Friday, June 10, 2016

హాలాహలో నైవ విషం


హాలాహలో నైవ విషం


సాహితీమిత్రులారా!

ఒకరితో ఒకరు మాట్లాడటమే సంవాదం కాదు.
మనలో మనమే ప్రశ్నించుకొని సమాధానాలు
చెప్పుకుంటూంటాము అవి కూడా సంవాదాలే.
ఒకడు తనలో తాను ప్రశ్నించుకొని,
ప్రతి వచనం చెప్పుకుంటాడు.
దానికి ఉదాహరణ ఈ శ్లోకం చూడండి.

హాలాహలో నైవ విషం విషం రమా
జనా: పరం వ్యత్యయ మత్ర మన్వతే
నిపీయ జాగర్తి సుఖేన తం శివ:
స్పృశన్నిమాం ముహ్యతి నిద్రయా హరి:

పూర్వం దేవదానవులు పాసముద్రాన్ని తరచినపుడు పుట్టిన
ఈ హాలాహలం అనే విషం సంగతి తెలియక ప్రజలు దాన్ని
ఘోరకాకోల విషం అన్నారు.
వాస్తవానికి అది పూర్తిగా అబద్ధం.
అసలైన విషం ఏందంటే - అది లక్ష్మి(సంపద)
ఎందుచేతంటారా?
ఆలోచించిచూస్తే నిజంగా
దాన్ని మస్తుగా(పూర్తిగా) తాగిన శివుడు,
ఏ ఇబ్బంది,
చావు లేకుండా హాయిగా, సుఖంగా మేల్కనే ఉన్నాడు.
కాని,
సముద్రంలో పుట్టిన అసలు విషం అయిన
లక్ష్మిని(సంపదను) తాకినంత మాత్రాన్నే
తన్మయత్వం చెందిన విష్ణువు మాత్రం మూర్చితుడైనట్లు
నిద్రాముద్రుడై ఉన్నాడుసుమా!
కనుక అసలు విషమంటే లక్ష్మి(సంపద)యే అని భావం.
మధ్యలో వచ్చిన సంపదతో అతడు మతమత్తచిత్తుడై,
కళ్ళుమూసుకుపోయినాడని గూఢార్థం.

2 comments:

కంది శంకరయ్య said...

ఈరోజు మీరు పరిచయం చేసిన ద్వక్షరి, ఏకసమాసచిత్రం రెండూ నాకు తెలిసినవే. అయినా మీ వివరణతో ఇక్కడ చదవడం ఆనందాన్ని కలిగించింది. ఎక్కదెక్కడినుంచో చిత్రకవిత్వాన్ని అన్వేషించి పరిచయం చేస్తున్న మీ ఉత్సాహాన్ని, భాషాభిమానాన్ని ప్రశంసిస్తున్నాను. కొనసాగించండి.

ఏ.వి.రమణరాజు said...


పెద్దలు కంది శంకరయ్యగారికి,
మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు.
నేను 2012 నుండి ఇప్పటికి చిత్రకవిత్వం మీద పరిశోధన చేస్తున్నాను. చిత్రకవితా సౌరభం అనే పేరుతో ఇప్పటికి ఏ4 సైజులో 700 పేజీలు అయినది. అది పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు ఇదంతా భగవత్కృప నా గురువుల ఆశీర్వాదప్రభావమేనని నా ప్రగాఢవిశ్వాసం ఆ ప్రయత్నంలోనివే ఈ బ్లాగులు. నేను ఏ విశ్వవిద్యాలయం నుండి పరిశోధన చేయడంలేదు. కేవలం దానిమీద ఉన్న అభిమానమే.