Friday, June 3, 2016

చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు



చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు


సాహితీమిత్రులారా!

ఈ క్రింది పద్యంలోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో చూడండి.

రాముడెవ్వరి గూడి రావణు మర్ధించె?  
వరవాసుదేవుని పట్నమేది?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది
వెలయ నాలుగు వంటి విత్త దేది?
సీతను చేకొన చెరచిన ధనువేది
సభవారి నవ్వించు దాణ యెవడు?
అల రంభ కొప్పులో అలరుమాలిక యేది
శ్రీకృష్ణుడే యింట చెలగుచుండు?

అన్నిటికి చూడ నైదేసి అక్షరములు
ఒనర నిరుదెస చదివిన నొక్క తీరె
చెప్ప గలిగిన నే నిత్తు చిన్ని మాడ
చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు

దీనిలో ఎనిమిది ప్రశ్నలు ఉన్నాయి.
ప్రతి సమాధానం ఐదు అక్షరాలలోనే ఉండాలి.
ఉంతేకాదు సమాధానం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉండాలి.
వాటి జవాబులలో కెళితే.........

రాముడెవ్వరి గూడి రావణు మర్ధించె? - తోకమూకతో
వరవాసుదేవుని పట్నమేది? - రంగనగరం
రాజమన్నారుచే రంజిల్లు శరమేది? - లకోరికోల
వెలయ నాలుగు వంటి విత్త దేది? - జంబీరబీజం
సీతను చేకొన చెరచిన ధనువేది? - పంచాస్త్రచాపం
సభవారి నవ్వించు దాణ యెవడు? - వికటకవి
అల రంభ కొప్పులో అలరుమాలిక యేది? - మందారదామం
శ్రీకృష్ణుడే యింట చెలగుచుండు? - నందసదనం

పూర్వకాలం సాహితీప్రియులు పదిమంది ఒకచోట చేరితే
ఇటువంటి ప్రశ్నలు, జవాబులు, పాండితీప్రకటనలు ఉండేవి.
కానీ ఇటువంటి వాటిని తూలనాడే కాలం వచ్చిదని కొందరి భావన.
కానీ నేటి వేగవంతమైన జీవన విధానంలో వీటి ఆవస్యకత తగ్గింది.
వీటివలన మనసునకు ఎంతో ఆహ్లాదాన్ని
యాంత్రికజీవనంలోని ఒత్తిడిని తగ్గించే వీలుందని
నా అభిప్రాయం.

No comments: