Monday, March 29, 2021

శ్రీరామ స్థవము

శ్రీరామ స్థవము





సాహితీమిత్రులారా!



ఈ స్థవాన్ని చూడండి


పాము వెన్నెల, బూది, నాపగను దాల్చు

వేల్పు టిల్లాలు సైదోడు విడిదిఁగన్న

మిన్నపావడ గలకన్నె మిన్నఁగన్న

కన్నె దొరసామి సిరిమిమ్ముఁగాచుగాత


పాము వెన్నల బూది అపగ(నది) లను తాల్చెడి దేవుడు ఈశ్వరుడు

ఆయన భార్య పార్వతి, 

ఆమె తమ్ముడు మైనాకుడు, 

అతనికి విడిదిగా ఉన్నది సముద్రం, 

సముద్రుని పావడాగల కన్నె భూదేవి, 

ఆమె కన్నకూతురు సీతాదేవి,

ఆమె భర్త శ్రీరామచంద్రుడు. 

ఆయన మీకు ఐశ్వర్యాలనిచ్చి కాచుగాక


ఇందులో శ్రీరాముని స్థవం గూఢంగా ఉందికావున ఇది గూఢచిత్రం అవుతుంది. 

Saturday, March 27, 2021

పొడుపు పద్యం

 పొడుపు పద్యం




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం చూడండి-

కణుపులేదే కఱ్ఱ కాపులేదేచెట్టు

          నీరందురెయ్యది నీరుకాదు

తొడిమలేదేపండు వడలనిదేపువ్వు

          పువ్వందురెయ్యది పువ్వుకాదు

సుంకులే దేపంట చూడలేదేకన్ను

          నీసందురెయ్యది నీసుకాదు

పైరులేదేపంట పాలులేదేచన్ను

          ఆకందు రెయ్యది యాకుకాదు

కఱ్ఱలునుఁగాక నాల్గుండు కఱ్ఱలేవి

కొమ్ములునుఁగాక నాల్గుండు కొమ్మలేవి

కొప్పులునుఁగాక మూఁడుండు కొప్పులేవి

కూర్చె గంగాధరము తెల్సి కొండుదీని


సమాధానాలు-

ముగ్గఱ్ఱ, భజనచేసే పొన్నచెట్టు, పన్నీరు

విభూదిపండు, బొండపువ్వు,కుంకుమపువ్వు, 

ఉప్పుపంట,బండికన్ను, కోడిగ్రుడ్డు, 

ఉప్పుపంట, తాటిచన్ను, బండియాకు,

1. జీలకఱ్ఱ, అక్కలకఱ్ఱ, ముగ్గఱ్ఱ, విసనకఱ్ఱ

2. కావడికొమ్ము, చెఱువుకొమ్ము, మఱుగొమ్ము, వరికొమ్ము

3. వడికొప్పు, యింటికొప్పు, రాశికొప్పు


Thursday, March 25, 2021

పొడుపుపద్యం

 పొడుపుపద్యం




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి-


వృక్షమందున నుండును పక్షిగాదు

రమ్యసర్మంబుఁబూను, బైరాగికాదు

కన్నులమరును, మూడు, శంకరుఁడు గాదు

మహితజలమున్ ధరించును మబ్బుగాదు

కూర్చె గంగాధరము, తెల్సికొండు దీని


చెట్టుపై ఉంటుందట కాని పక్షికాదట

మంచి అందమైన చర్మం కలిగి ఉంటుందట కాని బైరాగి కాదట

కన్నులు మూడుంటాయట కాని శివుడు కాదట

గొప్పవైన జలాన్ని ధరిస్తుందట కాని మబ్బుకాదట

దీన్ని తెలుసుకోమంటున్నాడు గంగాధరం కవి.


సమాధానం - కొబ్బరిబోండాం

Tuesday, March 23, 2021

చిక్కులెక్క

 చిక్కులెక్క




సాహితీమిత్రులారా!



ఈ చిక్కులెక్కను చూడండి-

ఒక వ్యక్తికి ఏడుగురు కొడుకులు. వారికి అతను తన దగ్గర ఉన్న

గోధుమలు పంచాలనుకున్నాడు. 7 మణుగుల గోధుమ బస్తాలు 7,

 6 మణుగుల గోధుమల బస్తాలు 6, 5 మణుగుల గోధుమ  బస్తాలు 5,

4 మణుగుల బస్తాలు 4, 3 మణుగుల గోధుమల బస్తాలు 3, 

2 మణుగుల గోధుమల బస్తాలు 2, 

1 మణుగు గోధుమల బస్తాలు 1  ఉన్నాయి. 

వీటిని తన కుమారులకు ఈ విధంగా పంచాలనుకున్నాడు 

ఎలాగంటే ప్రతిఒక్కరికి బస్తాల సంఖ్య సమానంగా లభించేలా 

మరియు బరువు కూడ సమానంగా ఉండేలా మరి వాటిని 

ఎలాపంచగలడో చెప్పండి-

(మణుగు అంటే 40 కే.జీలకు సమానం)


సమాధానం -

బస్తాలు / బరువు

7+6+5+2 - 20 మణుగులు

7+7+5+1 - 20 మణుగులు

6+6+4+4- 20మణుగులు

7+6+5+2- 20మణుగులు

 7+7+3+3- 20మణుగులు

7+5+4+4 - 20 మణుగులు

6+6+5+3- 20మణుగులు


Sunday, March 21, 2021

దీర్ఘాలు కొమ్ములు లేని నటరాజ స్తోత్రం

దీర్ఘాలు కొమ్ములు లేని నటరాజ స్తోత్రం





సాహితీమిత్రులారా!

పతంజలి కూర్చిన దీర్ఘాలు కొమ్ములు లేని నటరాజ స్తోత్రం

దీన్నే చరణశృంగరహిత నటరాజ స్తోత్రం అంటారు

దీనికి సంబంధించిన వీడియోలు చూడండి-





 

Friday, March 19, 2021

ఆదిశేషుని ప్రార్థన

 ఆదిశేషుని ప్రార్థన




సాహితీమిత్రులారా!



ఈ ప్రార్థన పద్యం గమనించండి-


పదియునైదు నైదు పదునైదు పదునైదు
నిఱువదైదు నూట యిఱువదైదు
నెలమి మూఁడునూరులిన్నూరు మున్నూరు
తలలవాఁడు మిమ్ము ధన్యుఁజేయు


10+5+5+15+25+125+300+200+300 తలలవాడు

ఎవరు అంటే ఇవన్నీ కూడగా 1000 అవుతుంది. అంటే

1000 తలలు కలిగినవాడు ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు

మిమ్ములను ధన్యులను చేయును- అని భావం


ఇందులో ఎవరిని ప్రార్థించినది సూటిగా కనిపించలేదు కావున 

ఇది గూఢచిత్రం అవుతుంది-


Wednesday, March 17, 2021

శిరహీనుని శివుడుమ్రింగె

శిరహీనుని శివుడుమ్రింగె








సాహితీమిత్రులారా!


ఈ 
పొడుపు పద్యం చూడండి.

సురలను సురలే మ్రింగిరి
పరగంగా బ్రహ్మవచ్చి భానుని మ్రింగెన్
అరయగ నప్పురి చెంతను
శిరహీనుని శివుడుమ్రింగె చిత్రముగాదే!

                                    (నానార్థగాంభీర్యచమత్కారిక పుట.14)


దీనిలో దేవతలను దేవలు మ్రిండమేమిటి?
బ్రహ్మ వచ్చి సూర్యుని మ్తింగడమేమిటి?
శిరహీనుని శివుడు మ్రింగడమేమిటి? - చిత్రమేకదా

బాగా ఆలోచిస్తే ఇందులోని పదాలకు
మరో అర్థం ఉండి ఉండాలి లేకుంటే ఇది ఎలా?

సురలను సురలే మ్రింగిరి -
అంటే
చేపలను(సురలను) చేపలే మ్రింగాయి.
(అనిమిషులు - చేపలు, సురలు)
బ్రహ్మవచ్చి భానుని మ్రింగెన్ -
మేక(అజము-బ్రహ్మ)వచ్చి జిల్లేడు చెట్టును(భానుని- అర్కం) తినింది.
శిరహీనుని శివుడు మ్రింగె -
పీత(శిరహీనుడు- ఎండ్రకాయ)ను నక్క(శివుడు) తిన్నది 

 


Monday, March 15, 2021

జఘనమండలము హంసయాన కురులు

 జఘనమండలము హంసయాన కురులు





సాహితీమిత్రులారా!



చ్యుతదత్తచిత్రపద్యం చూడండి-

ఈ పద్యంలో ఒక స్త్రీని వర్ణించాడు కవి


అధరముఖవర్ణ సూన్యంబు లతివకుచము

లాన నాకారరహిత, మబ్జాక్షి మేను

అజ జఘనమండలము, హంసయానకురులు

చరమ భాన్వితకరము చానతొడలు


ఈ పద్యంలో కవి స్త్రీని ఏ విధంగా వర్ణించాడో చూడండి-

ఆమె ఎలాంటి స్త్రీ అంటే

- లోపించిన అధరములు - కుచములు

- లేని ఆననము - మేను

- లేని జఘనము - కురులు

- కారముతోడి కరములు -  తొడలు - గలది  ఆమె.

అంటే 

అధరములో 

తీసివేస్తే ధరము - కొండ

కొండలవంటి కుచములు గలది ఆవిడ


ఆననము -లో తీసివేయగా

ననము అవుతుంది. ననము అంటే తీగ

తీగవంటి శరీరంగలది ఆమె.


జఘనము లో - లేనటువంటిది

అంటే జ తీసివేయగా ఘనము - మేఘము

మేఘమండలము వంటి కురులు గలది ఆవిడ


భాన్విత కరములు అంటే తో కూడిన కరములు

కరభములు - అరటిబోదెలవంటి తొడలు గలది ఆసుందరాంగి.



Saturday, March 13, 2021

హరి నీవనాకారి యాలి పరాచారి

హరి నీవనాకారి యాలి పరాచారి





సాహితీమిత్రులారా!



మదనగోపాల శతకంలోని ఈ పద్యం చూడండి-

హరి నీవనాకారి యాలి పరాచారి

                 కూతురు వ్యభిచారి కొడుకు జారి

యమ్మ నిర్దయకారి యబ్బ సంకిలికారి

                 యత్త పరాచారి యక్కమారి

మరదలు శుభాచారి మనుమఁడు జడదారి

                  మరిది క్షీణాకారి మామ క్షారి

వదినె నిర్దయకారి వాజి పక్ష్యాకారి

                  భటుఁడు మర్కటకారి పడకహారి

చూడు నీమర్మ మెల్లనే నాఁడుదాన

నేఁడు నన్నేలి, సిగ్గుఁగా పాడుకొనుము

సరససదరహాస ద్వారకా పురనివాస

మదనగోపాల రాధికా హృదయలోల


కవి ఏ విధంగా మదనగోపాలుని బెదిరిస్తున్నాడో చూడండి-

నీవు అనాకారివి, నీ భార్య లక్ష్మిదేవి పరాచారి,

కూతురు(గంగ) వ్యభిచారి, కొడుకు(మన్మధుడు) జారి,

తల్లి(దేవకీదేవి) నిర్దయకారి, తండ్రి(వసుదేవుడు) సంకిలికారి,

అత్త(భూదేవు) పరాచారి, అక్క(యోగమాయ)మారి,

మరదలు(ఊర్మిళాదేవి)శుభాచారి, మనుమడు(నారదుడు) జడదారి,

మరిది(చంద్రుడు) క్షీణకారి, మామ(సముద్రుడు) క్షారి,

వదినె(జ్యేష్టాదేవి) నిర్దయకారి, వాజి(గరుత్మంతుడు) పక్ష్యాకారి,

భటుడు(హనుమంతుడు) మర్కటాకారి, పడక(ఆదిశేషుడు)హారి,

నన్ను కాపాడకున్నచో నేను ఆడుదానిని యిలాంటి 

మర్మమెల్ల బట్టబయలు చేస్తాను. ఓ ద్వారకాపురవాసా, 

మదనగోపాలా జాగ్రత్తసుమా

 

Thursday, March 11, 2021

లింగోద్భవ గద్యం

 లింగోద్భవ గద్యం




సాహితీమిత్రులారా!


బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారి గళం నుంచి 

లింగోద్భవ గద్యం ఆస్వాదించండి-

జయ జయ శివ లింగ జ్యోతిర్మహాలింగ లింగోద్భవ శ్రీ మహాలింగ వేదత్రయీ లింగ నిర్లింగ సంస్పర్శ లింగ క్షమా లింగ సద్భావ లింగ స్వభావైక లింగ ...దిగ్దేశ కాల వ్యవఛ్చేద రాహిత్య లింగ స్వయంభూ మహాలింగ పాతాళలింగ క్రియాలింగ పంచాక్షరీ లింగ పంచప్రకారోపదీపక్రియా లింగ వారాణసీ క్షేత్ర సింధూ గయా రుద్ర పాదద్వయీ శ్రీగిరి స్థాన శోణాచల వ్యాఘ్రపుర్యాది నానావిధ స్థాన సంసిద్ధి ప్రమాణాప్రమేయ ప్రభా లింగ  విద్యాకళాలింగ షత్కర్త లింగాగమామ్నాయ లింగా ప్రతిష్టా కళా లింగ, మూలాలవాలాంతరాళానలావాణ  కోణత్రయీ గేహ రోహ ప్రథా లేఖికాస్యూతి నిధ్యాన షట్పుష్కరీ నిమ్న టంక్రోడ విష్కంభ నిష్కంప శంపాలతా లంఘిత బ్రహ్మరంధ్ర స్రవచ్చాంద్రసాన్ద్రామ్రుత స్యందనస్పందితానంద లింగాదిమధ్యాంతశూన్య స్వరూపాభిధాలింగ ఖట్వాంగ లింగా హిలింగాభ్రగంగాసరిల్లింగ సారంగలింగాత్మభూలింగ ఐంలింగ ఈంలింగ ఓంలింగ వృక్షాపరోక్ష విరూపాక్షా లింగా నమస్తే నమస్తే నమః !



Tuesday, March 9, 2021

పొడుపు పద్యం

 పొడుపు పద్యం




సాహితీమిత్రులారా!



పొడుపుపద్యం చూడండి

సమాధానం చెప్పగలరేమో


పదములెనిమిది కొమ్ములు వరలునాల్గు

తలయు తోకయు లేకున్న గలదుయొకటి

జీవముండియుఁదిరిగాఁడు చిత్రమొకటి

కూర్చె గంగాధరము తెల్సి కొండుదీని


పాదాలు ఎనిమిది, కొమ్ములు నాలుగు ఉండి తలతోక లేకున్నా ఒకటి ఉంది

కాళ్లు తల తోక కొమ్ములు లేక జీవమొటి కలిగి తిరిగేది ఒకటి

అవేవో తెలుసుకోమంటున్నారు దీన్ని కూర్చిన గంగాధరంగారు


సమాధానం - పీత - నత్త

                  

Sunday, March 7, 2021

అంకెల పద్యం

అంకెల పద్యం




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలో అన్నీ అంకెలే కనిపిస్తాయి గమనించండి 

వాటి అర్థం ఎలా తీసుకోవాలో క్రింద వివరించుకుందాం-


ఇంచుక చతుర్థజాతుఁడు

పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజన్

గాంచి తృతీయంబప్పురి

నించి ద్వితీయంబు దాగి నృపుకడకేగెన్


ఈ పద్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ అనే 

ఐదు అంకెలున్నాయి. వీటి అర్థం తెలిస్తే పద్యం సులువుగా అర్థమౌతుంది.

ఈ ఐదు అంకెలు పంచభూతాలుగా ఒక క్రమసంఖ్యను తీసుకుంటే

ఈ విధంగా గుర్తించవచ్చు. ప్రథమం - భూమి, ద్వితీయం - నీరు, 

తృతీయం-అగ్ని, చతుర్థం - గాలి, పంచమమం - ఆకాశం.

ఇక పద్యం అర్థంలో కెళితే-

చతుర్థం - గాలి, గాలికుమారుడు - హనుమంతుడు,

అయిదవది - ఆకాశం - గుండా లంక చేరి,

ప్రథమం - భూమికుమార్తె అయిన సీతను చూచి,

ద్వితీయం నీరు(సముద్రం) దాటి నృపతి(రాజు - శ్రీరాముని)

దగ్గరికెళ్లాడు - అని భావం. 

Friday, March 5, 2021

పొడుపు పద్యం

 పొడుపు పద్యం




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం చూడండి

సమాధానం చెప్పగలరేమో


ముక్కున పైనము నడచును

ప్రక్కను నోరుండు గాలి పారణసేయున్

గ్రక్కునవేసిన కూయును

మక్కువతోదీని దెలియు మనుజులు గలరే


ముక్కపై నడుస్తుందట

ప్రక్కన నోరుంటుందట

గాలిని తింటుందట

వేయగానే కూస్తుందట

ఏమిటో చెప్పమంటున్నాడు కవి-


సమాధానం - బొంగరం

Wednesday, March 3, 2021

పొడుపు పద్యం

 పొడుపు పద్యం





సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి

సమాధానం చెప్పగలరేమో

అంధకార సమం వస్తుః

వస్తునామత్రయాక్షరం

కకారాది కకారాంతం

షణ్మా సంచితయేద్బధః


అంధకారంతో సమానమైత వస్తువట

సమాధానం మూడక్షరాలతో ఉంటుంది

క-తో ప్రారంభం కావాలి

అలాగే కకారంతో అంతం కావాలి

చెప్పగలరేమో ఆలోచించండి-


సమాధానం - కాటుక

అంధకారంతో సమానమైనది

మూడక్షరాలు కలది

మొదట చివర క-తోనే ఉంది

సరిపోయిందికదా సమాధానం.

Monday, March 1, 2021

ఐ-త్వంతో పద్యం

 ఐ-త్వంతో పద్యం





సాహితీమిత్రులారా!



ఒక శ్లోకం లేదా పద్యంలో ఒకేఒక స్వరం(అచ్చు)వాడితే

అది ఏకస్వరచిత్రం దానిలో కేవలం దీర్ఘస్వరాలనే వాడితే

అది దీర్ఘ ఏకస్వరచిత్రం అవుతుంది.

ఈ శ్లోకం చూడండి.

వైధై రైనై రైశై రైంద్రై రైజై రైలై ర్జైనై: సైద్ధై:

మైత్రై ర్నైకై ర్దై ర్యై ర్వై రై దై: స్వై: స్వైరై ర్దేవైస్తైస్తై:

                                                                                       (సరస్వతీకంఠాభరణము)

దీనిలో అంతటా "ఐ" -త్వమే ఉపయోగించి

శ్లోకం కూర్చడమైనది.

కావున దీన్ని

"ఐ" - త్వ శ్లోకం అనికూడా పిలువవచ్చు.

అర్థం - బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు, మన్మథుడు, భూమి,

జినుడు, సిద్ధులు, సూర్యుడు కుబేరుడు అనువారికి సంబంధించిన

వారిచేత, అనేక దేవతల చేతను సుష్టుగా ఒసగబడిన

వారివారి ధైర్యములచేత సమగ్రముగా సమృద్ధి నొందుదును.