Wednesday, June 15, 2016

అన్నిటికి నొక్కయుత్తరం బమరవలయు


అన్నిటికి నొక్కయుత్తరం బమరవలయు


సాహితీమిత్రులారా!

ఈపద్యంలోని ప్రశ్నకు చెప్పగలరేమో చూడండి.

వాయుదేవుని వహియించు వాహనమేది?
వానచినుకుల గ్రోలెడి పక్షి యేది?
చంపక పరీమళంబు సహింపదేది?
తలను ముత్యాలుగల మృగతిలకమేది?
అన్నిటికి నొక యుత్తరం బమరవలయు

ప్రశ్నలను వివరంగా గమనిస్తే.......
1. వాయుదేవు(గాలి)ని మోసెడి వాహనమేది?  - లేడి
2. వానచినుకుతో బ్రతికే పక్షి ఏది? - చాతకపక్షి
3. సంపెంగ వాసన సరిపడనిది ఏది? - తుమ్మెద
4. తలలో ముత్యాలుగల శ్రేష్ఠమృగము ఏది? - ఏనుగు

పై ప్రశ్నల సమాధానాలు - లేడి,  చాతకపక్షి,  తుమ్మెద,  ఏనుగు
ఈ పదాలన్నిటిని నానార్థంగా గల పదం బాగా ఆలోచిస్తే తెలుస్తుంది.
అది ... అది.. ఆ.. సారంగము
సారంగానికి పర్యాయపదాలు -
తుమ్మెద, ఏనుగు, వానకోయిల(చాతకపక్షి), ఇఱ్ఱి, చిరుతపులి,
ఓదెకొంగ, నెమలి, గొడుగు, మబ్బు, వెండ్రుగ, నగ, పువ్వు, బంగారు,
కప్పురము, విల్లు, తామర, చిత్రవర్ణము, రాత్రి, నేల, శంఖము, చందనము,
వెలుఁగు, ఒక స్త్రీరాగము.

నిఘంటువులో ఇన్ని అర్థాలున్నాయి మరి.
ఇవి తెలిస్తే పొడుపు పద్యం సమాధానం సులభంకదా!

No comments: