కలలో గర్భము నిల్చె కోమలికి
సాహితీమిత్రులారా!
సమస్య-
కలలో గర్భము నిల్చె కోమలికి లోకం బింక నిందింపదే
పూరణ - గౌరిపెద్ది రామసుబ్బశర్మ
అలఘుస్వాంతుడు కామశాస్త్ర ధిషణాఖ్యాతుండు ప్రాయంబునన్
లలితాంగీమణి నూత్న యౌవన సముల్లాస స్ఫుర ద్రూపతన్
వలపుల్ మానస మందు నిండగను నిర్వక్రంబు లౌ రాకపో
కలలో గర్భము నిల్చె కోమలికి లోకం బింక నిందింపదే
కలలో కాదు ప్రియుని రాకపోకల వల్ల గర్భమైనది
అని బహుశా పెళ్ళికానందున లోక నిందకు
ఆస్పదమైందని బహు చమత్కారంగా పూరించాడుకదా!
మీరు మరో రకంగా పూరించి పంపండి.
కట్టా నరసింహులుగారు పంపిన పూరణ-
అలుకన్ పెండిలినాటినుండియును వియ్యంబాయె కయ్యంబుగా
వలపుల్ మోసులుగా వధూవరులు తద్వాంఛారతిన్ చాటుమై
వలరాముచ్చట దీర్చుకోదొడగి రప్పా!వహ్వ !ఈ రాకపో
కలలో గర్భము నిల్చె కోమలికి లోకంబెల్ల నిందింపగన్
.
కట్టా నరసింహులు
మాగురుదేవులు గౌరిపెద్ది వారి మార్గంలో..9441337542
No comments:
Post a Comment