Thursday, June 2, 2016

చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు



చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు


సాహితీమిత్రులారా!

ఈ క్రింది పద్యంలోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో చూడండి.

ఏమి చేయక వృథా ఏటినీరగును?
భూపాలు డేటికిన్ పుట్టువొందు?
తుంగముస్తెల ప్రీతి తొణుకాడు వేనికి?
సభవారి నవ్వించు జాణ యెవడు?
రాజహంస నివసించు కాసారమెయ్యది?
వీరు డెద్దానిచే విజయమందు?
లజ్జయెవ్వరి కమూల్యపు టలంకారంబు?
దేవాంగులకు దేన జీవనంబు?
అన్నిటికి జూడనైదేసి అక్కరములు
ఒనర నిరుదెస చదినిన నొక్క తీరె
చెప్పగలిగిన నే నిత్తు చిన్ని మాడ
చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు

సీస పాదాలలోని ఎనిమిది ప్రశ్నలకూ అయిదక్షరాలున్న సమాధానం చూడాలి.
తిప్పి చదివితే అదే రావాలి.
వీటి సమాధానాలు చూడండిమరి-

1. కాలుల ఏం చేయకపోతే వృథాగా పోతుంది? - కట్టకట్టక (పోతే)
2. రాజెందుకు పుడతాడు? - నేలనేలనే (భూమిని పాలించటానికి)
3. తుంగముస్తెలమీద వేటికి ఎక్కువ ఇష్టం? - కిటికోటికి (పందులకు)
4. సభవారిని నవ్వించే జాణ(చతురుడు)? - వికటకవి
5. కలహంస నివసించే సరస్సు? - సురసరసు
6. వీరుడు దేనిచేత గెలుపొందుతాడు? - చేతి హేతిచే (కత్తిచే)
7. సిగ్గెవరికి అలంకారం? - కులస్త్రీలకు
8. సాలెవానికి బ్రతుకు దేనివల్ల? - నేత చేతనే

ఇది పొడుపు పద్యం.

No comments: