Monday, December 17, 2018

కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం”


కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం”సాహితీమిత్రులారా!

గత శత వసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారొకరు. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం, అంటే 1899లో రామలింగారెడ్డి గారు 20వ శతాబ్దంలో రాబోయే సాహిత్యానికి దారి చూపారు. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో వారి రాసి ప్రచురించిన “ముసలమ్మ మరణము” తెలుగు కవిత్వంలోకి కొత్త ఆలోచనను ప్రవేశపెట్టింది. నూటికి నూరుపాళ్ళు ఆధునిక కావ్యం కాకపోయినా అది విషాదాంత కథనూ, ఆధునిక ఇతివృత్తాన్నీ తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది. అదే సంవత్సరంలో రెడ్డి గారు మద్రాసు క్రైస్తవ కళాశాల ఆంధ్ర భాషాభిరంజనీ సంఘం వారి సమావేశంలో కళాపూర్ణోదయాన్ని గురించి ఒక ఉపన్యాసాన్ని చదివారు. అది చిలకమర్తి లక్ష్మీనరసింహం, వేదం వెంకటరాయ శాస్త్రి, దర్భా సుబ్రహ్మణ్యం మొదలైన పండిత ప్రకాండుల మెప్పును పొందింది. ఇంగ్లండులో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తిరిగివచ్చి, మైసూరులో ఆచార్యపదవిలో స్థిరపడిన తర్వాత అంటే 1914లో రామలింగారెడ్డి గారు దాన్ని విస్తృతపరిచి రాసి “కవిత్వతత్వవిచారము” అన్న పేరుతో ప్రచురించారు. ఆ గ్రంథం తెలుగుసాహిత్యాధ్యయనంలో కొత్త వెలుగును ప్రసరింప చేసింది.

19వ శతాబ్దం వరకు తెలుగు సాహిత్యరంగంలో సాహిత్యవిమర్శ లేదు. అంతేకాదు తెలుగులో సంస్కృతానికి భిన్నమైన సాహిత్యసిద్ధాంతం కూడా లేదు. దాదాపు ఏడువందల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో ఒక యుగాన్నో, ధోరణినో, కావ్యాన్నో పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఎవరూ విమర్శ రాయలేదు. కవుల చరిత్రలూ, వ్యాఖ్యానాలూ మాత్రమే సాహిత్యవిమర్శగా చెలామణి అవుతుండేవి. ముఖ్యంగా ఒక కావ్యాన్ని తీసుకొని అందులోని వస్తువునూ, రూపాన్నీ విశ్లేషిస్తూ, వాటి పరస్పర సామంజస్యాన్ని చర్చిస్తూ, ఆ కావ్య ఉద్దేశాన్ని నిరూపిస్తూ విమర్శలు రాసే సంప్రదాయం అప్పటికింకా ప్రారంభం కాలేదు. కవిత్వవిమర్శ మొత్తం కావ్యం ప్రాతిపదికగా కాకుండా ఒక పద్యమో శ్లోకమో ప్రాతిపదికగా సాగుతూ వచ్చింది. ఈ ధోరణికి స్వస్తి చెప్పి ఒక కావ్యాన్ని సమగ్రంగా విశ్లేషించే విమర్శకు రామలింగారెడ్డి గారు “కవిత్వతత్వవిచారం”లో బాటలు వేశారు. అంతేకాకుండా ఒక ధోరణి కవిత్వాన్ని చర్చించి విలువ కట్టే సంప్రదాయాన్ని కూడా వారే ప్రారంభించారు. ఈనాడు ఆబాట ఎంతో విశాలమైంది. ఆ బాటలో ఎందరో సాహిత్యవిమర్శకులు నడుస్తున్నారు. నడుస్తూ ఆ బాటను మరింత విశాలం చేస్తున్నారు.

ఇంగ్లండులో చదువుకుంటున్నప్పుడూ, ఆ తరువాతా రామలింగారెడ్డి గారు అంతవరకూ వచ్చిన పాశ్చాత్యవిమర్శను శ్రద్ధగా అధ్యయనం చేశారు. సమాజానికి, సాహిత్యానికి మధ్య ఉన్న లేదా ఉండవలసిన సంబంధాన్ని అవగతం చేసుకున్నారు. ఆ తరువాతనే వారికి భారతీయ అలంకార శాస్త్రం లోని అసమగ్రత తేటతెల్లంగా అర్థమైంది. రామలింగారెడ్డి గారు ఇంగ్లండులోనూ, ఇతర యూరోపియన్‌ దేశాలలోనూ పారిశ్రామిక విప్లవం సృష్టించిన పరిణామాలను గమనించారు. శతాబ్దులుగా కొనసాగిన ఫ్యూడల్‌ సంస్కృతి పతనం కావటం, దాని స్థానంలో అంతకంటె అభ్యుదయకరమైన బూర్జువా సంస్కృతీ, ప్రజాస్వామ్య భావాలూ ఆ దేశాలలో విస్తరించటం రామలింగారెడ్డి గారిని ఆకర్షించింది. అలాంటి ఫ్యూడల్‌ వ్యతిరేక ప్రజాస్వామ్య భావాలను తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశపెట్టాలని వారు “కవిత్వతత్వవిచారం”లో ప్రయత్నించారు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతం ప్రభావం అందులో ఉండటం చేత ఆ గ్రంథం అనేక ప్రతివిమర్శలకూ, అపవాదాలకూ గురికావలసి వచ్చింది. ఫ్యూడల్‌ సామాజిక విలువల్ని సాహిత్యంలో పరిరక్షించే ఒక చిన్న పండిత వర్గం వారిని తీవ్రంగా వ్యతిరేకించింది. కాని కొత్తదనం కోసం ఎదురుచూస్తున్న అసంఖ్యాక సాహిత్యాభిమానులు దాన్ని సాదరంగా ఆహ్వానించారు.

రామలింగారెడ్డిగారు “కవిత్వతత్వవిచారం”లో ప్రధానంగా కవిత్వతత్వాన్ని గురించి చర్చించారు. మంచికవిత్వం యొక్క లక్షణాలను చెప్పారు. విజయనగరయుగం తర్వాత తెలుగు కవిత్వం ఎందుకు పతనమైందో, ఎలా పతనమైందో చూపించారు. భారతకవుల్లోనూ, “కళాపూర్ణోదయం”లోనూ ఉన్న గొప్పతనాన్ని చూపించారు. గొప్ప కవిత్వ లక్షణాలుగా వారు భావించే కల్పనాశక్తికీ, కథనానికీ, పాత్రపోషణకూ, నాటకీయతకూ, అంగాంగ సమన్వయానికీ (యూనిటీ) “కళాపూర్ణోదయం” వారికి మంచి ఉదాహరణంగా కనిపించింది. ఆ కావ్యాన్ని కూడా రామలింగారెడ్డి మినహాయింపులు లేకుండా మెచ్చుకోలేదు. ఆరవ ఆశ్వాసంలోని 189వ పద్యం వద్ద కావ్యాన్ని ఆపి ఉండవలసిందన్నారు. పింగళిసూరన్న గారే రాసిన “ప్రభావతీప్రద్యుమ్నం”లోని చవకబారు శృంగారాన్ని తీవ్రంగా విమర్శించారు.

రామలింగారెడ్డిగారి అభిప్రాయం ప్రకారం కవిత్వానికి భావనశక్తి ప్రాణం. “భావనశక్తి అంటే కావ్యంలోని విషయాలు పాఠకుని మనస్సులో ప్రతిబింబించేటట్టుగా ప్రత్యక్షంగా అవతారమెత్తేటట్టుగా చేయగల శక్తి” అని వారే నిర్వచించారు. వ్యాకరణమూ, యతిప్రాసలూ, అన్నీ కుదిరినా భావనాశక్తిలేని పాండిత్యం జీవం లేని ఆకారంలాగా జడంగా కనిపిస్తుందన్నారు. భావనశక్తిలేని కావ్యాలను చదవటం వల్ల “నూనెకు నష్టియే కాని కవితకు పుష్టి లేదు” అన్నారు.

“ఆలోచనలూ, భావాలూ, సంకల్పాలూ” మానవప్రకృతిలోని మూడు ప్రధానాంశాలుగా రామలింగారెడ్డి గారు గుర్తించారు. వీటిలో “భావాలు” భావనాశక్తిని విజృంభింపజేస్తాయని వారు భావించారు. భావాలు లేకుండా కొయ్యల్లాగానో, మహర్షుల్లాగానో నిర్వికారంగా ఉన్నవారు “పద్యాలు” రాయవచ్చునేమో కాని “కవిత్వం” రాయలేరన్నారు.

భారతకవుల తర్వాత ఆలంకారికతే కవిత్వంగా చెలామణి అయిందని రామలింగారెడ్డి గారు భావించారు. మితిమీరిన ఆలంకారికతకు కారణం భావశూన్యత మాత్రమేనని వారు తెగేసిచెప్పారు. తెలుగుకవుల్లో ఈ బలహీనత లేని వారు భారతకవులున్నారు. మన కవుల్లో ఎక్కువమంది పండితులు మాత్రమేననీ వారిలో కార్యోత్సాహమూ, భావప్రాబల్యమూ చాలా తక్కువనీ అన్నారు. అందుచేతనే వారిలో భావనాశక్తి తగినంతగా అభివృద్ధి చెందటానికి అవకాశం లేకుండా పోయిందని రామలింగారెడ్డిగారు “కవిత్వతత్వవిచారం”లో గట్టిగా ప్రతిపాదించారు. అందుచేతనే చాలామంది మన ప్రాచీన కవులు పాండిత్యాన్నీ, ఆలంకారికతనూ ఆశ్రయించారన్నది వారి సిద్ధాంతం. మితిమీరిన పాండిత్య ప్రదర్శనా, ఆలంకారికతా రసదృష్టికి ఎలా ఆటంకాలుగా నిలిచాయో రామలింగారెడ్డి ఈ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు.

ప్రాచీన అలంకార శాస్త్రం మనదేశంలో కవుల ప్రతిభకు సంకెళ్ళు వేసిందనీ, సాహిత్యం విభిన్నమార్గాలలో వికసించకుండా అడ్డుపడిందనీ రామలింగారెడ్డి గారి నిశ్చితాభిప్రాయం. నాయకులనూ, నాయికలనూ జాతులుగా విభజించిన అలంకార శాస్త్రాల్ని చాలామంది కవులు “అదే వేదమనుకొని, ప్రమాణమను పిచ్చిపట్టి” మానవస్వభావచిత్రణను నిరాదరించారని రామలింగారెడ్డిగారి అభియోగం. వారు కావ్యాలలో పాత్రచిత్రణ సహజంగా ఉండాలన్నారు. పాత్రల మనస్సులలో కలిగే భావోద్రేకాలు చిత్రించాలన్నారు. “పేడివారి తెగకు చెందిన మన వేదాంతులు” మానవుల సహజభావోద్రేకాలకు “మనోవికారా”లన్న పేరుపెట్టి నిరసించారని రామలింగారెడ్డిగారు తీవ్రంగా ధ్వజమెత్తారు.

మన సాహిత్యంలో అతి ఎక్కువగా ఉన్న పునరుక్తినీ, అతి తక్కువగా ఉన్న ఉపజ్ఞనూ మొదటిసారిగా తీవ్రంగా ఖండించిన వారు రామలింగారెడ్డి గారే. సమకాలీన వాస్తవ జీవితాన్ని తిరస్కరించటమూ, అలంకారశాస్త్ర గ్రంథాల ఆధిపత్యాన్ని తెలిసో, తెలియకో అంగీకరించటమూ, జీవితాన్ని గురించి మౌలికంగా ఆలోచించే సాహసం లేకపోవటమూ అందుకు ముఖ్యకారణాలని వారు చెప్పారు. శాస్త్రాలలో అంటే సైన్సుల్లో ఒకరు ప్రతిపాదించిన విషయాన్ని మరొకరు గ్రహించవచ్చనీ, అది పునరుక్తి అనిపించుకోదనీ రామలింగారెడ్డిగారి అభిప్రాయం. కాని సాహిత్యంలాంటి కళల్లో ఆ పద్ధతి పనికి రాదంటారు వారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వారు “ఏలనో మన కవులేనాటికీ రుక్మిణీపరిణయములూ, సుభద్రాపరిణయములూ వ్రాయుచుండిరి. వారు పెండ్లాడి, పెండ్లాడి అలసిపోయి ఉన్నారు. వారికి పింఛను ప్రసాదించకున్న నెంతయు ఘోరము” అని తీవ్రంగా విమర్శించారు.

కావ్యంలో వస్తువూ, రూపమూ రెండూ ముఖ్యమేనని, కథకు సంబంధం లేని వర్ణనలు విసుగును కలిగిస్తాయని, నిర్మాణసౌష్టవం లేని కావ్యం పాఠకుని తాకలేదనీ రామలింగారెడ్డిగారు చెప్పారు. తన సిద్ధాంతాలకు తగిన ఉదాహరణల్ని ఈ గ్రంథంలో చూపించారు.

“కవిత్వతత్వవిచారం” వచ్చిన కాలాన్ని (1914) దృష్టిలో ఉంచుకొని చూస్తే రామలింగారెడ్డి గారి అభిప్రాయాలు విప్లవాత్మకంగా ఉంటాయి. వారికి పూర్వం మన సాహిత్యాన్ని గురించి అంత మౌలికంగా ఆలోచించే సాహసాన్ని ఎవరూ చేయలేదు. కాని ఆ తర్వాత రామలింగారెడ్డిగారు అంతకంటె మరేమీ చేయలేకపోయారు. ఆ కాలంలోనే వచ్చిన భావకవిత్వం కాని, ఆ తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వం కాని రామలింగారెడ్డి గారిని బలంగా కదిలించలేకపోయాయి. “కన్యాశుల్కం” గొప్పతనాన్ని గుర్తించటమూ, “తృణకంకణం” రాసిన రాయప్రోలును అభినందించటమూ చేశారు గాని ఆ ఉద్యమాల సారాన్ని పట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రసిద్ధ విమర్శకుడు రా.రా. ఇలా అన్నారు.

“కట్టమంచి వారు ప్రబంధ కవిత్వాన్ని అంతగా చెడతిట్టిపోసినా తెలుగుకవిత్వానికి ఒక దారీ తెన్నూ చూపించలేకపోయారు. తెలుగు కవిత్వానికి ఆయన చేసిన positive contribution ఏమీలేదు. ప్రబంధకవిత్వం 19వ శతాబ్దంలోనే చచ్చింది. ఆ శవానికి అంత్యక్రియలు చేసిన ఘనత మాత్రం రామలింగారెడ్డిగారికి దక్కింది. ఆ తరువాత వచ్చిన భావకవిత్వం దశ ఆయన ఊహకే తట్టలేదు. నిజానికి ఆయనది చారిత్రాత్మకంగా ముందుచూపు కాదు”

రా.రా. అభిప్రాయంలో సత్యం లేదనలేము కాని అది పూర్తి సత్యం మాత్రం కాదు. అంతేకాదు రామలింగారెడ్డిగారు మొదటినుంచీ చివరివరకూ పరమచాదస్తమైన గ్రాంధికభాషనే రాశారు. 1951 వరకు జీవించినా అభ్యుదయ శిఖరాలను కూడా వారు తలెత్తిచూడలేదు. కానీ వారు ప్రబంధ కవిత్వంలోని గతానుగతికత్వం నుంచీ, అలంకారశాస్త్రాల సంకెళ్లనుంచీ, తుఛ్ఛశృంగారం నుంచీ సాహిత్యజిజ్ఞాసువుల దృష్టిని భావనాశక్తి వైపుకూ, వాస్తవిక జీవితం వైపుకూ మళ్ళించగలిగారు. అలా వారు పరోక్షంగా కొత్త కవిత్వానికి దారి చూపారు. ఆ తరువాత వారు ఘనీభవించి పోవటానికి రెండు కారణాలుండవచ్చు.

మొదటిది సాహిత్యం రామలింగారెడ్డి గారికి ప్రధాన కార్యరంగం కాదు. “కవిత్వతత్వవిచారం” ప్రచురించిన కొద్దికాలానికే వారు రాజకీయాల్లో, విశ్వవిద్యాలయ పరిపాలనలో తలమునకలుగా కూరుకుపోయారు. ఇంగ్లీషులో రొమాంటిక్‌ కవితతో, విమర్శతో బాగా పరిచయం ఉన్న రామలింగారెడ్డి గారికి తెలుగులో భావకవుల పట్ల వైముఖ్యం ఉండటానికి అవకాశం లేదు.

రెండవ కారణం సాధారణంగా మానవుడు తాను ఎంతవరకు మారాడో అంతవరకు మాత్రమే మార్పును ఆమోదిస్తాడు. తన్ను దాటి వెళ్ళే మార్పుల్ని ఆమోదించలేడు. ఇది చాలామంది మేధావుల్లో కూడా ఉన్న బలహీనత. బహుశా ఈ బలహీనత రామలింగారెడ్డి గారిలో కూడా ఉందేమో!

“కవిత్వతత్వవిచారం” వచ్చిన కొత్తలో దాని మీద చాలా ప్రతివిమర్శలు వచ్చాయి. కాళూరి వ్యాసమూర్తి శాస్త్రి గారూ, అక్కిరాజు ఉమాకాంతం గారూ, నోరి నరసింహశాస్త్రి గారూ ఆ గ్రంథం మీద విరుచుకుపడ్డారు. వీరెవరూ రామలింగారెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పలేదు. వీరు రామలింగారెడ్డి గారు పాశ్చాత్యసులోచనాలతో తెలుగు సాహిత్యాన్ని చూస్తున్నాడన్నారు. రెడ్డిగారు పెద్ద పెద్ద పదవుల్లో ఉండటం చేత సాహిత్యంలో వారిమాట చెల్లుతోందన్నారు. కానీ కాలం వారిని పక్కకునెట్టి ముందుకు సాగింది. ఆనాడే విశ్వనాథ సత్యనారాయణ గారు “రామలింగారెడ్డి గారు తమ కవిత్వతత్వవిచారము రాసి విమర్శపదాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్యసాహిత్యానికి కొత్తబోదెలు తవ్వారు” అన్నారు. ఈనాడు చే.రా. వంటి వారు “కాలానికి అవసరమైన విమర్శ కట్టమంచిది. కాలగమనం ఇష్టంలేక అన్నీ తాటాకుల్లోనే ఉన్నాయనే తత్వం ఆయన వ్యతిరేకులది” అంటున్నారు.
-----------------------------------------------------------
రచన: వల్లంపాటి వెంకట సుబ్బయ్య, 
ఈమాట సౌజన్యంతో

Sunday, December 16, 2018

చాటు పద్యాల్లో శ్రీనాథుడు


చాటు పద్యాల్లో శ్రీనాథుడుసాహితీమిత్రులారా!

శ్రీనాథ కర్తృత్వంతో ఎన్నో చాటుపద్యాలు మనకిప్పుడు దొరుకుతున్నాయి. వీటిలో ఎన్ని శ్రీనాథుడు స్వయంగా చెప్పినవో, అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.

ఇక్కడ “వ్యక్తిత్వం” అని ఎందుకు నొక్కి చెపుతున్నానంటే, కవుల కవితాశక్తి కోసమే ఐతే వాళ్ళు రాసిన (లేదా చెప్పిన) గ్రంథాలు చదువుకోవచ్చు, అవి చాలు. అంతటితో ఆగకుండా, ఆ కవుల వ్యక్తిగత విషయాలు కూడ తెలుసుకోవాలన్న కుతూహలం శ్రోతల్లో కలిగినప్పుడు చాటు పద్యాలు ఆ అవసరాన్ని భర్తీ చేస్తాయి. (“A poem at the right moment” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణ రావు, డేవిడ్‌ షుల్మన్‌ వివిధ భారతీయ భాషల చాటువుల గురించి సాధికారిక విశ్లేషణ చేశారు.) కవితాస్వాదనా తత్పరులైన రసిక పాఠకులు తమకు అంతటి ఆనందాన్ని అందిస్తున్న కవుల వ్యక్తిగత ప్రపంచాన్ని గురించి తయారు చేసుకున్న ఊహాచిత్రాల్ని ప్రతిబింబించేవి చాటుపద్యాలు. ఇప్పుడు సినీ తారల, ఆటగాళ్ళ, ఇతర ప్రముఖుల, వ్యక్తిగత విషయాల గురించి జనసామాన్యంలో ఎంతటి కుతూహలం ఉన్నదో చెప్పనక్కరలేదు. ఒకప్పుడు కవులు కూడ ఇలాటి జాబితాలో ఉండేవారనటానికి ప్రబలసాక్ష్యాలు చాటుపద్యాలు. అలాగే, వాళ్ళని ఆరాధించిన పాఠక-శ్రోతలు ఎంతటి సాహితీభక్తులో ఉన్నతస్థాయి కవులో కూడ చూపిస్తాయి.

పై పుస్తకంలో చెప్పినట్లు, ఓ కవి జనబాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయాడో చెప్పటానికి కొలమానాలు చాటుపద్యాలు. ఐతే ఇక్కడ మనం కవిని, అతని రచనల్ని విడదీసి చూడాలి. ఉదాహరణకు ఒక రచనకి ఎంతో జనాదరణ దొరికినా ఆ కవికి సంబంధించిన చాటువులు ఏమీ లేకపోవచ్చు. అలాటి పరిస్థితుల్లో పాఠకుల దృష్టి ఆ కవి మీద కన్నా రచన మీదే ఉందన్నమాట. లేకపోతే, ఆ కవి వ్యక్తిగత జీవితంలో కుతూహల కారకాలైన అంశాలేవీ లేకపోవచ్చు. ఉదాహరణకు నన్నయ గారిని తీసుకుంటే, ఆయన ఎలాటివాడు?

“… అవిరళ,
జపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది,
నానాపురాణ విజ్ఞాననిరతు
బాత్రు నాపస్తంబ సూత్రు ముద్గలగోత్ర
జాతు సద్వినుతావదాత చరితు
లోకజ్ఞు నుభయభాషా కావ్యరచనాభి
శోభితు సత్ప్రతిభాభియోగ్యు
నిత్యసత్యవచను మత్యమరాధిపా
చార్యు సుజను నన్నపార్యు..”

అని భారతం చెప్తోంది.

ఇటీవలి కాలంలో విశ్వనాథ కూడ ఆయన గురించి “ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి” అన్నారు. అలాటి వ్యక్తి జీవితంలో జనసామాన్యానికి కుతూహలం కలిగించే సంఘటనలుండటం అరుదు. ఐనప్పటికీ ఆయన చివరి పద్యం

శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారకహారపంక్తులం
జారుతరంబులయ్యె వికసన్నవకైరవ గంధబంధురో
దార సమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచి పూరములంబరపూరితంబులై

అన్న దాన్లోని చివరి సమాసాన్ని “పాండురుచి పూరములన్‌ పరపూరితంబులై” అని విరిచి, అది తన చివరి పద్యమనీ మిగిలిన భారతాన్ని పరులు పూరించబోతున్నారనీ నన్నయ గారు చెప్తున్నారని అన్వయించుకుని ఆనందించారు రసిక పాఠకులు. అలాగే సోమయాజి తిక్కన గారి విషయంలోనూ “ఏమి చెప్పుదున్‌ గురునాథా” అన్న చిన్నముక్కని దొరకపుచ్చుకుని దాని చుట్టూ ఓ రసవంతమైన కథని అల్లుకుని తృప్తిపడ్డారు.

అదే వేములవాడ భీమకవి విషయంలో ఐతే, చాటువుల్లో ఆయనది ప్రముఖ స్థానమైనా ఆయన రాసినవి ఏవీ ఇప్పుడు దొరకటం లేదు. అంటే, రసవత్తరమైన ఆయన వ్యక్తిగత విషయాలతో పోలిస్తే ఆయన గ్రంథాలు వెలవెల బోయానన్న మాట. ఇంకా చాలామంది కవుల విషయంలో కూడ ఇలా జరిగింది.

ఐతే శ్రీనాథుడి విషయంలో ఒకరకమైన సమతుల్యత సమకూరిందని చెప్పుకోవచ్చు. ఆయన రచనలు, ముఖ్యంగా ఆంధ్ర పంచకావ్యాలలో ఒకటిగా భూషించబడ్డ శృంగార నైషథం, అవశ్యపఠనీయాలయ్యాయి; అలాగే, ఆయన వ్యక్తిగత అనుభవాలను ప్రతిపాదించే చాటువులు ఆబాలగోపాలానికీ జిహ్వాగ్రాల మీద నిలిచాయి. ఈ చాటువుల్లో కనిపించే శ్రీనాథుడి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇందాకనే అనుకున్నట్లు, నిజంగా శ్రీనాథుడు ఇలా ప్రవర్తించాడా అనే ప్రశ్నకి ఇక్కడ తావులేదు – ఔనో కాదో చెప్పటం అసాధ్యం కనుక. ఇవి చెప్పేది తర్వాతి తరాల వాళ్ళ ఊహలో శ్రీనాథుని జీవితం ఎలాటిది అని మాత్రమే.

కాలం గడిచే కొద్ది ఏ విషయమైనా సరళీకృతం కావటం సాధారణం. అంటే మొదల్లో ఉన్న క్లిష్టతలు, అస్పష్టతలు బయటకు వెళ్ళిపోయి ఆ విషయానికి కొట్టొచ్చేట్టు కనిపించే గుణాలు మాత్రం బహుగుణీకరించబడతాయి. ఇప్పటి మాటల్లో చెప్పాలంటే “మైనర్‌ పాయింట్స్‌” మరుగున పడిపోయి “కోర్‌ వాల్యూస్‌” అనుకున్నవి ఎంతగానో “యాంప్లిఫై” ఔతాయి. శ్రీనాథుడి వ్యక్తిగత చిత్రీకరణ విషయంలోనూ చాటు పద్యాలు మనకు అదే నిరూపిస్తాయి. వీటిలో కనిపించే శ్రీనాథుడి వ్యక్తిత్వం ఇది –

ఆయన విశాల లోక సంచారి, ఐక్యాంధ్ర సామ్రాజ్యపు సరిహద్దులేమిటో తొలిగా చూపిన వాడు (వెల్చేరు ప్రతిపాదన ప్రకారం)
సౌందర్యారాధకుడు, మహా రసికుడు, సరసుడు
భోజనప్రియుడు
సర్వ స్వతంత్రుడు, దేవుణ్ణైనా లెక్కచెయ్యని వాడు
విలాసి, జీవితాన్ని విపరీతంగా ప్రేమించి అనుభవించిన వాడు
బాహ్యప్రేరణలకు వెంటనే స్పందించే వాడు
అసౌకర్యాలను భరించలేని వాడు
కులమత విభేదాలు లేనివాడు
సున్నిత మనస్కుడు
గొప్ప చమత్కారి
ఈ పట్టిక చూస్తే శ్రీనాథుడు ఎంతటి “ఆధునికుడో” అర్థమౌతుంది. మనం ఇప్పుడు నిజమైన ఆధునికతకు లక్షణాలుగా పరిగణిస్తున్నవి అన్నీ (సంప్రదాయ వైముఖ్యత, స్వకేంద్రిత దృష్టి, reactions based on unconscious, not self-consciousness,) వీటిలో వున్నాయి. ఏడు వందల ఏళ్ళ క్రితమే ఈ లక్షణాల్ని సంతరించుకున్న ఒక వ్యక్తి ఉండటాన్ని ఊహించిన, అలాటి వ్యక్తిని ఉన్నతుడిగా భావించిన, మన సంస్కృతి ఔన్నత్యం ఏమిటో ఆలోచించండి!

ఈ గుణాల్ని ఇప్పుడు ఇంకొంచెం విపులంగా, ఉదాహరణల్తో చూపుతాను.

లోకసంచారం.
శ్రీనాథుడు సింహాచలం నుండి ద్రవిడ కర్ణాట సీమల వరకు, కృష్ణాతీరపు బొడ్డుపల్లి నుండి శ్రీశైలం వరకు ఉత్తర దక్షిణాలుగా తూర్పుపడమరలుగా తిరిగాడు. మాచర్ల, పల్నాడు, కారెంపూడి, గురజాల లాటి చోట్ల ఉన్నాడు. త్రిలింగాల్ని దర్శించాడు. కొండవీడు, అద్దంకి, మారెళ్ళ, ఇంకా ఎన్నో చిన్నా పెద్దా ప్రదేశాల్లో ఉన్నాడు. వీటికి వేరే ఉదాహరణలు ఇవ్వక్కర్లేదు. ఎన్నో మన నాలుకల మీద నానుతున్న పద్యాలే.

సౌందర్యారాధన.
శ్రీనాథుడు సౌందర్యం కోసం వెదికాడు. ఎక్కడ కనిపించినా పరవశించి ప్రశంసించాడు. ఈ పద్యం చూడండి –

తాటంకయుగ ధగద్ధగిత కాంతిచ్ఛటల్‌
చెక్కుటద్దములపై జీరువార
నిటలేందు హరి నీల కుటిలకుంతలములు
చిన్నారిమోముపై జిందులాడ
బంధుర మౌక్తిక ప్రకట హారావళుల్‌
గుబ్బపాలిండ్లపై గులిసియాడ
గరకంకణ క్వణ క్వణ నిక్వణంబులు
పలుమారు రాతిపై బరిఢవిల్ల
నోరచూపుల విటచిత్త మూగులాడ
బాహు కుశలత జక్కని మోహనాంగి
పాట బాడుచు కూర్చుండి రోటి మీద
బిండి రుబ్బంగ గన్నులపండు వయ్యె

దీన్లో ఉన్నది అచ్చమైన సౌందర్యానందమే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆ సౌందర్యాన్ని చూసి కన్నుల పండగయిందట! పిండి రుబ్బటంలో ఇంత సొగసు చూడగలిన కవి మరొకరు మనకు కనిపించరు.

ఇప్పుడు మరోటి చూడండి – పూజావేళలో కూడ అందం ఆయన్ను ఆకర్షించక మానదు –

దాయాదుల్వలె గుబ్బచన్ను లొలయన్‌ ధావళ్య నేత్రాంబుజ
చ్ఛాయ ల్తాండవ మాడ గేరి పురుషస్వాంతమ్ముల న్మన్మథుం
డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనా వేళలన్‌
వాయించెం గిరిగిండ్లు బాహు కుశల వ్యాపార పారీణతన్‌
భోజనప్రీతి.
పల్నాడు, రేనాడు, గురజాల, కర్ణాటక, ద్రవిడదేశం, మరెన్నో చోట్ల సరైన భోజనం దొరక్కపోవటాన్ని గురించి ఎన్నో విధాలుగా వాపోయాడు శ్రీనాథుడు. చక్కటి కాయగూరల్తో మంచి సుగంధాలు చిమ్మే వరి అన్నం బంగారు పళ్ళెంలో వడ్డిస్తే భోంచెయ్యటం ఆయనకు ఇష్టం. అవి దొరకనప్పుడు ఆయన బాధ ఆ దేవుడికీ తెలియాలి.

ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్‌
సర్వస్వతంత్రత.
శ్రీనాథుడు తను చూసింది చూసినట్లు, తనకు తోచింది తోచినట్లు స్పష్టంగా, సూటిగా చెప్పాడు. తనకు ఇంపుకాని పని జరిగింది ఎవరివల్లనైనా – మామూలు మనిషి కానివ్వండి, రాజాధిరాజు కానివ్వండి, దేవుడే కానివ్వండి – వాళ్ళని కడిగెయ్యటానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇది చూడండి (హెచ్చరిక – దీన్లో బూతు వుంది) –

హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్‌ నభఃపుష్పముల్‌
సంసారద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి
ద్వాంసుల్‌ రాజమహేంద్ర పట్టణమునన్‌ ధర్మాసనంబుండి ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్‌ దర్కింత్రు రాత్రైకమున్‌
దేవతలకే దిక్కులేదు, ఈ రాజమహేంద్ర పుర విద్వాంసులు ఒక లెక్కా?

గొరియల మేకపోతులను గొమ్ముపొటేళ్ళను గాపుగొందు వీ
వరయగ సందెకాడ దగ వత్తునటంచు భవచ్ఛిరంబుపై
గరమిడి పోయినట్టి తిలఘాతుకురాలి తదీయశష్పముల్‌
పెరుకగలేవు నీవు కడు భీకరమూర్తివె కాళికేశ్వరీ
విలాసి.
జీవితాన్ని పరిపుష్టంగా అనుభవించిన వాడు శ్రీనాథుడు. వృద్ధాప్యంలో విధి వక్రించి విపరీత దుర్దశ ప్రాప్తించినా అప్పటివరకు రేపన్నది లేనట్లు అర్థకామాల అంచులు చూసిన వాడు. ఒకసారి తన వేలిగోరు విరిగితే దాన్ని ఉద్దేశించి ఎంత అద్భుతంగా తన జీవనశైలిని వివరించాడో చూడండి –

నీలాలకా జాల ఫాల కస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాడ
నంగనాలింగనా నంగ సంగర ఘర్మ
శీకరం బేమిట జిమ్మువాడ
మత్తేభగామినీ వృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాడ
భామామణీ కచాభరణ శోభితమైన
పాపట నేమిట బాపువాడ
ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి
… అహహ
పోయె నా గోరు తన చేతి పోరు మాని
(దీన్లో ఒక పాదభాగం మనకిప్పుడు దొరకటం లేదు.)
చివరిరోజుల్లో తన పూర్వవైభవాన్ని తల్చుకుంటూ చెప్పిన ఈ పద్యం ఒకవంక గుండెల్ని పిండి చేస్తూనే మరోవంక ఆయన ఎలాటి జీవితాన్ని అనుభవించాడో సూచిస్తుంది.

కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు
రంభ గూడె దెనుంగు రాయ రాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
స్వర్గస్థుడయ్యె విస్సన మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలార విభుడేగె
దినవెచ్చ మే రాజు దీర్పగలడు
భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
గలియుగంబున నికనుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్‌ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి
సత్వర స్పందన.
చాలా సందర్భాలో మనకు శ్రీనాథుడి అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి కవులూ గాయకులకన్నా వేశ్యలే మేలంటున్నాడు –

కవితల్‌ సెప్పిన బాడ నేర్చిన వృథా కష్టంబె యీ బోగపుం
జవరాండ్రే కద భాగ్యశాలినులు పుంస్త్వం బేల పో పోచకా
సవరంగా సొగసిచ్చి మేల్‌ యువతి వేషం బిచ్చి పుట్టింతువే
నెవరున్‌ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే పాపపుం దైవమా
రసికులు కాని రాజుల్ని మెత్తగా, పొగడ్త అనిపించే విధంగా మందలించటానికి ఏమాత్రం వెనకాడడు –

జననాథోత్తమ దేవరాయ నృపతీ చక్రేశ శ్రీ వత్సలాం
ఛన సంకాశ మహా ప్రభావ హరి రక్షాదక్ష నా బోటికిన్‌
గునృప స్తోత్ర సముద్భవంబయిన వాగ్దోషంబు శాంతంబుగా
గనకస్నానము చేసి గాక పొగడంగా శక్యమే దేవరన్‌
ఇదో అద్భుతమైన పద్యం. ఈ దేవరాయలు ఎవరో నాకు తెలియదు గాని శ్రీనాథుడికి బాగానే తిక్కరేపి నట్టున్నాడు. తొలిరెండు పాదాల్లోను అతన్నెంతగానో పొగిడినట్లనిపిస్తూ ఆ తర్వాత అసలు విషయం బయటపెడుతున్నాడు – నీలాటి కునృపుల్ని పొగిడీ పొగిడీ నాకు వాగ్దోషం వచ్చినట్టుంది, అది కనకస్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప పోయేది కాదు, అని!

అసౌకర్యాలంటే అసహనం.
భోజన, నిద్రా, మైథునాల్లో ఎలాటి లోపం కలిగినా భరించలేడాయన. వీటిలో భోజనం గురించి ముందే చెప్పుకున్నాం. ఇవి చూడండి –

గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్‌
జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలున్‌
ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీముపోతులున్‌
రంగ వివేకి కీ మసర రాజ్యము కాపుర మెంత రోతయో
అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్‌
తేలాకాయెను బోనము
పాలాయెను మంచినీళ్ళు పడియుండుటకున్‌
నేలా కరవాయె నిసీ
కాలిన గురిజాల నిష్ట కామేశ శివా
కులమతాతీతుడు.
ఆయన అందం ఎక్కడున్నా హర్షించాడు, కుత్సితం ఎక్కడున్నా గర్హించాడు. ఇంత విశాల దృక్పథం మరో పూర్వకవిలో కనిపించదు. ఈయన కంటికి నచ్చిన స్త్రీలు అన్ని వర్గాల వారూను – వ్యాపారి, నంబి, కమ్మ, రెడ్డి, జంగము, కాపు, శబర, ద్రావిడ, బలిజ, గానుల, వాసర, విప్ర, క్షత్రియ, శూద్ర, నియోగి, కర్ణాట, కాసల్నాటి, వైష్ణవ, సాతాని, అగసాలె, వడ్డెర, కుమ్మరి, చాకలి, ముస్లిం, ఇలా ఎందరెందరో. వీళ్ళలో ఎవరినీ ఎక్కువగానూ మరెవర్నీ తక్కువగానూ చూడడు. ఆయన దృష్టిలో సౌందర్యమే ప్రధానం, మిగిలినవన్నీ అనవసర విషయాలు. ఉదాహరణకు ఈ పద్యాలు చూడండి –

గిట గిట నగు నెన్నడుములు
పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో
జిట పొట లాడెడు మొగములు
కటి తటముల కొమరు శబరకాంతల కమరున్‌
నిబ్బరపు గలికిచూపులు
జబ్బించుకలేని పిరుదు సన్నపు నడుమున్‌
మబ్బు కురు లుబ్బు కుచములు
బిబ్బీలకు గాక కలవె పృథివీస్థలిపై
బంగరులింగమూర్తి చనుబంతుల మధ్య నటింపుచుండగా
జెంగులుజార మేల్వలువ చీరయు వీడ మదీప్సితంబు లు
ప్పొంగగ వామహస్తమున బొల్పగు నీవిని బట్టి వేడ్కతో
జంగున గోడదాటు నగసాలె శిరోమణి జూచితే సఖా
సున్నితమసస్కుడు.
సౌందర్యారాధనే కాదు, స్త్రీల మనస్సుల్ని చదవగలిగిన వాడు శ్రీనాథుడు. ఈ ప్రేమలేఖను చూడండి – ఆయన నిర్మల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

శ్రీమదసత్య మధ్యకును జిన్ని వయారికి ముద్దులాడికిన్‌
సామజయానకున్‌ మిగుల జక్కని యింతికి మేలు గావలెన్‌
మేమిట క్షేమ మీవరకు మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ
నా మది నీదు మోహము క్షణంబును దీరదు స్నేహబాంధవీ
అలాగే దుర్దశలో వున్న వారిని చూసి ప్రతిస్పందిస్తాడు కూడ –

వీసపు ముక్కునత్తు నరవీసపు మంగళసూత్ర మెంతయున్‌
గాసుకురాని కమ్మ లరకాసును కానివి పచ్చపూసలున్‌
మాసినచీర గట్టి యవమాన మెసంగగ నేడు రాగ నా
కాసలనాటి వారి కనకాంగిని జూచితి నీళ్ళరేవునన్‌
ఈ పద్యంలో వున్నావిడ దుస్థితిని హేళనగానో చులకనగానో చెప్పవచ్చు కాని అదికాదు ఆయన దృష్టి. వస్త్రాభరణాల్లో పేదరికం పొంగిపారుతున్నా ఆయన దృష్టిలో ఆమె కనకాంగి! సార్వభౌముల సత్కారాలు పొందుతూ భోగభాగ్యాలు చవిచూసిన వ్యక్తి నుంచి పేదరికం పట్ల ఇలాటి స్పందన అపూర్వం, అనితరసాధ్యం. అందులోనూ, అప్పటి సమాజంలో!

చమత్కారి.
రావు సింగన గురించి శ్రీనాథుడు చెప్పిన పద్యం –

సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే
అనేది ఆయన అతని సముఖంలో చెప్పాడని, ఆ తర్వాత మిత్రులు “అదేమిటీ, అతన్ని అంతగా పొగిడేశావు?” అనడిగితే, “అబ్బే, నేనెక్కడ పొగిడాను? నేను అన్నది ఏమిటంటే, “సర్వజ్ఞ నామధేయము శర్వునకే; రావు సింగ జనపాలునకి – ఏ యుర్విం జెల్లును? తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే” అంటూ అతను కుక్క అనే ధ్వనిని స్ఫురింపజేశాను” అన్నాడనీ మనకో కథ వినిపిస్తున్నది. ఇలాటిదే మరొకటి, ఇంకొంచెం లోతైనది ఇది –

దీనారటంకాల తీర్థమాడించితి
దక్షిణాధీశు ముత్యాలశాల
వాక్కుతోడై తాంధ్రభాషా మహాకావ్య
నైషథగ్రంథ సందర్భమునను
పగలగొట్టించి తుద్భట వివాదప్రౌఢి
గౌడ డిండిమబట్టు కంచుఢక్క
చంద్రభూషక్రియాశక్తి రాయల యొద్ద
పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు
నెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగన భూపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సరస సద్గుణ నికురంబ శారదాంబ
ఇది కూడ ఆ రావు సింగన గురించినదే! సీస పాదాలు అన్నీ అయేవరకు ఒక దారిన వెళ్ళిన పద్యం తేటగీతి మొదలుకావటంతో ఒక వింత మలుపు తిరుగుతుంది. సీస పాదాలన్నీ తనకు కలిగిన కఠినమైన పరీక్షల్ని వివరించి వాటిలో తను ఎలా విజయాన్ని సాధించాడో చెప్పాయి. నిజానికి అలాటి వాడికి ఈ రావు సింగనని మెప్పించటం ఓ లెక్క కాదు. అందువల్ల ఇక్కడ జరుగుతున్నది అతన్ని హేళన చెయ్యటం. అతన్ని “ధీవిశాలు”డని పిలవటం కూడ దాన్లో భాగమే. పైకి పొగడ్తగా కనిపిస్తూ లోపల అవహేళన నిండిన ఈ పద్యం ఆలోచనామృతం!

ఇలాటిదే పైన చూసిన “కనకస్నానం” పద్యం కూడ.

ఈ కింది పద్యం కూడ మొదటి మూడు పాదాల్లో మనల్ని మభ్యపెట్టి చివరకు హఠాత్తుగా ఒక అద్భుతమైన మలుపు తిరిగి ఔరా అనిపిస్తుంది, గిలిగింతలు పెడుతుంది. దీన్లోని అనుపమ శిల్పం ఆలోచనామృతమే. రెండోపాదం సగంలోంచి ఎలా ఒకే సమాసంతో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తూ తనతో పాటు మనల్నీ లాక్కెళ్తూ నిజానికి పద్యంలో ఏం జరుగుతుందో కూడ తెలియనివ్వనంత వేగంగా తన గమ్యస్థానానికి తీసుకెళ్ళి మనం ఎక్కడికి చేరామో తెలుసుకునే లోగానే పద్యం ముగిసిపోతుంది! ఐతే, ఇది “ఎక్స్‌-రేటెడ్‌” పద్యం అని హెచ్చరిక!

శ్రుతి శాస్త్ర స్మృతు లభ్యసించుకొని విప్రుండంత నానాధ్వర
వ్రతుడై పోయి కనున్‌ బురందర పురారామ ద్రుమానల్ప క
ల్పతరు ప్రాంత లతా కుడుంగ సుఖ సుప్త ప్రాప్త రంభా భగ
ప్రతి రోమాంకుర పాటన క్రమ కళా పాండిత్య శౌండీర్యమున్‌
పద్యశిల్పం ఏమిటో సోదాహరణంగా చూపే పద్యం ఇది. అసలు విషయం ఎంతవరకు దాచటానికి వీలౌతుందో అంతవరకూ దాచి అప్పుడు కూడ ఒక దీర్ఘ సమాసంలో దాన్ని కలిపేసి మనతో దోబూచులాడతాడు. మిరుమిట్లు గొల్పే పద్యం ఇది.

ఉపసంహారం
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్టుడయాడో చాటువుల ద్వారా కూడ అంతే. ఐతే శ్రీనాథుడివిగా చెప్పబడేవన్నీ ఆయన చెప్పినవేనా అనేది ఎవరూ తేల్చలేని విషయం. కాని, రసవేత్తలైన పాఠకుల దృష్టిలో శ్రీనాథుడి వ్యక్తిగత జీవనచిత్రణని చూపిస్తాయివి. ఈ చాటుపద్యాలలో కనిపించే శ్రీనాథుడు ఎంతో ఆధునిక భావాలున్నవాడు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవాడు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉండాలి. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యాడు. ఎవరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు ఎంత దూరమయాడో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన శ్రీనాథుడి మూలంగా మనకు మిగిలిన సంపదలో ముఖ్యభాగం ఈ చాటువులు.
----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 15, 2018

సాహిత్య వ్యవస్థలో సంశయావస్థ


సాహిత్య వ్యవస్థలో సంశయావస్థ
సాహితీమిత్రులారా!

“టు మ్యారీ ఎ విడో ఆర్‌ నాట్‌ టు మ్యారీ?!
దటీజ్‌ ది క్వశ్చన్‌! షేక్స్‌పియర్‌ పడ్డ అవస్థలో పడ్డాం!”

ఇది గురజాడ వారి “కన్యాశుల్కం” నాటకంలో గిరీశం అంతర్వేదన. డెబిట్‌ క్రెడిట్ల బ్యాలెన్స్‌ షీట్‌ వేసుకుంటాడు. పాపం!

అసలు, షేక్స్‌పియర్‌ కన్న ముందే ఎంతో మంది ఈ సంశయావస్థకు లోనై ఉంటారని నా ఉద్దేశం. కావ్య రచనారంభంలో కవి పడే అంతరంగ మథనాన్ని “కృత్యాద్యవస్థ” అంటారు.
విద్వాంసుడు పడే కష్టాన్ని విద్వాంసుడే తెలుసుకోగలడట! అయితే “బోద్ధారో మత్సర గ్రస్తాః”!
అసూయాళువులైన కవులు ఒక్కొకచో సంశయావస్థలో పడి పోతుంటారు.
రాస్తారు …! కొట్టేస్తారు …! … ఎవరో రాసిందైనా కొట్టేస్తారు!!

అదలా ఉంచితే ఏదైనా ఒక అంశంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో!
మన సాహిత్యవ్యవస్థలో సంశయావస్థ అడుగడుగునా పదేపదే కనిపిస్తూనే ఉంటుంది!
తెలుగుభాషలో ఆదికవి నన్నయ భారతాన్ని తొలిగ్రంధంగా తెలిగిస్తూనే ఓం ప్రధమంగా “భారతభారతీ సముద్రము దరియంగ నీదను విధాతృన కైనను నేరబోలునే!” అని సందేహించారు.
కవిబ్రహ్మ తిక్కనగారు తన కృతిపతిగా హరియో హరుడో తేల్చుకోలేక ఇద్దర్నీ కలిపి హరిహరనాధుడని ఓ దండం పెట్టేశారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఆయన కావ్యనేత ఐన ధర్మరాజులోనూ ఉంది. శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపుతూ “శస్త్ర జీవికయ తగియున్న దయినను వంశనాశ మనభిమతము!” అన్నారు ఆ “మెత్తనిపులి”.

శ్రీనాథ మహాకవి సంగతి చెప్పనే అక్కర్లేదు. “భీమఖండం”లో వ్యాసుడు శిష్యసమేతంగా ఏడు రోజులు తిండిలేక మలమల మాడిపోయి కాశిని శపించబోతాడు. శ్రీవిశాలాక్షి భోజనానికి ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు “ఏనొక్కడినే రానో? ఎల్లన్‌ శిష్యుల గొంచు వత్తునొ?” అన్న మీమాంసలో పడి గ్రామర్ని కూడ మర్చిపోయి (ఎల్లన్‌ శిష్యుల) తప్పులోనో పప్పులోనో కాలేశాడు. ఆకలే అన్నింటికీ అమ్మ కదా!

నాకు తెలిసినంత వరకు పోతన్న గారి కున్న డైలెమ్మా మరెవ్వరికీ లేదండీ! గజేంద్రుడు మకరి బారి నుండి రక్షించుమని విష్ణువుకి మొరపెట్టుకుంటూనే “కలడు కలండనెడి వాడు కలడో లేడో” అని సంశయించాడు.
యశోదాదేవి మన్ను తిన్న కన్నయ్య నోట బ్రహ్మాండాలన్నీ చూసి “కలయో? వైష్ణవ మాయయో? ఇతర సంకల్పార్థమో?..” అని .. “యశోదాదేవి గానో?..” అనుకునే దాకా వచ్చి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయింది.
రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వద్దకు అగ్నిద్యోతనుణ్ణి పంపి తిరిగి అతని రాకకై ప్రతీక్షిస్తూ “ఘనుడా భూసురుడేగెనో? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో? విని కృష్ణుండది తప్పుగా తలచెనో? విచ్చేయునో? ఈశ్వరుండనుకూలింప దలంచునో? తలపడో? ఆర్యామహాదేవియున్‌ నను రక్షింప నెరుంగునో? ఎరుగదో? నా భాగ్యమెట్లున్నదో?” అని ఆశంకించింది.

పెద్దన కవీంద్రుని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు తన వూరికి దారి అడుగుతూ వరూధినీ కాంతని “భీతహరిణేక్షణ!” అనేసేసి అలా పిలవకూడదని అనిపించిందో ఏమో వెంటనే నాలుక కరుచుకుని “తల్లీ! తెరువెద్ది? శుభంబు నీకగున్‌!” అనలేదూ?
ముద్దుపల్కుల తిమ్మనగారి సత్యభామకి కోపం “ముక్కు” మీదే గదా! పారిజాతాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణికివ్వగానే పలుముళ్ళమాటల యతియైన నారదుడు “సత్య గరువంబింక చెల్లద”ని ఓ తీర్మానం చేసేశాడు. ఇదంతా చూసిన చెలికత్తె ఒకతె సత్యభామకి “మోత కార్యక్రమం” పెట్టింది. అప్పుడు కోపపరాకాష్టలో సత్య భామ “ఏమేమీ! కలహాశనుండచటికై యేతెంచి యిట్లాడెనా? ఆ మాటల్చెవి యొగ్గి తా వినియెనా గోపికావల్లభుండే మే మాడెను రుక్మిణీసతియు ..” అంటుంది. సవతి రుక్మిణీదేవి తన గురించి ఇంకా ఏవేవో అనే వుంటుందన్నది సత్య డౌటు!

ఇంక ఆధునికానికొస్తే భావ పికస్వామి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి “ఈ అడవి దాగిపోనా? ఎచటైన ఆగిపోనా?” అని విచికిత్సకి లోనై మన బోటివాడెవ్వడో కిసుక్కుమనేసరికి చిర్రెత్తిపోయి “నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు? నా యిచ్చయే గాక నాకేటి వెరపు?” అని కోప్పడ్డారు.

కవిసమ్రాట్‌ విశ్వనాథ “రామాయణ కల్పవృక్షం” రాస్తూ “మళ్ళీ రామాయణమా?” అని మనం విస్తుబోతామని ఆయనే సంశయించి “తిన్నన్నమే తినడం లేదా?” అని డబాయించారు.

మార్క్సిస్ట్‌మార్క్‌ కవి శ్రీశ్రీగారు పోతన స్టైల్లోనే “ఇంతకీ ఒక సకలేంద్రియాతీతశక్తి ఉన్నట్టా ? లేనట్టా?” అని అనుమానించారు “ఖడ్గసృష్టి”లో.
మహాప్రస్థానం లో కూడా “సంధ్యా సమస్యలు” అన్న కవితలో “అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ; ఎంచుకొనే సమస్య కలిగిందొక ఉద్యోగికి..” అని సందేహాస్పద చిత్తవృత్తికి అద్దం పట్టారు.
గురజాడ వారన్న “షేక్స్‌పియర్‌ పడ్డ అవస్థ” ఇక్కడ స్పష్టంగా లేదూ!

ఆరుద్ర గారు “త్వమేవాహం” రాసి, “జీర్ణమంగే సుభాషితం” అని కినిసి “ఇంటింటి పజ్యాలు”, “కూనలమ్మ పదాలు” మున్నగు సరదా కవితల పరదాల వెనక దాక్కున్నారు. అవి మాత్రం ఎందరి కర్థమయ్యాయో?! .. ఆరోరుద్రుడికే అది ఎరుక!
వాగ్గేయకారులకి వల్లభుడు శ్రీ త్యాగరాజు స్వామి సైతం “నిధి చాల సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా?” అని మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌ విసిరారు.

కొన్ని దశాబ్దాల క్రితం బడాబడా విద్వాంసులు భారతి సాహిత్య మాసపత్రికలో ఒక అక్షరం గురువో లఘువో తేల్చుకుందుకు నెలల తరబడి కేశాకేశీ బాహాబాహీ హోరాహోరీ ముష్టాముష్టీ పోరాడుకోలేదూ! ఇంతకీ అది తేలిందా?!

వ్యాకరణ రంగంలో విభాష, వికల్పం, బహుళం, అనేవి ఈ శంకాజాతికి చెందినవే!

కావ్యానికి పరమప్రయోజనం ఏమిటీ? ఆనందమా? నీత్యుపదేశమా? అని అటు అరిస్టాటిల్‌, ఇటు భరతమహర్షి వంటి మహామహులే నిశ్చయించగలిగారా?!

షేక్స్‌పియర్‌ “హేమ్లెట్‌” “టు బి, ఆర్‌ నాట్‌ టు బి!” అంటాడు. అయినా ఈ సంశయావస్థకి ఆదిపురుషుడతగాడే అంటే నేనొప్పేది లెదు. ఈ సందేహాలున్న దేహాలు అంతకుముందే లోకంలో ఉన్నాయన్నది యథార్ధాల కెల్ల యథార్ధం! దీని విషయంలో ఎంతో ఆలోచించాలి ఆలోకించాలి పరికించాలి పరిశీలించాలి. అపుడైనా విషయం తేల్తుందో మునుగుతుందో!

అన్నింటినీ ఖచ్చితంగా నిర్ణయించే తర్కశాస్త్రం లోనూ “విత్తు ముందా? చెట్టు ముందా?” అని శాకాహారులూ “కోడి ముందా? గుడ్డు ముందా?” అని మాంసాహారులూ క్వశ్చన్‌ మార్క్‌ ముఖాల్తో బొమముడి వేశారు తెలుసా?

సంస్కృత న్యాయాల్లో “సన్యాసి యోషా న్యాయం” కూడా ఇట్టిదే!
ఓ సాములారి వేదాంతోపన్యాసం విని, వైరాగ్యం కొని తెచ్చుకున్న ఆసామికి బయటికి రాగానే అందమైన యువతి కనిపించింది అంతే! ఆ అతిలోకసుందరిని చూసిన మన జగదేకవీరుడి మనస్సు సన్యాసానికి టాటా చెప్పేసింది! ఈ సంశయావస్థకి వివరణలెందుకు?

ఏ భాషోద్యమాలలో నైనా గ్రాంధిక, వ్యావహారిక విభాగంలో దేనిని గ్రహించాలి? దేనిని త్యజించాలి? పెద్ద సమస్య. పురాణాల్లోని “త్రిశంకుస్వర్గం” ఈ అయోమయస్థితికి రాచబాట! మన సామెతల్లో “ఏ పుట్టలో ఏ పాముందో?!” అన్న దాన్లో సంశయావస్థ చోటు చేసుకుంది.

ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఈ స్థితి ఉంది “ఉన్నావా? .. అసలున్నావా?” … “దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం” బాపతు పాటల్లో మనం ఈ సంశయావస్థని గమనించగలం.

అస్తినాస్తి విచికిత్సాహేతుశాతోదరులైన మన కావ్య నాయికల నడుములింతకీ “ఉన్నట్టా మరి లేనట్టా?”

రాజకీయాల్లో మన ఇండియా అనుసరించిన “అలీన విధానం” అన్న వ్యవస్థ ఇదే అవస్థకి తిన్నగా సంబంధించినదే!

శ్రీనాథుడు క్రీడాభిరామం రాశాడా? లేదా?
రాయల వారికి పెద్దన ఘోస్ట్‌ రైటరా కాదా?
వేమన రాసిన పద్యాలు రెండు వేలా? ఐదు వేలా?..

ఇటువంటి “చలనంబు లేని శయనంబు” గల తెలుగు సాహిత్య సమస్య లెవ్వరూ ఎటూ నిర్ణయించగలిగేవేనా?

జీవితంలో ప్రతిరంగం లోనూ సంశయావస్థ గోచరిస్తూనే ఉంటుంది. వర్షం “కురవనా మాననా?” అన్న ఆలోచనలో ఉందని కవులెన్ని మార్లు వర్ణించలేదు!

కన్యాశుల్కం నాటకం లోనే చివర్లో గిరీశంతో బుచ్చమ్మ లేచిపోయిందనే విషయం తెలిసి అగ్నిహోత్రావధాన్లు పేరుకి తగ్గట్టుగా అయిపోయి అరుస్తాడు, ఏం చేయాలో పాలుబోక. చివరికి, “ఇంతకీ దారి యిటా? అటా?” అనడుగుతాడు.

ఈ తాటస్య్థ చిత్తవృత్తి ఈ సందేహాస్పద మనఃప్రవృత్తి ఇట్లా ఉండడానికి కారణం ఏమిటీ? అని ఆలోచిస్తే గొపీచంద్‌ రాసిన “అసమర్ధుని జీవితయాత్ర” నవలలో ఒక సమాధానం దొరుకుతుంది. రామయ్య తాత జీవితసత్యాన్ని కాచివడబోసి సీతారామారావుకి వినిపిస్తాడు సుదీర్ఘంగా నవల చివర్లో. అంతా విని ఎటూ నిర్ణయించుకోలేక సీతారామారావు, ఒక్కసారి “మిథ్య! మిథ్య గనుకనే ఎటు త్రిప్పి చెప్పటానికైనా వీలుంది!” అని గట్టిగా అరిచి చెబుతాడు.

జీవితంలోనూ, సాహిత్యం లోనూ ఈ సంశయావస్థకి హేతువులు వివేకాతిశయమైన చిత్త చాంచల్యమో? వినయగుణాధిక్యమో? అని అటునిటు గాకుండ చెప్పాల్సిందే! ఇంత రాశాక ఇది వ్యాసమేనా? కాదా? అన్న సంశయం కలిగింది. అందుకే, ఈ అవస్థ కింతటితో ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాను. Bertrand Russell  అనే మహానుభావుని మాటలిక్కడ స్వర్తవ్యాలు! ” The most unfortunate thing is that the stupid are cock-sure, while the intelligent are full of doubt!”
-----------------------------------------------------------
రచన: పొన్నపల్లి శ్రీరామారావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, December 14, 2018

అక్షరమాలా పద్యములు


అక్షరమాలా పద్యములు

సాహితీమిత్రులారా!

వివిధ దైవ స్తోత్రములలో అక్షరమాలా స్తోత్రము ఒకటి. కొన్ని దేవతలపై అట్టి స్తోత్రములు గలవు. అద్రీశ జాధీశ అను పదములతో ప్రారంభమయ్యే మృత్యుంజయ స్తోత్రములో ప్రతి పంక్తి అ, ఆ, ఇ, ఈ ఇత్యాదులైన అక్షరములతో ప్రారంభమై క్ష-కారముతో అంతమవుతుంది. అక్షరములతో ప్రారంభించు పంక్తులకు బదులు అకారాది అక్షరములతో ప్రారంభమగు వృత్తములతో పద్యములను వ్రాయవలయుననే ఒక ఆలోచన నాకు కలిగినది. దాని ఫలితమే ఈ ప్రయత్నము. ఇందులో అ-కారమునుండి హ-కారము వఱకు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క వృత్తము ఉన్నది. ౠ, ఌ, ఙ, ఞ, ణ, ళ అక్షరములు పరిగణించబడలేదు. ఎందుకనగా ఈ అక్షరములతో ప్రారంభమగు పదములు లేవు, ఉన్నను అవి చాల తక్కువ, అంతే కాక ఉపయోగములో లేవు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, క, క్ష, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ఱ, ల, వ, స, ష, స, హ అక్షరములతో (ఏ గుణింతమైనను సరియే) ప్రారంభమగు వృత్తములను, జాత్యుపజాతులను నేను వాడినాను. ఈ మొత్తము 46 పద్యములు. ఇందులో ఐ, ఒ, థ, ఠ, ఱ అక్షరములతో ఏ వృత్తములు గాని, జాత్యుపజాతులు గాని లేవు. ఈ అక్షరములకు పద్యములను నేను సృష్టించినాను. వాడుకలో ఉండే పద్యములన్నిటికి చోటు నిచ్చుటకు ప్రయత్నించినాను. రెండు పద్యములు ఒకే అక్షరముతో ప్రారంభమయినప్పుడు (ఉదా. మత్తేభవిక్రీడితము, మత్తకోకిల) వాటి అన్య నామములను ఉపయోగించినాను (మత్తకోకిల – చర్చరీ, చంపకమాల – సరసీ, దుర్మిలా – ఘోటక, తోటక – ఛిత్తక). సీసపద్యమును షట్పదలో గర్భితము చేసినాను. సంస్కృత, తెలుగు భాషలనుండి మాత్రమే కాక కొన్ని పద్యములను ఇతర భాషలనుండి దిగుమతి చేసికొన్నాను (కన్నడమునుండి ఏల, ధవళము; మరాఠీనుండి ఓవి; హిందీనుండి ఝూలనా, డమరు). మొట్టమొదట అన్ని పద్యములకు ఉదాహరణములు ఇవ్వబడినవి. చివరి భాగములో అన్ని పద్యములకు యతి గణాదులను తెలిపియున్నాను. కొన్ని పద్యముల ఛందస్సు గుఱించి నా సూచనలను అంతములో నిచ్చినాను. పాఠకులకందఱికి నా ఈ చిన్ని ప్రయత్నము నచ్చుతుందని భావిస్తున్నాను.

1) అశ్వధాటి –

శ్రీనందసూనుఁ గన – నానంద మయ్యె నొక – గానమ్ము లేచెను గదా
తేనెల్ స్రవించె నిఁకఁ – బానమ్ము సేయఁగను – వీనుల్ జలించెను గదా
వేణూరవమ్ములకు – వీణాస్వనమ్ములను – నేనిందుఁ గూర్చెదనుగా
తానాన తానతన – తానాన యంచుఁ జిఱు – ప్రాణమ్ముఁ జేర్చెదనుగా

2) ఆటవెలఁది –

శ్రీసరస్వతీ వి-రించి హృదయరాణి
భాసురమ్ము చేయు – భవము వాణి
హాస మొలుకు దేవి – యనురాగముల తల్లి
ఆసపడెదఁ గరుణ – కమృతవల్లి

3) ఇంద్రవజ్ర[1] –

రాజాధిరాజా – రవివంశతేజా
రాజీవనేత్రా – రమణీయగాత్రా
నా జీవధారా – నవజీవసారా
యీ జన్మ నీదే – యిహమంత నీదే

4) ఈశ –

జగదీశ్వరా మహేశా
నగజాపతీ గణేశా
త్రిగుణాత్మకా సురేశా
భగవత్స్వరూప యీశా

5) ఉత్పలమాల[2]–

కూరిమి నిండె నీ నెలఁత – కోమలికిన్ నినుఁ గోరఁగా సఖా
నారికి గుండెలోఁ గొలువ – నామ మగున్ స్మరణమ్ముకై సదా
వారుచుఁ బండు నా వలపు – స్వామి కృపన్ మురిపమ్ములౌ గదా
భీరువు కండ రా యలర – ప్రేమమయా లలి పెంచఁగా హరీ

6) ఊర్వశి –

ప్రియతమా చూడ రా – ప్రేమతోఁ గూడ రా
భయముతో నుంటి నే – బాధలన్ బాప రా
హయముపై వచ్చి నన్ – హాయిలో ముంచ రా
శ్రయము నీవేగదా – శ్యామ నవ్వించ రా

7) ఋషభగజవిలసిత –

వేణువు మ్రోఁగుచుండెఁ – బ్రియముగ నవనవమై
ధేనువు లాఁగకుండెఁ – దిరుగుచు నటునిటులన్
మానస మూఁగుచుండె – మధురత కనుగతమై
హా నినుఁ జూడకుండ – హరుసము గలుఁగదుగా

8) ఎత్తుగీతి –

ఈ హృది చిన్న దిచట
నీ హృది పెద్ద దచట
రా హృత్కమలము విరియ
సౌహార్దపు సుధ కురియ

9) ఏల –

ఏల నీవిట్లు యీ – బేల నన్నిట వీడి
చాల సేపుంటి వీవేళ
మాలి రావేల నా – కేల బట్టంగ గో-
పాలకా వేగ మీవేళ

10) ఐశ్వర్య –

ఇల నాకు నైశ్వర్య – మెప్పు డీవే
వలరాజు తండ్రి నా-వైపు నీవే
యలరారు నా మన్కి – కర్థ మీవే
శిలయైన రూపంపు – జీవ మీవే

11) ఒయ్యారి –

తెలతెల మేఘము – తేలుచు నింగినిఁ దోఁచె
మెలమెల గాలియు – మృదువుగఁ జల్లగ వీచె
ఉలుకుచు భావము – లొయ్యార మొలుకుచు లేచె
పలుకవె బంగరు – భామరొ మనసిట వేఁచె

12) ఓవి –

కానంగ సూర్యుని నీ యుషస్సు
ఆనందమైనది నా మనస్సు
ఆ నందగోపాలుఁడే తపస్సు
ఈ నాకు లేదు తమస్సు

13) ఔపచ్ఛందసిక (పుష్పితాగ్ర) –

కమలనయన – కాలమాయె గాదా
కమలుచు నుంటిని – కళ్ల జూడ రాదా
భ్రమల వలకు – బాగ చిక్కికొంటిన్
విమలుని ప్రేమకు – వేగ వేఁగుచుంటిన్

14) అంబుదావళి –

గగనమ్ములోనన్ – గన నంబుదావళిన్
నగధారి నాకున్ – నగుమోముతో లలిన్
అగుపించెఁ గాదా – యలరంగ డెందముల్
జగమెల్ల వాఁడే – జనియించె నందముల్

15) కందము –

సుందర చిత్రము గీచెను
సందె వెలుఁగులందుఁ బ్రకృతి – జ్వలియించంగా
స్కందా వెదుకుచు వేఁగుచు
సుందరవల్లి యిట నిన్ను – జూడఁ దపించెన్

16) క్షమా –

వెలుఁగుచు మెఱయున్- విశ్వమం దందమై
బులకల నిడు నీ – భూమి నా తల్లిగాఁ
దలతును మదిలో – తథ్యమై నిత్యమున్
సలుపుదు నఘముల్ – చాల మన్నించుమా

17) ఖజన[3] –

ఎందుకో మోసపో-యేను యీ రీతిగా – నిందువై చల్లఁగా – యిప్పుడే వాఁడు నా
ముందు రాఁడెందుకో – ముచ్చటల్ దీరఁగా – మోముపైఁ దీయగా – ముద్దిడన్ లేఁడుగా
సుందరుం డా హరిన్ – జూఁడగాఁ గోరితిన్ – సొంపులన్ జక్కఁగా – జూపఁగా నుంటిఁగా
నందగోపాల యా-నంద మీయంగ రా – నవ్వుతోఁ బువ్వులా – నన్నుఁ దాకంగ రా

18) గరుడరుతము –

గరుడరుతమ్ములన్ వినఁగ – కంజనేత్రుండు సం-
బరముగ నేఁగుదెంచెనని – బర్హిపింఛమ్ములన్
గరముల నుంచి వానిఁ గనఁ – గాంక్షతో నేఁగఁగా
వరదుఁడు గానరాఁడుగద – వంతలఁ గ్రుంగితిన్

19) ఘోటక[4]–

కమలాక్ష ననున్ – గనికారముతోఁ – గనరా యిపుడే – కడు వేగముగా
అమలానన నీ – యమృతాంబుధిలో – నలగా ననుఁ జే-యర యందముగా
సుముఖమ్ముగ నీ – సురగానములో – శ్రుతిగీతమునై – సుఖ మొందెదరా
రమణీయముగా – రసరాసములో – రజనిన్ వ్రజమున్ – రవ మయ్యెదరా

20) చర్చరీ –

నిన్ను జూచిన యా క్షణమ్మున – నేను వేఱుగ మారితిన్
గన్ను మూసినఁ గన్ను విప్పినఁ – గంటి ముందర నీవెగా
వన్నెచిన్నెల వెల్గు రూపము – వహ్ని నింపెను నామదిన్
ఖిన్న నైతిని కన్నె నేనిటఁ – గృష్ణమోహన రమ్మురా

21) ఛిత్తక[5] –

మధుసూదన రా – మనమోహన రా
యదునందన రా – అహినాశన రా
మధురాపతి రా – స్మరసుందర రా
మధురమ్ముగ రా – మది నిత్తునురా

22) జయా –

గగనమ్ములోనఁ – గనకప్రభారుచుల్
సొగసైన చిత్ర – సుషమమ్ము నెవ్వరో
మిగులన్ రచించి – మెఱయంగఁ జేసిరో
భగవంతు వాని – పదధూళిఁ గోరెదన్

23) ఝూలనా[6] –

ఉయ్యాల లూగంగ – సయ్యాట లాడంగ – నెయ్యమ్ముఁ జూపంగఁ – జయ్యంచు రా
అయ్యారె నీయొక్క – కయ్యాలఁ జాలించి – తియ్యంగ ముద్దీయఁ – జయ్యంచు రా
ఇయ్యకొని పలుకుమా – వ్రయ్యు నా హృదయమ్ము – కొయ్యవలె మాఱకను – జయ్యంచు రా
వెయ్యి దివ్వెల వెలుఁగు – నియ్య నీ వదనమ్ము – నెయ్యివలె కరుగు మది – చయ్యంచు రా

24) టంకణము –

నీవె నా గళము – నీవె నా ఫలము – నీవె నా బలమురా
నీవె నా కరము – నీవె నా వరము – నీవె నా స్వరమురా
నీవె నా తలఁపు – నీవె నా వలపు – నీవె నా కలలురా
నీవె నా విరులు – నీవె నా సిరులు – నీవె నా మరులురా

25) ఠారా –

దిశ లెల్ల నవనూత్న – దీప్తితో నిండెఁగా
శశినిఁ గన మనసొక్క – సంద్రమై లేచెఁగా
నిశివేళ నిను వీడి – నేను వేఁచేనుగా
వశమయ్యె నా హృదియు – వంశికిన్ మోహనా

26) డమరు –

శివుఁడన మన సొక గుడియగు నిజముగ – శివుఁడన జగమది శివమయ మగుఁ గద
భవుఁడన భవ మది నవమగు నిజముగ – భవ మది సుఖముల శుభమయ మగుఁ గద
భవమున హర యనఁ గలతలు తొలగుఁగ – భయహర మవ మది భ్రమములు తొలగుఁగ
భువియును దివమును డమరుక రవముల – మొరయుఁగ శివసతి నటనల కనువుగ

27) ఢుంఢి –

కరిరాజాస్యమ్ము
వరదా నా యిమ్ము
వరడుంఢీ రమ్ము
వరముల్ నాకిమ్ము

28) తేటగీతి –

నిదుర బోయేను నిశిలోన – నేను డస్సి
యదను నీకాయె నప్పుడె – యరుగుదెంచ
నిదురలో నన్నుఁ జూచేవు, – నిముసమందు
వదలి వెళ్లంగ, మిగిలె నీ – పాదధూళి

29) థోడన –

అంబరమందున – నందపు రంగుల
సంబర మెల్లెడ – సందె వెలుంగుల
చుంబిత మాస్యము – సూర్యకరమ్ముల
నంబుజనేత్రుఁడె – యందము

30) దండకము –

ఓ దేవదేవా మహాదేవదేవా, త్రిలోకాధినేతా పునీతా సునీతా, చిదానందరూపా సదానందదీపా, విరాడ్విశ్వమూర్తీ వివేకానువర్తీ, సదాసత్యగామీ సుధాపానకామీ, రమాచిత్తలోలా రసోత్సంగశీలా, నవాంభోజనేత్రా నవోత్సాహగాత్రా, అశేషాఽవనీశా, అశుద్ధాత్మనాశా, విదోషా విశేషా విపాశా వినాశా, అమోఘప్రవాహా విమోహా అదేహా, విరాగా సరాగా సురాగా పరాగా, ముకుందా మురారీ ముదాబ్ధీ మునీంద్రా, సచిత్రా విచిత్రా సుచిత్రా పవిత్రా, అనేకార్థనామా హరీ పరంధామా, అనంతాంఽతరంగా, మహోత్తుంగశృంగా, మహాకాలతత్త్వా మహోత్కృష్టసత్వా, అచింత్యప్రమాణా ప్రభాభాసమానా, సునీలాంగరంగా సుధర్మప్రసంగా, మదిన్ నిన్ను దల్తున్ సదా నిన్ను గొల్తున్, హృదిన్ బూయు పూలన్ విధిన్ నీకె యిత్తున్, నిధుల్ నీవె నాకున్ నిజమ్మీవె నాకున్, పదార్థమ్ము నీవే స్వరార్థమ్ము నీవే, యధార్థమ్ము నీవే భవార్థమ్ము నీవే, ననున్ గావ వయ్యా నమో కృష్ణమూర్తీ, నమస్తే నమస్తే నమస్తే నమః

31) ధవళము –

పావనమగు శ్రీపతి పదముల
పావనియగు గంగ జనించెనుగా
పావనమగు మునుగఁగ జలముల
జీవనమున ముక్తి లభించునుగా

32) నందన –

విను యదునందనా మనసులోఁ – బ్రియమ్ముగా నుండి క్రొ-
న్ననల గ్రహించు సంతసముతో – నయమ్ముగా నిత్యమున్
గనుఁగొన సాధ్యమే మహిమలన్ – కళామయా కృష్ణమో-
హన నను గావుమయ్య కరుణన్ – హరించు నా పాపముల్

33) పంచచామర[7] –

అనాథనాథుఁ డీవెగా – ననంతమూర్తి నీవెగా
సునీతిశాలి నీవెగా – సునాదబిందు వీవెగా
మనోజవమ్ము నీవెగా – మనోజ్ఞరూప మీవెగా
వినోదశీలి నీవెగా – వినాయకుండు నీవెగా

34) ఫుల్లదామ –

నీ హాసమ్ముల్ నాకు – నిజము వరదా – నిత్యసంతోషముల్గా
నీహారమ్మై తోచె – నెనరు పదముల్ – నిక్కమై నిండె నాలో
మోహమ్మాయెన్ నాకు – ముఖముఁ గన నే – ఫుల్లదామమ్ము నైతిన్
దేహమ్మందున్ నీవె – తెలిసినది నా – దేమియున్ లేదాయెరా

35) బింబ –

ప్రాణ మ్మీవే నాకు – ప్రణయవరదా – ప్రార్థింతు నిన్నే గదా
తాన మ్మీవే యెప్డు – తపితహృదిలో – తల్లీన మౌదున్ సదా
గాన మ్మీవే పాఱు – గతుల వడిలోఁ – గంపించు రాగమ్ము నేన్
శ్రీనాథా రారమ్ము – చెలిమి జగతిన్ – శృంగార బింబమ్ము నేన్

36) భుజంగప్రయాతము[8] –

నభమ్మందు కాంతుల్ – నవమ్మైన శాంతుల్
ప్రభాతమ్మునందున్ – ప్రకాశమ్ము జిందున్
శుభోషస్సు దీప్తుల్ – సుఖానంద సూక్తుల్
విభూ వేగ రావా – విమోహమ్ము నీవా

37) మత్తేభవిక్రీడితము –

మధురమ్మైనది నీదు మాట లవి యా – మాణిక్య వీణాస్వరం-
బధరమ్మందునఁ దేనె పాట నుడు ల-త్యానంద రాగమ్ములే
మధురమ్మైనది నీదు రూప మది నన్ – మంత్రించె మాయాత్మకన్
మధురోత్సాహము గల్గె నిన్ను దలఁచన్ – మత్ప్రాణనాథా హరీ

38) యమునా –

అల యమునానది – యందమై సదా
గలగల పారఁగ – గంతులేయుచున్
సలలితరాగము – శ్యామలాంగుఁడున్
మెలమెలఁ బాడఁగ – మింటి నంటితిన్

39) రగడ –

నీకై నేనిట – నీవట నాకై
రాకాశశి యట – రాజిలె మనకై
నదిలో హాయిగ – నౌకాయానము
హృదయానంద – మ్మిచ్చుఁ బ్రయాణము
ముదముగఁ బాడుము – మోహన రాగము
పదముల నింపుము – వడి ననురాగము
నను పాలింపుము – నవ్వులు కురియఁగ
ప్రణయాశ్లేషము – ప్రాణము తరియఁగ

40) ఱింగు –

వాసుదేవా హరీ మాధవా – వందింతున్ నే నిన్
శ్రీసతీశా సఖా కేశవా – సేవింతున్ నే నిన్
రాసలీలావినోదప్రియా – ప్రార్థింతున్ నే నిన్
ధ్యాస నీవేగదా యెప్పుడున్ – ధ్యానింతున్ నే నిన్

41) లయగ్రాహి –

గాలి యతి మందమయె – నీల గగనాన శశి – నేలపయి వెన్నెలలు – తూలె నిల రేయిన్
పూలవనిలోనఁ బలు – లీలలను బాడఁగను – దేలుచును గోపికలు – వ్రాలి రట హాయిన్
ఆలు బలు యూగుఁగద – వ్యాళములు నూగుఁగద – బాలతతి యూగుఁగద – మేలములఁ గృష్ణా
చాల తడవాయె నిఁకఁ – గేలఁ మురళిన్ గొనుచు – లీలలను జూపు మిట – శ్రీలొసఁగఁ గృష్ణా

42) వసంతతిలక[9] –

దేవాధిదేవుని మదిన్ – దినమెల్ల గొల్తున్
శ్రీవేంకటేశుని హృదిన్ – సిరియంచు దల్తున్
నావైపు చూపుమ హరీ – నగుమోము కాంతుల్
భావింతు నే నిను సదా – భవసార మంచున్

43) శార్దూలవిక్రీడిత –

పారావారము గాదె జీవితము సం-బంధమ్ములన్ ద్రెంచ సం-
సారమ్మందు నసాధ్యమౌను భువిలో – సందేహమే లేదుగా
పారావారము దాట నావ నొక టీ-వయ్యా నినున్ జేరఁగా
శ్రీరంగేశ్వర శ్రీనివాస వ్రజనా-రీచిత్తహారీ హరీ

44) షట్పద[10] –

చాలించు మారాము
బాలగోపాలకా
చాలించు మాటలన్ – జక్కనయ్య
చాలించు మన్నతో
కేళికల్ కజ్జముల్
చాలించు మిఁకమీదఁ – జల్లనయ్య
చాలించు పెర యిండ్లఁ
బాలు త్రాగుట నీవు
చాలించు మెదిరింపు – చారుహాస
చాలించు మెదురీత
నీలనీరమ్ములో
చాలించు దౌష్ట్యమున్ – సారసాక్ష
చాలు నాటకములు
చాలు కపటములు
చాలు బూటకములు – శ్యామలాంగ
వేళ నిద్ర కిదియె
లాలి పాట వినుచు
పూల కనులు మూసి – పొమ్ము నిద్ర

45) సరసి –

నవసరసీరుహాక్షుఁడు, సు-నాదవినోదవిచారుఁ, డభ్రమం-
దవనతమైన మేఘముల – నందముఁ బొందినవాఁడు, గంధ నం-
దవనమునందు సుందర సు-ధామధురధ్వనిఁ జిందు వాఁడు, నా
కవనమునందు రాజిలుచుఁ – గామము లన్నియుఁ దీర్చు వాఁడెగా

46) హరిణీ[11] –

హరినిఁ దలచన్ – హ్లాదమ్మయ్యెన్ – హరించిపోయెన్ వ్యధల్
హరిణి దయతో – నానందమ్మై – హసించి యిచ్చున్ సుధల్
ఇరువురు సదా – యిష్టార్థమ్ముల్ – హితమ్ముగా నివ్వరే
సరసహృదయుల్ – చక్కంగా శా-శ్వతమ్ముగా నవ్వరే

పద్యపట్టిక
* స్వకపోలకల్పితము, U గురువు, I లఘువు, సూ – సూర్యగణము, ఇం – ఇంద్రగణము, చం – చంద్రగణము, చ – చతుర్మాత్ర, ప – పంచమాత్ర

1) అశ్వధాటి – త/భ/య/జ/స/ర/న/గ, ప్రాసయతి (UUI UIII) (UUI UIII) (UUI UIII U) 22ఆకృతి 1915509
2) ఆటవెలఁది – (సూ-సూ-సూ) (ఇం-ఇం) / (సూ-సూ-సూ) (సూ-సూ)
3) ఇంద్రవజ్ర – త/త/జ/గగ, (UUI UU) (IIUI UU) 11 త్రిష్టుప్ 357
4) ఈశ – స/జ/గగ (IIUI UIU U) 8 అనుష్టుప్ 44
5) ఉత్పలమాల – భ/ర/న/భ/భ/ర/లగ (UII UIU III) (UII UII UIU IU) 20 కృతి 35579
6) ఊ(ఉ)ర్వశీ (కౌముదీ )- న/త/త/త/గ (IIIU UIU) (UIU UIU) 13 అతిజగతి 2344
7) ఋషభగజవిలసిత – భ/ర/న/న/న/గ (UII UIUI) (IIII IIIIU) 16 అష్టి 32727
8) ఎత్తుగీతి – ఇం-సూ-సూ
9) ఏల – ప్రాసయతి (ఇం-ఇం) (ఇం-ఇం) / (ఇం-సూ-ఇం)
10) *ఐశ్వర్య – స/య/జ/గగ (IIUI UUI) (UIUU)11 త్రిష్టుప్పు 332
11) *ఒయ్యారి – (ఇం-ఇం) (ఇం-ఇం-సూ)
12) ఓవి – మొదటి మూడు పాదములు 6 – 15 అక్షరములు, నాలుగవ పాదము తక్కిన పాదములకన్న చిన్నది, మొదటి మూడు పాదములకు అంత్యప్రాస నియతము.
13) ఔపచ్ఛందసిక – (6 మాత్రలు, ర,య) / (8 మాత్రలు, ర,య)
అందులో పుష్పితాగ్ర (III III – UIU IUU) / (IIII UII – UUI IUU)
14) అంబుదావళి – స/య/స/జ/గ (IIUI UU) (IIUI UIU) 13 అతిజగతి 2764
15) కందము – (చ-చ-చ) / (చ-చ-చ) (చ-చ) బేసి గణముగా జ-గణము నిషిద్ధము, చివరి గణము UU లేక IIU, ఆఱవ గణము IIII లేక IUI
16) క్షమా (చంద్రికా, కుటిలగతి) – న/న/త/త/గ (IIII IIU) (UIU UIU) 13 అతిజగతి 2368
17) ఖజన (గంగోదకము, స్వైరిణీక్రీడన) – ర/ర/ర/ర/ర/ర/ర/ర (UIU UIU) (UIU UIU) (UIU UIU) (UIU UIU)
24) సంకృతి 4793491
18) గరుడరుతము (వాణినీ) – న/జ/భ/జ/త/గ (IIII UIU III) (UIU UIU) 16 అష్టి 19376
19) ఘోటక (దుర్మిలా) – స/స/స/స/స/స/స/స (IIU IIU) (IIU IIU) (IIU IIU) (IIU IIU) 24 సంకృతి 7190236
20) చర్చరీ (మత్తకోకిల, ఉజ్జ్వల, హరనర్తన, విబుధప్రియా, మల్లికామాల) – ర/స/జ/జ/భ/ర (UI UII UI UII) (UI UII UIU)
18 ధృతి 93019
21) ఛిత్తక (తోటక) – స/స/స/స (IIU IIU) (IIU IIU) 12 జగతి 1756
22) జయా (మంజుభాషిణీ, కనకప్రభా, నందినీ, ప్రబోధితా) – స/జ/స/జ/గ (IIUI UI) (IIUI UIU) 13 అతిజగతి 2796
23) ఝూలనా – (5, 5) (5, 5) (5, 5) (5, 2) మాత్రలు ప్రాసయతి (అశ్వధాటి దీని ప్రత్యేకత)
24) టంకణము – ర-న-ర-న- ర-న-గ, ప్రాసయతి (UI UIII) (UI UIII) (UI UIIIU) 19 అతిధృతి 241339
25) *ఠారా – (5, 5) మాత్రలు, ర/ర (ప-ప) (UIU UIU)
26) డమరు – 32 లఘువులు – (16 లఘువులు) (16 లఘువులు) అంత్యప్రాస
27) ఢుంఢి – స/త (IIU UUI) 6 గాయత్రి 36
28) తేటగీతి – (సూ-ఇం-ఇం) (సూ-సూ)
29) *థోడన – మొదటి మూడు పాదములు (ఇం-ఇం) (ఇం-ఇం), నాలుగవ పాదము (ఇం-ఇం-ఇం)
30) దండకము – త-గణ దండకము – వరుసగా త-గణములు, చివర ఒక గురువు
31) ధవళము – గంగాధవళము – నాలుగు పాదములు, బేసి పాదములు (6,4,4) మాత్రలు, సరి పాదములు (6,4,4,2) మాత్రలు
32) నందన – న/జ/భ/జ/ర/ర (IIII UIU IIIU) (IUIU UIU) 18 ధృతి 76720
33) పంచచామర (నారాచ, మహోత్సవ) – జ/ర/జ/ర/జ/గ (IUIUIUIU) (IUIUIUIU) 16 అష్టి 21846
34) ఫుల్లదామ – మ/త/న/స/ర/ర/గ (UUU UUI) (III IIU) (UIU UIUU) 19 అతిధృతి 75745
35) బింబ – మ-త-న-స- త-త-గ, యతి (1, 7, 13) (UUU UUI) (IIIIIU) (UUI UUIU) 19 అతిధృతి 149473
36) భుజంగప్రయాత (ఆదిదైవీ, అప్రమేయా) – య/య/య/య (IUU IUU) (IUU IUU) 12 జగతి 578
37) మత్తేభవిక్రీడితము – స/భ/ర/న/మ/య/లగ (IIUU IIU IUI IIU) (UUI UUIU) 30 కృతి 298676
38) యమునా (తతి, మాలతీ, వరతను) – న/జ/జ/ర (IIII UII) (UIUIU) 12 జగతి 1392
39) రగడ – మధురగతి రగడ – (చ-చ) (చ-చ) ప్రాస, అంత్యప్రాస
40) *ఱింగు – ర/ర/ర/మ/గగ (UIU UIU UIU) (UUU UU) 14 శక్వరి 147
41) లయగ్రాహి – భ/జ/స/న/భ/జ/స/న/భ/య ప్రాసయతి (UIII UIII) (UIII UIII) (UIII UIII) (UIII UU)
42) వసంతతిలక – త/భ/జ/జ/గగ (UUI UIIIU) (IIUI UU) 21 శక్వరి 2933
43) శార్దూలవిక్రీడితము – మ/స/జ/స/త/త/గ (UUU IIU IUI IIU) (UUI UUIU) 19 అతిధృతి 149337
44) షట్పద – మూడు ప్రాసయతులు (ఇం-ఇం) (ఇం-ఇం) (ఇం-ఇం) (ఇం-చం)
45) సరసి (చంపకమాల, ధృతశ్రీ, పంచకావళీ) న/జ/భ/జ/జ/జ/ర (IIII UIU III) (UII UII UIUIU) 21 ప్రకృతి 711600
46) హరిణీ (వృషభలలిత) – న/స/మ/ర/స/లగ (IIIIIU) (UUUU) (IUI IUIU) 17 అత్యష్టి 46112

కొన్ని సూచనలు
1. ఇంద్రవజ్రకు తెలుగులోవలె గాక తాళరీత్యా యతి నుంచినాను.
2. ఈ ఉత్పలమాలలో జలదము (కూరిమి నిండె నీ నెలఁత – కోమలికిన్), మణిభూషణము (నిండె నీ నెలఁత కోమలికిన్ – నినుఁ గోరఁగా), ద్రుతవిలంబితము (నెలఁత కోమలికిన్ – నినుఁ గోరఁగా), అంబా (కోమలికిన్ నినుఁ – గోరఁగా సఖా) వృత్తములు గర్భితమై యున్నవి.
3. ఖజన వృత్తపు పాదములో రెండు స్రగ్విణీ వృత్తపు పాదములు గలవు.
4.ఘోటక వృత్తపు పాదములో రెండు తోటక వృత్తపు పాదములు గలవు.
5. ఛిత్తక (తోటక) వృత్తమునకు యతి తెలుగులో తొమ్మిదవ అక్షరమువలె గాక, రెండేసి చతుర్మాత్రలు విఱుగునట్లు నేను ఉంచినాను.
6. ఝూలనా లయ అశ్వధాటివంటిదే. మాత్రాగణములతో అశ్వధాటిని వ్రాస్తే అది ఝూలనా అవుతుంది.
7. పంచచామరమునకు తెలుగులోవలె గాక పాదము రెండుగా విఱుగునట్లు ఒక అక్షరము ముందు ఉంచినాను.
8. భుజంగప్రయాతమునకు తెలుగులోవలె గాక పాదము రెండుగా విఱుగునట్లు ఒక అక్షరము ముందు ఉంచినాను.
9. వసంతతిలకమునకు యతిని తెలుగులోవలె గాక ఒక అక్షరము ముందు ఉంచినాను.
10. తెలుగులో ఒక షట్పద పాదము నేను వ్రాసిన మూడు చిన్న పాదములను కలిపితే వస్తుంది. షట్పదలో మూడు ప్రాసయతులనే నేను ఉంచినాను. చివరి యతిని సామాన్య అక్షరయతిగా భావించినాను. ఇందులోని ప్రతి షట్పద పాదము ఒక సీస పాదమునకు సరిపోతుంది. షట్పదలోని చివరి చంద్ర గణమును రెండు సూర్యగణములుగా చేయుటవలన ఇది సాధ్యము అవుతుంది. ఇందులోని చివరి రెండు పాదములు (చాలు నాటకములు … నుండి) ఆటవెలదికి సరిపోతుంది.
11. హరిణికి నేను సంస్కృతములోవలె (ఉదా. మందాక్రాంతము) రెండు యతులను ఉంచినాను.
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

Thursday, December 13, 2018

కృష్ణరాయల కవిపోషణ


కృష్ణరాయల కవిపోషణసాహితీమిత్రులారా!

ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానాన్నిస్తూ కృష్ణరాయలు ఆంధ్రభోజుడనీ, సాహితీసమరాంగణ సార్వభౌముడనీ, అతని కాలం తెలుగు కవిత్వానికి స్వర్ణయుగమనీ మౌఖికంగా ప్రచారంలో వున్న భావాలు వట్టి పుకార్లేమో నన్న సందేహం వెలిబుచ్చారు.

అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న ఇలాటి భావాల్ని గురించి నాకు అందుబాటులో వున్న ఆధారాల సహాయంతో మరొక్కసారి పరిశీలించాలనిపించింది. ఇందుకోసం మూడు ఆధారాలను ఉపయోగిస్తున్నాను – పెద్దన మనుచరిత్ర, తిమ్మన పారిజాతాపహరణం, “A Forgotten Empire: Vijayanagar; A Contribution to the History of India by Robert Sewell”. ఈ విషయం మీద రాతిశాసనాల్లో ఇంకా కొన్ని ఆధారాలున్నాయని విన్న గుర్తు. అలాగే కన్నడ సాహిత్యంలో బహుశ కొన్ని ఆధారాలు ఉండి వుండవచ్చు. కాని అవి అందుబాటులో లేవు కనుక వీటితోనే ప్రస్తుతానికి సరిపెట్టుకోవాల్సొస్తోంది.

ఇవేవీ లేకుండా కృష్ణరాయల కవిపోషణ గురించి వ్యాసం ఏమిటి అన్న ప్రశ్న సహజం. అందుకు నాకనిపించేదేమంటే – పాశ్చాత్య పరిశోధకుల దృష్టిలో మన కవుల పొగడ్తలు కేవల కల్పితాలు. వాటిలో ఏమాత్రం నిజం వుండదు. అందువల్ల అవి చరిత్రకు ఉపయోగపడే విషయాలు ఏమీ చెప్పవు. భారతీయ పరిశోధకులు కూడ చాలావరకు వారినే అనుసరించారు. (సాహిత్య గ్రంథాలలోని చారిత్రక విషయాల ప్రాధాన్యత గురించి ఈ మధ్యనే కొంత లోతుగా పరిశీలన జరిగింది. (Textures of Time : Writing History in South India 1600-1800/Velcheru Narayana Rao, David Shulman and Sanjay Subrahmanyam)). అంచేత మన కావ్యాలలోని సాక్ష్యాలను పరిశీలించటం మరీ ప్రాధమికం, నేలబారు “ఉపరిశోధన” కాకపోవచ్చునని ఆశ.

ఇకపోతే, పైన చెప్పిన ఆధారాలు కృష్ణరాయల సమకాలీనులు, ఆయనతో కాస్తో కూస్తో సాంగత్యం వున్నవాళ్లు రాసినవి కనుక వీటినుంచి హేతుబద్ధంగా చెయ్యగలిగిన సిద్ధాంతాలను ఇతర ఆధారాలు ఖండించే అవకాశం తక్కువ; ఐతే ఇతర ఆధారాలు వీటి నుంచి నిర్ణయించలేని విషయాల మీద కొత్త వెలుగు ప్రసరించి నిర్ణయించటానికి పనికిరావొచ్చు. వాటిని వాడనందువల్ల అలాటి నిర్ణయాల్ని చెయ్యలేం. ఎలాగూ అన్ని ఆధారాల్నీ కూలంకషంగా పరిశీలించటానికి అదే పనిగా పెట్టుకున్న అనేకమంది పరిశోధకులు వున్నారు. వారు ఇంతకంటే లోతుగానే చూసివుంటారు. వాటితో పరిచయం వున్నవారు ఈ వ్యాసానికి స్పందించి ఆ పరిశోధనల పర్యవసానాల్ని వివరించమని ఆహ్వానిస్తున్నాను.

నాకున్న సందేహాలు ఇవి – కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా? అతను స్వయంగా కవి అన్న విషయం ఆ కాలపు ప్రసిద్ధ కవులు గుర్తించారా? అష్టదిగ్గజ కవుల ప్రసక్తి ఎలా వచ్చి వుంటుంది? ఆ అష్టదిగ్గజాలు ఎవరో ఎందుకు స్పష్టంగా లేదు? కృష్ణరాయలు కవిపోషకుడా – అంటే వాళ్ల కవితాశక్తికి ముగ్ధుడై వాళ్లకు దానాలు చేశాడా? వీటికి సమాధానాల కోసం చిన్న ప్రయత్నం ఇది.

పెద్దన, తిమ్మన – ఈ ఇద్దరిలోనూ (బహుశా అంతఃపురకవి కావటం వల్లనేమో?) కృష్ణరాయల ఆంతరంగిక విషయాలు పెద్దన కన్నా తిమ్మనకే ఎక్కువగా తెలిసినట్లు కనిపిస్తుంది. తిమ్మన రాయల కవిత్వాసక్తి గురించి చెప్పిన ఒక పద్యం –

ప్రతివర్ష వసంతోత్సవ
కుతుకాగత సుకవినికర గుంఫిత కావ్య
స్మృతి రోమాంచ విశంకిత
చతురాంతఃపుర వధూ ప్రసాదన రసికా! (ప్రథమాశ్వాసాంత పద్యం)

ఏటేటా జరిగే వసంతోత్సవాల్లో సుకవులు కావ్యగానాలు గుప్పిస్తారట. అవి విని పులకించిన రాయల రోమాంచాల్ని చూసి అంతఃపుర వనితలు అపార్థాలు చేసుకుని హడావుడిపడతారట. ఇది నిజమా? చెప్పలేం. నిజమైతే తిమ్మనకి ఎలా తెలిసి వుంటుంది? రాయలే తన ఆంతరంగికులతో అనుండొచ్చు. లేదా, అరణపుకవిగా అంతఃపుర స్త్రీలతో అనుకూల సంబంధాలున్న తిమ్మన వాళ్ల దగ్గర్నుంచి విని వుండొచ్చు. (ఐతే, నిజానికి అతను అరణపు కవి అనటానికి కూడ లిఖితాధారాలు లేవు, ఇదీ కేవలం అనుశ్రుతంగా వస్తున్న కథే.) ఇవేవీ కాకపోతే, ఇది అతని ఊహ కావొచ్చు.

వసంతోత్సవాల మాట నిజం (కింద చూడండి). అక్కడ కవులు కావ్యగానాలు చేశారా? అందుకు అవకాశం బాగా వుంది. కృష్ణరాయలు అవి విన్నాడా? తిమ్మన ఒక్కడే మనకు ఆధారం. “కనీసం ఇద్దరు చెప్తే కాని ఏ విషయమూ నిజం కింద లెక్క కాదు” అనే ప్రమాణం పాటిస్తే ఇది నిజమయేందుకు అవకాశం వుంది కాని ఖచ్చితంగా నిజం అని చెప్పలేం. ఇక అంతఃపుర సన్నివేశం నిజమైనా కాకపోయినా మనముందున్న ప్రశ్నకు అంత ముఖ్యం కాదు.

ఈ వసంతోత్సవాలు కనీసం మూడు రోజుల పాటు జరిగేవని నమ్మొచ్చు. 1443 ఏప్రిల్‌ నెలలో (అంటే కృష్ణరాయలు రాజు కావటానికి అరవై ఐదేళ్ల ముందు) విజయనగరాన్ని పాలిస్తున్న రెండవ దేవరాయల ఆస్థానాన్ని దర్శించిన Abdur Razzak అప్పడు జరిగిన వసంతోత్సవాన్ని చూసి దిగ్భ్రాంతుడయాడు. Forgotten Empire నుంచి ఆ భాగం ఇది –

“In pursuance of orders issued by the king of Bidjanagar, the generals and principal personages from all parts of his empire … presented themselves at the palace. They brought with them a thousand elephants … which were covered with brilliant armour and with castles magnificently adorned…. During three consecutive days in the month of Redjeb the vast space of land magnificently decorated, in which the enormous elephants were congregated together, presented the appearance of the waves of the sea, or of that compact mass which will be assembled together at the day of the resurrection. Over this magnificent space were erected numerous pavilions, to the height of three, four, or even five storeys, covered from top to bottom with figures in relief…. Some of these pavilions were arranged in such a manner that they could turn rapidly round and present a new face: at each moment a new chamber or a new hall presented itself to the view.

“In the front of this place rose a palace with nine pavilions magnificently ornamented. In the ninth the king’s throne was set up. In the seventh was allotted a place to the humble author of this narrative…. Between the palace and the pavilions … were musicians and storytellers.” Girls were there in magnificent dresses, dancing “behind a pretty curtain opposite the king.”

There were numberless performances given by jugglers, who displayed elephants marvellously trained. During three consecutive days, from sunrise to sunset, the royal festival was prolonged in a style of the greatest magnificence. Fireworks, games, and amusements went on. On the third day the writer was presented to the king.

“The throne, which was of extraordinary size, was made of gold, and enriched with precious stones of extreme value…. Before the throne was a square cushion, on the edges of which were sown three rows of pearls. During the three days the king remained seated on this cushion. When the fete of Mahanawi was ended, at the hour of evening prayer, I was introduced into the middle of four ESTRADES, which were about ten ghez both in length and breadth.[147] The roof and the walls were entirely formed of plates of gold enriched with precious stones. Each of these plates was as thick as the blade of a sword, and was fastened with golden nails. Upon the ESTRADE, in the front, is placed the throne of the king, and the throne itself is of very great size.”

కృష్ణరాయల కాలంలో రాజ్యంలో ఉన్న సంపదల దృష్ట్యా ఈ ఉత్సవం ఇంకా వైభవోపేతంగా జరిగి వుంటుందని ఊహించటం సత్యదూరం కాకపోవచ్చు.

మరో ప్రశ్న – కృష్ణరాయలు కవుల్ని పోషించాడా లేదా? తిమ్మన పారిజాతాపహరణాంతంలో తన గురించి చెప్పుకుంటూ ఇలా అంటాడు –

కౌశికగోత్ర విఖ్యాతు డాపస్తంబ
సూత్రు డార్వేల పవిత్రకులుడు
నందిసింగామాత్యునకును తిమ్మాంబకు
తనయుండు సకలవిద్యావివేక
చతురుడు మలయమారుత కవీంద్రునకు మే
నల్లుండు కృష్ణరాయక్షితీశ
కరుణా సమాలబ్ధ ఘన చతురంతయా
న మహాగ్రహార సన్మానయుతుడు
తిమ్మయార్యుండు శివపరాధీనమతి య
ఘోరశివ గురు శిష్యుండు పారిజాత
హరణ మను కావ్య మొనరించె నంధ్రభాష
నాదివాకర తారా సుధాకరముగ

మిగిలిన వాళ్ల విషయం ఎలా వున్నా కనీసం తిమ్మనకు “ఘన చతురంత యానాలు”, “మహాగ్రహారాలు”, “సన్మానాలు” దొరికాయన్నమాట. పెద్దనకు కూడ ఘన సన్మానాలు జరిగినట్టు, అగ్రహారాలు వచ్చినట్టు మౌఖికాధారాలు (చాటు పద్యాల ద్వారా) ఉన్నాయి కాని అవెంత నమ్మదగినవో చెప్పలేము. పెద్దన తనే దేవాలయాలకు దానాలు చేసిన శాసనాలు ఉన్నాయని విన్న గుర్తు. అలా ఐతే రాయలు కవులకు దానాలు చేశాడనటానికి మనకు రెండు ఆధారాలు దొరుకుతాయి.

పెద్దన, తిమ్మన ఇద్దరూ రాయల దాతృత్వాన్ని విపరీతంగా పొగిడారు. ఇది కేవలం ఆచారానికి కొనసాగింపా లేకపోతే నిజంగానే ఆయన దానాలు చేశాడా అనేది వీటినుంచి చెప్పలేం. ఒకవేళ దానాలు చేసినా, వాళ్లలో కవులు ఎంతమందో కూడ మనకు తెలియదు. దేవాలయాలకు దానాలు చేసినట్టు మాత్రం శాసనాలున్నాయి.

మరో ప్రశ్న అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా అనేది.

మనం చూస్తున్న మూడు ఆధారాల్లోను అష్టదిగ్గజాల ప్రసక్తి ఎక్కడా లేదు. ఐతే తిమ్మన పద్యం ఒకటి కొంత ఆలోచింప జేస్తుంది –

భువనవిజయాఖ్య సంస
న్నవరత్న విభా ప్రభాతనలినాప్త రమా
ధవ చరణకమల సేవా
ప్రవణమతీ వీరరుద్ర పర్వత వజ్రీ (పంచమాశ్వాసాంతం)

దీన్లో మొదటిభాగం భువనవిజయ సభ గురించి చెప్తుంది. ఒకవిధంగా చూస్తే “భువనవిజయసభ అనే కొత్త రత్నానికి వెలుగునిచ్చే ప్రభాత సూర్యుడ”ని రాయల్ని సంబోధిస్తున్నాడని అనిపిస్తుంది. మరోవిధంగా “భువనవిజయ సభలో ఉన్న నవరత్నాలకు వెలుగునిచ్చే ప్రభాత సూర్యుడ”ని కూడ అనుకోవచ్చు. ఇలా అనుకుంటే, అష్టదిగ్గజాలు కాదుగాని నవరత్నాలనే కవిపండితులు ఉన్నారేమోనన్న సందేహం కలుగుతుంది. దీనికి ఒక ఆధారం ఏమిటంటే పెద్దన, తిమ్మన ఇద్దరూ కృష్ణరాయల్ని భోజుడితో పోల్చారు. ఉదాహరణకు ఈ పద్యం చూడంది –

శ్రీఖండశీతనగ మ
ధ్యాఖండ క్షోణిమండ లాఖండల! వి
ద్యాఖేలన భోజ! సుధీ
లే ఖద్రుమ! కృష్ణరాయ! లీలామదనా! (మనుచరిత్ర ద్వితీయాశ్వాసం, తొలిపద్యం)

భోజుడి ఆస్థానంలో నవరత్నాలున్నారని ప్రతీతి. కనుక, నవరత్నాలని గాని, అష్టదిగ్గజాలని కాని, మరోటి కాని పేరున్నా లేకపోయినా కనీసం భోజుడితో పోలిక కారణంగా భువనవిజయంతో సంబంధం వున్న కొందరు ప్రముఖ కళాకారులు ఉన్నారని అనుకోవటం మరీ అతార్కికం కాకపోవచ్చు. కనీసం తిమ్మన దృష్టిలో అలాటి వాళ్లున్నారనుకోవచ్చు.

భువనవిజయ ప్రసక్తి పెద్దన కూడ చేశాడు. నిజానికి రాయలు పెద్దనను మనుచరిత్ర చెప్పమని అడిగింది అక్కడే అని పెద్దన ప్రకటన.

భువనవిజయాఖ్య సంస
ద్భవన స్థిత భద్రపీఠి ప్రాజ్ఞుల గోష్టిన్
కవితామధురిమ డెందము
దవులన్‌ గొలువుండి సదయతన్‌ నను బల్కెన్‌ (కృత్యాది పద్యాల్లో)

మొత్తం మీద, అష్టదిగ్గజాలనే ప్రసిద్ధమైన పేరున్న కవులు కృష్ణరాయల ఆస్థానంలో ఉన్నారా అంటే చాలా అనుమానమే. కాని కొందరు ప్రముఖ కవిపండితులు, ఇతర కళాకారులు కృష్ణరాయలతో గోష్టి సలిపే వారని, బయటివారు వాళ్లలో కొందరిని అష్టదిగ్గజాలనో నవరత్నాలనో మరోపేరుతోనో సరదాగానో, గౌరవం కొద్దో పిలుచుకుని ఉండేవారని నమ్మటానికి ఆస్కారం వుంది. భోజుడితో పోలిక వల్ల నవరత్నాలను కొందరు గుర్తించి వుండవచ్చు కూడ. అలాగని అలాటి వారందరి దృష్టిలోను ఒకే ఒక నవరత్నాల సమూహం ఉందని కాదు; ఎవరి దృష్టిలో వారికి వేరే వారు ఆ నవరత్నాలో అష్టదిగ్గజాలో అయుండవచ్చు. ఇప్పుడు మనకు కనిపించే అష్టదిగ్గజాల జాబితాలు రెండు మూడు ఉండటాన్ని ఈ ప్రతిపాదన వివరిస్తుంది కూడ.

చివరగా మరో సందేహం – కృష్ణరాయలు కూడ కవే అనే విషయం అప్పటి ప్రసిద్ధ ఆంధ్రకవులెవరైనా గుర్తించారా?

పెద్దన రాయల జైత్రయాత్రల్ని, పౌరుషప్రతాపాల్ని వీరావేశంతో వర్ణించాడు. మనుచరిత్రలో ఆయన చేసిన వేట వర్ణనల నుంచి, చాటు పద్యాల నుంచి, వేటల్లో, యుద్ధాల్లో రాయలతో పాటు పెద్దన కూడ వెళ్లివుండవచ్చునని అనిపిస్తున్నది. పెద్దనకు రాజకీయాల్లో కూడ పాత్ర వుండి వుండొచ్చు (పెద్దనామాత్యుడనే పదం అనుశ్రుతంగా వినిపిస్తుంది). అంత ఆప్తుడిగా వున్న పెద్దన రాయల కవితాస్వాదనా గుణాన్ని గురించి చెప్పాడు తప్ప కావ్యకర్తృత్వం గురించి కాదు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే తిమ్మనకు రాయల ఈ పార్శ్వం గురించి కూడ తెలిసినట్టుంది.

శ్రీవేంకటగిరి వల్లభ
సేవా పరతంత్ర! చిన్నమదేవీ
జీవితనాయక! కవితా
ప్రావీణ్య ఫణీశ! కృష్ణరాయ మహీశా! (చతుర్థాశ్వాసం తొలిపద్యం)

ఐతే ఒకమాట చెప్పుకోవాలి. ఆముక్తమాల్యదా కర్తకి, ఈ కవులు వర్ణించిన రాయలుకి (ముఖ్యంగా ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథల్లో కనిపించే రాయలుకి) చాలా తారతమ్యం వుంది. ఆముక్తమాల్యద రాయలు వీరవైష్ణవుడు. పరమతవిముఖుడు. అహంభావి. మనుషులెవర్నీ లక్ష్యపెట్టని వాడు. శ్రీకాకుళ విష్ణువుకీ తనకీ ఒక విధంగా సమానత్వాన్ని ఆపాదించుకున్నవాడు. “సెంటిమెంట్స్‌” జోలికి వెళ్లనివాడు. కవిపండితులు, బ్రాహ్మణులు, మంత్రులు, వేదవిదులు – వీళ్లందర్నీ కేవలం భృత్యులుగా, గౌరవార్హులు కానివారిగా భావించినవాడు.

రాయల ఈ రెండు పార్శ్వాలకు సమన్వయం సాధ్యమా?

రాయలు చాలా లౌకికుడని, ఆవేశాతీతుడని ఆముక్తమాల్యద స్పష్టంగా చూపిస్తుంది. కనుక, ఆయన కవిపండిత పోషకుడై వుంటే, దానికీ లౌకిక కారణాలు ఉండివుండవచ్చు. లేదా, తనూ కవి కనుక కవుల మీద పక్షపాతమన్నా వుండి వుండాలి. ఈ సందర్భంలో, నారాయణ రావు గారు ఉదహరించిన పద్యాన్ని ఒక్కసారి చూద్దాం.

అక్షరపక్షపాతమున నర్థము నూళ్లనొసంగ నుబ్బునన్
భిక్షు జటాధరాధికులు భిన్న నిజవ్రతులౌదు; రైన దు
ర్భిక్ష రుజా శిశుచ్యుతులు పెక్కగు; భక్తియె చాలు; దాన త
త్ప్రక్షుభితత్వ మేయఘము దార్పదు; శంక దలంగు మయ్యెడన్

‌నారాయణరావు గారు కృష్ణరాయలు కవిపోషకుడు కాకపోవచ్చుననటానికి ఈ పద్యాన్ని ఉదాహరణగా చూపారు. దీనికి మరో విధమైన వివరణ కూడ ఇవ్వొచ్చు. అదిప్పుడు చూద్దాం.

కృష్ణరాయల చాలా పద్యాల్లాగే ఇదీ అర్థం చెప్పటానికి తేలిగ్గా కొరుకుడు పడేది కాదు. ముందుగా ఈ పద్యానికి అన్వయం చూద్దాం – భిక్షు జటాధరాధికులకు, అక్షర పక్షపాతమున, అర్థమును, ఊళ్లను ఒసంగ, ఉబ్బునన్‌, (వారు) భిన్న నిజవ్రతు లౌదురు; (అలా) ఐన, దుర్భిక్ష రుజా శిశుచ్యుతులు పెక్కగు; (కాబట్టి వారి పట్ల) భక్తియె చాలు; దాన, తత్‌ ప్రక్షుభితత్వము; ఏ అఘమును తార్పదు; అయ్యెడన్‌, శంక తలంగు(ము).

దీన్నుంచి తార్కికమైన అర్థాన్ని సాధించాలంటే అనేక ప్రశ్నలు కలుగుతాయి. భిక్షువులు, జటాధరాధికులకు అర్థమూ ఊళ్లూ ఇవ్వాలనిపించే అక్షరాలు ఏమిటి? దీనికి సమాధానం కోసం మనం పద్యం రెండోభాగాన్ని ఉపయోగించాలి. వాళ్లకు డబ్బూ ఊళ్లూ ఇస్తే జరుగుతాయని చెప్పిన అనర్థాలు అలా ఇవ్వకపోతే జరగవనే కదా! అంటే వాళ్లని భిక్షువులుగా జటాధారులుగానే వదిలేస్తే వాళ్లు క్షామాలు, జబ్బులు, శిశుచ్యుతులు జరగకుండా అడ్డుపడతారన్నమాట. అదీ వాళ్ల “అక్షరాల” ద్వారా చేస్తారు. అవి ఎలాటి అక్షరాలై వుండాలి? ధర్మాన్ని నిలబెట్టేవి కావాలి. ధర్మగ్లాని జరిగితే కదా ఈ పద్యంలో చెప్పిన అనర్థాలు సంభవించేది! అంటే ఈ పద్యంలో చెప్పిన అక్షరాలు కావ్యాలు కావు; వేదాంతమూ, మతబోధ, జీవన ధర్మ నిర్దేశమూ లాటివి. అదీగాక సామాన్యంగా భిక్షువులు, జటాధారులు వైష్ణవేతరులు – బౌద్ధులు, శైవులు, జైనులు. “ఆముక్తమాల్యదా” కారుడు వీరవైష్ణవుడని వేరే చెప్పనక్కర్లేదు కనుక వైష్ణవేతర మతప్రచారకులకు డబ్బూ ఊళ్లూ ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పటం సహజం కూడ.

ఏతావాతా నా ఉద్దేశ్యం ఈ పద్యం మాట్లాడుతున్నది కవుల గురించి కాదని. అలా ఐతే, ఆయన కవిపోషణని గురించి ఈ పద్యం పెద్దగా ఏమీ చెప్పదు. కనుక, ఆయన కవులకు దానాలు చేస్తే, అది లౌకిక కారణాల కోసమా లేక కవిపక్షపాతం వల్లనా అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది.
----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, December 12, 2018

రవీంద్రధనుస్సు


రవీంద్రధనుస్సుసాహితీమిత్రులారా!

కవితలకీ, గేయాలకీ, పద్యాలకీ (వీటన్నిటినీ సమష్టిగా ఇప్పటికి కవితలని అందాం) స్థూలంగా రెండు లక్ష్యాలుంటాయి. పాఠకులు కవితని చదివేలా చెయ్యడం, కవితావస్తువుని చక్కగా వ్యక్తపరుస్తూ ఆలోచింపజెయ్యడం. చాలావరకూ తెలిసిన విషయాలనే అయినా అందమైన మాటలతో ఆసక్తికరంగానైతేనేమి, శబ్దాలంకారాలవంటి ప్రక్రియలతో కర్ణపేయంగానైతేనేమి చెప్పడం మొదటి లక్ష్యానికి సంబంధించిన పద్ధతి. ఠాట్, అలాకాదంటూ కొత్తవిషయాలనయినా, కాకపోతే పాతవిషయాలను కొత్తకోణంలోనుంచయినా లోతయిన అవగాహన, విశ్లేషణలతో, సూటిగా, క్లుప్తమైన మాటలతో, పాఠకులనాలోచింపజేసేటట్టు చెప్పడం రెండో లక్ష్యానికి సంబంధించిన పద్ధతి. కాక యీరెండు పద్ధతులనూ వివిధమైన పాళ్ళలో సమ్మేళన చెయ్యడాన్ని మరో పద్ధతి అనుకోవచ్చు. కవుల దృక్కోణంలోనించి చూసినా, పాఠకుల దృక్కోణంలోనించి చూసినా యీ పద్ధతులన్నీ వివిధ పరిమితుల్లో ఆకర్షణీయమే!

ఇతరభాషల్లోని కవితలని తెలుగులోకి అనువదించే విషయంలోకూడా కొంతవరకూ యీప్రక్రియలను అనువర్తించుకోవచ్చు. అయితే అనువాదాల్లో విషయానికి ప్రాధాన్యత యెక్కువ. మూలానికీ, ఆమూలరచయితకూ న్యాయంచెయ్యడం అనువాదకుల ముఖ్యబాధ్యత అని నావుద్దేశం. ఈ అభిప్రాయాన్ని రకరకాలుగా ఖండించవచ్చుకూడా. ఈమాట 2006 జనవరి సంచికలో ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు అనువాదాలగురించీ వాటిపై ప్రచారంలో వుండే అపోహల గురించీ వ్రాస్తూ అనువాదాలు ఆయాభాషల్లో స్వతంత్రంగా నిలబడి, సాహిత్యంలో స్థాయి కలిపించుకోవాలన్నారు. రాసుకున్న అత్తరుగుబాళింపు ఫోటోలో పడాలనే వైఖరితో అనువాదాలు చదవడంలోనూ, మూలభాషకు బానిసగా మారడంలోనూ, “ముక్కస్య ముక్కానువాదాలు” చెయ్యడంలోనూ వుండే లొసుగులను వివరించారు. “ముక్కస్య ముక్కానువాదాలు” (నాకీ ప్రయోగం చాల నచ్చింది) ఆచరణీయమని వాదించేవారుంటారా అనిమాత్రం నాకనుమానమే. అనువాదకుడు మూలభాషకు విధేయుడవవలసిన అవసరమంతగా లేకపోయినా మూలరచయితకూ, కవిహృదయానికీ న్యాయం చేసితీరాలని నా అభిప్రాయం. ఈతేడా కొంచెమే అయినా చిన్నదిమాత్రంకాదు.

అయితే మూలానికి న్యాయంచెయ్యడమనేది చెప్పినంత తేలికపని కాదు. మూలకవి తానుద్దేశించిన విషయాన్ని కేవలం భావంలోనే కాక శైలిద్వారానూ, సందర్భానుసారంగా కొత్తరంగులు సంతరించుకునే ప్రత్యేకమయిన పదాలూ, అలంకారాలూ మొదలయిన వాటి యెన్నిక ద్వారానూ కూడావ్యక్తపరిచినట్టయితే, అనువాదకులు కూడా ఆయా అంశాలకి అంతగానూ ప్రాధాన్యత యిస్తేతప్ప కవిహృదయానికీ గొంతుకకూ న్యాయం చేకూరకపోయే అవకాశముంది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ వ్రాసిన గీతాంజలి లోని ఒక కవిత యొక్క ఆంగ్లాంధ్రానువాదాలను యీకోణాల్లోంచి పరిశీలించడం యీవ్యాసం ముఖ్యోద్దేశం. క్లుప్తంగా చెప్పాలంటే రవీంద్రుని వూహల్లో, కలల్లో తనదేశమేవిధమయిన పరిణామమూ పరిణతీ సాధించాలీ అన్నవిషయం యీకవితలో ప్రధానాంశం. గీతాంజలిలోని వంగమూలాన్ని తామే స్వయంగా ఆంగ్లంలోకి తర్జుమా చేశారు రవీంద్రులు. తెలుగులో చాలా అనువాదాలు వచ్చాయి. ఇలా బహుళంగా అనువాదాలకు నోచుకుని బహుప్రాచుర్యంలోకి వచ్చిన కవితనూ, దాని అనువాదాలనూ పరిశీలించేటప్పుడు వెల్చేరువారి కొలబద్దతోబాటు తులనాత్మకతకోసం కవిహృదయపు కొలబద్దను కూడా ఉపయోగించడం సమంజసమేననాలి. రవీంద్రుల బెంగాలీ మూలకవితతోబాటు, తామే స్వయంగా చేసిన ఆంగ్లానువాదాన్నీ, కొన్ని ఆంధ్రానువాదాలనూ, ఒక అనుసరణాన్నీ యీవ్యాసంలో పరిశీలిద్దాం.

ప్రార్థొనా

చిత్త జెథా భయశూన్య, ఉచ్ఛ జెథా శిర
జ్ఞాన జెథా ముక్త, జెథా గృహేర్‌ ప్రాచీర
అపన ప్రాంగణతలే, దివస శర్వరీ
వసుధేర్‌ రాఖేనాయ్‌, ఖండ క్షుద్ర కరి,
జెథా వాక్య హృదయేర్‌, ఉత్‌ సముఖ హోతే
ఉచ్ఛ్వాసియా ఉఠే, జెథా నిర్వారిత స్రోతే
దేశదేశ దిశేదిశే కర్మధారా థాయ్‌
అజస్ర సహస్రవిధ చరితార్థ తాయ్‌
జెథా తుచ్ఛ ఆచారేర్‌, మరుబాలు రాశి
విచారేర్‌ స్రోతః పథో, ఫీలేనాయి గ్రాసి
పౌరుషేర్‌ కొరేని శతథా, నిత్య జెథా
తుమి సర్వ కర్మ చింతా ఆనందేర్‌ నేతా,
నిజహస్త నిర్దయ ఆఘాత కరి పితః
భారతేర్‌ సేయీ స్వర్గ కరో జాగరిత

వంగభాషను తెలుగులో వ్రాయసాహసించినందుకూ, తద్వారా దానిలో అనుకోకుండా తప్పులు దొర్లించివుంటే వాటికీ క్షమాపణలతోబాటు పాఠకులకు యిక్కడొక విజ్ఞప్తి. దయచేసి యీవంగమూలాన్ని కాసేపు దగ్గరగా మరోమారు పరిశీలించి చూడండి. చాలావరకు తెలుగులో వాడగలిగే పదాలూ (ఉదాహరణకి చిత్తము, భయశూన్యము, వగైరా), సంస్కృతమూలములైన పదాలూ బాగానే కానవస్తాయి. కొంచెమలా ప్రయత్నించాక, ఇదిగో, రవీంద్రులు ఆంగ్లంలోకి స్వయంగా చేసిన అనువాదాన్ని చూడండి:

Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake

నాకయితే యీకవితతో పరిచయం మొదటిగా కలిగినది యీ ఆంగ్లాంతరంతోనే. స్వీయానువాదంకాబట్టి కవిహృదయాన్ని యింతకన్నా ఔచిత్యముతో మరెవరూ అనువదించలేకపోవచ్చని నమ్మవచ్చేమో. నిజంగానే మూలంలోని లోతు చాలావరకూ యీ ఆంగ్లానువాదంలో ప్రతిబింబిస్తుందని ఒప్పుకోవాలి. భారతదేశంలో వంగభాషతో పరిచయంలేనివారు చాలమందికీ కొంతవరకూ ఆంగ్లంలో పరిచయమయి గీతాంజలి మొత్తం చదవాలనే ఆసక్తి కలిగించినది యీ ఆంగ్లానువాదం. కొన్ని ఆంధ్రానువాదాలను కొంచెం పరిశీలించి మళ్ళా యీ ఆంగ్లానువాదాన్ని పునరావలోకనం చేద్దాం. మొదటి ఆంధ్రానువాదం గుడిపాటి వెంకట చలం గారిది.

1. చలం గారి అనువాదం
ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం
విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం
ఇంకిపోకుండా వుంటుందో,
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.

అతి సరళమైన పలుకుల్లో వ్యక్తపరచిన యీ అనువాదపు భావం రవీంద్రుల ఆంగ్లాంతరం లోనిదే అనడానికి సందేహమేమీ లేదు. ఉదాహరణకి వంగభాషలో “హృదయంలోంచి వెలువడే వాక్యాలు (లేక మాటలు)” (బాక్యొ హృదయెర్ … ఉఠె) చలంగారి తెలుగులో “సత్యాంతరాళంలోంచి” బైలువెడలుతున్నాయి. రవీంద్రుల ఆంగ్లాంతరాన్ని మూలంగా తీసుకున్న పరిధిలో యీ అనువాదాన్ని సరిపోలిస్తే చలంగారు భాషకు జిలుగులు పెట్టకుండా సాదాతనానికీ, భావస్పష్టతకూ ప్రాముఖ్యతనిచ్చినట్టు తెలుస్తోంది. అయితే “free” అనే సాధారణమైన ఆంగ్లపదానికి మాత్రం సూటి అనువాదం దొరికినట్లనిపించదు. “ఎక్కడ జ్ఞానం విశృంఖలమో” అంటే? ఆతరువాతి పంక్తికూడా ఆంగ్లమూలంలోని భావానికి అంత స్పష్టంగా అద్దంపట్టలేదనే చెప్పాలి. మనిషి పెంచుకుపోతున్న (“domestic”) గోడలవల్ల ఖండఖండాలుగా విడిపోని ప్రపంచాన్ని ఆంగ్లంలో కోరుకున్నారు టాగోర్. “సంసారపు గోడలమధ్య” అనడంలో భావం కొంచెం లోపించింది. మిగిలిన మొత్తమూ చాలా సూటిగా తీర్చిదిద్దిన అనువాదమనే చెప్పాలి. ఇప్పుడు మరొక అనువాదాన్ని పరిశీలిద్దాం:

2.కాండ్రేగుల అంబాప్రసాదరావుగారి అనువాదం
ఎచట మానసము నిర్భీకమై చెలగునో,
ఎట శిరమ్ము సగర్వముగ నెత్తనర్హమౌ,
ఎచట విజ్ఞాన వాహిని నిరాటంకమో,
ఎచట సంకుచిత భావపు భిత్తికలు జగ
మ్మును క్షుద్ర ఖండఖండములుగా సేయవో,
ఎచ్చోట శ్రమ గణింపని యుద్యమము సాగు
పరిపూర్ణతాలబ్ధి కొరకు నశ్రాంతంబు,
ఎచట సత్యపులోతులను జనించును వాక్కు,
ఎచట మూఢాచారమరుభూమి నింకిపో
వవు వివేక స్రవంతీ నిర్మలాంబువుల్,
ఎచట బుద్ధి పురోగమించు నీ సారధ్య
మున, నిత్య విస్తృత భావ, క్రియాదులన్,
అట్టి స్వేచ్ఛా దివ్యలోకాన జాగృత
మ్మగుగాక నా స్వామి! నా జన్మదేశమ్ము.

ఇది కాండ్రేగుల అంబాప్రసాదరావుగారి అనువాదం. ఇందులో భాషకు యిచ్చిన ప్రాముఖ్యత పదాల అందాల్లోనూ, చెక్కిన నగిషీల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి “ఎచట విజ్ఞాన వాహిని నిరాటంకమో” అన్న ప్రయోగం చాలు. అలాగే “ఎచట సంకుచిత భావపు భిత్తికలు జగమ్మును క్షుద్ర ఖండఖండములుగా సేయవో” అనడంలోనూ, “వివేక స్రవంతీ నిర్మలాంబువుల్” అనడంలోనూ భాషాసౌందర్యం భావస్పష్టతను మరింత ప్రతిబింబించింది. కాక ఇక్కడ మరోవిషయాన్ని గమనించవచ్చు. క్షుద్ర ఖండములనే ప్రయోగాన్ని వంగమూలంలో చూశాము. అదే ప్రయోగం చెయ్యడంవల్ల ప్రసాదరావుగారిపై వంగమూలం ప్రభావం కొంతయినా వుందేమోననిపిస్తుంది. అలాగే మూఢాచారమరుభూమికీ “తుచ్ఛొ ఆచారెర్ మొరుబాలురాషీ” మరీ దూరం కాదేమో.

ఈవ్యాసంకోసమని చేసిన శొధనలో మరికొన్ని అనువాదాలు ఇంటర్నెట్టు ధర్మమా అని సాహితీమిత్రులద్వారా అందినవి వున్నాయి.

3. దేశకల్యాణము
ఎచట భయశంకలను బుద్ధి యెఱుఁగకుండు,
ఎచట తలయెత్తి నిలబడు నేపు కలుగు,
ఎచట జ్ఞానమ్మబాధమై యెసఁగుచుండు,
ఎచట జ్ఞాతివిభేదమ్ము లీ జగమ్ముఁ
జీల్చి ఖండఖండమ్ములు చేయకుండు,
ఎచట సత్యప్రభూతమై యెగయు వాక్కు,
ఎట క్రియాదీక్ష పూర్ణత్వ మెఱుఁగగోరు,
ఎట జడాభ్యాసపు టెడారి యిసుకఁ జొచ్చి
హేతుచింతాతరంగిణి యింకకుండు,
ఎచట నీ శిక్షణమ్మున నెపటికపుడు
బుద్ధి భావక్రియావృద్ధిఁ బొడువుసాగు,
అట్టి స్వేచ్ఛామయ స్వర్గమందుఁ దండ్రి!
నాదు దేశమ్ము మేలుకొనంగ నిమ్ము!

ఈ అనువాదానికి పేరుకూడా పెట్టి తర్జుమా చేసినదెవరో తెలుసా? చలనచిత్రనటునిగా ప్రముఖులైన స్వర్గీయ కొంగర జగ్గయ్య! ఆయన కంచుకంఠంతోనేకానీ సాహితీముఖంతో మనలో చాలామందికి పరిచయంతక్కువే. బహుశా అందువల్ల కొంతకావచ్చుకానీ, నాకుమాత్రం యీ అనువాదం రవీంద్రుని మూలాన్ని ఛందోవర్ణాలతో అందంగా చిత్రీకరించిన భావచిత్రపటంలా అనిపిస్తుంది. తేటగీతి ఛందస్సూ యతినియమాలూ దీనిలో చూడవచ్చు. ఛందస్సు భావప్రకటనకి సంకెళ్ళు వేస్తుందని వాదించేవారిని యీ వుదాహరణ అంతోయింతో ఆలోచింపజేస్తుందని నాకనిపిస్తుంది.

అయితే జగ్గయ్యగారి అనువాదంలో మరో విశేషం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. టాగోర్ మూలభావాన్ని అక్కడక్కడ యీ అనువాదం ఇంకా అందగించింది. భావానికి మరింత భావుకత అద్దింది. “ఎట జడాభ్యాసపు టెడారి యిసుకజొచ్చి హేతుచింతాతరంగిణి యింకకుండు” అనే పదప్రయోగం చూడండి! అసలా “హేతుచింతాతరంగిణి” అనే సమాసం అత్యద్భుతంగా లేదూ? అలాగే వంగమూలంలోని “గృహెర్ ప్రాచిర్” లేక “సంసారపు గోడ” లకు బదులుగా వాడిన “జ్ఞాతివిభేదమ్ము” లనే మాట మూలంలోని భావాన్ని వ్యక్తపరుస్తూనే కొత్త కోణాన్ని తొలకరించింది. టాగోర్ “ముక్తొ” (లేక free) అన్న సందర్భంలో జగ్గయ్య జ్ఞానం నిరాటంకమవడమే కాక అతిశయించాలనడం మరింత వన్నె తెచ్చింది.

4. శంకరంబాడి సుందరాచారి గారి అనువాదం
బెదరు విడి మానసము పదిలపడి నపుడు
పరువుతో తల యెత్తబడియున్న యపుడు
విజ్ఞానబంధములు వీడిపోయిన యపుడు
ఇఱుకు సంసారముల కఱకు గోడల నడుమ
భువనాలు తునుకలైపోక మిగిలిన యపుడు
పలుకులు సత్యగర్భమ్ము వెలువడు నపుడు
అలసి యెఱుగనియట్టి హస్తములు పరిపక్వ-
దశ నంటగను సాగు తరుణ మొదవిన యపుడు
చెడ్డ యలవాటనెడు చీకటెడారిలో
తేటతెల్లని తెలివి బాట తప్పని యపుడు
నిత్యవిస్తృతమైన నిర్మలిన భావనా-
శ్రయ కర్మముల చేయ స్వాంతమును ముందునకు
నా స్వామి నీవుగా నడుప బూనిన యపుడు
స్వాతంత్ర్య స్వర్గ సౌభాగ్యవీధుల మాతృ
ధాత్రి మేల్కొనుగాత ధన్యాతి ధన్యయై

శంకరంబాడి సుందరాచారి గారి యీ సుందరానువాదం కూడా ఛందోబద్ధమే. అలవాటయిన తేటగీతీ, ఆటవెలదీ, సీసమూ కాకపోయినా, ఆపంథాలోనే సాగిన మాత్రాఛందస్సు నిందులో చూడవచ్చు. ఇదికూడా వంగమూలంకన్నా, ఆంగ్లాంతరానికే దగ్గరలో వుందనడంలో సందేహమేమీ లేదు. కాకపోతే ఆంగ్లాంతరంతో సరిపోల్చినా అక్కడక్కడ శైలికే ప్రాధాన్యత యెక్కువగా కనిపిస్తుంది. ప్రస్ఫుటంగా నాకు కనిపించినది ఆంగ్లంలో “dead habit” అనీ, బెంగాలీలో “తుచ్ఛొ ఆచారెర్” అనీ పేర్కొన్న భావాన్ని “చెడ్డ యలవా” టనడంలో జరిగిన భావాంతరం. చెడ్డ అలవాటనడంలో సాధారణంగా వ్యక్తిగతంగా ఆపాదించే అర్థం స్ఫురిస్తున్నాది. టాగోర్ వుద్దేశించినది సాంఘికపరమైన మూఢాచారాలనే అనిపించినప్పటికీ “dead habit” అన్న ఆంగ్లానువాదంవల్ల యీవిషయంలో కొంత అనుమానానికి ఆస్కారముందనే అనుకుందాం. చెడ్డ అలవాట్ల చీకటెడారిలో తెలివి బాటతప్పకపోవడమనేది చక్కటి ప్రబోధమేకానీ తక్కినవారు అన్వయించిన అర్థాలకి భిన్నంగానూ, కొంచెం పేలవంగానూ నాకు మాత్రం అనిపిస్తున్నాది. అలాగే, “ఇఱుకు సంసారముల కఱకు గోడల నడుమ భువనాలు తునుకలైపోక మిగిలిన యపుడు” అనడంలో అందం ఇనుమడించిందనడంలో సందేహమేమీ లేదుకానీ భావపు లోతు వేరేగా స్ఫురిస్తున్నాది. “అలసి యెఱుగనియట్టి హస్తము” లకుబదులుగా “అలసటెఱుగనియట్టి హస్తము” లనివుండవలసిందని నా అభిప్రాయం. ఈ అనువాదపు ప్రత్యేకత రవీంద్రులు ప్రదేశానికి అన్వయించిన లక్షణాలను (“జెథా”, “ఎక్కడ”, “where”) శంకరంబాడి కాలానికనువర్తించడం (“అపుడు”)! “స్వాతంత్ర్య స్వర్గ సౌభాగ్యవీధుల మాతృ ధాత్రి మేల్కొనుగాత ధన్యాతి ధన్యయై” అనే ముగింపు మాత్రం బహుసుందరంగా కుదిర్చారు శ్రీ శంకరంబాడి.

5. ఆదిపూడి సోమనాథరావుగారి అనువాదం
తేటగీతి-
ఉన్నత-శిరంబు, నిర్భయ-యుత మనంబు,
నుచిత-విద్యా-ప్రదాన మహోదయంబు,
క్షుద్ర-కుచిత-గృహ-చ్ఛిద్ర కుడ్య-జాత
విభజన-విహీన-లోకంబు, శుభకరంబు,
సత్య-గంభీర-దేశ-సంజనిత పూత
వాక్య సముదాయ-శోభిత వైభవంబు,
పూర్ణతను బొందగా నెంచి భుజము లెత్తి
వృద్ధి గాంచెడు వివిధ పరిశ్రమంబు,
సార-హీన దురాచార-వార మనెడు
నూషర క్షేత్రముల బారకుండు నట్టి
సదమల వివేక-పూర సంచారణంబు,
జ్ఞాన-యత్నంబు లా నాడు నాటి కలరు
పగిది నీచేత నడుపంగ బడు మనంబు,
చారు-సత్య-స్వతంత్ర-భూ-స్వర్గ మరయ
జనక, నా దేశ-జనులు దత్స్వర్గమునకు
మేలుకొందురు గాక నీ మూలకముగ

శ్రీ ఆదిపూడి సోమనాథరావుగారి యీ అనువాదం ఛందోగంభీరమై, సంక్లిష్టపదభూయిష్టమై, సుందరసమాసాలంకృతమై యొప్పుచున్నదనవచ్చును. “క్షుద్ర-కుచిత-గృహ-చ్ఛిద్ర కుడ్య-జాత విభజన-విహీన-లోకంబు” అనే సమాసం సంక్లిష్టమైనా, భావసంపన్నమూ భాషాసౌందర్యమూ నింపుకున్న ప్రయోగం. “ఉచిత-విద్యా-ప్రదాన మహోదయంబు” అనడంలో “జ్ఞాన్ జెథా ముక్తొ” లేక “where knowledge is free” అనేభావాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలోకి నిర్దేశించినా, దేశానికీనాటికీ అత్యవసరమైన పంథానే సూచించారు. ఛందస్సుకు సరిపడే అవసరార్థమై అక్కడక్కడ మిగిలిన అనువాదకులకంటే కొంత ఎక్కువే స్వేచ్ఛ తీసుకున్నారు ఆదిపూడి వారు (ఉదాహరణకి, “శుభకరంబు,” “… దేశ-సంజనిత పూత …,” మొదలైనవి). “పారకుండునట్టి” అనేబదులు “ఇంకకుండునట్టి” అనివుంటే ఛందోభంగం కలగకుండానే మరింత అర్థవంతమయ్యేదేమో.

6. బెజవాడ గోపాలరెడ్డి గారి అనువాదం
చిత్తము ఎచ్చో భయరహితమో
శిరము ఎచ్చో ఉన్నతమో
జ్ఞానము ఎచ్చో స్వచ్ఛందమో
గృహప్రాకారములు ఎచ్చో నిజప్రాంగణములలో
రేయింబవళ్లు వసుధను చీల్చి ముక్కలు చేయవో
ఎచ్చో వాక్యములు హృదయంపు చెలమ ముఖమున
పొంగి పారునో
ఎచ్చో అడ్డులులేని వెల్లువతో
ఎల్ల ఎడల, పలుదిక్కుల
నిరంతరముగ సహస్ర చరితార్థములలో
కర్మధారలు పరుగిడునో
ఎచ్చో తుచ్ఛ ఆచారము లను ఎడారి ఇసుకతిన్నెలు
భావనాస్రవంతి గతుల గ్రసింపవో
ఎచ్చో పురుషార్థములు నిరర్థకములు కావో
ఎచ్చో నిత్యము నీవు
సర్వ కర్మల చింతల ఆనందముల అధినేతవో
నిజహస్తములతో నిర్దయగ ప్రహరమొనర్చి తండ్రీ
భారతమును అట్టి స్వర్గమున మేల్కొలుపుము.

బెజవాడ గోపాలరెడ్డి గారు వంగమూలాన్నే సూటిగా అనువదించినవిషయం కొద్ది పరిశీలనతోనే విదితమౌతుంది. వంగమూలంలోనూ యీ అనువాదంలోనూకూడా సంస్కృత తత్సమములైన పదాలు సుమారుగా ఒకే రూపముగలవి కానవస్తాయి (ఉదాహరణకి చిత్తము, శిరము, ప్రాంగణము, వసుధ, హృదయము, సహస్ర, చరితార్థము, కర్మధార, తుచ్ఛ, ఆచారము, గ్రసించు, నిత్యము, సర్బొ కర్మొ-చింత-ఆనందెర్ నేతా, నిజహస్తము, నిర్దయ, మొదలగునవి).

అంతేకాక తక్కిన ఆంధ్రానువాదకులూ, చివరికి రవీంద్రులు సైతం తమ ఆంగ్లానువాదములోకూడా స్పర్శింపని మూలభావాలు యీ అనువాదములో స్పష్టంగా కానవస్తాయి. వంగమూలంలో, “ఎక్కడైతే నిరాటంకమైన ప్రవాహంతో దేశదేశాలా, దిశదిశలా కర్మధార అగణితచరితార్థముగా ప్రవహిస్తుందో” అని అన్నారు రవీంద్రులు. బెజవాడవారిది తప్ప మిగిలిన అనువాదాల్లో యీవివరాలూ స్పష్టతా యెక్కడా కానరావు. సరే, సాంస్కృతికాధ్యాత్మిక భావాల సమ్మేళనమైన కర్మధారవంటి భావానికి ఆంగ్లంలో తగిన పదాలు దొరకలేదనుకుందాం. తెలుగులో దొరికితీరేవే, అనువాదకులు ఆంగ్లంతో సరిపెట్టకుండా వంగమూలాన్ని పూర్తిగా పరిశీలించివుంటే, అనిపించకమానదు. అయితే బెజవాడవారు తెలుగులో వేరే పదాలనాశ్రయించకుండా సుమారుగా వంగమూలంలోని పదాలనే వాడినందువల్ల భావాంతరానికి ఆస్కారమసలే లేకపోయింది. బెంగాలీలోని చివరి మూడున్నర పంక్తులనూ జాగ్రత్తగా చదివితేకూడా మనకు ఇలాంటి భావమే కలుగుతుంది.

నాకు రవీంద్రుల ఆంగ్లానువాదం కలిగించిన స్ఫూర్తితో దాన్ని కొంత అనుకరించీ, కొంత అనుసరించీ ఒక కవిత వ్రాశానిలా:

నేను…
నిర్భయుణ్ణి ధీబలుణ్ణి
తలయెత్తుకు తిరుగువాణ్ణి
జ్ఞానమనే పవనాలను
హాయిగా పీల్చువాణ్ణి
విజ్ఞానమనే పావురాన్ని
స్వేచ్ఛగా వదలువాణ్ణి
నేను…
అత్యుత్తమ గమ్యాలకు
దప్పికంటు లేకుండా
శ్రమించుతూ పోవువాణ్ణి
మాటంటే మాట యనీ
దాన్నెప్పుడు తప్పననీ
నిశ్చయించుకున్నవాణ్ణి
సంకుచితపు భావాలను
అవికట్టే కుడ్యాలను
భేదించుకు పోవువాణ్ణి
నేను…
మృతాలైన మూఢమైన
నమ్మకాల ఎడారుల్లొ
ఇంకకుండ జంకకుండ
ఎండమావి కాకుండా
ఎంతెంతటి దూరమైన
పిల్లవాగులా సాగే
హేతువాదినైనవాణ్ణి
నేను…
మనసులోన కర్మలోన
ఆనందపు పథములోన
స్వర్గమనే గమ్యమంద
పెడదారులు పట్టకుండ
నిద్రలోకి తూలకుండ
ఒక్కకుదుపు లోనలేచి
జాగృతుణ్ణైనవాణ్ణి

ఇలా కలలు కంటు వున్నవాణ్ణి!

దీనిలో ఉన్న తమాషా యేమిటంటే, యిది అనుసరణనీ, అనుకరణనీ ముందే చేతులెత్తేశాను కాబట్టి మరి యిందాకటి పంథాలో విమర్శించే ప్రసక్తి లేదు! అనుసరణే అయినా, అలాగని భావంలో మూలానికి మరీదూరం కాదనే నమ్ముతున్నాను. ముఖ్యంగా దేశంగురించి సామూహికంగా రవీంద్రులు వ్యక్తపరచిన ఆశాభావాన్ని తనకు వ్యక్తిగతంగా ఆపాదించుకుంటూన్న వ్యక్తి, హఠాత్తుగా తను కలగంటున్నట్టు గ్రహించినట్టుగా ముగించాను. అలా చెయ్యడంలో ప్రస్తుత దేశపరిస్థితి పట్ల కొంత నిస్పృహ వ్యక్తపరచినా, పూర్తిగా నిరాశావాదిగా కనిపించకూడదనే బింకమైన ప్రయత్నమిది. అక్కడక్కడ శ్రీశ్రీ శైలిని అనుకరించే పిల్లప్రయత్నం కూడా కొంత లేకపోలేదు. మరొక చిన్న రహస్యమేమిటంటే యీఅనుసరణలో నాతొలి ప్రయత్నం నిజానికి రవీంద్రుల ఆంగ్లాంతరం నుంచే మొదలయింది. నాకు వంగమూలంతో పరిచయమయిన తరువాత కొంతభాగం క్రొత్తగా వ్రాయడం జరిగింది.

ఇన్ని అనువాదాలకు నోచుకున్న మూలాలు నాకయితే ఎక్కువగా తెలియవు. ఆ దృష్టితో చూస్తే రవీంద్రుల మూలగీతపు రవికిరణాలు ఇంద్రధనుస్సులోని కొన్ని కొన్ని వర్ణాల కలయికలలా ఆయా అనువాదాల్లో వ్యక్తమయ్యాయి. అందరు అనువాదకులూ కూడా ఆయా రంగులను తమతమ వైయక్తికమైన పద్ధతులలో సంయుక్తపరచి, అక్కడక్కడ హంగులు తొడిగి మరిందరు పాఠకులకు అందించారు. భావం సుమారుగా ఒకటే అయినా, ప్రతి అనువాదకునికీ స్వంతమైన దృక్పథమూ, శైలీ వారి వారి అనువాదాల్లో ప్రతిబింబించి ప్రత్యేకమైన ఆకర్షణ చేకూర్చాయి. మరోవిధంగా చెప్పాలంటే ఒక అనువాదం మూలానికి దగ్గరా దూరమా అనేప్రశ్నకు సమాధానం కొంతవరకూ వ్యక్తిగతమని ఒప్పుకుంటే, ఒక్కో అనువాదం మూలాన్ని ఏవో కొన్ని కోణాల్లోంచే ప్రతిబింబించగలదనికూడా నమ్మాలి. ఆపరిమితిలో అనువాదాన్ని ఆకర్షణీయంగా మలచడం మాత్రమే అనువాదకులు సాధారణంగా చెయ్యగలరు. అటువంటి ప్రయత్నాలు ప్రయోజనకరమే ననడం కూడా మరీ చర్చనీయాంశం కాదు. అయితే మూలం యేవిధాలైన వివరణలకూ, అర్థాన్వయాలకూ తావిస్తుందో అనువాదం కూడా సుమారు అన్నివిధాలైన వివరణలకూ, అర్థాన్వయాలకూ తావివ్వగలిగితే యెలావుంటుందీ అన్న ప్రశ్నను మనం పూర్తిగా విస్మరించకూడదని నాకనిపిస్తుంది. అలా విస్మరించడం అనువాదకుల భాషాపరిజ్ఞానాన్నీ, సృజనాత్మకతనీ కూడా తక్కువగా అంచనా వెయ్యడమే. కష్టమైనవన్నీ అసాధ్యమని అనుకోనక్కరలేదు కదా!

రవీంద్రధనుస్సు ≠ రవి + ఇంద్రుడు + ధనుస్సు     
---------------------------------------------------------
రచన: వేణు దశిగి, 
ఈమాట సౌజన్యంతో

Sunday, December 9, 2018

అన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలు


అన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలు
సాహితీమిత్రులారా!

“కవీనాం సమయః కవిసమయః” అని కవిసమయ సమాసానికి విగ్రహవాక్యం. కవుల ఆచరణే కవిసమయం అని అర్థం.
శిష్టసాహిత్యమైన కావ్యాలు, ప్రబంధాలలో కవిసమయాలను ప్రయోగించడముంది. కాని సంకీర్తనా సాహిత్యంలో కవిసమయప్రయోగాలను చూడడం అరుదు. ఐతే అన్నమయ్య సంకీర్తనల్లో ఈ కవిసమయాలను విస్తృతంగా చూడవచ్చు. సంప్రదాయ సిద్ధమైన వాటిని సందర్భానుకూలంగా మలుచుకోవడం, వాటితో సరితూగే కొత్తవాటిని సృష్టించడం స్వతంత్రుడైన అన్నమయ్య రచనల్లో మనకు సాక్షాత్కరిస్తాయి. వాటిలో ప్రత్యేకతను సంతరించుకున్న కొన్నిటిని పరిశీలిద్దాం.

దేవతామూర్తులను ఆపాదకేశాంతం వర్ణించడం ఆచారం. పాదాలను తామరలు, ఎర్రకలువలు, చిగురుటాకులు, పగడాలతో పోల్చడం కవిసమయం. అన్నమయ్య పాదాలను తామరలు, తులసీదళం, చిగురు, చింతకొమ్మ, కూర్మం, సంతముద్రకోల, నాగళ్ళతో పోల్చాడు.

పొంచి తామరపువ్వుల బోలిన పాదాలాతడు
వంచి తుమ్మెదల కొప్పు వడిసోక మొక్కవే (24251)

అని శ్రీనివాసుని పాదాలను తామరలతో పోల్చాడు. తామరలు అందమైనవి, మకరందంతో నిండినవి, ఆస్వాదించే వారి బడలికను పోగొట్టేవి. అట్టివే స్వామివారి పాదాలు. ఆశ్రయించిన వారి అలసటను తీర్చేవి. ఆ తామరలలోని మకరందాన్ని ఆస్వాదించేవి తుమ్మెదలు. తుమ్మెద షట్పది. ఇక్కడ పంచేంద్రియాలు, మనస్సు అనే ఆరు ఇంద్రియాలే పాదాలుగా గల జీవుడు షట్పది. తామర తుమ్మెదల అనుబంధాన్ని ప్రేయసీప్రియానుబంధంగా వర్ణించడం కవిసమయం. అన్నమయ్య జీవుడు భగవంతుడి పాదాలను ఆశ్రయించి శాశ్వతానంద మకరందాన్ని పొంది జీవన్ముక్తుడు కావడమే పరమావధిగా తుమ్మెద తామరల బంధాన్ని మధుర భక్తి విశేషంగా పేర్కొన్నాడు. భగవంతుని దివ్య పాదధూళి శిరసుపై సోకడం దివ్యానుగ్రహం. పాదాలను తామరలతోనూ కురులను తుమ్మెదలతోనూ పోల్చడం కవిసమయసిద్ధం.

పాదాలను చిగురులతో పోల్చడం కూడా కవిసమయం. అయితే అన్నమయ్య దృష్టికి చిగురులను బోలిన అమ్మవారి పాదాలు స్వామి మెడలోని తులసిదండలుగా భాసించడం అపురూపం. స్వామికి సమర్పించే పూజాద్రవ్యాలలో విశిష్టస్థానాన్ని ఆక్రమించింది తులసీదళం. ఈ పోలికతో అన్నమయ్య నాయిక స్వామి కెంత ప్రీతిపాత్రురాలో గ్రహించవచ్చు.

ఆపోలికౌనో కాదో అట్టే నీవు చూచుకోమ్మా
పూపలై వలపులెల్లా పూచినట్లున్నది
తగులుకొనెనో మెడ, దరుణి చూపులెల్లా
అగపడి బాదాల నిగ్గు జెడగట్టెనో అప్పటి
తగియల్లదె తులసిదండ వలె నున్నది (13218)

ఇదొక రతిక్రీడా విశేషం. ఆ సమయంలో సున్నితము, సుకుమారము అయిన చిగురులాంటి అమ్మవారి పాదాలు స్వామి మెడ చుట్టు పెనగొని ఉండడం విశేషం. అందుచేత అవి తులసిమాలలుగా భాసిస్తున్నాయి.

తనను ఆశ్రయించేవారికి గట్టి ఆధారాన్నిచ్చే స్వామివారి పాదాలను చింతకొమ్మలతో పోల్చాడు.

కొనల నీ పాద చింతకొమ్మయే దిక్కు (2146)

చెట్లలో చింతకొమ్మ చాల గట్టిది. ఆ కొమ్మను పట్టుకుని వేలాడే వారికి అది విరిగిపోతుందనే భయం లేదు. స్వామి పాదాలు జీవికి చింతకొమ్మ లాంటివే.

స్త్రీ శరీరంలో ఉన్నతం, ఆకర్షణీయం అయినవి ఏవో అందరికీ తెలుసు. ఇవి కవుల కావ్యాలలో విస్తృత కల్పనలకు ఆలవాలాలు. గుండ్రంగా దృఢంగా వుండే వీటి ఆకృతిని బట్టి కొండలు, కుండలు, కరికుంభాలు, చక్రవాకాలు, తామరమొగ్గలు, పూలగుత్తులు, దబ్బపండ్లు, దానిమ్మపండ్లు, తాటిపండ్లు ఇత్యాదిగా పోల్చడం కవిసమయం. వీటితోనే గాక శంఖం, చక్రం, సంగడాలు, తలగడబిళ్ళలు, మంచంకోటిగుబ్బలు, కిన్నెరకాయలతో కూడ పోల్చడం అన్నమయ్య సంకీర్తనల్లో కనిపిస్తుంది.

చెలియ తన కుచగిరులు శ్రీవేంకటాచలపు
నిలువు శిఖరములనుచు నిధుల నిలిచె (30176)

నాయకుడు వేంకటగిరీశుడు ఎందుకైనాడనడానికి వేరే వివరణ అవసరం లేదు.

చెలుల జవ్వనమెల్లా చేరువ బృమ్దావనము
కలుకు జన్నులు పెక్కు గోవర్ధనాలు (27100)

ఇక్కడ నాయకుడు కృష్ణుడు. ఇక గోవర్ధనాలేవో వూహించుకోవచ్చు.

వీటిని చక్రాల్తో కూడ పోల్చే సంప్రదాయముంది. అయితే సామాన్యుల దృష్టికి అవి బండిచక్రాలైతే అన్నమయ్య దృష్టికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతి సుదర్శనచక్రం!

ఒక్క చక్రమె నీకున్నది గాని యింతి
రెక్కల చక్రాలె పో రెండు గుబ్బలు (1271)

చక్రాలతోనే కాదు, శంఖంతో కూడా.

పడతి గుబ్బలు నీకు పాంచజన్యములుగా
కడివోని మొనలోలి గదియనొత్తి
తడయక మదన యుద్ధమున గెలిచితినంటా
వొడలి చెమటలార నూదితివిగా నీవు (12116)

జెట్టి సాధన కుపకరించే ఇనుపగుండ్లు సంగడాలు. బలిష్టుడు మరింత బలిష్టుడు కావడానికి ఉపకరించే పరికరాలివి. మదనుడి సాముగరిడీ నాయిక శరీరం. అందులోని సంగడాలో?

కాముని సాముగరిడి కాంతపురము
ఆమని చను సంగడాలమరె గాన (29196)

స్త్రీశరీరంలో ఎ్తౖతెనవి వక్షోజాలైతే లోతైనది నాభి. నతనాభిగా స్త్రీని వర్ణించడం కావ్యాలలో సుపరిచితం. నాభిని గుహ, కూపం, పాతాళం, కూపం ఇత్యాదులతో పోల్చడం సర్వసాధారణం. అయితే అన్నమయ్య దృష్టికి అదొక పవిత్రమైన హోమగుండంగా గోచరించడం విశేషం.

మలయు నీనాభి హోమగుండమునను
నెలకొన్న విరహాగ్ని నిండా బోసి
పొలయు నిట్టూరుపుల విసరుచును
వొలుకు జెమటల నాహుతి వోసె నతడు (12288)

నాయిక శరీరమే వేదికగా నాయకుడు జవ్వనయాగం చేస్తున్నాడు. అందులో భాగమే ఇది.

జెట్టి సాధన పరికరమైన బొందెకోలతో చేతులను పోల్చడం అన్నమయ్య సంకీర్తనల్లో ప్రత్యేకం. నాయకుని చేతిలో నలిగిన సుకుమారి అయిన నాయిక

బోరన బట్టేవు చేయి బొందికోలా (29217)

అని నిలదీయడం చూడొచ్చు.

మధురమైన స్త్రీ కంఠస్వరాన్ని కోకిలకూతతోనూ చిలుకపలుకులతోనూ వర్ణించడం మనమెరుగుదుం. ఆ మధురస్వరాలకు నిలయమైన నాయికకంఠాన్ని “కీరపులాయం”గా అన్నమయ్య వర్ణించడం విశేషం.

ఇరవై కీరపు లాయమీపె గళము
సరసపు మాట లెల్ల జరిపె గాన (29196)

లాయమంటే అశ్వశాల. మదనుడి అశ్వాలు కీరాలు. ఆ కీరాలకు నెలవు కీరపు లాయం. మగువ మేనే మదనుడి భాండాగారమట.
కంఠంలోని మధురరాగాలు పెదాల మధ్య నుంచి బయటకొస్తే ఆ పెదాలు పిల్లనగ్రోవులట.

ఇత్తరి శ్రీవేంకటేశ్వరు గూడగ
గుత్తిక లోపలి కోవిలలా
బిత్తరి యధరపు బిల్లగోవిలో
నొత్తి నిలిపి తనివొందించీని (3063)

అందమైన కళ్ళను కలువలు, కమలాలు, చకోరాలు, చాతకాలు, చేపలు, లేడి కళ్ళతో పోల్చడం సంప్రదాయం.

కలువరేకుల వంటి కన్నులాతడు నీపతి
తొలుత నీమోము జందురు జూపవే (24251)

కలువ కళ్ళు గల నాయకుడు తన ప్రేయసి ముఖచంద్ర దర్శనాన్ని ప్రతీక్షిస్తున్నాడు. నాయకుడు సూర్యవంశ సంజాతుడైతే నాయిక కమలాక్షి.

కమలాప్త కులుడ నీ కమలాక్షి నీపాద
కమలములు దలపోసి కమలారి దూరె (26229)

ఇలా సందర్భానుసారంగా కవిసమయాలను వినియోగించుకోవడంలో దిట్ట అన్నమయ్య.

చూపుల బాణాలను విసిరే కళ్ళను రక్షించే కనురెప్పలు అమ్ములపొదులట!

పంచల వాడమ్ములివె పట్టవయ్య కానికె
పొంచి తొంగలి రెప్పల పొది నున్నవి (1235)

కుపిత అయిన నాయిక కళ్లలో కావిమొయిళ్ళు ఆవరిస్తే నిలువెల్ల చెమటల వర్షం కురుస్తుంది. ఆ నీటిబిందువుల ద్వారా ఎర్రని సూర్యకిరణ ప్రసారం చేత ఏర్పడేదే ఇంద్రధనువు.

ఎలమి బొమ్మల జంకె లింద్రధనువులు వొడిచె
మొలచె గన్నుల గావిమొయిలు ఘనమై
కొలది కగ్గలపు గుంకుమ చెమట నెత్తురులు
పొలతిపై గురియుటకు బోటి వలె నాయె (4100)

విరహిణి అయిన నాయిక కనుబొమలు అరిష్టదాయకములైన ధూమకేతువులట.

పడతి వేనలి జారి పగలు చీకట్లాయ
వొడల బులకల చుక్కలురక పొడమె
తొడరి కనుబొమ్మలనె ధూమకేతువు దోచె
పొడమె నుత్పాతములు పూటపూటకును
పరిగొనుచు విరహంపు పతి సూర్యుడుదయించె (29580)

విరహిణి అయిన నాయిక శరీరంలో కలిగే మార్పులను చూచి ఎటువంటి ఉత్పాతం రానుందో అని చెలుల కలవరమిది. వేనలి (జడ) జారి చీకట్లు కమ్మడం, పులకలనే చుక్కులు పొడమడం, కనుబొమలనే ధూమకేతు దర్శనం, తర్వాత విరహపు పతి సూర్యుడుదయించడం ఇదీ క్రమం.

స్త్రీల ముంగురులు మరుడు పన్నిన గాలాలట.

చింత చేతనిదె చెలియనుదిటిపై
చెంతల జెదరిన చిరునెరులు
కాంత కన్నులను గండుమీలకును
కంతుడు వేసిన గాలములే (12174)

గాలానికి చిక్కిన చేప కాసేపు గిలగిల కొట్టుకుని తర్వాత చేష్టలుడిగిపోవడం కద్దు. అలాగే నాయకునిపై చింతతో నిశ్చేష్టురాలైన నాయిక కళ్ళు ఆమె ముంగురులనే మరుని గాలాలకి చిక్కాయట!

స్త్రీ ముఖాన్ని చంద్రబింబంతో, కొప్పును రాహువుతో పోల్చడం కవిసమయం. అయితే అన్నమయ్య ఈ రెంటిని జత చేసి చమత్కరించడం విశేషం.

పొలతి వదనమను పున్నమ చంద్రుడు
బలిమి నెగయునని భయమునను
మెలుత చికుర ధమ్మిల్లపు రాహువు
తల జెదరగ నిదె దైవమె సేసె (417)

రాహుకేతువులు చంద్ర, సూర్య బింబాలను కబళించడం వల్లే గ్రహణాలొస్తాయని పురాణభావన. నాయిక వదనమనే పూర్ణచంద్రుడు నింగి పైకి ఎగిసిపోకుండా కబళించడానికి సిద్ధంగా ఉన్న రాహువే నాయిక కొప్పట!
పూలతో కూడిన మగువకొప్పు మరుని ఆయుధశాల!

మరుని ఆయుధశాల మగువకొప్పు
తొరలించి విరులెల్లా దురిమె గాన (29196)

మగవారి మనసుల దోచే మగువల కొప్పు మదనుడి బాణాలైన పూలకు నెలవు.

గోపాలుడైన నాయకుడికి గోపిక కొప్పు కొత్తపేయల గూడుగా గోచరించింది.

కొత్తపేయల గూడంటా కొప్పంటేవు (13156)

కొత్తగా పాలు విడిచిన ఆవుదూడ పెయ్య. ఆ పెయ్యదూడ మూపురమే గూడు. నాయిక కొప్పు తనకు సుపరిచితమైన కొత్తపేయల గూడుగా భాసించింది.
కొంటె కృష్ణుడికి సతులకొప్పులు చక్కిలాలు అనే తినుబండారం గంపలా గోచరించడంలో వింత లేదు.

సతుల పెద్దకొప్పులు చక్కిలాల గంపంటా
బతిమాలి వేడీనప్పటి కృష్ణుడు (23206)

జడలుగాటిన కురుల తోడి బాలకృష్ణుడి శిరసు చింతకాయల గంప.

చిన్నిశిశువూ చిన్నిశిశువూ
ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు
తోయంపు గురుల తోడ దూగేటి శిశువు చింత
కాయల వంటి జడలగముల తోడ
మ్రోయుచున్న కనకంపు మువ్వల పాదాల తోడ
పాయక యశోద వెంట బారాడు శిశువూ (41)

స్త్రీశరీరాంగాల్ని వర్ణించడం సాధారణమే గాని పురుషశరీరాన్ని వర్ణించడం అరుదు. అయితే అన్నమయ్య నాయకుడి శరీరాన్ని కూడా రకరకాలుగా వర్ణించాడు.
తరతమ భేదాలు గ్రహించలేని దక్షిణనాయకుడి పాదాలు సంతముద్రకోల.

ఇందరు సతులలోనా యెచ్చుకుందుల చూడవు
సందడి కాలు దొక్కేవు సారెసారెకు
చందమైన నీపాదము సంతముద్రకోలాయ
యిందుకు నేనూ లోనై యిరవుకోవలెనా (13185)

ప్రాచీనకాలంలో సంతల్లో ముద్ర వేయించుకుని సరకు నమ్ముకునే పద్ధతి వుంది. దక్షిణనాయకుడు అక్కడి సతులందరి పాదాలను తన పాదాలతో తొక్కి వాటి విలువను నిర్ణయిస్తుంటే కుపిత అయిన నాయిక ఆవేదన ఇది.

అలమేలు మంగకు నిలయమైన స్వామి ఉరాన్ని ఆమెకు సింహాసనంగా, కమలాల పానుపుగా, జపశాలగా, పొదరిల్లుగా అన్నమయ్య అభివర్ణించాడు. అయితే అదే ఉరము సవతులైన శ్రీదేవి, భూదేవులకు నిలయం గనక నురిపే కళ్ళమయిందట!

ఇక్కువ శ్రీవేంకటేశ యెనసి ఇద్దరివల్లా
అక్కర నురిపే కళ్లమాయెను నీ వురము (13404)

ధాన్యాన్ని కాళ్ళతో తొక్కి రాల్చే ప్రదేశం నురుపుకళ్ళం. పలువుర కాళ్లతొక్కిడిని భరించడం దాని లక్షణం. సవతిపోరు లోకవిదితం. ఆ ఇద్దరినీ ఒకచోట చేర్చిన శ్రీనివాసుని ఉరం నురిపేకళ్ళమయింది.

స్త్రీల పెదవులను అందమైన దొండపండ్లతో పోలిస్తే కాముకుడైన నాయకుడి నోటిని బందె యెద్దు మోరతో పోల్చాడు.

జంగిలి కాంతల నెల్లా సంగతులెంచక నీవు
యెంగిలి సేసేవు మోవి యేకము గాను
పంగించ నీ నోరు బందె యెద్దు మోరాయ (13185)

ఎక్కడ బడితే అక్కడ మేసి బందెలదొడ్డికి తోలబడ్డ యెద్దు బందెయెద్దు. విచక్షణారహితంగా అనాగరిక స్త్రీలను సైతం చుంబించిన నాయకుడి నోరు బందెయెద్దు మోర. పలుకాంతలను చుంబించే నాయకుడి పెదాలను గాడిపట్టుగా వర్ణించడం కూడ చూస్తాం.

కాంతలకు నీ మోవి గాడిపట్టు (31451)

పశువులన్నీ కలిసి సామూహికంగా మేయడానికి రాతితో నిర్మించిన తొట్టి గాడిపట్టు. పలువురు స్త్రీల పొందు ననుభవించే నాయకుడి కౌగిలే విడిదిల్లు. శరీరమే దాయిమాను, శిరసే బొడ్రాయి.

పంతమెల్లా నాదె కాక భావించి చూచితేను
యింతులకు మ్రొక్కే నీకు యెమ్మె వున్నదా
ఇంతటి శ్రీ వేంకటేశ ఇట్టే నన్ను గూడితివి
పొంతలనే శిరసిది బొడ్రాయిగదా (31451)

ఊరికి తూర్పు పొలిమేరల్లో వుండే రాయిని బొడ్రాయి అంటారు. సాధారణంగా ఊర్లోకి వచ్చీ పోయే బళ్ళన్నీ బొడ్రాయిని ఒరుసుకుంటూ పోయే సంప్రదాయం రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వుంది. ఈ బొడ్రాయితో నాయకుడి శిరసుకు పోలిక.
అయితే ఈ నిందలన్నీ కుపిత అయిన నాయిక నాయకుణ్ణి నిందించిన సందర్భాలే.

అన్నమయ్య మాత్రం తన చేతిలోని వీణను మీటుతూ శ్రీవేంకటేశ్వరుణ్ణి కీర్తించడమే కాదు, తన తనువునే వీణ వొళవుగా మార్చిన తీరు అద్భుతం, అనన్యం.

పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పది రెండు వేళల రాగాలను
తనువే వొళవు తలయే దండెకాయ
ఘనమైన వూర్పులు రెండు కట్టిన తాళ్ళు
మనసే నీ బద్దితాడు మరి గుణాలే జీవాళి
మొనసిన పుట్టుగే మూలకరడి (9178 )

భగవంతుడికి నిత్యపూజ లర్పించడం మానవధర్మం.

పలుకే మంత్రమట పొందైన నాలుకే
కలకలమను పిడిఘంటయట (282)

భగవంతుని కీర్తించే నాలుక గుడిలోని ఘంట. భగవంతుని చేరని మానవజీవితం వ్యర్థం.

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖమందనేలా (1196)

బూరుగ మాకున జెందిన కీరము చందమున
ఆరయ నిష్ఫలమగు మరి యన్యుల జేరినను (1194)

మధురఫలాలను ఆస్వాదించే చిలక శుష్కమైన బూరుగఫలాలను చేరడం లాగా భగవంతుణ్ణి ఆశ్రయించక అన్యుల్ని ఆశ్రయించడం వ్యర్థం.
----------------------------------------------------------
రచన: జి. ఉమాదేవి, 
ఈమాట సౌజన్యంతో