ఆననాధరగళ మూర్తులతివ కజుఁడు
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి.
ఆననాధరగళ మూర్తు లతివ కజుఁడు
చంద్రకురువిందశంఖ చంచలలఁజేసి,
చెలఁగి, తచ్చిహ్న కాఠిన్య సితచలతలు
సొరిదిఁ కచకుచహాసదృష్టులుగఁ జేసె
(చాటుపద్యమణిమంజరి-1భా. పుట.108)
ఈ పద్యం తెనాలి రామకృష్ణునిదిగా ప్రసిద్ధమయినది.
పద్యంలోని క్రిందిపదాల వరుస చూడండి.
ఆనన-చంద్ర-చిహ్న - కచ
అధర- కురువింద- కాఠన్య- కుచ
గళ- శంఖ- సిత- హాస
మూర్తి-చంచల- చలత-దృష్టులు
ఈ వరుసక్రమంలో పదాలను గుర్తుంచుకొని వివరణలో గమనించండి.
బ్రహ్మదేవుడు వనితయొక్క
ముఖాన్ని(ఆననమును) చంద్రునితోను,
పెదవిని(అధరమును) పద్మరాగ(కురువింద)మణులతోను,
కంఠము(గళము)ను శంఖముతోను,
ఆకారమును(మూర్తిని) మెరుపు(చంచల)తోను,
క్రమంగా ఉంపమింప సృష్టించినాడు.
కానీ,
క్రమంగా వాటిలోని దోషాలను తర్వాత గమనించి,
మరల విజృంభించి(చెలగి)
ముఖము చంద్రునితో చేశాడుకదా చంద్రునిలోని మచ్చ(నలుపు)ను
తొలగించటానికి ఆమె వెంట్రుకల(కచ)తోను,
పద్మరాగంలోని కఠినత్వాన్ని స్తనాలలోను,
శంఖంలోని తెల్లదనాన్ని(సిత) ఆమె నవ్వు(హాసం)లోను,
మెరుపులోని చంచలత్వాన్ని ఆమె చూపులలోను,
క్రమంగా రూపొందిచి తప్పు చేసినాడనే
అపవాదు నుండి తప్పించుకున్నాడు బ్రహ్మ.
1 comment:
అందమైన శృంగార ఊహ....భళా వికటకవీ....
Post a Comment