Saturday, June 4, 2016

కాక కల్గునే నీ కిట్టి కఠిన బుద్ధి


కాక కల్గునే నీ కిట్టి కఠిన బుద్ధి


సాహితీమిత్రులారా!

"ప్రేమ ఏంత మధురం ప్రియురాలు అంత కఠినం" -  అనే పాటను
"ఆచార్య ఆత్రేయ" అభినందన చిత్రంకోసం రాశారు.
అలాగే ఈ పద్యం చూడండి. ఇదేమిటి పాట ముందు చెప్పి
తర్వాత పద్యం అంటాడు  అనుకోవద్దు.
ఆ పాటలోని భావానికి ఈ పద్యం కారణం కావచ్చేమో?
ఒక ప్రియుడు తన ప్రియురాలిని గూర్చి
ఈ విధంగా అనుకుంటున్నాడు
ఆ పద్యం.......

కిసలయంబు నీ మేను పొసగ జేసి
సరగ కీదీసి యాయూడ్చి సాగుడిచ్చి
చేసె కాబోలు ధాత నీ చిత్త మరయ
కాక కల్గునే నీ కిట్టి కఠిన బుద్ధి

కిసలయము అంటే చిగురు,
నీ శరీరం చిగురులతో చక్కగా చేశాడు బ్రహ్మ.
కానీ నీ మనసును "కిసలయ" - లోని "కి - య" లను తీసివేసి,
"స"- కు గుడి ఇచ్చి చేశాడు విధాత
అనగా
కిసలయ లో మిగిలినది "సల" దీనిలో "స" కు గుడి ఇస్తే సిల అంటే శిల అని అర్థం.
(ఆమె మనసు శిల కాకపోతే)
నీకు ఇంత కఠిన బుద్ధి కలుగుతుందా! అని ప్రియుడు
బాధతో అనుకొంటున్నాడు - అని భావం.

No comments: