Friday, November 4, 2016

సంధ్యావందన మాచరించవలదా?


సంధ్యావందన మాచరించవలదా?



సాహితీమిత్రులారా!


సమస్య-
సంధ్యావందన మాచరింప వలదా చౌసీతి బంధమ్ములన్

దీనిలో సంధ్యావందనాన్ని
చౌసీతి బంధాలతో చేయవద్దా? - అని ప్రశ్న.
ఇందులో మొదటిభాగం ఆచారంలో భాగమైన
ఒక పవిత్ర వేదచోదిత కర్మ.
రెండవది శృంగార క్రీడా భంగిమల సంఖ్య.
ఈ రెండింటికి సంబంధంలేదు.

1. పూరణ-
ప్రాచీనకవులలో ఒకరు పూరించినది
చాటుపద్యమణిమంజరిలోనిది-

కంధ్యుద్భూతునిచే మనోభవునిచే గాసిల్లగా కంచుక
గ్రంధ్యంతంబు తెమల్చి కౌగిటను జేర్పన్ నేర్పు లేదాయె నా
సంధ్యాదుల యందె నిల్చెదవయో స్వామీ! యిదేమైన నీ
సంధ్యావందనమా? చరించ వలదా చౌశీతి బంధమ్ములన్

ఒక భర్త నిరంతరం ధ్యానంతో కాలం
గడుపుతూ శృంగార దోష్టి లేకపోతే,
అతన్ని ప్రోత్సహిస్తున్న సందర్భం తీసుకొని
సంధ్యావందనము+ ఆచరించవలదా - అని కాక
సంధ్యావందనమా  - చరింపవలదా అని విభాగం చేసి
చౌశీతి బంధాల్లో చరంచవద్దా?
ఇదేమైనా ధ్యానమా; సంధ్యావందనమా -
నేర్పరుగా కౌగిట చేర్చి పురోగమించాలి
అని చెప్పిన తీరు చక్కగా పద్యంలో ఇమిడింది.

2. తిరుపతి వేంకటకవుల పూరణ-

విధ్యాద్రి ప్రభ నొప్పు బల్ కుచములన్ వేపట్టి పెంపొందు కా
మాంధ్యం బార్పగలేక వెర్రి వలె వేలా మంచి యీ రాతిరిన్
వంధ్యం జేసెదు? కాముకేళి యనగా పాండిత్యమా లేక నీ
సంధ్యావందనమా?  చరించవలదా?  చౌశీతి బంధమ్ములన్

దీని భావం పై పూరణలోనివలెనే ఉన్నా
కొంచెం అందంగా, చమత్కారంగా ఉంది.

3. పూరణ-
ఇది ఆధునిక కవులలో
ఒకరు పూరించారు(పేరు తెలియదు)

విధ్యాంభోనిది మధ్య తారలను నీవే గొప్పలే - కాని - సం
బంధ్యుల్లాసము పోయె జీవితములో బంధమ్ములే లే వికన్
సంధ్యుత్సాహము రాదు నీ కొరకు ఖర్చయ్యెన్ ధన మెల్ల నో
సంధ్యా! వందన మాచరింప వలదే చౌశీతి బంధమ్ములన్

ఒకడు సంధ్య అనే గొప్ప సినిమా తార వెంబడి
ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకున్నాడు.
అప్పటికి జ్ఞానోదయమైంది. అతడంటున్నాడు -

వింధ్య పర్వతానికి, సముద్రానికి మధ్య - అంటే
దక్షిణ భారతం మొత్తం మీద సినిమా తారలలో
నీవే ఇప్పటికి గొప్పే!  సందేహంలేదు. అయితే
నీతో సంబంధం ఉంచుకోవాలనే ఉల్లాసం పోయింది.
అసలు బంధాలే పోయి నాకు వైరాగ్యం పుట్టింది.
మన మధ్య ఇక సంధి కుదరదు. నీకోసం నా ధనమంతా
వ్యయమైపోయింది. ఇక నా వల్ల కాదు.
ఓ సంధ్యా! వందనం.
ఇక చౌశీతి బంధాలు ఆచరించవద్దు.
అంటే శృంగారం రద్దు - అని భావం.


ఈ పూరణలు చూశారుకదా
మీరూ మరోరకంగా పూరించి పంపండి.

No comments: