండు దిశల ప్రపంచంలో కనిపించని వక్రత వంటి లక్షణాలు కనిపించాలంటే ఆ పూరీ ని మూడు దిశల ప్రపంచంలో సంస్థరించాలి (లేదా embed చెయ్యాలి). ఇప్పుడు పలచగా ఉన్న పూరీ నుండి గుండ్రంగా ఉన్న భూమి మీదకి వద్దాం. భూమి ఉపరితలం కూడ రెండు దిశలలో మాత్రమే వ్యాప్తి చెంది ఉందని మరచిపోకండి – పూరీలా నేలబారుగా కాకుండా ఉబ్బెత్తుగా ఉన్నా, దాని వ్యాప్తి రెండు దిశలలోనే! ఇలా వ్యాప్తి చెందిన భూమి ఉపరితలం మీద ఉన్నంతసేపూ మనకి భూమి గోళాకారం (మూడవ దిశలో చెందిన వ్యాప్తి) అవగాహన కాదు; భూమి ఉపరితలం నుండి పైకి లేచినప్పుడే భూమి గోళాకారం మనకి అవగాహన అవుతుంది.

ఈ కొత్తరకం ఊహలు పరిపూర్ణంగా అర్ధం కావాలంటే గణిత శాస్త్రపు లోతులు అవగాహన చేసుకునే అనుభవం ఉండాలి. యూక్లిడ్‌లా కాగితం మీద బొమ్మలు గీసి చూపించటానికి వీలు పడదు. ఇది అర్ధం చేసుకోవటం ఎంత కష్టం అనిపించినా ఒక విషయం మాత్రం మరువకూడదు. విశ్వాకారం అవగాహన కావాలంటే శతాబ్దాలపాటు పాతుకుపోయిన యూక్లిడ్ మార్గం –సుగమమైనా, ప్రయోజనం లేని మార్గం; ఎంత దుర్గమం అయినా రీమాన్ చూపెట్టిన మార్గమే మనకి శరణ్యం. విశ్వం ఆకారాన్ని సాంతం (finite) అయిన, అపరిమిత (unbounded) క్షేత్రం (field) తో ఒక నమూనాని నిర్మిస్తే అది విశ్వం నిజమైన ఆకారానికి దగ్గరలో ఉంటుంది అని రీమాన్ చెబుతాడు. బంతి ఆకారం, లేదా గోళాకారం మనకి అనుభవంలో ఉన్నదీ, మూడు దిశలలో వ్యాపించినదీ, సాంతం అయినదీ, అపరిమితం అయిన స్థలానికి ఉదాహరణ. రీమాన్ తన విశ్వాకారాన్ని వర్ణించటానికి ప్రయత్నం చెయ్యలేదు; మూడు కంటె ఎక్కువ దిశలలో వ్యాప్తి చెందిన స్థలాలని గణితపరంగా వర్ణించేడు, అంతే. ఆ నమూనాని అయిన్‌స్టయిన్ వాడుకుని నాలుగు కొలతల విశ్వాన్ని నిర్మించేడు.

విశ్వాంతరాళం రీమాన్ చెప్పినట్లు ఒంపు తిరిగి ఉంది అంటే, యూక్లిడ్ వాడిన బల్లపరుపు క్షేత్రంలా లేదనే కదా! అంటే యూక్లిడ్ సూత్రాలన్నీ ఈ ఒంపు తిరిగిన క్షేత్రం మీద పని చెయ్యవని మనం గ్రహించాలి. ఉదాహరణకి పైథాగరస్ సిద్ధాంతం విశ్వాంతరాళంలో పని చెయ్యదు. ఉదాహరణకి మనం భూమి నుండి 3 కాంతివత్సరాలు (light years) దూరంలో ఉన్న A అనే గెలాక్సీ దగ్గరకి వెళ్ళి, అక్కడ నుండి 90 డిగ్రీలు కుడి పక్కకి తిరిగి, 4 కాంతివత్సరాలు దూరంలో ఉన్న B అనే గెలాక్సీకి ప్రయాణం చేసి వెళ్ళేం అనుకుందాం. ఇప్పుడు భూమికీ, Bకి మధ్య ఉండే అత్యల్ప దూరం (shortest distance) 5 కాంతివత్సరాలు ఉంటే, భాస్కర సిద్ధాంతం పని చేసిందనిన్నీ, విశ్వాంతరాళం బల్లపరుపుగా ఉందనిన్నీ మనం తీర్మానించ వచ్చు; అలా కాక పోతే విశ్వాంతరాళం రీమాన్ చెప్పినట్లు ఒంపు తిరిగి ఉందని ఒప్పుకోవాలి. ఈ దూరం 5 కాంతివత్సరాలు కంటే తక్కువ ఉంటే ఈ ఒంపుది ధనాకారం (positive curvature) అనిన్నీ, 5 కాంతివత్సరాలు కంటే ఎక్కువ ఉంటే ఈ ఒంపుది రుణాకారం (negative curvature) అనీ అంటారు. వందల సంవత్సరాల క్రిందట గ్రీకులు భూమి (యూక్లిడ్ నిర్వచనం ప్రకారం) గోళాకారంలో ఉందని నిర్ధారించినట్లే, ఈ నాడు విశ్వం (రీమాన్ నిర్వచనం ప్రకారం) గోళాకారంలో ఉందని అంటాం.

ఇంతకీ విశ్వం బంతిలా గుండ్రటి ఆకారంలో ఉందా? విశ్వం బంతిలా ఉండుంటే ఇంత రాద్ధాంతం చెయ్యవలసిన పనే ఉండేది కాదు; మొదట్లోనే విశ్వం బంతిలా ఉందనో, నారింజ పండులా ఉందనో, మా పెద్ద తెలుగు మేష్టారి ముక్కుపొడుం డబ్బాలా ఉందనో చెప్పేసి చేతులు కడిగేసుకుని ఉండేవాడిని. కాని ఈ బంతి నమూనా తరవాత్తరవాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు గుండ్రంగా ఉన్నవన్నీ బంతులు కావని మనం గమనించాలి. సబ్బు బుడగ గుండ్రంగా ఉంటుంది, టెన్నిస్ బంతి గుండ్రంగా ఉంటుంది, బందరు లడ్డు గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా ఉన్న ఉల్లిపాయలు కూడా ఉంటాయి. వీటిల్లో విశ్వాకారం ఏ రకం గోళం అన్నది తేల్చవలసిన ప్రశ్న. మరికొంచెం లోతుగా వెళదాం.

యూక్లిడ్ నిర్వచనానికి సరిపడే గోళాకారం మనం రోజూ చూసే బంతి. రీమాన్ నిర్వచనానికి సరిపడే గోళం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం అంచెల మీద ఊహించుకుందాం. వృత్తం (circle) అన్న మాటకి నిర్వచనం ఏమిటి? గుండ్రంగా ఉన్న పళ్ళెం అంచుని ఆనుకుని ఉన్న ఒంపు తిరిగిన రేఖ. పళ్ళెం (plate, disk) అన్న భావానికీ, ఉచ్చు (loop) అన్న భావానికీ తేడా ఉంది కదా, ఇప్పుడు బుడగ (bubble) అన్న మాటని గుండ్రంగా ఉన్న సబ్బు బుడగతో పోల్చుదాం. గోళం (sphere) అన్న మాటని గుండ్రంగా ఉన్న లడ్డుండతో పోల్చుదాం. ఇప్పుడు ద్వి-మాత్రకమైన (two-dimensional) పళ్ళెం చుట్టూ ఉన్న పరిధి (లేదా ఉచ్చు) ఏక-మాత్రకం (one-dimensional) మాత్రమే అని గమనించండి. (గుండ్రంగా అమర్చిన దారం వెంబడి మనం ఒకే ఒక దిశలో ప్రయాణం చెయ్యగలం.) అలాగే త్రి-మాత్రకమైన లడ్డుండకీ ద్వి-మాత్రకమైన సబ్బు బుడగకీ మధ్య తేడా గమనించండి. (సబ్బు బుడగకి ఉపరితలం ఉంది కాని, మందం లేదు కనుక దాని మీద రెండు దిశలలోనే ప్రయాణం చెయ్యగలం.) అంటే, గణిత పరిభాషలో వృత్తం ‘ఏక-మాత్రకమైన, పరిమితి లేని, ఒంపు తిరిగిన గీత’. బుడగ ‘ద్వి-మాత్రకమైన, పరిమితి లేని, ఒంపు తిరిగిన ఉపరితలం (surface)’.

త్రి-మాత్రకమైన (3-dimensional) బుడగ ఎలా ఉంటుంది? ఈ రకం బుడగ మన అనుభవంలో సాధారణంగా తారస పడదు, కాని ఊహకి పరిమితి లేదు కదా, ఒక పెద్ద సబ్బు బుడగలో మరొక చిన్న సబ్బు బుడగని ఊహించుకోవటం కష్టం కాదు. ఈ రకంగా ఊహించుకున్న సబ్బు బుడగ చూడటానికి గుండ్రంగానే ఉంటుంది, కాని అది నాలుగు దిశలలో వ్యాపించి ఉంటుంది (బుడగలో ఉన్న బుడగని వర్ణించటానికి పొడుగు, వెడల్పు, ఎత్తు కాకుండా ‘లోతు’ కూడా ఉంటుంది కదా!). ఈ రకం బుడగలో బుడగని మీరు ఊహించుకోలేకపోతే బజారులో కొండపల్లి లక్కబొమ్మలని చూడండి. (నిజానికి ఈ రకం బొమ్మలు మొట్టమొదట రష్యాలో వచ్చేయి.) ఈ లక్క మనుష్యుల నమూనా కంటె నాకు నచ్చిన మరొక నమూనా ఉంది. అదే గుండ్రటి ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డలో ఎన్నో పొరలు – ఒక దానిలో మరొకటి ఉంటాయి కదా, పైనున్న గుండ్రటి పొర ఒక సబ్బు బుడగ లాంటిది, దాని లోపల పొర మరొక గుండ్రటి బుడగ లాంటిది. ఉల్లిగడ్డలో ఇటువంటి పొరలు ఎన్నో ఉంటాయి.

ఇంతవరకు నేర్చుకున్న విషయాల నేపథ్యాన్ని ఉపయోగించి మనకి గోచరమయ్యే విశ్వం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఒక కొంచెం ఊహిద్దాం. ఇక్కడ రెండు నమూనాలు నిర్మించటానికి అవకాశం ఉంది. మొదట భూకేంద్ర నమూనాని (geocentric model) వర్ణించటానికి ప్రయత్నిస్తాను. ఈ నమూనాలో మనం భూమి మీద కూర్చుని విశ్వాన్ని చూస్తూ ఉంటాం. అప్పుడు పేద్ద ఉల్లిగడ్డ పొట్టలో, మధ్యలో, ఒక గోళీకాయలా భూమి ఉందన్నమాట. మనకి గోచరమయ్యే ప్రతి గ్రహాన్ని, నక్షత్రాన్నీ ఈ గోళీ నుండి సందర్భోచితమైన దిశలోనూ, దూరం లోనూ అమర్చుదాం. ఆధునిక ఖగోళశాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే మనం భూమి నుండి దూరం వెళుతూన్న కొద్దీ కాలంలో కూడ వెనక్కి వెళుతూ ఉంటాం. అంటే ఉల్లిగడ్డ పైపొరలు సృష్టి జరిగిన కొత్త రోజులని సూచిస్తాయి. అన్నిటికంటె పైనున్న పొర, సృష్టికి మొదలు. బ్రహ్మాండ విచ్ఛిన్న వాదాన్ని నమ్మే వారికి ఆ పొర “బిగ్ బేంగ్” ని సూచిస్తుందన్నమాట.

పైన చెప్పిన నమూనాకి ప్రత్యామ్నాయంగా శక్తిని కేంద్రంగా (big bang centric model) ఉపయోగించి మరొక నమూనాని తయారు చెయ్య వచ్చు. ఈ రెండు నమూనాలు ఒకదానికొకటి బొమ్మ-బొరుసు లాంటివి. ఒక రబ్బరు బుడగలో పై ఉపరితలం బొమ్మా, లోపలి ఉపరితలం బొరుసూ అయితే, బుడగ పేలిపోకుండా, చిరిగిపోకుండా, పై తలాన్ని లోపలికి, లోపలి ఉపరితలాన్ని పైకి వచ్చేటట్లు ‘బోర్లించేం’ అనుకొండి. అటువంటి ప్రక్రియని సాంకేతిక పరిభాషలో ‘ఎవర్షన్’ (eversion: inversionని పోలిన కొత్త మాట) అంటారు. అలాంటి ప్రక్రియ చెయ్యగలిగితే ‘భూ కేంద్రక నమూనా’, ‘శక్తి కేంద్రక నమూనా’, రెండూ సర్వ సమానాలు. ఈ క్లిష్టమైన విషయాలు అర్ధం కావాలంటే ప్రదేశ శాస్త్రం లేదా సంస్థితి శాస్త్రం (topology) అధ్యయనం చెయ్యాలి.

ఈ చర్చని పూర్తిచేసే లోగా అయిన్‌స్టయిన్ రీమాన్ ని అంతలా ఎందుకు పొగిడేడో చూద్దాం. అయిన్‌స్టయిన్ రీమాన్ నమూనాని తీసుకుని దానికి చిన్న చిన్న మెరుగులు దిద్దేడు. రీమాన్ నమూనాలో స్థలానికి ఎన్ని కొలతలయినా ఉండొచ్చు: పొడుగు, గిడుగు, వెడల్పు, గిడల్పు, లోతు, గీతు, ఇలా ఎన్ని దిశలలో కావలిస్తే అన్ని దీశలలో అక్షాలు(axis) ఊహించుకుని స్థలాలు నిర్మించవచ్చు. ఈ అక్షాలు అన్నీ నిజ రేఖలే (real lines). రీమాన్ ప్రత్యేకించి పైకి అనకపోయినా ఈ నిజ రేఖలన్నీ స్థలం (space) యొక్క వ్యాప్తిని కొలుస్తాయి. ఇక్కడ అయిన్‌స్టయిన్ చేసిన సవరింపులు రెండే రెండు. ఒకటి, నాలుగు దిశలలో వ్యాప్తి చెందిన రీమాన్ క్షేత్రం తనకి చాలు అన్నాడు. రెండు, ఈ నాలుగు దిశలలో మూడు స్థలం అక్షాలనీ (space coordinates), ఒకటి కాలం అక్షాన్నీ (time coordinate) సూచిస్తాయన్నాడు. ఈ నాలుగు అక్షాలు నిర్వచించే ప్రదేశాన్ని స్థల-కాల సమవాయం (space-time continuum) అన్నాడు. దీన్ని మనం స్థల-కాల క్షేత్రం (space-time field) అని కూడా అనొచ్చు. ఈ విజ్ఞమంతా రీమాన్ పెట్టిన భిక్షే. ఈ రీమాన్ క్షేత్రంలో అయిన్‌స్టయిన్ తన సాధారణ సాపేక్ష సిద్దాంతం (General Theory of Relativity) అనే సౌధాన్ని నిర్మించాడు. యూక్లిడ్ క్షేత్రంలో న్యూటన్ నిర్మించిన గురుత్వాకర్షణ సిద్ధాంతసౌధం కంటే అయిన్‌స్టయిన్ నిర్మించిన సాపేక్ష సిద్దాంత సౌధం ఎంతో రమ్యమైనది.

మరయితే అయిన్‌స్టయిన్ చెప్పినదే ఆఖరి మాటా? పైన పదకొండు కొలతలు అన్నాను కదా! వాటి మాటేమిటి? ఈ నాటి శాస్త్రజ్ఞులు అయిన్‌స్టయిన్ ని సవాలు చేస్తున్నారు. విశ్వానికి పది స్థల నిర్దేశపు కొలతలు (ten space dimensions) ఒక కాల నిర్దేశపు కొలత (one time dimension), వెరసి మొత్తం పదకొండు కొలతలు ఉన్నాయని వారు ఊహిస్తున్నారు. ఈ వాదనలో ఎంత పటుత్వం ఉందో కాలమే నిర్ణయించాలి. చూద్దాం.

విశ్వానికి ఉల్లిపాయ నమూనా ని పోలిన నమూనాని పదమూడవ శతాబ్దంలో (న్యూటన్, గెలిలియో లకి ముందే) ఒక ఇటాలియన్ కవి నిర్మించేడు. కవి ఊహించలేనిది లేదు కదా! తన ఊహలని ఉరవళ్ళు తొక్కనిస్తూ, ఇటలీ దేశపు కవి అయిన డాంటే, డివైన్ కామెడీ (Divine Comedy) అనే గ్రంథాన్ని రాసేడు. ఈ గ్రంథంలో డాంటే ఒక చోట విశ్వం ఆకారాన్ని వర్ణిస్తాడు. ఆ వర్ణనకీ, పైన ఉదహరించిన భూకేంద్ర నమూనాకి కొన్ని పోలికలు ఉండటం కేవలం కాకతాళీయమేనేమో! ఈ గ్రంథంలో ఒకదాని పొట్టలోకి చొచ్చుకుపోయిన మరొక గోళాల సమూహాన్ని వర్ణిస్తాడు కవి. ఈ గోళాలన్నిటి మధ్య భూమి ఉంటుంది. ఒక ప్రయాణీకుడు భూలోకం వదలి ఊర్ధ్వ గోళాలలోకి ప్రాయాణించి చివరికి నక్షత్రగోళం చేరుకుంటాడు. అక్కడ ధగధగ మెరిసే వెలుగు చుట్టూ తొమ్మిది ఏక కేంద్ర వర్తులాలలో (concentric circles) దేవదూతలు కనిపిస్తారు. ఇది దేవలోకపు స్వర్గం. ఈ ఏక కేంద్ర వర్తులాలల్ని ఉల్లిపాయ రూపంలో ఉన్న అతిగోళాలమీదకి ప్రక్షిప్తం (project) చేస్తే ‘అతిస్తూపాలు’ (hyper pyramids) వస్తాయి. ఈ అతిస్తూపాల శిఖరాగ్రమే మానవుల స్వర్గం; ఈ స్తూపాల మట్టు మానవుల నరకం.

హిందూ పురాణాలలో కూడ భూలోకం, స్వర్గం, నరకం మొదలైనవాటికి నమూనాలు ఉన్నాయి. ఒక నమూనాలో ఒక సముద్రం మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఈ పర్వతం చుట్టూ ఉన్న సముద్రంలో నాలుగు దీవులు ఉంటాయి. ఈ నాలుగింటిలోనూ ఒక దాని పేరు జంబూద్వీపం. ఈ జంబూద్వీపపు ఉత్తర దిగ్భాగాన్నీ, దక్షిణ దిగ్భాగాన్నీ విడదీస్తూ హిమవత్పర్వతాలు ఉంటాయి. ఈ హిమాలయాలకి దక్షిణాన ఉన్నది భరతవర్షం. ఈ వర్ణనని బట్టి మేరు పర్వతం అంటే ఉత్తర ధ్రువం అని కొందరు ప్రతిపాదిస్తున్నారు. అప్పుడు జంబూద్వీపం అంటే ఆసియా, యూరప్ లు కలసి ఉన్న యూరేసియా ఖండం. ఎక్కడో గుహలలోనో, అడవులలోనో కూర్చుని తపస్సు చేసుకునే వారు కంటికి కనిపించే ఆకాశాన్ని చూసి విశ్వాకారం ఊహించటం తేలిక, కంటికి ఆనని భూమి ఆకారం ఊహించటమే కష్టం. అలాగని మన పురాణాలలో హాస్యాస్పదమైన నమూనాలు కూడా లేకపోలేదు. మరొక పురాణంలో మేరు పర్వతం చుట్టూ ఉన్న సముద్రంలో వలయాకారంలో ఉన్న దీవి పేరు జంబూద్వీపం. ఈ జంబూ ద్వీపం చుట్టూ ఉన్న ఉప్పునీటి సముద్రంలో ఉండే ద్వీపం పేరు ప్లక్షద్వీపం. దాని చుట్టూ వలయాకారాలలో, పాల సముద్రం, మరో ద్వీపం, పెరుగు సముద్రం, మరో ద్వీపం, నెయ్యి సముద్రం, అలా ఉండి ఆఖరున ఉండే ఏడవ సముద్రం మంచినీటి సముద్రం. ఇదీ భూలోకపు నమూనా!

పురాతన హిందువుల రాతలలో విశ్వ స్వరూపాన్ని వర్ణించటానికి కూడ నమూనాలు ఉన్నాయి. ఒక నమూనాలో విశ్వాన్ని ఒక గుడ్డు (బ్రహ్మాండం) లా ఉహించుకోమన్నారు. ఇది మామూలు గుడ్డు కాదు; ఇరవై నాలుగు పొరలు ఉన్న ఉల్లిపాయ లాంటి గుడ్డు, లేదా ఉల్లిగుడ్డు, అందాం (ఇక్కడ hypersphere అన్న మాటకి ఉల్లిగుడ్డు అని ప్రయోగిస్తున్నాను). పైనుండి ఏడవ పొర మీద భూలోకం ఉంది. ఈ పొరనుండి పైకి వెళుతూ ఉంటే వచ్చే పొరల మీద, క్రమంగా ఆరు ఊర్ద్వలోకాలు ఉన్నాయి: భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. భూలోకానికి దిగున ఉన్న పొరలలో ఏడు అధోలోకాలు ఉన్నాయి: అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళలోకాలు. ఈ పాతాళ లోకానికి దిగువ ఉన్న ఏడు పొరలలో ఏడు నరక లోకాలు ఉన్నాయి. ఈ నరక లోకాలలో దిగువకి వెళుతూన్న కొద్దీ కష్టాలు ఎక్కువ. ఈ నమూనా రీమాన్ చెప్పిన నమూనాకి చాల దగ్గరలో ఉందని మీరే గ్రహించగలరు.

సంప్రదించిన మూలాలు

A lecture on shape of the universe from Stanford University.
Shape of the Universe,
V. Vemuri, The Geometry of the Universe, Science Reporter, pp 30-31, Published by National Institute of Science Communication, August. 1996, New Delhi, India.
Robert Osserman, Poetry of the Universe: A mathematical exploration of the Cosmos, Doubleday, New York, 1996
Paul Halpern, The Great Beyond, John Wiley & Sons, Hoboken, NJ, 2004.
Lisa Randall, Warped Passages : Unraveling The Mysteries of The Universe’s Hidden Dimensions, Ecco, 2005.
---------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో