Friday, January 27, 2017

సరి బేసైరిపుడేల భాస్కరులు భాషానాథ!


సరి బేసైరిపుడేల భాస్కరులు భాషానాథ!



సాహితీమిత్రులారా!



పూర్వము రాయని భాస్కరుడనే మంత్రి దానములో
గొప్పపేరున్న దాత ఆయన గురించి అనేక పద్యాలు
చాటువులు ఉన్నాయి. వాటిలోని ఒక చాటువు
సంవాదచిత్రంలో చూడండి-

బ్రహ్మ - నారదుల సంవాద చిత్రం -


సరి బేసై రిపుడేల భాస్కరులు భాషానాథ!, పుత్రా! వసుం
ధరపై నొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ రామయామాత్య భా
స్కరుడో ఔను అయితే సహస్రకరశాఖల్లేవు అదె యున్నవే
తిరమై దానము చేయుచో - రిపు హేతిన్ వ్రేయుచో - వ్రాయుచో



    
నారదుడు -  సరి బేసై రిపుడేల భాస్కరులు భాషానాథ! 
                      (తండ్రీ!  ద్వాదశాదిత్యులు ఇపుడు బేసి(11) గా    ఎందుకున్నారు?)

బ్రహ్మ -  పుత్రా! వసుంధరపై నొక్కడు మంత్రియయ్యె వినుకొండన్
               (అందులోని సూర్యుడే కుమారా భూమిపై వినుకొండలో
                  మంత్రి రాయని భాస్కరునిగా పుట్టాడు)

నారదుడు -  రామయామాత్య భాస్కరుడో
                      (రామయామాత్య భాస్కరుడేనా)

బ్రహ్మ - ఔను

నారదుడు - అయితే సహస్రకరశాఖల్లేవు
                      (అయితే సహస్ర కరాలు(కిరణాలు) లేవేమి?)

బ్రహ్మ -  అదె యున్నవే తిరమై దానము చేయుచో - 
                రిపు హేతిన్ వ్రేయుచో - వ్రాయుచో
               (అదుగో ఉన్నవి దానముచేయువేళ,
                యుద్ధము చేయువేళ, వ్రాయువేళ
                  అతనికి వేయి చేతులుంటాయి)


(సూర్యులు 12 మంది. కశ్యపునకు దితికి కలిగినవారు. 
వీరిని తుషితులనే దేవతలుగా పిలుస్తారు. 
వారి పేర్లు - 1. ఇంద్రుడు, 2. ధాత, 3. పర్జన్యుడు, 
4. త్వష్ట, 5. పూష, 6. అర్యముడు, 7. భగుడు, 
8. వివస్వంతుడు, 9, విష్ణువు, 10. అంశుమంతుడు, 
11. వరుణుడు, 12 మిత్రుడు)

No comments: