Wednesday, November 16, 2016

కలవాడె కలవాడు


కలవాడె కలవాడు



సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్యా శతకంలోని ఈ పద్యం చూడండి-

నిజముగ వాకొనగా న
క్కజముగ గలవాడె కలవాడు కాని యన్యుడున్
అజుడును నభవుండును కా
యజుడైనను లేని వాడే యనుమా యార్యా!


కలవాడు - ఉన్నవాడు, స్థతిమంతుడు.
వాకొనగా - చెప్పగా, వకారం తీసికొనగా.

కలవాడు అనే పదంలో వ-కారాన్ని తీసివేస్తే కలడు.
కలడు అనే సామాన్యార్థం మిగులుతుంది.
కాని వ్యతిరేకార్థంగాని మరొకటిగాని మిగలదు.
ఇది ఇందులోని చమత్కారం

ఇక లక్ష్మిలేనివారిలో అజుడు అభవుడు,
కాయజుడు అనే వారిని పరిశీలించిన
అజుడన్నా, అభవుడన్నా  పుట్టనివాడు
అనే అర్థం. పుట్టినాడు ప్రపంచంలో
ఎలాగూ ఉండనే ఉండరు.

శ్రీ శబ్దానికి లక్ష్మి అనేకాక సరస్వతి,
పార్వతి అనే అర్థాలు కూడా ఉన్నాయి.
కాబట్టి వారులేనపుడు అవాక్కై - బ్రహ్మ,
అర్థశరీరుడై శివుడు
ఉన్నా లేనివారే అవుతారు.

ఇక మన్మథుడో ఎపుడో సశరీరంగా ఉన్నా
శివుని కంటి మంటకు భస్మమై యిపుడెలాగూ
అనంగుడైనాడు.
కాబట్టి లక్ష్మీకటాక్షం లేనపుడు
ఇక్కడ ఉదాహరణగా చెప్పబడిన
బ్రహ్మవంటి సృష్టకర్త, శివునివంటి సర్వజ్ఞుడు,
మన్మథునివంటి రూపవంతుడు
కూడ లేనివారికిందికే లెక్క - అని పద్య తాత్పర్యం.

No comments: