Friday, June 10, 2016

ద్వ్యక్షరి


ద్వ్యక్షరి

సాహితీమిత్రులారా!
పద్యంలో లేక శ్లోకంలో ఒక వ్యంజనం(హల్లు) మాత్రమే ఉపయోగించి కూర్చిన దాన్ని ఏకాక్షరి అని మనం ఇంతకు ముందు చూచాం. అదే రెండు వ్యంజనాలతో కూర్చిన దాన్ని ద్వ్యక్షరి అంటారు.
తెలుగులో నందితిమ్మన పారిజాతాపహరణం(5-98)లోని పద్యం ఇది. ఇందులో "న, మ" - అనే రెండు వ్యంజనాలను ఉపయోగించి కూర్చడం జరిగింది.

మనమున ననుమానము నూ
నను నీనామ మనుమను మననమును నేను
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానా నూనా

నానా = సకల, మునీన = మునిశ్రేష్ఠుల యొక్క, మాన = ప్రమాణములకు, అనూనా = అధికుడా, మనమునన్ = మనస్సునందు, అనుమానమున్ = సందేహమును, ఊనను = పెట్టుకొనను, నీనామమను = నీ పేరను, మను = మంత్రం యొక్క, మననమును = ధ్యానమును, నేమమ్మునన్ = నియమముతో, మానన్ = వదలను, నన్నున్ = అటువంటి ఏకాంత భక్తుడనగునన్ను, మన్నన్ = ప్రీతితో, మనుము+ అను = జీవించుము అని చెప్పు.

No comments: