Thursday, January 26, 2017

రోటికి కట్టె రాఘవుని ద్రౌపది


రోటికి కట్టె రాఘవుని ద్రౌపది




సాహితీమిత్రులారా!


పద్యంలోని ప్రశ్నలన్నిటికి
సమాధానం అందులోనే ఉంటే దాన్ని
అంతర్లాపిక ప్రహేలిక అంటారు.
ఈ క్రింది సమస్యను ప్రహేలికా
పద్ధతిలో పూరించడం జరిగింది
చూడండి-

సమస్య-
రోటికి కట్టె రాఘవుని ద్రౌపది కుండిన పట్టణంబునన్

ఇందులో రోటికి కట్టడం అది రాముని,
కట్టింది ద్రౌపది, ప్రదేశం కుండిన పట్టణం
ఏమిటీ ఇంత అస్తవ్యస్తమైన సమస్య అందుకే
కవి ఇలా పూరించారు -

బోటి యశోద కృష్ణునకు బుద్దులుసెప్పగనేమిచేసె నా
తాటకి తాకెనెవ్వని నుకవ్రత ఏవుర పెండ్లియాడెనె
ప్పాటలగంధి రుక్మికెట భంగమువాటిలె వారిజాక్షుచే
రోటికి కట్టె, రాఘవుని, ద్రౌపది, కుండిన పట్టణంబునన్

ఇందులోని ప్రశ్నలు-

1. యశోద కృష్ణునికి బుద్ధి చెప్పటానికి ఏమి చేసింది?

2. తాటకి ఎవరిని తాకింది యుద్ధంలో ?

3. పొగడదగిన వ్రతం కలిగిన ఏ స్త్రీ ఏవురిని పెండ్లాడింది?

4. రుక్మి(రుక్మిణీదేవి అన్న) ఏ పట్టణంలో భంగపడ్డాడు?


ప్రశ్న - సమాధానాలు

1. యశోద కృష్ణునికి బుద్ధి చెప్పటానికి ఏమి చేసింది?

  - రోటికి కట్టింది

2. తాటకి ఎవరిని తాకింది యుద్ధంలో ?

   - రాఘవుని(రాముని)

3. పొగడదగిన వ్రతం కలిగిన ఏ స్త్రీ ఏవురిని పెండ్లాడింది?

   - ద్రౌపది

4. రుక్మి(రుక్మిణీదేవి అన్న) ఏ పట్టణంలో భంగపడ్డాడు?

   - కుండిన పట్టణంలో

ఈ విధంగా ప్రశ్నలు సృష్టించి సమస్యపూరించాడు కవిగారు.
పూరించినది - సింహాద్రి శ్రీరంగముగారు.


No comments: