Saturday, November 5, 2016

పంచాక్షరి శివుడు హరిఁబ్రపంచము వోలెన్


పంచాక్షరి శివుడు హరిఁబ్రపంచము వోలెన్



సాహితీమిత్రులారా!



విద్వత్ప్రభువైన అనవేమారెడ్డిని
సంవత్సరానికొకసారి నాచనసోమనాథకవి
దర్శించేవారట. దర్శించి ఒక పద్యం చెప్పి
సన్మానం అందుకొనేవాడట.
ప్రతిరోజు ఆయనదగ్గరుండే కవులకు ఇది కన్నెర్రైంది.
 దీనితో రాజునకు లేనిపోని కొండేలు చెప్పారు.
విని విని ఒకసారి రాజుగారు సోమనకు కబురు పెట్టారు.
అప్పటికి 8 నెలలైంది. సోముడు రాజాజ్ఞప్రకారం వచ్చి
తన కవితా ప్రాభవాన్ని ప్రదర్శిస్తూ ఒక కందంలో
కొంతభాగం చెప్పి మిగతా భాగాన్ని
అక్కడి కవులను పూరించమని,
నాలుగునెలల తరువాత తాను
విజయదశమినాడు మిగతా భాగాన్ని
పూరిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ పద్యం-

కొంచెపు జగముల లోపల
సంచితముగ నీదు కీర్తి అనవేమనృపా
మించెను..........

అనవేముడు తమ గొప్పలు చెప్పుకున్న
కవులను పూరించమని అడిగితే
వారు చేయలేక పోయారట.  చేయలేకపోయారు
అనటంకంటె వారుచేసినవి రాజుకు
నచ్చలేదు అనవచ్చు. విజయదశమి రానే వచ్చింది.
సోమన వచ్చాడు పూరించాడు  ఆ పూరణ-

కొంచెపు జగముల లోపల
సంచితముగ నీదు కీర్తి అనవేమనృపా
మించెను కరి ముకురంబున 
పంచాక్షరి శివుడు హరిఁబ్రపంచము వోలెన్


(ఓ అనవేమనృపాలా! అద్దంలో ఏనుగు ఉన్నట్లుగా,
పంచాక్షరి మంత్రంలో శివుడు ఉన్నట్లుగా విష్ణువు
 ప్రపంచమంతా ఉన్నట్లుగా ఈ కొంచెపు లోకంలో
నీ కీర్తి మించింది.)


No comments: