కృపాం మయి సదా!
సాహితీమిత్రులారా!
ఈ గూఢచిత్ర శ్లోకం చూడండి-
ఒక ప్రియుడు తన ప్రేయసితో ఇలా అంటున్నాడు-
వక్త్రేందు: కబరీభర స్తన తమ స్సీమన్త సూర్యోగురు
ర్వక్షోజా వధర స్స చావనిజని: కేతు ర్భ్రువౌ సుందరి
వాక్యం కావ్యమయం శనైశ్చరగతి ర్మస్తు సౌమ్యోऽపర
స్సాత్వం చేత్కురుషే కృపాం మయి సదా సర్వేऽనుకూలాగ్రహా
సుందరీ! గ్రహయోగము ఎట్లు చాలలేదు
నీముఖము చంద్రుడు, నీ కొప్పు తమము(రాహువు),
నీ పాపటబొట్టు రవి, నీ చనుగవ గురువు,
నీ యధరోష్టము లోహితాంగుడు (కుజుడు),
నీ కనుబొమలు కేతువు, నీ మాటలు కావ్యమయము(శుక్రుడు)
నీ నడక శనైశ్చరుడు, నీ నడుము సౌమ్యుడు(బుధుడు)
కాంతామణి అన్ని గ్రహాలు నీ యందే యోగమై ఉన్నవి కదా
నీ దయ ఒక్కటి నాయందు ప్రసరింపచేయుదువేని నా కన్ని
గ్రహములు అనుకూలములు గాక ఏ మగును
దీనిలో ఆమె ముఖం చంద్రబిబం
కొప్పు నల్లగా రాహువువలె ఉన్నది.
నీ పాపట బొట్టు సూర్యకాంతితో వెలుగుచున్నది.
నీ చనుగవ గొప్పవిగా గురునివలె ఉన్నవి.
నీ అధరము ఎర్రగా కుజునివలె ఉన్నది.
నీమాటలు కవి(శుక్రుని)కావ్యం వలె కమనీయంగా ఉన్నవి.
నీ నడక మందముగా(శనైశ్చరునివలె) ఉన్నవి.
నీ నడుము సోమ్యముగా బుధునివలె ఉన్నది.
అని చంద్రుడు, రాహువు, రవి, గురుడు,
కుజుడు, కేతువు, శుక్రుడు, శని, బుధుడు-
తొమ్మిది గ్రహాలను ఆమె శరీరంలో గోపనం చేసి
కవి చెప్పాడు కావున ఇది గోపన(గూఢ) చిత్రమగుచున్నది.
No comments:
Post a Comment